Sri Sivamahapuranamu-I    Chapters   

శ్రీ గణశాయ నమః

శ్రీ శివ మహాపురాణము

విద్యేశ్వర సంహితా

అథ ప్రధమోsధ్యాయః

ముని ప్రశ్న వర్ణనము

శ్రీ గణశాయనమః శ్రీ గురుభ్యోనమః | శ్రీ సరస్వతైనమః | అథ శివపురాణ ప్రథమా విద్యేశ్వర సంహితా ప్రారభ్యతే |

ఆద్యంతమంగల మజాత సమాన భావమార్యం తమీశ మజరామర మాత్మదేవమ్‌ |

పంచాననం ప్రబల పంచవినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశమ్‌ || 1

వ్యాస ఉవాచ |

ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగాకాలింది సంగమే | ప్రయాగే పరమే పుణ్య బ్రహ్మలోకస్య వర్త్మని || 2

మునయశ్శంసితాత్మన స్సత్యవ్రత పరాయణాః | మహౌజసో మహాభాగా మహాసత్రం వితేనిరే || 3

శ్రీ గణశునకు నమస్కారము. శ్రీ గురువులకు నమస్కారము. శ్రీ సరస్వతికి నమస్కారము. ఇపుడు శివపురాణము నందు మొదటిది యూగ విద్యేశ్వర సంహిత ఆరంభింపబడుచున్నది.

శంకరుడు ఆదిలో, అంతములో, మధ్య యందు కూడ మంగళ స్వరూపుడు. ఆయనతో సమమైన తత్త్వము ఎక్కడనూ లేదు. ఆయనకు జనన మరణములు లేవు. జగత్‌ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములనే అయిదు కర్మలను ఆయన సునాయాసముగా చేయును. ఆయన ఐదు ముఖములు గలవాడు. అట్టి సర్వశ్రేష్ఠుడగు, జగదీశుడైన అంబికాపతిని మనస్సులో ధ్యానించెదను (1).

వ్యాసుడు ఇట్లు పలికెను-

ధర్మమునకు గొప్ప క్షేత్రము, గంగా యమునా సంగమస్ధానము, బ్రహ్మలోకమార్గము, పరమ పుణ్యప్రదము నగు ప్రయాగ క్షేత్రమునందు(2), జితేంద్రియులు, సత్యమును వ్రతముగా పాలించువారు, గొప్ప తేజశ్శాలురు, మహాత్ములు నగు మునులు మహా సత్రయాగమును అనుష్ఠించిరి (3).

తత్ర సత్రం సమాకర్ణ్య వ్యాస శిష్యో మహామునిః | ఆజగామ మునిర్ద్రష్టుం సూతః పౌరాణికోత్తమః || 4

తం దృష్ట్వాసూత మాయాంతం హర్షితా మునయస్తదా | చేతసా సుప్రసన్నేన పూజాం చక్రుర్యథావిధి|| 5

తతో వినయ సంయుక్తాః ప్రాచుస్సాంజలయశ్చ తే | సుప్రసన్నా మహాత్మనః స్తుతిం కృత్వా యథావిధి || 6

రోమహర్షణ సర్వజ్ఞ భవాన్‌ వై భాగ్యగౌరవాత్‌ | పురాణ విద్యామఖిలాం వ్యాసాత్‌ ప్రత్యర్థమీయివాన్‌ || 7

తస్మా దాశ్చర్యభూతానాం కథానాం త్వం హి భాజనమ్‌ | రత్నానా మురుసారాణాం రత్నకర ఇవార్ణవః || 8

వ్యాసుని శిష్యుడు, పురాణవేత్తలలో శ్రేష్ఠుడు నగు సూతమహాముని అచట సత్రయాగము జరుగుచున్నదని విని, చూచుటకు విచ్చేసెను (4). సూతమహర్షి వచ్చుచుండగా చూచిన మునులు చాల సంతసించి, మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో, శాస్త్రోక్త విధిగా ఆయనను పూజించిరి (5). తరువాత ఆ మహాత్ములగు ఋషులు వినయముతో దోసిలి యొగ్గి. మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో ఆయనను స్తుతించిరి, ఇట్లనిరి (6). ఓ రోమహర్షణా*! నీవు సర్వజ్ఞుడవు. నీభాగ్యము గొప్పది యగుటచే వ్యాసమహర్షి వద్ద నుండి పురాణ విద్యను సంపూర్ణముగా పొందియుంటివి (7). అందువలననే, గొప్ప విలువైన రత్నములకు సముద్రము ఆకరమైనట్లు, విస్మయమును కలిగించు గాథలకు నీవు నిధివి అయితివి (8).

______________________________________________* సూతుని పురాణ గాథలను విన్న శ్రోతలకు గగుర్పాటు కలిగెడిది. కాన ఆయనకు రోమహర్షణుడు అను పేరు కలిగెను.

