Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

త్రిపుర వాసుల దీక్షా స్వీకారము

సనత్కుమార ఉవాచ |

అసృజచ్చ మహాతేజాః పురుషం స్వాత్మసంభవమ్‌ | ఏకం మాయామయం తేషాం ధర్మ విఘ్నార్థమచ్యుతః || 1

ముండినం వ్లూనవస్త్రం చ గుంఫి పాత్ర సమన్వితమ్‌ | దధానం పుంజికాం హస్తే చాలయంతం పదేపదే || 2

వస్త్ర యుక్తం తథా హస్తం క్షీయమాణం ముఖే సదా | ధర్మేతి వ్యాహరంతం హి వాచా విక్లబయా మునే || 3

స నమస్కృత్య విష్ణుం తం తత్పురస్సంస్థితో%థవై | ఉవాచ వచనం తత్ర హరింస ప్రాంజలిస్తదా || 4

సనత్కుమారుడిట్లు పలికెను -

మహాతేజస్వియగు అచ్యుతుడు త్రిపురాసురుల ధర్మమునకు విఘ్నమును కలిగించుటకై తన దేహము నుండి ఒక మాయా పురుషుని సృష్టించెను (1). ఆతడు ముండితశిరస్కుడై చినిగిన వస్త్రములను ధరించి పాత్రలను త్రాటియందు గుచ్చి పట్టుకొనెను. ఆతడు చేతియందు మణిని ధరించి ప్రతి అడుగునందు దానిని త్రిప్పుచుండెను (2). ఆతడు చేతులపై వస్త్రములను ధరించెను. ముఖము నందు చిక్కి యున్న ఆతడు భయముతో నిండిన స్వరముతో ధర్మ శబ్దమును పలుకుచుండెను. ఓ మునీ! (3) ఆతడు పాపములను హరించు విష్ణువునకు నమస్కరించి ఆయన యెదుట నిలబడి చేతులు జోడించి అపుడు ఇట్లు పలికెను (4).

అరిహన్నచ్యుతం పూజ్యం కిం కరోమి తదాదిశ | కాని నామాని మే దేవస్థానం వాపి వద ప్రభో || 5

ఇత్యేవం భగవాన్‌ విష్ణుశ్శ్రుత్వా తస్య శుభం వచః | ప్రసన్న మానసో భూత్వా వచనం చేదమబ్రవీత్‌ || 6

అరిహన్‌ అను పేరు గల ఆతడు పూజ్యుడగు అచ్యుతునితో నిట్లనెను: ఓ ప్రభూ! నేనేమి చేయవలెనో ఆదేశించుము. ఓ దేవా! నా నామములను, మరియు స్థానమును కూడా చెప్పుము (5). ఆతని ఈ శుభవచనమును విని విష్ణు భగవానుడు ప్రసన్నమగు మనస్సుగలవాడై ఇట్లు పలికెను (6).

విష్ణురువాచ |

యదర్థం నిర్మితో%సి త్వం నిబోధ కథయామి తే | మదంగజ మహాప్రాజ్ఞ మద్రూపస్త్వం న సంశయః || 7

మమాంగాచ్చ సముత్పన్నో మత్కార్యం కర్తుమర్హసి | మదీయస్త్వం సదా పూజ్యో భవిష్యతి న సంశయః || 8

అరిహన్నామ తేస్యాత్తు హ్యన్యాని న శుభాని చ | స్థానం వక్ష్యామి తే పశ్చాచ్ఛృణు ప్రస్తుతమాదరాత్‌ || 9

మాయిన్‌ మాయామయం శాస్త్రం తత్‌ షోడశ సహస్రకమ్‌ | శ్రౌతస్మార్తవిరుద్ధం చ వర్ణాశ్రమ వివర్జితమ్‌ || 10

విష్ణువు ఇట్లు పలికెను-

నా శరీరమునుండి పుట్టిన ఓ గొప్ప బుద్ధిశాలీ! నీవు సృష్టింపబడుటకు గల కారణమును చెప్పెదను. తెలుసుకొనుము. నీవు నా స్వరూపమే ననుటలో సందేహము లేదు (7). నా శరీరమునుండి జన్మించిన నీవు నా కార్యమును చేయ తగుదువు. నీవు నా వాడవు గనుక సర్వదా పూజల నందుకొనగలవు. సందేహము లేదు (8). నీకు అరిహన్‌ అను పేరు ప్రసిద్ధమగును. ఇతర నామములు ఉన్ననూ, అవి శుభకరములు గావు. నీ స్థానమును తరువాత చెప్పగలను. ఇప్పుడు ప్రస్తుత విషయమును శ్రద్ధతో వినుము (9). ఓ మాయావీ! పదునారు వేల శ్లోకములు గలది, వేదములకు స్మృతులకు విరుద్ధమైనది, వర్ణాశ్రమ విభాగము లేనిది అగు మోసముతో నిండిన శాస్త్రమును రచింపుము (10).

