Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుర్థోsధ్యాయః

నారదునకు విష్ణువు ఉపదేశించుట

ఋషయ ఊచుః |

సూత సూత మహాప్రాజ్ఞ వర్ణితా హ్యద్భుతా కథా | ధన్యా తు శాంభవీ మాయా తదధీనం చరాచరమ్‌ || 1

గతయోర్గణయోశ్శంభోస్స్వయ మాత్మేచ్ఛయా విభోః | కిం చకార మునిః క్రుద్ధో నారదస్స్మరవిహ్వలః || 2

ఋషులిట్లు పలికిరి -

ఓ సూతా! మహాజ్ఞానివగు నీవు అద్భుతమగు కథను చెప్పితివి. శివుని మాయ ధన్యురాలు. స్థావరజంగమాత్మకమగు జగత్తు ఆమె అధీనమునందున్నది (1). శివుని అనుయాయులిద్దరు శివుని ఇచ్ఛను గ్రహించి తమ స్థానమునకు వెళ్లిపోగా, కామపీడితుడగు నారదముని క్రుద్ధుడై ఏమి చేసెను? (2).

సూత ఉవాచ |

విమోహితో మునిర్దత్వా తయోశ్శాపం యథోచితమ్‌ | జలే ముఖం నిరీక్ష్యాథ స్వరూపం గిరిశేచ్ఛయా || 3

శివేచ్ఛయాన ప్ర బుద్ధస్స్మృత్వా హరికృతచ్ఛలమ్‌ | క్రోధం దుర్విషహం కృత్వా విష్ణులోకం జగామ హ || 4

ఉవాచ వచనం క్రుద్ధస్సమిద్ధ ఇవ పావకః | దురుక్తి గర్భితం వ్యంగ్యం నష్టజ్ఞాన శ్శివేచ్ఛయా || 5

సూతుడిట్లు పలికెను -

మోహితుడై యున్న నారదుడు వారిద్దరికి తగు శాపమునిచ్చి, నీటిలో తన ముఖమును, తన ఇతర స్వరూపమును చూచుకొనెను. ఇది అంతయూ శివుని ఇచ్ఛచే జరుగచుండెను (3). అతనికి ఇంకనూ జ్ఞానప్రబోధము కాలేదు. అతడు విష్ణువు చేసిన మోసమును స్మరించి, సహింప శక్యము కాని కోపమును పొంది విష్ణులోకమునకు వెళ్లెను (4).ఇంధనము వేసిన అగ్ని హోత్రమువలె క్రోధముతో మండిపడుచున్నవాడై, అతడు వెటకారముతో నిందావచనములను పలికెను. శివుని సంకల్పముచే నాతడు జ్ఞానమును కోల్పోయి ఉండెను (5).

నారద ఉవాచ |

హే హరే త్వం మహాదుష్టః కపటీ విశ్వమోహనః | పరోత్సాహం న సహసే మాయావీ మలినాశయః || 6

మోహినీ రూపమాదాయ కపటం కృతవాన్‌ పురా | అసురేభ్యోsపాయయస్త్వం వారుణీ మమృతం న హి || 7

చేత్పిబేన్న విషం రుద్రో దయా కృత్వా మహేశ్వరః | భ##వేన్నష్టాsఖిలా మాయా తవ వ్యాజరతే హరే || 8

గతిస్సకపటా తేsతిప్రియా విష్ణో విశేషతః | సాధుస్వ భావో న భవాన్‌ స్వతంత్రః ప్రభుణా కృతః || 9

హే హరే! నీవు మహాదుష్టుడవు. మోసగాడవు. జగత్తును వ్యామోహపెట్టెదను. మాయావిని. దుష్ట స్వభావముగల నీవు ఇతరుల ఉత్సాహమును సహించలేవు (6). నీవు పూర్వము మోహినీ రూపమును ధరించి, మోసము చేసి, రాక్షసులచే సురను త్రాగించితివి. వారికి అమృతము దక్కకుండ చేసితివి (7). మోసమునందు ప్రీతి గల ఓ హరీ! మహేశ్వరుడగు రుద్రుడు దయతో విషమును త్రాగకున్నచో, నీ మాయ ఆనాడే నశించి యుండెడిది (8). హే విష్ణో! నీకు కపట మార్గము మిక్కిలి ప్రియమైనది. నీ స్వభావము మంచిది కాదు. అయిననూ, శంకరుడు నిన్ను స్వతంత్రుని చేసినాడు (9).

