Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచదశో%ధ్యాయః

గణశయుద్ధము

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తా విభునా తేన నిశ్చయం పరమం గతాః | సన్నద్ధాస్తు తదా తత్ర జగ్ముశ్చ శివామందిరమ్‌ || 1

గణశో%పి తథా దృష్ట్వా హ్యాగతాన్‌ గణసత్తమాన్‌ | యుద్ధాటోపం విధాయైవ స్థితాశ్చైవాబ్రవీదిదమ్‌ || 2

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివ విభుడిట్లు పలుకగా గణములు దృఢనిశ్చయము చేసుకొని సర్వసన్నద్ధులై పార్వతీ మందిరమునకు వెళ్లిరి (1).

గణాధ్యక్షులందరు యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి యుండుటను గాంచి గణశుడు వారితో నిట్లనెను (2).

గణశ ఉవాచ |

ఆయాంతు గణపాస్సర్వే శివాజ్ఞా పరిపాలకాః | అహ మేకశ్చ బాలశ్చ శివాజ్ఞాపరిపాలకః || 3

అథాపి పశ్యతాం దేవీ పార్వతీ సూనుజం బలమ్‌ | శివశ్చ స్వగణానాం తు బలం పశ్యతు వై పునః || 4

బలవద్బాలయుద్ధం చ భవానీశివపక్షయోః | భవద్భిశ్చ కృతం యుద్ధం పూర్వం యుద్ధ విశారదైః || 5

మయా పూర్వం కృతం నైవ బాలో%స్మి క్రియతే%ధునా|| 6

గణశుడిట్లు పలికెను -

శివుని ఆజ్ఞను పాలించు గణాధ్యక్షలందరీకీ స్వాగతము. బాలుడు, ఏకాకి అగు నేను పార్వతీ దేవి ఆజ్ఞను పాలించెదను (3). పార్వతీదేవి తన కుమారుని బలమును చూచుగాక! శివుడు కూడా తన గణముల బలమును చూడగలడు (4). ఈ యుద్ధములో భవాని పక్షమున బాలుడు, శివుని పక్షమున బలవంతులగు గణములు ఉన్నారు. మీరు పూర్వము అనేక యుద్ధములలో రాటు దేలిన యుద్ధ నిపుణులు (5). నేను పూర్వము యుద్ధమును చేయనే లేదు. బాలుడనగు నేను ఇపుడు యుద్ధమును చేయబోవు చున్నాను (6).

మమైవం తు భ##వేన్నైవ వైపరీత్యం భవిష్యతి | మమైవ భవతాం లజ్జా గిరిజాశివయోరిహ ||7

ఏవం జ్ఞాత్వా చ కర్తవ్యస్సమరశ్చ గణశ్వరాః | భవద్భి స్స్వామినం దృష్ట్వా మయా చ మాతరం తదా || 8

క్రియతే కీదృశం యుద్ధం భవితవ్యం భవిత్వితి | తస్యవై వారణ కో%పి న సమర్థస్త్రిలోకకే || 9

ఈ సంధర్భములో నాకు కలుగబోయే వినాశ##మేమియూ లేదు. పార్వతీ పరమేశ్వరులు సిగ్గుపడినచో, అది నాకు మీకు కూడ సిగ్గుపడదగినవిషయమే యగును (7). ఓ గణనాథులారా! మీరీ సత్యమునెరింగి యుద్ధమునకు దిగుడు. మీరు మీ ప్రభువు ముఖమును, నేను నా తల్లి ముఖమును చూచి (8), యుద్ధమును చేసెదము. ఎట్టి యుద్ధము జరుగవలసియున్నదో అట్టి యుద్ధము జరుగుగాక! దానిని అపగల సమర్థుడు ముల్లోకములలో లేడు (9).

