Sri Sivamahapuranamu-I
Chapters
అథ సప్తమోSధ్యాయః విష్ణుబ్రహ్మల వివాదము బ్రహ్మోవాచ | సుప్తే నారాయణ దేవే నా భౌ పంకజముత్తమమ్ | ఆవిర్బభూవ సహసా బృహద్వై శంకరేచ్ఛయా ||
1 అనంతయష్టికాయుక్తం కర్ణికారసమప్రభమ్ | అనంత యోజనాయామ మనంతోచ్ఛ్రాయసంయుతమ్ ||
2 కోటి సూర్యప్రతీకాశం సుందరం తత్త్వ సంయుతమ్ | అత్యద్భుతం మహారమ్యం దర్శనీయమనుత్తమమ్ ||
3 కృత్వా యత్నం పూర్వవత్స శంకరః పరమేశ్వరః | దక్షిణాంగాన్నిజాన్మాం వై సాంబశ్శంభురజీజనత్ ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - నారాయణ దేవుడు నిద్రించగానే, శంకరుని ఇచ్ఛచే అతని నాభియందు ఉత్తమమగు పెద్ద పద్మ మొకటి ఆవిర్భవించెను (1). దానికి అంసంఖ్యాకములగు నాళములు ఉండెను. అది కర్ణికార పుష్పమువలె ప్రకాశించెను. అది అసంఖ్యాక యోజనముల వెడల్పు, ఎత్తు కలిగి ఉండెను (2). సుందరమగు ఆ పద్మము ప్రాకృతతత్త్వమలన్నింటితో గూడి కోటి సూర్యుల వలె భాసించెను. అత్యద్భుతము, సర్వశ్రేష్ఠము, అతి సుందరమునగు ఆ పద్మము చూడ ముచ్చట గొలిపెను (3). శుభములనిచ్చే పరమేశ్వరుడు సాంబశివుడు పూర్వము వలెనే యత్నము చేసి, తన దేహము యొక్క కుడి భాగమునుండి నన్ను సృష్టించెను (4). స మాయా మోహితం కృత్వా మాం మహేశో ద్రుతం మునే | తన్నాభి పంకజాదావిర్భావయామాస లీలయా ||
5 ఏవ మాద్యాత్తతో జజ్ఞే పుత్రోహం హేమగర్భకః | చతుర్ముఖో రక్తవర్ణ స్త్రి పుండ్రాంకితమస్తకః || 6 తన్మాయామోహితశ్చాహం నావిదం కమలం వినా | స్వదేహజనకం తాత పితరం జ్ఞానదుర్బలః ||
7 కోsహం వా కుత ఆయాతః కిం కార్యం తు మదీయకమ్ | కస్య పుత్రోsహముత్పన్నః కేనైవ నిర్మితోsధునా ||
8 ఓ మహర్షీ! ఆ మహేశ్వరుడు వెంటనే నన్ను మాయచే మోహింపజేసి తన లీలలో భాగముగా నన్ను ఆ నాభి పద్మము నుండి ఆవిర్భవింపజేసెను (5). ఈ విధముగా హిరణ్యగర్భుడనగు నేను నాల్గు ముఖములతో, ఎర్రని దేహముతో, త్రిపుండ్రముతో భాసించు లలాటముతో ఆ ఆదిదేవుని పుత్రునిగా జన్మించితివి (6). వత్సా! ఆశివుని మాయచే మోహితుడనైన నేను అల్పజ్ఞుడనగుటచే , నాకు జన్మనిచ్చిన తండ్రిని యెరుంగక జాలక, నాకు జన్మనిచ్చినది కమలమే యని భావించితిని (7). నేనెవరిని? ఎక్కడ నుండి వచ్చితిని?నాకర్తవ్యమేమి? నేను ఎవరికి పుత్రుడనై జన్మించితిని? ఈ పద్మమును నిర్మించినదెవరు?(8) ఇతి సంశయమాపన్నం బుద్ధిర్మాం సమపద్యత | కి మర్థం మోహమాయామి తద్జ్ఞానం సుకరం ఖలు ||
