Sri Sivamahapuranamu-I
Chapters
అథ సప్త దశోsధ్యాయః ప్రణవ, పంచాక్షరీ మంత్రముల మహిమ - శివలోక వైభవము ఋషయ ఊచుః | ప్రణవస్య చ మహాత్మ్యం షడ్ లింగస్య మహామునే | శివభక్తస్య పూజాం చ క్రమ శో బ్రూహి నః ప్రభో ||
1 ఋషులిట్లు పలికిరి - ఓ మహర్షీ! ఓ ప్రభూ! ఓంకారము యొక్క మహిమను, ఆరు లింగముల మహిమను, మరియు శివభక్తుని పూజించు విధమును మాకు క్రమముగా చెప్పుము (1). సూత ఉవాచ | తపోధనైర్భవ ద్భిశ్చ సమ్యక్ ప్రశ్నస్త్వయం కృతః | అస్యోత్తరం మహాదేవో జానాతి స్మ న చాపరః ||
2 అథాపి వక్ష్యే తమహం శివస్య కృపయైవ హి | శివోsస్మాకం చ యుష్మాకం రక్షాం గృహ్ణాతు భూరిశః ||
3 ప్రో హి ప్రకృతి జాతస్య సంసారస్య మహోదధేః | నవం నావాంతరమితి ప్రణవం వై విదుర్బాధాః ||
4 ప్రః ప్రపంచో న నాస్తి వో యుష్మాకం ప్రణవం విదుః | ప్రకర్షేణ నయేద్యస్మా న్మోక్షం వః ప్రణవం విదుః ||
5 సూతుడిట్లు పలికెను - తపోధనులగు మీరు చక్కని ప్రశ్నను అడిగితిరి. దీనికి ఉత్రరమును మహాదేవుడు తక్క మరియొకడు చెప్పజాలడు (2). అయిననూ, నేను శివుని కృపతో ఉత్తరము నిచ్చెదను. శివుడు మమ్ములను, మిమ్ములను అధికముగా రక్షించు భారమును స్వీకరించుగాక! (3) ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రమునకు 'ప్రః' అని పేరు. దీనిని దాటించే నావ గనుక ఓంకారమునకు ప్రణవము (ప్ర + నవ) అని పేరు కలిగినదని పండితులు చెప్పెదరు (4). ప్రః = ప్రపంచము; న = లేదు; వః = మీకు, అను అర్థమును బట్టి కూడ ఓంకారమునకు ప్రణవమను పేరు కలిగినది. ప్ర = నిశ్చయముగా; న = (మోక్షమునకు ) నడిపించును; వః = మిమ్ములను, అను అర్థములో కూడ ఓంకారము ప్రణవమనబడును (5). స్వజాపకానాం యోగినాం స్వమంత్ర పూజకస్య చ | సర్వ కర్మక్షయం కృత్వా దివ్యజ్ఞానం తు నూతనమ్ || 6 తమేవ మాయారహితం నూతనం పరిచక్షతే | ప్రకర్షేణ మహాత్మానం నవం శుద్ధ స్వరూపకమ్ || 7 నూతనం వై కరోతీతి ప్రణవం తం విదుర్బధాః | ప్రణవం ద్వివిధం ప్రోక్తం సూక్ష్మస్థూల విభేదతః || 8 సూక్ష్మమేకాక్షరం విద్యాత్ స్థూలం పంచాక్షరం విదుః | సూక్ష్మమవ్యక్త పంచార్ణం సువ్యక్తార్ణం తథేతరత్ || 9 జీవన్ముక్తస్య సూక్ష్మం హి సర్వసారం హి తస్య హి | మంత్రేణార్థాను సంధానం స్వదేహ విలయా వధి || 10 ఓంకారమును జపించి, శివుని ఓంకారముతో పూజించు వారికి సర్వ కర్మలు నశించి, నూతనమగు దివ్యజ్ఞానము లభించును (6). మాయకు అతీతుడు, శుద్ధ చైతన్య రూపుడు నగు పరమాత్మ 'నూతనుడు' అనబడును (7). సాధకుని నూతనునిగా చేయునది గాన, ఓంకారమునకు ప్రణవమని పేరు వచ్చినదని పండితులు చెప్పుదురు. ప్రణవము సూక్ష్మము, స్థూలము అని ద్వివిధముగా నున్నది (8). ఓం అను ఏకాక్షరమునకు సూక్ష్మ ప్రణవమనియు, పంచాక్షరికి స్థూల ప్రణవమనియు పేరు. సూక్ష్మ ప్రణవములో అవ్యక్తముగ నున్న పంచవర్ణములు స్థూల ప్రణవములో బాగుగా వ్యక్తమగును (9). జీవన్ముక్తుడగు జ్ఞాని సర్వమంత్ర సారమగు సూక్ష్మ ప్రణవమును, ప్రణవ ప్రతిపాద్యమగు పరమాత్మను ధ్యానిస్తూ, దేహము పతనమగు వరకు జపించవలెను (10). స్వదేహే గలితే పూర్ణం శివం ప్రాప్నోతి నిశ్చయః | కేవలం మంత్ర జాపీతు యోగం ప్రాప్నోతి నిశ్చయః || 11 షట్ త్రింశత్కోటి జాపీ తు నిశ్చయం యోగమాప్నుయాత్ | సూక్ష్మం చ ద్వివిధం జ్ఞేయం హ్రస్వ దీర్ఘ విభేదతః || 12 అకారశ్చ ఉకారశ్చ మకారశ్చ తతః పరమ్ | బిందునాదయుతం తద్ధి శబ్దకాల కలాన్వితమ్ || 13 దీర్ఘ ప్రణవమేవం హి యోగినామేవ హృద్గతమ్ | మకారాంతం త్రితత్త్వం హి హ్రస్వ ప్రణవ ఉచ్యతే || 14 శివశ్శక్తి స్తయోరైక్యం మకారాంతం త్రికాత్మకమ్ | హ్రస్వమేవం హి జాప్యం స్యాత్ సర్వపాక్షయైషిణామ్ || 15 అట్టి జ్ఞాని దేహపాతానంతరము పూర్ణ స్వరూపుడగు శివుని పొందుట నిశ్చయము. అర్థాను సంధానము లేకుండగా కేవల మంత్రమును జపించు వ్యక్తి యోగమును పొందుట నిశ్చయము (11). ముప్పది ఆరు కోట్ల జపమును చేసిన వ్యక్తి నిశ్చయముగా యోగమును పొందును. సూక్ష్మ ప్రణవము మరల హ్రస్వము, దీర్ఘము అని రెండు విధములుగ నున్నది (12). అకారము, ఉకారము, మకారము, బిందువు, నాదము, శబ్దము, కాలము, కళ అను వాటితో కూడిన ప్రణవము (13) దీర్ఘ ప్రణవము. ఇది యోగుల హృదయము నందు మాత్రమే ఉండును. అకార, ఉకార, మకారములను మూడు వర్ణములతో మాత్రమే కూడిన ప్రణవము హ్రస్వ ప్రణవమనబడును (14). అకారము శివుడు. ఉకారము శక్తి. మకారము శివశక్తుల ఐక్యము. సర్వ పాపనాశమును గోరు సాధకులు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవమును జపించవలెను (15). భూవాయు కనకార్ణోద్యోః శబ్దాద్యాశ్చ తథా దశ | ఆశాన్వయే దశ పునః ప్రవృత్తా ఇతి కథ్యతే || 16 హ్రస్వమేవ ప్రవృత్తానాం నివృత్తానాం తు దీర్ఘకమ్ | వ్యాహృత్యా దౌ చ మంత్రాదౌ కామం శబ్దకలాయుతమ్ || 17 వేదాదౌ చ ప్రయోజ్యం స్యాద్వందనే సంధ్యయోరపి | నవకోటి జపాన్ జప్త్వా సంశుద్ధః పురుషో భ##వేత్ || 18 పునశ్చ నవ కోట్యా తు పృథివీ జయమాప్నుయాత్ | పునశ్చ నవకోట్యా తు హ్యపాం జయమవాప్నుయాత్ || 19 భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము అను పంచభూతములు, గంధ స్పర్శ రూప రస శబ్దములనే అయిదు విషయములు వెరసి ఈ పదింటి యందు ఆశతో ప్రవర్తించే పది రకముల మానవులు 'ప్రవృత్తులు' అనబడుదురు (16). ప్రవృత్తులు