Sri Sivamahapuranamu-I
Chapters
అథ తృతీయోsధ్యాయః నారదుని మోహము ఋషయ ఊచుః | సూత సూత మహాభాగ వ్యాసశిష్య నమోsస్తుతే | అద్భుతేయం కథా తాత వర్ణితా కృపయా హి నః ||
1 మునౌ గతే హరిస్తాత కిం చకార తతః పరమ్ | నారదోsపి గతః కుత్ర తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 2 ఋషులు ఇట్లు పలికిరి - ఓ సూతా! మహాత్మా! వ్యాస శిష్యుడవగు నీక నమస్కారము. వత్సా! నీవు దయతో మాకు ఈ అద్భుతమగు గాథను వర్ణించితివి (1). ఓ వత్సా! మహర్షి వెళ్లగానే, విష్ణువు ఏమి చేసెను? నారదుడు ఎక్కడకువెళ్లెను? ఈ విషయములను వివరింపుము (2). వ్యాస ఉవాచ | ఇత్యాకర్ణ్య వచస్తేషాం సూతః పౌరాణి కోత్తమః | ప్రత్యువాచ శివం స్మృత్వా నానాసూతికరం బుధః || 3 వ్యాసుడిట్లు పలికెను - పౌరాణిక శ్రేష్ఠుడు, విద్వాంసుడు నగు సూతుడు వారి ఈ పలుకులను విని, అనేక గొప్ప లీలలను చేయు శివుని స్మరించి, ఇట్లు బదులిడెను (3), సూత ఉవాచ | మునౌ యదృచ్ఛయా విష్ణుర్గతే తస్మన్ హి నారదే | శివచ్ఛేయా చకారాశు మాయాం మాయా విశారదః || 4 ముని మార్గస్య మధ్యే తు విరేచే నగరం మహత్ | శత యోజన విస్తారమద్భుతం సుమనోహరమ్ || 5 స్వలోకాదధికం రమ్యం నానావస్తు విరాజితమ్ | నరనారీ విహారాఢ్యం చతుర్వర్ణాకులం పరమ్ || 6 తత్ర రాజా శీలనిధి ర్నామైశ్వర్య సమన్వితః | సుతాస్వయం వరుద్యుక్తో మహోత్సవ సమన్వితః || 7 సూతుడిట్లు పలికెను - ఆ నారదముని తన దారిన వెళ్లగానే, మాయలో సమర్థుడగు విష్ణువు శివుని ఇచ్ఛను అనుసరించి, వెంటనే మాయను ప్రయోగించెను (4).నారదముని వెళ్లు మార్గములో ఒక గొప్ప నగరమును నిర్మించెను. వంద యోజనములు నిడివి గల ఆ అద్భుత నగరము మిక్కిలి సుందరముగ నుండెను (5).విష్ణులోకముకంటె అధిక సుందరముగా నున్న ఆ నగరము అనేక వస్తువలతో విరాజిల్లెను. దాని యందు స్త్రీ పురుషులు విహరించుచుండిరి. నాల్గు వర్ణముల వారితో ఆనరగము విరాజిల్లెను (6). ఆ నగరమును శీలనిధియను రాజు పరిపాలించెను. అతడు గొప్ప ఐశ్వర్యము గలవాడు. అతడా సమయములో తన కుమార్తె యొక్క స్వయంవరోత్సవమును ఏర్పాటు చేసెను (7). చతుర్దిగ్భ్యః సమాయతైస్సంయుతం నృపనందనైః | నానావేషై స్సు శోభైశ్చ తత్కన్యావరణోత్సుకైః || 8 ఏతాదృశం పురం దృష్ట్వా మోహం ప్రాప్తోsథ నారదః | కౌతుకీ తన్నృపద్వారం జగామ మదనైధితః || 9 ఆగతం మునివర్యం తం దృష్ట్వా శీలనిధిర్నృపః | ఉపవేశ్యార్చయాం చక్రే రత్న సింహాసనే వరే || 10 అథ రాజా స్వతనయాం నామతశ్శ్రీమతీం వరామ్ | సమానీయ నారదస్య పాదయోస్సమపాతయత్ || 11 ఆ కన్యను వివాహమాడే ఉత్సాహముతో నాల్గు దిక్కుల నుండి రాజు కుమారులు వచ్చియుండిరి. సుందరమగు వేషములను ధరించి న ఆ రాజ కుమారులతో నగరము నిండియుండెను (8). ఇట్టి నగరమును చూచి నారదుడు మోహమును పొందెను. కామవశుడై ఆయన ఉత్కంఠతో రాజద్వారమును సమీపించెను (9). అచటకు విచ్చేసిన నారద మహర్షిని చూచి, శీలనిధి మహారాజు ఆయనను శ్రేశ్ఠమగు రత్నసింహాసనముపై ఆసీనుని చేసి పూజించెను (10). అపుడు రాజు తన కుమార్తెను పిలింపిచెను. ఆమె పేరు శ్రీమతి. ఆమెచే రాజు నారదుని పాదములకు నమస్కరింపజేసెను (11). తత్కన్యాం ప్రేక్ష్య స మునిరనారదః ప్రాహ విస్మితః | కేయం రాజన్మ హాభాగా కన్యా సురసుతోపమా || 12 తస్య తద్వచనం శ్రుత్వా రాజా ప్రాహ కృతాంజలిః | దుహితేయం మమ మునే శ్రీమతీ నామ నామతః || 13 ప్రదాన సమయం ప్రాప్తా వరమన్వేషతీ శుభమ్ | సా స్వయం వర సంప్రాప్తా సర్వలక్షణ లక్షి తా || 14 అస్యా భాగ్యంవద మునే సర్వం జాతక మాదరాత్ | కీదృశం తన యేయం మే వరమాప్స్యతి తద్వద || 15 నారదమహర్షి ఆ కన్యను చూచి, ఆశ్చర్యమును పొంది, ఇట్లనెను. రాజా! దేవకన్య వలె నున్న ఈ శ్రేష్ఠకన్య ఎవరు?(12).రాజు ఆ మాటను విని, దోసిలి యొగ్గి ఇట్లు పలికెను. మహర్షీ! ఈమె నా కుమార్తె. పేరు శ్రీమతి (13). ఈమెకు యుక్త వయస్సు వచ్చినది. సర్వ లక్షణములతో శోభిల్లు ఈమె యోగ్యుడగు వరుని కొరకై స్వయంవర సభలో అన్వేషించబోవుచున్నది. (14). ఓ మహర్షీ!ఈమె జాతకమును చూచి ఈమె భాగ్యమును చెప్పుడు. ఈ నా కుమార్తె ఎట్టి వరుని పొందగలదో చెప్పుడు (15). ఇత్యుక్తో ముని శార్దూల స్తామిచ్ఛుః కామవిహ్వలః | సమాభాష్య స రాజానం నారదో వాక్య మబ్రవీత్ || 16 సుతేయం తవ భూపాల సర్వలక్షణ లక్షితా | మహాభాగ్యవతీ ధన్యా లక్ష్మీ రివ గుణాలయా || 17 సర్వేశ్వరోsజీతో విరో గిరీశదృశో విభుః |అస్యాః తపిర్ధ్రువం భావీ కామ జిత్సురసత్తమః || 18 ఇత్యుక్త్వా నృపమామంత్ర్య య¸° యాదృచ్ఛికో మునిః | బభూవ కామ వివశశ్శివమాయా విమోహితః || 19 మన్మథ పీడితుడుగు ఆ ముని వర్యుడు ఈ మాటను విని, ఆమెను పొందగోరెను. ఆయన రాజును సంబోధించి, ఇట్లు పలికెను (16). ఓ రాజా! ఈ నీ కుమార్తె సర్వ శుభలక్షణములతో విరాజిల్లుచున్నది. ఈమె లక్ష్మీదేవి వలె మహాభాగ్యము గల ధన్యురాలు.ఈమె సద్గుణములకు నిలయము (17). సర్వసమర్ధుడు, పరాజయమునెరుంగని వాడు, వీరుడు, శివునితో సమానమగు మహిమ గల వాడు, మన్మథుని జయించిన వాడునగు దేవశ్రేష్ఠుడు ఈమెకు పతి కాగలడు. ఇద నిశ్చయము (18). ఇట్లు రాజుతో పలికి నారదముని రాజువద్ద సెలవు తీసుకొని తన దారిన వెళ్లెను. ఆ ఋషి శివమాయచే మోహితుడై కామమునకు వశుడై యుండెను (19). చిత్తే విచింత్య స ముని రాప్నుయాం కథమేనకామ్ | స్వయంవరే నృపాలానామేకం మాం వృణుయాత్కథమ్ || 20 సౌందర్యం సర్వనారీణాం ప్రియం భవతి సర్వథా | తద్దృష్ట్వైవ ప్రసన్నా సా స్వవశా నాత్ర సంశయః || 21 విధాయేత్థం విష్ణురూపం గ్రహీతుం మునిసత్తమః | విష్ణులోకం జగామాశు నారదస్స్మర విహ్వలః || 22 ప్రణిపత్య హృషీకేశం వాక్యమేతదువా చ హ | రహసి త్వాం ప్రవక్ష్యామి స్వవృత్తాంతమశేషతః || 23 ఈమెను నేను పొందుట యెట్లు? రాజకుమారులు పాల్గొనే స్వయంవరములో ఈమె నన్ను వరించు ఉపాయమేది? అని ఆ మహర్షి తన మనమున ఆలోచించెను (20). స్త్రీలందరికీ సౌందర్యమే ప్రీతిపాత్రమగును. వారు సౌందర్యమును చూచి మాత్రమే పురుషునకు వశులగుదురనుటలో సందియము లేదు (21).కామ వివశుడగు నారదమహర్షి ఇట్లు తలపోసి, విష్ణువు యొక్క రూపమును పొందుటకై వెంటనే విష్ణులోకమునకు వెళ్లెను (22). ఆయన విష్ణువునకు నమస్కరించి, 'నా వృత్తాంతమునంతనూ నీకు ఏ కాంతములో చెప్పవలె' నని పలికెను (23). తథేత్యుక్తే తథా భూతే శివేచ్ఛా కార్యకర్తరి | బ్రూహీత్యుక్తవతి శ్రీశే మునిరాహ చ కేశవమ్ || 24 నారద ఉవాచ | త్వదీయో భూపతి శ్శీలనిధిస్స వృషతత్పరః | తస్య కన్యా విశాలాక్షీ శ్రీమతీ వరవర్ణినీ || 25 జగన్మోహిన్యభిఖ్యాతా త్రైలోక్యే ప్యతి సుందరీ | పరిణతుమహం విష్ణో తామిచ్ఛామయద్య మా చిరమ్ || 26 స్వయంవరం చకారాసౌ భూపతిస్తనయోచ్ఛయా | చతుర్దిగ్భ్య స్సమాయాతా రాజపుత్రాస్సహస్రశః || 27 శివుని ఇచ్ఛననుసరించి కార్యములను నిర్వర్తించు లక్ష్మీపతి 'సరే, చెప్పుమ అని బదులిడగా, నారదముని కేశవునితో నిట్లనెను (24). నారదుడిట్లు పలికెను - శీలనిధి మహారాజు నీ భక్తుడు. ధర్మాత్ముడు. అతని కుమార్తె నిడివి కన్నులు గల సుందరి. ఆమె పేరు శ్రీమతి (25). ఆమె ముల్లోకములలో కెల్లా అతి సుందరి, జగన్మోహిని అని ప్రఖ్యాతి గాంచినది. హే విష్ణో! నేనామెను ఈనాడే విలంబము లేకుండా వివాహమాడ గోరుచున్నాను (26). ఆమె కోర్కె మేరకు శీలనిధి మహారాజు స్వయంవరము నేర్పాటు చేసెను (27). వేలాది రాజపుత్రులు నాల్గు దిక్కుల నుండి విచ్చేసినారు (28). యది దాస్యసి రూపం మే తదా తాం ప్రాప్నుయాం ధ్రువమ్ | త్వద్రూపం సా వినా కంఠే జయమాలాం న ధాస్యతి || 28 స్వరూపం దేహి మే నాథ సేవకోsహం ప్రియస్తవ | వృణుయాన్మాం యథా సా వై శ్రీమతీ క్షితిపాత్మజా || 29 నీవు నాకు రూపము నొసంగినచో, నేనామెను పొందుట నిశ్చయము. నీ రూపము నాకు లేనిదే, ఆమె నా కంఠములో జయమాలను వేయదు (28). ఓనాథా! నీపరూపమును నాకిమ్ము. నేను నీకు ప్రియమైన సేవకుడను. నీ రూపము నాకున్నచో, ఆ రాజకుమార్తె శ్రీమతి నన్ను వరించును (29). సూత ఉవాచ | వచః శ్రుత్వా మునేరిత్థం విహస్య మధు సూదనః | శాంకరీం ప్రభుతాం బుద్ద్వా ప్రత్యువాచ దయాపరః || 30 సూతుడిట్లు పలికెను - మహర్షి యొక్క ఈ మాటను విని దయాళువగు