అపభ్రంశమయం శాస్త్రం కర్మవాదమయం తథా | రచయేతి ప్రయత్నేన తద్విస్తారో భవిష్యతి || 11

దదామి తవ నిర్మాణ సామర్థ్యం తద్భవిష్యతి | మాయా చ వివిధ శీఘ్రం త్వదధీనా భవిష్యతి || 12

మానవులను భ్రష్టులను చేయునట్టియు, పౌరుషమునకు మాత్రమే ప్రాధాన్యము నిచ్చు శాస్త్రమును ప్రయత్నపూర్వకముగా రచింపుము. అది విస్తారమును పొందగలదు (11). అట్టి శాస్త్రమును నిర్మించు సామర్థ్యమును నీకు నేను ఇచ్చెదను. నీకు అట్టి సామర్థ్యము కలుగ గలదు. అనేక రకముల మాయ శీఘ్రమే నీకు వశము కాగలదు (12).

తచ్ఛ్రుత్వా వచనం తస్య హరేశ్చ పరమాత్మనః | నమస్కృత్య ప్రత్యువాచ స మాయీ తం జనార్దనమ్‌ || 13

పాపహారి, పరమాత్మ, దుష్ట శిక్షకుడునగు విష్ణువు యొక్క ఆ మాటను విని ఆ మాయావి నమస్కరించి ఇట్లు బదులిడెను (13).

ముండ్యువాచ|

యత్కర్తవ్యం మయా దేవ ద్రుతమాదిశ తత్ప్రభో | త్వదాజ్ఞయాఖిలం కర్మ సఫలం చ భవిష్యతి || 14

యతి ఇట్లు పలికెను-

ఓ దేవా! నా కర్తవ్యమేమి? ప్రభూ! నాకు కర్త్వయమును వెంటనే ఆదేశించుము. నీ ఆజ్ఞచే సర్వకర్మలు సఫలము కాగలవు (14).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా పాఠయామాస శాస్త్రం మాయామయం తథా | ఇహైవ స్వర్గ నరక ప్రత్యయో నాన్యథా పునః || 15

తమువాచ పునర్విష్ణు స్స్మృత్వా శివపదాంబుజమ్‌ | మోహనీయా ఇమే దైత్యాస్సర్వే త్రిపురవాసినః || 16

కార్యాస్తే దీక్షితా నూనం పాఠనీయాః ప్రయత్నతః | మదాజ్ఞయా న దోషస్తే భవిష్యతి మహామతే || 17

ధర్మాస్తత్ర ప్రకాశంతే శ్రౌతస్మార్తా న సంశయః | అనయా విద్యయా సర్వే స్ఫోటనీయా ధ్రువం యతే || 18

సనత్కుమారుడిట్లు పలికెను-

ఇట్లు పలికిన తరువాత విష్ణువు ఆతనిచే మాయా ప్రధానమగు శాస్త్రమును పఠింపజేసెను. స్వర్గనరకములు ఇచటనే గలవు. మరణానంతరగతి ఏదీ లేదు. ఇది ఆ శాస్త్రసారము (15). విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి మరల ఆతనితో నిట్లనెను: ఈ త్రిపురాసురులను, త్రిపురవాసులను అందరినీ నీవు మోహింపజేయవలెను (16). వారికి నీవు దీక్షలనీయవలెను. వారిచే ఈ శాస్త్రమును ప్రయత్నపూర్వకముగా పఠింపజేయవలెను. ఓ మహాబుద్ధీ! నా ఆజ్ఞచే ప్రవర్తిల్లు నీకు దోషము అంటుకొనదు (17). ఆ త్రిపురములలో శ్రౌతస్మార్త ధర్మములు విలసిల్లుచున్నవనుటలో సందేహము లేదు. ఓ యతీ! నీవు ఈ విద్యతో వాటినన్నిటినీ నిశ్చయముగా నాశనము చేయవలెను (18).

