Sri Sivamahapuranamu-II    Chapters   

అథ వింశో%ధ్యాయః

గణశుని వివాహము

బ్రహ్మోవాచ|

ఏతస్మిన్నంతరే తత్ర విశ్వరూపః ప్రజాపతిః | తదుద్యోగం సంవిచార్య సుఖమాప ప్రసన్నధీః || 1

విశ్వరూప ప్రజేశస్య దివ్యరూపే సుతే ఉభే| సిద్ధిర్బుద్ధిరితి ఖ్యాతే శుభే సర్వాంగశోభ##నే || 2

తాభ్యాం చైవ గణశస్య గిరిజాశంకరౌ ప్రభూ| మహోత్సవం వివాహం చ కారయామాసతుర్ముదా || 3

సంతుష్టా దేవతాస్సర్వాస్తద్వివాహే సమాగమన్‌ | యథా చైవ శివసై#్యవ గిరిజాయా మనోరథః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇదే సమయములో విశ్వరూపుడనే ప్రజాపతి గణశుని ప్రయత్నమును గురించి చక్కగా విచారించి ప్రసన్నమనస్కుడై సుఖమును పొందెను (1). విశ్వరూప ప్రజాపతికి దివ్యమగు రూపము గలవారు, శుభాకారము గలవారు, సర్వావయముల యందు సౌందర్యముగలవారు, సిద్ధి బుద్ధి అను పేర ప్రసిద్ధి చెందిన ఇద్దరు కుమార్తెలు గలరు (2). పార్వతీ పరమేశ్వరులు గణశునకు వారిద్దరితో వావాహ మహోత్సవమును ఆనందముతో చేయించిరి (3). దేవతలందరు ఆనందముతో ఆ వివాహమునకు వచ్చిరి. పార్వతీ పరమేశ్వరుల మనోరథము ఈడేరెను (4).

తథా చ విశ్వరూపో%సౌ వివాహం కృతవాంస్తథా | తథా చ ఋషయో దేవా లేభిరే పరమాం ముదమ్‌ || 5

గణశో%పి తదా తాభ్యాం సుఖం చైవాప్తి చింతకమ్‌ | ప్రాప్తవాంశ్చ మునే తత్తు వర్ణితుం నైవ శక్యతే || 6

కియతా చైవ కాలేన గణశస్య మహాత్మనః | ద్వయోః పత్న్యోశ్చ ద్వౌ దివ్యౌ తస్య పుత్రౌ బభూవతుః || 7

సిద్ధేర్గణశపత్న్యా స్తు క్షేమనామా సుతో%భవత్‌ | బుద్ధేర్లాభాభిధః పుత్రో హ్యాసీత్పరమ శోభనః || 8

విశ్వరూపుడు ఆ వివాహమును చేసి ఆనందించెను. ఋషులు దేవతలు కూడ పరమానందమును పొందిరి (5). గణశుడు కూడ వారిద్దరినీ పొంది ఆ కాలములో గొప్ప సుఖమును పొందెను. ఓ మహర్షీ! ఆ సుఖమును వర్ణించుట సంభవము కాదు (6). కొంత కాలము తరువాత మహాత్ముడగు గణశునకు ఇద్దరు భర్యలయందు ఇద్దరు దివ్యపుత్రులు జన్మించిరి (7). సిద్ధి యను గణశుని భార్యకు క్షేముడను కుమారుడు కలిగెను. బుద్ధికి పరమ సుందరుడైన లాభుడనే కుమారుడు కలిగెను (8).

ఏవం సుఖమచింత్యం వై భుంజానే హి గణశ్వరే | ఆజగామ ద్వితీయశ్చ క్రాంత్వా పృథ్వీం సుతస్తదా || 9

తావచ్చ నారదేనైవ ప్రాప్తో గేహే మహాత్మనా | యథార్థం వచ్మి నో%సత్యం న ఛలేన న మత్సరాత్‌ || 10

పితృభ్యాం చ కృతం యచ్చ శివయా శంకరేణ తే | తన్న కుర్యాత్పరో లోకే సత్యం సత్యం బ్రవీమ్యహమ్‌ | 11