హ్రస్వ ప్రణవమును మాత్రమే జపించవలెను. నివృత్తులు (సన్న్యాసులు) దీర్ఘ ప్రవమును జపించవలెను. సాధకుడు వ్యాహృతలకు (భూః, భువః, సువః), మంత్రములకు ఆరంభములో తన ఇచ్ఛ ప్రకారముగా శబ్దముతో, కళతో కూడిన ప్రణవమును ఉచ్చరించవచ్చును (17). వేదపఠనమునకు ఆది యందు, ప్రాతస్సాయం సంధ్యా వందనములలో ఓంకారమును ఉచ్చరించవలెను. తొమ్మిది కోట్ల ఓంకార జపమును చేసిన పురుషుడు పూర్ణముగా శుద్ధుడగును (18). మరల తొమ్మిది కోట్లు జపించినచో పృథివీతత్త్వమును, ఇంకో తొమ్మిది కోట్లు జపించినచో జలతత్త్వమును జయించును (19). పునశ్చ నవకోట్యా తు తేజసాం జయమాప్నుయాత్ | పునశ్చ నవకోట్యా తు వాయోర్జయ మవాప్నుయాత్ || 20 ఆకాశ జయ మాప్నోతి నవకోటి జపేనవై | గంధాదీనాం క్రమేణౖవ నవకోటి జపేన వై || 21 అహంకారస్య చ పునర్నవకోటి జపేన వై | సహస్ర మంత్ర జప్తేన నిత్యం శుద్ధో భ##వేత్పుమాన్ || 22 తతః పరం స్వసిద్ధ్యర్థం జపో భవతి హి ద్విజాః | ఏవ మష్టోత్తర శతకోటి జప్తేన వై పునః || 23 ప్రణవేన ప్రబుద్ధస్తు శుద్ధయోగ మవాప్నుయాత్ | ఇంకో తొమ్మిది కోట్ల జపము చేసినచో అగ్ని తత్త్వమును, ఇంకో తొమ్మిది కోట్ల జపము చేసినచో వాయుతత్త్వమును జయించును (20). ఇంకో తొమ్మిది కోట్లు జపించినచో ఆకాశతత్త్వమును జయించును. ఇటులనే క్రమముగా తొమ్మిది కోట్ల చొప్పున జపించు వ్యక్తి గంధాదులను జయించును (21). ఇంకో తొమ్మిది కోట్లు జపించినచో అహంకార తత్త్వమును జయించును. ప్రతి దినము వేయిసార్లు మంత్రమును జపించిన మానవుడు శుద్ధుడగును (22). ఓ ద్విజులారా! ఆ తరువాత మానవుడు ఆత్మ సాక్షాత్కారము కొరకు జపమును కొనసాగించవలెను. ఈ విధముగా నూట ఎనిమిది కోట్ల ప్రణవమును జపించిన వ్యక్తి (23) జ్ఞానియై శుద్ధ యోగమును పొందును. శుద్ధయోగేన సంయుక్తో జీవన్ముక్తో న సంశయః || 24 సదా జపన్ సదా ధ్యాయన్ శివం ప్రణవరూపిణమ్ | సమాధి స్థో మహాయోగీ శివ ఏవ న సంశయః || 25 ఋషిచ్ఛందో దేవతాది న్యస్య దేహే పునర్జపేత్ | ప్రణవం మాతృకాయుక్తం దేహే న్యస్య ఋషిర్భవేత్ || 26 దశమాతృషడధ్వాది సర్వం న్యాసఫలం లభేత్ | ప్రవృత్తానాం చ మిశ్రాణాం స్థూల ప్రణవమిష్యతే || 27 శుద్ధ యోగమును పొందిన జ్ఞాని జీవన్ముక్తుడనుటలో సందేహము లేదు (24). ప్రణవ స్వరూపుడగు శివుని సదా ధ్యానిస్తూ, ప్రణవమును సదా జపిస్తూ, సమాధి యందుండు మహా యోగి శివుడే యనుటలో సందియము లేదు (25). మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి, అంగన్యాస కరన్యాసములను చేసి జపమును చేయవలెను. అకారాది హకారము వరకు గల వర్ణములతో కూడిన ప్రణవమును తన దేహము నందు న్యాసము చేసిన వ్యక్తి ఋషి యగును (26). పది రకముల మంత్ర సంస్కారములు, మాతృకా న్యాసము, షడద్వ (హోమవిధి) మొదలగు వాటితో కూడిన పూర్ణన్యాస ఫలము నాతడు పొందును. ప్రవృత్తులకు, ప్రవృత్తి నివృత్త్యు భయ విశిష్టమగు జీవనము గడుపు వారికి స్థూల ప్రణవము అభీష్టముల నిచ్చును (27). క్రియాతపోజపైః యుక్తా స్త్రి విధా శ్శివయోగినః | ధనాది విభ##వైశ్చైవ కరాద్యంగైర్నమాది భిః || 28 క్రియయా పూజయా యుక్తః క్రియా యోగీతి కథ్యతే | పూజా యుక్తశ్చ మితభుక్ బాహ్యేంద్రియ జయాన్వితః || 29 పరద్రోహాది రహితస్తపో యోగీతి కథ్యతే | ఏతైర్యుక్త స్సదాsక్రుద్ధ స్సర్వ కామాది వర్జితః || 30 సదా జపపరాశ్శాంతో జపయోగీతి తం విదుః | ఉపచారైః షోడశభిః పూజయా శివయోగినామ్ || 31 సాలోక్యాది క్రమేణౖవ శుద్ధో ముక్తిం లభేన్నరః | క్రియా యోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు మూడు విధములుగా నున్నారు. సంపదను వినియోగించి పూజను చేయుచూ సాష్టాంగ నమస్కారాది (28) క్రియా తత్పరుడగు భక్తుడు క్రియా యోగి యనబడును. పూజచేయుచూ, మితముగా భుజించువాడై, బాహ్యేంద్రియములను జయించి (29), ఇతరులకు ద్రోహమును చేయుట మొదలగు వాటిని విడనాడి యుండు భక్తుడు తపోయోగి యనబడును. ఈ గుణములను కలిగి యుండి, ఏనాడు కోపము నెరుంగక, కామనల నన్నిటినీ విడనాడి (30), శాంత మనస్కుడై సర్వకాలముల యందు జపమును చేయు భక్తుడు జపయోగి యనబడును. శివయోగులను షోడశోపచారముతో పూజించు (31) మానవుడు శుద్ధుడై, సాలోక్యాది ముక్తిని పొందును. జపయోగ మథో వక్ష్యే గదతః శృణుత ద్విజాః || 32 తపః కర్తుర్జపః ప్రోక్తో యజ్జన్మ పరిమార్జతే | శివనామ నమః పూర్వం చతుర్థ్యాం పంచతత్త్వకమ్ || 33 స్థూల ప్రణవరూపం హి శివపంచాక్షరం ద్విజాః | పంచాక్షర జపేనైవ సర్వ సిద్ధిం లభేన్నరః || 34 ప్రణవేనాది సంయుక్తం సదా పంచాక్షరం జపేత్ | గురూపదేశం సంగమ్య సుఖవాసే సుభూతలే || 35 పూర్వ పక్షే సమారభ్య కృష్ణ భూతావధి ద్విజాః | మాఘం భాద్రం విశిష్టం తు సర్వకాలోత్తమోత్తమమ్ || 36 ఓ ద్విజులారా! నేనిపుడు జపయోగమును చెప్పెదను వినుడు (32). తపస్సును చేయువాని కొరకు జపము విధింపబడినది. జపము జన్మబంధమును తుడిపెట్టును. ముందుగా 'నమ'ః ఉచ్చరించి, తరువాత చతుర్ధీ విభక్తిలో శివనామమును చేర్చగా, 'నమశ్శివాయ' అను పంచాక్షరి యగును (33). ఓ ద్విజులారా! శివపంచాక్షరి స్థూల ప్రణవము. పంచాక్షరిని జపించు మానవుడు సర్వసిద్ధులను పొందును (34). సదా ఓంకారముతో కూడిన పంచాక్షరిని జపించవలెను. గురూపదేశమును పొంది, చక్కని నేలపై సుఖాసనముపై కూర్చుండి జపించవలెను (35). ఓ ద్విజులారా ! శుక్ల పక్షములో ఆరంభించి, కృష్ణపశ్రము పూర్తియగు వరకు జపించవలెను. మాఖ, భాద్రపదములు జపమునకు ఉత్తమోత్తమగు మాసములు (36). ఏకవారం మితాశీ తు వాగ్యతో నియతేంద్రియః | స్వస్య రాజపితౄణాం చ శుశ్రూషణం చ నిత్య శః || 37 సహస్ర జపమాత్రేణ భ##వేచ్ఛుద్ధోsన్యథా ఋణీ | పంచాక్షరం పంచలక్షం జపేచ్ఛివ మనుస్మరన్ || 38 పద్మాసనస్థం శివదం గంగా చంద్ర కలాన్వితమ్ | వామోరు స్థితశక్త్యా చ విరాజంతం మహాగణౖః || 39 మృగటంక ధరం దేవం వరాద భయపాణికమ్ | సదానుగ్రహ కర్తారం సదాశివ మనుస్మరన్ || 40 సంపూజ్య మనసా పూర్వం హృది వా సూర్యమండలే | జపేత్పంచాక్షరీం విద్యాం ప్రాజ్ముఖ శ్శుద్ధ కర్మకృత్ || 41 సాధకుడు ఒక పూజ భుజించవలెను. మితముగా భుజించవలెను. మితముగా మాటలాడవలెను. ఇంద్రియములను జయించవలెను. దేశప్రభువునకు, తల్లి దండ్రులకు నిత్యము సేవ చేయవలెను (37). ఇట్లు నియమముతో వేయి జపమును చేసిన సాధకుడు శుద్ధుడగును. జపమును చేయనివాడు ఋణి యగును. శివుని స్మరిస్తూ పంచాక్షరిని ఐదు లక్షల జపము చేయవలెను (38). పద్మాసనమునందున్నట్టియు, మంగళముల నిచ్చునట్టియు, గంగతో చంద్రకళతో కూడి ఉన్నట్టియు, ఎడమతొడపై నున్న శక్తితో మరియు గొప్ప ప్రమథ గణములతో విరాజిల్లుచున్నట్టియు, (39) మృగమును, త్రిశూలమును ధరించినట్టియు, ప్రకాశస్వరూపుడైనట్టియు, చేతుల యందు వరద, అభయ ముద్రలను కలిగి ఉన్నట్టియు, భక్తులను సదా అనుగ్రహించు సదాశివుని ధ్యానించవలెను (40). పవిత్రాచరణము గల సాధకుడు ముందుగా హృదయము నందు గాని, సూర్య మండలము నందు గాని శివుని భావన చేసి మానసిక పూజను చేసి తూర్పు ముఖముగా కూర్చుండి పంచాక్షరీ మంత్రమును జపించవలెను (41). ప్రాతః కృష్ణ చతుర్దశ్యాం నిత్య కర్మ సమాప్య చ | మనోరమే శుచౌ దేశే నియత శ్శుద్ధ మానసః || 42 పంచాక్షరస్య మంత్రస్య సహస్రం ద్వాదశం జపేత్ | వరయేచ్చ సపత్నీకాన్ శైవాన్ వై బ్రాహ్మణోత్తమాన్ || 43 ఏకం గురువరం శిష్టం వరయేత్సాంబమూర్తికమ్ | ఈశానం చాథ పురుష మఘోరం వామమేవ చ || 44 సద్యోజాతం చ పంచైవ శివభక్తాన్ ద్విజోత్తమాన్ | పూజా ద్రవ్యాణి సంపాద్య శివపూజం సమారభేత్ || 45 కృష్ణపక్ష చతుర్దశి నాడు (జపము సమాప్తమైన రోజు) ఉదయమే నిత్యకర్మను పూర్తిచేసుకుని, అందముగా శుభ్రముగా నున్న స్థలములో కూర్చుండి, శుద్ధమైన ఏకాగ్రమైన మనస్సు గలవాడై (42) సాధకుడు పంచాక్షరీ మంత్రమును పన్నెండు వేలు జపించవలెను. భార్యలతో కూడియున్న శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను వరణ చేయవలెను. శివభక్తులగు బ్రాహ్మణోత్తముల యందు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత (44) రూపములను భావన చేయవలెను. పూజాద్రవ్యములను సంపాదించి శివపూజ నారంభించవలెను (45). శివపూజాం చ విధివత్ కృత్వా హోమం సమారభేత్ | ముఖాంతం చ స్వసూత్రేణ కృత్వా హోమం సమారభేత్ || 46 దశైకం వా శ##తైకం వా సహసై#్రకమథాపి వా | కాపిలేన ఘృతే నైవ జుహుయాత్స్వయమేవ హి || 47 కారయేచ్ఛివ భ##క్తైర్వాష్యష్టోత్తరశతం బుధః| హోమాంతే దక్షిణా దేయా గురోర్గోమిథునం తథా || 48 ఈశానాది స్వరూపాం స్తాన్ గురుం సాంబం విభావ్య చ | తేషాం పత్సిక్తతో యేన స్వశిరః స్నాన మాచరేత్ || 49 యథావిధిగా శివపూజను చేసి హోమము నారంభిచవలెను. అగ్నిస్థాపనము వరకు స్వీయ గృహ్య సూత్రానుసారముగా చేసి, హోమమును మొదలిడవలెను (46). సాధకుడు కపిలగోవు యొక్క నేతితో పదకొండు, లేక నూట ఒకటి , లేక వేయి ఒకటి ఆహుతులను తానే ఈయవలెను (47). లేదా, శివభక్తులచే నూట ఎనిమిది ఆహుతులను ఇప్పించవలెను. హోమము అయిన తరువాత గురువునకు రెండు గోవులను దక్షిణనీయవలెను (48). గురువు నందు సాంబుని, ఇతర బ్రాహ్మణుల యందు ఈశానాదులను భావన చేసి, వారి పాదజలమును తన శిరస్సుపై చల్లుకొనవలెను (49). షట్ త్రింశత్కోటి తీర్థేషు సద్యస్స్నానఫలం లభేత్ | దశాంగమన్నం తేషాం వై దద్యా ద్వై భక్తిపూర్వకమ్ || 50 పరాబుద్ధ్యా గురోః పత్నీ మీశానాది క్రమేణ తు | పరమాన్నేన సంపూజ్య యథా విభవ విస్తరమ్ || 51 రుద్రాక్ష వస్త్రపూర్వం చ వటకాపూప కైర్యుతమ్ | బలిదానం తతః కృత్వా భూరి భోజన మాచరేత్ || 52 తతస్సంప్రార్థ్య దేవేశం జపం తావత్సమాపయేత్ | పునశ్చరణమేవం చ కృత్వా మంత్రీ భ##వేన్నరః || 53 అట్లు చేసిన సాధకుడు ముప్పది యారు కోట్ల తీర్థములలో స్నానము చేసిన ఫలమును వెంటనే పొందును. తరువాత వారికి పది అంగములతో కూడి భోజనమును భక్తిపూర్వకముగా సమర్పించవలెను (50). గురుపత్ని యందు పరాశక్తిని, బ్రాహ్మణుల యందు ఈశానాది ఐదురూపములను భావన చేసి, వారిని వైభవమునకు అనురూపముగా పరమాన్నముతో పూజించి (51), రుద్రాక్షలను, వస్త్రములను ఈయవలెను. తరువాత వడలతో, అప్పములతో కూడిన అన్నమును కాకాది ప్రాణులకు సమర్పించి, తరువాత సాధకుడు సుష్ఠుగా భుజించవలెను (52). తరువాత శివుని ప్రార్థించి జపమును ముగించవలెను. ఈ విధముగా మంత్ర పురశ్చరణను చేసిన వ్యక్తి మంత్రసిద్ధని పొందును (53). పునశ్చ పంచలక్షేణ సర్వపాపక్షయో భ##వేత్ | అతలాది సమారభ్య సత్యలోకావధి క్రమాత్ || 54 పంచలక్ష జపాత్తత్తల్లోకైశ్వర్య మవాప్నుయాత్ | మధ్యే మృతశ్చేద్భోగాంతే భూమౌ త జ్ఞాపకో భ##వేత్ || 55 పునశ్చ పంచలక్షేణ బ్రహ్మ సామీప్యమాప్నుయాత్ | పునశ్చ పంచలక్షేణ సారూపై#్యశ్వర్య మాప్నుయాత్ || 56 ఆహత్య శతలక్షేణ సాక్షాద్బ్రహ్మ సమో భ##వేత్ | కార్య బ్రహ్మణ ఏవం హి సాయుజ్యం ప్రతిపద్యవై || 57 యథేష్టం భోగమాప్నోతి తద్బ్రహ్మ ప్రలయావధి | అతడు మరల ఐదు లక్షలు జపించినచో పాపము లన్నియూ నశించును. అయిదేసి లక్షల చొప్పున జపించిన వ్యక్తి క్రమముగా అతలము మొదలగు సత్యలోకము వరకు గల (54) ఆయా లోకముల ఐశ్వర్యమును పొందును. మధ్యలో మరణించినచో, పరలోకములో భోగముల ననుభవించి, భూమి యందు జన్మించి పంచాక్షరిని జపించును (55). మరల పంచలక్షలు జపించి బ్రహ్మలోకమును పొందును. ఇంకో అయిదు లక్షలు జపించినచో, సారూప్య ఐశ్వర్యమును పొందును (56). వెరసి కోటి జపము చేసిన వాడు బ్రహ్మతో సమానమైన వాడగును. అతడు కార్యబ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) యొక్క సాయుజ్యమును పొంది (57), ఆ బ్రహ్మ ప్రలయమును పొందువరకు కోరిన భోగములను అనుభవించును. పునః కల్పాంతరే వృత్తే బ్రహ్మపుత్రస్స జాయతే || 58 పునశ్చ తపసా దీప్తః క్రమాన్మక్తో భవిష్యతి | పృథ్వ్యాది కార్యభూతేభ్యో లోకావై నిర్మితాః క్రమాత్ || 59 పాతాలాది చ సత్యాంతం బ్రహ్మలోకాశ్చతుర్దశ | సత్యాదూర్ధ్వం క్షమాంతం వై విష్ణులోకాశ్చతుర్దశ || 60 క్షమాలోకే కార్యవిష్ణుర్వైకుంఠే వరపత్తనే | కార్య లక్ష్మా మహాభోగి రక్షాం కృత్వాsధితిష్ఠతి || 61 తదూర్ధ్వగాశ్చ శుచ్యంతా లోకాష్టావింశతిః స్ధితాః | మరియొక కల్పము ఆరంభము కాగానే ఆతడు బ్రహ్మపుత్రుడై జన్మించును (58). ఆతడు మరల తపస్సు చే ప్రకాశించి, క్రమముగా ముక్తుడగును. పృథివి మొదలగు కార్యభూతముల నుండి క్రమముగా (59) పాతాలము మొదలు సత్యలోకము వరకు గల పదునాల్గు బ్రహ్మలోకములు నిర్మింపబడినవి. సత్యలోకము పైన క్షమాలోకములో శ్రేష్ఠపట్టణమగు వైకుంఠము నందు కార్య విష్ణువు కార్య లక్ష్మితో గూడి ఆదిశేషునిపై శయనించి రక్షించుచుండును (61). దానిపైన శుచిలోకము వరకు ఇరవై ఎనిమిది లోకములు గలవు. శుచౌ లోకే తుకైలాసే రుద్రో వై భూతహృత్ స్థితః || 62 షడుత్తరాశ్చ పంచాశదహింసాంతాస్తదూర్ధ్వగాః | అహింసాలో కమాస్థాయ జ్ఞానకైలాసకే పురే || 63 కార్యేశ్వరస్తిరో భావం సర్వాన్ కృత్వాది తిష్ఠితి | తదంతే కాలచక్రం హి కాలాతీతస్తతః పరమ్ || 64 శివేనాధిష్ఠితస్తత్ర కాలశ్చక్రేశ్వరాహ్వయః | మాహిషం ధర్మమాస్థాయ సర్వాన్ కాలేన యుజంతి || 65 శుచిలోకములోని కైలాసములో ప్రాణులను సంహిరించే రుద్రుడు ఉండును (62). దానిపైన అహింసాలోకము వరకు ఏబదియారు లోకములు గలవు. అహింసాలోకములోని జ్ఞాన కైలాసపురమును (63), సర్వప్రాణులను తిరోధానము చేయు కార్యేశ్వరుడు అధిష్ఠించి యుండును. అహింసా లోకమునకు అంతములో కాలచక్రము గలదు. దానిపైన కాలాతీత లోకము గలదు (64). దానిని శివుడు అధిష్ఠించి యుండును. అచట చక్రేశ్వరుడను కాలుడు మహిష వాహనారూఢుడై, ధర్మబద్ధముగా సర్వులను కాలమునుకు అధీనులను చేయును (65). తావన్మహేశ్వరః ప్రోక్తస్తిరోధాస్తావదేవ హి | తదర్వాక్ కర్మభోగో హి తదూర్ధ్వం జ్ఞానభోగకమ్ || 66 తదర్వాక్ కర్మ మాయా హి జ్ఞానమాయా తదూర్ధ్వకమ్ | మా లక్ష్మీః కర్మభోగోవై యాతి మాయేతి కథ్యతే || 67 మా లక్ష్మీర్ జ్ఞాన భోగోవై యాతి కథ్యతే | తదూర్ధ్వం నిత్యభోగో హి తదర్వాజ్ నశ్వరం విదుః || 68 తదర్వాక్ చ తిరోధానం తదూర్ధ్వం న తిరోధనమ్ | తదర్వాక్ పాశబంధో హి తదూర్ధ్వం నహి బంధనమ్ || 69 మహేశ్వరుడు ఇంతవరకు మాత్రమే తిరోధానమును చేయును. దీని క్రింద కర్మజన్య భోగము, దీనిపైన జ్ఞాన జన్య ఆనందము గలవు (66). దీని క్రింద కర్మ మాయ, దీనిపైన జ్ఞాన మాయ గలవు. 'మా' అనగా కర్మభోగ రూపలక్ష్మి కర్మభోగమును కర్మిపొందును అను యుర్థములో మాయూ అనబడును (67). 'మా' అనగా జ్ఞానానందరూపమగు లక్ష్మి జ్ఞానానందమును జ్ఞాని పొందును అను అర్ధములో మాయా అనబడును. అహింసాలోకమునకు పైన శాశ్వతానందము, దాని క్రింద నశించే భోగములు ఉండును (68). దాని క్రింద ఉండే తిరోధానము దానిపైన ఉండదు. దాని క్రింద సంసారబంధము గలదు. దానిపైన బంధము లేదు (69). తదర్వాక్ పరివర్తంతే కామ్యకర్మాను సారిణః | నిష్కామ కర్మభోగస్తు తదూర్ధ్వం పరికీర్తితః || 70 తదర్వాక్ పరివర్తంతే బిందు పూజా పరాయణాః | తదూర్ధ్వం హి వ్రజంత్యేవ నిష్కామా లింగపూజకాః || 71 తదర్వాక్ పరివర్తంతే శివాన్య సురపూజకాః | శివైక నిరతా యే చ తదూర్ధ్వం సంప్రయాంతి తే || 72 తదర్వాగ్జీవ కోటి స్స్యాత్తదూర్ధ్వం పరకోటికాః | సాంసారికా స్తదర్వాక్చ ముక్తాః ఖలు తదూర్ధ్వగాః || 73 తదర్వాక్పరి వర్తంతే ప్రాకృత ద్రవ్యపూజకాః | తదూర్ధ్వం హి వ్రజంత్యేతే పౌరుష ద్రవ్య పూజకాః || 74 కామ్య కర్మలను చేయువారు దానికి క్రింది లోకములో తిరుగాడుచుందురు. నిష్కామ కర్మానుష్ఠానపరులు దానిపై లోకములలో ఆనందము ననుభవింతురు (70). బిందు పూజయందు నిష్ఠ గలవారు దాని క్రింద తిరుగాడుదురు. నిష్కామముగా లింగపూజ చేయువారు దానిపై లోకములను నిశ్చయముగా పొందెదరు (71). శివుని కంటె భిన్నమైన దేవతలను పూజించువారు దాని క్రింద లోకములలో తిరుగాడుదురు. శివుని యందు మాత్రమే నిష్ఠ గలవారు దానిపై లోకములను పొందెదరు (72). దాని క్రింద జీవకోటి, దానిపైన ఈశ్వరకోటి ఉండును. సంసారబద్ధులు దాని క్రింద, ముక్తులు దానిపైన ఉందురు (73). ప్రాకృత ద్రవ్యములతో