బ్రహ్మోవాచ|

ఇత్యేవం భర్త్సితాస్తే తు దండభూషిత బాహవః | వివిధాన్యాయుధాన్యేవం ధృత్వా తే చ సమాయయుః || 10

ఘర్షయంతస్తథా దంతాన్‌ హుంకృత్య చ పునః పునః | పశ్య పశ్య బ్రువంతశ్చ గణాస్తే సముపాగతాః || 11

నందీ ప్రథమమాగత్య ధృత్వా పాదం వ్యకర్షయత్‌ | ధావన్‌ భృంగీ ద్వితీయం చ పాదం ధృత్వా గణస్య చ || 12

యావత్పాదే వికర్షంతౌ తావద్ధస్తేన వై గణః | ఆహత్య హస్తయోస్తాభ్యా ముత్‌క్షిప్తౌ పాదకౌ స్వయమ్‌ || 13

బ్రహ్మ ఇట్లు పలికెను -

దండములచే అలంకరింపబడిన బాహువులు గల ఆ గణములను గణశుడిట్లు భయపెట్టగా, వారు వివిధములగు ఆయుధములను ధరించి ముందునకురికిరి (10). పళ్లను పటపట కొరుకుచూ, అనేక పర్యాయములు హుంకరించి 'చూడు చూడు' అని పలుకుతూ, ఆ గణములు ముందునకురికిరి (11). మున్ముందుగా నంది వచ్చి కాలిని పట్టి లాగెను. భృంగి పరుగుతో వచ్చి గణశుని రెండవ పాదమును లాగెను (12). వాళ్లిద్దరు పాదములను లాగ బోవునంతలో గణశుడు తన చేతిలో కొట్టి వారి పాదములను తన చేతులతో లాగి ఎత్తి పడవేసెను (13).

అథ దేవీసుతో వీరస్సంగృహ్య పరిఘం బృహత్‌ | ద్వారస్థితో గణపతి స్సర్వానాపోథయత్తదా || 14

కేషాంచిత్పాణయో భిన్నాః కేషాంచిత్‌ పృష్ఠకాని చ | కేషాంచిచ్చ శిరాంస్యేవ కేషాంచిన్మస్త కాని చ | 15

కేషాంచి జ్ఞానునీ తత్ర కేషాంచిత్‌ స్కంధకాంస్తథా| సమ్ముఖే చాగతా యే వై తే సర్వే హృదయే హతాః || 16

కేచిచ్చ పతితా భూమౌ కేచిచ్చ విదిశో గతాః | కేషాంచిచ్చరణౌ ఛిన్నౌ కేచిచ్ఛర్వాంతికం గతాః || 17

అపుడు వీరుడు, పార్వతీ తనయుడు, ద్వారపాలకుడు అగు గణపతి పెద్ద పరిఘను చేతబట్టి వారి నందరినీ పొడిచెను (14). కొందరి చేతులు, కొందరి వీపులు, కొందరి తలకాయలు, మరికొందరి లలాటములు (15), కొందరి మోకాళ్లు, మరికొందరి భుజములు విరిగినవి. ఎదురుగా వచ్చిన వారందరికీ వక్షస్థ్సలములో దెబ్బలు తగిలినవి (16). కొందరు నేల గూలిరి. కొందరు దిక్కులకు పరుగులు దీసిరి. కొందరి కాళ్లు విరిగినవి. మరికొందరు శివుని వద్దకు పరుగులెత్తిరి (17).

