Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్వావింశోsధ్యాయః

శివనైవేద్యము

ఋషయ ఊచుః |

అగ్రాహ్యం శివనైవేద్యమితి పూర్వం శ్రుతం వచః | బ్రూహి తన్నిర్ణయం బిల్వమహాత్మ్యమపి సన్మునే|| 1

ఋషులిట్లు పలికిరి -

శివనైవేద్యమును స్వీకరించరాదని పూర్వము వినయుంటిమి. దాని నిర్ణయమును చెప్పుము. ఓగొప్ప మహర్షీ! బిల్వమహిమను కూడ చెప్పుము (1).

సూత ఉవాచ |

శృణుధ్వం మునయస్సర్వే సావధానతయాధునా | సర్వం వదామి సంప్రీత్యా ధన్యా యూయం శివవ్రతాః || 2

శివ భక్త శ్శుచి శ్శుద్ధ స్సద్ర్వతీ దృఢనిశ్చయః | భక్షయేచ్ఛివనైవేద్యం త్యజేద గ్రాహ్య భావనామ్‌ || 3

దృష్ట్వాపి శివనైవేద్యం యాంతి పాపాని దురతః | భుక్తే తు శివనైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః || 4

అలం యాగసహస్రేణాప్యలం యాగార్బుదైరపి | భక్షితే శివనైవేద్యే శివసాయుజ్యమాప్నుయాత్‌ || 5

సూతుడిట్లు పలికెను -

ఓ మునులారా! మీరందరు ఇపుడు సావధానముగా వినుడు. సర్వమును ప్రేమతో చెప్పెదను. శివవ్రతులగు మీరు ధన్యులు (2). బాహ్యమందు, అంతరమందు శుచి గలవాడు, దృఢనిశ్చయము, ధృఢవ్రతము గలవాడు నగు శివభక్తుడు 'తీసుకోరాదేమో' అను భావనను వీడి శివనైవేద్యమును భక్షించవలెను (3). శివ నైవేద్యమును చూచినంతనే పాపములు దూరముగా తొలగును. శివ నైవేద్యమును భక్షించినచో కోటి పుణ్యములు లభించును (4). వేలాది, లక్షలాది యాగములను చేయబనిలేదు. శివనైవేద్యమును భక్షించిన వ్యక్తి శివసాయుజ్యమును పొందును (5).

యద్గృహే శివనైవేద్య ప్రచారోsపి ప్రజాయతే | తద్గృహం పావనం సర్వ మన్యపావన కారణమ్‌ || 6

ఆగతం శివనైవేద్యం గృహీత్వా శిరసా ముదా | భక్షణీయం ప్రయత్నేన శివస్మరణ పూర్వకమ్‌ || 7

ఆగతం శివనైవేద్యమన్యదా గ్రాహ్యమిత్యపి | విలంబే పాపసంబంధో భవత్యేవ హి మానవే || 8

న యస్య శివనైవేద్య గ్రహణచ్ఛా ప్రజాయతే | స పాపిష్ఠో గరిష్ఠ స్స్యాన్నరకం యాత్యపి ధ్రువమ్‌ || 9

ఏ గృహములో శివనైవేద్యమును భక్షించి, ఇతరులకు ఇచ్చెదరో, ఆ ఇల్లు పవిత్రమగును. ఇంటిలోని వారిని, ఇంటికి వచ్చిన వారిని పవిత్రముచేయును (16).భక్తుడు తనకు లభించిన శివనైవేద్యమును ఆనందముతో వినయముగా స్వీకరించి, శివుని స్మరిస్తూ శ్రద్ధగా భక్షించవలెను (17). శివనైవేద్యము లభించినప్పుడు, మరియొకప్పుడు తీసుకొనవచ్చుననే భావనతో ఆలస్యము చేసిన మానవుడు తప్పక పాపమును పొందును (8). శివనైవేద్యమును తీసుకొనవలెననే కోరిక ఎవనికి కలుగదో, వాడు మహాపాపియై, నిశ్చయముగా నరకమును పొందును (9).