నిష్కాస్య త్వాం కుక్రమణం మిషముత్పాద్య యత్నతః | గణశస్య వరో %కారి వివాహః పరమశోభనః || 12

ఈ విధముగా గణశుడు ఈహకు అందని సుఖము ననుభవించు చుండగా, రెండవ కుమారుడు భూమిని చుట్టి తిరిగి వచ్చెను (9). అంతలో మహాత్ముడగు నారదుడు అతని ఇంటికి వచ్చి ఇట్లు చెప్పెను : నేను సత్యమును చెప్పుచున్నాను. నేను మోసపు బుద్ధితో గాని, ఈర్ష్య వలన గాని అసత్యమును చెప్పుట లేదు (10). నీ తల్లి దండ్రులగు పార్వతీ పరమేశ్వరులు నీకు చేసిన దానిని లోకములో ఇతరులెవ్వరూ తమ పుత్రులకు చేయరు. నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (11). భూమిని చుట్టి వచ్చుట అను మిషను కల్పించి నిన్ను ప్రయత్న పూర్వకముగా బయటకు పంపి గణశునకు మిక్కిలి శోభాకరము, శ్రేష్టము అగు వివాహము చేయబడెను (12).

గణశస్య కృతోద్వాహో లబ్ధవాన్‌ స్త్రీ ద్వయం ముదా| విశ్వరూప ప్రజేశస్య కన్యారత్నం మహోత్తమమ్‌ || 13

పుత్రద్వయం లలాభాసౌ ద్వయోః పత్న్యోశ్శుభాంగయోః | సిద్ధే క్షేమం తథా బుద్ధేర్లాభం సర్వసుఖప్రదమ్‌ || 14

పత్న్యోర్ద్వయోర్గణశో%సౌ లబ్ధవాన్‌ పుత్రద్వయం శుభమ్‌ | మాతాపిత్రోర్మతేనైవ సుఖం భుంక్తే నిరంతరమ్‌ || 15

భవతా పృథివీ క్రాంతా ససముద్రా సకాననా | తచ్ఛలాజ్ఞావశాత్తాత తస్య జాతం ఫలం త్విదమ్‌ || 16

గణశుడు విశ్వరూపప్రజాపతి యొక్క కుమార్తెలగు అతిశయించిన అందముగల ఇద్దరు కన్యలను ఆనందముతో వివాహమాడెను (13). అతనికి సుందరాంగనలగు ఆ ఇద్దరు పత్నులయందు ఇద్దరు పుత్రులు కలిగిరి. సిద్ధి అను నామెకు క్షేముడు, బుద్ధి అను నామెకు సర్వసుఖముల నిచ్చే లాభుడు కలిగిరి (14). ఈ గణశుడు ఇద్ధరు భార్యమలయందు ఇద్దరు శుభపుత్రులను పొందినాడు. తల్లి దండ్రుల అంగీకారముతో నాతడు ఎడతెరపి లేని సుఖము ననుభవించుచున్నాడు (15). కుమారా! నీవు వారి మోసపూరితమగు ఆజ్ఞకు బద్ధుడవై సముద్రములతో అడవులతో కూడి యున్న భూమిని చుట్టి వచ్చితివి. దానికి లభించిన ఫలము ఇది (16).

పితృభ్యాం క్రియతా సై#్మవ చ్ఛలం తాత విచార్యతామ్‌ | స్వస్వామిభ్యాం విశేషేణ హ్యన్యః కిం న కరోతి వై || 17

అసమ్యక్చ కృతం తాభ్యాం త్వత్పితృభ్యాం హి కర్మ హ| విచార్యతాం త్వయాపీహ మచ్చిత్తే న శుభం మతమ్‌ || 18

దద్యాద్యది గరం మాతా విక్రీణీయాత్పితా యది | రాజా హరతి సర్వస్వం కసై#్మ కిం చ బ్రవీతు వై || 19

యే నైవేదం కృతం స్యాద్వై కర్మానర్ధకరం పరమ్‌ | శాంతి కామస్సుధీస్తాత తన్ముఖం న వలోకయేత్‌ || 20