మధుసూదనుడు శంకరుని సామర్ధ్యము నెరింగినవాడై చిరునవ్వుతో నిట్లనెను. విష్ణురువాచ | స్వేష్టదేశం మునే గచ్ఛ కరిష్యామి హితం తవ | భిషగ్వరో యథార్తస్య యతః ప్రియతరోసి మే || 31 ఇత్యుక్త్వా మునయే తసై#్మ దదౌ విష్ణుర్ముఖం హరేః | స్వరూపమనుగృహ్యాస్య తిరోధానం జగామ సః || 32 ఏవముక్తో మునిర్హృష్ట స్స్వరూపం ప్రాప్యవై హరేః | మేనే కృతార్ధమాత్మనం తద్యత్నం న బుబోధ నసః || 33 విష్ణువు ఇట్లు పలికెను - ఓ మహర్షీ! నీవు తోచిన చోటికి వెళ్లుము. నీవు నాకు మిక్కిలి ప్రియమైన వాడవు. కావున, శ్రేష్ఠుడగు వైద్యుడు రోగికి హితమును చేయు విధామున, నేను నీకు హితమును చేసేదను (31). విష్ణువు ఇట్లు పలికి ఆ నారదమునికి కోతి ముఖమును, మిగిలిన దేహములో తన రూపమును ఇచ్చి అంతర్ధానమయ్యెను (32). ఈ మాటలను విని నారదుడు చాల సంతోషించి, కృతార్థడనైతినని తలపోసెను. ఆయన కోతి ముఖమును, విష్ణువు రూపము (ఇతర దేహమునందు) ను పొందెను. విష్ణువు యొక్క ఈ కార్యమును ఆయన ఎరుంగలేక పోయెను (33). అథ తత్ర గతశ్శీఘ్రం నారదో మునిసత్తమః | చక్రే స్వయంవరం యత్ర రాజపుత్రై స్సమాకులమ్ || 34 స్వయంవర సభా దివ్యా రాజపుత్ర సమావృతా | శుశుభేsతీవ విప్రేంద్రా యథా శక్రసభాsపరా || 35 తస్యాం నృపసభాయం వై నారదస్సముపావిశత్ | స్థిత్వా తత్ర విచింత్యేతి ప్రీతియుక్తేన చేతసా || 36 మాం వరిష్యతి నోన్యం సా విష్ణు రూపధరం ధ్రువమ్ | ఆననస్య కురూపత్వం న వేద మునిసత్తమః || 37 పూర్వ రూపం మునిం సర్వే దదృశుస్తత్ర మానవాః | తద్భేదం బుబుధుస్తే న రాజపుత్రాదయో ద్విజాః || 38 అపుడా నారదమహర్షి వెనువెంటనే రాజపుత్రులతో కోలాహలముగా నున్న స్వయం వర సభకు చేరుకొనెను (34). విప్రశ్రేష్ఠులారా! రాజపుత్రులతో నిండియున్న ఆ దివ్యమగు స్వయంవర సభ రెండవ ఇంద్రసభ వలె మిక్కిలి ప్రకాశించెను (35).నారదుడు ఆనందముతో నిండిన అంతరమున గలవాడై ఆ రాజసభ యందు గూర్చుండి (36),'విష్ణురూపమును ధరించియున్న నన్ను తక్క ఆమె మరియొకరిని వరించదు, ఇది నిశ్చయము' అని తలపోసెను. ఆ మహర్షి తన ముఖము కురూపముగా నుండుటను యెరుంగడు (37). ఓద్విజులారా! అక్కడనున్న జనులందరు ఆ మహర్షి యొక్క పూర్వ రూపమును మాత్రమే చూచిరి. రాజపుత్రులకు, ఇతరులకు నారదముని యొక్క రూపములోని మార్పు తెలియదు (38). తత్ర రుద్ర గణౌ ద్వౌ తద్రక్షణార్థం సమాగతౌ | విప్రరూప ధరౌ గూఢౌ తద్భేదం జజ్ఞతుః పరమ్ || 39 మూఢం మత్వా మునిం తౌ తన్నికటం జగ్మతుర్గణౌ | కురుతస్తత్ర్పహాసం వై భాషమాణౌ పరస్పరమ్ || 40 పశ్య నారదరూపం హి విష్ణోరివ మహోత్తమమ్ | ముఖం తు వానరస్యేవ వికటం చ భయంకరమ్ || 41 ఇచ్ఛత్యయం నృపసుతాం వృథైవ స్మరమోహితః | ఇత్యుక్తా