9 ఏ తత్కమల పుష్పస్య పత్రారోహస్థలం హ్యధః | మత్కార్తా చ సవేతత్ర భవిష్యతి న సంశయః ||
10 ఇతి బుద్ధిం సమాస్థాయ కమలాదవరోహయన్ | నాలే నాలే గతస్తత్ర వర్ణాణాం శతకం మునే ||
11 న లబ్ధం తు మయా తత్ర కమలస్థాన ముత్తమమ్ | సంశయం చ పునః ప్రాప్తః కమలే గంతుముత్సుకః ||
12 ఇట్టి సంశయములతో నిండిన నాకు ఒక ఊహ కలిగెను. నేను ఇట్లు మోహమును పొందనేల? ఈ విషయమును తేలికగా కనుగొనచ్చును గదా ! (9). ఈ కమలమునకు క్రింద పత్రములు ఆవిర్భవించిన చోట నన్ను సృష్టించినవాడు ఉండగలడనుటలో సందేహము లేదు (10). ఓ మహర్షీ! ఇట్లు భావించి, నేను కమలము నుండి క్రిందకు దిగి, ఒక నాళమునుండి మరియొక నాళమునకు తిరుగుతూ, వంద సంవత్సరములు గడిపితిని (11). కాని, ఆ గొప్ప కమలము యొక్క మొదలు నాకు దొరకలేదు. నాకు మరల సంశయములు పొడసూపి, తిరిగి కమలములోనికి వెళ్లు టకు ప్రయత్నించితిని (12). ఆరురోహాథ కమలం నాలమార్గేణ వై మునే | కుడ్మలం కమలస్యాథ లబ్ధవాన్న విమోహితః | | 13 నాలమార్గేణ భ్రమతో గతం వర్షశతం పునః | క్షణ మాత్రం తదా తత్ర తతస్తిష్ఠన్విమోహితః || 14 తదా వాణీ సముత్పన్నా తపేతి పరమా శుభా | శివేచ్ఛయా పరా వ్యోమ్నో మోహ విధ్వంసినీ మునే || 15 తచ్ఛ్రుత్వా వ్యోమవచనం ద్వాదశాబ్దం ప్రయత్నతః | పునస్తప్తం తపో ఘోరం ద్రష్టుం స్వజనకం తదా || 16 ఓ మహర్షీ! అపుడు నేను మరల నాలమార్గము ద్వారా పైకి ఎక్కితిని. కాని, మోహితుడైన పద్మము యొక్క మొదటికి చేరలేక పోతిని (13). ఆనాల మార్గములో నేను వంద సంవత్సరములు పరిభ్రమించితిని. అపుడచటమోహితుడనై క్షణకాలము నిలబడితిని (14). ఓ మహర్షీ! అపుడు శివుని ఇచ్ఛచే ఆకాశము నుండి 'తపస్సు ను చేయుము' అను శుభకరమగు వాక్కు పుట్టెను. నామోహము తొలగెను (15). ఆ ఆకాశవాణిని విని నేను నా తండ్రిని చూచు కోరికతో మరల పన్నెండు సంవత్సరములు యత్నముతో ఘోరమగు తపస్సును చేసితిని (16). తదా హి భగవాన్విష్ణుశ్చతుర్బాహుస్సులోచనః | మయ్యేవానుగ్రహం కర్తుం ద్రుతమావిర్బభూవ హ || 17 శంఖ చక్రాయుధకరో గదా పద్మధరః పరః | ఘనశ్యామల సర్వాంగః పీతాంబరధరంః పరః || 18 ముకుటాది మహాభూషః ప్రసన్న ముఖ పంకజః | కోటి కందర్పసంకాశస్సందృష్టో మోహితేన సః || 19 తద్దృష్ట్వా సుందరం రూపం విస్మయం పరమం గతః | కాలాభం కాంచనాభం చ సర్వాత్మానం చతుర్భుజమ్ || 20 అపుడు నాల్గు భుజములు, అందమగు కన్నులు గల విష్ణుభగవానుడు నన్ను అనుగ్రహించుటకై వెనువెంటనే ప్రత్యక్షమాయెను (17). ఆయన