కృతం సముచితం నైవ శివేన పరమాత్మనా | తత్ప్రభావబలం ధ్యాత్వా స్వతంత్రకృతికారకః || 10

త్వద్గతిం సుసమాజ్ఞాయ పశ్చాత్తాపమవాప సః | విప్రం సర్వోపరి ప్రాహ స్వోక్తవేదప్రమాణ కృత్‌ || 11

తద్‌ జ్ఞాత్వాహం హరే త్వాద్య శిక్షయిష్యామి తద్బలాత్‌ | యథా న కుర్యాః కుత్రాపీ దృశం కర్మ కదాచన || 12

అద్యాపి నిర్భయస్త్వం హి సంగం నాపస్తరస్వినా | ఇదానీం లప్ప్యసే విష్ణో ఫలం స్వకృతకర్మణః || 13

నిన్ను స్వతంత్రుని చేయుటలో శివుడు పొరపాటు చేసినాడు. ఆయన తన ప్రభావము చే నిన్ను స్వతంత్రుని చేసినాడు (10). నీ ప్రవృత్తిని చూసి ఆయన పశ్చాత్తాపమును పొందెను. ఆయన వేదప్రామాణ్యమును నిరూపించి, విప్రుడు సర్వశ్రేష్ఠుడని చెప్పెను (11).హే హరే! నేనా విషయము నెరింగి ఆ బలము వలన, నీవు మరల ఇట్టి పనిని ఏనాడూ చేయకుండునట్లు నిన్నీనాడు శిక్షించెదను (12). నీకు ఇప్పటికైననూ భయము కలుగలేదు. నీవు ఇంతవరకు తేజశ్శాలియగు వ్యక్తిని ఎదుర్కొనలేదు. హే విష్ణో! ఈనాడు నీవు, చేసిన పనికి ఫలమునను భవించెదవు (13).

ఇత్థముక్త్వా హరిం సోsథ మునిర్మాయావిమోహితః | శశాప క్రోధనిర్విణ్ణో బ్రహ్మతేజః ప్రదర్శయన్‌ || 14

స్త్రీకృతే వ్యాకులం విష్ణో మామకార్షీర్విమోహకః | అన్వకార్షీ స్స్వరూపేణ యేన కాపట్య కార్యకృత్‌ || 15

తద్రూపేణ మనుష్యస్త్వం భవ తద్దుఃఖభుగ్ఘరే | యన్ముఖం కృతవాన్‌ మే త్వం తే భవంతు సహాయినః || 16

త్వం స్త్రీ వియోగజం దుఃఖం లభస్వ పరదుఃఖదః | మనుష్యగతికః ప్రాయో భవాజ్ఞానివిమోహితః || 17

మాయా మోహితుడగు నారదముని విష్ణువుతో నిట్లు పలికి, బ్రహ్మతేజస్సును ప్రదర్శించుచున్నవాడై, క్రోధావేశముతో శపించెను (14). హే విష్ణో! స్త్రీ కొరకై నన్ను మోసము చేసి దుఃఖమును కలిగించితివి. హే హరే! నీవు కపటముచేసి నాకు ఏ రూపమును ఇచ్చితివో (15), అదే రూపముతో మనుష్యుడవై జన్మించి, ఆ జన్మలో దుఃఖము ననుభవింపుము. నీవు నాకు ఏ వానరముఖమును ఇచ్చితివో, అదే వానరులు నీకు సహాయకారులగుదురు (16). ఇతరులకు దుఃఖమును కలిగించిన నీవు స్త్రీ వియోగ దుఃఖమును పొందెదవు. మనుష్య జన్మలో నీవు తరుచు అజ్ఞానముచే మోహితుడవై ఉండెదవు (17).