గంతుమర్హసి నాశార్థం ముండిస్త్రి పురవాసినామ్‌ | తమోధర్మం సంప్రకాశ్య నాశయస్వ పురత్రయమ్‌ || 19

తతశ్చైవ పునర్గత్వా మరుస్థల్యాం త్వయా విభో | స్థాతవ్యం చ స్వధర్మేణ కలిర్యావత్సమాప్రజేత్‌ || 20

ప్రవృత్తే తు యుగే తస్మిన్‌ స్వీయో ధర్మః ప్రకాశ్యతామ్‌ | శిషై#్యశ్చ ప్రతిశిషై#్యశ్చ వర్తనీయస్త్వయా పునః || 21

మదాజ్ఞయా భవద్ధర్మో విస్తారం యాస్యతి ధ్రువమ్‌ | మదను జ్ఞాపరో నిత్యం గతిం ప్రాప్స్యసి మామకీమ్‌ || 22

ఓ యతీ! త్రిపుర నివాసుల వినాశము కొరకు నీవు బయలు దేరుము. వారికి ఈ తమోగుణ ప్రధానమగు ధర్మమును నేర్పి త్రిపురములను నశింపజేయుము (19).

ఓ యతీ! ఆ తరువాత నీవు ఎడారి ప్రాంతమునకు వెళ్లి అచట నీ ధర్మమును పాటిస్తూ కలికాలము ఆరంభమగు వరకు నివసించి యండవలెను (20). కలియుగము ఆరంభము కాగానే నీవు శిష్యుల ద్వారా, ప్రశిష్యుల ద్వారా నీ ధర్మమును ప్రచారము చేయవలెను. ఆ ధర్మమును నీవు పాటించుచుండవలెను (21). నా ఆజ్ఞచే నీధర్మము నిశ్చయముగా వ్యాప్తిని చెందగలదు. నీవు నిత్యము నా ఆజ్ఞను పాలిస్తూ నా సాయుజ్యమును పొందగలవు (22).

ఏవమాజ్ఞా తదా దత్తా విష్ణునా ప్రభవిష్ణునా | శాసనాద్దేవ దేవస్య హృదా త్వంతర్దధే హరిః || 23

తత స్స ముండీ పరిపాలయన్‌ హరేః ఆజ్ఞాం తథా నిర్మితవాంశ్చ శిష్యాన్‌ |

యథాస్వరూపం చతురస్తదానీం మాయామయం శాస్త్రమపాఠయత్స్వయమ్‌ || 24

యథా స్వయం తథా తే చ చత్వారో ముండినశ్శుభాః | నమస్కృత్య స్థితాస్తత్ర హరయే పరమాత్మనే || 25

సర్వసమర్థుడగు విష్ణువు దేవ దేవుడగు శివుని ఆజ్ఞను మనస్సులో పొంది ఆతనికి ఈ విధముగా ఆజ్ఞాపించి అంతర్ధానమాయెను (23). అపుడా యతి విష్ణువు యొక్క ఆజ్ఞను పాలించి ఆ విధముగనే శిష్యులను నిర్మాణము చేసెను. సమర్థుడగు ఆ యతి అపుడు వారిచే మాయా ప్రధానమగు శాస్త్రమును యథాతథముగా స్వయముగా పఠింపజేసెను (24). ఆ యతి మరియు ఆయన వలెనే శిరో ముండనముతో నున్న ఆ నల్గురు శిష్యులు పాపహారి, పరమాత్మయగు విష్ణువునకు నమస్కరించి ఆయన యెదుట నిలబడిరి (25).

హరిశ్చాపి మునే తత్ర చతురస్తాంస్తదా స్వయమ్‌ | ఉవాచ పరమప్రీత శ్శివాజ్ఞా పరిపాలకః || 26

యథా గురుస్తథా యూయం భవిష్యథ మదాజ్ఞయా | ధన్యాస్సథ సద్గతిమిహ సంప్రాప్స్యథ న సంశయః || 27

చత్వారో ముండినస్తే%థ ధర్మం పాషండమాశ్రితాః | హస్తే పాత్రం దధానాశ్చ తుండవస్త్రస్య ధారకాః || 28

మలినాన్యేవ వాసాంసి ధారయంతో హ్యభాషిణః | ధర్మో లాభః పరం తత్త్వం వదంతస్త్వతి మర్షతః || 29

ఓ మహర్షీ! పాపహారి, శివుని ఆజ్ఞను పరిపాలించువాడు అగు విష్ణువు మిక్కిలి సంతసించి ఆ నల్గురు శిష్యులతో నిట్లనెను (26). మీరు మీ గురువు చేసినట్లు చేయుడు. నా ఆజ్ఞను పాలించుడు. సద్గతిని పొంది మీరు ధన్యులు కాగలరు. సందేహము లేదు (27). వారు నల్గురు ముండిత శిరస్కులై ఆపధర్మము నాశ్రయించి చేతిలో పాత్రను పట్టుకొని, నోటిపై గుడ్డతో కట్టుకొని యుండిరి (28). వారు మలిన వస్త్రములను ధరించి యున్నారు. తాము పాటించు ధర్మము ననుసరించినచో పరమతత్త్వము చేజిక్కునని మహానందముతో ప్రకటించుచున్నారు. ఇతర విషయములను మాటలాడుట లేదు (29).

మార్జనీం ధ్రియమాణాశ్చ వస్త్రఖండ వినిర్మితామ్‌ | శ##నైశ్శనైశ్చలంతో హి జీవహింసా భయాద్ధ్రువమ్‌ || 30

తే సర్వే చ తదా దేవం భగవంతం ముదాన్వితాః | నమస్కృత్య పునస్తత్ర మునే తస్థుస్తదగ్రతః || 31

హరిణా చ తదా హస్తే ధృత్వా చ గురవేర్పితాః | అభ్యధాయి చ సుప్రీత్యా తన్నామాపి విశేషితః || 32

యథా త్వం చ తథైవైతే మదీయా వై నసంశయః | ఆదిరూపం చ తన్నామ పూజ్యత్వాత్పూజ్య ఉచ్యతే || 33

గుడ్డ పేలికలతో తుడిచే చీపురును తయారు చేసి పట్టుకున్నారు. ప్రాణులకు హింస కలుగకుండుటకై మెల్లమెల్లగా నడుచుచున్నారు (30). ఓ మహర్షీ! వారందరు అపుడు విష్ణు భగవానునకు ఆనందముతో నమస్కరించి మరల ఆయన యెదుట నిలబడిరి (31). ఆపుడు విష్ణువు వారిని చేతితో పట్టుకొని గురువునకు సమర్పించెను. మరియు వారి నామధేయములను మిక్కిలి ప్రీతితో ప్రకటించెను (32). నీవు నావాడవు. అటులనే వీరు కూడా నావారే. సందేహము లేదు. మీరందరు పూజనీయులు గనుక, మీ నామధేయములు 'పూజ్య' అను పదముతో ఆరంభమగు చుండును (33).

ఋషిర్యతిస్తథా కీర్య ఉపాధ్యాయ ఇతి స్వయమ్‌ | ఇమాన్యపి తు నామాని ప్రసిద్ధాని భవంతు వః || 34

మమాపి చ భవద్భిశ్చ నామ గ్రాహ్యం శుభం పునః | అరిహన్నితి తన్నామ ధ్యేయం పాపప్రణాశనమ్‌ || 35

భవద్భిశ్చైవ కర్తవ్యం కార్యం లోకసుఖావహమ్‌ | లోకానుకూలం చరతాం భవిష్యత్యుత్తమా గతిః || 36

ఋషి, యతి, కీర్యుడు, ఉపాధ్యాయుడు అనునవి మీ పేర్లు. నేను స్వయముగా పెట్టిన మీ ఈ నామములు లోకములో ప్రసిద్ధిని గాంచగలవు (34). మీరు శుభకరమగు నా నామమును కూడ ఉచ్చరించుడు. మీ గురువు యొక్క అరిహన్‌ అను పాపనాశకమగు నామమును కూడ ధ్యానము చేయుడు (35). మీరు ప్రాణులకు సుఖమును కలిగించు కార్యమును చేపట్టుడు. మీరు లోకముల క్షేమమునకు అనురూపముగా నడుచుకొనుడు. మీకు ఉత్తమగతి కలుగ గలదు (36).