యచ్చ భూతం చ భవ్యం చ యచ్చాన్యద్వస్తు వర్తతే | న త్వయాsవిదితం కించిత్‌ త్రిషు లోకేషు విద్యతే || 9

త్వం మద్దిష్ట వశాదస్య దర్శనార్థ మిహాగతః | కుర్వన్‌ కిమపి నః శ్రేయో న వృథా గంతు మర్హసి || 10

తత్త్వం శ్రుతం స్మ నః సర్వం పూర్వమేవ శుభాశుభమ్‌ | న తృప్తి మధిగచ్ఛామః శ్రవణచ్ఛా మహుర్ముహుః || 11

ఇదానీ మేకమేవాస్తి శ్రోతవ్యం సూత సన్మతే | తద్రహస్య మపి బ్రూహి యది తే sనుగ్రహో భ##వేత్‌ || 12

ప్రాప్తే కలియుగే ఘోరే నరాః పుణ్య వివర్జితాః | దురాచార రతాస్సర్వే సత్య వార్తా పరాఙ్ముఖాః || 13

పరాపవాద నిరతాః పరద్రవ్యాభిలాషిణః | పరస్త్రీసక్త మనసః పరహింసా పరాయణాః|| 14

జరిగినది గాని, జరుగబోయేది గాని నీకు తెలియని వృత్తాంతము, లేక వస్తువు ముల్లోకములలో ఏదియూ లేదు (9). నీవు నా భాగ్యవశమున యాగమును చూచుటకు ఇచటకు విచ్చేసితివి. మాకు ఏదో ఒక శ్రేయస్సు **ను కలిగించకుండా నీవు వృథాగా మరలిపోరాదు (10). మేమింతకు ముందు శుభాశుభములగు తత్త్వములను గురించి విని యున్ననూ, మాకు తృప్తి కలుగలేదు. మరల మరల వినవలెననే కోరిక కలుగుచున్నది (11). ఓసూతా! నీవు సద్బుద్ధి+గలవాడవు. మేమిప్పుడు వినదగినది ఒక్కటియే గలదు. అది రహస్యమే కావచ్చును. అయిననూ, నీకు మా యందనుగ్రహమున్నచో, దానిని మాకు చెప్పుము (12).భయంకరమగు కలియుగము రాగానే, మానవులు అందరు పుణ్యదూరులగుదురు. వారు దురాచారము లందు ప్రీతి గలవారు, సత్యవాక్యము నందు శ్రద్ధ లేనివారు (13). ఎల్లవేళలా ఇతరులను నిందించువారు, ఇతరుల ధనమున కాశపడువారు, పరస్త్రీల యందు లగ్నమైన మనస్సు గలవారు, ఇతరులను హింసించుటయే ప్రధానకృత్యముగా గలవారు అగుదురు (14).

దేహాత్మ దృష్టయా మూఢా నాస్తికాః పశుబుద్ధయః | మాతృపితృ కృత ద్వేషాః స్త్రీ దేవాః కామకింకరాః || 15

విప్రా లోభ గ్రహగ్రస్తా వేద విక్రయ జీవినః | ధనార్జనార్థ మభ్యస్త విద్యా మద విమోహితాః || 16

త్యక్త స్వజాతి కర్మాణః ప్రాయశః పరవంచకాః | త్రికాల సంధ్యయా హీనా బ్రహ్మబోధ వివర్జితాః || 17

అదయాః పండితం మన్యా స్స్వాచార వ్రతలోపకాః | కృష్యుద్యమరతాః క్రూరస్వభావా మలినాశయాః || 18

క్షత్రియాశ్చ తథా సర్వే స్వధర్మత్యాగ శీలినః | అసత్సంగాః పాపరతా వ్యభిచార పరాయణాః || 19