తేషాం మధ్యే తే కశ్చిద్వై సంగ్రమే సమ్ముఖో నహి| సింహం దృష్ట్వా యథా యాంతి మృగాశ్చైవ దిశో దశ || 18

తథా తే చ గణాస్సర్వే గతాశ్చైవ సహస్రశః | పరావృత్య తథా సో%పి సుద్వారి సముపస్థితః || 19

కల్పాంతకరణ కాలో దృశ్యతే చ భయం కరః | యథా తథైవ దృష్టస్స సర్వేషాం ప్రలయం కరః || 20

ఏతస్మిన్‌ సమయే చైవ సరమేశ సురేశ్వరాః | ప్రేరితా నారదే నేహ దేవాస్సర్వే సమాగమన్‌ || 21

సింహమును చూచిన మృగములు వలె వారిలో ఒక్కరైననూ యుద్ధములో అతనిని ఎదిరించలేక పది దిక్కులకు పరువులు దీసిరి (18). ఆ విధముగా వేలాది గణములు వచ్చిరి. వచ్చిన వారందరు వెనుదిరిగిరి. అయిననూ ఆతడు ద్వారము నందు గట్టిగా నిలబడి యుండెను (19). కల్పాంతమునందు భయమును గొల్పు యముడెట్లుండునో అతడు అట్లు కన్పట్టెను. వారందరికీ ఆ క్షణములో ప్రళయమును కలుగజేసెను (20). అదే సమయములో నారదునిచే ప్రేరేపింపబడినవారై విష్ణువుతో, ఇంద్రునితో గూడి దేవతలందరు అచటకువిచ్చేసిరి (21).

సమబ్రువంస్తదా సర్వే శివస్య హితకామ్యయా | పురస్థ్సిత్వా శివం నత్వా హ్యాజ్ఞాం దేహి ప్రభో ఇతి || 22

త్వం పరబ్రహ్మ సర్వేశస్సర్వే చ తవ సేవకాః | సృష్టేః కర్తా సదా భర్తా సంహర్తా పరమేశ్వరః || 23

రజస్సత్త్వ తమోరూపో లీలయా నిర్గుణస్స్వతః | కా లీలా రచితా చాద్య తామిదానీం వద ప్రభో|| 24

అపుడు వారందరు శివునకు హితమును చేయగోరి ఆయనకు నమస్కరించి ఎదుట నిలచి ఇట్లు పలికిరి: హే ప్రభూ! ఆజ్ఞాపించుము (22). నీవు పరబ్రహ్మవు, సర్వేశ్వరుడవు. మేమందరము నీ సేవకులము. సృష్ఠి స్థితిలయ కారణుడగు పరమేశ్వరుడవు నీవే (23). నీవు స్వరూపములో నిర్గుణడవేయైననూ లీలచే రజస్సత్త్వ తమోగుణములతో రూపమును స్వీకరించెదవు. హే ప్రభూ! నీవీనాడు ఎట్టి లీలను వెలయించితివో చెప్పుము (24).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషాం మునిశ్రేష్ఠ మహేశ్వరః | గణాన్‌ భిన్నాం స్తదా దృష్ట్వా తేభ్యస్సర్వం న్యవేదయత్‌ || 25

అథ సర్వేశ్వరస్తత్ర శంకరో మునిసత్తమ | విహస్య గిరిజానాథో బ్రహ్మాణం మామువాచ హ || 26

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ ముని శ్రేష్ఠా! మహేశ్వరుడు వారి మాటలను విని, తన గణములు చెల్లాచెదరగుటను గాంచి వారికి వృత్తాంతము నంతనూ విన్నవించెను (25). ఓ మునిశ్రేష్ఠా! సర్వేశ్వరుడు, గిరిజాపతి యగు శంకరుడు అపుడు నవ్వి బ్రహ్మ నగు నాతో నిట్లు పలికెను (26).

శివ ఉవాచ |

బ్రహ్మన్‌ శృణు మమ ద్వారి బాల ఏకస్సమాస్థితః | మహాబలో యష్ఠిపాణిర్గేహావేశ నివారకః || 27

మహాప్రహార కర్తాసౌ మత్పార్షదవిఘాతకః | పరాజయః కృతస్తేన మద్గణానాం బలాదిహ|| 28

బ్రహ్మన్‌ త్వయైవ గంతవ్యం ప్రసాద్యో%యం మహాబలః | యథా బ్రహ్మ న్నయస్స్యాద్వై తథా కార్యం త్వయా విధే|| 29

శివుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! వినుము. నా ద్వారము నందు మహాబలుడగు ఒక బాలుడు చేత కర్ర బట్టు కొని నిలబడి ఇంటిలోనికి వెళ్లకుండగా అడ్డుపడుచున్నాడు (27). ఈతడు యుద్ధములో శత్రువును దెబ్బతీయుటలో దిట్ట. నా గణములను స్వీయబలముచే ఓడించి చెల్లాచెదరు చేసినాడు (28). ఓ బ్రహ్మా! నీవు మహాబలుడవు. ఆతని వద్దకు వెళ్లి ఆతనిని ప్రసన్నునిగా చేయుము. ఓ బ్రహ్మ! విధీ! నీవు సామరస్యముతో నీతిని ఉపయోగించి కార్యమును సాధించుము (29).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య ప్రభోర్వాక్య మజ్ఞాత్వా%జ్ఞానమోహితః | తదీయ నికటం తాత సర్వైః ఋషివరైరయామ్‌ || 30

సమాయాంతం చ మాం దృష్ట్వా స గణశో మహాబలీ | క్రోధం కృత్వా సమభ్యేత్య మమ శ్మశ్రూణ్యవాకిరత్‌ || 31

క్షమ్యతాం క్షమ్యతాం దేవ న యుద్ధార్థం సమాగతః | బ్రహ్మణో%హమను గ్రహ్యశ్శాంతి కర్తానుపద్రవః || 32

ఇత్యేవం బ్రువతి బ్రహ్మంస్తావత్పరిఘ మాదదే| స గణశో మహావీరో బాలో%బాల పరాక్రమః || 33

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! అజ్ఞానముచే మోహితుడనైన నేను ప్రభువు యొక్క ఈ వాక్యమును విని భావమునెరుంగక మహర్షులందరితో గూడి ఆ బాలకుని వద్ధకు వెళ్లితిని (30). మహాబలుడగు ఆ గణశుడు సమీపమునకు వచ్చుచున్న నన్ను గాంచి కోపించి దగ్గరకు వచ్చి నా మీసములను పెరికి వేసెను (31). ఓ దేవా! క్షమించుము. క్షమించుము. నేను యుద్ధము కొరకు వచ్చినవాడను గాను. నేను బ్రాహ్మణుడను. శాంతికాముకుడను. ఉపద్రవమును చేయువాడను గాను. అనుగ్రహించుము (32). ఓ నారదా! మహావీరుడు, బాలుడే అయినా పెద్దల పరాక్రమము గల వాడు అగు ఆ గణశుడు ఇట్లు నేను పలుకుచుండగనే పరిఘను చేత బట్టెను (33).

గృహీత పరిఘం దృష్ట్వా తం గణశం మహాబలమ్‌ | పలాయనపరో యాతప్త్వహం ద్రుతతరం తదా || 34

యాత యాత బ్రువంతస్తే పరిఘేన హతాస్తదా | స్వయం చ పతితాః కేచిత్‌ కేచిత్తేన నిపాతతాః || 35

కేచిచ్చ శివసామీప్యం గత్వా తత్‌క్షణమాత్రతః | శివం విజ్ఞాపయాం చక్రుస్తద్వృత్తాంతమశేషతః || 36

తథా విధాంశ్చ తాన్‌ దృష్ట్వా తద్వృత్తంతం నిశమ్య సః | అపారమాదధే కోపం హరో లీలావిశారదః || 37

మహాబలుడగు గణశుడు పరిఘను చేతబట్టుట గాంచి నేను వెంటనే పలాయనము చిత్తగించితిని (34), 'పొండు పొండు' అని పలుకతూ ఆతడు వారిని పరిఘతో మోదెను. కొందరు వారంతట వారే క్రిందబడిరి. మరికొందరిని ఆతడు పడవైచెను (35). మరికొందరు క్షణములో శివుని దరిజేరి ఆ వృత్తాంతమును సర్వమును శివునకు విన్నవించుకొనిరి (36). లీలాపండితుడగు శివుడు వారి ఆ దురవస్థను గాంచి ఆ వృత్తాంతమును విని పట్టజాలని కోపమును పొందెను (37).