సనత్కుమార ఉవాచ |

తతః ప్రణమ్య తం మాయీ శిష్యయుక్త స్స్వయం తదా | జగామ త్రిపురం సద్య శ్శివేచ్ఛా కారిణం ముదా || 37

ప్రవిశ్య తత్పురం తూర్ణం విష్ణునా నోదితో వశీ | మహామాయవినా తేన ఋషిర్మాయాం తదాకరోత్‌ || 38

నగరోపవనే కృత్వా శిషై#్యర్యుక్త స్‌స్థితిం తదా | మాయాం ప్రవర్తయామాస మాయినామపి మోహినీమ్‌ || 39

శివార్చన ప్రభావేణ తన్మాయా సహసా మునే | త్రిపురే న చచాలాశు నిర్విణ్ణో%భూత్తదా యతిః || 40

సనత్కుమారుడిట్లు పలికెను-

మాయావి యగు ఆ యతి శిష్యులతో కూడినవాడై, శివుని ఆజ్ఞను ఉల్లాసముతో పాలించు విష్ణువునకు ప్రణమిల్లి, వెంటనే త్రిపురమునకు వెళ్లెను (37). విష్ణువుచే ప్రేరింపబడినవాడు, జితేంద్రియుడు, మహామాయావి అగు ఆ యతి శీఘ్రముగా ఆ నగరమునందు ప్రవేశించి తన మాయను విస్తరింపజేసెను (38). ఆతడు శిష్యులతో గూడి నగరసమీపములోని ఉద్యానమునందు మకాము చేసి, మాయావులను కూడా మోమింపజేయు తన మాయను ప్రవర్తిల్ల జేసెను (39). ఓ మహర్షీ! ఆతని మాయ శివుని ఆరాధించిన మహిమచే వెనువెంటనే త్రిపురమునందు వ్యాపించలేదు. అపుడా యతి చకితుడయ్యెను (40).

అథ విష్ణుం స సస్మార తుష్టాన చ హృదా బహు | నష్టోత్సాహో విచేతస్కో హృదయేన విదూయతా || 41

తత్స్మృతస్త్వరితం విష్ణుస్సస్మార శంకరం హృది | ప్రాప్యాజ్ఞాం మనసా తస్య స్మృతవాన్నారదం ద్రుతమ్‌ || 42

స్మృతమాత్రేణ విష్ణోశ్చ నారదస్సముపస్థితః | నత్వా స్థిత్వా పురస్తస్య స్థితోభూత్సాంజలిస్తదా || 43

అపుడు నశించిన ఉత్సాహము గలవాడు, కింకర్తవ్యతా విమూఢుడు అగు ఆ యతి దుఃఖముతో నిండిన హృదయముతో విష్ణువును స్మరించి మనసులో ఆయనను పరిపరి విధముల స్తుతించెను (41). వానిచే స్మరింపబడిన విష్ణువు వెంటనే తన హృదయములో శంకరుని స్మరించి మనస్సులో ఆయన ఆజ్ఞను పొంది వెంటనే నారదుని స్మరించెను (42). విష్ణువు స్మరించగానే నారదుడచటకు వచ్చి నమస్కరించి, ఆయన యెదుట చేతులు జోడించి నిలబడెను (43).

అథ తం నారదం ప్రాహ విష్ణుర్మతి మతాం వరః | లోకోపకారనిరతో దేవకార్యకరస్సదా || 44

శివాజ్ఞయోచ్యతే తాత గచ్ఛ త్వం త్రిపురం ద్రుతమ్‌ | ఋషిస్తత్ర గతశ్శిషై#్యః మోమార్థం తత్సువాసినామ్‌ || 45

ఇత్యాకర్ణ్య వచస్తస్య నారదో మునిసత్తమః | గతస్తత్ర ద్రుతం యత్ర స ఋషిర్మాయినాం వరః || 46

నారదో%పి తథా మాయీ నియోగాన్మాయినః ప్రభోః | ప్రవిశ్య తత్పురం తేన మాయినా సహ దీక్షితః || 47

తతశ్చ నారదో గత్వా త్రిపురాధీశసన్నిధౌ | క్షేమప్రశ్నాదికం కృత్వా రాజ్ఞే సర్వం న్యవేదయత్‌ || 48

