Sri Sivamahapuranamu-I    Chapters   

అథ తృతీయోsధ్యాయః

సాధ్యసాధన విచారము - శ్రవణ మనన కీర్తనములు

వ్యాస ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచ స్సౌతం ప్రోచుస్తే పరమర్షయః | వేదాంతసార సర్వస్వం పురాణం శ్రావయాద్భుతమ్‌ || 1

ఇతి శ్రుత్వా మునీనాం స వచనం సుప్రహర్షితః | సంస్మరన్‌ శంకరం సూతః ప్రోవాచ మునిసత్తమాన్‌ || 2

వ్యాసుడు ఇట్లు పలికెను-

సూతుని ఈ పలుకులను విని ఆ మహర్షులు 'ఉపనిషత్సారము నంతనూ తనలో కలిగియున్న ఆ అద్భుతమగు పురాణమును వినిపింపుము' అని కోరిరి (1). మహర్షుల ఈ మాటను విని ఎంతయో సంతసిల్లిన సూతుడు శంకరుని స్మరించుచూ, ఆ ముని శ్రేష్ఠులతో నిట్లనెను (2).

సూత ఉవాచ |

శృణ్వంతు ఋషయస్సర్వే స్మృత్వా శివమనామయమ్‌ | పురాణ ప్రవరం శైవం పురాణం వేదసారజమ్‌ || 3

యత్ర గీతం త్రికం ప్రీత్యా భక్తి జ్ఞాన విరాగకమ్‌ | వేదాంత వేద్యం సద్వస్తు విశేషేణ ప్రవర్ణితమ్‌ || 4

సూతుడిట్లు పలికెను -

ఋషులందరు మంగళ స్వరూపుడగు శివుని స్మరించి, వేదము యొక్క సారరూపముగా పుట్టిన, పురాణశ్రేష్ఠమైన శివపురాణమును వినెదరు గాక! (3). దీనియందు భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మరియు ఉపనిషత్తుల యందు నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపము ప్రత్యేకముగా వర్ణింపబడినవి (4).

పురా కాలేన మహతా కల్పేsతీతే పునః పునః | అస్మిన్నుపస్థితే కల్పే ప్రవృత్తే సృష్టికర్మణి || 5

మునీనాం షట్‌ కులీనానాం బ్రువతా మితరే తరమ్‌ | ఇదం పరమిదం నేతి వివాద స్సుమహాన భూత్‌ || 6

తేsభి జగ్ముర్విధా తారం బ్రహ్మాణం ప్రష్టు మవ్యయమ్‌ | వాగ్భిర్వినయ గర్భాభి స్సర్వే ప్రాంజలయోsబ్రువన్‌ || 7

త్వం హి సర్వజగద్ధాతా సర్వకారణ కారణమ్‌ | కః పుమాన్‌ సర్వతత్త్వేభ్యః పురాణః పరతః పరః || 8

చాలకాలము క్రిందట పూర్వకల్పము గడచి, ప్రస్తుత కల్పము ఆరంభమయ్యెను. సృష్టికార్యము ప్రారంభ##మైన ఆ సమయములో (5), ఆరు సముదాయములకు చెందిన ఋషుల మధ్య ఒకరితో మరియొకరికి 'ఇది గొప్పది; ఇది గొప్పది కాదు' అంటూ వివాదము కలిగెను (6). అపుడు వారు నాశరహితుడగు బ్రహ్మగారిని ప్రశ్నించుటకు ఆయన వద్దకు వెళ్లి, చేతులు జోడించి, వినయముతో నిండిన పలుకులతో నిట్లనిరి (7). 'నీవు సర్వజగత్తును సృష్టించినవాడవు. కారణముల కన్నిటికీ కారణమైనవాడవు. అన్ని తత్త్వముల కంటె పూర్వము నందున్నవాడు, సర్వోత్కృష్టమగు అవ్యక్తము కంటె ఉత్కృష్టమైన పురుషుడు ఎవ్వరు?'