ఇంద్రాదికాన్‌ దేవగణాన్‌ షణ్ముఖ ప్రవరాన్‌ గణాన్‌ | భూతప్రేతపిశాచాంశ్చ సర్వానాదేశయత్తదా || 38

తే సర్వే చ యథా యోగ్యం గతాస్తే సర్వతో దిశమ్‌ | తం గణం హంతుకామా హి శివాజ్ఞాతా ఉదాయుధాః || 39

యస్య యస్యాయుధం యచ్చ తత్తత్సర్వం విశేషతః| తద్గణశోపరి బలాత్సమాగత్య విమోచితమ్‌ || 40

హాహాకారో మహానాసీత్త్రైలోక్యే స చరాచరే | త్రిలోకస్థా జనాస్సర్వే సంశయం పరమం గతాః || 41

అపుడాయన ఇంద్రుడు మొదలగు దేవగణములను, షణ్ముఖుడు, మొదలగా గల గణములను, భూతప్రేత పిశాచములను అందరినీ ఆదేశించెను (38). శివునిచే ఆజ్ఞాపించబడిన ఆ వీరులందరు ఆ గణశుని సంహరించు కోరికతో ఆయుధములనెత్తి పట్టుకొని ఎవరి వీలును బట్టి వారు అన్నివైపులనుండియు ముట్టడించిరి (39). ఎవరెవరి వద్ద ఏయే ఆయుధములు గలవో వారు వారు ఆయా ఆయుధములను ఆ గణశునిపై బలముగా ప్రయోగించిరి (40). స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో పెద్ద హాహాకారము చెలరేగెను. ముల్లోకములలోని జనులందరు సందేహమును పొందిరి (41).

న యాతం బ్రహ్మణో%ప్యాయుర్బ్రహ్మాండం క్షయమేతి హి | అకాలే చ తథా నూనం శివేచ్ఛా వశత స్స్వయమ్‌|| 42

తే సర్వే చాగతాస్తత్ర షణ్ముఖాద్యాశ్చ యే పునః | దేవా వ్యర్థాయుధా జాతా ఆశ్చర్యం పరమం గతాః || 43

బ్రహ్మ గారి ఆయుర్ధాయము పూర్తికాలేదు గదా! శివుని ఇచ్ఛచే బ్రహ్మాండము కాలము కాని కాలమందు తనంత తానుగా వినాశనమును పొందుచున్నది (42). అచటకు విచ్చేసిన షణ్ముఖుడు మొదలగు గణములు మరియు దేవతలు, తమ ఆయుధములు వ్యర్థము కాగా పరమాశ్చర్యమును పొందిరి (43).

ఏతస్మిన్నంతరే దేవీ జగదంబా విబోధనా | జ్ఞాత్వా తచ్చరితం సర్వమపారం క్రోధమాదధే|| 44

శక్తి ద్వయం తదా తత్ర తయా దేవ్యా మునీశ్వర| నిర్మితం స్వగణసై#్యవ సర్వసాహాయ్య హేతవే || 45

ఏకా ప్రచండరూపం చ ధృత్వాతిష్ఠన్మహామునే | శ్యామపర్వతసంకాశం విస్తీర్య ముఖగహ్వారమ్‌ || 46

