Sri Sivamahapuranamu-I
Chapters
అథ ఏకాదశోsధ్యాయః లింగ ప్రతిష్ఠ - ప్రణవము - పంచాక్షరి ఋషయ ఊచుః | కథం లింగం ప్రతిష్ఠాప్యం కథం వా తస్య లక్షణమ్ | కథం వా తత్సమభ్యర్చ్యం దేశే కాలే చ కేన హి ||
1 ఋషులిట్లు పలికిరి - లింగమును ఎట్లు ప్రతిష్ఠించవలెను? లింగము యొక్క లక్షణములేవి? దానిని అర్చించు విధమెట్టిది? ఏ దేశ కాలములలో ఏ పదార్థముతో లింగమును నిర్మించవలెను? (1) సూత ఉవాచ | యుష్మదర్థం ప్రవక్ష్యామి బుద్ధ్యంతా మవధానతః | అనుకూలే శుభే కాలే పుణ్య తీర్థే తటే తథా || 2 యుథేష్టం లింగమారోప్యం యత్ర స్సాన్నిత్యమర్చనమ్ . పార్ధివేన తథాప్యేన తైజసేన యథారుచి || 3 కల్పలక్షణ సంయుక్తం లింగం పూజాఫలం లభేత్ | సర్వలక్షణ సంయుక్తం సద్యః పూజాఫలప్రదమ్ || 4% సూతుడిట్లు పలికెను - మీకీ విషయములను చెప్పెదను. సావధానముగా వినుడు. అనుకూలమైన శుభముహూర్తము నందు పుణ్యక్షేత్రములో నదీతీరమున (2), పార్థివ, జలమయ, తేజోమయ లింగములలో మనస్సునకు నచ్చిన లింగమును ప్రతిష్టించి నిత్యము అర్చించవలెను (3). కల్పోక్త లక్షణములతో కూడిన లింగమును అర్చించినచో, పూజాఫలము లభించును. అన్ని మంచి లక్షణములతో కూడిన లింగమును అర్చించినచో, పూజాఫలము వెనువెంటనే లభించును (4). చరే విశిష్యతే సూక్ష్యం స్థావరే స్థూలమేవ హి | సలక్షణం సపీఠం చ స్థాపయేచ్ఛివ నిర్మితమ్ || 5 మండలం చతురస్రం వా త్రికోణ మథవా తథా | ఖట్వాంగ వన్మధ్యసూక్ష్మం లింగపీఠం మహాఫలమ్ || 6 ప్రథమం మృచ్ఛిలాదిభ్యో లింగం లోహాదిభిః కృతమ్ | యేన లింగం తేన పీఠం స్థావరే హి విశిష్యతే || 7 లింగం పీఠం చరే త్వేకం లింగం బాణకృతం వినా | లింగ ప్రమాణం కర్తౄణాం ద్వాదశాంగుల ముత్తమమ్ || 8 న్యూనం చేత్ఫలమల్పం స్యాదధికం నైవ దూష్యతే | కర్తూరేకాంగుల న్యూనం చరేపి చ తథైవ హి || 9 చల ప్రతిష్ఠ యందు చిన్న లింగము, అచల ప్రతిష్ఠ యందు పెద్ద లింగము శ్రేష్ఠము. సర్వ సల్లక్షణలతో కూడిన లింగమును పీఠముతో సహా స్థాపించవలెను (5). లింగపీఠము మండలాకారముగా గాని, చతుర్భుజాకారముగా గాని, త్రికోణాకారముగా గాని, లేదా ఖట్వాంగము (ఒకానొక ఆయుధ విశేషము ) వలె మధ్యలో పలుచగా గాని యున్నచో మహాఫలము కలుగును (6). లింగమును మట్టి, రాయి, లోహము మొదలగు పదార్థములతో చేయవలెను. అచల ప్రతిష్ఠలో లింగము, పీఠము ఒకే పదార్థముతో చేయబడుట శ్రేష్ఠము (7). చల ప్రతిష్ఠలో కూడ లింగ , పీఠములను ఒకే పదార్థముతో చేయవలెను. బాణలింగమునకీ నియమము వర్తించదు. లింగము దానిని ప్రతిష్ఠించు