అశూరా అరణ ప్రీతాః పలాయన పరాయణాః | కుచౌర వృత్తయశ్శూద్రాః కామకింకరచేత సః || 20

మానవులు దేహమే ఆత్మయను మూర్ఖ దృష్టి గలవారై, నాస్తికులగుదురు. పశువుల వలె బుద్ధిహీనులై, తల్లిదండ్రులను ద్వేషించి, స్త్రీలను భోగసాధనములుగా భావించువారై, కామమునకు బానిస లగుదురు (15). బ్రాహ్మణులు లోభము అనే దెయ్యము ఆవేశించుటచే, వేదమును విక్రయించి ధనమును సంపాదింతురు. వారు ధనమును సంపాదించుట కొరకై విద్యను నేర్చి, ఆగర్వముతో ఒళ్ళు తెలియక ఉందురు (16) తమ జాతికి సంబంధించిన కర్మలను వీడి, తరచుగా ఇతరులను మోసగించెదరు. మూడు కాలముల యందు సంధ్యావందనమును ఆచరించరు. వారిలో బ్రహ్మజ్ఞానము శూన్యము (17). వారికి దయాగుణము ఉండదు. తాము పండితులమను అహంకారమును కలిగియుందురు. వారి యందు శీలము, వ్రతము లోపించును. వ్యవసాయమును చేయుట యందు ప్రీతి కలిగి, క్రూరమగు స్వభావము, దుష్టబుద్ది కలిగియుందురు (18). అదే విధముగా, క్షత్రియులందరు స్వధర్మమును విడనాడే స్వభావమును కల్గియుందురు. దుష్టుల సహవాసముతో పాపముల నాచరించెదరు. వ్యభిచారము నందు నిమగ్నులగుదురు (19). శౌర్యము లేనివారై, యుద్ధము నందు అభిరుచిని గోల్పోయి, పారిపోవుట యందు ప్రీతి కలిగియుందురు. దుష్టులై, చోరులై, కామమునకు బానిసలై జీవించెదరు (20).

శస్త్రాస్త్ర విద్యయా హీనా ధేను విప్రావనో జ్ఘి తాః | శరణ్యావన హీనాశ్చ కామిన్యూతి మృగాస్సదా || 21

ప్రజాపాలన సద్ధర్మ విహీనా భోగతత్పరాః | ప్రజాసంహారకా దుష్టా జీవహింసకరా ముదా || 22

వైశ్యాస్సంస్కారహీనాస్తే స్వధర్మత్యాగశీలినః| కుపథాః స్వార్జనరతాస్తు లా కర్మకువృత్తయః || 23

గురుదేవ ద్విజాతీనాం భక్తిహీనాః కుబుద్ధయః | అభోజిత ద్విజాః ప్రాయః కృపణా బద్ధ ముష్టయః || 24

_____________________________________________

** శ్రేయస్సు అను పదమునకు మోక్షము అని యర్థము. మోక్షము ఆత్యంతిక శ్రేయస్సు. దాని కంటె తక్కువ ఫలముల యందు కూడ శ్రేయశ్శబ్దము ప్రయోగింపబడవచ్చును.

+ సత్‌ అనగా పరమాత్మ అను అర్థము కూడ గలదు.

కామినీ జారభావేషు సురతా మలినాశయాః | లోభమోహ విచేతస్కాః పూర్తాది సువృషోజ్ఘి తాః || 25

మరియు వారు శస్త్రాస్త్ర విద్యల నెరుంగరు. గోవులను, బ్రాహ్మణులను రక్షించే ధర్మమును విడిచెదరు. శరణు జొచ్చిన వానిని రక్షించరు. సర్వకాలములలో పశువుల వలె కామినీ స్త్రీలతో సంభోగించెదరు (21). ప్రజలను రక్షించుట అనే గొప్ప ధర్మమును పాటించరు. భోగలాలసులై, దుష్టులై, ప్రజలను సంహరించెదరు. ఆనందముతో జీవహింసను చేసెదరు (22). వైశ్యులు సంస్కారములు లేనివారై స్వధర్మమును వీడు స్వభావమును కల్గియుందురు. వారు తప్పుదారిలో నడిచెదరు. తూకములో మోసము చేసి ధనమును సంపాదించుటలో ప్రీతిని కలిగి యుందురు (23). దుర్బుద్ధులగు వీరికి గురువుల యందు, దేవతల యందు, బ్రాహ్మణుల యందు భక్తి ఉండదు. వారిలో చాల మంది లోభులై, పిడికిలి బిగించుకొని, బ్రాహ్మణులకు భోజనమును పెట్టరు (24). వేశ్యల చుట్టూ తిరుగు విటులై, మలినహృదయములగుదురు. లోభము చేతను, అజ్ఞానము చేతను చెడిన బుద్ధి గలవారై, నూతులు త్రవ్వించుట, చెట్లను పాతించుట మొదలగు పుణ్యకార్యములను త్యజించెదరు (25).

తద్వచ్ఛూద్రాశ్చ యే కేచిత్‌ బ్రాహ్మణాచార తత్పరాః | ఉజ్జ్వలాకృతయో మూఢాః స్వధర్మ త్యాగశీలినః || 26

ప్రతికూల విచారాశ్చ కుటిలా ద్విజదూషకాః | ధనవంతః కుకర్మాణో విద్యావంతో వివాదినః || 27

సుభూషాకృతయో దంభాః సుదాతారో మహామదాః | విప్రాదీన్‌ సేవకాన్‌ మత్వా మన్యమానా నిజం ప్రభుమ్‌ || 28

స్వధర్మ రహితా మూఢాస్సంకరాః క్రూరబుద్ధయః | మహాభిమానినో నిత్యం చతుర్వర్ణవిలోపకాః || 29

