Sri Sivamahapuranamu-I
Chapters
అథ షోడశోsధ్యాయః పూజావిధానము - పూజాఫలము ఋషయ ఊచుః | పార్థివ ప్రతిమాపూజా విధానం బ్రూహి సత్తమ | యేన పూజావిధానేన సర్వాభీష్టమవాప్యతే ||
1 సూత ఉవాచ | సుసాధు పృష్టం యుష్మాభిః సదా సర్వార్థదాయకమ్ | సద్యో దుఃఖస్య శమనం శృణుత ప్రబ్రవీమి వః ||
2 అపమృత్యుహరం కలామృత్యోశ్చాపి వినాశనమ్ | సద్యః కలత్ర పుత్రాది ధన ధాన్యప్రదం ద్విజాః ||
3 అన్నాది భోజ్యం వస్త్రాది సర్వముత్పద్యతే యతః | తతో మృదాది ప్రతిమాపూజాభీష్ట ప్రదా భువి ||
4 పురుషాణాం చ నారీణా మధికారోsత్రనిశ్చితమ్ | ఋషులిట్లు పలికిరి - ఓ మహానుభావా! ఏ పూజా విధానముచే కోర్కెలన్నియూ నెరవేరునో, అట్టి మట్టి ప్రతిమను పూజించు విధానమును చెప్పుము (1). సూతుడిట్లు పలికెను - మీరు చాలా చక్కగా ప్రశ్నించితిరి. సర్వకాలములలో సర్వఫలములను ఇచ్చి, వెను వెంటనే దుఃఖములను పోగొట్టే పూజావిధిని మీకు చెప్పెదను. వినుడు (2). ఓ ద్విజులారా! ఈ పూజావిధానము వలన అపమృత్యువు మాత్రమే గాక , కాలమృత్యువు కూడ వినాశమును పొందును. వెనువెంటనే భార్య, పుత్రుడు, ధన ధాన్యములు లభించును (3). మట్టి మొదలగు వాటితో చేసిన ప్రతిమలను పూజించుట వలన భూలోకములో అన్నాది భోజ్యములు, వస్త్రాదులు, సర్వాభీష్టములు సిద్ధించును (4). ఈ పూజ యందు పురుషులకు, స్త్రీలకు కూడ అధికారము గలదనుటలో సందేహము లేదు. నద్యాం తడాగే కూపే వా జలాంతర్మృదమాహారేత్ ||
5 సంశోధ్య గంధచూర్ణేన షేషయిత్వా సుమండపే | హస్తేన ప్రతిమాం కుర్యాంత్ క్షీరేణ చ సుసంస్కృతామ్ ||
6 అంగ ప్రత్యంగకోపేతా మాయుధైశ్చ సమన్వితామ్ | పద్మాసనస్థితాం కృత్వా పూజయే దాదరేణ హి ||
7 విఘ్నేశాదిత్య విష్ణూనామంబాయాశ్చ శివస్య చ | శివస్య శివలింగం చ సర్వదా పూజయే ద్ద్విజాః ||
8 నదిలో గాని, చెరువులో గాని, నూతిలో గాని, నీటిలోపల నున్న మట్టిని తీసుకువచ్చి (5), శుద్ధి చేసి, గంధపుపొడితో కలిపి, చేతితో ప్రతిమను చేసి, అందమగు మండపము నందుంచి, పాలతో సంస్కరించవలెను (6). అంగప్రత్యంగములతో, ఆయుధములతో కూడియున్న ఆ ప్రతిమను పద్మాసనము నందు స్థాపించి, శ్రద్ధతో పూజించవలెను (7). ఓ బ్రాహ్మణులారా! విఘ్నేశ్వర, ఆదిత్య, విష్ణువుల ప్రతిమలను, పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను, శివలింగమును కూడ నిత్యము పూజించవలెను (8). షోడశైరుపచారైశ్చ కుర్యాత్తత్ఫలసిద్ధయే | పుష్పేణ ప్రోక్షణం కుర్యాదభిషేకం సమంత్రకమ్ || 9 శాల్యన్నేనైవ నైవేద్యం సర్వం కుడవమానతః | గృహేతు కుడవం జ్ఞేయం మానుషే ప్రస్థమిష్యతే || 10 దైవే ప్రస్థత్రయం యోగ్యం స్వయంభోః ప్రస్థపంచకమ్ | ఏవం పూర్ణఫలం విద్యాదధికం వై ద్వయం త్రయమ్ || 11 సహస్ర పూజయా సత్యం సత్యలోకం లభేద్ద్విజః | పూజాఫలము సిద్ధించుట కొరకు షోడశోపచారములతో పూజించవలెను. పుష్పముతో నీటిని జల్లుతూ సమంత్రకముగా అభిషేకమును చేయవలెను (9). పావు బియ్యముతో వండిన అన్నమును నైవేద్యమిడవలెను. ఇంటిలోని ప్రతిమకు పావు, మవుష్య ప్రతిష్ఠ యగు దేవళములో పూజ చేసినపుడు శేరు బియ్యముతో అన్నమును వండి నైవేద్యమిడవలెను (10). దేవాలయము దైవప్రతిష్ఠ అయినచో మూడు శేరులు, స్వయంభూలింగమైనచో ఐదు శేరులు బియ్యమును వండి నైవేద్యమిడినచో పూర్ణ ఫలము లభించును. ఇట్లు పూజను రెండు లేక మూడుసార్లు చేసినచో అధికఫలము లభించును (11). ద్విజుడు వేయిసార్లు పూజ చేసినచో నిశ్చతముగా సత్యలోకమును పొందును. ద్వాదశాంగుల మాయామం ద్విగుణం చ తతోs ధికమ్ || 12 ప్రమాణమంగులసై#్యకం తదూర్ద్వం పంచకత్రయమ్ | అయోదారు కృతం పాత్రం శివమిత్యుచ్యతే బుధైః || 13 తదష్టభాగః ప్రస్థస్స్యాత్ తచ్చతుః కుడవం మతమ్ | దశప్రస్థం శతప్రస్థం సహస్ర ప్రస్థమేవ చ || 14 జల తైలాది గంధానాం యథాయోగ్యం చ మానతః | మానుషార్ష స్వయంభూనాం మహాపూజేతి కథ్యతే || 15 పన్నెండు అంగుళముల వెడల్పు, ఇరవై అయిదు అంగుళముల పొడవు (12), పదిహేను అంగుళముల ఎత్తు గల చెక్క పాత్రను లేదా లోహపాత్రను పండితులు 'శివము' అని అందురు (13). దానిలో ఎనిమిదవ భాగము ప్రస్థము (శేరు). దానిలో నాల్గవ భాగము కుడవము (పావు) . మానవ ప్రతిష్ఠిత శివలింగమునకు పదిశేర్లు, ఋషి ప్రతిష్ఠిత లింగమునకు వందశేర్లు, స్వయం భూలింగమునకు వేయి శేర్లు (14). బియ్యమును వండి నైవేద్యమిడి, జలాభిషేకము, తైలాభిషేకము, గంధము మొదలగు ఉపచారములను కూడ తగిన పరిమాణములో చేసినచో ఆ పూజకు మహా పూజ యని పేరు (15). అభిషేకాదాత్మ శుద్ధి ర్గంధాత్పుణ్యమవాప్యతే | ఆయుస్తృప్తి శ్చ నైవేద్యాత్ ధూపాదర్థ మవాప్యతే || 16 దీపాత్ జ్ఞానమవాప్నోతి తాంబూలాద్భోగ మాప్నుయాత్ | తస్మాత్ స్నానాదికం షట్కం ప్రయత్నేన ప్రసాధయేత్ || 17 నమస్కారో జపశ్చైవ సర్వాభీష్ట ప్రదావుభౌ | పూజాంతే చ సదాకార్యౌ భోగమోక్షార్థి భిర్నరైః || 18 సంపూజ్య మనసా కుర్యాత్తత్తత్సదా నరః | దేవానాం పూజయా చైవ తత్తల్లోకమవాప్నుయాత్ || 19 తదవాంతర లోకే చ యథేష్టం భోగ్య మాప్యతే | తద్విశేషాన్ర్ప వక్ష్యామి శృణుత శ్రద్ధయా ద్విజాః || 20 శివునకు అభిషేకమును చేయుట వలన చిత్తశుద్ది కలుగును. గంధము నర్పించుట వలన పుణ్యము, నైవేద్యము చేయుట వలన ఆయుర్దాయము, తృప్తి, ధూపము నర్పించుట వలన ధనము లభించును (16). దీపమును చూపుట వలన జ్ఞానమును, తాంబూలము నిచ్చుట వలన భోగమును పొందును. కావున, స్నానముతో మొదలిడి ఈ ఆరు ఉపచారములను శ్రద్ధతో అర్పించవలెను (17). భోగమోక్షములను గోరు మానవులు నిత్యపూజ అయిన తరువాత కోర్కెల నన్నిటినీ తీర్చే నమస్కార జపములను రెండింటినీ చేయవలెను (18). ముందుగా మనస్సులో భగవానుని ధ్యానించి, తరువాత ఆయా ఉపచారములను అర్పించవలెను. మానవుడు దేవతలను పూజించుట వలన ఆయా లోకములను పొందుటయే గాక (19), అవాంతర లోకముల యందు గూడ స్వేచ్ఛగా భోగముల ననుభవించగల్గును. ఓ ద్విజులారా! ఆ విశేషములను చెప్పెదను. శ్రద్ధగా వినుడు (20). విఘ్నేశ పూజయా సమ్యగ్ భూర్లోకేsభీష్టమాప్నుయాత్ | శుక్రవారే చతుర్ధ్యాం చ సితే శ్రావణ భాద్రకే || 21 భిషగ్నక్షే ధనుర్మాసే విఘ్నేశం విధివద్యజేత్ | శతం పూజా సహస్రం వా తత్సంఖ్యాక దినైర్వ్రజేత్ || 22 దేవాగ్ని శ్రద్ధయా నిత్యం పుత్రదం చేష్టదం నృణామ్ | సర్వ పాప ప్రశమనం తత్తద్దురిత నాశనమ్ || 23 వారపూజాం శివాదీనా మాత్మ శుద్ధి ప్రదం విదుః | తిథి నక్షత్ర యోగానా మాధారం సార్వకామికమ్ || 24 తథా వృద్ధి క్షయాభావాత్ పూర్ణ బ్రహ్మాత్మకం విదుః | ఉదయాదుదయం వారో బ్రహ్మ ప్రభృతి కర్మణామ్ || 25 విఘ్నేశ్వరుని పూజించుట వలన భూలోకము నందు కోర్కెలను పూర్తిగా పొందును. శుక్రవారము నాడు, శ్రావణ భాద్రపద మాసములలో శుక్లపక్ష చతుర్ధినాడు (21), ధనుర్మాసములో శతభిషక్ నక్షత్రము నాడు విఘ్నేశుని యథావిధిగా అర్చించవలెను. వంద, లేక వేయి రోజుల వరుసగా పూజించవలెను (22). దేవతల యందు, అగ్ని యందు శ్రద్ధ కలిగి నిత్యము పూజను, హోమమును చేసిన మానవులకు సంతానము కలుగును; కోర్కె లీడేరును; పాపము లన్నియు తొలగును; పాపకర్మలు దూరమగును (23). శివాది దేవతలను ఆయా వారముల యందు ఆరాధించుట వలన అంతః కరణ శుద్ధి కలుగునని పెద్దలు చెప్పుదురు. తిథి, నక్షత్ర, యోగములకు వారమే ఆధారము. కోర్కెల నన్నిటినీ వారపూజ ఈడేర్చును (24). మరియు, వారమునకు పెరుగుదల, తగ్గుదల లేవు గనుక, వారము పూర్ణ బ్రహ్మ స్వరూపమని చెప్పుదురు. బ్రాహ్మణాదుల కర్మలకు సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒక వారముగా పరిగణించవలెను (25). తిథ్యా దౌ దేవపూజా హి పూర్ణ భోగప్రదా నృణామ్ | పూర్వభాగః పితౄణాం తు నిశియుక్తః ప్రశస్యతే || 26 పరభాగస్తు దేవానాం దివాయుక్తః ప్రశస్యతే | ఉదయ వ్యాపినీ గ్రాహ్యా మధ్యాహ్నే యది సా తిథిః || 27 దేవకార్యే తథా గ్రాహ్యాస్తిథి ఋక్షాదికాశ్శుభాః | సమ్యగ్విచార్య వారాదీన్ కుర్యా త్పూజా జపాదికమ్ || 28 పూర్జాయతే హ్యనేనేతి వేదేశ్వర్ధస్య యోజనా | పూర్ణ భోగఫల సిద్ధిశ్చ జాయతే తేన కర్మణా || 29 మనోభావాంస్తథా జ్ఞానమిష్టభోగర్థ యోజనాత్ | పూజాశబ్దార్థ ఏవం హి విశ్రుతో లోకవేదయోః || 30 తిథి యొక్క ఆది యందు దేవపూజ చేయు మానవులకు పూర్ణభోగములు లభించును. రాత్రితో కూడిన తిథి యొక్క పూర్వభాగము పితృదేవతల అర్చనకు ప్రశస్తమైనది (26). తిథి యొక్క ద్వితీయార్ధము