ఏకా విద్యుత్స్వరూపా చ బహుహస్త సమన్వితా | భయంకరా మహాదేవీ దుష్ట దండవిధాయినీ || 47

ఇంతలో ప్రకాశస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు అగు జగన్మాత ఆ వృత్తాంతమునంతనూ ఎరింగి అంతులేని కోపమును పొందెను (44). ఓ మహర్షీ! అపుడామెతన గణమునకు అన్ని విధములుగా సహాయతను చేకూర్చుటకై అచట రెండు శక్తులను నిర్మించెను (45). ఓ మహర్షీ! నల్లని పర్వతమువలెనున్న ఒక శక్తి గుహవంటి నోటిని విస్తరింపజేసి భయంకరమగు ఆకారమును ధరించి నిలబడెను (46). రెండవ శక్తి విద్యు ద్రూపములో నుండెను. ఆమె అనేక హస్తములను కలిగియుండెను. దుష్టులను శిక్షించు ఆ మహాదేవి భయమును గొల్పు చుండెను (47).

ఆయుధాని చ సర్వాణి మోచితాని సురైర్గణౖః | గృహీత్వా స్వముఖే తాని తాభ్యాం శీఘ్రం చ చిక్షిపే || 48

దేవాయుధం న దృశ్యేత పరిఘః పరితః పునః | ఏవం తాభ్యాం కృతం తత్ర చరితం పరమాద్భుతమ్‌ || 49

ఏకో బాలో%ఖిలం సైన్యం లోడయామాస దుస్తరమ్‌ | యథా గారివరేణౖవ లోడితస్సాగరః పురా || 50

ఏకేన నిహతాస్సర్వే శక్రాద్యా నిర్జరాస్తథా | శంకరస్య గణాశ్చైవ వ్యాకులా అభవంస్తదా || 51

దేవతలు, గణములు ప్రయోగించిన ఆయుధములనన్నిటినీ తమ నోటితో గ్రహించి ఆ శక్తులు మరల వాటిని వెంటనే వారిపై విసిరినవి (48). వజ్రాయుధమునకు ఆ గతి పట్టగా పరిఘ వంటి ఆయుధమును గురించి చెప్పునదేమున్నది? ఈ తీరున వారచట అత్యద్భుతమగు క్రియల నాచరించిరి (49). పూర్వము గొప్ప కొండ సముద్రమును అడ్డగించిన తీరున, ఒకే ఒక బాలుడు జయింప శక్యము కాని సైన్యమునంతనూ అడ్డుకొనినాడు (50). ఒకే ఒక బాలుడు ఇంద్రాది దేవతలనందరినీ ఓడించి, శంకరుని గణములను చీకాకు పరిచినాడు (51).

అథ సర్వే మిలిత్వా తే నిశ్శ్వస్య చ ముహుర్ముహుః | పరస్పరం సమూచుస్తే తత్ప్రహారసమాకులాః || 52

అపుడు అతని ప్రహారములచే కలత చెందిన వారందరు అనేక పర్యాయములు నిట్టూర్చి ఒకరితో నొకరు ఇట్లు పలికిరి (52).

దేవ గణాఊచుః |

కిం కర్తవ్యం క్వ గంతవ్యం న జ్ఞాయంతే దిశో దశ | పరిఘం భ్రామయత్యేష సవ్యాపసవ్యమేవ చ || 53

దేవతలు, గణములు ఇట్లు పలికిరి -

ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? దిక్కులు పది తెలియకున్నవి. ఈతడు కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి పరిఘను త్రిప్పుచున్నాడు (53).

బ్రహ్మోవాచ |

ఏతత్కాలే%ప్సరశ్శ్రేష్ఠాః పుష్పచందనపాణయః | ఋషయశ్చ త్వదాద్యాహి యే%తి యుద్ధేతిలాలసాః || 54

తే సర్వే చ సమాజగ్ముర్యుద్ధ సందర్శనాయవై | పూరితో వ్యోమ సన్మార్గసైస్తదా మునిసత్తమ || 55

తాస్తే దృష్ట్వా రణం తం వై మహావిస్మయమాగతాః | ఈదృశం పరమం యుద్ధం న దృష్టం చైకదాపి హి || 56

