Sri Sivamahapuranamu-I
Chapters
అథ షష్ఠోsధ్యాయః విష్ణువు జన్మించుట బ్రహ్మోవాచ | భో బ్రహ్మాన్ సాధు పృష్టోsహం త్వయా విబుధసత్తమ | లోకోపకారిణా నిత్యం లోకానాం హితకామ్యయా ||
1 యచ్ఛ్రుత్వా సర్వలోకానాం సర్వపాపక్షయో భ##వేత్ | తదహం తే ప్రవక్ష్యామి శివతత్త్వ మనామయమ్ ||
2 శివతత్త్వం మయా నైవ విష్ణునాపి యథార్ధతః | జ్ఞాతం చ పరమం రూపమద్భుతం చ పరేణ న ||
3 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! నీవు గొప్ప విద్వాంసుడవు. నిత్యము లోకుల హితమును గోరి, లోకమునకు ఉపకారము చేసే నీవు నన్ను చక్కగా ప్రశ్నించితివి (1).నేను నీకు చెప్పబోవు నిర్దోషమగు శివతత్త్వమును విన్న మానవులందరి పాపములన్నియూ నశించును (2).శివతత్త్వమును నేను గాని, విష్ణువుగాని సమగ్రముగా నెరుంగము. అది సర్వోత్కృష్టమైనది, అద్భుతమైనది, ఇతరులకు తెలియరానిది (3). మహాప్రలయకాలే చ నష్టే స్థావర జంగమే | ఆసీత్తమోమయం సర్వమనర్క గ్రహతారకమ్ ||
4 అచంద్రమనహోరాత్ర మనగ్న్య నిలభూజలమ్ | అప్రధానం వియాచ్ఛూన్య మన్యతేజో వివర్జితమ్ ||
5 అదృష్టత్వాదిరహితం శబ్ద స్పర్శనముజ్ఘితమ్ | అవ్యక్త గంధరూపం చ రసత్యక్తమది జ్మఖమ్ ||
6 ఇత్థం సత్యంధ తమసే సూచీభేద్యే నిరంతరే | తత్సద్బ్రహ్మేతి యచ్ఛ్రుత్యా సదేకం ప్రతిపద్యతే ||
7 మహా ప్రలయము సంభవించిన కాలములో చరాచరజగత్తు నశించగా, సర్వము చీకటిమయముగా నుండెను. సూర్యుడు, గ్రహములు, నక్షత్రములు లేకుండెను (4). చంద్రుడు, రాత్రింబగళ్లు, అగ్ని, వాయువు, భూమి, జలము, అవ్యక్త తత్త్వము, ఇతర తేజస్సులు లేకుండెను. ఆకాశము శూన్యముగ నుండెను (5). అదృష్టము మొదలైనవి లేకుండెను. శబ్ద, స్పర్శ, గంధ, రూప, రసములు లేకుండెను. దిగ్విభాగము లెకుండెను (6).ఈ విధముగా సూదితో పొడుచుటకు శక్యమా అన్నట్లు ఉన్న దట్టమైన కటిక చీకటి మాత్రమే ఉండెను. 'తత్సద్బ్రహ్మ' అను శ్రుతిచే ప్రతిపాదింపబడే సత్తు ఒక్కటి మాత్రమే ఉండెను (7). ఇతీదృశం యదా నాసీద్యత్తత్సదసదాత్మకమ్ | యోగినోంsతర్హితాకాశే యత్పశ్యంతి నరంతరమ్ ||
8 అమనోగోచరం వాచాం న కదాచన | అనామరూపవర్ణం చ న స్థూలం న చ యత్కృశమ్ ||
