Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ఏకాదశోsధ్యాయః

శివపూజావిధి

ఋషయ ఊచుః |

సూత సూత మహాభాగ వ్యాస శిష్య నమోsస్తుతే | శ్రా వితాద్యాద్భుతా శైవకథా పరమపావనీ || 1

తత్రాద్భుతా మహా దివ్యా లింగోత్పత్తి శ్ర్శుతా శుభా | శ్రుత్వా యస్యాః ప్రభావం చ దుఃఖనాశో భ##వేదిహ || 2

బ్రహ్మ నారద సంవాదమను సృత్య దయానిధే | శివార్చనవిధిం బ్రూహి యేన తుష్టో భ##వేచ్చివః || 3

బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యెశ్ర్శూద్రైర్వా పూజ్యతే శివః | కథం కార్యం చ తద్‌ బ్రూహి యథా వ్యాసముఖాచ్ఛ్రు తమ్‌ || 4

తచ్ఛ్రుత్వా వచనం తేషాం శర్మదం శ్రుతి సంమతమ్‌ | ఉవాచ సకలం ప్రీత్యాముని ప్రశ్వాను సారతః || 5

ఋషులిట్లు పలికిరి -

ఓ సుతా! మహాత్మా! వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. నీవు అద్భుతము, పరమ పావనము అగు శివకథను వినిపించితివి (1). దాని యందు మేము మిక్కిలి దివ్యము, శుభకరమునగు లింగావిర్భావమును వింటిమి. ఈ గాథను విన్నచో ఆ ప్రభావము వలన ఈ సంసారములో దుఃఖము నశించును (2). ఓ దయా సముద్రా! నీవు బ్రహ్మ నారద సంవాదమునను సరించి, శివునకు ప్రీతికరమగు అర్చన విధిని చెప్పుము (3). బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు శివుని పూజింతురు. ఈ పూజను ఎట్లు చేయవలెను ? నీవు వ్యాసుని ముఖమునుండి విన్న ఆ పూజా విధిని చెప్పుము (4). సుఖకరము, వేద సమ్మతమునగు వారి ఆ మాటను విని, సూతుడు ప్రీతితో మునుల ప్రశ్నకు అను రూపముగా సర్వమును బోధించెను (5).

సూత ఉవాచ |

సాధు పృష్టం భవద్భిశ్చ తద్రహస్యం మునీశ్వరాః | తదహం కథయామ్యద్య యథా బుద్ధి యథాశ్రుతమ్‌ || 6

భవద్భిః పృచ్ఛతే తద్వత్తథా వ్యాసేనవై పురా | పృష్టం సనత్కుమారాయ తచ్ఛ్రుతం హ్యుపమన్యునా || 7

తతో వ్యాసేన వై శ్రుత్వా శివ పూజాదికం చ యత్‌ | మహ్యం చ పాఠితం తేన లోకానాం హిత కామ్యయా || 8

తచ్ఛ్రుతం చైవ కృష్ణేన హ్యుపమన్యోర్మహాత్మనః | తదహం కథయిష్యామి యథా బ్రహ్మావదత్పురా || 9

సూతుడిట్లు పలికెను -

ఓ మునీశ్వరులారా! శివపూజా రహస్యమును గూర్చి మీరు చక్కగా ప్రశ్నించితిరి. నేనా విషయమును ఇపుడు నేను విన్నదానికి అను రూపముగా నా బుద్ధికి అందినంతవరకు చెప్పెదను (6). మీరు నన్ను అడిగిన తీరుననే , పూర్వము వ్యాసుడు సనత్కుమారుని అడిగెను. ఆ ప్రసంగమును ఉపమన్యుడు కూడా వివెను (7). వ్యాసుడు శివపూజాదులను విని లోకములకు హితమును చేయగోరి నాకు బోధించినాడు (8). మహాత్ముడగు ఉపమన్యుని నుండి దానిని శ్రీ కృష్ణుడు వినెను. పూర్వము బ్రహ్మచే చెప్పబడిన ఆ విషయమును నేను చెప్పగలను (9).