ఇతి శప్త్వా హరిం మోహాన్నారదోs జ్ఞానమోహితః | విష్ణుర్జగ్రాహ తం శాపం ప్రశంసన్‌ శాంభవీ మజామ్‌ || 18

అథ శంభుర్మహాలీలో నిశ్చకర్ష విమోహినీమ్‌ | స్వమాయాం మోహితో జ్ఞానీ నారదోsప్యభవద్యయా || 19

అంతర్హితాయాం మాయాయాం పూర్వవన్మతి మానభూత్‌ | నారదో విస్మితమనాః ప్రాప్తబోధో నిరాకులః || 20

పశ్చాత్తాపమవాప్యాతి నినింద స్వం ముహూర్ముహుః | ప్రశశంస తదా మాయాం శాంభవీం జ్ఞానమోహినీమ్‌ || 21

అజ్ఞానముచే మోహితుడైన నారదుడు విష్ణువును ఇట్లు శపించగా, విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి, ఆ శాపమును స్వీకరించెను (18). అపుడు గొప్ప లీలలు గల శంభుడు మోహమును కలిగించు తన మాయను ఉపసంహరించెను. ఆ మాయచేతనే జ్ఞానియగు నారదుడు కూడ మోహితుడాయెను గదా! (19) మాయ తొలగిపోగానే, నారదుడు పూర్వమునందు వలె జ్ఞాని ఆయెను. జ్ఞానము కలుగగానే దుఃఖము తొలగి, నారదుడు ఆశ్చర్యచకితుడాయెను (20). అతడు పశ్చాత్తాపమును పొంది తాను చేసిన పనులను పునః పునః నిందించుకొనెను. అపుడాతడు, జ్ఞానమును పొగొట్టి మోహింపజేయు శివమాయను కొనియాడెను (21).

అథ జ్ఞాత్వా మునిస్సర్వం మాయావిభ్రమమాత్మనః | అపతత్పాదయోర్విష్ణోర్నారదో వైష్ణవోత్తమః || 22

హర్యుపస్థాపితః ప్రాహ వచనం నష్టదుర్మతిః | మయా దురుక్తయః ప్రోక్తా మోహితేన కుబుద్ధినా || 23

దత్తశ్శాపోsపి తేనాథ వితథం కురు తం ప్రభో | మహత్పాపమకార్షం హి యాస్యామి నిరయం ధ్రువమ్‌ || 24

కముపాయం హరే కుర్యాం దాసోsహం తే తమాదిశ | యేన పాపకులం నశ్యేన్నిరయో న భ##వేన్మమ || 25

అపుడా మహర్షికి తాను మాయా విమోహితుడై చేసిన పనులన్నియు తెలియవచ్చెను. వైష్ణవోత్తముడగు నారదుడు అపుడు విష్ణువు పాదములపై పడెను (22). శ్రీహరి అతనిని లేవదీయగా, దుష్టబుద్ధి తొలగిపోయిన నారదుడిట్లు పలికెను. మోహితుడనైన నేను దుర్బుద్ధితో దుష్టవచనములను పలికితిని (23). పైగా, శాపమును కూడ ఇచ్చితిని. హే ప్రభో! ఆ శాపము అసత్యమగునట్లు చేయుము. నేను మహాపాపమును చేసితిని. నేను నరకమును పొందుట నిశ్చయము (24). హే హరే! పాపమంతయూ నశించి, నాకు నరకము కలుగకుండునట్లు ఉపాయమేమి గలదు? నేను నీదాసుడను. నాకు అట్టి ఉపాయమును ఉపదేశింపుము (25).

ఇత్యుక్త్వా స పునర్విష్ణోః పాదయోర్మునిసత్తమః | పపాత సుమతిర్భక్త్వా పశ్చాత్తాపము పాగతః || 26

అథ విష్ణుస్తముత్థాప్య బభాషే సూనృతం వచః |

ఇట్లు పలికి నారదమహర్షి పశ్చాత్తాపమునుపొంది, సద్బుద్ధి గల వాడై భక్తితో మరల విష్ణువు పాదములపై పడెను (26).

విష్ణువు అపుడాతనిని లేపి ఈ సత్యవచనమును పలికెను.