బ్రహ్మోవాచ |

యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ | యస్మాత్సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పుర్వకమ్‌ || 9

సహ భూతేంద్రియై స్సర్వైః ప్రథమం సంప్రసూయతే | ఏష దేవో మహాదేవః సర్వజ్ఞో జగదీశ్వరః || 10

అయం తు పరయా భక్త్యా దృశ్యతే నాsన్యథా క్వచిత్‌ | రుద్రో హరిర్హరశ్చైవ తథాన్యే చ సురేశ్వరాః || 11

భక్త్యా పరమయా తస్య నిత్యం దర్శనకాంక్షిణః | బహునాత్ర కిముక్తేన శివే భక్త్యా విముచ్యతే || 12

ఎవనిని వర్ణించుటలో విఫలమై వాక్కు వెనుకకు మరలునో; ఎవడు (అసంస్కృతమగు) మనస్సునకు కూడ అందడో; సృష్ట్యాది యందు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాది దేవతలతో (9) , పంచభూతములతో, ఇంద్రియములతో కూడిన ఈ సమస్త జగత్తు ఎవని నుండి ఉద్భవించుచున్నదో , అట్టి దైవము మహాదేవుడు. ఆయన సర్వజ్ఞుడు; జగత్ప్రభువు (10). పరాభక్తితో ఆయనను దర్శించుట సంభవమే. ఆయనను దర్శించుటకు మరో మార్గము లేదు. రుద్రుడు, విష్ణువు మొదలగు దేవతలు (11) పరాభక్తిని కలిగి, నిత్యము ఆయన దర్శనమును కోరుచుందురు. ఇన్ని మాటలేల? శివుని యందు భక్తి ఉన్నచో, మోక్షము కలుగును (12).

ప్రసాదాద్దేవతా భక్తిః ప్రసాదో భక్తి సంభవః | యథేహాంకురతో బీజం బీజతో వా యథాంకురః || 13

తస్మాదీశ ప్రసాదార్థం యూయం గత్వా భు వం ద్విజాః | దీర్ఘ సత్రం సమాకృధ్వం యూయం వర్ష సహస్రకమ్‌ || 14

అముషై#్య వాధ్వరేశస్య శివసై#్యవ ప్రసాదతః | వేదోక్త విద్యాసారం తు జ్ఞాయతే సాధ్యసాధనమ్‌ || 15

లోకములో అంకురము నుండి బీజము, బీజము నుండి అంకురము పుట్టుతీరున, దేవానుగ్రహము నుండి భక్తి, భక్తి నుండి దేవానుగ్రహము పుట్టును (13). కావున, ఓ ద్విజులారా! మీరు భూలోకమునకు వెళ్లి, ఈశ్వరుని అనుగ్రహము కొరకై, వేయి సంవత్సరముల దీర్ఘ సత్రయాగము ననుష్ఠించుడు (14). యజ్ఞేశ్వరుడగు ఈ శివుని అనుగ్రహము వలన మాత్రమే వేదవిద్య యొక్క సారభూతమైన సాధ్యసాధనములు తెలియబడును (15).

మునయ ఊచుః |

అథ కిం పరమం సాధ్యం కిం వా తత్సాధనం పరమ్‌ | సాధకః కీదృశస్తత్ర తదిదం బ్రూహి తత్త్వతః || 16

మునులు ఇట్లు పలికిరి-

సర్వ శ్రేష్ఠమగు సాధ్యము ఏది ? ఆ సాధ్యమును పొందించే శ్రేష్ఠమగు సాధనము ఏది? ఆ సాధ్యమును గోరు సాధకుడు ఎట్లుండును? మాకీ సాధనా స్వరూపమును చెప్పుము (16).

బ్రహ్మోవాచ |

సాధ్యం శివపద ప్రాప్తిః సాధనం తస్య సేవనమ్‌ | సాధకస్తత్ర్పసాదాద్యోsనిత్యాది ఫల నిస్స్పృహః || 17

కర్మ కృత్వాతు వేదోక్తం తదర్పిత మహాఫలమ్‌ | పరమేశ పదప్రాప్తః సాలోక్యాది క్రమాత్త తః || 18

తత్త ద్భక్త్యనుసారేణ సర్వేషాం పరమం ఫలమ్‌ | తత్సాధనం బహువిధం సాక్షాదీశేన బోధితమ్‌ || 19

సంక్షిప్య తత్ర వస్సారం సాధనం ప్రబ్రవీమ్యహమ్‌ | శ్రో త్రేణ శ్రవణం తస్య వచసా కీర్తనం తథా || 20

