Sri Sivamahapuranamu-I
Chapters
అథ ద్వాదశోsధ్యాయః సార, అసార వస్తు విచారము నారద ఉవాచ | బ్రహ్మన్ ప్రజాపతే తాత ధ్యన్యస్త్వం శివసక్తధీః | ఏత దేవ పునస్సమ్యగ్ బ్రూహిమే విస్తరాద్విధే ||
1 నారదుడిట్లు పలికెను - ఓ ప్రజాపతీ! తండ్రీ! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. హే బ్రహ్మన్! ఈ విషయమునే మరల వివరముగా చెప్పుము (1). బ్రహ్మోవాచ | ఏకస్మిన్ సమయే తాత ఋషీనాహూయ సర్వతః |నిర్జరాంశ్చావదం ప్రీత్యా సువచః పద్మ సంభవః ||
2 యది నిత్యసుఖే శ్రద్ధా యది సిద్ధేశ్చ కాముకాః | ఆగంతవ్యం మయా సార్ధం తీరం క్షిరపయోనిధేః || 3 ఇత్యేతద్వచనం శ్రుత్వా గతాస్తే హి మయా సహ | యత్రాస్తే భగవాన్ విష్ణుస్సర్వేషాం హితకారకః || 4 తత్ర గత్వా జగన్నాథం దేవదేవం జనార్దనమ్ | ఉపతస్థుస్సురా నత్వా సుకృతాంజలయో మునే || 5 తాన్ దృష్ట్వా చ తదా విష్ణు ర్బ్రహ్మాద్యానమరాన్ స్థితాన్ | స్మరన్ శివపదాం భోజమబ్రవీత్పరమం వచః || 6 బ్రహ్మ ఇట్లు పలికెను - వత్సా! ఒకప్పుడు పద్మ సంభవుడనగు నేను అన్ని చోట్ల నుండి ఋషులను , దేవతలను ఆహ్వానించివారితో ప్రేమగా నిట్లంటిని (2). మీకు శాశ్వత సుఖమునందు శ్రధ్ధ, మోక్షములనందు ఇచ్ఛ ఉన్నచో నాతో పాలసముద్ర తీరమునకు రండు (3). ఈ మాటను విని వారు నాతో బయల్దేరిరి. సర్వులకు హితమును చేసే విష్ణు భగవానుడు గల చోటికి వెళ్లితిమి (4). ఓ మహర్షీ! అచటకు వెళ్లి, జగన్నాథుడు, దేవదేవుడునగు జనార్దనుని నమస్కరించి, దేవతలు దోసిలి యొగ్గి దగ్గరకు వెళ్లిరి (5). అపుడు విష్ణువు ఆ బ్రహ్మాది దేవతలను చూచి, శివుని పాదపద్మములను స్మరించి, ఈ శ్రేష్ఠవచనములను పలికెను (6). విష్ణురువాచ | కిమర్థ మాగతా యూయం బ్రహ్మాద్యాశ్చ సురర్షయః | సర్వం వదత తత్ర్పీత్యా కిం కార్యం విద్యతేsధునా || 7 విష్ణువు ఇట్లు పలికెను - దేవశ్రేష్ఠులగు మీరు బ్రహ్మతో గూడి ఇచటకు వచ్చుటకు గల ప్రయోజనమును ప్రీతితో పూర్ణముగా చెప్పుడు. నేనిప్పుడు చేయదగిన పనియేది ?(7). బ్రహ్మో వాచ - ఇతి పృష్టా స్తదా తేన విష్ణువా చ మయా సురాః | పునః ప్రణమ్య తం ప్రీత్యా కిం కార్యం విద్యతేsధునా || 8 వినివేదయితుం కార్యం హ్యబ్రువన్వచనం శుభమ్ | బ్రహ్మ ఇట్లు పలికెను - విష్ణువు ఇట్లు ప్రశ్నించగా, దేవతలు నాతో గూడి మరల ఆయనకు ప్రణమిల్లి, తాము కోరే కార్యమును (8) నివేదించుటకై ఈ శుభమగు మాటలను పలికిరి. దేవా ఊచుః | నిత్యం సేవా తు కసై#్యవ కార్వా దుఃఖాపహారిణీ || 9 ఇత్యేతద్వచనం శ్రుత్వా భగవాన్భక్తవత్సలః | సామరస్య మమ ప్రీత్యా కృపయా వాక్యమబ్రవీత్ || 10 దేవతలు ఇట్లు పలికిరి - నిత్యము ఎవరిని సేవించినచో దుఃఖములు తొలగును? (9) భక్తవత్సలుడగు విష్ణుభగవానుడు ఈ మాటను విని దేవతలతో గూడిన నాతో ప్రేమతో నిట్లు పలికెను (10). శ్రీ భగవానువాచ | బ్రహ్మన్ శృణు సురైస్సమ్యక్ శ్రుతం చ భవతా పురా | తథా పి కథ్యతే తుభ్యం దేవేభ్యశ్చ తథా పునః || 11 దృష్టం చ దృశ్యతేsద్యైవ కిం పునః పృచ్ఛ్యతేsధునా | బ్రహ్మన్ దేవైస్సమసై#్తశ్చ బహుధా కార్యతత్పరైః || 12 సేవ్యస్సేవస్సదా దేవశ్సంకరస్సర్వ దుఃఖహా | మమాపి కథితం తేన బ్రహ్మణోsపి విశేషతః || 13 ప్రస్తుతం చైవ దృష్టం వస్సర్వం దృష్టాంతమద్భుతమ్ | త్యాజ్యం తదర్చనం నైవ కదాపి సుఖమీప్సుభిః || 14 శ్రీ భగవానుడిట్లు పలికెను - ఓ బ్రహ్మా! వినుము. పూర్వమునీవు, మరియు దేవతలు పూర్తిగా వినియుంటిరి. అయిననూ, నీకు, దేవతలకు మరల చెప్పుచున్నాను (11). దీనిని మీరు ఇది వరలో చూచియున్నారు. ఇప్పుడు చూచుచున్నారు. మరల ఇప్పుడు ఏల ప్రశ్నించుచున్నారు? ఓ బ్రహ్మా! వివిధ కార్యముల యందు నిమగ్నమైయున్న దేవతలందరు (12) సర్వదా సర్వదుఃఖములను పోగొట్టే శంకరదేవుని సేవించవలెను. ఈ విషయమును ఆయన నాకు, బ్రహ్మకు ప్రత్యేకముగా చెప్పియున్నాడు (13). అద్భుతమగు దృష్టాంతము (లింగావిర్భావము) ను మీరు చూచియే యున్నారు. మీరు సుఖమును కోరువారైనచో, శివార్చనను ఏనాడూ విడువకుడు (14). సంత్యజ్య దేవదేవేశం లింగమూర్తిం మహేశ్వరమ్ | దారపుత్రాస్తథైవైతే నష్టాస్తేsపి సబాంధవాః || 15 మయా చ మోహితాస్తే వై మాయయా దూరతః కృతాః | సర్వే వినష్టాః ప్రధ్వస్తాశ్శివేన రహితా యదా || 16 తస్మాత్సదా పూజనీయో లింగమూర్తి ధరో హరః | సేవనీయో విశేషేణ శ్రద్ధయా దేవసత్తమః || 17 శర్వ లింగార్చనాదేవ దేవా దైత్యాశ్చ సత్తమాః | అహం త్వం చ తథా బ్రహ్మన్ కథం తద్విస్మృతం త్వయా || 18 దేవదేవుడగు మహేశ్వరుని లింగమూర్తిని విడిచిన వారు భార్య , పిల్లలు మరియు బంధువులతో గూడి వినాశమును పొందెదరు (15). వారిని నేను మాయచే మోహింపజేసి నాకు దూరమగునట్లు జేసెదను. శివుని వీడిన అట్టి వ్యక్తులు అందరు సర్వమును పోగొట్టుకొని వినాశమును పొందెదరు (16). కావున లింగాకారమును ధరించిన శివుని సర్వదా పూజించవలెను. దేవోత్తముడగు శివుని ప్రత్యేక శ్రద్ధతో సేవించవలెను (17). శివలింగార్చన వలననే దేవతలు, రాక్షసులు, నేను, మరియు నీవు గొప్పవారమైతిమి. ఓ బ్రహ్మా! నీవు ఈ విషయమునేట్లు విస్మరించితివి? (18) తల్లింగమర్చయేన్నిత్యం యేన కేనాపి హేతునా | తస్మాద్ర్బహ్మన్ సురాశ్శర్వస్సర్వకామఫలేప్సయా || 19 సా హానిస్తన్మహాచ్ఛిద్రం సాంధతా సా చ ముగ్దతా | యన్ముహూర్తం క్షణం వాపి శివం నైవ సమర్చయేత్ || 20 భవ భక్తిపరా యే చ భవప్రణత చేతసః | భవ సంస్మర ణా యే చ న తే దుఃఖస్య భాజనాః || 21 ఓ బ్రహ్మా! దేవతలారా! కారణమేదైనా, కోర్కెలన్నియూ ఈడేరుటకై నిత్యము శివలింగమును అర్చించవలెను (19). ముహూర్తకాలముగాని, క్షణకాలము గాని శివుని అర్చించినచో, అది హానిని కలిగించును. అది మహా దోషము. అది అజ్ఞానము. అది మోహము (20). శివుని యందు దృఢమగు భక్తి గలవారు, శివునకు మనసా నమస్కరించువారు, మరియు శివుని స్మరించువారు దుఃఖభాజనులు కారు (21). భవనాని మనోజ్ఞాని మనోజ్ఞా భరణాస్త్ర్రియః | ధనం చ తుష్టి పర్యంతం పుత్ర పౌత్రాది సంతతిః || 22 