పగటితో కూడియున్నచో దేవపూజకు ప్రశస్తము. తిథి ఉదయమును వ్యాపించి మధ్యాహ్నము వరకు ఉన్నచో అదియే శ్రేష్ఠము (27). ఈ తీరున చక్కగా విచారణ చేసి, శుభమగు తిథి నక్షత్రాదులలో దేవపూజ, జపము ఇత్యాదులను చేయవలెను (28). వేదముల యందు పూజాశబ్దమునకు వ్యుత్పత్తి ఈయబడినది. పూఃజాయతే అనేన. అనేన=ఈ కర్మచేత; పూః=పూర్ణమగు భోగముల, ఫలముల సిద్ధి, జాయతే=కలుగును (29). అభీష్టమగు భోగము అనగా మనస్సునకు నచ్చిన వస్తువులు కావచ్చును. మరియు, పరమార్థ జ్ఞానము కావచ్చును. లోకము నందు, వేదములో పూజాశబ్దమునకు ఈ అర్ధము ప్రసిద్ధమై యున్నది (30). నిత్య నైమిత్తికం కాలాత్సద్యః కామ్యే స్వనుష్ఠితే | నిత్యం మాసం చ పక్షం చ వర్షం చైవ యథా క్రమమ్ || 31 తత్తత్కర్మ ఫల ప్రాప్తి స్తాదృక్పాపక్షయః క్రమాత్ | మహాగణపతేః పూజా చతుర్ధ్యాం కృష్ణపక్షకే || 32 పక్ష పాపక్షయ కరీ పక్ష భోగఫల ప్రదా | చైత్రే చతుర్ధ్యాం పూజా చ కృతా మాసఫల ప్రదా|| 33 వర్ష భోగ ప్రదా జ్ఞేయా కృతా వై సింహభాద్రకే | శ్రావణ్యా దిత్యవారే చ సప్తమ్యాం హస్తభే దినే || 34 మాఘ శుక్లే చ సప్తమ్యామాదిత్య యజనం చరేత్ | నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరము నందు ఫలము నిచ్చును. చక్కగా అనుష్ఠింపబడిన కామ్యకర్మ వెనువెంటనే ఫలమునిచ్చును. పక్షము గాని, మాసముగాని, సంవత్సరము గాని వరుసగా ప్రతి నిత్యము పూజాదికర్మను చేసినచో (31), ఆయా కాలములకు చెందిన ఫలము నిచ్చి, ఆయా కాలములలో పాపములను పోగొట్టును. కృష్ణపక్ష చతుర్థి నాడు మహాగణపతిని పూజించినచో (32), పదిహేను రోజులు పాపములు తొలగి, భోగములు, ఫలములు, సిద్ధించును. చైత్ర చతుర్ధి నాడు పూజించినచో, మాస పూజాఫలము లభించును (33). భాద్రపద మాసములో సూర్యుడు సింహరాశి యందుండగా పూజించినచో, సంవత్సర కాలము భోగములు లభించును. శ్రావణ మాసములో ఆదివారము, హస్తా నక్షత్ర యుక్త సప్తమి నాడు (34), మాఘ శుక్ల సప్తమి నాడు ఆదిత్యుని పూజించవలయును. జ్యేష్ఠ భాద్రక సౌమ్యే చ ద్వాదశ్యాం శ్రవణ ర్ క్షకే || 35 ద్వాదశ్యాం విష్ణుయజన మిష్ట సంపత్కరం విదుః | శ్రావణ విష్ణుయ జనమిష్టారోగ్య ప్రదం భ##వేత్ || 36 గవాదీన్ ద్వాదశానర్ధాన్ సాంగాన్ దత్త్వా తు యత్ ఫలమ్ | తత్ఫలం సమవాప్నోతి ద్వాదశ్యాం విష్ణుతర్పణాత్ || 37 ద్వాదశ్యాం ద్వాదశాన్ విప్రాన్ విష్ణోర్ద్వాదశ నామతః | షోడశైరుపచారైశ్చ యజేత్తత్ర్పీతి మాప్నుయాత్ || 38 ఏవం చ సర్వదేవానాం తత్త ద్ద్వాదశ నామకైః | ద్వాదశబ్రహ్మ యజనం తత్తత్ర్పీతికరం భ##వేత్ || 39 జేష్ఠ భాద్రపదమాసములలోని బుధవారము నాడు, శ్రవణా నక్షత్ర యుక్త ద్వాదశినాడు (35), మరియు కేవల ద్వాదశినాడు విష్ణువును ఆరాధించినచో, అభిష్టమగు సంపదలు లభించునని ఋషులు చెప్పుదురు. శ్రావణమాసములో విష్ణువును ఆరాధించినచో, కోర్కెలు ఈడేరి, ఆరోగ్యము చేకూరును (36). గోవు మొదలగు పన్నెండు వస్తులను దానము చేయుట వలన ఏ ఫలము లభించునో, ద్వాదశి నాడు విష్ణువును ఆరాధించుట వలన అదే ఫలము లభించును (37). ద్వాదశి నాడు పన్నెండు మంది బ్రాహ్మణులను విష్ణువు యొక్క పన్నెండు నామములతో, షోడశోప చారములతో పూజించు మానవుడు విష్ణువు యొక్క ప్రీతికి పాత్రుడగును (38). ఇదే తీరున, దేవతల నందరినీ వారి వారి పన్నెండు నామములతో పన్నెండు బ్రాహ్మణుల యందు ఆరాధించినచో, ఆయా దేవతల ప్రీతికి పాత్రుడగును (39). కర్కటే సోమవారే చ నవమ్యాం మృగశీర్షకే | అంబాం యజే ద్భూతి కామః సర్వభోగ ఫలప్రదామ్ || 40 ఆశ్వయుక్ ఛుక్ల నవమీ సర్వాభిష్ట ఫలప్రదా | ఆదివారే చతుర్దశ్యాం కృష్ణ పక్షే విశేషతః || 41 ఆర్ద్రాయాం చ మహార్ద్రాయాం శివపూజా విశిష్యతే | మాఘకృష్ణ చతుర్దశ్యాం సర్వాభీష్ట ఫలప్రదా || 42 ఆయుష్కరీ మృత్యుహరా సర్వసిద్ధికరీ నృణామ్ | సంపదలను కోరు వ్యక్తి కర్కట సంక్రాంతి, సోమవారము మృగశిరా నక్షత్ర యుక్త నవమి దినములలో సర్వభోగములను ఇచ్చే జగన్మాతను ఆరాధించవెలను (40). ఆశ్వయుజ శుక్ల నవమి కోరిన ఫలముల నన్నిటినీ ఇచ్చును. కృష్ణ పక్ష చతుర్దశీ ఆదివారము మిక్కిలి ప్రశస్తమైనది (41). ఈ తిథుల యందే గాక, ఆర్ద్రా