బ్రహ్మోవాచ |

శృణు నారద వక్ష్యామి సంక్షేపాల్లింగపూజనమ్‌ | వక్తుం వర్షశ##తేనాపి న శక్యం విస్తరాన్మునే || 10

ఏవం తు శాంకరం రూపం సుఖం స్వచ్ఛం సనాతనమ్‌ | పూజయే త్పరయా భక్త్యా సర్వకామ ఫలాప్తయే || 11

దారిద్ర్యం రోగ దుఃఖం చ పీడనం శత్రు సంభవమ్‌ | పాపం చతుర్విధం తావద్యావన్నార్చ యతే శివమ్‌ || 12

సంపూజితే శివే దేవే సర్వదుఃఖం విలీయతే | సంపద్యతే సుఖం సర్వం పశ్చాన్ముక్తి రవాప్యతే || 13

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదా! లింగపూజను సంక్షేపముగా చెప్పెదను వినుము. ఓ మహర్షీ! దానిని విస్తరముగా చెప్పుటకు వంద సంవత్సరములైనను చాలదు (10). మానవుడు సర్వకామనలను పొందుట కొరకై పరాభక్తితో సుఖకరము, శుద్ధము, సనాతనమునగు శంకరుని లింగరూపమును ఈ తీరున పూజించవలెను (11). దారిద్ర్యము, రోగము, దుఃఖము, శత్రుపీడ అనే నాల్గు విధముల పాపఫలములు మానవునకు శివుని అర్చించ నంతవరకు మాత్రమే ఉండును (12). మహాదేవుని పూజించినచో దుఃఖములన్నియు తొలగి, సర్వసుఖములు కలుగును. మరణించిన తరువాత ముక్తి కలుగను (13).

యో వై మానుష్య మాశ్రిత్య ముఖ్యం సంతానతస్సుఖమ్‌ | తేన పూజ్యో మహాదేవ స్సర్వకార్యర్థ సాధకః || 14

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రాశ్చ విధివత్క్రమాత్‌ | శంకరార్చాం ప్రకుర్వంతు సర్వకామార్థ సిద్ధయే || 15

ప్రాతః కాలే సముత్థాయ ముహూర్తే బ్రహ్మసంజ్ఞకే | గురోశ్చ స్మరణం కృత్వా శంభోశ్చైవ తథా పునః || 16

తీర్థానాం స్మరణం కృత్వా ధ్యానం చైవ హరేరపి | మ మాపి నిర్జరాణాం వై మున్యాదీనాం తథా మునే || 17

మానుషదేహమును పొంది ఏ వ్యక్తి ప్రధానముగా సంతాన సుఖమును కాంక్షించునో, అట్టివాడు సర్వకార్యములను సిద్ధింపజేయు మహాదేవుని కొలువవలెను (14). బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కామనలన్నియు ఈడేరుటకై శంకరుని పూజించవలెను (15). ఓ మహర్షీ! ఉదయమే బ్రహ్మ ముహూర్తమునందు లేచి, గురువును, శంభుని పునః పునః స్మరించి (16), తీర్థములను స్మరించి, హరిని నన్ను, దేవతలను మరియు మునులను ధ్యానించవలెను (17).

తతః స్తోత్రం శుభం నామ గృహ్ణీ యా ద్విధిపూర్వకమ్‌ | తతోత్థాయ మలోత్సర్గం దక్షిణస్యాం చరేద్దిశి || 18

ఏకాంతే తు విధిం కుర్యాన్మలోత్సర్గస్య యచ్ఛ్రుతమ్‌ | తదేవ కథయామ్యద్య శృణాధాయ మనో మునే || 19

శుద్ధాం మృదం ద్విజో లిప్యాత్పంచ వారం విశుద్ధయే | క్షత్రియశ్చ చతుర్వారం వైశ్యో వారత్రయం తథా || 20

శూద్రో ద్వివారం చ మృదం గృహ్ణీ యా ద్విధిశుద్ధయే | గుదే వాథ సకృల్లింగే వారమేకం ప్రయత్నతః || 21

తరువాత స్తోత్రమును పఠించి, పవిత్రమగు నామమును యథావిధిగా జపించవలెను. తరువాత లేచి మలవిసర్జన కొరకు దక్షిణము వైపునకు వెళ్లవలెను (18). ఏకాంతములో మలవిసర్జన చేయవలెను. ఓ మహర్షీ! ఆ విధిని ఇప్పుడు చెప్పెదను. మనస్సును లగ్నము చేసి వినుము (19). బ్రాహ్మణుడు శుద్ధి కొరకు శుద్ధమగు మట్టిని అయిదు సార్లు, క్షత్రియుడు నాలుగుసార్లు, వైశ్యుడు మూడుసార్లు (20), శూద్రుడు రెండు సార్లు గుదమును లేపము చేయవలెను. ఒకసారి గుహ్యమును ప్రయత్నముతో లేపము చేయవలెను (21).

దశవారం వామహస్తే సప్తవారం ద్వయోస్తదా | ప్రత్యేకం పాదయోస్తాత త్రివారం కరయోః పునః || 22

స్త్రీ భిశ్చ శూద్రవత్కార్యం మృదా గ్రహణముత్తమమ్‌ | హస్తౌ పాదౌ చ ప్రక్షాల్య పూర్వ వన్మృదమాహరేత్‌ || 23

దంతకాష్ఠం తతః కుర్యాత్సవర్ణ క్రమతో నరః | విప్రః కుర్యాద్దంత కాష్ఠం ద్వాదశాంగుల మానతః || 24

ఏకాదశాంగులం రాజా వైశ్యః కుర్యాద్దశాంగులమ్‌ | శూద్రో నవాంగులం కుర్యాదితి మానమిదం స్మృతమ్‌ || 25

వత్సా! ఎడమ చేతిని పదిసార్లు, రెండు చేతులను ఏడుసార్లు, పాదములను ఒక్కొక్క పర్యాయము, మరల చేతులను మూడుసార్లు ప్రక్షాళనము చేయవలెను (22). స్త్రీలు శూద్రులవలెనే చేయవలెను. మట్టి శుద్ధికి ఉత్తమము. చేతులను, పాదములను మట్టితో శుద్ధి చేయవలెను (23). తరువాత మానవుడు తన వర్ణమునకు తగ్గ దంత కాష్ఠముతో దంతములను శుద్ధి చేయవలెను. బ్రాహ్మణుడు పన్నెండు అంగుళముల కాష్ఠమును (24), క్షత్రియుడు పదకొంéడు అంగుళముల కాష్ఠములను, వైశ్యుడు పది అంగుళముల కాష్ఠమును, శూద్రుడు తొమ్మిది అంగుళముల కాష్ఠమును ఉపయోగించవలెను (25).

కాలదోషం విచార్యైవ మనుదృష్టం వివర్జయేత్‌ | షష్ఠ్యాద్యా మాశ్చ నవమీ వ్రతమస్తం రవేర్దినమ్‌ | | 26

తథా శ్రాద్ధదినం తాత నిషిద్ధం రదధావనే | స్నానం తు విధివత్కార్యం తీర్థాదిషు క్రమేణ తు || 27

దేశకాల విశేషణ స్నానం కార్యం సమంత్రకమ్‌ | ఆచమ్య ప్రథమం తత్ర ధౌతవస్త్రం చ ధారయేత్‌ || 28

ఏకాంతే సుస్థలే స్థిత్వా సంధ్యా విధిమథా చరేత్‌ | యథా యోగ్యం విధిం కృత్వా పూజావిధి మథారభేత్‌ || 29

కాలదోషమును విచారించి మనువు చెప్పిన విధముగా షష్ఠి, పాడ్యమి, అమావాస్య, నవమి, వ్రతదినము, సూర్యాస్తమయ కాలము, ఆదివారము (26), మరియు శ్రాద్ధదినములలో దంత ధావనము (కాష్టముతో) నిషిద్ధము. తీర్థములలో యథావిధిగా స్నానమును చేయవలెను (27). దేశకాలములను బట్టి సమంత్రకముగా స్నానము ను చేయవలెను. తరువాత ఏకాంతములో మంచి చోట కూర్చిండి సంధ్యను ఆచరించవలెను. తరువాత యోగ్యతను బట్టి నిత్యవిధిని పూర్తిచేసుకొని, తరువాత పూజావిధిని ఆరంభించవలెను (29).

మనస్తు సుస్థిరం కృత్వా పూజాగారం ప్ర విశ్య చ | పూజా విధిం సమాదాయం స్వాసనే హ్యు పవిశ్య వై || 30

న్యాసాదికం విధాయదౌ పూజయే త్ర్క మశో హరమ్‌ | ప్రథమం చ గణాధీశం ద్వారపాలాం స్తథైవ చ || 31

దిక్పాలాంశ్చ సుసంపూజ్య పశ్చాత్పీఠం ప్రకల్ప యేత్‌ | అథ వాSష్టదలం కృత్వా పూజాద్రవ్య స మీపతః || 32

ఉపవిశ్య తతస్తత్ర ఉపవేశ్య శివం ప్రభుమ్‌ | ఆచమనత్రయం కృత్వా ప్రక్షాల్వ చ పునః కరౌ || 33

ప్రాణాయామత్రయం కృత్వా మధ్యే ధ్యాయేచ్చ త్ర్యంబకమ్‌ | పంచవక్త్రం దశభుజం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ || 34

సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకమ్‌ |

మనస్సును నిశ్చలము చేసుకొని, పూజా గృహములో ప్రవేశించి, పూజావిధిని ఆరంభించుటకై మంచి ఆసనము పైకూర్చుండి (30), న్యాసాదులనాచరించి శివుని క్రమముగా పూజించవలెను. ముందుగా గణపతిని, ద్వారపాలకులను (31), దిక్పాలకులను చక్కగా పూజించి, పీఠమును ఏర్పాటు చేయవలెను. లేదా, అష్టదళపద్మమును పూజా ద్రవ్యములకు సమీపమునందు రచించి (32), అక్కడ కూర్చుండి, శివప్రభువును కూర్చుండబెట్టి, మూడు సార్లు ఆచమనమును చేసి, మరల చేతులను శుద్ధి చేసుకొని (33), మూడు ప్రాణాయామములను చేయవలెను. వాటి మధ్యలో మూడు కన్నులు, ఐదు ముఖములు, పది చేతులు కలిగి, స్వచ్ఛమగు స్ఫటికమువలె భాసించునట్టియు (34), సర్వాభరణములు కలిగినట్టియు, వ్యాఘ్ర చర్మము ఉత్తరీయముగా గల శివుని ధ్యానించవలెను.

తస్య సారూప్యతాం స్మృత్వా దహేత్పాపం నరస్సదా || 35

శివం తతస్సముత్థాప్య పూజయేత్పరమేశ్వరమ్‌ | దేహంశుద్ధి తతః కృత్వా మూలమంత్రం న్యసేత్ర్కమాత్‌ || 36

సర్వత్ర ప్రణవేనైన షడంగ న్యాసమాచరేత్‌ | కృత్వా హృది ప్రయోగం చ తతః పూజాం సమారభేత్‌ || 37

పాద్యార్ఘ్యాచమనార్థం చ పాత్రాణి చ ప్రకల్పయేత్‌ | స్థాపయే ద్వివిధాన్‌ కుంభాన్‌ నవ ధీమాన్యథావిధి || 38

దర్భైరాచ్ఛాద్య తైవరేవ సంస్థాప్యాభుక్ష వారిణా | తేషు తేషు చ సర్వేషు క్షిపేత్తోయం సుశీలతమ్‌ || 39

శివుని తో సదాసారూప్యమును భావించి మానవుడు పాపములను పొగొట్టుకొనవలెను (35). అపుడు పరమేశ్వరుడగు శివుని ఆహ్వానించి పూజించవలెను. శరీరమును పవిత్రము చేసుకొని వరుసగా మూలమంత్ర న్యాసమును చేయవలెను (36). ఓం కారముతో ఆరు అంగన్యాసములను చేయవలెను. పూజా ప్రయోగమును మనసునందిడుకొని పూజను ఆరంభించవలెను (37). పాద్య, ఆర్ఘ్య, ఆచమనముల కొరకు పాత్రల నుంచవలెను. బుద్ధిమంతుడు యథావిధిగా తొమ్మిది విభిన్న కలశములను ఉంచవలెను (38). వాటిని దర్భలయందుంచి, దర్భలతో కప్పి, జలముతో ప్రోక్షించి, ఆ కలశములన్నిటి యందు చల్లని నీటిని పోయవలెను (39).

ప్రణవేన క్షిపేత్తేషు ద్రవ్యాణ్యాలోక్య బుద్ధిమాన్‌ | ఉశీరం చందనం చైవ పాద్యే తు పరికల్పయేత్‌ || 40

జాతీకం కలకర్పూర వటమూల తమాలకమ్‌ | చూర్ణయిత్వా యథాన్యాయం క్షిపే దాచమనీయకే || 41

ఏతత్సర్వేషు పాత్రేషు దాపయేచ్చందనాన్వితమ్‌ | పార్శ్వ యోర్దేవదేవస్య నందీశం తు సమర్చయేత్‌ || 42

గంధైర్ధూపై స్తథా దీపైర్వివిధైః పూజయేచ్ఛివమ్‌ | లింగశుద్ధిం తతః కృత్వా ముదా యుక్తో నరస్తదా || 43

యథోచితం తు మంత్రౌఘైః ప్రణవాదినమోంతకైః | కల్పయేదాసనం స్వస్తి పద్మాది ప్రణవేన తు || 44