9 అహ్రస్వ దీర్ఘమలఘు గురుత్వపరివర్జితమ్ | న యత్రోపచయః కశ్ఛిత్తథా నాపచయోsపి చ || 10 అభిధత్తే స చకితం యదస్తీతి శ్రుతిః పునః |సత్యం జ్ఞానమనంతం చ పరానందం పరం మహః || 11 ఇది, ఇట్టిది, ఏది, అది ఇత్యాది మూర్తామూర్తాత్మకమగు జగత్తు ఆ సమయములో లేకుండెను. అప్పుడు ఉన్న పరబ్రహ్మమును యోగులు హృదయాకాశములో సర్వదా దర్శించెదరు (8). అది మనస్సునకు గోచరముకాదు. వాక్కునకెన్నడూ విషయము కాదు. దానికి నామరూపములు, వర్ణము (రంగు, బ్రాహ్మణాది భేదము) లేవు. అది స్థూలము కాదు. కృశించినది కాదు (9). పొట్టికాదు, పొడుగు కాదు, తేలిక కాదు. బరువు కాదు. దానియందు పెరుగుదల లేదు. తగ్గుదల లేదు (10). సత్య జ్ఞానా నంత స్వరూపము, పరమానంద ఘనము, పరంజ్యోతిరూపమునగు, ఆ పరబ్రహ్మను గురించి, విస్మయావిష్టమగు శ్రుతి 'అస్తి (ఉన్నది)' అని మాత్రమే చెప్ప గల్గుచున్నది (11). అప్రమేయమనాధారమవికారమనాకృతి |నిర్గుణం యోగిగమ్యం చ సర్వవ్యాప్యేక కారణమ్ || 12 నిర్వికల్పం నిరారంభం నిర్మాయం నిరుపద్రవమ్ | అద్వితీయనమనాద్యంత మవికారం చిదాత్మకమ్ || 13 యస్యేత్థం సంవికల్పంతే సంజ్ఞాసంజ్ఞోక్తితస్స్మ వై | కియతా చైవ కాలేన ద్వితీయేచ్ఛాsభవత్కిల || 14 అమూర్తేన స్వమూర్తిశ్చ తేనాకల్పి స్వలీలయా | సర్వైశ్వర్యగుణోపేతా సర్వజ్ఞాన మయూ శుభా || 15 పరబ్రహ్మ ప్రమాణగోచరము కాదు.అన్యముపై ఆధారపడదు.అది వికారములు లేనిది. ఆకారము లేనిది. గుణములు లేనిది. సర్వవ్యాపకము, జగత్తునకు ఏకైకకారణమగు పరబ్రహ్మను యోగులు పొందగల్గుదురు (12). అది వికల్పములు లేనిది. అది లేనిది మాయా ప్రభావములేనిది. ఉపద్రవములు లేనిది. బ్రహ్మము కంటె భిన్నమైన ద్వితీయవస్తువు ఏదియూ లేదు. అది ఆద్యంతములు లేనిది. వికారములు లేనిది. అది చైతన్యఘనము (13). ఈ తీరున పరబ్రహ్మను గురించి స్వరూప, తటస్థ లక్షణములు ఊహింపబడును. అట్టి పరమాత్మకు చాలకాలము తరువాత ద్వైతమునందు ఇచ్ఛ కలిగెను (14).నిరాకారుడగు ఆ పరమాత్మ తన లీలచే, సర్వైశ్వర్యగుణములతో కూడిన, సర్వజ్ఞానయుతమైన, మంగళకరమగు స్వీయమూర్తిని కల్పించెను (15). సర్వగా సర్వరూపా చ సర్వదృక్సర్వకారిణీ | సర్వైకవంద్యా సర్వాద్యా సర్వదా సర్వసంస్కృతిః || 16 పరికల్ప్యేతి తాం మూర్తిమైశ్వరీం శుద్ధరూపిణీమ్ | అద్వితీయమనాద్యంతం సర్వాభావం చిదాత్మకమ్ || 17 అంతర్దధే పరాఖ్యం యద్బ్రహ్మ సర్వగమవ్యయమ్ | అమూర్తేః యత్పరాఖ్యం వై తస్య మూర్తి స్సదాశివః || 18 అర్వాచీనాః పరాచీనా ఈశ్వరం తం జగర్బుధాః | శక్తిస్తదైకలేనాపి సై#్వరం విహరతా తనుః || 19 