ఆరోగ్యం చ శరీరం చ ప్రతిష్ఠాం చాప్యలౌకికీమ్ | యే వాంఛంతి మహాభాగాస్సుఖం వా త్రిదశాలయమ్ | 23 అంతే ముక్తి ఫలం చైవ భక్తిం వా పరమేశితుః | పూర్వ పుణ్యాతిరేకేణ తేsర్బయంతి సదాశివమ్ || 24 సుందరమగు భవనములను, సుందరమగు ఆభరమణములను, స్త్రీలను, చాలు అనే టంతటి ధనమును, పుత్రులు పౌత్రులు మొదలగు సంతానమును (22), ఆరోగ్యమును, దృఢమగు శరీరమును, దివ్యమగు యశస్సును, స్వర్గలోక సుఖమును (23), అంతమునందు ముక్తిని, లేదా పరమేశ్వరుని యందు భక్తిని గోరు పుణ్యాత్ములను అతి శయించిన పూర్వపుణ్య ప్రభావముచే సదాశివుని అర్చించెదరు (24). యోsర్చయేచ్ఛివలింగం వై నిత్యం భక్తి పరాయణః | తస్య వై సఫలా సిద్ధిర్న స పాపైః ప్రయుజ్యతే || 25 నిత్యము శివలింగమును భక్తి శ్రద్ధలతో అర్చించే మానవుడు సంసిద్ధుడగును. పాపము లాతనిని స్పృశించవు (25). ఇత్యుక్తాశ్చ తదా దేవాః ప్రణిపత్య హరిం స్వయమ్ | లింగాని ప్రార్థయామాసుస్సర్వకామప్తయే నృణామ్ || 26 తచ్ఛ్రుత్వా చ తదా విష్ణుర్విశ్వకర్మాణమబ్ర వీత్ | అహం చ ముని శార్దూల జీ వోద్దార పరాయణః || 27 విశ్వకర్మన్ యథా శంభోః కల్పయిత్వా శుభాని చ | లింగాని సర్వదేవే భ్యో దేయాని వచనాన్మమ || 28 లింగాని కల్పయిత్వైవ మధికారాను రూపతః | విశ్వకర్మా దదౌ తేభ్యో నియోగాన్మమ వా హరేః || 29 విష్ణువు ఈ తీరున పలుకగా, దేవతలు ఆయనకు నమస్కరించి, మానవుల సర్వకామనలు ఈడేరుట కొరకై లింగములను ప్రార్థించిరి (26). ఓ మునిశ్రేష్ఠా! ఆ మాటలను విని, జీవులను ఉద్ధరించుటయే పరమలక్ష్యముగా గల విష్ణువు, మరియు నేను విశ్వకర్మతో నిట్లంటిమి (27). ఓ విశ్వకర్మా! నా శాసనముచే నీవు శంభుని మంగళకరములగు లింగములను నిర్మించి దేవతలందరికీ ఈయవలెను (28). విశ్వకర్మ నాయొక్క ఆజ్ఞచేత, లేదా విష్ణువు ఆజ్ఞచేత అధికారమునకు తగిన విధముగా లింగములను నిర్మించి వారికిచ్చెను (29). తదేవ కథయామ్యద్య శ్రూయతామృషిసత్తమ | పద్మారాగమయం శక్రో హేమ విశ్రవసస్సుతః || 30 పీతం మణిమయం ధర్మో వరుణశ్శ్యామలం శివమ్ | ఇంద్రనీలమయం విష్ణుర్బ్రహ్మా హేమమయం తథా || 31 విశ్వేదేవాస్తథా రౌప్యం వసవశ్చ తథైవ చ | ఆరకూడమయం వాపి పార్థివం హ్యశ్వినౌ మునే || 32 లక్ష్మీశ్చ స్ఫాటికం దేవీ హ్యాది త్యాస్తామ్ర నిర్మితమ్ | మౌక్తికం సోమరాజో వై వజ్రలింగం విభావసుః || 33 ఓ మహర్షీ! ఆ వివరములను ఇప్పుడు చెప్పెదను. వినుము. ఇంద్రుడు పద్మరాగ లింగమును, కుబేరుడు బంగరు లింగమును (30), యముడు పచ్చని మణిలింగమును, వరుణుడు శుభకరమగు శ్యామవర్ణము గల లింగమును, విష్ణువు ఇంద్రనీల మాణిక్య నిర్మితమైన లింగమును, బ్రహ్మ బంగరు లింగమును (31), విశ్వే దేవతలు వెండి లింగమును, వసువులు ఇత్తడి లింగమును, అశ్వినీ దేవతలు పార్థివ లింగమును (32), లక్ష్మీదేవి స్ఫాటిక లింగమును, ఆదిత్యులు రాగి లింగమును, చంద్రుడు ముత్యపు లింగమును, అగ్ని వజ్ర లింగమును పొందెను (33). మృణ్మయం చైవ విప్రేంద్రా విప్రపత్న్యస్తథైవ చ | చాందనం చ మయో నాగాః ప్రవాలమయమాదరాత్ || 34 నవనీతమయం దేవీ యోగీ భస్మమయం తథా | యక్షా దధిమయం లింగం ఛాయ పిష్టమయం తథా || 35 శివలింగం చ బ్రహ్మాణీ రత్నం పూజయతి ధ్రువమ్ | పారదం పార్థివం బాణ స్సమర్చతి పరేsపి వా || 36 ఏవం విధాని లింగాని దత్తాని విశ్వకర్మణా | తే పూజయంతి సర్వేవై దేవా ఋషి గణాస్తథా || 37 విప్రశ్రేష్ఠులు, వారి పత్నులు మట్టితో చేసిన లింగములను, మయుడు చందన లింగమును, నాగులు పగడపు లింగములను ఆదరముతో స్వీకరించిరి (34). శచీ దేవి వెన్నతో చేసిన లింగమును, యోగులు భస్మలింగమును, యక్షులు పెరుగు లింగమును, ఛాయాదేవి పిండి లింగమును (35), సరస్వతి రత్నలింగమును పూజించిరి. బాణుడు పాదరసలిగమును పూజించెను. ఇతరులు కూడ ఆ లింగమును పూజించెదరు (36) విశ్వకర్మ ఆ విధముగా నానా లింగములనీయగా, అందరు దేవతలు, ఋషులు పూజించుచున్నారు (37). విష్ణుర్దత్వా చ లింగాని దేవేభ్యో హి తకామ్యయా | పూజావిధిం సమాచష్ట బ్రహ్మ ణ మో పినాకినః || 38 తచ్ఛ్రత్వా వచనం తస్య బ్రహ్మాహం దేవసత్తమైః | అగచ్ఛం చ స్వకం ధామ హర్ష నిర్భరమానసః || 39 తత్రా గత్య ఋషీన్ సర్వాన్ దేవాంశ్చా హం తథా మునే | శివ పూజా విధిం సమ్యగబ్రువం సక లేష్ట దమ్ || 40 సర్వుల హితమును గోరి విష్ణువు నాకు, దేవతలకు లింగములనిచ్చి పినాకధారియగదు శివుని పూజావిధిని వివరించెను (38). విష్ణువు యొక్క ఉపదేశమును విన్న తరువాత బ్రహ్మనగు నేను దేవతలతో కూడి ఆనందముతో నిండిన అంతరంగము గలవాడనై నా ధామమునకు తిరిగి వచ్చితిని (39). ఓ మహర్షీ! తిరిగి వచ్చిన తరువానత నేను దేవతలకు, ఋషులకు అందరికి, సకలకామనల నీడేర్చు శివపూజావిధిని చక్కగా వివరించితిని (40). బ్రహ్మోవాచ | శ్రూయతామృషయ స్సర్వే సామరః ప్రేమతత్పరాః | శివపూజా విధిం ప్రీత్యా కథయే భుక్తిముక్తిదమ్ || 41 మానుషం జన్మ సంప్రాప్యం దుర్లభం సర్వజంతుషు | తత్రాపి సత్కులే దేవా దుష్ప్రాప్యం చ మునీశ్వరాః || 42 అవ్యంగం చైవ విప్రేషు సాచారేషు సపుణ్యతః | శివసంతోష హేతోశ్చ కర్మ స్వోక్తం సమాచరేత్ || 43 యద్య జ్ఞాతి సముద్దిష్టం తత్తత్కర్మన లంఘయేత్ | యావద్దానస్య సంపత్తి స్తావత్కర్మ సమావహేత్ || 44 ఓ ఋషులారా! మీరందరు ప్రేమనిండిన హృదయము గలవారై దేవతలతో గూడి వినుడు. భుక్తిని, ముక్తిని ఇచ్చే శివపూజావిధిని ప్రీతితో చెప్పెదను (41). ఓమునిశ్రేష్ఠులారా! దేవతలారా! సర్వప్రాణులలో మనుష్య జన్మ మిక్కిలి దుర్లభము. మనుష్యులలో సత్కులములో జన్మించుట మరింత దుర్లభము (42). సదాచారులగు విప్రుల ఇంటిలో జన్మ పుణ్యము వలననే లభించును. మానవులు తమకు విహితమైన వర్ణాశ్రమ ధర్మములను శివుని సంతోషము కొరకై ఆచరించవలెను.