సచ్ఛలం వాక్యముపహాసం ప్రచక్రతుః || 42 నారదుని రక్షణ కొరకు అచటకు ఇద్దరు రుద్రానుయాయులు వచ్చి బ్రాహ్మణవేషములో రహస్యముగా నుండిరి. వారిద్దరికి నారదుని వికృతరూపము యొక్క రహస్యము తెలిసిపోయెను (38). వారిద్దరు మహర్షిని మూఢునిగా తలంచి, ఆయన వద్దకు వెళ్ళి ఒకరితోనొకరు మాటలాడుచూ ఆయనను వెటకారము చేసిరి (40). విష్ణువువలె మిక్కిలి గొప్ప రూపమును ధరించియున్న నారదుని చూడుము. కాని ఈతని ముఖము కోతి ముఖము. వికటము, భయంకరముగా నున్నది (41). కామముచే విమోహితుడైన ఈతడు రాజకుమార్తెను కోరుచున్నాడు. ఈతని కోరిక వ్యర్థము. ఈ విధముగా వారు నిందావచనములతో ఆ మహర్షిని పరిహాసము చేసిరి (42). న శుశ్రావ యథార్థం తు తద్వాక్యం స్మరవిహ్వలః | పర్యేక్ష చ్ఛ్రీమతీం తాం వై తల్లిప్సుర్మోహితో మునిః || 43 ఏతస్మిన్నంతరే భూపకన్యా చాంతః పురాత్తు సా | స్త్రీ భిస్సమావృతా తత్రా జగామ వరవర్ణినీ || 44 మాలాం హిరణ్మయీం రమ్యామాదాయ శుభలక్షణా | తత్ర స్వయంవరే రేజే స్థితా మధ్యే రమేవ సా || 45 బభ్రామ సా సభాం సర్వాం మాలామాదాయ సువ్రతా | వరమన్వేషతీ తత్ర స్వాత్మాభీష్టం నృపత్మజా || 46 కామమోహితుడగు ఆ మహర్షి వారి సత్యవచనములను చెవిని పెట్టలేదు. మోహితుడగు ఆ ముని శ్రీమతిని పొందగోరి, ఆమె కొరకు ఎదురుచూచెను (43). ఇంతలో సుందరియగు ఆ రాజకుమార్తె అంతఃపురము నుండి పరిచారికలతో కూడి అచటకు వచ్చెను (44). శుభలక్షణములు గల ఆమె అందమైన బంగరు మాలను చేతబట్టి, స్వయంవర సభామధ్యములో లక్ష్మీదేవి వలె నిలబడెను (45). దృఢవ్రతము గల ఆ రాజకుమారి మాలను చేతబట్టి, తనకు నచ్చే వరుని అన్వేషిస్తూ, సభనంతను తిరిగెను (46). వానరాస్యం విష్ణుతనుం మునిం దృష్ట్వా చుకోప సా | దృష్టిం నివార్య చ తతః ప్రస్థితా ప్రీతమానసా || 47 న దృష్ట్వా స్వవరం తత్ర త్రస్తా సీన్మనసేప్సితమ్ | అంత స్సభాస్థితా కస్మిన్నర్పయామాస న స్రజమ్ || 48 ఏతస్మిన్నంతరే విష్ణురాజగామ నృపాకృతిః | న దృష్టః కైశ్చిదపరైః కేవలం సా దదర్శ హి || 49 అథ సా తం సమాలోక్య ప్రసన్న వదనాంబుజా | అర్పయామాస తత్కంఠే తాం మాలాం వరవర్ణినీ || 50 ఉల్లాసమగు మనస్సుతో నున్న ఆమె విష్ణు రూపమును, కోతి ముఖమును కలిగిన ఆ మునిని చూచి, కోపముతో ముఖమును త్రిప్పుకొనెను (47).