పూజించువారు దాని క్రింద తిరుగాడుదురు. పురుష ద్రవ్యములతో పూజించువారు దానిపై లోకములను పొందెదరు (74). తదర్వాక్ శక్తి లింగం తు శివలింగం తదూర్ధ్వకమ్ | తదర్వాగావృతం లింగం తదూర్ధ్వం హి నిరావృతి || 75 తదర్వాక్ కల్పితం లింగం తదూర్ధ్వం వై నకల్పితమ్ | తదర్వాక్ బాహ్య లిగం స్యాదంతరంగం తదూర్ధ్వకమ్ || 76 తదర్వాక్ఛక్తి లోకా హి శతం వై ద్వాదశాధికమ్ | తదర్వాగ్బిందురూపం హి నాద రూపం తదుత్తరమ్ || 77 తదర్వాక్కర్మలోకస్తు తదూర్ధ్వం జ్ఞానలోకకః | నమస్కారస్తదూర్ధ్వం హి మదాహంకారనాశనః || 78 జనిజం తిరోధానం న నానిషిద్ధ్యాతతే ఇతి | జ్ఞాన శబ్దార్థ ఏవం హి తిరో ధాన నివారణాత్ || 79 దానికి క్రింద శక్తి లింగము, దానిపైన శివలింగము, దాని క్రింద ఆవృత్త (సుడులు తిరిగిన ) లింగము, దానిపైన ఆవృత్తిలేని లింగము (75) , దాని క్రింద కల్పిత (లింగాకార వస్తువు నందు) లింగము, దానిపైన కల్పితము కాని (స్వయంభు) లింగము, దాని క్రింద బాహ్య లింగము, దానిపైన ఆంతర (భావనారూపమై) లింగము ఉండును (76). దాని క్రింద నూట పన్నెండు శక్తిలోకములుగ గలవు. దాని క్రింద బిందురూపము, దానిపైన నాదరూపము (77), దాని క్రింద కర్మఫల రూపమగు లోకములు, దానిపైన జ్ఞాన గమ్యమగు లోకము గలవు. గర్వమును, అహంకారమును నశింపజేయు నమస్కారము దానిపై లోకములను పొందించును (78). జన్మ నుండి పుట్టిన తిరోధానము దాని యందు లేదు. తిరోధానమును నిషేధించనిదే అహింసా లోకమునకు పై స్థానమును పొంద శక్యము కాదు. జ్ఞాన శబ్దమునకు తిరోధానమును తొలగించునది అని యర్ధము (79). తదర్వాక్ పరివర్తంతే హ్యాధి భౌతిక పూజకాః | ఆధ్యాత్మికార్చకా ఏవ తదూర్ధ్వం సంప్రయాంతి వై || 80 తావద్వైవేది భాగం తన్మహాలోకాత్మ లింగకే | ప్రకృత్యాద్యష్ట బంధోపి వేద్యంతే సంప్రతిష్ఠితః || 81 అసత్యశ్చా శుచిశ్చైవ హింసా చైవాథ నిర్ఘృణా | అసత్యాది చతుష్పాదః సర్వాంశః కామరూపధృక్ || 82 నాస్తిక్య చక్షుర్దుస్సంగో వేద బాహ్య ధ్వని స్సదా | క్రోధశృంగః కృష్ణ వర్ణో మహామహిష వేషవాన్ || 83 అధర్మ మహిషారూఢం కాలచక్రం తరంతితే | సత్యాది ధర్మయుక్తా యే శివపూజా పరాశ్చ యే || 84 బాహ్యమగు అర్చన చేయువారు అహింసాలోకమునకు క్రింద తిరుగాడుచుందురు. కాని హృదయము నందు శివుని అర్చించువారు దాని కంటె ఊర్ధ్వలోకములను పొందెదరు (80). మహాలోకములతో కూడిన బ్రహ్మాండము లింగాకారమున నున్నది. కార్య జగత్తులోని లోకములు ఆ లింగము యొక్క వేది (పానపట్టము) వరకు వ్యాపించియున్నవి. అంతవరకు బద్ధజీవులు ఉందురు (81). అసత్యము, అశుచి, హింస, నిర్దయ అను నాల్గు పాదములు కల్గినట్టియు, కోరిన రూపమును ధరించునట్టియు (82), నాస్తికతయే నేత్రములుగా కల్గినట్టియు, దుష్ట సంగముతో సర్వాదా వేదవిరుద్దముగా శబ్దించునట్టియు, క్రోధమే శృంగములుగా కలిగినట్టియు, నల్లని రంగు గల విశాలమైన (83) అధర్మ మహిషమును అధిష్ఠించి యున్న కాలచక్రమును, సత్యము మొదలగు ధర్మములను పాటిస్తూ శివుని పూజించుటలో తత్పరులగు భక్తులు మాత్రమే తరించెదరు (84). తదూర్ధ్వం వృషభో ధర్మో బ్రహ్మచర్య స్వరూపధృక్ | సత్యాది పాదయుక్తస్తు శివలోకాగ్రతః స్థితః || 85 క్షమా శృంగః శమః శ్రోత్రో వేద ధ్వని విభూషితః | ఆస్తిక్య చక్షు ర్నిశ్శ్వాస గురు బుధ్ది మనా వృషః || 86 క్రియాది వృషభా జ్ఞేయాః కారణాదిషు సర్వదా | తం క్రియావృషభం ధర్మం కాలాతీతోsధి తిష్ఠతి || 87 బ్రహ్మ విష్ణు మహేశానాం స్వస్వాయుర్దినముచ్యతే | తదూర్ధ్వం న దినం రాత్రి ర్న జన్మ మరణాదికమ్ || 88 కాలచక్రమునకు పైన ధర్మవృషభము కలదు. బ్రహ్మచర్యమే దాని స్వరూపము. సత్య, శౌచ, అహింసా, దయలు అను నాల్గు పాదములు గల ఆ ధర్మ వృషభము శివలోకమునకు ఎదుట నిలబడి యుండును (85). దానికి క్షమయే కొమ్ము. శమము (ఇంద్రియనిగ్రము) శ్రోత్రము. అది వేదధ్వనితో ప్రకాశించుచన్నది. ఆస్తిక్యమే దాని నేత్రము. గొప్ప బుద్ధియే దాని నిశ్శ్వాసము (86). క్రియా రూపమగు వృషభములు సదా కారణముల యందు ప్రతిష్ఠితములై యుండును. ఆ క్రియా రూపమగు ధర్మవృషభమును కాలాతీతుడగు శివుడు అధిష్ఠించును (87). బ్రహ్మ విష్ణు మహేశ్వరుల (కార్య) ఆయుర్దాయములకు దినమని పేరు. ఆ కాల చక్రముపైన దినము, రాత్రి, జన్మ, మరణము మొదలైనవి లేవు (88). పునః కారణ సత్యాంతాః కారణ బ్రహ్మణస్తథా | గంధాది భ్యస్తు భూతేభ్యస్తదూర్ధ్వం నిర్మితాస్సదా || 89 సూక్ష్మ గంధ స్వరూపా హి స్థితా లోకాశ్చతుర్దశ | పునః కారణ విష్ణోర్వై స్థితా లోకాశ్చతుర్దశ || 90 పునః కారణ రుద్రస్య లోకాష్టా వింశకా మతాః | పునశ్చ కారణశస్య షట్పంచాశత్త దూర్ధ్వగాః || 91 తతః పరం బ్రహ్మచర్య లోకాఖ్యం శివసంమతత్ | తత్రైవ జ్ఞానకైలాసే పంచావరణ సంయుతే || 92 పంచమండల సంయుక్తం పంచ బ్రహ్మ కలాన్వితమ్ | ఆదిశక్తి సమాయుక్త మాది లింగం తు తత్ర వై || 93 మరల కారణ సత్యలోకము వరకు కారణ బ్రహ్మ యొక్క లోకములు గలవు. ఇవి గంధాది భూత తన్మాత్రల నుండి నిర్మింపబడి కాలచక్రమునకు పైన గలవు (89). వీటి సంఖ్య పదునాలుగు. మరియు, కారణ విష్ణువు యొక్క లోకములు పదునాలుగు (90), కారణ రుద్రుని లోకములు ఇరవై ఎనిమిది, వాటికి పైన కారణ ఈశానుని లోకములు ఏభై ఆరు గలవు (91). ఆ పైన శివునకు ప్రియమైన బ్రహ్మచర్యలోకము గలదు. అచటనే అయిదు ప్రాకారములతో