శంఖ, చక్రములను ఆయుధములను చేతులయందు ధరించియుండెను. నీలమేఘశ్యామల వర్ణములతో భాసించు దేహముగల విష్ణువు గదను, పద్మమును ధరించి, పీతాంబరుడై ప్రకాసించెను (18). కిరీటమును, ఇతర ఆభరణములను ధరించిన విష్ణువు యొక్క ముఖ పద్మము ప్రసన్నముగ నుండెను. నేను కోటి మన్మధుల సౌందర్యము గల విష్ణువును చూచి మోహమును పొందితిని (19).నల్లని మేనుతో, బంగరు ఆభరణములతో, నాల్గు భుజములతో ప్రకాశించే సర్వాత్ముకుడగు విష్ణువు యొక్క సుందర రూపమును చూచి, నేను ఆత్యాశ్చర్యమగ్నుడనైతిని (20). తథా భూతమహం దృష్ట్వా సదసన్మయామాత్మ నా | నారాయణం మహాబాహుం హర్షితో హ్యాభవం తదా || 21 మాయయా మోహితశ్సంభో స్తదా లీలాత్మనః ప్రభోః | అవిజ్ఞాయ స్వజనకం తమవోచం ప్రహర్షితః || 22 ప్రకృతి పురుషరూపుడు, మహాబాహువు అగు నారాయణుని ఆ సుందర రూపమును చూచి, నేనప్పుడు సంతసించితిని (21). లీలామయుడగు శివప్రభువు యొక్క మాయచే మోహితుడనైన నేను ఆ సమయములోనన్ను సృష్ఠించిన తండ్రి గురించి తెలుసకొన లేకపోతిని. నేనప్పుడు ఆనందిచి విష్ణువుతో నిట్లంటిని.(22). బ్రహ్మోవాచ | కస్త్వం వదేతి హస్తేన సముత్థాప్య సనాతనమ్ | తదా హస్త ప్రహారేణ తీవ్రేణ సుదృఢేన తు || 23 ప్రబుద్ధ్యోత్థాయ శయనాత్సమాసీనః క్షణం వశీ | దదర్శ నిద్రావిక్లిన్న నీరజామలలోచనః || 24 మామత్ర సంస్థితం భాసా ధ్యాసితో భగవాన్ హరిః | అహ చోత్థాయ బ్రహ్మాణం హసన్మాం మధురం సకృత్ || 25 బ్రహ్మ ఇట్లు పలికెను - సనాతనుడగు విష్ణువును నేను 'నీ వెవరివి ?' అని చేతితో తట్టిలేపితిని. చేతితో తట్టినపుడు ఆయనకు గట్టి దెబ్బ తగిలినది (23). ఆయన తెలివి తెచ్చుకొని, శయ్యపై నుండి లేచి, క్షణ కాలములో నిద్రను జయించి, నిద్ర తొలగి చూచుచున్న పద్మముల వంటి స్వచ్ఛమగు నేత్రములతో చూచెను (24). గొప్ప ప్రకాశముగల విష్ణుభగవానుడు లేచి, అక్కడ నిలబడి యున్న నన్ను చూచి, నవ్వుతూ మధురమగు మాటను పలికెను (25). విష్ణు రువాచ | స్వాగతం స్వాగతం వత్స హితామహ మహాద్యుతే | నిర్భయో భవ దాస్యేsహం సర్వాన్కామాన్న సంశయః || 26 తస్య తద్వచనం శ్రుత్వా స్మిత పూర్వం సురర్షభః | రజసా బద్ధవైరశ్చ తమవోచం జనార్దనమ్ || 27 విష్ణువు ఇట్లు పలికెను - వత్సా! పితామహా! నీకు స్వాగతము. స్వాగతము. నీవు గొప్పగా ప్రకాశించుచున్నావు. భయపడకుము. నీ కోర్కెల నన్నిటినీ నేను నిస్సందేహముగా తీర్చెదను (26). దేవతలలో శ్రేష్ఠుడనగు నేను జనార్దనుని చిరునవ్వుతో