పృథివీ కంపితా తత్ర సముద్రసహితా తదా| పర్వతాః పతితాశ్చైవ చక్రుస్సంగ్రమసంభవమ్‌ || 57

బ్రహ్మ ఇట్లు పలికెను -

అదే సమయములో అందమగు అప్సరసలు పుష్పములను, గంధమును చేతులయందు ధరించి యుద్ధమును చూడవలెననే ఉత్కంఠతో అచటకు వచ్చిరి. నీ వంటి ఋషులు కూడా వచ్చిరి (54). యుద్ధమును చూచుటకు వచ్చిన వారందరితో ఆకాశములోని నక్షత్రమార్గము ఆ సమయములో నిండియుండెను. ఓ మహర్షీ! (55) వారా యుద్ధమును చూచి మహాశ్చర్యమును పొందిరి. ఇట్టి గొప్ప యుద్ధమును వారెన్నడునూ చూచియుండఅలేదు (56). ఆ సమయములో యుద్ధము వలన ఏర్పడిన పరిస్థితికి భూమి సముద్రముతో సహా కంపించెను. పర్వతములు నేల గూలినవి (57).

ద్యౌర్గ్రహార్‌క్ష గణౖ ర్ఘూర్ణా సర్వే వ్యాకులతాం గతాః | దేవాః పలాయితాస్సర్వే గణాశ్చ సకలాస్తదా|| 58

కేవలం షణ్ముఖస్తత్ర నాపలాయత విక్రమీ | మహావీరస్తదా సర్వానావార్య పురతస్థ్సితః || 59

శక్తి ద్వయేన తద్యుద్ధే సర్వే చ నిష్ఫలీకృతాః | సర్వాస్త్రాణి నికృత్తాని సంక్షిప్తాన్యమరై ర్గణౖః || 60

యే %వస్థితాశ్చ తే సర్వే శివస్యాంతిక మాగతాః | దేవాః పలాయితాస్సర్వే గణాశ్చ సకలాస్తదా|| 61

గ్రహములతో, నక్షత్రముల గుంపులతో కూడియున్న ఆకాశము కంపించినది. అందరు కలవరపడిరి. సర్వదేవతలు మరియు సమస్తగణములు పలాయనము చిత్తగించిరి (58). అచట నున్న వారిలో షణ్ముఖుడు మాత్రమే పారిపోలేదు. మహావీరుడగు అతడు అందరినీ వెనుకకు త్రోసి ముందు నిలబడెను (59). ఇద్దరు శక్తులు ఆ యుద్దములో శత్రుపక్షము వారి ప్రయత్నములనన్నిటినీ వమ్ము చేసిరి. దేవతలు, గణములు ప్రయోగించిన అస్త్రములనన్నిటిని వారు భగ్నము చేసి మరల వారిపై ప్రయోగించిరి (60). అచటనున్న ఆ దేవతలు, గణములు అందరు పారిపోయి శివుని వద్దకు వచ్చి నిలబడిరి (61).

తే సర్వేమిలితాశ్చైవ ముహుర్నత్వా శివం తదా | అబ్రువన్వచనం క్షిప్రం కో%యం గణవరః ప్రభో || 62

పురా చైవ శ్రుతం యుద్ధ మిదానీం బహుధా పునః | దృశ్యతే నశ్రుతం దృష్ట మీదృశం తు కదాచన || 63

కించిద్విచార్యతాం దేవ త్వన్యథా న జయో భ##వేత్‌ | త్వమేవ రక్షకస్స్వామిన్‌ బ్రహ్మాండస్య న సంశయః || 64

ఇత్యేవం తద్వచశ్ర్శుత్వా రుద్రః పరమకోపనః | కోపం కృత్వా చ తత్రైవ జగామ స్వగణౖస్సహ || 65