కుమారా! నీవు ఆలోచింపుము. వ్యక్తికి ప్రభులగు తల్లిదండ్రులే మోసమును చేసినచో, ఇతరులు కూడ మోసమును ఎట్లు చేయకుందురు? (17) నీ తల్లి దండ్రులు చేసిన పని యోగ్యముగా లేదు. నీవు కూడ ఆలోచించుము. నా మనస్సునకు వారు చేసిన పని శుభకరమని తోచలేదు (18). తల్లి విషమునిచ్చినచో, తండ్రి అమ్మివేసినచో, రాజు సర్వస్వమును అపహరించినచో, ఎవనికి ఏమి చెప్పవలెను? (19) కుమారా! ఎవరైతే ఇట్టి గొప్ప అనర్ధమును కలిగించే కర్మను చేయుదురో, అట్టి వారి ముఖమును శాంతిని గోరు బుద్ధిశాలి చూడకుండుట మేలు (20).

ఇతి నీతిశ్ర్శుతౌ ప్రోక్తా స్మృతౌ శాస్త్రేషు సర్వతః | నివేదితా చ సా తే %ద్య యథేచ్ఛసి తథా కురు || 21

వేదశాస్త్రములు, మరియు స్మృతులు ఇట్టి నీతిని దృఢముగా బోధించు చున్నవి. ఆ నీతిని నేను నీకు విన్నవించితిని. నీకు నచ్చిన రీతిని ఆచరింపుము (21).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా నారద త్వం తు మహేశ్వరమనో గతిః | తసై#్మ తథా కుమారాయ వాక్యం మౌనముపాగతః || 22

స్కందో%పి పితరం నత్వా కోపాగ్ని జ్వలితస్తదా| జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితో%పి సన్‌ || 23

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! మహేశ్వరుని మనస్సులో ధ్యానించే నీవు ఆ కుమారునితో ఈ వాక్యమును పలికి మౌనమును వహించితివి(22). కోపమనే అగ్నితో మండిపడుచున్న స్కందుడు తండ్రికి నమస్కరించి, తల్లిదండ్రులు వారించిననూ వినక, క్రౌంచపర్వతమునకు వెళ్లెను (23).

వారణ చ కృతే గమ్యతే చ కథం త్వయా | ఇత్యేవం చ నిషిద్ధో%పి ప్రోచ్య నేతి జగామ సః || 24

న స్థాతవ్యం మయా తతౌ క్షణమప్యత్ర కించన | యద్యేవం కపటం ప్రీతిమపహాయ కృతం మయి || 25

ఏవముక్త్వా గతస్తత్ర మునే సో%ద్యాపి వర్తతే | దర్శనేనైవ సర్వేషాం లోకానాం పాపహారకః || 26

తద్దినం హి సమారభ్య కార్తికేయస్య తస్యవై | శివపుత్రస్య దేవర్షే కుమారత్వం ప్రతిష్ఠితమ్‌ || 27

'నీవు ఇపుడు ఎట్లు వెళ్లెదవు?' అని వారించి నిషేధించిననూ ఆతడు 'కుదరదు' అని బదులిడి వెళ్లిపోయెను (24). తల్లిదండ్రులారా! నేను ఇచట క్షణకాలమైననూ ఉండరాదు. ఏలయన, మీరు ప్రేమను ప్రక్కన బెట్టి నా యందు కపటమును చేసితిరి (25). ఓ మునీ! ఇట్లు పలికి ఆతడు అచటకు వెళ్లెను. ఇప్పటికినీ అచటనే యున్నాడు. ఆయన దర్శన మాత్రముచే సర్వమానవుల పాపములను పోగొట్టును (26). ఓ దేవర్షీ! ఆ దినమునుండి శివపుత్రుడగు కార్తికేయుని బ్రహ్మ చర్యము స్థిరముగా నుండెను (27).