గూడిన ఆ మాటను విని, రజోగుణుముచే వైరము గలవాడై ఆయనతో ఇట్లంటిని (27). బ్రహ్మోవాచ | భాషసే వత్స వత్సేతి సర్వ సంహారకారణమ్ | మామిహాతి స్మితం కృత్వా గురుశ్శిష్యమివానఘ || 28 కర్తారం జగతాం సాక్షాత్ ప్రకృతేశ్చ ప్రవర్తకమ్ | సనాతనమజం విష్ణుం విరించిం విష్ణు సంభవమ్ || 29 విశ్వాత్మానం విధాతారం ధాతారం పంకజేక్షణమ్ | కి మర్థం భాషసే మోహా ద్వక్తు మర్హసి సత్వరమ్ || 30 వేదో మాం వక్తి నియమాత్స్వయం భువమజం విభుమ్ | పితామహం స్వరాజం చ పరమేష్ఠిన ముత్తమమ్ || 31 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ పూజ్యుడా! సర్వమును సంహరించుటలో కారణమగు నన్ను ఉద్దేశించి, గురువు శిష్యుని వలె, మిక్కిలి చిరునవ్వుతో వత్సా! వత్సా! అని పలుకుచున్నావు (28). నేను సాక్షాత్తు సృష్టికర్తను. ప్రకృతిని ప్రవర్తిల్ల జేయునది నేనే. నేను సనాతనుడను. జన్మ లేని వాడను. సర్వవ్యాపకుడను. విష్ణువు నుండి జన్మించిన బ్రహ్మను (29). విశ్వ స్వరూపుడగు విధాతను. పద్మముల వంటి నేత్రములు గల ధాతను. నీవు మోహితుడవై నాతో ఇట్లు పలుకుటకు గల కారణమును వెంటనే చెప్పుము (30). వేదము తప్పని సరిగా నన్ను స్వయంభువుడు, జన్మ లేనివాడు, వ్యాపకుడు, పితామహుడు, స్వరాట్,పరమేష్టి మరియు ఉత్తముడు అని బోధించుచున్నది (31). ఇత్యాకర్ణ్య హరిర్వాక్యం మమ క్రుద్ధో రమాపతిః | సోపి మామాహ జానే త్వాం కర్తారమితి లోకతః || 32 ఈ నా మాటను విని లక్ష్మీపతి యగు విష్ణువు కోపించి, 'లోకములను సృష్టించినది నీవేనని నేను యెరుంగుదును' అని పలికెను (32). విష్ణు రువాచ | కర్తుం ధర్తుం భవానంగాదవతీర్ణో మమావ్యయాత్ | విస్మృతోsసి జగన్నాథం నారాయణ మనామయమ్ || 33 పురుషం పరమాత్మానం పురుహూతం పురుష్టుతమ్ | విష్ణుమచ్యుతమీశానం విశ్వస్య ప్రభవోద్భవమ్ || 34 నారాయణం మహా బాహుం సర్వవ్యాపకమీశ్వరమ్ | మన్నాభిపద్మతస్త్వం హి ప్రసూతో నాత్ర సంశయః || 35 తవాపరాధో నాస్త్యత్ర త్వయి మాయాకృతం మమ | శృణు సత్యం చతుర్వక్త్ర సర్వదేవేశ్వరో హ్యహమ్ || 36 కర్తా హర్తా చ భర్తా చ న మయాస్తి సమో విభుః | అహమేవ పరం బ్రహ్మ పరం తత్త్వం పితామహ|| 37 విష్ణువు ఇట్లు పలికెను - నీవు జగత్తును సృష్టించి,ధరించుట కొరకై వినాశరహితమగు నా దేహము నుండి పుట్టితివి . కాని, లోకములకు ప్రభువు, దోషములు లేనివాడు, పరమాత్మ, సర్వులచే ప్రార్థింపబడువాడు, సర్వులచే స్తుతింపబడువాడు, సర్వవ్యాపకుడు, అచ్యుతుడు, లోకములను