యజమాని యొక్క పన్నెండువ్రేళ్ల పరిమాణమున్నచో ఉత్తమము (8). అంతకంటె తక్కువయైనచో, ఫలము తగ్గును. కాని, అధికమున్నచో దోషము లేదు. చల ప్రతిష్ఠలో లింగ పరిమాణము యజమాని యొక్క ఒక వ్రేలు అంత తక్కువ యుండవచ్చును (9). అదౌ విమానం శిల్పేన కార్యం దేవగణౖర్యుతమ్ | తత్ర గర్భ గృహే రమ్యే దృఢే దర్పణ సన్నిభే || 10 భూషితే నవరత్నైశ్చ దిగ్ ద్వారే చ ప్రధానకైః | నీలం రక్తం చ వైదూర్యం శ్యామం మారకతం తథా || 11 ముక్తా ప్రవాల గోమేధ వజ్రాణి నవరత్నకమ్ | మధ్యే లింగం మహత్ ద్రవ్యం నిక్షిపేత్సహ వేదికే || 12 ముందుగా శిల్ప శాస్త్రానుసారముగా దేవలయమును నిర్మించవలెను. దానిపై దేవతల మూర్తులు ఉండవలెను. దానిలో సుందరము, దృఢము, అద్దము వలె స్వచ్ఛము అయిన గర్భగుడి ఉండవలెను (10). దానికి నాల్గు దిక్కులలో అలంకరింపబడిన ద్వారము లుండవలెను. లింగమును ప్రతిష్ఠించు స్థానములో నీల రక్త , వైడూర్య, శ్యామ, మరకత (11),ము క్తా (ముత్యము), ప్రవాల (పగడము) , గోమేధ, వజ్రములనే తొమ్మిది రత్నములను, ఇతరములగు గొప్ప ద్రవ్యములను వేదమంత్ర పురస్సరముగా నుంచవలయును (12). సంపూజ్య లింగం సద్యాద్యైః పంచస్థానే యథాక్రమమ్ | అగ్నౌ చ హూత్వా బహుధా హవిషా సకలం చ మామ్ || 13 అభ్యర్చ్య గురమాచార్య మర్ధైః కామైశ్చ బాంధవమ్ | దద్యాదైశ్వర్యమర్థిభ్యో జడమప్య జడం తథా || 14 స్థావరం జంగమం జీవం సర్వం సంతోష్య యత్నతః | సువర్ణ పూరితే శ్వభ్రే నవరత్నైశ్చ పూరితే || 15 సద్యాది బ్రహ్మ చోచ్చార్య ధ్యాత్వా దేవం పరం శుభమ్ | ఉదీర్య చ మహామంత్ర మోంకారం నాద ఘేషితమ్ || 16 లింగం తత్ర ప్రతిష్ఠాప్య లింగం పీఠేన యోజయేత్ | లింగం సపీఠం నిక్షిప్య నిత్య లేపేన బంధయేత్ || 17 సద్యో జాతాది మంత్రములచే లింగమును వరుసగా అయిదు స్థానముల యందు పూజించవలెను. హవిస్సుతో అగ్నిహోత్రములో సర్వదేవతలకు, సాకారుడనగు నాకు హోమమును చేయవలెను (13). పురోహితుని, ఆచార్యుని దక్షిణలతో అర్చించవలెను. బంధు జనుల కోర్కెలను తీర్చి, యాచకులకు జడ సంపద(ధనధాన్యాదులు) ను, చేతన సంపద (పశువులు) ను దానమీయవలెను (14). చరాచర ప్రాణుల నన్నిటినీ ప్రయత్నపూర్వకముగా సంతోష పెట్టవలెను. బంగారముతో, నవరత్నములతో లింగగర్తమును పూరించవలెను (15). సద్యోజాతాది మంత్రములను పఠించి, మంగళకరుడగు మహాదేవుని ధ్యానించి, ఓంకార మహామంత్రమును జపించి, శంఖనాదమును చేయుచూ (16), దాని యందు లింగమును ప్రతిష్ఠించి, పీఠముతో జతగూర్చవలెను. పీఠసహితముగా లింగమును దాని యందుంచి, ఆపై