హృదయే చంద్రకాంతే చ స్వర్ణరూప్యాది నిర్మితే | శివదీక్షావతా భ##క్తే నేదం భక్ష్యమితీర్యతే || 10

శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకమ్‌ | సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేచ్ఛు భమ్‌ || 11

అన్యదీక్షా యుజాం నృణాం శివభక్తి రతాత్మనామ్‌ | శృణుధ్వం నిర్ణయం ప్రీత్యా శివనైవేద్యభక్షణ || 12

శాలగ్రామోద్భవే లింగే రస లింగే తథా ద్విజాః | పాపాణ రాజతే స్వర్ణే సుర సిద్ధ ప్రతిష్ఠితే || 13

కేసరే స్ఫాటికే రాత్నే జ్యోతిర్లింగేషు సర్వశః | చాంద్రాయణ సమం ప్రోక్తం శంభోర్నైవేద్య భక్షణమ్‌ || 14

హృదయమునందు గాని, లేక చంద్రకాంతమాణిక్యము, బంగారము, వెండి మొదలగు వాటితో నిర్మించిన లింగముల యందుగాని విరాజిల్లే శివునకు నైవేద్యమిడి ఆ భక్ష్యమును శివదీక్షలో నున్న భక్తుడు భక్షించవలెనని ఋషులు చెప్పిరి (10). శివదీక్షను పొందిన భక్తుడు మహాప్రసాదము అనబడే, శుభకరమగు, అన్ని లింగముల నైవేద్యమును భక్షించవలెను (11). ఇతరదీక్షలు గల మానవులు శివభక్తి యందు లగ్నమైన మనస్సు గల వారైనచో, వారు ప్రీతితో శివనైవేద్యమును భక్షించుట అను విషయములో గల నిర్ణయమును వినుడు (12). ఓ ద్విజులారా! శాలగ్రామము నందు ఉద్భవించిన లింగము, రసలింగము, శిలాలింగము, వెండి లింగము, బంగరు లింగము, దేవతలచే మరియు సిద్ధులచే ప్రతిష్ఠింప చేసిన లింగములు, అన్ని జ్యోతిర్లింగములు అను వాటి యందు విరాజిల్లే శివుని నైవేద్యమును భక్షించిన భక్తునకు చాంద్రాయణ వ్రతము చేసిన ఫలము లభించును.

బ్రహ్మహాపి శుచిర్భూత్వా నిర్మాల్యం యుస్తు ధారయేత్‌ | భక్షయిత్వా ద్రుతం తస్య సర్వపాపం ప్రణశ్యతి || 15

చండాధికారో యత్రాస్తి తద్భోక్తవ్యం న మానవైః | చండాధికారో నో యత్ర భోక్తవ్యం తచ్చ భక్తితః || 16

బాణ లింగే చ లౌహే చ సిద్ధే లింగే స్వయంభువి | ప్రతిమాసు చ సర్వాసు న చండోధికృతో భ##వేత్‌ || 17

స్నాపయిత్వా విధానేన యో లింగస్నపనోదకమ్‌ | త్రిః పిబేత్‌ త్రివిధం పాపం తస్యేహాశు వినశ్యతి || 18

ఎవరైతే శుచియై శివుని నిర్మాల్యమును ధరించి, ప్రసాదమును భక్షించునో, వాడు బ్రహ్మహత్యను చేసిన వాడైననూ, వాని పాపమంతయూ వెంటనే పూర్తిగా నశించును (15). చండీశ్వరుని అధికారము గల ప్రతిష్ఠలో మానవులు నైవేద్యమును భక్షించరాదు. చండీశ్వరాధి కారము లేని దేవళములో నైవేద్యమును భక్తితో భక్షించవలెను (16). బాణలింగము, లోహనిర్మితలింగము, సిద్ధ ప్రతిష్ఠిత లింగము, స్వయం భూలింగము, మరియు అన్ని రకముల శివప్రతిమల విషయములో చండీశ్వరునకు అధికారము ఉండదు (17). ఎవరైతే లింగమునకు యథావిధిగా అభిషేకమును చేసి, ఆ తీర్థమును మూడుసార్లు స్వీకరించునో, వాని మూడు విధముల పాపములు వెను వెంటనే నశించును.