రక్షించువాడు, జగత్తునకు నిమిత్త ఉపాదానకారణములైన వాడు (34), చతుర్భుజుడు, సర్వసమర్థుడు, నారాయణుడునగు నన్ను విస్మరించితివి. నీవు నా నాభియందలి పద్మమునుండి జన్మించితి వనుటలో సందియము లేదు (35). దీనిలో నీ అపరాధమేమియూ లేదు నీవు నా మాయచే మోహితుడవైతివి. ఓ నాల్గు ముఖముల వాడా!సత్యమును వినుము. దేవతలందరికీ ప్రభువును నేనే (36).జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయువాడను నేనే. నాతో సమమగు విభుడు లేడు. ఓ పితామహా! పరమతత్త్వమగు పరబ్రహ్మను నేనే (37). అహమేవ పరం జ్యోతిః పరమాత్మా త్వహం విభుః | అద్య దృష్టం శ్రుతం సర్వం జగత్యస్మింశ్చరాచరమ్ || 38 తత్తద్విద్ధి చతుర్వక్త్ర సర్వం మన్మయ మిత్యథ | మయా సృష్టం పురావ్యక్తం చతుర్వింశతితత్త్వకమ్ || 39 నిత్యం తేష్వణవో బద్ధా స్సృష్టక్రోధ భయాదయః | ప్రభావాచ్చ భవానంగాన్యనే కానీహ లీలయా || 40 సృష్టా బుద్ధిర్మయా తస్యా మహంకారస్త్రిధా తతః | తన్మాత్రం పంకజం తస్మాన్మనో దేహేం ద్రియాణి చ || 41 పరం జ్యోతి పరమాత్మను నేనే. నేను సర్వవ్యాపకుడను. ఓ నాల్గు మోముల వాడా! ఈ జగత్తులో కనబడే మరయు వినబడే స్థావర జంగమములన్నియు (38) నాస్వరూపమేనని తెలుసుకో. ఇరువది నాల్గు తత్త్వముల అవ్యక్తమును పూర్వము నేనే సృష్టించితిని (39). వాటియందు నిత్యమగు అణువులను నేనే నిబద్ధము చేసితిని. నేను నా ప్రభావము చేత లీలగా క్రోధము, భయము మొదలగువాటినే గాక, నిన్ను, జగత్తులో వివిధ అంశములను సృష్టించితిని (40). నేను అవ్యక్తము నుండి బుద్ధిని, బుద్ధి నుండి త్రివిధాహంకారములను, పంచతన్మాత్రలను, పద్మములను, మరియు మనస్సును, దేహమును, ఇంద్రియములను సృజించితిని (41). ఆకాశాదీని భూతాని భౌతికాని చ లీలయా | ఇతి బుద్ధ్వా ప్రజానాథ శరణం వ్రజ మే విధే || 42 అహం త్వాం సర్వదుఃఖేభ్యో రక్షిష్యామి న సంశయః | ఇతి శ్రుత్వా వచస్తస్య బ్రహ్మా క్రోధ సమన్వితః || 43 కో వా త్వమితి సంభర్త్స్యాబ్రువం మాయావిమోహితః | కి మర్థం భాషసే భూరి బహ్వనర్ధకరం వచః || 44 నేశ్వరస్త్వం పరబ్రహ్మ కశ్చిత్కర్తా భ##వేత్తవ | మాయయా మోహితశ్చాహం యుద్ధం చక్రే సుదారుణమ్ || 45 నేను లీలగా ఆకాశాది పంచ భూతములను, భౌతిక పదార్థములను సృష్టించితిని. ఓ ప్రజాపతీ! హే బ్రహ్మన్ ! నీవీ సత్యమునెరింగి, నన్ను శరణు పొందుము (42). నేను నిన్ను నిస్సంశయముగా సర్వదుఃఖములను నుండి