విష్ణు రువాచ |

న ఖేదం కురు మే భక్తవరస్త్వం నాత్ర సంశయః|| 27

శృణు తాత ప్రవక్ష్యామి సుహితం తవ నిశ్చయాత్‌ | నిరయస్తే న భవితా శివశ్శం తే విధాస్యతి || 28

యదకార్షీ శ్శివవచో వితథం మదమోహితః | స దత్తవానీదృశం తే ఫలం కర్మఫలప్రదః || 29

శివేచ్ఛయాsఖిలం జాతం కుర్విత్థం నిశ్చితాం మతిమ్‌ | గర్వాపహర్తా స స్వామీ శంకరః పరమేశ్వరః || 30

పరం బ్రహ్మ పరాత్మా స సచ్చిదానంద బోధనః | నిర్గుణో నిర్వికారో చ రజస్సత్త్వతమః పరః || 31

విష్ణువు ఇట్లు పలికెను -

నీవు దుఃఖింపకుము. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవనుటలో సందియము లేదు (27).వత్సా!నేను నీకు నిశ్చయముగా హితమును చెప్పెదను. వినుము. నీకు నరకము సంప్రాప్తము కాదు. శివుడు నీకు మంగళమును చేయగలడు (28). నీవు గర్వముచే మోహితుడవై శివుని వచనమును అవమానించితివి. కర్మఫలములనిచ్చు శివుడు నీకీ ఫలమునిచ్చినాడు (29). సర్వము శివుని ఇచ్ఛచేతనే సంభవించునని నీవు మనస్సులో నిర్ణయించుకొనుము. శంకరస్వామి గర్వమును పోగొట్టును. ఆయనయే పరమేశ్వరుడు (30), పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానందస్వరూపుడు, నిర్గుణుడు, వికార రహితుడు, రజస్సత్త్వ తమోగుణాతీతుడు (31).

స ఏవమాదాయ మాయాం స్వాం త్రిధా భవతి రూపతః | బ్రహ్మ విష్ణుమహేశాత్మా నిర్గుణోs నిర్గుణోsపి సః || 32

నిర్గుణత్వే శివాహ్వో హి పరమాత్మా మహేశ్వరః | పరం బ్రహ్మావ్యయోsనంతో మహాదేవేతి గీయతే || 33

తత్సేవయా విధిస్స్రష్టా పాలకో జగతామహమ్‌ | స్వయం సర్వస్య సంహారీ రుద్రరూపేణ సర్వదా || 34

సాక్షీ శివస్వరూపేణ మాయా భిన్నస్స నిర్గుణః |స్వేచ్ఛాచారీ సంవిహారీ భక్తానుగ్రహకారకః || 35

ఆయన మాయను ఈ విధముగా తన వశము చేసుకొని, బ్రహ్మవిష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల రూపములో నుండును. సగుణుడు, నిర్గుణుడు కూడా ఆయనయే (32). నిర్గుణుడగు పరమాత్మకు శివుడని పేరు. ఆయనయే మహేశ్వరుడు, పరబ్రహ్మ, అవ్యయుడు,అనంతుడు, మహాదేవుడు అని కీర్తింపబడును (33). శివుని సేవించి బ్రహ్మ సృష్టికర్త అయినాడు. నేను జగద్రక్షకుడనైతిని. శివుడు స్వయముగా రుద్రరూపుడై సర్వమును సంహరించును (34). పరమాత్మ శివస్వరూపములో సాక్షియై ఉండును. నిర్గుణుడగు పరమాత్మకు, మాయకు భేదము లేదు. ఆయన స్వేచ్ఛగా విహరించును. ఆయన భక్తులననుగ్రహించును (35).

శృణు త్వం నారదమునే సదుపాయం సుఖప్రదమ్‌ | సర్వపాపా పహర్తారం భుక్తిముక్తి ప్రదం సదా || 36

త్యక్త్వా స్వసంశయం సర్వం శంకరసద్యశః | శతనామ శివస్తోత్రం సదానన్యమతిర్జప || 37

యజ్ఞపిత్వా ద్రుతం సర్వం తవ పాపం వినశ్యతి | ఇత్యుక్త్వా నారదం విష్ణుః పునః ప్రాహదయాన్వితః || 38

మునే న కురు శోకం త్వం త్వయా కించిత్‌ కృతం న హి | స్వేచ్ఛయా కృతవాన్‌ శంభురిదం సర్వం న సంశయః || 39

ఓ నారదమహర్షీ! సర్వపాపములను పోగొట్టి సుఖమునిచ్చునది, సర్వదా భుక్తిని ముక్తిన ఇచ్చునది యగు మంచి ఉపాయమును నీవు వినుము (36). నీవు నీ సందేహముల నన్నిటినీ విడనాడి, శంకరుని యశస్సును గానము చేయుము. నీవు మనస్సును లగ్నముచేసి, సర్వదా శివశతనామ స్తోత్రమును జపించుము (37). దానిని జపించినచో నీ పాపము వెనువెంటనే నశించును. అని నారదునకు బోధించి, దయామయుడగు విష్ణువు మరల ఇట్లు అనుచున్నాడు (38). ఓ మహర్షీ! నీవు శోకించకుము. నీవు చేసిన దేమియూ లేదు. దీని నంతనూ శంభువు తన ఇచ్ఛ చేతనే నడిపించినాడనుటలో సందియము లేదు (39).

అహార్షీత్త్వన్మతిం దివ్యాం కామక్లేశమదాత్స తే | త్వన్ము ఖాద్దాపయాంచక్రే శాపం మే స మహేశ్వరః || 40

ఇత్థం స్వచరితం లోకే ప్రకటీ కృతవాన్‌ స్వయమ్‌ | మృత్యుంజయః కాలకాలో భక్తోద్ధారపరాయణః || 41

న మే శివసమానోsస్తి ప్రియస్స్వామీ సుఖప్రదః | సర్వశక్తి ప్రోదో మేsస్తి స ఏవ పరమేశ్వరః || 42

తస్యో పాస్యాం కురు మునే తమేవ సతతం భుజ | తద్యశః శృణు గాయ త్వం కురు నిత్యం తదర్చనమ్‌ || 43

నీ మనస్సులో కామము, చిత్తమలములు, గర్వము ప్రవేశించినవి. అందువలననే ఆయన నీ దివ్యమగు బుద్ధిని అపహరించినాడు. ఆ మహేశ్వరుడే నోటినుండి నాకు శాపము నిప్పించినాడు (40). మృత్యువును జయించిన వాడు, మృత్యువునకు మృత్యువు, భక్తులను ఉద్ధరించుటయే ప్రధానలక్ష్యముగా గలవాడు నగు శివుడు తన చరితమును తానే లోకములో ప్రకటించినాడు (41).నాకు శివునితో సమముగా సుఖములనిచ్చు ప్రభువు మరియొకడు లేడు. ఆ పరమేశ్వరుడే నాకు శక్తులనన్నింటినీ ఇచ్చినాడు (42). ఓ మహర్షీ! నీవా శివుని ఉపాసించుము. సర్వదా శివుని మాత్రమే భజించుము. శివుని కీర్తిని వినుము, పాడుము. నిత్యము శివుని పూజింపుము (43).

కాయేన మనసా వాచా యశ్శంకరముపైతి భోః | స పండిత ఇతి జ్ఞేయస్స జీవన్ముక్త ఉచ్యతే || 44

శివేతి నామ దావాగ్నే ర్మహాపాతక పర్వతాః | భస్మీ భవన్త్య నాయాసా త్సత్యం సత్యం న సంశయః|| 45

పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి తాన్యతః | శివార్చనైక నశ్యాని నాన్యనశ్యాని సర్వథా || 46

స వైదికస్స పుణ్యాత్మా సధన్యస్స బుధో మునే | యస్సదా కాయవాక్చితై శ్శరణం యాతి శంకరమ్‌ || 47

ఓయీ! శరీరముతో, మనస్సుతో, వాక్కుతో, ఎవడు శంకరుని భజించునో, వాడే పండితుడని తెలియవలెను. అతడే జీవన్ముక్తుడనబడును (44). శివనామము అనే దావాగ్ని మహాపాతములనే పర్వతములను బూడిత చేయును. ఇది సత్యము. నిస్సంశయముగా సత్యము (45). వివిధ దుఃఖములకు పాపములే కారణము. అవి శివార్చన చేత మాత్రమే నశిస్తాయి. అవి నశించు మార్గము మరియొకటి లేనే లేదు (46). ఓ మహర్షీ! ఎవడైతే సర్వదా శరీరముతో, వాక్కుతో, మనస్సుతో శంకరుని శరణు వేడునో, వాడే వైదికుడు; వాడే పుణ్యాత్ముడు; వాడే ధన్యుడు; వాడే పండితుడు (47).