బుద్ధిమంతుడగు సాధకుడు ప్రణవమునుచ్చరించి ఆ కలశములలో ద్రవ్యముల నుంచవలెను. పాద్యకలశమునందు ఉశీరము (వట్టివేరు) ను, చందనమును వేయవలెను (40). మల్లె, మిరియాలు, కర్పూరము, మర్రిచెట్టు వ్రెళ్లు, మరియు తమలపాకులను చూర్ణము చేసి ఆచమన కలశమునందుంచవలెను (41). మిగిలిన కలశములన్నిటియందు చందనమును వేయవలెను. దేవదేవుని పార్శ్వములయందు నందీశ్వరుని అర్చించవలెను (42). శివుని గంధము, ధూపము, దీపము ఇత్యాది ఉపచారములతో పూజించవలెను. తరువాత లింగమునుండి నిర్మాల్యమును తీసివేసి సాధకుడు ప్రీతితో కూడినవాడై (43), ఓంకారము ఆదియందు నమః అంతమునందు గల మంత్రములతో యథోచితముగా స్వస్తికాసనము, పద్మాసనము ఇత్యాదులను కల్పించవలెను (44).

తస్మా త్పూర్వదిశం సాక్షాదణిమామయమక్షరమ్‌ | లఘిమా దక్షిణం చైవ మహిమా పశ్చిమా పశ్చిమం తథా || 45

ప్రాప్తిశ్చైవోత్తరం పత్రం ప్రాకామ్యం పావకస్య చ | ఈశిత్వం నైర్‌ ఋతం పత్రం వశిత్వం వాయుగోచరే || 46

సర్వజ్ఞత్వం తథైశాన్యం కర్ణికా సోమ ఉచ్యతే | సోమస్యాధస్తథా సూర్యస్తస్యాధః పావకస్త్వయమ్‌ || 47

ధర్మాదీనపి తస్యాధో భావతః కల్పయేత్‌ క్రమాత్‌ | అవ్యక్తాది చతుర్దిక్షు సోమస్యాంతే గుణత్రయమ్‌ || 48

సద్యోజాతం ప్రవక్ష్యా మిత్యావాహ్య పరమేశ్వరమ్‌ |

ఆ పద్మము యొక్క తూర్పూ దిక్కున గల పత్రము నాశము లేని అణిమా అనే సిద్ధి (సూక్ష్మరూపధారణ శక్తి) అనియు, దక్షిణ పత్రము లఘిమ (మిక్కిలి తేలిక అయ్యే శక్తి ) అనియు, పశ్చిమ పత్రము మహిమ (పెద్ద రూపమును ధరించగలిగే శక్తి) అనియు (45),ఉత్తరపత్రము ప్రాప్తి (ఏ వస్తువునైననూ పొందగలిగే శక్తి) అనియు, ఆగ్నేయ పత్రము ప్రాకామ్యము (అమోఘ సంకల్పశక్తి) అనియు , నైర్‌ ఋతపత్రముఈశిత్వము (సర్వోత్కృష్టత్వము) అనియు, వాయవ్య పత్రము వశిత్వము (జితేంద్రియమత్వము) అనియు (46), ఈశాన్యపత్రము సర్వజ్ఞత్వమనియు, కర్ణిక చంద్రుడనియు చెప్పబడెను. చంద్రునికి క్రింద సూర్యుడు, ఆ క్రింద అగ్ని (47) గలరు. ఆ క్రింద ధర్మార్ధకామ మోక్షములను భావన చేయవలెను. నాలుగు దిక్కుల యందు అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, పంచ భూతములు అను తత్త్వములను, చంద్రునికి పైన త్రిగుణములను భావన చేయవలెను (48). సద్యో జాతం ప్రవక్ష్యామి అను మంత్రముతో పరమేశ్వరుని ఆ వాహన చేయవలెను.

వామదేవేన మంత్రేణ తిష్ఠేచ్చై వాసనోపరి || 49

సాన్నిధ్యం రుద్రగాయత్ర్యా అగఘోరేణ నిరోధయేత్‌ | ఈశానం సర్వవిద్యానామితి మంత్రేణ పూజయేత్‌ || 50

పాద్యమాచమనీయం చ విధాయార్ఘ్యం ప్రదాపయేత్‌ | స్నాపయేద్విధినా రుద్రం గంధచందన వారిణా || 51

పంచగవ్యవిధానేన గృహ్యా పాత్రేsభిమంత్ర్య చ | ప్రణవేనైవ గవ్యేన స్నాపయేత్పయసా చ తమ్‌ || 52

దధ్నా చ మధునా చైవ తథా చేక్షురసన తు | ఘృతేన తు యథా పూజ్య సర్వకామహితావహమ్‌ || 53

వామదేవాయ అను మంత్రముతో శివునకు ఆసనము నీయవలెను (49). తత్పురుషాయ అను మంత్రముతో శివుని ధ్యానించి, అఘోరేభ్యః అను మంత్రముతో శివుని స్థిరుని చేయవలెను. ఈశానం సర్వ విద్యానామ్‌ అను మంత్రముతో పూజించవలెను (50). పాద్యమును, ఆచమనమును, అర్ఘ్యమును ఈయవలెను. గంధ జలముతో రుద్రుని యథావిధిగా అభిషేకించవలెను (51). పంచగవ్యములను పాత్రలో నుంచి, ప్రణవముతో అభిమంత్రించి అభిషేకించవలెను. మరియు ఆవు పాలతో అభిషేకించవలెను (52). పెరుగు, తేనే, చెరుకు రసము, నేయి అను ద్రవ్యములతో అభిషేకించినచో, కామనలన్నియు ఈడేరి హితము చేకూరును (53).

పుణ్యౖర్ద్రవ్యైర్మహాదేవం ప్రణవేనాభిషేచయేత్‌ | పవిత్రజల భాండేషు మంత్రైస్తోయం క్షిపేత్తతః || 54

శుద్ధీకృత్య యథాన్యాయం సితవసై#్త్రణ సాధకః | తావద్దూరం న కర్తవ్యం న యావచ్చందనం క్షిపేత్‌ || 55

తందులైస్సుందరైస్తత్ర పూజయేచ్ఛంకరం ముదా | కుశాపామార్గ కర్పూర జాతి చంపకపాటలైః || 56

కరవీరైస్సితైశ్చైవ మల్లికాకమలోత్పతైః | అపూర్వపూషై#్పర్వివిధైశ్చనందనాధ్యైస్తథైవ చ || 57

పుణ్య ద్రవ్యములతో ప్రణవోచ్చారణ పూర్వకముగా మహాదేవుని అభిషేకించవలెను. తరువాత పవిత్ర కలశముల యందు మంత్ర పూర్వకముగా జలము నుంచవలెను (54). సాధకుడు ఆ జలమును తెల్లని వస్త్రముతో వడకట్టి శుద్ధి చేయవలెను. శివునకు చందనమును అర్పించువరకు ఆ జలమును దూరము చేయరాదు (55). అపుడు శంకరుని ఆనందముగా చక్కని అక్షతలతో పూజించవలెను. దర్భలు, అపామార్గ పుష్పములు, తెల్లని మల్లెలు, ముద్ద సంపెంగలు, పాటలు పుష్పములు (56), తెల్ల గన్నేరు పువ్వులు, మల్లెలు, పద్మములు, కలువలు ఇత్యాది వివిధ పుష్పములతో, చందనాదులతో పూజించవలెను (57).

జలేన జలధారాం చ కల్పయేత్పరమేశ్వరే | పాత్రైశ్చ వివిధైర్దేవం స్నాపయేచ్చ మహేశ్వరమ్‌ || 58

మంత్రపూర్వం ప్రకర్తవ్యా పూజా సర్వఫలప్రదా | మంత్రాంశ్చ తుభ్యం తాంస్తాత సర్వకామార్థ సిద్ధయే || 59

ప్రవక్ష్యామి సమాసేన సావధానతయా శృణు | పావమానేన మంత్రేణ తథా వాజ్మ ఇత్యనేన చ || 60

రుద్రేణ నీలరుద్రేణ సుశుక్లేన శుభేన చ | హోతారేణ తథా శీర్షా శుభేనాథర్వణన చ | 61

శాంత్యా వాథ పునశ్శాం త్యా భారుణ్డనారుణన చ | అర్థాభీష్టేన సామ్నా చ తథా దేవవ్రతేన చ || 62

రథం తరేణ పురుషేణ సూక్తేన యుక్తేన చ | మృత్యుంజయేన మంత్రేణ తథా పంచాక్షరేణ చ || 63

జలధారాస్సహస్రేణ శ##తేనైకోత్తరేణ వా | కర్తవ్యా వేదమార్గేణ నామభిర్వాథ వా పునః || 64