అదే విధముగా, శూద్రులు కొందరు బ్రాహ్మణుల ఆచారములలో శ్రద్ధను చూపెదరు. మూఢులగు వారు ప్రకాశించే వేషములను ధరించి, స్వధర్మమును వీడు స్వభావమును కలిగియుందురు (26). వారు కుటిలురై, ధర్మ విరుద్ధమగు ఆలోచనాసరళి కలిగి, బ్రాహ్మణులను దూషింతురు. వారిలో ధనవంతులు తప్పు పనులను చేసెదరు. విద్యావంతులు వాదవివాదములలో పాల్గొనుచుందురు (27). వారు విలువైన అలంకారములను ధరించువారై, తాము చేసే ధర్మకార్యములకు విరివిగా ప్రచారమునిచ్చెదరు. వారిలో దానశీలము గలవారు చాల గర్వితులై యుందురు. బ్రాహ్మణులను తమ సేవకులుగను, తమను తాము ప్రభువులు గను భావింతురు (28). వారు మూఢులై, స్వధర్మమును వీడి, క్రూరమగు మనస్సు కలిగియుందురు. మరియు, సర్వదా అహంకారమును కలిగియుందురు. ఈ తీరున నాల్గు వర్ణముల వారు స్వధర్మమును వీడియుందురు (29).

స్త్రియశ్చ ప్రాయశో భ్రష్టా భర్త్రవజ్ఞాన కారికాః | శ్వశురద్రోహ కారిణ్యో నిర్భయా మలినాశనాః || 30

కుహావభావనిరతాః కుశీలాః స్వరవిహ్వలాః | జారసంగరతా నిత్యం స్వస్వామి విముఖాస్తథా || 31

తనయా మాతృపిత్రోశ్చ భక్తిహీనా దురాశయాః | అవిద్యాపాఠకా నిత్యం రోగగ్రసిత దేహకాః || 32

ఏతేషాం నష్టబుద్ధీనాం స్వధర్మ త్యాగశీలినామ్‌ | పరలోకే పీహ లోకే కథం సూత గతిర్భవేత్‌ || 33

ఇతి చింతాకులం చిత్తం జాయతే సతతం హి నః | పరోపకార సదృశో నాస్తి ధర్మోపరః ఖులు || 34

లఘూపాయేన యేనైషాం భ##వేత్‌ సద్యోఘ నాశనమ్‌ | సర్వ సిద్ధాంత విత్త్వం హి కృపయా తద్వదాధునా || 35

స్త్రీలలో అధికులు పతితలు అగుదురు. భర్తను అవమానము చేసెదరు. మామకు ద్రోహము తలపెట్టెదరు. భయమును వీడి, దుష్టమగు ఆహారమును స్వీకరించెదరు(30). చెడు హావభావములను ప్రదర్శించెదరు. శీలమును వీడి, కామదాహము గలవారై, నిత్యము పరపురుషులతో భోగించెదరు. తమ భర్తయందు అనురాగము లేకయుందురు (31). కొడుకులు తల్లిదండ్రుల యందు భక్తి లేనివారై, దుష్టబుద్ధి కలిగి, చెడు చదువులు చదివెదరు. వారి దేహములు సర్వదా రోగములతో నిండియుండును (32).ఓ సూతా! వినాశము చెందిన బుద్ధి కలిగి, స్వధర్మమును వీడే స్వభావము గల వీరికి ఈ లోకములో, మరియు పరలోకములో ఏమి గతిపట్టును? (33). మాకు ఈ విషయమై మనస్సులో చింత నిత్యము కలుగుచున్నది. పరోపకారముతో సమమైన మహాధర్మము లేదు గదా! (34). వీరికి శీఘ్రముగా పాపములు తొలగిపోయే తేలిక ఉపాయమేది నీవు సిద్ధాంతముల నన్నిటినీ యెరింగినవాడవు. కాన దయతో ఇపుడే ఆ ఉపాయమును చెప్పుము (35).

వ్యాస ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషాం మునీనాం భావితాత్మనామ్‌ |మనసా శంకరం స్మృత్వా సూతః ప్రోవాచ తాన్మునీన్‌ || 36

ఇతి శ్రీశైవే మహాపురాణ విద్యేశ్వర సంహితాయాం ముని ప్రశ్న వర్ణనం నామ ప్రథమో sధ్యాయః (1)

వ్యాసుడిట్లు పలికెను-

పవిత్రమగు అంతఃకరణము గల ఆ మునుల ఈ పలుకులను విని, సూతుడు మనస్సులో శంకరుని స్మరించి, ఆ మునులతో నిట్లనెను.

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు ముని ప్రశ్న వర్ణనము అను మొదటి అధ్యాయము ముగిసినది.

Sri Sivamahapuranamu-I    Chapters