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, లోకోపకారమునందు సర్వదా నిమగ్నమైనవాడు, సర్వకాలములలో దేవకార్యమును చేయువాడునగు విష్ణువు ఆ నారదునితో నిట్లనెను (44). వత్సా! నేను శివుని ఆజ్ఞచే చెప్పుచున్నాను. నీవు వెంటనే త్రిపురములకు వెళ్లుము. ఆ నగరములలో నివసించు వారిని మోహపెట్టుటకై ఋషి శిష్యులతో గూడి అచటకు వెళ్లినాడు(45). విష్ణువు యొక్క మాటను విని, నారద మహర్షి మాయావులలో అగ్రేసరుడగు ఆ ఋషి ఉన్న స్థానమునకు వెంటనే వెళ్లెను (46). మాయావి యగు నారదుడు ఆ విధముగా మాయావియగు ప్రభుని ఆదేశముచే ఆ పురమును ప్రవేశించి ఆ మాయావి వద్ద దీక్షను స్వీకరించెను (47). తరువాత నారదుడు త్రిపురాధిపతి వద్దకు వెళ్లి క్షేమ సమాచారమును ప్రశ్నించి, తరువాత విషయమునంతనూ ఆ మహారాజునకు విన్నవించెను (48).

నారద ఉవాచ |

కశ్చిత్సమాగతశ్చాత్ర యతిర్ధర్మ పరాయణః | సర్వవిద్యా ప్రకృష్టో హి వేదవిద్యా పరాన్వితః || 49

దృష్టాః చ బహవో ధర్మా నైతేన సదృశాః పునః | వయం సుదీక్షితాశ్చాత్ర దృష్ట్వా ధర్మం సనాతనమ్‌ || 50

తవేచ్ఛా యది వర్తేత తద్ధర్మే దైత్యసత్తమ | తద్ధర్మస్య మహారాజ గ్రాహ్యా దీక్షా త్వయా పునః || 51

నారదుడిట్లు పలికెను-

ఇచటకు ధర్మ నిష్ఠుడు, విద్యలన్నింటిలో ఆరితేరినవాడు, వేదమునందలి పరావిద్యను ఎరింగిన వాడు అగు యతి ఒకరు వచ్చి యున్నారు (49). నేను అనేక ధర్మములను చూచితిని గాని, అవి దీని సాటి గావు. ఈ ధర్మము సనాతనమని మాకు తోచినది. కావున మేమీ ధర్మములో దీక్షను గైకొంటిమి (50). ఓ రాక్షస శ్రేష్ఠా! మహారాజా! నీకు ఆధర్మము నందు అభిరుచి కలిగినచో, నీవు కూడా ఆ ధర్మమునకు సంబంధించిన దీక్షను గైకొనుము (51).

సనత్కుమార ఉవాచ |

తదీయం స వచశ్శ్రుత్వా మహదర్థసుగర్భితమ్‌ | విస్మితో హృది దైత్యోశో జగౌ తత్ర విమోహితః || 52

నారదో దీక్షితో యస్మాద్వయం దీక్షా మవాప్నుమః | ఇత్యేవం చ విదిత్వావై జగామ స్వయమేవ హ || 53

తద్రూపం చ తదా దృష్ట్వా మోహితో మాయయా తథా | ఉవాచ వచనం తసై#్మ నమస్కృత్య మహాత్మనే || 54

సనత్కుమారిడిట్లు పలికెను-

గొప్ప అర్థముతో నిండి ప్రకాశించే ఆతని ఆ మాటను విని, ఆ రాక్షసరాజు మనస్సులో ఆశ్చర్యమును పొంది మోహితుడై అచటకు వెళ్లెను (52). 'నారదుడు దీక్షను స్వీకరించినవాడు గనుక, మేము దీక్షను గైకొనెదము'. ఆతడు ఇట్లు తలపోసి స్వయముగా వెళ్లెను (53). ఆ యతి యొక్క రూపమును చూచి మరియు మాయచే మోహితుడై ఆతడు ఆ మహాత్మునకు నమస్కరించి ఇట్లు పలికెను (54).