పరమేశ్వరునిపై పడునట్లు జలధారను కల్పించవలెను. వివిధి కలశములలోని జలముతో మహేశ్వరునకు అభిషేకము చేయవలెను (58). సమంత్రకముగా చేసే పూజ సర్వఫలముల నిచ్చును. ఓ వత్సా! కోర్కెలన్నియూ ఈడేరుట కొరకై నీకు ఆ మంత్రములను (59) సంగ్రహముగా చెప్పెదను. సావధానముగా వినుము. పవమాన సూక్తము, వాజ్ఞ్మే ఇత్యాది మంత్రము (60), రుద్ర నీలరుద్ర మంత్రములు, శుక్లయుజుర్వేదమంత్రములు, శుభకరములగు ఋగ్వేద మంత్రములు, మరియు అథర్వ శీర్ష మంత్రములు (61), వివిధి వేదశాఖలలోని శాంతి మంత్రములు, భరుండ మంత్రములు, అరుణ మంత్రములు, అర్థాభీష్టసామ, దేవ వ్రతసామ (62), రథంతర సామ, పురుషసూక్తము, మృత్యుంజయ మంత్రము, పంచాక్షరి (63) ఇత్యాది మంత్రములతో, వేయి జలధారలతో, లేదా నూట ఎనిమిది జలధారలతో అభిషేకించవలెను. ఇది వేదమార్గము. నామములతో నైననూ పూజించవలెను (64).

తతశ్చందనపుష్పాది రోపణీయం శివోపరి | దాపయేత్ర్పణవేనైవ ముఖవాసాదికం తథా || 65

తతస్స్ఫటిక సంకాశం దేవం నిష్కలమక్షయమ్‌ | కారణం సర్వలోకానాం సర్వలోకమయం పరమ్‌ || 66

బ్రహ్మేంద్రోపేంద్ర విష్ణ్వాద్యైరపి దేవైరగోచరమ్‌ | వేదవిద్భిర్తి వేదాంతే త్వగోచరమితి స్మృతమ్‌|| 67

ఆదిమధ్యాంతరహితం భేషజం సర్వరోగిణామ్‌ | శివతత్త్వమితి ఖ్యాతం శివలింగే వ్యవస్థితమ్‌ || 68

ప్రణవేనైవ మంత్రేణ పూజయేల్లింగమూర్ధని |

తరువాత చందనము, పుష్పములు, తాంబూలము మొదలగు వాటిని శివునకు ఓం కారముతో అర్పించవలెను (65). తరువాత స్పటికమువలె తెల్లని వాడు, అంశములు లేనివాడు, నాశము లేనివాడు, సర్వలోకములకు కారణుడు, సర్వలోకస్వరూపుడు, సర్వోత్కృష్టుడు (66), బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడగు విష్ణువు మొదలగు దేవతలకు కూడ గోచరము కానివాడు, ఉపనిషత్తులలో వేదవేత్తలచే అగోచరుడు అని వర్ణింపబడిన వాడు (67). ఆది, మధ్యము, అంతములు లేనివాడు, సర్వరోగములకు వైద్యుడు, సర్వమంగళకరమగు తత్త్వమని ప్రఖ్యాతి గాంచినవాడు, శివలింగమునందుండు వాడు అగు మహాదేవుని (68) లింగము నందు ఓం కారముచే పూజించవలెను.

ధూపై ర్దీపైశ్చ నైవేద్యై స్తాంబూలై స్సుందరైస్తథా || 69

నీరాజనేన రమ్యేణ యథోక్త విధినా తతః | నమస్కారై స్స వై శ్చాన్యై ర్మంత్రైర్నానావిధైరపి || 70

అర్ఘ్యం దత్త్వా తు పుష్పాణి పాదయోస్సువికీర్య చ | ప్రణిపత్య చ దేవేశ మాత్మ నారాధయేచ్ఛివమ్‌ || 71

హస్తే గృహీత్వా పుష్పాణి సముత్థాయ కృతాంజలిః | ప్రార్థయేత్పునరీశానం మంత్రేణానేన శంకరమ్‌ || 72

అజ్ఞానాద్యది వా జ్ఞానా జ్ఞపపూజాదికం మయా | కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర || 73

ధూపదీపనైవేద్యములతో, అందమగు తాంబూలములతో (69), మరియు రమ్యమగు నీరాజనముతో యథావిధిగా పూజించి తరువాత నమస్కారమును చేసి, ఇతర మంత్రములతో స్తుతించి (70) , ఆర్ఘ్యమును ఇచ్చి, పాదముల యందు పుష్పములను జల్లి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్సులో దేవదేవుడగు శివుని ధ్యానించవలెను (71). చేతిలో పుష్పములను తీసుకొని, లేచి నిలబడి, దోసిలి యొగ్గి ఈ క్రింది మంత్రముతో మరల శంకరుని ప్రార్థించవలెను (72). హే శంకరా! తెలిసి గాని తెలియక గాని నేను చేసిన జపపూజాదులు నీ దయచే సఫలమగు గాక! (73).