నక్షత్రము నాడు, మహార్ద్ర (సూర్య సంక్రాంతితో కూడిన ఆర్ద్ర) నాడు శివపూజ చాల ప్రశస్తమైనది. మాఘ కృష్ణ చతుర్దశినాడు శివపూజను చేసిన మానవులకు కోరిన ఫలములన్నియు లభించును (42). మృత్యువు తొలగి, ఆయుష్షు పెరుగును. సర్వము సిద్ధించును. జేష్ఠ మాసే మహార్ద్రాయాం చతుర్దశీ దినేsపి చ || 43 మార్గశీర్షార్ద్ర కాయాం వా షోడశైరుపచారకైః | తత్తన్మూర్తిం శివం పూజ్య తస్య వై పాద దర్శనమ్ || 44 శివస్య యజనం జ్ఞేయం భోగమోక్ష ప్రదం నృణామ్ | వారాది దేవ యజనం కార్తికే హి విశిష్యతే || 45 కార్తికే మాసి సంప్రాప్తే సర్వాన్ దేవాన్ యజేద్బుధః | దానేన తపసా హోమై ర్జపేన నియమేన చ || 46 షోడశైరుపచారైశ్చ ప్రతిమా విప్రమంత్రకైః | బ్రాహ్మణానాం భోజనేన నిష్కామార్తికరో భ##వేత్ || 47 జేష్ఠ మాసములో మహార్ద్రా, చతుర్దశి (43), మార్గశీర్ష మాసములో ఆర్ద్రా అను దినములలో వివిధ పదార్ధములతో చేసిన శివుని మూర్తిని పూజించు వ్యక్తి యొక్క పాదములను దర్శించవలెను (44). శివుని పూజించు మానవులకు భోగమోక్షములు లభించును. కార్తీకమాసములో ఆయా వార దేవతలను పూజించుట ప్రశస్తమైనది (45). కార్తీకమాసము రాగానే వివేకి దేవతల నందరినీ పూజించవలెను. దానము, తపస్సు, హోమము, జపము, నియమము (46), షోడశోపచారములు, మరియు మంత్రములతో ప్రతిమను ఆరాధించి, బ్రాహ్మణులకు భోజనము నీయవలెను. ఈ పూజను నిష్కామముగా, శాంతమనస్కుడై చేయవలెను (47). కార్తికే దేవయజనం సర్వభోగప్రదం భ##వేత్ | వ్యాధీనాం హరణం చైవ భ##వే ద్భూతగ్రహక్షయః || 48 కార్తికాదిత్య వారేషు నృణా మాదిత్య పూజనాత్ | తైల కార్పాసదానాత్తు భ##వేత్కుష్ఠాది సంక్షయః || 49 హరీతకీ మరీచీనాం వస్త్రక్షీరాది దానతః | బ్రహ్మ ప్రతిష్ఠయా చైవ క్షయారోగ క్షయో భ##వేత్ || 50 దీప సర్షపదానాచ్చ అపస్మారక్షయో భ##వేత్ | కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణామ్ || 51 మహాదారిద్ర్య శమనం సర్వ సంపత్కరం భ##వేత్ | కార్తీకమాసములో దేవతలను పూజించినచో, సర్వభోగములు లభించును. వ్యాధులు తగ్గును. భూతములు, గ్రహములు నశించును (48). కార్తీకమాసములో ఆదివారముల యందు ఆదిత్యుని పూజించి, తైలమును, నేత వస్త్రములను దానము చేసినచో, కుష్ఠు మొదలగు రోగములు తొలగిపోవును (49). హరీతకి (కరక్కాయ), మిరియములు, వస్త్రములు, పాలు మొదలగు వాటిని దానము చేసి బ్రాహ్మణులకు ప్రతిష్ఠను కల్పించినచో, క్షయరోగము నశించును (50). దీపమును, ఆవాలను దానము చేసినచో, అపస్మారము తొలగును. కృత్తికా నక్షత్ర యుక్త సోమవారము నాడు శివుని పూజించు మానవులకు (51), దారిద్య్రము పూర్తిగా తొలగి, సర్వసంపత్తులు లభించును. గృహ క్షేత్రాది దానాచ్చ గృహోపకరణాదినా || 52 కృత్తికా భౌమ వారేషు స్కందస్య యజనాన్నృణామ్ | దీపఘంటాది దానాద్వై వాక్సిద్ధి రచిరాద్భవేత్ || 53 కృత్తికా సౌమ్యవారేషు విష్ణోర్వై యజనం నృణామ్ | దధ్యో దనస్య దానం చ సత్సంతాన కరం భ##వేత్ || 54 కృత్తికా గురువారేషు బ్రహ్మణో యజనాద్ధనైః | మధు స్వర్ణాజ్య దానేన భోగవృద్ధిర్భవేన్నృణామ్ || 55 కృత్తికా శుక్రవారేషు గజకోమేడ యాజనాత్ | గంధ పుష్పాన్న దానేన భోగ్యవృద్ధిర్భవేన్నృణామ్ || 56 వంధ్యా సుపుత్రం లభ##తే స్వర్ణ రౌప్యాది దానతః | గృహము, గృహములో పనికి వచ్చు సామాను, క్షేత్రము, మొదలగు వాటిని దానము చేయుట వలన (52), కృత్తికా నక్షత్ర యుక్త మంగళవారము లందు కుమారస్వామిని పుజించి, దీపము, ఘంట మొదలగువాటిని దానము చేయుట వలన శీఘ్రముగా వాక్సిద్ధి లభించును (53). కృత్తికా నక్షత్రయుక్త బుధవారములందు విష్ణువును ఆరాధించి, పెరుగు అన్నమును దానము చేసిన మానవులకు మంచి సంతానము కలుగును (54). కృత్తికా నక్షత్ర యుక్త గురువారము లందు ధనములతో బ్రహ్మను పూజించి, తేనెను, బంగారమును, నేయిని దానము చేసిన మానవులకు భోగములు వృద్ధి జెందును (55). కృత్తికా నక్షత్ర యుక్త శుక్రవారముల యందు గణపతిని పూజించి, గంధమును, పుష్పములను, అన్నమును దానము చేయు మానవులకు భోగములు వృద్ధి జెందును (56). బంగారము, వెండి మొదలగు వాటిని దానము చేసినచో, వంధ్యా స్త్రీకి మంచి