వారందరు శివునకు అనేక పర్యాయములు నమస్కరించి ముక్తకంఠముతో శివునితో నిట్లు పలికిరి: ఓ ప్రభూ! ఈ గణశ్రేష్ఠుడు ఎవరు? (62) పూర్వము జరిగిన ఎన్నో యుద్ధములను గూర్చి వినియుంటిమి. కాని ఇటువంటి యుద్ధమును ఏ కాలము నందైననూ చచూడలేదు, వినలేదు (63). ఓ దేవా! నీవు సావకాశముగా ఆలోచించుము. లేనిచో జయము లభించదు. ఓ స్వామీ! బ్రహ్మండమునకు రక్షకుడవు నీవే అనుటలో సందేహము లేదు (64). వారి ఈ మాటలను విని పరమ కోపి యగు రుద్రుడు కోపించి వెనువెంటనే తన గణములతో గూడి ఆ స్థానమునకు వెళ్లెను (65).

దేవసైన్యం చ తత్సర్వం విష్ణునా చక్రిణా సహ| సముత్సవం మహత్కృత్వా శివస్యాను జగామ హ || 66

ఏతస్మిన్నంతరే భక్త్యా నమస్కృత్య మహేశ్వరమ్‌ | అబ్రవీన్నారద త్వం వై దేవదేవం కృతాంజలిః || 67

దేవసైన్యమంతయు చక్రధారియగు విష్ణువుతో గూడి గొప్ప ఉత్సవమును చేసి శివుని వెంబడించిరి (66). ఓ నారదా! ఇంతలో నీవు దేవదేవుడగు మహేశ్వరునకు భక్తితో చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికితివి (67).

నారద ఉవాచ |

దేవదేవ మహాదేవ శృణు మద్వచనం విభో | త్వమేవ సర్వగస్స్వామీ నానాలీలా విశారదః || 68

త్వయా కృత్వా మహాలీలాం గణగర్వో%పహారితః | అసై#్మ దత్త్వా బలం భూరి దేవగర్వశ్చ శంకర || 69

దర్శితం భువనే నాథ స్వమేవ బలమద్భుతమ్‌ | స్వతంత్రేణ త్వయా శంభో సర్వగర్వ ప్రహారిణా || 70

నారదుడిట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! విభూ! నామటను వినుము. సర్వవ్యాపియగు నీవు అనేక లీలలను చేయుటలో నిపుణుడగు ప్రభుడవు (68). నీవు గొప్ప లీలను నెరపి గణముల గర్వమునడంచితివి. ఓ శంకరా! ఈ గణశునకు మహాబలము నిచ్చి దేవతల గర్వమునడంచితివి (69). ఓ నాథా! శంభూ! స్వతంత్రుడవగు నీవు అందరి గర్వము నడంచి అద్భుతమగు నీ బలమును లోకమునకు చాటి చెప్పితివి (70).

ఇదానీం న కురుష్వేశ తాం లీలాం భక్తావత్సల | స్వగణానమరాంశ్చాపి సుసమ్మాన్యాభివర్ధయ || 71

ఇమం న ఖేలయేదానీం జహి బ్రహ్మ పదప్రద| ఇత్యుక్త్వా నారద తం వై హ్యంతర్తానం గతస్తదా || 72

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమార ఖండే గణశయుద్ధ వర్ణనం నామ పంచదశో%ధ్యాయం (15).

ఓ భక్తప్రియా! ఈశా! ఈ లీలను ఇంకనూ కొనసాగింపకుము. నీ గణములను, మరియు దేవతలను ఆదరించి వర్థిల్ల జేయుము

(71). బ్రహ్మపదమునిచ్చు దేవా! ఈ క్రీడను ఇప్పటితో విడిచి పెట్టము. ఓ నారదా! ఆయనతో నీ విట్లు పలికి అంతర్ధానము జెందితివి (72).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితలోని కుమార ఖండలో గణశయుద్ధ వర్ణనమనే ఇరువది అయిదవ అధ్యాయము

ముగిసినది (25).

Sri Sivamahapuranamu-II    Chapters