దృఢమగు లేపముతో లింగపీఠములు సుస్థిరమగునట్లు చేయవలెను (17). ఏవం బేరం చ సంస్థాప్య తత్రైవ పరమం శుభమ్ | పంచాక్షరేణ బేరం తు ఉత్సవార్థం బహిస్తథా || 18 బేరం గురుభ్యో గృహ్ణీయాత్సాధుభిః పూజితం తు వా | ఏవం లింగే చ బేరే చ పూజా శివపదప్రదా || 19 పునశ్చ ద్వివిధం ప్రోక్తం స్థావరం జంగమం తథా | స్థావరం లింగమిత్యాహుస్తరు గుల్మాదికం తథా || 20 జంగమం లింగమిత్యాహుః క్రిమికీటాదికం తథా | స్థావరస్య చ శశ్రూషా జంగమస్య చ తర్పణమ్ || 21 తత్తత్సుఖానురాగేణ శివపూజాం విదుర్బుధాః | అదే దేవళములో ఉత్సవముల కొరకై పరమ మంగళమయమగు శివమూర్తిని బయట పంచాక్షరితో స్థాపించవలెను (18). ఈ మూర్తిని ఆచార్యుల నుండి తెచ్చుకొనవలెను. లేదా, సాధుపురుషులచే పూజింపబడిన మూర్తిని ప్రతిష్ఠించవలెను. ఈ విధముగా లింగబేరముల నర్చించినచో, శివపదము లభించును (19). ఇంతేగాక, లింగము ద్వివిధమని చెప్పబడినది. ఒకటి స్థావరము;రెండవది జంగమము. చెట్లు, లతలు మొదలగు వాటికి స్థావర లింగమని పేరు (20). క్రిమికీటకాదులకు జంగమలింగమని పేరు. స్థావర లింగమును నీరుపోయుట మొదలగు సేవలతో, జంగమ లింగమును ఆహారాదులతో (21), అనురాగపూర్వకముగా సంతోషపెట్టవలెను. వాటికి ఇట్లు సుఖమును కల్గించుట శివపూజ యగునని పండితులు చెప్పెదరు. పీఠమంబామయం సర్వం శివలింగం చ చిన్మయమ్ || 22 యథా దేవీ ముమామంకే ధృత్వా తిష్ఠతి శంకరః | తథా లింగమిదం పీఠం ధృత్వా తిష్ఠతి సంతతమ్ || 23 ఏవం స్థాప్య మహాలింగం పూజయేదుపచారకైః | నిత్య పూజా యథాశక్తి ధ్వజాదికరణం తథా || 24 ఇతి సంస్థాపయే ల్లింగం సాక్షాచ్ఛివపదప్రదమ్ | అథవా చర లింగం తు షోడ శైరుపచారకైః || 25 పూజయేచ్చ యథా న్యాయం క్రమాచ్ఛివ పదప్రదమ్ | సర్వత్ర పీఠము దేవీ స్వరూపము. శివలింగము చేతనాత్మకము (22). శంకరుడు ఉమాదేవిని అంకముపై ధరించి యుండు తీరున, ఈ లింగము సర్వదా పీఠమును ధరించియుండును (23). ఈ విధముగా గొప్ప లింగమును స్థాపించి, ఉపచారములతో నిత్యపూజను చేయవలెను. మరియు యథాశక్తిగా ధ్వజారోహణము మొదలగు ఉత్సవములను చేయవలెను (24).మానవుడు ఇట్టి అచల ప్రతిష్ఠ వలన సాక్షాత్తుగా శివుని ధామమును పొందగల్గును. లేదా, చల ప్రతిష్ఠను చేసి, యథాశాస్త్రముగా షోడశోపచారములతో (25) వరుసగా పూజించినచో, శివపదము లభించును. ఆవాహనం చాసనం చ అర్ఘ్యం పాద్యం తథైవ చ || 26 తదంగాచమనం చైవ స్నానమభ్యంగ పూర్వకమ్ | వస్త్రం గంధం తథా పుష్పం ధూపం దీపం నివేదనమ్ || 27 నీరాజనం చ తాంబూలం నమస్కారో విసర్జనమ్ | అథవార్ఘ్యాదికం కృత్వా నైవేద్యాంతం యథావిధి || 28 అథాభిషేకం నైవేద్యం నమస్కారం చ తర్పణమ్ | యథాశక్తి సదా కుర్యాత్ క్రమాచ్ఛివ పదప్రదమ్ || 29 ఆవాహనము, ఆసనము, ఆర్ఘ్యము, పాద్యము (26), ఆచమనము, అభ్యంగన స్నానము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము (27), నీరాజనము, తాంబూలము, నమస్కారము, ఉద్వాసన అనునవి షోడశోపచారములు. లేదా, ఆర్ఘ్యముతో మొదలిడి, నైవేద్యము వరకు విధివత్ చేయవలెను (28). అభిషేక, నైవేద్య, నమస్కార, తర్పణములను ప్రతిదినము యథాశక్తి చేసినచో, కాలక్రమములో శివపదము లభించును (29). అథావా మానుషే లింగే ప్యార్షే దైవే స్వయంభువి | స్థాపితేsపూర్వకే లింగే సోపచారం యథా తథా || 30 పూజోపకరణ దత్తే యత్ కించిత్ఫలమశ్నుతే | ప్రదక్షిణా నమస్కారైః క్రమాచ్ఛివ పదప్రదమ్ || 31 లింగదర్శన మాత్రం వా నియమేన శివప్రదమ్ | మరియు, ఇతర మానవులచే, లేక ఋషులచే, లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడిన లింగమును, లేదా స్వయముగా ప్రకటమైన లింగమును, లేదా సాధకుడు తాను ప్రతిష్ఠిచిన నూతన లింగమును షోడశోపచారములతో యథావిధిగా అర్చించిననూ (30),లేదా పూజాద్రవ్యములను దానము చేసిననూ పూర్వోక్తఫలము సిద్ధించును. వరుసగా ప్రదక్షిణములను, నమస్కారములను చేసినచో శివపదము లభించును (31). ప్రతి నిత్యము లింగమును దర్శించుట మాత్రము చేతనే శివసాయుజ్యము లభించును. మృత్పిష్ట గోశకృత్ పుషై#్పః కరవీరేణ వా ఫలైః || 32 గుడేన నవనీతేన భస్మ నాన్నైర్యథారుచి | లింగం యత్నేన కృత్వాంతే యజేత్తదనుసారతః || 33 అంగుష్ఠాదావపి తథా పూజామిచ్ఛంతి కేచన | లింగ కర్మణి సర్వత్ర నిషేధోsస్తి న కర్హిచిత్ || 34 సర్వత్ర ఫలదాతా హి ప్రయాసానుగుణం శివః | మట్టి, పిండి, గోమయము, పుష్పములు, గన్నేరుపువ్వులు, ఫలములు (32), బెల్లము, వెన్న, విభూతి, అన్నము అనువాటిలో మనస్సునకు నచ్చిన వస్తువుతో లింగమును చేసి యథావిధిగా ప్రయత్నపూర్వకముగా అర్చించవలెను (33). అంగుష్ఠము మొదలగు లింగాకార వస్తువుల యందు పూజను చేయవచ్చునని కొందరి అభిప్రాయము. లింగపూజ యందు అంగుష్ఠాది రూపములు ఉపాదేయములగును. నిషేధమేమియు లేదు (34). అన్ని సందర్భములలో సాధకుల శ్రమకు తగు ఫలము నిచ్చువాడు శివుడే గదా! అథవా లింగదానం వా లింగ మౌల్యమథాపి వా || 35 శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివ పదప్రదమ్ | అథవా ప్రణవం నిత్యం జపేద్దశ సహస్రకమ్ || 36 సంధ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివ పదప్రదమ్ | జపకాలే మకారాంతం మనశ్శుద్ధికరం భ##జేత్ || 37 సమాధౌ మానసం ప్రోక్తముపాంశు సార్వకాలికమ్ | సమాన ప్రణవం చేమం బిందు నాదయుతం విదుః || 38 లింగమును గాని, లింగము యొక్క వెలను గాని (35), శ్రద్ధతో శివభక్తున కిచ్చినచో, శివపదము లభించును. లేదా, నిత్యము పదివేలు ఓంకార జపమును చేసినచో (36), లేదా ఉభయ సంధ్యల యందు వేయి చొప్పున జపించినచో, శివపదము లభించును. ఓంకారమును జపము చేయునప్పుడు దీర్ఘ మకారాంతముగా చేసినచో, మనశ్శుద్ధి కలుగును (37). ఓంకార జపమును సమాధిలో మానసికముగాను, ఇతర కాలములలో మెల్లగాను (ఇతరులకు వినబడని విధముగా) చేయవలెను. బిందు (అనుస్వార) నాదములతో కూడిన ఓంకారమును సమాన ప్రణవమని యందురు (38). అథ పంచాక్షరం నిత్యం జపేదయుత మాదరాత్ | సంధ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపద ప్రదమ్ || 39 ప్రణవేనాది సంయుక్తం బ్రాహ్మణానాం విశిష్యతే | దీక్షాయుక్తం గురోర్గ్రాహ్యం మంత్రం హ్యథ ఫలాప్తయే || 40 కుంభస్నానం మంత్రదీక్షా మాతృకాన్యాస మేవ చ | బ్రాహ్మణస్సత్యపూతాత్మ గురుర్ జ్ఞానీ విశిష్యతే || 41 ద్విజానాం చ నమః పూర్వమన్వేషాం చ నమోsంతకమ్ | స్త్రీణాం చ క్వచిదిచ్ఛంతి నమోంతం చ యథావిధి || 42 విప్త్రస్త్రీణాం నమః పూర్వమిదం మిచ్ఛంతి కేచన | పంచకోటి జపం కృత్వా సదాశివ సమో భ##వేత్ || 43 మరియు పంచాక్షరిని నిత్యము పదివేలు శ్రద్ధతో జపించవలెను. ఉభయ సంధ్యలలో వేయి చొప్పున జపించినచో, శివపదము లభించును (39). బ్రాహ్మణులు పంచాక్షరిని ఆది యందు ఓంకారముతో కలిపి జపించిన శ్రేష్ఠము. మంత్రమును దీక్షాపూర్వకముగా గురువు నుండి స్వీకరించినచో, ఫలము సిద్ధించును (40). కడవతో స్నానము, మంత్రదీక్ష , మంత్రవర్ణములతో అంగాది న్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణుడు, జ్ఞాని యగు గురువు శ్రేష్ఠములు (41). పంచాక్షరిని ద్విజులు నమఃపూర్వకముగను (నమశ్శివాయ), ఇతరులు నమః అంతముగను (శివాయ నమః) జపించవలెను. స్త్రీలు కూడ నమః అంతముగా జపించవలెనని కొందరు ఋషుల అభిప్రాయము (42). బ్రాహ్మణస్త్రీలు నమః పూర్వకముగ జపించవలెనని మరికొందరి మతము. ఐదుకోట్లు జపించినచో , సదాశివుని లో ఐక్యమగును (43). ఏకద్విత్రిచతుః కోట్యా బ్రహ్మాదీనాం పదం వ్రజేత్ | జపే దక్షరలక్షం వా అక్షరాణాం పృథక్ పృథక్ || 44 అథవాక్షరలక్షం వా జ్ఞేయం శివపద ప్రదమ్ | సహస్రం తు సహస్రాణాం సహస్రేణ దినేన హి || 45 జపేన్మంత్రాదిష్ట సిద్ధిర్నిత్యం