పుత్రుడు కలుగును. కృత్తికా శనివారేషు దిక్పాలానాం చ వందనమ్ || 57 దిగ్గజానాం చ నాగానాం సేతుపానాం చ పూజనమ్ | త్ర్యంబకస్య చ రుద్రస్య విష్ణోః పాపహరస్య చ || 58 జ్ఞానదం బ్రహ్మణశ్చైవ ధన్వంతర్యశ్వినోస్తథా | రోగాపమృత్యు హరణం తత్కాల వ్యాధి శాంతిదమ్ || 59 కృత్తికా నక్షత్ర శనివారముల యందు దిక్పాలకులకు నమస్కరించి (57), దిగ్గజములను, సర్పములను, సేతు పాలకులను పూజించవలెను. ముక్కంటి దైవమగు రుద్రుని, పాపములను హరించు విష్ణువును (58), పూజించినచో జ్ఞానము కలుగను. బ్రహ్మను, ధన్వంతరిని, అశ్వినీ దేవతలను పూజించినచో రోగములు, అపమృత్యువు తొలగిపోవును. వ్యాధి శీఘ్రముగా శాంతించును (59). లవణాయస తైలానాం మాషాదీనాం చ దానతః | త్రికటు ఫలగంధానాం జలాదీనాం చ దానతః || 60 ద్రవాణాం కఠినానాం చ ప్రస్థేన ఫలమానతః | స్వర్గప్రాప్తి ర్ధనుర్మాసే హ్యుషః కాలే చ పూజనమ్ || 61 శివాదీనాం చ సర్వేషాం క్రమాద్వై సర్వసిద్ధయే | శాల్యన్నస్య హవిష్యస్య నైవేద్యం శస్తముచ్యతే || 62 విధాన్నస్య నైవేద్యం ధనుర్మాసే విశిష్యతే | మార్గశీర్షేsన్నదసై#్యవ సర్వమిష్ట ఫలం భ##వేత్ || 63 ఉప్పు, ఇనుము, నూనె, మినుములు, మూడు కటు ఫలములు (శొంఠి, అల్లము, మిరప), గంధముల, జలము మొదలగు వాటిని దానము చేసినచో (60), స్వర్గము లభించును. ద్రవపదార్థములను శేరు, ఘన పదార్థములను పలము (మూడు తులములు ) తగ్గకుండా ఈయవలెను. ధనుర్మాసములో తెల్లవారు జామున (61), శివుడు మొదలగు దేవతల నందరిని క్రమముగు పూజించినచో, సర్వ సిద్ధులు కలుగును. నాణ్యమైన బియ్యముతో వండిన అన్నము, మరియు వెన్న నైవేద్యమునకు ప్రశస్తమని చెప్పబడినది (62). ధనుర్మాసములో అనేక రకముల అన్నములను నైవేద్యమిడుట ప్రశస్తము. మార్గశీర్ష మాసములో అన్నదానము చేయువానికి కోరిన ఫలము లన్నియు లభించును (63). పాపక్షయం చేష్టసిద్ధిం చారోగ్యం ధర్మమేవ చ | సమ్యగ్వేద పరిజ్ఞానం సదనుష్ఠానమేవ చ || 64 ఇహాముత్ర మహాభోగా నంతే యోగం చ శాశ్వతమ్ | వేదాంత జ్ఞాన సిద్ధిం చ మార్గశీర్షాన్నదో లభేత్ || 65 మార్గశీర్షే హ్యుషః కాలే దినత్రయ మథాపి వా | యజేద్దేవాన్ భోగకామో నాధనుర్మాసికో భ##వేత్ || 66 యావత్సంగవ కాలం తు ధనుర్మాసో విధీయతే | పాపములు నశించుట, కోర్కెలు ఈడేరుట, ఆరోగ్యము, ధర్మము, వేదములో చక్కని పరిజ్ఞానము, సత్కర్మానుష్ఠానము (64), ఇహ పరలోకములలో మహాభోగములు, శాశ్వతముగా ఈశ్వరునిలో ఐక్యమగుట, వేదాంత జ్ఞానము సిద్ధించుట అను ఫలములు మార్గశిర మాసములో అన్నదానమును చేసిన వ్యక్తికి లభించును (65). భోగముల నాశించు మానవుడు మార్గశిర మాసములో కనీసము మూడు దినములు తెల్లవారుజామున దేవతలను పూజించ వలెను. ధనుర్మాసములో ఏనాడు పూజచేయని వాడు కారాదు (66). తెల్లవారు జాము నుండి తెల్లవారు వరకు మాత్రమే ధనుర్మాసపూజ విధింపబడినది. ధనుర్మాసే నిరాహారో మాసమాత్రం జితేంద్రియః || 67 ఆ మధ్యాహ్నం జపేద్విప్రో గాయత్రీం వేదమాతరమ్ | పంచాక్షరాదకాన్ మంత్రాన్ పశ్చాదాసుప్తికం జపేత్ || 68 జ్ఞానం లబ్ధ్వా చ దేహాంతే విప్రో ముక్తి మవాప్నుయాత్ | అన్యేషాం నరనారీణాం త్రిః స్నానేన జపేన చ || 69 సదా పంచాక్షరసై#్యవ విశుద్ధం జ్ఞానమాప్యతే | ఇష్ట మంత్రాన్ సదా జప్త్వా మహా పాపక్షయం లభేత్ || 70 విప్రుడు ధనుర్మాసములో నెలదినములు మధ్యాహ్నము వరకు ఆహారమును తీసుకోకుండా, ఇంద్రియ జయము గలవాడై (67) వేదమాత యగు గాయత్రిని జపించవలెను. ఆ తరువాత రాత్రి నిద్రపోవు వరకు పంచాక్షరి మొదలగు మంత్రములను జపించవలెను (68). అట్టి విప్రుడు జ్ఞానమును పొంది, దేహత్యాగానంతరము మోక్షమును పొందును. ఇతర మానవులు, స్త్రీలు మూడు కాలముల యందు స్నానము చేసి (69), సర్వదా పంచాక్షరిని జపించినచో, విశుద్ధమగు జ్ఞానము లభించును. అన్నివేళలా ఇష్ట దేవతల మంత్రములను జపించు మానవునకు మహా పాపము లన్నియు తొలగిపోవును (70). ధనుర్మాసే విశేషేణ మహానైవేద్య మాచరేత్ | శాలితండుల భారేణ మరీచ ప్రస్థకేన చ || 71 గణనాద్ద్వాదశం సర్వం మధ్వజ్యకుడవేన హి | ద్రాణ యుక్తేన ముద్గేన ద్వాదశ వ్యంజనేన చ || 72 ఘృత పక్వైరపూపైశ్చ మోదకైశ్శాలికాది