రక్షించెదను. ఆతని ఈ మాటలను విన్న బ్రహ్మకు కోపము కలిగెను (43). మాయచే మోహితుడనైన నీవు ' నీవెవ్వరివి? అర్థహీనములగు వాక్యములను అధికముగా నేల పలుకుచుంటివి?' అని కోపముతో బిగ్గరగా అరచితిని (44). నీవు ఈశ్వరుడవు కాదు. పరబ్రహ్మవు కాదు. నిన్ను సృష్టించిన వాడు మరియొకడు గలడు అని పలికి, మాయచే మోహితుడనైన నేను దారుణమగు యుద్ధమును చేసితిని (45). హరిణా తేన వై సార్థం శంకరస్య మహాప్రభోః | ఏవం మమ హరేచ్ఛా సీత్సంగరో రోమహర్షణః || 46 ప్రలయార్ణవమధ్యే తు రజసా బద్దవైరయోః | ఏతస్మిన్నంతరే లింగమభవచ్చావయోః పురః || 47 వివాదశమనార్థం హి శమనార్థం తథాssవయోః | జ్వాలామాలా సహస్రాఢ్యం కాలానల శతోపమమ్ || 48 క్షయవృద్ధి వినిర్ముక్తమాది మధ్యాంత వర్జితమ్ | అనౌపమ్యమనిర్దేశ్య మవ్యక్తం విశ్వ సంభవమ్ || 49 గొప్ప ప్రభువగు శంకరుని మాయచే మోహితుడనగు నాకు విష్ణువుతో యుద్ధము సంప్రాప్తమయ్యెను. ఈవిధముగా ప్రలయకాల సముద్ర మధ్యములో రజోగుణ ప్రభావముచే పరస్పర వైరము గల నాకు, విష్ణువునకు భయంకరమగు యుద్ధము జరిగెను (46). ఇంతలో మా ఇద్దరి యుద్ధమును చల్లార్చుటకై మా ఎదుట లింగము ఆవిర్భవించెను (47). అది అనేక జ్వాలలతో నిండి, అసంఖ్యాకములగు ప్రలయకాలాగ్నులను పోలియుండేను (48). తగ్గుదల, పెరుగుదల లేని ఆ లింగమునకు తుది, మొదలు, మధ్యము లేకుండెను. ఆ లింగము సాటిలేనిది, పరిచ్ఛేదము లేనిది, ఇంద్రియములకు అందనిది, జగత్సృష్టికి ఆధారమైనది (49). తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరిః | మోహితం చాహ మామత్ర కిమర్థం స్పర్థసేsధునా || 50 ఆగతస్తు తృతీయోsత్ర తిష్ఠతాం యుద్ధమావయోః | కుత ఏవాత్ర సంభూతః పరీక్షావోsగ్ని సంభవమ్ || 51 అధో గమిష్యామ్యనలస్తం భస్యానుపమస్య చ | పరీక్షార్థం ప్రజానాథ తస్య వై వాయు వేగతః || 52 భవానూర్ధ్వం ప్రయత్నేన గంతు మర్హతి సత్వరమ్ | ఆ లింగము యొక్క వేలాది జ్వాలలచే మోహితుడగు విష్ణుభగవానుడు మోహితుడనగు నాతో నిట్లనెను. ఇప్పుడు నాతో నీకు ఈ స్పర్థ యేల? (50). మన ఇద్దరి మధ్య ఈ మూడవది వచ్చినది. మనము యుద్ధమును విరమించెదము. ఈ అగ్ని స్తంభము ఎచట నుండి ఉత్పన్నమైనదో పరీక్షించెదము (51). ఈ సాటిలేని అగ్ని స్తంభము యొక్క క్రింది భాగమును నేను వాయు వేగముతో వెళ్లి పరీక్షించెదను (52). నీవు వెంటనే పైభాగమును పరీక్షించుటకు ప్రయత్నించుము. బ్రహ్మోవాచ | ఏవం వ్యాహృత్య విశ్వాత్మా స్వరూపమకరోత్తదా || 53 వారాహమహమప్యాశు హంసత్వం ప్రాప్తవాన్మునే | తదా ప్రభృతి మామాహూర్హంసహంసో విరాడితి || 54 హంస హంసేతి యో బ్రూయత్స హంసోsథ భవిష్యతి | సుశ్వేతో హ్యనల ప్రఖ్యో విశ్వతః పక్ష సంయుతః || 55 మనోనిల జవో భూత్వాగత్వోర్థ్వం చోర్థ్వతః పురా | నారాయణోsపి విశ్వాత్మా సుశ్వేతో హ్యభవత్తదా || 56 బ్రహ్మ ఇట్లు పలికెను - ఇట్లు పలికి అపుడు జగద్రూపుడగు విష్ణువు వరాహరూపమును పొందెను (53). ఓమహర్షీ! నేను కూడా వెంటనే హంస రూపమును పొందితిని. అప్పటి నుండియూ లోకములో నాకు హంస అనియు, విరాట్ అనియు ప్రసిద్ధి కలిగెను (54). హంస జపమును చేయువాడు హంస (విరాట్) రూపుడగును. నేను తెల్లనిది, అగ్నివలె ప్రకాశించునది, విశాలముగ రెక్కలు గలది (55), మనస్సుతో మరియు వాయువుతో సమమగు వేగము గలది అగు హంసరూపమును ధరించి పైకి, పైపైకి వెళ్లితిని. అపుడు జగద్రూపుడగు నారాయణుడు కూడా తెల్లని వరాహరూపమును ధరించెను (56). దశయోజనవిస్తీర్ణం శతయోజన మాయతమ్ | మేరు పర్వత వర్ష్మాణం గౌరతీక్ణోగ్రదంష్ట్రిణమ్ || 57 కాలాదిత్య సమాభాసం దీర్ఘఘోణం మహాస్వనమ్ | హ్రస్వపాదం విచిత్రాంగం జైత్రం దృఢమనౌపమమ్ || 58 వారాహాకారమాస్థాయ గతవాంస్త జవాత్ | ఏవం వర్ష సహస్రం చ చరన్ విష్ణురధో గతః || 59 తదా ప్రభృతి లోకేషు శ్వేత వారాహ సంజ్ఞకః | కల్పో బభూవ దేవర్షే నరాణాం కాలసంజ్ఞకః || 60 ఆ వరాహము పదియోజనముల వెడల్పు, వంద యోజనముల పొడవు గల, మేరు పర్వతము వంటి దేహమును కలిగియుండెను. దాని తెల్లని పదునైన దంష్ట్రలు భయమును గొల్పుచుండెను (57). ప్రళయకాల సూర్యుని వలె ప్రకాశించే ఆ వరాహము పెద్ద ముట్టిని కలిగి, గొప్ప ధ్వనిని చేయుచుండెను. దాని పాదములు చిన్నవి గను, దాని అంగములు విచిత్రములు విచిత్రముగను ఉండెను. సాటిలేని దార్ఢ్యముగల దాని దేహము సర్వసమర్ధముగ నుండెను (58). విష్ణువు ఇట్టి వరాహ రూపమును ధరించి, ఆ లింగము క్రింది వైపునకు వేగముగా పయనిస్తూ , వేయి సంవత్సరములు గడిపెను (59). ఓ దేవర్షీ! అప్పటి నుండియూ మానవలోకములో ఒక కల్పమునకు శ్వేత వరాహ కల్పమను పేరు కలిగెను (60). బభ్రామ బహుధా విష్ణుః ప్రభ విష్ణు రధోగతః | నా పశ్య దల్పమప్యస్య మూలం లింగస్య సూకరః || 61 తావత్కాలం గత శ్చోర్ధ్వ మహమప్యరిసూదన | సత్వరం సర్వయత్నేన తస్యాంతం జ్ఞాతుమిచ్ఛయా || 62 శ్రాంతో న దృష్ట్వా దస్యాంతమహం కాలాదధోగతః | తథైవ భగవాన్విష్ణు శ్చాంతం కమలలోచనః || 63 సర్వదేవని