ఆమెకు తన మనస్సునకు నచ్చే వరుడు దొరకడేమో యను భయము కలిగెను. ఆమె సభలోని వారెవ్వరికీ మాలను ఈయకుండగా సభలో నిలబడి యుండెను (48)ఇంతలో అచటకు రాజవేషములో విష్ణువు వచ్చెను. ఆయన ఇతరులెవ్వరికీ కానరాలేదు. ఆమె మాత్రమే ఆయనను చూచెను (49). అపుడా సుందరి ఆయనను చూచి ప్రసన్నమగు ముఖపద్మము గలదై ఆయన కంఠములో మాలను అర్పించెను (50). తామాదాయ తతో విష్ణూ రాజరూపధరః ప్రభుః | అంతర్ధానమగాత్సద్య స్స్వస్థానం ప్రయ¸° కిల || 51 సర్వే రాజకుమారాశ్చ నిరాశాశ్ర్శీమతీం ప్రతి | మునిస్తు విహ్మలోsతీవ బభూవ మదనాతురః || 52 తదా తావూచతుస్సద్యో నారదం స్మరవిహ్వలమ్ | విప్ర రూపధరౌ రుద్ర గణౌ జ్ఞానవిశారదౌ || 53 అపుడు రాజరూపమును ధరించిన విష్ణు భగవానుడు ఆమెను తీసుకొని, అంతర్థానమై, వెంటనే తన లోకమునకు వెళ్లెను (51). రాజకుమారులందరు శ్రీమతి విషయంలో నిరాశను పొందిరి. కామపీడితుడగు నారదముని మిక్కిలి దుఃఖించెను (52). అపుడు గొప్ప జ్ఞానులు, బ్రాహ్మణవేషధారులునగు రుద్రానుచరులిద్దరు కామనాదుఃఖితుడగు నారదునితో నిట్లనిరి (53). గణావూచతుః | హే నారదమునే త్వం హి వృథా మదనమోహితః |తల్లిప్సు స్స్వ ముఖం పశ్య వానరస్యేవ గర్హితమ్ || 54 రుద్రాసుచరులిద్దరు ఇట్లు పలికిరి - ఓ నారదమహర్షీ! నీవు కామపీడితుడవై ఆమెను పొందగోరుట వ్యర్థము. నీ ముఖమును చూచుకొనుము. కోతి ముఖమ వలె వికటముగ నున్నది (54). సూత ఉవాచ | ఇత్యా కర్ణ్య తయోర్వాక్యం నారదో విస్మతోsభవత్ | ముఖం దదర్శ ముకురే శివమాయా విమోహితః || 55 స్వముఖం వానరస్యేవ దృష్ట్వా చక్రోధ సత్వరమ్ | శాపం దదౌ తయోస్తత్ర గణయోర్మోహితో ముని ః || 56 యువాం మమోపహాసం వై చక్రతుర్బ్రాహ్మణస్య హి | భ##వేతాం రాక్ష సౌ విప్రవీర్య జౌ హి తదాకృతీ || 57 శ్రుత్వా హరగణా విత్థం స్వశాపం జ్ఞానిసత్తమౌ | న కించి దూచతుస్తౌ హి ముని మాజ్ఞాయ మోహితమ్ || 58 స్వస్థానం జగ్మతుర్విప్రా ఉదాసీనౌ శివస్తుతిమ్ | చక్రతుర్మన్యమానౌ వై శివేచ్ఛాం సకలాం సదా || 59 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపా ఖ్యానే నారదమోహవర్ణనం నామ తృతీయోsధ్యాయః (3). సూతుడిట్లు పలికెను - వారి ఈ మాటలను విని నారదుడు ఆశ్చర్యచకితుడయ్యెను. శివమాయచే మోహితుడైన ఆ ఋషి అద్దములో ముఖమును చూచుకొనెను (55). తన ముఖము కోతి ముఖమువలె నుండుటను గాంచిన ఋషికి వెంటనే కోపము కలిగెను. మోహితుడగు ఆ ముని రుద్రానుయాయులిద్దరిని శపించెను (56). మీరిద్దరు బ్రాహ్మణుడనగు నన్ను పరిహాసము చేసిరి. కావున, మీరిద్దరు బ్రాహ్మణులై పుట్టి రాక్షసరూపమును పొందెదరు (57). మహర్షి మోహితుడై యుండుటను యెరింగిన ఆ జ్ఞానులిద్దరు ఋషి తమకిచ్చిన శాపమును విని ఏమియూ బదులిడలేదు (58). ఓ విప్రులారా! ఉదాసీనముగా నున్న వారిద్దరు తమలోకమునకు వెళ్లిరి. సర్వము సర్వదా శివుని ఇచ్ఛ ప్రకారమే జరుగునని తలంచినవారై వారు శివుని స్తుతించిరి (59). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు మొదటి ఖండములోని సృష్ఠ్యు పాఖ్యానములో నారద మోహవర్ణనము అను మూడవ అధ్యాయము ముగిసినది (3).