భిః | ద్వాదశైశ్చ దధిక్షీరై ర్ద్వాదశ ప్రస్థకేన చ || 73 నారికేల ఫలాదీనాం తథా గణనయా సహ | ద్వాదశ క్రముకైర్యుక్తం షట్త్రింశత్పత్రకైర్యుతమ్ || 74 కర్పూర ఖురచూర్ణేన పంచసౌగంధి కైర్యుతమ్ | తాంబూల యుక్తం తు యదా మహానైవేద్య లక్షణమ్ || 75 ధనుర్మాసములో విశేషముగా మహానైవేద్యమును చేయవలెను. నాణ్యమైన పుట్టెడు బియ్యమును వండవలెను. శేరు మిరియాలు (71), పన్నెండు, పావుల తేనె, నేయి, కుంచెడు పెసరపప్పు, పన్నెండు వ్యంజనములు (కూర, పచ్చడి ఇత్యాదులు) (72), నేతితో వేచిన అప్పములు, వరితో చేసిన మోదకములు, పన్నెండు శేర్ల పెరుగు, వక్కలు, ముప్పదియారు తమలపాకులు (74), కర్పూర సుగంధ చూర్ణము, ఐదు సుగంధ ద్రవ్యముల గల తాంబూలము ఇవన్నీ కలసి మహానైవేద్యము అగును (75). మహానైవేద్యమేతద్వై దేవతార్పణ పూర్వకమ్ | వర్ణానుక్రమ పూర్వేణ తద్భక్తే భ్యః ప్రదాపయేత్ || 76 ఏవం చౌదననైవేద్యా ద్భూమౌ రాష్ట్రపతిర్భవేత్ | మహా నైవేద్య దానేన నరస్స్వర్గ మవాప్నుయాత్ || 77 మహానైవేద్య దానేన సహస్రేణ ద్విజర్ష భాః | సత్యలోకే చ తల్లోకే పూర్ణమాయురవాప్నుయాత్ || 78 సహస్రాణాం చ త్రింశత్యా మహానైవేద్య దానతః | తదూర్ధ్వ లోకమాపై#్యవ న పునర్జన్మ భాగ్భవేత్ || 79 సహస్రాణాం చ షట్ త్రింశజ్జన్మ నైవేద్యమీరితమ్ | తావన్నైవేద్య దానం తు మహాపూర్ణం తదుచ్యతే || 80 జన్మనైవేద్య దానేన పునర్జన్మ న విద్యతే | ఊర్జే మాసి దినే పుణ్య జన్మ నైవేద్య మాచరేత్ || 81 ఈ మహా నైవేద్యమును ఈశ్వరునకర్పించి, అన్ని వర్ణములకు చెందిన భక్తులకు ఈయవలెను (76). ఇట్లు అన్నమును నైవేద్యమిడిన వ్యక్తి ఈ లోకములో సామ్రాజ్యాధిపతి యగును. మహా నైవేద్యమును దానము చేయు నరుడు స్వర్గమును పొందును (77). ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! వేయి మహా నైవేద్యములను దానము చేయు వ్యక్తి సత్యలోకములో పూర్ణాయుర్దాయమును పొందును (78). ముప్పదివేల మహానైవేద్యములను దానము చేయు వ్యక్తి అంతకంటె ఊర్ధ్వలోకమును పొందును. మరియు, అతనికి పునర్జన్మ ఉండదు (79). ముప్పది యారువేల మహానైవేద్యములకు జన్మనైవేద్యమని పేరు. అన్ని మహా నైవేద్యములకు మహా పూర్ణమనియు పేరు గలదు (80). జన్మ నైవేద్యమును దానము చేయు వ్యక్తికి పునర్జన్మ లేదు. కార్తీకమాసములో శుభదినమున జన్మనైవేద్యమును చేయవలెను. సంక్రాంతి పాత జన్మర్‌క్ష పౌర్ణమాస్యాది సంయుతే | అబ్ద జన్మదినే కుర్యా జ్జన్మనైవేద్య ముత్తమమ్ || 82 మాసాంతరేషు జన్మర్‌క్ష పూర్ణయోగ దినేs పి చ | మేలనే చ శ నేర్వాపి తావత్సాహస్రమాచరేత్ || 83 జన్మనైవేద్య దానేన జన్మార్పణ ఫలం లభేత్ | జన్మార్పణాచ్ఛివః ప్రీతః స్వసాయుజ్యం దదాతి హి || 84 ఇదం తు జన్మనైవేద్య శివసై#్యవ ప్రదాపయేత్ | యోనిలింగ స్వరూపేణ శివో జన్మనిరూపకః || 85 తస్మాజ్జన్మ నివృత్త్యర్థం జన్మపూజ శివస్య హి | సంక్రాంతి, జన్మ నక్షత్రము, పూర్ణిమ, జన్మించిన దినము ఇత్యాది సందర్భములలో ఉత్తమమగు జన్మనైవేద్యమును చేయవలెను (82). ఇతర మాసములలో జన్మ నక్షత్రము పూర్ణయోగములో నున్న దినమున గాని, శనితో కూడియున్న దినమున గాని చేయవలెను (83). జన్మ నైవేద్యము దానము చేసినచో, జన్మను అర్పించిన ఫలము లభించును. జన్మను అర్పించినచో శివుడు ప్రీతుడై తన సాయుజ్యము నిచ్చును (84). ఈ జన్మ నైవేద్యమును శివునికి మాత్రమే ఈయవలెను. స్త్రీ పురుష రూపముగ జన్మను ఇచ్చువాడు శివుడే (85), కావున మరల జన్మ కలుగకుండుట కొరకై శివునకు జన్మపూజను చేయవలెను. బిందునాదాత్మకం సర్వం జగత్ స్థావర జంగమమ్ || 86 బిందుశ్శక్తి శ్శివో నాదశ్శివ శక్త్యాత్యకం జగత్ | నాదాధార మిదం బిందు ర్బింద్వాధార మిదం జగత్ || 87 జగదాధార భూతౌ హి బిందు నాదౌ వ్యవస్థితౌ | బిందు నాదయుతం సర్వం సకలీకరణం భ##వేత్ || 88 సకలీకరణా జ్జన్మ జగత్ర్పాప్నోత్యసంశయః | బిందు నాదాత్మకం లింగం జగత్కారణ ముచ్యతే || 89 బిందుర్దేవీ శివో నాద శ్శివ లింగం తు కథ్యతే | తస్మా జ్జన్మ నివృత్త్యర్థం శివలింగం ప్రపూజయేత్ || 90 చరాచర జగత్తు సర్వము బిందునాదాత్మకము (86). బిందువు శక్తి. శివుడు నాదము. శివశక్తి