స్వవిగ్రహాత్స్వయం సృష్టా స్వశరీరానపాయినీ | ఆ మూర్తి సర్వరూపములను ధరించినదై, సర్వమును పొంది, సర్వమును చూస్తూ, సర్వమును చేయును. సర్వులచే నమస్కరింపదగిన ఆమె సర్వమునకు ఆది; సర్వమును ఇచ్చును. అమోయే సర్వసంస్కృతులకు మూలము (16). ద్వితీయము లేనిది, ఆద్యంతములు లేనిది, సర్వమును ప్రకాశింపజేయు చిద్ఘనము, సర్వవ్యాపకము, వినాశము లేనిదియగు పరబ్రహ్మ శుద్ధరూపిణి, ఈశ్వరియగు ఆ మూర్తిని సృజించి అంతర్ధానము జెందెను (17). మూర్తి రహితమైన పరబ్రహ్మ యొక్క మూర్తియే సదాశివుడు (18).ఆయనయే ఈశ్వరుడని ప్రాచీన, ఆధునిక విద్వాంసులు వాక్రుచ్చినారు. ఏకాకియై స్వేచ్ఛగా సంచరించు సదాశివుడు (19) తన స్వరూపమునుండి తన కంటె భిన్నముకాని శక్తిని స్వయముగా సృష్టించెను. ప్రధానం ప్రకృతిం తాం చ మాయాం గుణవతీం పరామ్ || 20 బుద్ధి తత్త్వస్య జననీమాహుర్వికృతి వర్జితామ్ | సా శక్తి రంబికా ప్రోక్తా ప్రకృతిస్సక లేశ్వరీ || 21 త్రిదేవ జననీ నిత్యా మూలకారణమిత్యుత | అస్యా అష్టౌ భుజాశ్చాసన్ విచిత్ర వదనా శుభా || 22 రాకా చంద్ర సహస్రస్య వదనే భాశ్చ నిత్యశః | నానా భరణ సంయుక్తా నానాగతిసమన్వితా || 23 నానాయుధధరా దేవీ పుల్ల పంకజలోచనా |అచింత్య తేజసా యుక్తా సర్వయోనిస్సముద్యతా || 24 ఆమోయే ప్రధానము, ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక (20). పరాశక్తి, సమష్టి బు ద్దధితత్త్వమునకు జనవి, వికారము లేనిది యని ఋషులు చెప్పుదురు. ఆశక్తియే అంబిక, ప్రకృతి, సర్వమునకు ఈశ్వరియని చెప్పబడును (21). మరియు ఆమె బ్రహ్మ విష్ణురుద్రులకు జనని, నిత్య, మూల కారణము అని కూడ చెప్పబడెను. ఆమెకు ఎనిమిది భుజములు గలవు. ఆమె యొక్క మంగళకరమగు ముఖము అనేక రంగులతో శోభిల్లును (22). ఆమె ముఖములో అనంతపూర్ణిమా చంద్రుల కాంతి నిత్యము ప్రకాశించును. ఆమె అనేక ఆభరణములను ధరించును. ఆమె అనేక విధముల గతి కలది (23). అనేక ఆయుధములను ధరించే ఆ దేవి యొక్క నేత్రములు వికసించిన పద్మములవలె నుండును. ఆమె తేజస్సు ఊహకందనిది. ఉద్యమ శీలియగు ఆమెయే సర్వకారణము (24). ఏకాకినీ యదా మాయా సంయోగాచ్చాప్యనేకికా | పరః పుమా నీశ్వరస్స శివశ్శంభురనీశ్వరః || 25 శీర్షే మందాకినీధారీ భాలచంద్రస్త్రిలోచనః | పంచవక్త్రః ప్రసన్నాత్మా దశబాహుస్త్రి శూలధృక్ || 26 కర్పూర గౌరసుసితో భస్మోద్ధూలిత విగ్రహః |యుగపచ్చ తయా శక్త్యా సాకం కాలస్వరూపిణా || 27 శివలోకాభిధం క్షేత్రం నిర్మితం తేన బ్రహ్మాణా | తదేవ కాశికేత్యేత త్ర్పోచ్యతే క్షేత్రముత్తమమ్ || 28 ఆమెయ ఏకాకినియే అయిననూ, గుణ సంయోగముచే అనేకముగా అగును. ఆ సదాశివుడే పరమపురుషుడు. ఈశ్వరుడు, శివుడు, శంభువు. ఆయనకు ఈశ్వరులు లేరు (25).