బ్రాహ్మణ భోజనాత్ | అష్టోత్తర సహస్రం వై గాయత్రీం ప్రాతరేవ హి || 46 బ్రాహ్మణస్తు జపేన్నిత్యం క్రమాచ్ఛివ పదప్రదాన్ | వేద మంత్రాంస్తు సూక్తాని జపేన్నియమ మాస్థితః || 47 ఒకటి, రెండు, మూడు, నాల్గు కోట్లు జపించినచో, క్రమముగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశుల పదములు లభించును. ఒక్కొక్క అక్షరమును వేర్వేరు గా అక్షరలక్షలు (5 లక్షలు) జపించవలెను (44). లేదా, మంత్రమును అక్షరలక్షలు జపించినచో శివపదము లభించును. ప్రతిదినము వేయి చొప్పున వేయి దినములు (45) జపించి, నిత్యము బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో, ఇష్టసిద్ధికలుగును, ప్రతిదినము ఉదయమే బ్రాహ్మణుడు నూట యెనిమిది గాయత్రిని చేసి (46), శివపదము నొసంగు వేదమంత్రములను, సూక్తములను నియమముగా జపించవలెను (47). ఏకం దశార్ణం మంత్రం శతోనం చ తదూర్ధ్వకమ్ | అయుతం చ సహస్రం చ శతమేకం వినా భ##వేత్ || 48 వేదపారాయణం చైవ జ్ఞేయం శివపద ప్రదమ్ | అన్యాన్ బహుతరాన్మంత్రాన్ జపేదక్షర లక్షతః || 49 ఏకాక్షరాంస్తథా మంత్రాన్ జపేదక్షర కోటితః | తతః పరం జపే చ్చైవ సహస్రం భక్తి పూర్వకమ్ || 50 ఏవం కుర్యాద్యథా శక్తి క్రమాచ్ఛివపదం లభేత్ | నిత్యం రుచికరం త్వేకం మంత్రమామరణాంతికమ్ || 51 జపేత్సహస్ర మోమితి సర్వాభీష్టం శివాజ్ఞయా | ఒక అక్షరము కలిగినట్టియు, పదిఅక్షరములు కలిగినట్టియు, వందకు కొద్ది తక్కువ అక్షరములు కలిగినట్టియు, వందకు అధికమగు అక్షరములు కలిగినట్టియు, తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్షరములు కలిగినట్టియు, తొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్షరములు కలిగినట్టియు, తొంభైతొమ్మిది అక్షరములు కలిగిన మంత్రములు గలవు (48). వేద పారాయణము వలన శివపదము లభించునని తెలియవలెను. ఇంకనూ అనేక మంత్రములను అక్షరలక్షలు జపించవలెను (49). ఒకే అక్షరము గల మంత్రములను ఒక కోటి జపము చేయవలెను. ఆ తరువాత భక్తితో ప్రతిదినము వేయి జపమును చేయవలెను (50). ఇట్లు యథాశక్తి చేసినచో, కాలక్రమములో శివపదము లభించును. మనస్సునకు అభీష్టమైన ఒక మంత్రమును ఓంకారపూర్వకముగా మరణించు వరకు ప్రతిదినము (51), వేయి జపము చేసినచో, శివుని యాజ్ఞతో అభీష్టము లన్నియు నెరవేరును. పుష్పారామాదికం వాపి తథా సంమార్జనాదికమ్ || 52 శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్ | శిక్షేత్రే తథా వాసం నిత్యం కుర్యాచ్చ భక్తితః || 53 జడానామజడానాం చ సర్వేషాం భుక్తి ముక్తిదమ్ | తస్మాద్వాసం శివక్షేత్రే కుర్యాదామరణం బుధః|| 54 శివుని కొరకు పుష్పముల తోటను పెంచుట వలన, శివాలయములో తుడిచి, కడిగి శుభ్రము చేయుట వలన (52), సాధకునకు శివపదము లభించును. సాధకులు శివక్షేత్రములో భక్తితో నిత్యనివాసము చేయవలెను (53). శివక్షేత్రము నందు నివసించుట వలన వృక్ష లతాది స్థావరములకు, పశు మనుష్యాది జంగమములకు భుక్తి, ముక్తి కూడ లభించును. కావున, పండితుడు మరణించువరకు శివక్షేత్రములో నివసించవలెను (54). లింగాద్ధస్తశతం పుణ్యం క్షేత్రే మానుషకే విదుః | సహస్రారత్ని మాత్రం తు పుణ్యక్షేత్రే తథార్షకే || 55 దైవ లింగే తథా జ్ఞేయం సహస్సారత్ని మానతః | ధనుష్ప్రమాణ సాహస్రం పుణ్యం క్షేత్రే స్వయం భువి || 56 మానవ ప్రతిష్ఠిత శివక్షేత్రములో లింగము నుండి వంద బారల దూరము వరకు, ఋషి ప్రతిష్ఠిత క్షేత్రములో వేయి మూరల దూరము వరకు (55), దేవతా ప్రతిష్ఠిత క్షేత్రములో కూడ వేయి మూరల వరకు, స్వయం భూక్షేత్రములో వేయి ధనస్సుల దూరము వరకు పవిత్ర భూమి యని ఋషులు చెప్పెదరు (56) పుణ్యక్షేత్రే స్థితా వాపీకూపాద్యాః పుష్కరాణి చ | శివగంగేతి విజ్ఞేయం శివస్య వచనం యథా || 57 తత్ర స్నాత్వా తథా దత్వా జపిత్వాహి శివం వ్రజేత్ | శివక్షేత్రం సమాశ్రిత్య వసేదా మరణం తథా || 58 దాహం దశాహం మాస్యం వా సపిండీకరణం తువా | ఆబ్దికం వా శివక్షేత్రే పిండమథా పి వా || 59 సర్వపాప వినిర్ముక్త స్సద్య శ్శివపదం లభేత్ | పుణ్యక్షేత్రములో బావులు, సరస్సులు మొదలగునవి శివగంగ యని తెలియవలెను. శివుడు అట్లు చెప్పినాడు (57). వాటి యందు స్నానము చేసి, దానము చేసి, జపము చేసిన వ్యక్తి శివుని పొందును. మానవుడు మరణించు వరకు శివక్షేత్రము నాశ్రయించి జీవించవలెను (58). మరణించిన వ్యక్తి దేహమును శివక్షేత్రములో దహించుట, లేక పదవరోజు కర్మను చేయుట, లేదా మాసికమును పెట్టుట, లేక సపిండీకరణము, లేక ఆబ్దికమును పెట్టుట, లేక పిండదానమును చేయుట వలన (59), ఆ జీవుడు వెనువెంటనే పాపములన్నిటి నుండి విముక్తుడై, శివపదమును పొందును. అథవా సప్త రాత్రం వా వసేద్వా పంచరాత్రకమ్ || 60 త్రిరాత్రమేకరాత్రం వా క్రమాచ్ఛివపదం లభేత్ | స్వవర్ణానుగుణం లోకే స్వా చారా త్ర్పాప్నుతే నరః || 61 వర్ణోద్ధారేణ భక్త్యా చ తత్ఫలాతిశయం నరః | సర్వం కృతం కామనయా సద్యః ఫలమవాప్నుయాత్ || 62 సర్వం కృతమకామేన సాక్షాచ్ఛివ పదప్రదమ్ | శివక్షేత్రములో ఏడు రాత్రులు గాని, ఐదు రాత్రులు గాని (60), మూడు