స్వరూపమే జగత్తు. బిందువునకు నాదము ఆధారము. జగత్తునకు బిందువు ఆధారము (87). బిందునాదములు జగత్తునకు ఆధారములై యున్నవి. సర్వము బిందునాదములతో కూడియున్నది. బిందువు నాదములో కలియుట సకలీకరణము అనబడును (88). సకలీకరణము నుండియే జగత్తు పుట్టుననుటలో సందియము లేదు. లింగము బిందు నాదాత్మకము గాన జగత్తునకు కారణమని చెప్పబడుచున్నది (87). బిందువు దేవి. శివుడు నాదము. ఉభయాత్మకము శివలింగమని చెప్పబడును. కావున జన్మనివృత్తి కొరకు శివలింగమును పూజించవలెను (90). మాతా దేవీ బిందు రూపా నాదరూప శ్శివః పితా | పూజితాభ్యాం పితృభ్యాం తు పరమానంద ఏవ హి || 91 పరమానంద లాభార్థం శివలింగం ప్రపూజయేత్ | సా దేవీ జగతాం మాతా స శివో జగతః పితా || 92 పిత్రో శ్శుశ్రూషకే నిత్య కృపాధిక్యం హి వర్ధతే | కృపయాంతర్గతైశ్వర్యం పూజకస్య దదాతి హి || 93 తస్మాదంతర్గతానంద లాభార్థం మునిపుంగవాః | పితృ మాతృ స్వరూపేణ శివలింగం ప్రపూజయేత్ || 94 బిందురూప యగు దేవి తల్లి. నాదరూపుడగు శివుడు తండ్రి. తల్లిదండ్రులను పూజించినచో పరమానందము కలుగును (91). పరమానంద ప్రాప్తికై శివలింగమును శ్రద్ధతో పూజించవలెను. జగత్తులకు తల్లి ఆ దేవి. జగత్తునకు తండ్రి ఆ శివుడు (92). తల్లి దండ్రులను నిత్యము పూజించు వాని యందు వారికి అధికమగు దయ వర్ధిల్లును. అట్లు పూజించు వానికి శివుడు దయతో అంతరంగము ఐశ్వర్యమును ఇచ్చును (92). కావున, ఓ ముని శ్రేష్ఠులారా, అంతరంగము నందు ఆనందమును పొందుట కొరకై శివలింగమును తల్లితండ్రుల రూపముగా భావించి విశేషముగా పూజించవలెను (94). భర్గః పురుషరూపో హి భర్గా ప్రకృతిరుచ్యతే | అవ్యక్తాంతరధిష్ఠానం గర్భః పురుష ఉచ్యతే || 95 సువ్యక్తాంతరధిష్ఠానం గర్భః ప్రకృతి రుచ్యతే | పురుషస్త్వాది గర్భో హిగర్భవాన్ జనకో యతః || 96 పురుషాత్ర్పకృతౌ యుక్తం ప్రథమం జన్మ కథ్యతే | ప్రకృతే ర్వ్యక్తతా యాతం ద్వితీయం జన్మ కథ్యతే || 97 జన్మ జంతు ర్మృత్యు జన్మ పురుషాత్ర్పతిపద్యతే | భర్గుడు పురుషుడనియు, భర్గ ప్రకృతి అనియు చెప్పబడును. వ్యక్తము కాని అంతరధిష్ఠానము గల గర్భము పురుషుడనియు (95), బాగుగా వ్యక్తమయ్యే అంతరధిష్ఠానము గల గర్భము ప్రకృతి అనియు చెప్పబడును. మొదటి గర్భము పురుషుడే. జగత్తునకు పురుషుడు తండ్రి గనుక గర్భవాన్ అనబడును (96). పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మ అనియు, ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమగుట రెండవ జన్మ అనియు చెప్పుదురు (97). జీవుడు పురుషుని నుండి యే జన్మను, మృత్యువును, మరల జన్మను పొందును. అన్యతో భావ్యతేsవశ్యం మాయయా జన్మ కథ్యతే || 98 జీర్యతే జన్మకాలాద్యత్త స్మాజ్జీవ ఇతి స్మృతః | జన్మతే తన్యతే పాశైర్జీవ శబ్దార్థ ఏవ హి || 99 జన్మపాశ నివృత్త్యర్థం జన్మలింగం ప్రపూజయేత్ | భం వృద్ధిం గచ్ఛతీ త్యర్థాద్భగః ప్రకృతిరుచ్యతే || 100 ప్రాకృతై శ్శబ్ద మాత్రాద్యైః ప్రాకృతేంద్రియ భోజనాత్ | భగస్యేదం భోగమితి శబ్దార్ధో ముఖ్యతః శ్రుతః || 101 ముఖ్యో భగస్తు ప్రకృతిః భగవాన్ శివ ఉచ్యతే | భగవాన్ భోగదాతా హి నాన్యో భోగప్రదాయకః || 102 మాయచే మరియొక రూపములో ప్రకటమగుటయే జన్మ యని చెప్పబడును (98). పుట్టినప్పుటి నుండి జీర్ణమగు వాడు గావున జీవుడనబడును. జీవ శబ్దమునకు 'పుట్టి, పాశములచే బంధింపబడువాడు' అను అర్ధము కూడ గలదు (99). ఈ జన్మ పాశము తొలగుట కొరకై మాతా పితృరూపమగు శివలింగమును శ్రద్ధగా పూజించవలెను. భం గచ్ఛతీతి భగః భం=వృద్ధిని, గచ్ఛతి ఇతి=పొందునది గనుక 'భగ'ః అను పేరు ప్రకృతికి గలదు (100). ప్రకృతి జన్యములగు ఇంద్రియములు ప్రకృతి జన్మములగు శబ్దాదులను అనుభవించును. భగమునకు, అనగా ప్రకృతి కి సంబంధించినది అను అర్థములో భోగ శబ్దము అన్వర్థ ప్రయోగమును కలిగియున్నది (101). భగము ప్రకృతి, భగవానుడు శివుడు. భోగముల నిచ్చునది భగవానుడే గాని ఇతరులు కాదు (102). భగస్వామీ చ భగవాన్ బర్గ ఇత్యుచ్యతే బుధైః | భ##గేన సహిత లింగం భగం లింగేన సంయుతమ్ || 103 ఇహా ముత్ర చ భోగవార్థం నిత్యభోగార్ధమేవ చ | భగవంతం మహాదేవం