అగ్రాహ్యం శివనైవేద్యం పత్రం పుష్పం ఫలం జలమ్‌ | శాలగ్రామ శిలా సంగాత్సర్వం యాతి పవిత్రతామ్‌ || 19

లింగోపరి చ యద్ద్రవ్యం తద గ్రాహ్యం మునీశ్వరాః| సుపవిత్రం తద్‌ జ్ఞేయం యల్లింగ స్వర్శ బాహ్యతః || 20

నైవేద్య నిర్ణయః ప్రోక్త ఇత్థం వో ముని సత్తమాః |శృణుధ్వం బిల్వ మహాత్మ్యం సావధానతయాssదరాత్‌ || 21

గ్రహింపదగని శివనైవేద్యము, పత్రము, పుష్పము, ఫలము, జలము ఇత్యాది సర్వముల శాలగ్రామ శిలయొక్క స్పర్శ చేతపవిత్రతను పొందును (19). ఓ ముని శ్రేష్ఠులారా! లింగముపైన ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు. కాని, లింగస్పర్శకు బయట నున్న శివనైవేద్యము మిక్కిలి పవిత్రమని తెలియవలెను (20). ఓమునిశ్రేష్ఠులారా! మీకింతవరకు నైవేద్యనిర్ణయమును చెప్పితిని. ఇపుడు సావధానముగా బిల్వ మహిమను శ్రద్ధతో వినుడు (21).

మహాదేవ స్వరూపోయం బిల్వో దేవైరపి స్తుతః | యథా కథం చిదేతస్య మహిమా జ్ఞాయతే కథమ్‌ || 22

పుణ్యతీర్థాని యావంతి లోకేషు ప్రథితాన్యపి | తాని సర్వాణి తీర్థాని బిల్వమూలే వసంతి హి || 23

బిల్వమూలే మహదేవం లింగరూపిణ మవ్యయమ్‌ | యః పూజయతి పుణ్యాత్మా స శివం ప్రాప్నుయాద్ధ్రువమ్‌ || 24

బిల్వమూలే జలైర్యస్తు మూర్దానమ భిషించతి | ససర్వతీర్థ స్నాతస్స్యాత్‌ స ఏవ భువి పావనః || 25

మారేడు చెట్టు మహాదేవుని స్వరూపము. దీనిని దేవతలు కూడ స్తుతించెదరు. దీని మహిమను యెరుంగుట మిక్కిలి కష్టము (22). లోకములో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థములు ఎన్ని గలవో, అవి అన్నియూ మారేడు చెట్టు మూలములో నివసించి యుండును.(23). మారేడు చెట్టు మూలమునందు లింగమరూపముగా నున్న వ్యయ రహితుడగు మహాదేవుని పూజించు పుణ్యాత్ముడు నిశ్చయముగా శివుని పొందును (24). మారేడు చెట్టు మొదట్లో స్నానము చేసినవాడు సర్వతీర్థములలో స్నానము చేసిన ఫలమును పొందును. అట్టి వాడు మాత్రమే ఈ లోకములో పవిత్రుడు (25).

ఏతస్య బిల్వ మూలస్యాథాలవాలమనుత్తమమ్‌ | జలాకులం మహాదేవో దృష్ట్వా తుష్టో భవత్యలమ్‌ || 26

పూజయేద్బిల్వమూలం యో గంధపుష్పాదిభిర్నరః | శివలోకమవాప్నోతి సంతతిర్వర్ధతే సుఖమ్‌ || 27

బిల్వమూలే దీపమాలం యః కల్పయతి సాదరమ్‌ | స తత్త్వజ్ఞాన సంపన్నో మహేశాంతర్గతో భ##వేత్‌ || 28

బిల్వశాఖాం సమాదాయ హస్తేన నవపల్లవమ్‌ | గృహీత్వా పూజయేద్బిల్వంస చ పాపైః ప్రముచ్యతే || 29

మారేడు చెట్టు మూలములో కట్టిన కుదురు సర్వోత్కృష్టమైనది. అది నీటితో తడిసియున్నచో, మహాదేవుడు చూచి సంతోషించును. శివుని అనుగ్రహమునకు అది చాలును (26). ఏ మానవుడు గంధము, పుష్పములు మొదలగు వాటితో మారేడు చెట్టు మూలమును పూజించునో, అతడు శివలోకమును పొందును. అట్టి వారికి సంతానము, సుఖము వర్థిల్లును (27).మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపములను పెట్టిన మానవుడు తత్త్వ జ్ఞానమును పొంది, మహేశ్వరునిలో ఐక్యమగును (28). కొత్త చిగుళ్ల తో నున్న మారేడు కొమ్మను చేతితో పట్టుకుని, మారేడు చెట్టును పూజించు మానవుడు పాపములనుండి విముక్తుడగును (29).