(43). విహితకర్మను వీడరాదు. ఉన్న సంపదకు తగ్గట్లుగా దానము చేయవలెను (44). కర్మయజ్ఞ సహస్రేభ్య స్తపోయజ్ఞో విశిష్యతే | తపో యజ్ఞ సహస్రే భ్యో జపయజ్ఞో విశిష్యతే || 45 ధ్యానయ జ్ఞాత్పరం నాస్తి ధ్యానం జ్ఞానస్య సాధనమ్ | యతస్సమరసం స్వేష్టం యోగీ ధ్యానేన పశ్యతి || 46 ధ్యానయజ్ఞ రతస్యాస్య సదా సంనిహితశ్శివః | నాస్తి విజ్ఞానినాం కించిత్ర్పాయశ్చిత్తాది శోధనమ్ || 47 విశుద్ధా విద్యయా యే చ బ్రహ్మన్ బ్రహ్మ విదో జనాః | నాస్తి క్రియా చ తేషాం వై సుఖం దుఃఖం విచారతః || 48 వేయి కర్మ యజ్ఞముల కంటె ఒక తపో యజ్ఞము గొప్పది. వేయి తపోయజ్ఞముల కంటె ఒక జపయజ్ఞము గొప్పది (45). ధ్యానము కంటె గొప్ప యజ్ఞము లేదు. ధ్యానము జ్ఞానమునకు సాధనము. ఏలయనగా, యోగి ధ్యానముచేత తన ఇష్ట దైవమును దర్శించి, సమరసతను పొందును (46). ధ్యానయ జ్ఞనిష్ఠుడగు యోగికి శివుడు సర్వదా సన్నిహితుడై యుండును. విజ్ఞానులకు శుద్ది కొరకై ప్రాయశ్చిత్తాదులతో పని లేదు (47). బ్రహ్మవేత్తలకు జ్ఞానమే శుద్ధి కారణము. వారికి కర్మలతో పనిలేదు. వారు సుఖ దుఃఖములను సరుకు జేయరు (48). ధర్మా ధర్మౌ జపో హోమో ధ్యానం ధ్యానవిధిస్తథా | సర్వదా నిర్వికారాస్తే విద్యయా చ తయామరాః || 49 పరానందకరం లింగం విశుద్ధం శివమక్షరమ్ | నిష్కలం సర్వగం జ్ఞేయం యోగినాం హృది సంస్థితమ్ || 50 లింగం ద్వివిధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరం ద్విజాః | బాహ్యం స్థూలం సముద్దిష్టం సూక్ష్మమాభ్యంతరం మతమ్ || 51 కర్మయజ్ఞ రతా యే చ స్థూలలింగార్చనే రతాః | అసతాం భావనార్థాయ సూక్ష్మేణ స్థూల విగ్రహాః || 52 వారు ధర్మా ధర్మములకు, జపహోమములకు, ధ్యానమునకు, ధ్యానవిధికి అతీతులు. జ్ఞానముచే అమరులైన వారు సర్వదా వికార రహితులై యుందురు (49). పరమానందమునిచ్చునది, విశుద్ధమైనది, మంగళకరమైనది, నాశరహితమైనది, సర్వవ్యాపకము అగు నిరాకారలింగము యోగుల హృదయములో నుండునని తెలియదగును (50). ఓ విప్రులారా! బాహ్యము, అంతరము అని లింగము ద్వివిధముగ నున్నది యని చెప్పబడెను. స్థూల లింగము బాహ్యము. హృదయగుహలో నుండునది సూక్ష్మము (అంతరము) అని చెప్పబడెను (51). స్థూలలింగమును అర్చించువారు కర్మయజ్ఞ పరాయణులు అగుదురు. అజ్ఞానులు మనస్సులో భావన చేయగల్గుట కొరకై స్థూల విగ్రహములు నిర్దేశింప బడినవి (52). ఆధ్యాత్మికం యల్లింగం ప్రత్యక్షం యస్య నో భ##వేత్ | స తల్లింగే తథా స్థూలే కల్పయేచ్చ న చాన్యథా || 53 జ్ఞానినాం సూక్ష్మమమలం భావాత్ర్పత్యక్షమవ్యయమ్ | యథా స్థూల మయుక్తానా ముత్కృష్టాదౌ ప్రకల్పితమ్ || 54 అహో విచారతో నాస్తి హ్యన్యత్తత్త్వార్థ వాదినః |నిష్కలం సకలం చిత్తే సర్వం శివమయం జగత్ || 55 ఏవం జ్ఞాన విముక్తానాం నాస్తి దోషవికల్పనా | విధిశ్చైవ తథా నాస్తి విహితావిహితే తథా || 56 హృదయమునందు ఆరాధింపబడే సూక్ష్మ లింగము ఇంద్రియ గోచరము కాదు. సాధకుడు అట్టి అంతర లింగమునందు, మరియు స్థూల లింగమునందు అర్చన చేయవలెను (53). ఉత్కృష్టమగు ద్రవ్యముచే నిర్మించబడిన స్థూలలింగము అజ్ఞానులకు ఏ తీరున దృష్టిగోచరము అగునో, అదే తీరున జ్ఞానులకు నిర్దోషము, వినాశరహితమునకు సూక్ష్మలింగము భావాత్మకముగ ప్రత్యక్ష మగును (54). శివతత్త్వము నెరింగిన జ్ఞానికి భిన్నముగా నిరాకార లింగము గాని, సాకారలింగము గాని లేదు. ఈ రెండు అతని హృదయమునందే గలవు. విచారించి చూడ, జగత్తు అంతా శివునితో నిండి యున్నది (55). ఇట్లు జ్ఞానముచే జీవన్ముక్తులైన వారికి దోషము యొక్క స్పర్శయైననూ ఉండదు. వారికి విధినిషేధములు వర్తించవు (56). యథా జలేషు కమలం సలిలైర్నావలిప్యతే | తథా జ్ఞాని గృహే తిష్ఠన్ కర్మణా నావబధ్యతే || 57 ఇతి జ్ఞానం సముత్పన్నం యావన్నైవ నరస్య వై | తావచ్చ కర్మణా దేవం శివమారాధయేన్నరః || 58 ప్రత్యయార్థం చ జగతా మేకస్తోsపి దివాకరః | ఏకోsపి బహుధా దృష్టో జలాధారాది వస్తుషు || 59 దృశ్యతే శ్రూయతే లోకే యద్యత్స ద సదాత్మకమ్ | తత్తత్సర్వం సురా విత్త పరం బ్రహ్మ శివాత్మకమ్ || 60 నీటి యందు ఉండే కమలము నీటితో లేపమును పొందదు. అటలనే జ్ఞాని గృహమునందున్ననూ కర్మచే బద్ధుడు కాడు (57). మానవుడు జ్ఞానము కలుగనంతవరకు శివుని వివిధోపచారములతో పూజించవలెను (58). సూర్యుడు ఒక్కడే అయిననూ, వివిధ జల పాత్రల యందు అనేకముగా కన్పట్టును (59). అటులనే , ఓ దేవతలారా! సర్వాత్ముడు, పరబ్రహ్మ యగు శివుడు లోకమునందు వ్యక్త రూపముగను, అవ్యక్త రూపముగను కనబడు చున్నాడు, వినబడుచున్నాడు (60). భేదో జలానాం లోకేsస్మిన్ ప్రతి భావే విచారతః |ఏవమాహుస్తథా చాన్యే సర్వే వేదార్థతత్త్వగాః || 61 హృది సంసారిణః సాక్షాత్సకలః పరమేశ్వరః | ఇతి విజ్ఞానయుక్త స్య కిం తస్య ప్రతిమాదిభిః || 62 ఇతి విజ్ఞానహీనస్య ప్రతిమాకల్పనా శుభా | పదముచ్చైస్సమారోఢుం పుంసో హ్యాలంబనం స్మృతమ్ || 63 ఆలంబనం వినా తస్య పదము చ్చై స్సుదుష్కరమ్ | నిర్గుణ ప్రాప్తయే నౄణాం ప్రతిమాలంబనం స్మృతమ్ || 64 సగుణా న్నిర్గుణ ప్రాప్తి ర్భవతీతి సునిశ్చితమ్ | ఏవం చ సర్వదేవానాం ప్రతిమా ప్రత్యయావహా || 65 నీటిలో అనేక భేదములు కాన్పించును. కాని, విచారణ చేసినచో అవి అన్నియూ జలమే. అటులనే, జగత్తంతయూ పరమేశ్వర స్వరూపమని వేదము యొక్క తత్త్వము నెరింగిన వారు చెప్పెదరు (61). మానవుని హృదయములో పరమేశ్వరుడు స్వయముగా సగుణరూపుడై ఉన్నాడు. ఈ దర్శనము గల జ్ఞానికి ప్రతిమాదులతో పని యేమి? (62). కాని ఈ దర్శనము లేని వాడు ప్రతిమను ఏర్పాటు చేసుకొనుట మంచిది. ఉన్నత స్థానమును పొందుటకై మానవునకు ఆలంబనము ఉండవలెనని పెద్దలు చెప్పెదరు (63). ఆలంబనము లేకుండగా ఉన్నత స్థితిని పొందుట మిక్కిలి కష్టమైన పని. అటులనే, నిర్గుణ పరమాత్మను పొందుటకై మానవులకు ప్రతిమ ఆలంబనమని చెప్పబడినది (64). సగుణారాధన వలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము కలుగునని సిద్ధాంతము. శివ ప్రతిమ వలెనే ఇతర దేవతల ప్రతిమలు కూడా హృదయమునునందు ఈశ్వరాకార వృత్తిని కలిగించి తోడ్పడును (65). దేవశ్చాయం మహీయాన్వై తస్యార్థే పూజనం త్విదమ్ | గంధ చందన పుష్పాది కిమర్థం ప్రతిమాం వినా || 66 తావచ్చ ప్రతిమా పూజ్యా యావద్వి జ్ఞాన సంభవః | జ్ఞానా