కూడిన జ్ఞానకైలాసము నందు (92), అయిదు మండలములతో, అయిదు బ్రహ్మకళలతో, ఆదిశక్తితో కూడియున్న ఆదిలింగము గలదు (93). శివాలయం మిదం ప్రోక్తం శివస్య పరమాత్మనః | పరశక్త్యా సమాయుక్తస్తత్రైవ పరమేశ్వరః || 94 సృష్టిః స్థితిశ్చ సంహారస్తిరో భావోऽప్యనుగ్రహః | పంచకృత్య ప్రవీణోऽసౌ సచ్చిదానంద విగ్రహః || 95 ధ్యానం ధర్మ స్సదా యస్య సదానుగ్రహతత్పరః | సమాధ్యాసన మాసీనః స్వాత్మారామో విరాజతే || 96 తస్య సందర్శనం సాధ్యం కర్మధ్యానాది భిః క్రమాత్ | నిత్యాది కర్మయజ నాచ్ఛివకర్మ మతిర్భవేత్ || 97 క్రియాది శివకర్మభ్యః శివాజ్ఞానం ప్రసాదయేత్ | తద్దర్శన గతాస్సర్వే ముక్తా ఏవ న సంశయః || 98 పరమాత్మ యగు శివుడు విరాజిల్లే శివాలయము ఇదియే. పరమేశ్వరుడు పరాశక్తితో గూడి ఇచటనే యుండును (94). సచ్చిదానందరూపుడగు శివుడు సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములనే ఐదు జగత్కార్యములను నిర్వహించుటలో సమర్థుడు (95). సర్వకాలములలో భక్తులను అనుగ్రహించుట యందు తత్పరుడైన ఆ శివుని నిత్య ధర్మము ధ్యానము. ఆయన సమాధి యోగ్యమగు ఆసనము నందు ఉపవిష్టుడై ఆత్మారాముడై ప్రకాశించును (96). నిత్య కర్మానుష్ఠానము, ధ్యానము మొదలగు వాటి అభ్యాసము వలన క్రమముగా అట్టి శివుని దర్శించుట సంభవమే. కావున, మానవుడ శివారాధనా తత్పరుడు కావలెను (97). పూజ మొదలగు శివసంబంధి కర్మల ననుష్ఠించి, మానవుడ శివజ్ఞానమును సాధించవలెను. శివుని కృపాదృష్టికి పాత్రులైన వారందరు మోక్షమును పొందెదరనుటలో సందియము లేదు (98). ముక్తి రాత్మ స్వరూపేణ స్వాత్మారామత్మమేవ హి | క్రియాతపో జప జ్ఞాన ధ్యాన ధర్మేషు సుస్థితః || 99 శిస్య దర్శనం లబ్ధ్వా స్వాత్మారా మత్వమేవ హి | యథా రవిస్స్వ కిరణా దశుద్ధి మపనేష్యతి || 100 కృపా విచక్షణ శ్శంభురజ్ఞాన మననేష్యతి | అజ్ఞాన వినివృత్తౌ తు శివజ్ఞానం ప్రవర్తతే || 101 శివజ్ఞానాత్స్వ స్వరూప మాత్మా రామత్వమేష్యతి | ఆత్మారామత్వ సంసిద్ధౌ కృతకృత్యో భ##వేన్నరః || 102 ముక్తి యనగా ఆత్మరూపుడై, ఆత్మారాముడై ఉండుటయే. కర్మలు, తపస్సు, జపము, స్వాధ్యాయము, ధ్యానము అను ధర్మములను శ్రద్ధగా ఆచరించు సాధకుడు (99). శివుని దర్శనమును, ఆత్మారామత్వమును పొందును. సూర్యుడు తన కిరణములచే అశుచిని తొలగించు తీరున (100), శివుడు తన దయా దృష్టితో అజ్ఞానమును తొలగించును. అజ్ఞానము తొలగగానే శివజ్ఞానము ప్రవర్తిల్లును (101). సాధకుడు శివజ్ఞానము వలన స్వస్వరూపమును, ఆత్మారామత్వమును పొందును. ఆత్మ యందు రమించు జ్ఞాని కృతార్థుడగును (102). పునశ్చ శతలక్షేణ బ్రహ్మణః పదమాప్నుయాత్ | పునశ్చ శతలక్షేణ విష్ణోః పదమవాప్నుయాత్ || 103 పునశ్చ శతలక్షేణ రుద్రస్య పదమాప్నుయాత్ | పునశ్చ శతలక్షేణ ఐశ్వరం పదమాప్నుయాత్ || 104 పునశ్చైవం విధేనైవ జపేన సుసమాహితః | శివలోకాది భూతం హి కాలచక్రమావాప్నుయాత్ || 105 పంచాక్షరిని కోటి జపము చేసిన మానవుడు బ్రహ్మలోకమును, మరియొక కోటి చేసినచో విష్ణులోకమును (103), మరియొక కోటి చేసినచో రుద్రలోకమును, ఇంకొక కోటి చేసినచో ఈశ్వరలోకమును పొందును (104). ఇదే విధముగా ఏకాగ్రమగు మనస్సుతో ఇంకనూ జపము చేసిన మానవుడు శివలోకమునకు ఆది యందుండు కాలచక్రమును పొందును (105). కాలచక్రం పంచ చక్రమేకైకేన క్రమోత్తరే | సృష్టిమోహౌ బ్రహ్మచక్రం భోగమో హౌ తువైష్ణవమ్ || 106 కోపమోహౌ రౌద్రచక్రం భ్రమణం చైశ్వరం విదుః | శివచక్రం జ్ఞానమోహౌ పంచచక్రం విదుర్బుధాః || 107 పునశ్చ దశకోట్యో హి కారణ బ్రహ్మణః పదమ్ | పునశ్చ దశకోట్యాహి తత్పదైశ్వర్య మాప్నుయాత్ || 108 ఏవం క్రమేణ విష్ణ్వాదేః పదం లబ్ధ్వా మహౌజసః | క్రమేణ తత్పదైశ్వర్యం లబ్ధ్వా చైవ మహాత్మనః || 109 శతకోటి మనుం జప్త్వా పంచోత్తరమతం ద్రితః | శివలోక మవాప్నోతి పంచమావరణాద్బహిః || 110 కాలచక్రము నందు ఒకదానిపైన మరియొకటి చొప్పున అయిదు చక్రములు గలవు. సృష్టి మోహములు బ్రహ్మచక్రము, భోగమోహములు విష్ణు చక్రము (106), కోప మోహములు రుద్రచక్రము, సంసారములో తిరుగాడుట ఈశ్వర చక్రము, జ్ఞానమోహములు శివచక్రము వెరసి అయిదు చక్రములని పండితులు చెప్పెదరు (107). పంచాక్షరిని పదికోట్లు జపించినచో కారణశ్వర లోకమును పొందును (108). భక్తుడు ఇదే తీరున క్రమముగా మహా విష్ణుస్థానమును, మహేశానుని స్థానమును పొందును (109). పంచాక్షరీ మంత్రమును శ్రద్ధతో నూట అయిదు కోట్లు జపము చేసిన భక్తుడు శివలోకములోని అయిదవ ప్రాకారమునకు బయట నుండు స్ధానమును పొందును (110). రాజతం మండపం తత్ర నందీ సంస్థానముత్తమమ్ | తపో రూపశ్చ వృషభస్తత్రైవ పరిదృశ్యతే || 111 సద్యోజాతస్య తత్‌స్థానం పంచమావరణం పరమ్ | వామదేవస్య చ స్థానం చతుర్ధావరణం పునః || 112 అఘోరనిలయం పశ్చాత్ తృతీయావరణం పరమ్ | పురుషసై#్యవ సాంబస్య ద్వితీయావరణం శుభమ్ || 113 ఈశానస్య పరసై#్యవ ప్థమావరణం తతః | ధ్యాన ధర్మస్య చ స్థానం పంచమం మండపం తతః || 114 బలినాథస్య సంస్థానం తత్ర పూర్ణామృతప్రదమ్ | చతుర్థం మండపం పశ్చా చ్చంద్రశేఖర మూర్తి మత్ || 115 అచట శ్రేష్ఠమైన వెండి మండపము గలదు. అదియే నందీశ్వరుని స్ధానము. తపోరూపమగు వృషభము అచటనే యుండును (111). ఆ శ్రేష్ఠమగు ఐదవ ప్రాకారము సద్యోజాతుని స్థానము. నాల్గవ ప్రాకారము వామదేవుని స్థానము (112). దాని తరువాత నుండే మూడవ ప్రాకారము సాంబునిది (113). తరువాత నుండే మొదటి ప్రాకారము ఈశానదేవునిది. అచట నుండు అయిదవ మండపము ధ్యానధర్ముని స్థానము (114). పూర్ణమగు ఆనందము నిచ్చు నాల్గవ మండపము బలినాథునిది. దాని యందు చంద్రశేఖరుని మూర్తి గలదు (115). సోమస్కందస్య చ స్థానం తృతీయం మండపం పరమ్ | ద్వితీయం మండపం నృత్యం మండపం ప్రాహురాస్తికాః || 116 ప్రథమం మూలమాయాయాః స్థానం తత్రైవ శోభనమ్ | తతః పరం గర్భగృహం లింగస్థానం పరం శుభమ్ || 117 నంది సంస్థానతః పశ్చాన్న విదుశ్శివ వైభవమ్ | నందీశ్వరో బహిస్తిష్ఠ న్పంచాక్షరముపాసతే || 118 ఏవం గురుక్రమాల్లబ్దం నందీశాచ్చ మయా పునః | తతః పరం స్వ సంవేద్యం శివేనైవాను భావితమ్ || 119 శివస్య కృపయా సాక్షా చ్ఛివలోకస్య వైభవమ్ | విజ్ఞాతుం శక్యతే సర్వైర్నాన్యథేత్యాహురాస్తికాః || 120 మూడవ శ్రేష్ఠ మండపము సోమస్కందుని స్ధానము. రెండవ మండపము నృత్యమండపమని ఆస్తికులు చెప్పుదురు (116). అచటనే ఉన్న అందమైన మొదటి మండపము మూల మాయ యొక్క స్థానము. దాని తరువాత మంగళ కరమగు గర్భగృహము గలదు. దాని యందు శివలింగము గలదు (117). నందీశ్వరుని స్థానము తరువాత ఉండే శివుని వైభవము ఎవ్వైరికైననూ తెలియదు. నందీశ్వరుడు బయట కూర్చుండి పంచాక్షరిని ఉపాసన చేయును (118). ఈ జ్ఞానము నందీశ్వరుని నుండి మా గురువునకు, ఆయన నుండి నాకు సంక్రమించినది. ఈ వైభవము శివునకు మాత్రమే తెలియును. అది శివునిచే మాత్రమే అనుభవింపబడును (119). శివుని దయ ఉన్నచో శివలోకము యొక్క వైభవము ఎవరికైననూ తెలియుట సంభవమగునని ఆస్తికులు చెప్పెదరు (120). ఏవం క్రమేణ ముక్తా స్స్యుర్బ్రాహ్మణా వై జితేంద్రియాః | అన్యేషాం చ క్రమం వక్ష్యే గదతః శృణుతాదరాత్ || 121 గురూపదేశాజ్ఞాప్యం వై బ్రహ్మణీనాం నమోంsతకమ్ | పంచాక్షరం పంచలక్ష మాయుష్యం ప్రజపేద్విధిః || 122 స్త్రీ త్వాప నయనార్థం తు పంచలక్షం జపేత్పునః | మంత్రేణ పురుషో భూత్వా క్రమాన్ముక్తో భ##వేద్బుధః || 123 క్షత్రియః పంచలక్షేణ క్షత్రత్వ మపనేష్యతి | పునశ్చ పంచలక్షేణ క్షత్రియో బ్రాహ్మణో భ##వేత్ || 124 జితేంద్రియులగు బ్రాహ్మణులు ఈ తీరున క్రమముగా మోక్షమును పొందెదరు. ఇతరులు మోక్షమును పొందు క్రమమును కూడ చెప్పెదను. శ్రద్ధతో వినుడు (121). బ్రాహ్మణ స్త్రీలు గురూపదేశమును పొంది, 'నమః'తో అంతమగు విధముగా పంచాక్షరిని జపించవలెను అని విధి. అయిదు లక్షలు పంచాక్షరిని జపించిన యొడల ఆయుష్షు లభించును (122). మరల ఇంకో అయిదు లక్షలు జపించినచో, మరుజన్మలో స్త్రీత్వము తొలగి పురుషుడై, వివేకియై, క్రమముగా ముక్తిని పొందును (123). క్షత్రియుడు అయిదు లక్షలు జపించినచో, క్షత్రియత్వమును విడనాడి, మరల ఐదు లక్షలు జపించినచో బ్రాహ్మణుడగును (124). మంత్ర సిద్ధి ర్జపాచ్చైవ క్రమాన్ముక్తో భ##వేన్నరః | వైశ్యస్తు పంచలక్షేణ వైశ్యత్వ మపనే ష్యతి || 125 పునశ్చ పంచలక్షేణ మంత్ర క్షత్రియ ఉచ్యతే | పునశ్చ పంచలక్షేణ క్షత్త్రత్వమపనేష్యతి || 126 పునశ్చ పంచలక్షేణ మంత్ర బ్రహాణ ఉచ్యతే | శూద్రశ్చైవ నమోంతేన పంచవిశంతి లక్షతః || 127 మంత్ర విప్రత్వ మాపద్య పశ్చాచ్ఛూద్రో భ##వేద్ద్విజః | నారీ వాథ నరో వాథ బ్రహ్మణో వాsన్య ఏవ వా || 128 నమోంతం వా నమః పూర్వమాతరు స్సర్వదా జపేత్ | మానవుడు జపమును చేయుట వలన మంత్రసిద్ధిని పొంది క్రమముగా ముక్తుడగును. వైశ్యుడు అయిదు లక్షల జపము చేసినచో, వైశ్యత్వము తొలగును (125). మరల అయిదు లక్షలు జపించినచో మంత్ర క్షత్రియుడనబడును. మరల ఇంకొక అయిదు లక్షలు జపించినచో క్షత్రియత్వము తొలగును (126). మరల అయిదు లక్షలు జపించినచో మంత్ర బ్రాహ్మణుడనబడును. శూద్రుడు కూడ ఇరవై అయిదు లక్షల పంచాక్షరిని 'నమ'ః అంతమగునట్లు జపించినచో (127), మంత్ర బ్రాహ్మణత్వమును పొంది, తరువాత బ్రాహ్మణుడగును. స్త్రీ గాని పురుషుడు గాని బ్రాహ్మణుడు గాని, ఇతరుడు గాని (128), 'నమః'అంతము నందు గాని, ముందు గాని ఉండునట్లు పంచాక్షరిని శ్రద్ధతో సర్వకాలముల యందు జపించవలెను.. సాధకః పంచలక్షాంతే శివప్రీత్యర్థమేవ హి || 129 మహాభిషేకం నైవేద్యం కృత్వా భక్తాంశ్చ పూజయేత్ | పూజయా శివభక్తస్య శివః ప్రీతతరో భ##వేత్ || 130 శివస్య శివభక్తస్య భేధో నాస్తి శివో హి సః | శివస్వరూప మంత్రస్య ధారణాచ్ఛివ ఏవ హి || 131 శివభక్త శరీరే హి శివే తత్పరమో భ##వేత్ | శివభక్తాః క్రియాస్సర్వా వేద సర్వక్రియాం విదుః || 132 యావద్యావ చ్ఛివం మంత్రం యేన జప్తం భ##వేత్ క్రమాత్ | తావద్వై శివసాన్నిధ్యం తస్మిన్ దేహే న సంశయః || 133 సాధకుడు శివుని ప్రీతి కొరకు మాత్రమే అయిదు లక్షల జపమును పూర్తి చేసి (129), మహాభిషేకమును, నైవేద్యమును చేసి, భక్తులను పూజించవలెను. శివభక్తుని పూజించినచో, శివుడు మిక్కిలి సంతసించును (130). శివునకు, శివభక్తునకు తేడా లేదు. శివభక్తుడు శివుని స్వరూపమగు మంత్రమును జపించుట వలన శివుడే యగును (131). శివభక్తుని శరీరములో శివుడు ఉండును. కాన, శివభక్తుని శ్రద్ధతో ఆరాధించవలెను. శివభక్తులకు లౌకిక, వైదిక క్రియలన్నియూ జ్ఞాతములే (132). భక్తుడు ఎంత అధికముగా శివమంత్రమును జపించునో, అంత అధికముగా అతని దేహములో శివుని సన్నిది ఉండుననుటలో సందియము లేదు (133). దేవీలింగం