ఆయన తలపై మందాకినిని, ఫాలమునందు చంద్రుని ధరించును. ఆయన మూడు కన్నులు, అయిదు ముఖములు, పది చేతులు గలవాడు. ప్రసన్నమగు మనస్సు గలవాడు. ఆయన త్రిశూలమును ధరించును(26).ఆయన దేహము కర్పూరము వలె పచ్చగా, తెల్లగా నుండును. ఆయన దేహమంతటా భస్మను ధరించును. కాల స్వరూపుడగు అపర బ్రహ్మ శక్తితో బాటు (27).శివలోకమును క్షేత్రమును నిర్మించెను. ఆ ఉత్తమక్షేత్రమునకు కాశీ అను పేరు గలదు (28). పరం నిర్వాణ సంఖ్యానం సర్వోపరి విరాజితమ్ | తాభ్యాం చ రమణాభ్యాం చ తస్మిన్ క్షేత్రే మనోరమే || 29 పరమానందరూపాభ్యాం పరమానందరూపిణి | మునే ప్రలయకాలేsపి న తత్ క్షేత్రం కదాచన || 30 విముక్తం హి శివాభ్యాం యదవిముక్తం తతో విదుః | అస్యానందవనం నామ పురాsకారి పినాకినా || 31 క్షేత్రస్యానందహేతుత్వా దవిముక్త మనంతరమ్ | కాశీనగరము సర్వశ్రేష్ఠమగు మోక్ష నగరి. తీర్థములలో కెల్లా గొప్పదియై ప్రకాశించుచున్నది. పరమానంద స్థానమగు ఆ సుందరక్షేత్రమునందు పరమానంద రూపులగు శివశక్తులు ఉందురు (29). ఓ మహర్షీ! పార్వతీ పరమేశ్వరులు ప్రలయకాలమందైననూ ఆ క్షేత్రమును ఏనాడు విడువరు (30). అందువలననే ఈ క్షేత్రమునకు అవిముక్తము అని పేరు. పూర్వము శివుడు ఆనందమును కలిగించునదగుటచే ఈ అవిముక్త క్షేత్రమునకు ఆనందమని పేరిడెను (31). అథానందవనే తస్మిన్ శివయో రమమాణయోః || 32 ఇచ్ఛేత్య భూత్సరర్షే హి సృజ్యః కోప్యపరః కిల | యస్మిన్ యస్య మహాభారమావాం స్వసై#్వ రచారిణౌ || 33 నిర్వాణధారణం కుర్వః కేవలం కాశిశాయినౌ | స ఏవ సర్వం కురుతాం స ఏవ పరిపాతు చ || 34 స ఏవ సంవృణోత్వంతే మదనుగ్రహతస్సదా | చేతస్సముద్రమాకుంచ్య చింతాకల్లోలలోలితమ్ || 35 సత్త్వరత్నం తమో గ్రాహం రజోవిద్రుమవల్లితమ్ | యస్య ప్రసాదాత్తిష్ఠావస్సుఖమానందకాననే || 36 ఓ దేవర్షీ! శివశక్తులిద్దరు ఆ ఆనందవనమునందు రమించుచుండగా (32), మరియొకనిని సృష్టించవలెనని వారికి సంకల్పము కలిగెను. మరియొకనిని సృష్టించి, వానియందు సృష్టిభారమునుంచి మనము ఇద్దరము స్వేచ్ఛగా (33) కాశీనగరమునందున్న వారమై పరమానందమును పొందెదము. ఆ పురుషుడు సదా నా అనుగ్రహముచే సర్వమును సృజించి, ఆతడే పరిపాలించుగాక!