మనసా మననం తస్య మహాసాధన ముచ్యతే | శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ మంతవ్యశ్చ మహేశ్వరః || 21

బ్రహ్మ యిట్లు పలికెను -

శివ పదమును పొందుట సాధ్యము. శివుని సేవయే సాధనము. శివుని అనుగ్రహముచే అనిత్యములగు ఫలముల యందు కామన లేని వ్యక్తియే సాధకుడు (17). మానవుడు వేదవిహిత కర్మను ఆచరించి, దాని మహాఫలమును శివునకు అర్పించి, సాలోక్యము, సామీప్యము ఇత్యాది క్రమములో పరమేశ్వరుని పదమును పొందును (18). మానవులందరికి వారి వారి భక్తిని బట్టి ఆయా గొప్ప ఫలములు లభించును. ఈ భక్తిలో బహువిధ సాధనములు గలవు. వాటిని సాక్షాత్తుగా ఈశ్వరుడే బోధించినాడు (19). వాటిని కుదించి నేను మీకు సారభూతమైన సాధనమును చెప్పెదను. చెవులతో శివుని మహిమను వినుట, వాక్కుతో శివుని కీర్తించుట(20), మరియు మనస్సుతో శివుని ధ్యానిం చుట అను ఈ మూడు కలిసి మహాసాధన మనబడును. మహేశ్వరుని మహిమలను వినాలి; కీర్తించాలి; మరియు ధ్యానించాలి (21).

ఇతి శ్రుతి ప్రమాణం నః సాధనేనామునా పరమ్‌ | సాధ్యం వ్రజత సర్వార్థ సాధనైక పరాయణాః || 22

ప్రత్యక్షం చక్షుషా దృష్ట్వా తత్ర లోకః ప్రవర్తతే | అప్రత్యక్షం హి సర్వత్ర జ్ఞాత్వా శ్రోత్రేణ చేష్టతే || 23

తస్మాచ్ఛ్రవణమేవాదౌ శ్రుత్వా గురుముఖాద్బుధః | తతస్సంసాధయే దన్యత్‌ కీర్తనం మననం సుధీః || 24

క్రమాన్మనన పర్యంతే సాధనేsస్మిన్‌ సుసాధితే | శివయోగో భ##వేత్తేన సాలోక్యాది క్రమాచ్ఛనైః || 25

సర్వాంగవ్యాధయః పశ్చాత్సర్వా నందశ్చ లీయతే | అభ్యాసాత్‌ క్లేశ##మేతద్వై పశ్చాదాద్యంతమంగలమ్‌ || 26

ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితా యాం సాధ్యసాధన ఖండే తృతీయోsధ్యాయః (3)

ఈ విషయములో మనకు వేదమే ప్రమాణము. మీరు ఈ సాధనముతో సర్వోత్కృష్ట మగు సాధ్యమును పొందుడు. సర్వపురుషార్థముల నొసగే ఈ ఏకైక సాధనమును తత్పరతతో అనుష్ఠించుడు (22). మానవుడు ముందుగా ఒక వస్తువును కంటితో చూచి, తరువాత దాని యందు ప్రవర్తించును. కంటికి కనబడని వాటి గురించి చెవితో విని తదనుగుణముగా చేష్టను చేయును (23). అదేవిధముగా, విద్వాంసుడు ముందుగా గురుముఖము నుండి శ్రవణమును చేసి, తరువాత శ్రద్ధతో కీర్తనమును, మననమును చేయవలెను (24). ఈ విధముగా మననము వరకు గల ఈ సాధనమును బాగుగా అభ్యసించిన భక్తుడు కొంత కాలము తరువాత సాలోక్య సారూప్యాది వరుసలో శివునితో ఐక్యమును చెందును (25). ఈ సాధనము వలన దేహములోని అన్ని అవయవముల రోగములు నశించును. లౌకికానందములు లీనమగును. ఈ అభ్యాసము తొలుత కష్టముగ నున్ననూ, ఆది నుండి అంతము వరకు మంగళముల నిచ్చును (26).

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో మూడవ అధ్యాయము ముగిసినది.

Sri Sivamahapuranamu-I    Chapters