భవంతి వివిధా ధర్మా యేషాం సద్యః ఫలోన్ముఖాః | తేషాం భవతి విశ్వాసస్త్రి పురాంతక పూజనే || 48

పాతకాని వినశ్యంతి యావంతి శివ పూజయా | భువి తావంతి పాపాని న సంత్యేవ మహామునే || 49

బ్రహ్మ హత్యాది పాపానాం రాశ##యేsప్యమితా మునే | శివస్మృత్యా వినశ్యంతి సత్యం సత్యం వదామ్యహమ్‌ || 50

శివనామతరీం ప్రాప్య సంసారాబ్ధిం తరంతి తే | సంసారమూలపాపాని తస్య నశ్యంత్య సంశయమ్‌ || 51

త్రిపురములను నశింపజేసిన శివుని పూజయందు శ్రద్ధ గలవారు ఆచరించే ధర్మములు వెంట వెంటనే ఫలములనిచ్చును (48).ఓ మహర్షీ! శివపూజచే ఎన్ని పాపములు నశించునో, అన్ని పాపములు భూలోకములో లేనే లేవు (49). ఓ మహర్షీ! బ్రహ్మ హత్యాది పాపముల అంతులేని రాశులైననూ శివస్మరణచేత నశించును. నేను ముమ్మాటికి సత్యమును పలుకు చున్నాను (50). శివనామము అనే నావను ఆశ్రయించిన వారి సంసారమూల భూతము లైన పాపము లన్నియూ నశించి, వారు సంసారసముద్రమును దాటుదురు. ఇది నిశ్చయము (51).

సంసారమూలభూతానాం పాతకాం మహా మునే | శివనామకుఠారేణ వినాశో జాయతే ధ్రువమ్‌ || 52

శివనామామృతం పేయం పాపదావానలార్దితైః | పాపదావాగ్ని తప్తానాం శాంతిస్తేన వినా న హి || 53

శివేతి నామపీయూష వర్ష ధారా పరిప్లుతః | సంసారదవమధ్యేsపి న శోచతి న సంశయః || 54

న భక్తి శ్శంకరే పుంసాం రాగద్వేషరతాత్మనామ్‌ | తద్విధానాం హి సహసా ముక్తి ర్భవతి సర్వథా || 55

ఓ మహర్షీ! సంసారమునకు మూలమైన పాపములు శివనామమే గొడ్డలిచే నశించుట నిశ్చయము (52).పాపమనే దావాగ్నిచే పీడింపబడు మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే పీడింప బడు వారికి శివనామము లేకుండా శాంతి లేదు (53). శివనామమనే అమృతవర్షధారతో తడిసిన మానవుడు సంసారమనే దావాగ్ని మధ్యలో నున్ననూ దుఃఖించడు. దీనిలో సందేహము లేదు (54). రాగ ద్వేషముల యందు సక్తమైన అంతః కరణముగల వారికి శంకరుని యందు భక్తు కుదరదు. శంకరుని యందు భక్తి కుదిరిన మానవులకు శీఘ్రముగా మోక్షము లభించును (55).

అనంత జన్మభిర్యేన తపస్తప్తం భవిష్యతి | తసై#్యవ భక్తిర్భవతి భవానీ ప్రాణవల్లభే || 56

జాతాపి శంకరే భక్తి రస్య సాధారణీ వృథా | పరం త్వవ్యభి చారేణ శివభక్తిరపేక్షితా || 57

యస్యా సాధారణీ శంభౌ భక్తి రవ్యభిచారిణీ | తసై#్యవ మోక్షస్సులభో నాన్యస్యేతి మతిర్మమ || 58

కృత్వాప్యనంతపాపాని యది భక్తిర్మహేశ్వరే | సర్వపాప వినిర్ముక్తో భవత్యేవ న సంశయః || 59