(34) ప్రలయమునందు ఆతడే సర్వమును ఉపసంహరించుగాక!చింతలు అనే తరంగములతో సంక్షుబ్దమై, సత్త్వగుణము అనే రత్నములు, తమోగుణము అనే మొసళ్లు, రజోగుణమనే పగడములు గలచిత్తము అనే సముద్రమును ఉపసంహరించుకొని (35). ఆ పురుషుని అనుగ్రహము వలన మనమిద్దరము ఆనందకాననములో సుఖముగా నుండెదము (36). పరిక్షిప్త మనోవృత్తౌ బహిశ్చింతాతురే సుఖమ్ | సంప్రధార్యేతి స విభుస్తయా శక్త్యా పరేశ్వరః || 37 సవ్యే వ్యాపారయాం చక్రే దశ##మేsగే సుధాసవమ్ | తతః పుమానావిరాసీ దేకః త్రైలోక్య సుందరః || 38 శాంతస్సత్త్వ గుణోద్రిక్తో గాంభీర్యామిత సాగరః | తథా చ క్షమయా యుక్తో మునేsలబ్దోపమోsభవత్ || 39 ఇంద్ర నీలద్యుతి శ్ర్శీమాన్పుండరీ కోత్తమేక్షణః సువర్ణకృతి భృచ్ఛ్రేష్ఠదుకూలయుగలావృతః || 40 లసత్ర్ప చండదోర్దండ యుగలో హ్యపరాజితః | నా మనోవృత్తులన్నియూ ఈ నగరమునందు లగ్నమగుచున్నవి. ఈ నగరమునుకు బయట చింత, ఆదుర్దా గలవు. కాన, మనమిచట సుఖముగ నుండెదమని నిశ్చయించి, శక్తి సహితుడగు ఆ పరమేశ్వరుడు (37) తన ఎడమ భాగమునందు జననేంద్రియమునందు అమృతమును చిందించెను. అపుడు ఒక త్రిలోకసుందరుడగు పురుషుడు ఆవిర్భవించెను (38). ఓ మహర్షీ! ఆతడు శాంతుడు, సత్త్వగుణప్రధానుడు, గాంభీర్యము నందు సముద్రము వంటి వాడు, మరియు క్షమాగుణము కలవాడు, సాటిలేనివాడు (39). శోభాయుక్తుడగు ఆపురుషుడు ఇంద్రనీలమణుల కాంతి గలవాడు, పద్మముల వలె అందమగు కన్నులు కలవాడు, బంగరు రంగు గల రెండు పట్టు వస్త్రములను ధరించెను (40).ప్రకాశించే బలమైన భుజదండములు గల నాతడు పరాజితుడు కాడు. తతస్స పురషశ్శంభుం ప్రణమ్య పరమేశ్వరమ్ || 41 నామాని కురు మే స్వామిన్ వద కర్మ జగావితి | తచ్ఛ్రుత్వా వచనం ప్రాహ శంకరః ప్రహసన్ ప్రభుః || 42 పురుషం తం మహేశానో వాచా మేఘగభీరయా | అపుడా పురుషుడు పరమేశ్వరుడగు శంభునకు నమస్కరించి (41), ' ఓ స్వామీ! నాకు పేరు పెట్టి పనిని ఆదేశించుము' అని పలికెను. ఆ మాటను విని శంకర ప్రభుడు చిరునవ్వు నవ్వి (42), మేఘ గర్జన వంటి ధ్వనితో ఆ పురుషునితో నిట్లనెను. శివ ఉవాచ | విష్ణ్వితి వ్యాపకత్వాత్తే నామ ఖ్యాతం భవిష్యతి || 43 బహూన్యన్యాని నామాని భక్తసౌఖ్య కరాణి హ | తపః కురు దృఢో