తన్నామ శుభదం లోకే ప్రసిద్ధం భువనత్రయే | సర్వపాపహరం పుణ్యం బ్రహ్మ చర్యప్రదం పరమ్‌ || 28

కార్తిక్యాం చ సదా దేవా ఋషయశ్చ సతీర్ధకాః | దర్శనార్ధం కుమారస్య గచ్ఛంతి చ మునీశ్వరాః || 29

కార్తిక్యాం కృత్తి కా సంగే కుర్యాద్యస్స్వా మి దర్శనమ్‌ | తస్య పాపం దహేత్సర్వం చిత్తేప్సిత ఫలం లభేత్‌ || 30

ఉమాపి దుఃఖమాపన్నా స్కందస్య విరహే సతి| ఉవాచ స్వామినం దీనా తత్ర గచ్ఛ మయా ప్రభో || 31

కార్తికేయుని నామము ముల్లోకములలో ప్రసిద్ధమైనది. ఆ శ్రేష్ఠ పవిత్ర నామము సర్వపాపములను పోగొట్టి బ్రహ్మచర్యమునిచ్చును (28). ప్రతి సంవత్సరములో కార్తీక మాసము నందు దేవతలు, శిష్యులతో గూడి ఋషులు, మరియు మునిశ్రేష్ఠులు కుమారుని దర్శనముకొరకు వెళ్లు చుందురు (29). ఎవడైతే కార్తీక మాసములో కృత్తికానక్షత్రమునాడు కుమారస్వామిని దర్శించునో, వాని పాపములన్నియు భస్మమై, మనస్సులో కోరిన ఫలములు లభించును (30). స్కందుడు దూరమగుటచే దుఃఖమును పొందిన ఉమాదేవి కూడా దీనురాలై శివునితో 'ప్రభూ! నన్ను అచటకు తీసుకొని వెళ్లుడు' అని పలికెను (31).

తత్సుఖార్థం స్వయం శంభుర్గతస్సాంశేన పర్వతే | మల్లికార్జున నామాసీజ్జ్యోతిర్లింగం సుఖావహమ్‌ || 32

అద్యాపి దృశ్యతే తత్ర శివయా సిహితశ్శివః | సర్వేషాం నిజభక్తానాం కామపూరస్సతాం గతిః || 33

తమాగతం స విజ్ఞాయ కుమారస్సశివం శివమ్‌ | స విరజ్య తతో%న్యత్ర గంతుమాసీ త్సముత్సుకః ||34

దేవైశ్చ మునిభిశ్చైవ ప్రార్థితస్సో%పి దూరతః | యోజనత్రయ ముత్సృజ్య స్థితస్ధ్సా నే చ కార్తికః || 35

ఆమె సుఖము కొరకు శంభుడు ఆమెతో గూడి స్వయముగా ఆ పర్వతమునకు వెళ్లి మల్లికార్జునుడు అను పేర అచట జ్యోతిర్లింగమై వెలసి జనులకు సుఖములనిచ్చు చున్నాడు (32). ఈనాటికీ శివుడు పార్వతితో గూడి అచట దర్శనమిస్తూ, తన భక్తులందరి కోర్కెలనీడేర్చుచూ సత్పురుషులకు శరణమై ఉన్నాడు(33). పార్వతీ పరమేశ్వరులు వచ్చి నారని తెలిసిన ఆ కుమారస్వామి విరక్తుడై మరియొక చోటకు పోవుటకు సంసిద్ధుడాయెను. దేవతలు, మునులు ప్రార్థించగా ఆతడు కూడా మూడు యోజనముల దూరమును విడచి అచటనే ఉండెను. ఇట్లు అదే స్థానములో కార్తికుడు కూడ ఉన్నాడు (34,35).

పుత్ర స్నేహాతురౌ తౌ వై శివౌ పర్వణి పర్వణి | దర్శనార్థం కుమారస్య తస్య నారద గచ్ఛతః || 36

అమావాస్యాదినే శంభుః స్వయం గచ్ఛతి తత్ర హ | పూర్ణ మాసీ దినే తత్ర పార్వతీ గచ్ఛతి ధ్రువమ్‌ || 37

యద్యత్తస్య చ వృత్తాంతం భవత్పృష్టం మునీశ్వర| కార్తికస్య గణశస్య పరమం కథితం మయా || 38