శివలింగం ప్రపూజయేత్ || 104 లోక ప్రసవితా సూర్యస్తచ్చిహ్నం ప్రసవాద్భవేత్ | లింగే ప్రసూతి కర్తారం లింగినం పురుషం యజేత్ || 105 లింగార్థ గమకం చిహ్నం లింగ మిత్యభి ధీయతే | లింగమర్థం హి పురుషం శివం గమయతీత్యతః || 106 ప్రకృతికి ప్రభువగు భగవానుని ఋషులు భర్గుడు అని పిలుతురు. ప్రకృతి పురుషునితో, పురుషుడు ప్రకృతితో కలిసి యుండును (103). ఇహలోక పరలోకములలో భోగము కొరకు మానవుడు శివలింగరూపములో భగవానుడగు మహాదేవుని శ్రద్దగా పూజించవలెను (104). లోకములను ప్రకాశింపజేయు సూర్యుడు భగవానుని చిహ్నము. ప్రకృతి యందు జగత్తును సృష్టించే పురుషుని శివలింగరూపములో ఆరాధించవలెను (105). ఒక వస్తువును బోధించే చిహ్నమునకు లింగము అని పేరు. శివలింగము పురుషుడగు శివుని బోదించే చిహ్నము (106). శివక్త్యోశ్చ చిహ్నస్య మేలనం లిగంముచ్యతే | స్వచిహ్న పూజనా త్ర్పీతః చిహ్న కార్యం న వీయతే || 107 చిహ్న కార్యం తు జన్మాది జన్మద్యం వినివర్తతే | ప్రాకృతైః పురుషైశ్చాసి బాహ్యాభ్యంతర సంభ##వైః || 108 షోడశైరుపచారైశ్చ శివలింగం ప్రపూజయేత్ | ఏవ మాదిత్య వారే హి పూజా జన్మ నివర్తికా || 109 శివశక్తుల చిహ్నములు శివలింగము నందు మిళితమై యున్నవి. తన చిహ్నమును పూజించుటచే శివుడు ప్రీతుడగును. చిహ్న కార్యమగు జన్మ మృత్యువులు శివపూజకుని గ్రసించవు (107). పూజకునకు జన్మ మరణ రూప సంసారము తొలగును. ఇంటిలోపల, బయట లభించే ప్రాకృత, పురుష వస్తువులతో (108) శివలింగమునకు షోడశోపచార పూజ చేయవలెను. ఆదివారము నాడు అట్లు చేసిన వ్యక్తికి పునర్జన్మ ఉండదు (109). ఆదివారే మహాలింగం ప్రణవేనైవ పూజయేత్ | ఆదివారే పంచగవ్యై రభిషేకో విశిష్యతే || 110 గోమయం గోజలం క్షీరం దధ్యాజ్యం పంచగవ్యకమ్ | క్షీరాద్యం చ పృథక్ చైవ మధునా చేక్షుసారకైః || 111 గవ్యక్షీరాన్ననైవేద్యం ప్రణవేనైవ కారయేత్ | ప్రణవం ధ్వనిలింగం తు నాదలింగం స్వయంభువః || 112 బిందులింగం తు యంత్రస్య్సాన్మకారం తు ప్రతిష్ఠితమ్ | ఉకారం చరలింగం స్యాదకారం గురువిగ్రహమ్ || 113 షడ్ లింగపూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయః | ఆదివారము నాడు మహాలింగమును ఓంకారముతో మాత్రమే పూజించవలెను. ఆదివారమునాడు పంచగవ్యములతో అభిషేకము ప్రశస్తము (110). గోమయము, గోజలము, ఆవుపాలు, పెరుగు, నెయ్యి అనునవి పంచగవ్యము లనబడును. పాలు, పెరుగు, నేయిలతో వేర్వేరుగా అభిషేకించి, తేనె, చక్కెరలతో కలిపి కూడా అభిషేకమును చేయవలెను (111). ఆవుపాలతో చేసిన పాయసమును ఓంకారముతో మాత్రమే నివేదన చేయవలెను. ఓంకారమునుకు ధ్వనిలింగమనియు, స్వయంభులింగమునకు నాదలింగమనియు (112), యంత్రమునకు బిందులింగమనియు, ప్రతిష్ఠిత లింగమునకు మకార లింగమనియు, ఉత్సవములలో ఊరేగించు లింగమునకు ఉకార లింగమనియు, గురువు యొక్క శరీరమునకు ఆకార లింగమనియు పేరు (113). మానవుడు ఈ ఆరు లిగమములను నిత్యము పూజించినచో, జీవించి యుండగనే ముక్తుడగు ననుటలో సందేహము లేదు. శివస్య భక్త్యా పూజా హి జన్మ ముక్తికరీ నృణామ్ || 114 రుద్రాక్ష ధారణాత్పాద మర్ధం వైభూతి ధారణాత్ | త్రిపాదం మంత్ర జాప్యాచ్చ పూజయా పూర్ణ భక్తి మాన్ || 115 శివలింగం చ భక్తం చ పూజ్య మోక్షం లభేన్నరః | య ఇమం పఠతేsధ్యాయం శృణుయాద్వా సమాహితః || 116 తసై#్యవ శివభక్తిశ్చ వర్థతే సుదృఢా ద్విజాః || 117 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయాం షోడశోsధ్యాయః (16). శివుని భక్తితో పూజించు మానవులు జన్మ బంధము నుండి విముక్తిని పొందెదరు (114). మానవుడు రుద్రాక్ష ధారణ వలన భక్తిలో నాల్గవ అంశమును, విభూతిని ధరించుట వలన సగము భక్తిని, మంత్రమును జపించినచో మూడు పాదముల భక్తిని, పూజించినచో పూర్ణ భక్తిని కలవాడగును (115). మానవుడు శివలింగమును, శివభక్తుని పూజించినచో, మోక్షమును పొందును. ఓ ద్విజులారా! ఎవరైతే ఈ అధ్యాయమును పఠించెదరో, లేక మనస్సును లగ్నము చేసి వినెదరో (116), వారికి దృఢమగు శివభక్తి పెంపొందును (117). శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు పదునారవ అధ్యాయము ముగిసినది (16).