భ##వేద్రూపం శివభక్తి స్త్రియస్తథా | యావన్మంత్రం జపే ద్దేవ్యాస్తావత్సాన్నిధ్యమస్తి హి || 134 శివం సంపూజయేద్దీమాన్స్వయం వై శివరూపభాక్ | స్వయం చైవ శివో భూత్వా పరాం శక్తిం ప్రపూజయేత్ || 135 శక్తిం బేరం చ లింగం చ హ్యాలేఖ్యా మాయయా యజేత్ | శివలింగం శివం మత్వా స్వాత్మానం శక్తిరూపకమ్ || 136 శివలింగం నాదరూపం బిందురూపం తు శక్తికమ్ | ఉపప్రధాన భావేన అన్యోన్యసక్త లింగకమ్ || 137 పూజయేచ్చ శివం శక్తిం స శివో మూలభావనాత్ | శివభక్తురాలగు స్త్రీ దేవీ స్వరూప యగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రమును జపించునో, ఆమె యందు దేవీసాన్నిధ్యము అంత అధికముగా నుండును (134). బుద్ధిమంతుడు స్వయముగా శివరూపుడై శివుని పూజించవలెను. భక్తుడు తనను తాను శివునిగా భావన చేసి పరాశక్తిని పూజించవలెను (135). దేవిని, శివుని మూర్తిని, లింగమును, మరియు శివుని చిత్రపటమును నిష్కపట భావనతో ఆరాధించవలెను. భక్తుడు తనను శక్తిరూపముగా భావన చేసి, శివలింగము నందు శివుని పూజించవలెను (136). శివలింగము నాదరూపము. శక్తి బిందురూపము. శివశక్తులు రెండు, పరస్పరము ప్రధాన, గుణ (అప్రధాన) భావముతో కలసి యుందురు (137). ఇట్లు శివుని, శక్తిని పుజించు భక్తుడు, మూలమును భావన చేయుట వలన, శివస్వరూపుడగును. శివభక్తాన్ శివమంత్ర రూపకాన్ శివరూపకాన్ || 138 షోడశైరుపచారైశ్చ పూజయే దిష్టమాప్నుయాత్ | యేన శుశ్రూషణాద్యైశ్చ శివభక్తస్య లింగినః || 139 ఆనందం జనయే ద్విద్వాన్ శివః ప్రీతతరో భ##వేత్ | శివభక్తాన్ సపత్నీకాన్ పత్న్యా సహ సమాదరాత్ || 140 పూజయే ద్భోజనాద్యైశ్చ పంచ వా దశ వా శతరమ్ | ధనే దేహే చ మంత్రే చ భావనాయా మవంచకః || 141 శివశక్తి స్వరూపేణ న పునర్జాయతే భువి| శివమంత్ర భావనచే శివస్వరూపులైన శివభక్తులను (138), షోడశోపచారములతో పూజించు భక్తుడు అభీష్టమును పొందును. విద్వాంసుడు శివస్వరూపుడగు శివభక్తునకు శుశ్రూష చేసి (139), ఆనందమును కలిగించవలెను. అట్లు చేయుట వలన శివుడు మిక్కిలి సంతసించును. భక్తుడు భార్యతో గూడి భార్యాసమేతులగు శివభక్తులను ఆదమరముతో (140), అయిదుగురిని, గాని, పదిమందిని గాని, లేక వందమందిని గాని భోజనాదులతో పూజించవలెను. ధనములో గాని, కాయకష్టములో గాని, మంత్రములో గాని, భావన యందు గాని లోటు రానీయకూడదు (141). అట్టి భక్తుడు శివశక్తి స్వరూపుడై భూలోకము నందు మరల జన్మించడు. నాభేరధో బ్రహ్మ భాగమాకంఠం విష్ణుభాగకమ్ || 142 ముఖం లింగమితి ప్రోక్తం శివభక్త శరీరకమ్ | మృతాన్ దాహాది యుక్తాన్వా దాహాది రహితాన్మృతాన్ || 143 ఉద్దిశ్య పూజయే దాది పితరం శివమేవ హి | పూజాం కృత్వాది మాతుశ్చ శివభక్తాంశ్చ పూజయేత్ || 144 పితృలోకం సమాసాద్య క్రమాన్ముక్తో భ##వేన్మృతః | శివభక్తుని శరీరములో పాదము నుండి నాభి వరకు బ్రహ్మభాగమనియు, నాభి నుండి కంఠము వకరు విష్ణుభాగమనియు (142), ముఖము లింగమనియు చెప్పబడినది. మరణించిన వాని దేహమును దహించినా, లేక ఖననాదులను చేసినా (143), అది పిత యగు శివుని, ఆది మాత యగు శక్తిని, శివభక్తులను పూజించవలెను (144). అపుడు మరణించిన జీవుడు పితృలోకమును పొంది, క్రమముగా మోక్షమును పొందును. క్రియాయుక్త దశభ్యశ్చ తపోయుక్తో విశిష్యతే || 145 తపోయుక్త శ##తేభ్యశ్చ జపయుక్తో విశిష్యతే | జపయుక్త సహస్రే భ్యః శివజ్ఞానీ విశిష్యతే || 146 శివజ్ఞానిషు లక్షేషు ధ్యానయుక్తో విశిష్యతే | ధ్యానయుక్తేషు కోటిభ్యః సమాధిస్థో విశిష్యతే || 147 ఉత్తరోత్తర వైశిష్ట్యా త్పూజాయా ముత్తరోత్తరమ్ | ఫలం వైశిష్ట్యరూపం చ దుర్విజ్ఞేయం మనీషిభిః || 148 తస్మాద్వై శివభక్తస్య మహిమానం వేత్తి కో నరః | మంచి కర్మలను చేయు పదిమంది కంటె తపస్సు చేయు వాడు మేలు (145). వందమంది తపోనిష్ఠుల కంటె జపము చేయువాడు మేలు; వేయి మంది జపము చేయువారి కంటె శివజ్ఞానము గలవాడు మేలు (146). లక్షమంది శివజ్ఞానుల కంటె ధ్యానము చేయువాడు మేలు. కోటి మంది ధ్యానము చేయువారి కంటె సమాధి యందుండు వాడు మేలు (147). వీరిలో క్రమముగా ఉత్తరోత్తరముగా మహిమ పెరుగును. వారిని పూజించుట వలన కలుగు మహాఫలము విద్వాంసుల బుద్ధికి కూడ అందదు (148). శివభక్తుని మహిమను తెలియగలవారెవ్వరు? శివశక్త్యోః పూజనం చ శివభక్తస్య పూజనమ్ || 149 కురుతే యో నరో భక్త్యా స శివ శ్శివ మేధతే | య ఇమం పఠేతేsధ్యాయ మర్థవద్వేద సంమతమ్ || 150 శివజ్ఞానీ భ##వే ద్విప్రః శివేన సహ మోదతే | శ్రావయేచ్ఛివ భక్తాంశ్చ విశేషజ్ఞో మునీశ్వరాః || 151 శివప్రసాద సిద్ధి స్స్యాచ్ఛివస్య కృపయా బుధాః || 152 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయాం సప్తదశోsధ్యాయః (17). శివ శక్తులను, మరియు శివ భక్తుని పూజించు (149) మానవుడు శివస్వరూపుడై మంగళములను గాంచును. వేదత్యులమై గంభీరార్థమును కలిగియున్న ఈ ఆధ్యాయమును పఠించు (150) బ్రాహ్మణుడు శివజ్ఞానియై, శివునితో కూడి ఆనందించును. మునిశ్రేష్ఠులారా! ఈ అధ్యాయములోని విశేషములను యెరింగిన వ్యక్తి శివభక్తులకు వినిపింపవలెను (151). ఓ విద్వాంసులారా! అట్టివానికి శివుని దయ కలిగి, శివుని అనుగ్రహము సిద్ధించును (152). శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు పదిహేడవ అధ్యాయము ముగిసినది (17).