ఏతచ్ఛ్రుత్వా నరో ధీమాన్‌ సర్వపాపైః ప్రముచ్యతే |శోభనాన్‌ లభ##తే కామానీప్సితాన్‌ సకలాన్‌ సదా|| 39

పార్వతీ పరమేశ్వరులు పుత్ర స్నేహముచే ఆర్ద్రమైన హృదయము గల వారై ప్రతి పర్వమునందు కుమారస్వామిని చూచుటకు అచటికి వెళ్లు చుందురు. ఓ నారదా! (36) అమావాస్య నాడు శంభుడు, పూర్ణిమనాడు పార్వతి తప్పని సరిగా అచటకు స్వయముగా వెళ్లుచుందురు (37). ఓ మహర్షీ! నీవు ప్రశ్నించిన విధముగా నేను కార్తీక గణశుల పరమ పవిత్ర గాథను వివరించితిని (38). ఈ గాథను వినిన బుద్ధిమంతుడగు మానవుడు పాపములన్నిటి నుండియూ విముక్తుడై తాను కోరుకునే శుభకామనలనన్నింటినీ పొందగలడు(39).

యః పఠేత్పాఠయేద్వాపి శృణుయాచ్ఛ్రావయేత్తథా | సర్వాన్‌ కుమానవాప్నోతి నాత్ర కార్యా విచారణా || 40

బ్రాహ్మాణో బ్రహ్మ వర్చస్వీ క్షత్రియో విజయీ భ##వేత్‌| వైశ్యో ధన సమృద్ధస్స్యాచ్ఛూద్ర స్సత్సమాతామియాత్‌ || 41

రోగీ రోగాత్ప్రముచ్యేత భయాన్ముచ్యేత భీతియుక్‌| భూతప్రేతాదిబాధాభ్యః పీడితో న భ##వేన్నరః || 42

ఏతదాఖ్యానమనఘం యశస్యం సుఖవర్ధనమ్‌ | ఆయుష్యం స్వర్గ్య మతులం పుత్రపౌత్రాది కారకమ్‌ || 43

ఎవరైతే ఈ గాథను పఠించెదరో, పఠింపజేసెదరో, వినెదరో, వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందెదరనుటలో సందేహము లేదు (40). బ్రహ్మణుడు బ్రహ్మతేజస్సును. క్షత్రియుడు విజయమును, వైశ్యుడు ధనసమృద్ధిని పొందెదరు. శ్రూద్రుడు సత్పురుషులతో సమానుడగును (41). రోగి ఆరోగ్యవంతుడగును. భయపడినవాడు భయవిముక్తుడగును. అట్టి మానవుడు భూతప్రేతాది బాధలచే పీడింపబడడు (42). ఈ గాథ పుణ్యమును, కీర్తిని, సుఖమును, ఆయుర్దాయమును వర్ధిల్ల జేయును. సాటిలేని ఈ గాథ పుత్ర పౌత్రాదులనిచ్చి స్వర్గప్రాప్తిని కలిగించును (43).

అపవర్గ ప్రదం చాపి శివజ్ఞాన ప్రదం పరమ్‌ | శివాశివప్రీతి కరం శివభక్తి వివర్థనమ్‌ || 44

శ్రవణీయం సదా భ##క్తైర్నిష్కామైశ్చ ముముక్షుభిః | శివాద్వైతప్రదం చైతత్సదాశివమయం శివమ్‌ || 45

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమారఖండే గణశ వివాహ వర్ణనం నామ వింశో%ధ్యాయః (20).

|| ఓం నమశ్శివాయ ||

ఈ గాథ ముక్తిని ఇచ్చును. శ్రేష్ఠ మగు శివ జ్ఞానము నిచ్చును. పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమగు ఈ గాథ శివభక్తిని వర్థిల్ల జేయును (44). భక్తులు, మరియు కామనలు లేని ముముక్షువులు ఈ గాథను సర్వదా వినవలెను. సదాశివ స్వరూపము, మంగళకరమునగు ఈ గాథ శివాద్వైతము నిచ్చును (45).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలోగణశ వివాహము అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

కుమార ఖండము ముగిసినది.

ఓం నమశ్శివాయ

Sri Sivamahapuranamu-II    Chapters