భస్తూర్ణ ముత్థితస్స మహావపుః | సమాగతో మయా సార్థం ప్రణిపత్య భవం ముహుః || 64 మాయయా మోహితశ్శంభోస్తస్థౌ సంవిగ్నమానసః | పృష్ఠతః పార్శ్వతశ్చైవ హ్యగ్రతః పరమేశ్వరమ్ || 65 ప్రణిపత్య మయా సార్దం సస్మార కిమిదం త్వితి | సర్వ సమర్థుడగు విష్ణువు వరాహరూపియై దాని క్రింది భాగములో అధికముగా పయనించియూ, దాని మూలము యొక్క దరిదాపులకు కూడ చేరలేకపోయెను (61).అంతశ్శత్రువులను జయించిని ఓ మహర్షీ! అదే కాలములో నేను కూడా దాని అగ్రమును చూచు కోరికతో వేగముగా పైకి ప్రయత్న పూర్వకముగా పయనించితిని (62).నేను దాని అగ్రమును కనుగొనలేక, అలసి సొలసి, వెనకకు మరలితిని. పద్మము వంటి కన్నులు గల విష్ణు భగవానుడు కూడ అలసి అచటకు చేరెను (63). సర్వ దేవతా స్వరూపుడగు ఆ వరాహమూర్తి పెద్ద శరీరముతో అచటకు నేను చేరిన సమయమునకే చేరెను. మేము అనేక సార్లు శివునకు నమస్కరించితిమి (64).శివుని మాయచే మోహితుడైన విష్ణువు వ్యాకులమగు మనస్సు గలవాడై, నాతో గూడి పరమేశ్వరునికి వెనుక, ప్రక్కన, మరియు ఎదుట నమస్కరించెను (65). ఇది ఏమై యుండును? అని మోము విస్మితులమైతిమి. అనిర్దేశ్యం చ తద్రూప మనామకర్మ వర్జితమ్ || 66 ఆలింగం లింగతాం ప్రాప్తం ధ్యానమార్గేsప్య గోచరమ్ | స్వస్థం చిత్తం తదా కృత్వా నమస్కారపరాయణౌ || 67 బభూవతురుభావావామహం హరిరపి ధ్రువమ్ | జానీవో న హితేరూపం యోsసి యోsసి మహాప్రభో || 68 నమస్తేsస్తు మహేశాన రూపం దర్శయ నౌ త్వరన్ | ఏవం శరచ్ఛతాన్యాసన్న మస్కారం ప్రకుర్వతోః || 69 ఆవయోర్ముని శార్దూల మదమాస్థితయోస్తదా || 70 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండేవిష్ణుబ్రహ్మవివాద వర్ణనం నా సప్తమోsధ్యాయః (7). పరమేశ్వరుని రూపము ఇదమిత్థముగా నిర్దేశింప శక్యము కానిది. నామము, కర్మ, చిహ్నములు లేనట్టియు (66), ధ్యానమార్గములో నైననూ గోచరింపని పరమేశ్వరుడు లింగాకారమును పొందినాడు. విష్ణువు, నేను స్వస్థచిత్తులమై శివునకు నమస్కారములను చేయుచుంటిమి (67). మహాప్రభో! నీవెవ్వరివో, నీ స్వరూపమేమియో మాకు తెలియకున్నది (68). మహేశ్వరా! నీకు నమస్కారము. నీవు నీ రూపమును మాకు వెంటనే చూపుము. ఇట్లు శివునకు నమస్కరింస్తూ, మేము వంద ఏళ్ళు గడిపితిమి (69). ఓ మహర్షీ! గర్వించిన మేము అపుడాస్థితిలో నుంటిమి (70). శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో విష్ణుబ్రహ్మవివాద వర్ణమనే ఏడవ అధ్యాయము ముగిసెను (7).