త్రిపురాధిప ఉవాచ |

దీక్షా దేయా త్వయా మహ్యం నిర్మలాశయ భో ఋషే | అహం శిష్యో భవిష్యామి సత్యం సత్యం న సంశయః || 55

ఇత్యేవం తు వచశ్శ్రుత్వా దైత్యరాజస్య నిర్మలమ్‌ | ప్రత్యువాచ సుయత్నేన ఋషిస్స చ సనాతనః || 56

మదీయా కరణీయా స్యాద్యద్యాజ్ఞా దైత్యసత్తమ | తదా దేయా మయా దీక్షా నాన్యథా కోటి యత్నతః || 57

ఇత్యేవం తు వచశ్శ్రుత్వా రాజా మాయా మయో%భవత్‌ | ఉవాచ వచనం శీఘ్రం యతిం తం హి కృతాంజలిః || 58

త్రిపురాధీశుడు ఇట్లు పలికెను-

పవిత్రమగు హృదయము గల ఓ మహర్షీ! నీవు నాకు దీక్షను ఇమ్ము నేను నీకు శిష్యుడను కాగలను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (55). సనాతనుడగు ఆ యతి రాక్షసురాజు యొక్క ఆ కపటము లేని మాటను విని జాగరూకతతో నిట్లు బదులిడెను (56). ఓ రాక్షస శ్రేష్ఠా! నీవు నా ఆజ్ఞను పాలించే పక్షములో నేను నీకు దీక్షను ఇచ్చెదను. అట్లు గానిచో కోటి ప్రయత్నములను చేసిననూ దీక్షను ఈయజాలను (57). ఆ రాజు ఈ మాటను విని మాయా మోహితుడై వెంటనే చేతులు జోడించి ఆ యతితో నిట్లనెను (58).

దైత్య ఉవాచ |

యథాజ్ఞాం దాస్యసి త్వం చ తత్తథైవ న చాన్యథా | త్వదాజ్ఞాం నోల్లంఘయిష్యే సత్యం న సంశయః || 59

రాక్షసుడు ఇట్లు పలికెను -

నీవు ఆజ్ఞాపించినట్లే సర్వమును నేను చేయగలను. దీనికి తిరుగు లేదు. నీ ఆజ్ఞను నేను ఉల్లఘించను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (59).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య త్రిపురాధీశితుస్తదా | దూరీకృత్య ముఖాద్వస్త్రమువాచ ఋషిసత్తమః || 60

దీక్షాం గృహ్ణీష్వ దైత్యేంద్ర సర్వ ధర్మోత్తమోత్తమామ్‌ | దదౌ దీక్షా విధానేన ప్రాప్స్యసి త్వం కృతార్థతామ్‌ || 61

ఇత్యుక్త్వా స తు మాయావీ దైత్య రాజాయ సత్వరమ్‌ |దదౌ దీక్షాం స్వధర్మోక్తాం తసై#్మ విధివిధానతః || 62

దైత్యరాజే దీక్షితే చ తస్మిన్‌ ససహజే మునే | సర్వే చ దీక్షితా జాతాస్తత్ర త్రిపుర వాసినః || 63

సనత్కుమారుడిట్లు పలికెను-

త్రిపురాధీశ్వరుని ఈ మాటలను విని అపుడా యోగి శ్రేష్ఠుడు నోటికి కట్టిన వస్త్రమును ప్రక్కకు తొలగించి ఇట్లనెను (60). ఓ రాక్షసరాజా! సర్వధర్మములలో ఉత్తమోత్తమమైన ఈ దీక్షను స్వీకరించుము. నీవు ఈ దీక్షను పాటించినచో కృతార్థుడవు కాగలవు (61). ఇట్లు పలికి మాయావి యగు ఆ యతి వెంటనే రాక్షసరాజునకు తన శాస్త్రములో విధింపబడిన విధానములో యథావిధిగా దీక్షను ఇచ్చెను (62). ఓ మహర్షీ! సోదరులతో కలిసి రాక్షసరాజు దీక్షను స్వీకరించగానే, త్రిపురములయందు నివసించు వారందరు దీక్షను స్వీకరించిరి (63).

మునే శిషై#్యః ప్రశిషై#్యశ్చ వ్యాప్తమాసీద్ద్రుతం తదా | మహామాయావినస్తత్తు త్రిపురం సకలం మునే || 64

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధ ఖండే త్రిపుర దీక్షావిధానం నామ చతుర్థో%ధ్యాయః (4).

ఓ మహర్షీ! అపుడు మహామాయవి యగు ఆ యతీశ్వరుని శిష్యప్రశిష్యులతో త్రిపురములన్నియూ శీఘ్రమే నిండి పోయెను (64).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో త్రిపుర వాసుల దీక్షాస్వీకారము అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

Sri Sivamahapuranamu-II    Chapters