రాత్రులు గాని , ఒక రాత్రి గాని నివసించినచో, కాలక్రమములో శివపదము లభించును. మానవుడు లోకములో స్వవర్ణానురూపముగా స్వధర్మమును (61) భక్తితో పాటించినచో, అతిశయించిన ఫలమును పొందును. కామనతో శివపూజాదికమును చేసినచో, వెనువెంటనే ఫలము లబించును (62). కాని నిష్కామముగా చేసినచో శివుని పదము లభించును. ప్రాతర్మధ్యాహ్న సాయాహ్న మహస్త్రిష్వేకతః క్రమాత్ || 63 ప్రాతర్విధికరం జ్ఞేయం మధ్యాహ్నం కామికం తథా | సాయాహ్నం శాంతికం జ్ఞేయం రాత్రావపి తథైవ హి || 64 కాలో నిశీథో పై ప్రోక్తో మధ్యయామ ద్వయం నిశి | శివపూజా విశేషేణ తత్కాలేsభీష్ట సిద్ధి దా || 65 ఏవం జ్ఞాత్వా నరః కుర్వన్ యథోక్త ఫల భాగ్భవేత్ | కలౌ యుగే విశేషేణ ఫలసిద్ధిస్తుకర్మణా || 66 ఉక్తేన కేన చిద్వాపి అధికార విభేదతః | సద్వృత్తిః పాప భీరుశ్చేత్తత్తత్ఫల మవాప్నుయాత్ || 67 ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అని దినము మూడు విభాగములుగా నున్నది (63). ఉదయము నిత్య కర్మలకు, మధ్యాహ్నము కామ్య కర్మలకు, సాయంకాలము శాంతి కర్మలకు తగిన కాలము అని తెలియవలెను. రాత్రియందు కూడ ఇట్టి విభాగము కలదు (64). రాత్రి యందలి మధ్యభాగములో గల రెండు యామముల కాలమునకు నిశీథమని పేరు. ఆ కాలమందు శివపూజ చేసినచో, విశేషించి అభీష్టములు సిద్ధించును (65). ఈ విషయము నెరింగి ఆచరించిన వ్యక్తి పైన వివరించిన ఫలమును పొందును. కలియుగములో విశేషించి కర్మ చేత ఫలసిద్ది కలుగును (66). మానవుడు ధార్మిక ప్రవృత్తి, పాపభీతి కలిగి, అధికార భేదమును బట్టి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబించినచో, ఆయా, ఫలములను పొందును (67). ఋషయ ఊచుః | అథ క్షేత్రాణి పుణ్యాని సమాసాత్కథయస్వ నః | సర్వాః స్త్రియశ్చ పురుషా యాన్యాశ్రిత్య పదం లభేత్ || 68 సూత యోగి వరకు శ్రేష్ఠ శివక్షేత్రా గమాంస్తథా | సూతఉవాచ| శృణుతః శ్రద్ధయా సర్వక్షేత్రాణి చ తదాగమాన్ || ఇతి శ్రీశివమహా పురాణ విద్యేశ్వర సంహితాయాం ఏకదశ్యోధ్యాయః (1 1). ఋషులిట్లు పలికిరి- ఓ సూతా! నీవు యోగులలో శ్రేష్ఠుడవు. మాకు పుణ్యక్షేత్రములను గురించి సంగ్రహముగా చెప్పుము. స్త్రీ పురుషులందరు వాటిని సేవించి శివపదమును పొందెదరు (69). శివక్షేత్రములను, శివాగమములను కూడ వివరింపుము. సూతుడిట్లు పలికెను - శివ క్షేత్రములను గురించి, వాటి ఆగమముల గురించి శ్రద్ధగా వినుడు (69).శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు పదకొండవ అధ్యాయము ముగిసినది