భవంతి భస్మ సాద్యృక్షా దవదగ్ధా యథా వనే | తథా భవంతి దగ్ధాని శంకరాణా మఘాన్యపి || 60

అనంత జన్మల యందు తపము నాచరించిన వానికి మాత్రమే భవానీదేవి యొక్క ప్రాణవల్ల భుడగు శంకరుని యందు భక్తి కుదురును (56). సంసారములోని ఇతర వస్తువులతో సమానముగా శంకరుని యందు భక్తి కుదిరినా, అది వ్యర్థము . శివుని యందు అచంచలమైన పరాభక్తి మోక్షసాధనమగును (57). ఎవనికి శంభుని యందు అచంచల, అసాధారణ భక్తి కుదురునో, వానికి మాత్రమే మోక్షము సులభముగా లభించునని నా అభిప్రాయము (58). అనంత పాపములను చేసిన వాడైననూ మహేశ్వరుని యందు భక్తి గలవాడైనచో, ఆపాపములన్నియూ తొలగిపోవుననుటలో సందేహము లేదు (59).వనములో వృక్షములు దావాగ్ని చే దగ్ధమైన తీరున, శంకర భక్తుల పాపములన్నియు దగ్ధములగును (60).

యో నిత్య భస్మపూతాంగో శివపూజోన్ముఖో భ##వేత్‌ | స తరత్యేవ సంసార మపారమతి దారుణమ్‌ || 61

బ్రహ్మ స్వహరణం కృత్వా హత్వాపి బ్రాహ్మణాన్‌ బహూన్‌ | న లిప్యతే నరః పాపైర్విరూపాక్షస్య సేవకః || 62

విలోక్య వేదానఖిలాన్‌ శివసై#్యవార్చనం పరమ్‌ | సంసారనాశనోపాయ ఇతి పూర్వైర్వినిశ్చితమ్‌ || 63

అద్యప్రభృతి యత్నేన సావధానో యథా విధి | సాంబం సదాశివం భక్త్యా భజ నిత్యం మహేశ్వరమ్‌ || 64

ఆపాద మస్తకం సమ్యక్‌ భస్మనోద్ధూల్య సాదరమ్‌ | సర్వశ్రుతిశ్రుతం శైవం మంత్రం జప షడక్షరమ్‌ || 65

ఎవడైతే ప్రతిదినము భస్మచే పవిత్రమైన దేహము గలవాడై, శివపూజా తత్పరుడై యుండునో, వాడు అనంతమైన, మిక్కిలి భయంకరమైన సంసార సముద్రమును నిశ్చయముగా తరించగల్గును (61). ముక్కంటి దేవుని పూజించు భక్తునకు బ్రాహ్మణ ద్రవ్యాపహరణము వలన కలిగే పాపము, మరియు అనేక బ్రహ్మ హత్యల పాపము కూడ అంటవు (62). పూర్వము ఋషులు వేదములనన్నిటినీ పరిశీలించి, శివార్చనమే సర్వోత్కృష్టమగు సంసారతరణ సాధనమని తేల్చిరి. (63). నీవు ఈనాటి నుండి సావధానుడవై ప్రయత్న పూర్వకముగా ప్రతిదినము యథావిధిగా భక్తితో సాంబ సదాశివుని భజించుము (64). పాదములనుండి తల వరకు భస్మను శ్రద్ధతో చక్కగా ధరించి, సర్వవేద ప్రతిపాదితమైన'నమశ్శివాయ' అను మంత్రమును జపించుము (65).

సర్వాంగేషు ప్రయత్నేన రుద్రాక్షాన్‌ శివవల్లభాన్‌ | ధారయస్వాతి సద్భక్త్యా సమంత్రం విధిపూర్వకమ్‌ || 66

శృణుశైవీం కథాం నిత్యం వద శైవీం కథాం సదా | పూజయస్వాతియత్నేవ శివభక్తాన్‌ పునః పునః || 67