పఠిత్వైవం చ పుష్పాణి శివోపరి ముదా న్యసేత్‌ | స్వస్త్యయనం తతః కృత్వా హ్యాశిషో వివిధాస్తథా || 74

మార్జనం తు తతః కార్యం శివస్యోపరి వై పునః | నమస్కారం తతః క్షాంతిం పునరాచమనాయ చ || 75

అఘోచ్చారణ ముచ్చార్య నమస్కారం ప్రకల్పయేత్‌ | ప్రార్ధయేచ్చ పునస్తత్ర సర్వభావ సమన్వితః || 76

శివే భక్తిశ్శివే భక్తిశ్శివే భక్తిర్భవే భ##వే | అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ || 77

ఇతి సంప్రార్థ్య దేవేశం సర్వసిద్ధిప్రదాయకమ్‌ | పూజయేత్పరయా భక్త్యా గలనాదైర్విశేషతః || 78

ఈ విధముగా పఠించి, ఆ పుష్పములను ఆనందముతో శివునిపై నుంచవలెను. తరువాత స్వస్తి మంత్రములను పఠించి, వివిధములగు ఆశీస్సులను కోరవలెను (74). తరువాత శివుని పై మరల జలమును ప్రోక్షించవలెను. తరువాత నమస్కారమును చేసి, అపరాధక్షమాపణను చెప్పి, మరల ఆచమనమును చేయవలెను (75). అఘోర మంత్రమునుచ్చరించి నమస్కారమును చేయవలెను. మరల పూర్ణశ్రద్ధతో గూడి ప్రార్థించవలెను (76). ప్రతిజన్మలో శివుని యందు దృఢమగు భక్తి కలుగవలెను. నాకు మరియొక శరణు లేదు. నీవే నాకు శరణు (77). సర్వసిద్ధులను ఇచ్చే దేవదేవుని ఈ తీరున ప్రార్థించి, జయజయ ధ్వానములను చేయుచూ పరమశ్రద్ధతో పూజించవలెను (78).

నమస్కారం తతః కృత్వా పరివారగణౖస్సహ | ప్రహర్షమతులం లబ్ధ్వా కార్యం కుర్యాద్యథాసుఖమ్‌ || 79

ఏవం యః పూజయేన్నిత్యం శివభక్తిపరాయణః | తస్య వై సకలా సిద్ధిర్జాయతే తు పదే పదే || 80

వాగ్మీ స జాయతే తస్య మనోభీష్టఫలం ధ్రువమ్‌ | రోగం దుఃఖం చ శోకం చ హ్యుద్వేగం కృత్రిమం తథా || 81

కౌటిల్యం చ గరం చైవ యద్యుద్దుఃఖముపస్థితమ్‌ | తద్దుఃఖం నాశయత్యేవ శివః శివకరః పరః || 82

తరువాత కుటుంబం సభ్యులతో కలిసి నమస్కరించి, గొప్ప ఆనందమును పొంది, సుఖముగా మిగిలిన కార్యములను చేసుకొనవలెను (79). ఈ విధముగా ఎవడైతే శివభక్తితో నిండిన హృదయము గలవాడై నిత్యము పూజించునో, వానికి అడుగడుగునా అన్ని కార్యములు సిద్ధించును (80). అతడు గొప్ప వక్త యగును. అతని మనస్సులోని కోర్కెలన్నియూ నిశ్చయముగా నీడేరును. రోగము, శోకము, కృత్రిమమగు ఉద్వేగము (81), మోసము, విషము ఇత్యాది ఆపదలు ఏవి సంప్రాప్తమైననూ, పరమమంగళకరుడగు శివుడు ఆ దుఃఖములను నిశ్చయముగా నాశనము జేయును (82).

కల్యాణం జాయతే తస్య శుక్లపక్షే యథా శశీ | వర్ధతే సద్గుణస్తత్ర ధ్రువం శంకర పూజనాత్‌ || 83

ఇతి పూజావిధిశ్శంభోః ప్రోక్తస్తే మునిసత్తమ | అతః పరం చ శశ్రూషుః కిం ప్రష్టాసి చ నారద || 84

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే శివపూజావిధి వర్ణనం నామ ఏకాదశేsధ్యాయః (11).

శంకరుని పూజించు భక్తునికి మంగళములు కలుగును. అతని సద్గుణము శుక్లపక్షమునందలి చంద్రుని వలె వృద్ధినొందును (83). ఓ మహర్షీ! నారదా! నీకింతవరకు శివపూజావిధిని చెప్పితిని. ఇంకనూ వినే కోరిక యున్నచో ప్రశ్నించుము (84).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండలో శివపూజావిధివర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

Sri Sivamahapuranamu-I    Chapters