భూత్వా పరమం కార్యసాధనమ్ || 44 ఇత్యుక్త్వా శ్వాసమార్గేణ దదౌ చ నిగమం తతః | తతోsచ్యుతశ్శివం నత్వా చకార విపులం తపః || 45 అంతర్ధానం గతశ్శక్తా సలోకః పరమేశ్వరః | దివ్యం ద్వాదశసాహస్రం వర్షం తప్త్వాపి చాచ్యుతః || 46 న ప్రాప స్వాభిలషితం సర్వదం శంభుదర్శనమ్ | శివుడు ఇట్లు పలికెను - వ్యాపకుడవగుచటచే నీకు విష్ణువు అను పేరు ప్రసిద్ధి చెందగలదు (43). భక్తులకు ఆనందమును కలిగించు అనేక ఇతర నామములు నీకు కలుగును. కార్యసిద్ధికి తపస్సు గొప్ప సాధనము. కాన నీవు దృఢచిత్తముతో తపస్సు చేయుము (44).ఇట్లు పలికి శివుడు శ్వాసమార్గము ద్వారా వేదము నొసంగెను. అపుడు విష్ణువు శివునకు నమస్కరించి, గొప్ప తపస్సును చేసెను (45).పరమేశ్వరుడు శక్తి తో కూడి అంతర్హితుడయ్యెను. శివలోకము కూడ అంతర్థానమయ్యెను. అచ్యుతుడు పన్నెండు వేల దివ్యవర్షములు తపస్సు చేసిననూ (46), సర్వమును ఇచ్చే, తనకు అభీష్టమైన శివుని సాక్షాత్కారమును పొందలేక పోయెను. తత్తత్సంశయమాపన్న శ్చింతితం హృది సాదరమ్ || 47 మయాద్య కిం ప్రకర్తవ్యమితి విష్ణుశ్శివం స్మరన్ | ఏతస్మిన్నంతరే వాణీ సముత్పన్నాశివచ్ఛుభా || 48 తపః పునః ప్రకర్తవ్యం సంశయస్యాపనుత్తయే | తతస్తేన చ తచ్ఛ్రుత్వా తపస్తప్తం సుదారుణమ్ || 49 బహుకాలం తదా బ్రహ్మాధ్యాన మార్గపరేణ హి | తతస్స పురుషో విష్ణుః ప్రబుద్ధో ధ్యానమార్గతః || 50 సుప్రీతో విస్మయం ప్రాప్తః కిం యత్తవ మహా ఇతి |పరిశ్రమవతస్తస్య విష్ణోస్స్వాంగేభ్య ఏవ చ || 51 జలధారా హి సంయాతా వివిధా శ్శివమాయయా | విష్ణువు మనస్సులో అనేక సంశయములు పొడసూపెను. ఆతడు ఆదరముతో (47) శివుని స్మరిస్తూ నాకిప్పుడు కర్తవ్యమేమి? అని చింతిల్లెను. ఇంతలో శివుని నుండి 'సంశయములను పోగొట్టుకొనుటకై మరల తపస్సు చేయుము' అను వాక్కు వెలువడెను (48). ఆ మాటను విని ఆతడు చిరకాలము పర బ్రహ్మధ్యానము నందు నిమగ్నుడై కఠోరమగు తపస్సును చేసెను (49). అపుడా విష్ణువు ధ్యానమార్గము నుండి బయటకు వచ్చి (50) శివుని మహిమను స్మరించి ప్రీతిని, విస్మయమును పొందెను. ఈ విధముగా కఠిన తపస్సు చేసిన విష్ణువు అవయవముల నుండి (51)శివమాయాప్రభావముచే అనేక జలధారలు బయల్వెడలెను. అభివ్యాప్తం చ సకలం శూన్యం యత్తన్మహామునే || 52 బ్రహ్మరూపం జలమభూత్స్పర్శనా త్పాపనాశనమ్ | తదా శ్రాంతశ్చ పురుషో విష్ణుస్తస్మిన్ జలే