అప్రమాదేన సతతం శివైక శరణో భవ | శివార్చనేన సతతమానందః ప్రాప్యతే యతః || 68

ఉరస్యాధాయ విశ##దే శివస్య చరణాంబుజౌ | శివ తీర్థాని వచర ప్రథమం ముని సత్తమ || 69

శివునకు ప్రీతికరములగు రుద్రాక్షలను మిక్కిలి భక్తితో ప్రయత్నపూర్వకంగా మంత్రముతో యథావిధిగా అన్ని అవయవముల యందు ధరించుము (66). నిత్యము శివగాథను వినుము. సదా శివగాథను చెప్పుము. శివభక్తులను మరల మరల ప్రత్యేక శ్రద్ధతో పూజింపుము (67). సర్వకాలముల యందు అప్రమత్తుడవై శివుని శరణు వేడుము. శివుని అర్చించినచో నిత్యానందము లభించును (68). ఓ మహర్షీ! శివ పాదుకలను స్వచ్ఛమగు వక్షస్థ్సలమునందు ధరించి ముందుగా శివతీర్థములను దర్శించుము (69).

పశ్యన్‌ మాహాత్మ్య మతులం శంకరస్య పరాత్మనః | గచ్ఛానందవనం పశ్చాచ్ఛంభు ప్రియతమం మునే || 70

తత్ర విశ్వేశ్వరం దృష్ట్వా పూజనం కురు భక్తితః | నత్వా స్తుత్వా విశేషేణ నిర్వికల్పో భవిష్యసి || 71

తతశ్చ భవతా నూనం విధేయం గమనం మునే | బ్రహ్మలోకే స్వకామార్ధం శాసనాన్మమ భక్తితః || 72

నత్వా స్తుత్వా విశేషేణ విధిం స్వజనకం మునే | ప్రష్టవ్యం శివమహాత్మ్యం బహుశః ప్రీత చేతసా || 73

పరమాత్మయగు శంకరుని సాటిలేని మహిమను యెరుంగుము. ఓ మహర్షీ! తరువాత శంకరునకు మిక్కిలి ప్రియమైన కాశీనగరమునకు వెళ్లుము (70).అచట విశ్వేశ్వరుని దర్శించి, భక్తితో పూజించి, నమస్కరించి, విశేషముగా స్తుతించుము. నీ సందేహములన్నియూ తొలగిపోవును (71).ఓమహర్షీ! తరువాత నీవు నాయాజ్ఞాను సారముగా బ్రహ్మలోకమునకు వెళ్లుము. అచట నీ కోరిక తీర గలదు (72). హే మునే ! నీ తండ్రియగు బ్రహ్మకు నమస్కరించి ఆనందముతో నిండిన మనస్సుతో శివుని మహాత్మ్యమును విస్తారముగా అడిగి తెలుసుకొనుము(73).

సశైవ ప్రవరో బ్రహ్మా మహాత్మ్యం శంకరస్య తే | శ్రావయిష్యతి సుప్రీత్యా శతనామస్తవం చ హి || 74

అద్యతస్త్వం భవ మునే శైవశ్శివ పరాయణః | ముక్తి భాగీ విశేషేణ శివస్తే శం విధాస్యతి || 75

ఇత్థం విష్ణుర్మునిం ప్రీత్యా హ్యుపదిశ్య ప్రసన్నధీః | స్మృత్వా నుత్వా శివం స్తుత్వా తతస్త్వంతరధీయత || 76

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే నారదస్య విష్ణూపదేశ వర్ణనం నామ చతుర్ధోSధ్యాయః (4).

శైవులలో శ్రేష్ఠుడగు ఆ బ్రహ్మదేవుడు నీకు శంకరుని శతనామస్తోత్రమును మిక్కిలి ప్రీతితో వినిపించగలడు (74). ఓమహర్షీ! ఈనాటినుండియు నీవు శివుని శ్రద్ధతో పూజించి, శైవుడవు కమ్ము. అట్లు చేయుటవలన నీవు మోక్షమును పొందగలవు. శివుడు నీకు మంగళమును చేయగలడు (75). ప్రసన్నమగు మనస్సు గల విష్ణువు నారదునకు ఇట్లు ప్రీతితో ఉపదేశించి, శివుని స్మరించి నమస్కరించి, స్తుతించి,తరువాత అంత ర్ధానమయ్యెను (76).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందలి మొదటి ఖండమైన సృష్ట్యు పాఖ్యానములో నారదునకు విష్ణువు ఉపదేశించుట అను నాల్గవ అధ్యాయము ముగిసెను (4).

Sri Sivamahapuranamu-I    Chapters