భావే నపూజ్యేత పతనం తస్య నిశ్చితమ్ || 67 ఏతస్మాత్కారణాద్విప్రా శ్శ్రూయతాం పరమార్థతః | స్వజాత్యుక్తం తు యత్కర్మ కర్తవ్యం తత్ర్పయత్నతః || 68 యత్ర యత్ర యథా భక్తిః కర్తవ్యం పూజనాదికమ్ | వినా పూజనదానాది పాతకం న చ దూరతః || 69 యావచ్చ పాతకం దేహే తావత్సిద్ధిర్న జాయతే . గతే చ పాతకే తస్య సర్వం చ సఫలం భ##వేత్ || 70 శివుడు దేవోత్తముడు. ప్రతిమ లేనిచో శివుని పూజకై సమకూర్చుకోబడిన గంధ చందన పుష్పాది ద్రవ్యములకు వినియోగమే మున్నది?(66).జ్ఞానము ఉదయించు నంతవరకు ప్రతిమను పూజించవలెను. జ్ఞానము కలుగకుండగనే పూజను వీడినాడు పతనమగుట నిశ్చయము (670. ఓ విప్రులారా! పరమార్ధమును వినుడు. ఈ కారణము వలన మానవుడు తనకు విహితమైన కర్మను ప్రయత్న పూర్వకముగా చేయవలెను (68). మానవుడు భక్తిని అను రూపముగా వివిధ ప్రతిమాదులను పూజించవలెను. పూజ, దానము మొదలగు కర్మలను వీడినచో, పాపము దూరము కాదు (69). దేహము (సూక్ష్మ) లో పాపము ఉన్నంతవరకు సిద్ధి కలుగదు. పాపము నశించిన మానవునకు సర్వము సఫలమగును (70). తథా చ మలినే వస్త్రే రంగశ్శుభతరో న హి | క్షాలనే హి కృతే శుధ్ధే సర్వో రంగః ప్రసజ్ఞతే || 71 తథా చ నిర్మలే దేహే దేవానాం సమ్యగర్చయా | జ్ఞానరంగః ప్రజాయేత తదా విజ్ఞానసంభవః || 72 విజ్ఞానస్య చ సన్మూలం భక్తి రవ్యభి చారిణీ | జ్ఞానస్యాపి చ సన్మూలం భక్తి రేవాభిధీయతే || 73 భ##క్తేర్మూలం హి సత్కర్మ స్వేష్ట దేవాది పూజనమ్ | తన్మూలం సద్గురుః ప్రోక్తస్తన్మూలం సంగతిస్సతామ్ || 74 మలిన వస్త్ర ముపై రంగు అందముగా పట్టదు. ఉతికి శుద్ధిచేసిన వస్త్రముపై రంగు పూర్తిగా పట్టును (71). అదే విధముగా దేవతలను చక్కగా అర్చించుటచే సాధకుని (సూక్ష్మ) దేహము శుద్ధమై, జ్ఞానమనే రంగు కలుగును. అపుడు విజ్ఞానము (విశేష జ్ఞానము) పుట్టును (72). చలనము లేని సద్భక్తి విజ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు కూడా సద్భక్తి యే మూలమనిచేప్పబడినది (73). తన ఇష్ట దైవమును పూజించుట మొదలగు సత్కర్మలు భక్తికి మూలము గదా! సత్కర్మకు సద్గురువు మూలము. సద్గురువు లభించుటకు సత్సంగము మూలమని చెప్పబడినది (74). సంగత్యా గురురాప్యేత గురోర్మంత్రాది పూజనమ్ | పూజనాజ్ఞాయతే భక్తి ర్భక్త్యా జ్ఞానం ప్రజాయతే || 75 విజ్ఞానం జాయతే జ్ఞానా త్పర బ్రహ్మ ప్రకాశకమ్ | విజ్ఞానం చ యదా జాతం తదా భేదో నివర్తతే || 76 భేదే నివృత్తే సకలే ద్వంద్వ దుఃఖ విహీనతా | ద్వంద్వ దుఃఖ విహీనస్తు శివరూపో భవత్యసౌ || 77 ద్వంద్వా ప్రాప్తౌ న జాయేతాం సుఖదుఃఖే విజానతః | విహితావిహితే తస్య న స్యాతాం చ సురర్షయః || 78 సత్సంగతిచే గురువు లభించును. గురువు నుండి మంత్రము, పూజా విధి లభించును. పూజవలన భక్తి పుట్టును. భక్తి వలన జ్ఞానము పుట్టును (75). జ్ఞానమునుండి విజ్ఞానము పుట్టును. పరబ్రహ్మను ప్రకాశింప జేయును. విజ్ఞానము పుట్టగానే, భేదము తొలగి పోవును (76). సకల భేదములు