బిల్వమూలే శివరతం భోజయేద్యస్తు భక్తితః | ఏకం వా కోటిగుణితం తస్య పుణ్యం ప్రజాయతే || 30

బిల్వమూలే క్షీరయుక్తమన్న మాజ్యేన సంయుతమ్‌ | యో దద్యాచ్ఛివ భక్తాయ స దరిద్రో న జాయతే || 31

బిల్వమూలే క్షీరయుక్తమన్న మాజ్యేన సంయుతమ్‌| యో దద్యాచ్ఛివ భక్తాయ స దరిద్రోన జాయతే ||

సాంగో పాంగమితి ప్రోక్తం శివలింగ ప్రపూజనమ్‌ | ప్రవృత్తానాం నివృత్తానాం భేదతో ద్వివిధం ద్విజాః || 312

ప్రవృత్తానాం పీఠపూజా సర్వపూజా సమా భ##వేత్‌ | అభిషేకాంతే నైవేద్యం శాల్యన్నేన సమాచరేత్‌ || 33

మారేడు చెట్టు క్రింద శివభక్తునికి ఒక్కనికి భోజనము పెట్టిననూ, కోటి రెట్లు పుణ్యము లభించును (30). మారేడు చెట్టు క్రింద పాలు, నేయితో కూడిన అన్నమును శివభక్తునకు పెట్టినచో, అట్టివాడు దరిద్రుడై పుట్టడు (31). ఓ ద్విజులారా! ఈ విధముగా శివలింగ పూజను, దానిలోని వివిధ అంగములను, చిన్న వివరములతో సహా చెప్పితిని. ప్రవృత్తి, నివృత్తి అనే ద్వివిధి మార్గములలో నున్న భక్తులు చేయు పూజ వేర్వేరుగా నుండును (32). ప్రవృత్తులు పీఠపూజను చేయవలెను. దానివలన వారికి సర్వదేతలను పూజించిన ఫలము లభించును. వారు అభిషేకమును చేసి, నాణ్యమైన బియ్యముతో వండిన అన్నమును నైవేద్యమిడవలెను (33).

పూజంతే స్థాపయేల్లింగం పుటే శుద్ధే పృథక్‌ గృహే | కరపూజా నివృత్తానాం స్వభోజ్యం తు నివేదయేత్‌ || 34

నివృత్తానాం పరం సూక్ష్మం లింగమేవ విశిష్యతే | విభూత్యభ్యర్చనం కుర్యాద్విభూతిం చ నివేదయేత్‌ || 35

పూజాం కృత్వా తథా లింగం శిరసా ధారయేత్సదా || 36

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రతమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధనఖండే శివనైవేద్య వర్ణనం నామ ద్వావింశోsధ్యాయః (22)

పూజ అయిన తరువాత లింగమును శుద్ధమగు సంపుటిలో పెట్టి గృహములో ప్రత్యేకముగా భద్రము చేయవలెను. నివృత్తి మార్గములో నున్నవారు చేతియందు లింగము నుంచుకొని పూజించి, భిక్షాటనచే లభించిన ఆహారమునే నైవేద్యమిడవలెను (34). నివృత్తి పరులు సూక్ష్మలింగము (ఓం) ను ఉపాసించుటయే పరమశ్రేష్ఠము. వారు లింగమును విభూతితో అర్చించి, విభూతిని నైవేద్యమిడవలెను (35). పూజ అయిన పిమ్మటి లింగమును సర్వదా శిరస్సుపై ధరింపవలెను (36).

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో శివనైవేద్య వర్ణనము అనే ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము (22).

Sri Sivamahapuranamu-I    Chapters