స్వయమ్ || 53 సుష్వాప పరమ ప్రీతో బహుకాలం విమోహితః | నారాయణతి నామాపి తస్మాసీచ్ఛ్రుతి సంమతమ్ || 54 నాన్య త్కించిత్తదా హ్యాసీత్ ప్రాకృతం పురుషం వినా | ఏతస్మిన్నంతరే కాలే తత్త్వాన్యాసన్మహాత్మనః || 55 తత్ర్పకారం శృణు ప్రాజ్ఞ గదతో మే మహామతే | ఓ మహర్షీ! అపుడా అవకాశముంతయూ ఆ బ్రహ్మరూపమగు జలముచే నిండిపోయెను (52). ఆ జలమును స్పృశించినంతనే పాపములు నశించును. అపుడు అలసిన విష్ణువు ఆ జలమునందు (53) మిక్కిలి సంతసముతో చిరకాలము మోహితుడై నిద్రించెను. అందువలననే, ఆయనకు వేద సమ్మతమగు నారాయణ (జలముపై శయనించువాడు) నామము కలిగెను (54). అపుడా పురుషుడు (విష్ణువు) తక్క ఇతర ప్రకృతి వికారము లేనియూ లేకుండెను. ఈ కాలములోనే ఆ మహాత్ముని నుండి వివిధ తత్త్వములు ఉద్భవించినవి. (55). ఓ నారదా! నీవు గొప్ప బుద్ధిశాలివి. ఆ తత్త్వములు పుట్టిన తీరును నేను చెప్పెదను వినుము. ప్రకృతేశ్చ మహానాసీన్మహతశ్చ గుణాస్త్రయః || 56 అహంకారస్తతో జాత స్త్రి విధో గుణభేదతః | తన్మాత్రాశ్చ తతో జాతాః పంచభూతాని వై తతః || 57 తదైవ తానీంద్రియాణి జ్ఞానకర్మమయాని చ | తత్త్వా నామితి సంఖ్యానముక్తం తే ఋషిసత్తమ || 58 జడాత్మకం చ తత్సర్వం ప్రకృతేః పురుషం వినా | తత్తదైకీకృతం తత్త్వం చతుర్వింశతి సంఖ్యకమ్ || 59 శివేచ్ఛయా గృహీత్వా స సుష్వాప బ్రహ్మరూపకే || 60 ఇతి శ్రీ శివ మహా పురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యుపాఖ్యానే ప్రథమ ఖండే విష్ణూత్పత్తి వర్ణనం నామ షష్ఠోSధ్యాయః (6). ప్రకృతి నుండి మహత్తు నుండి సత్త్వరజస్తమోగుణములు పుట్టెను (56). ఈగుణముల భేదముచే మూడు విధములైన అహంకారము పుట్టెను. అహంకారము నుండి పంచతన్మాత్రలు, వాటి నుండి అయిదు స్థూల భూతములు పుట్టినవి (57). అదే కాలములో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పుట్టినవి. ఓ మహర్షీ!నీకీ విధముగా తత్త్వముల లెక్కను చూపించితిని (58). పురుషుడు తక్క, ప్రకృతి నుండి పుట్టిన తత్త్వములన్నియు జడములే. విష్ణువు ఈ ఇరువది నాల్గు తత్త్వములను ఏకము చేసి (59), దానిని శివుని ఇచ్ఛచే తనలో నుంచుకొని, బ్రహ్మ రూపమగు జలములో నిద్రించెను (60). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానము అనే మొదటి ఖండములో విష్ణూత్పత్తి వర్ణనము అనే ఆరవ అధ్యాయము ముగిసెను (6).