తొలగినప్పుడు ద్వంద్వము (రాగద్వేషాదులు) ల వలన కలిగే దుఃఖము దూరమగును. ద్వంద్వ దుఃఖములు తొలగిన భక్తుడు శివస్వరూపుడగును (77). జ్ఞానికి ద్వంద్వములు ఉండవు. కాన, సుఖదుఃఖములు ఉండవు. ఓ దేవతలారా! ఋషులారా! జ్ఞానికి విధినిషేధములు కూడ లేవు (78) ఈ దృశో విరో లోకే గృహాశ్రమ వివర్జితః | యది లోకే భవత్యస్మిన్ద ర్శనాత్పాపహారకః || 79 తీర్థాని శ్లాఘయంతీహ తాదృశం జ్ఞానవిత్తమమ్ | దేవాశ్చ మునయస్సర్వే పరబ్రహ్మాత్మకం శివ మ్ || 80 తాదృశాని న తీర్థాని న దేవా మృచ్ఛి లామయాః | తే పునంత్యురు కాలేన విజ్ఞానీ దర్శనాదపి || 81 యావద్గృహాశ్రమే తిష్ఠేత్తావదాకార పూజనమ్ | కుర్యాచ్ఛ్రేష్ఠస్య సంప్రీత్యా సురేషు ఖలు పంచసు || 82 గృహము గాని, ఆశ్రమముగాని లేని ఇట్టి జ్ఞాని లోకములో అరుదు. ఒకచో ఉన్నచో, ఆయనను దర్శించినంత పాపములు పోవును (79). అట్టి జ్ఞానిశ్రేష్ఠులు పరబ్రహ్మస్వరూపలనియు, శివమూర్తులనియు తీర్థములు (అధిష్ఠాన దేవతలు,) సురులు మరియు అందరు మునులు స్తుతించు చున్నారు (80). తీర్థములు గాని, మట్టితో రాతితో చేసిన దేవతా మూర్తులు గాని అట్టి జ్ఞానికి సరిగారు. ఏలయన, అవి చిరకాలమునకు మానవులను పవిత్రులను చేయును. కాని, జ్ఞాని దర్శనముచేతనే పవిత్రులను చేయును (81). సాధకుడు గృహస్థా శ్రమములో నున్నంతవరకు అయిదుగురు దేవతల (బ్రహ్మ, విష్ణు, రుద్ర , ఈశాన, సదాశివులు) లో శ్రేష్ఠుడగు శివుని, ప్రీతితో పూజించవలెను. మరియు మిగిలిన వారిని పూజించవలెను (82). అథవా చ శివః పూజ్యో మూలమేకం విశిష్యతే | మూలే సిక్తే తథా శాఖాస్తృప్తాస్సంత్యఖిలాస్సురాః || 83 శాఖాసు చ సుతృపాస్తు మూలం తృప్తం న కర్హి చి త్ | ఏవం సర్వంషు తృప్తేషు సురేషు మునిసత్తమాః || 84 సర్వథా శివతృప్తిర్నో విజ్ఞేయా సూక్ష్మబుద్ధిభిః | శివే చ పూజితే దేవాః పూజితాస్సర్వ ఏవ హి || 85 తస్మా చ్చ పూజయే ద్దేవం శంకరం లోకశంకరమ్ | సర్వకామ ఫలావాపై#్య సర్వ భూతాహితే రతమ్ || 86 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే పూజా విధివర్ణనే సారాసార విచార వర్ణనం నామ ద్వాదశోsధ్యాయః (12). లేదా, శివుని పూజించిన చాలును మూలము ప్రధానము గాదా! ఓ దేవతలారా! మూలమున నీరు పోసినచో అన్ని శాఖలు కూడ తృప్తిని చెందును (83). కాని, శాఖలకు నీరు పోసినచో, మూలము తృప్తి చెందుట అసంభవము. ఇదే తీరున , ఓ ముని శ్రేష్ఠులారా! దేవతలందరు తృప్తులైన నూ (84) శివుడు తృప్తుడు కాడని సూ క్ష్మ బుద్ధి గలవారు తెలియదుగును. కాని, శివుని పూజించినచో, దేవతలనందరినీ పూజించినట్లే యగును. (85). అందువలన సర్వప్రాణుల హితమును గోరునట్టియు, లోకములకు మంగళముల నిచ్చు శంకరదేవుని కోర్కెలన్నియూ ఈడేరుట కొరకై పూజించవలెను (86) శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు సృష్ట్యు పాఖ్యానమే మొదటి ఖండయందు సారాసార విచారవర్ణన మనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).