Sri Sivamahapuranamu-I
Chapters
అథ త్రయోదశోsధ్యాయః శివపూజ బ్రహ్మోవాచ | అతః పరం ప్రవక్ష్యామి పూజా విధి మనుత్తమమ్ | శ్రూయతా మృషయో దేవా స్సర్వకామ సుఖా వహమ్ ||
1 బ్రహ్మే మూహూర్తే చోత్థాయ సంస్మరేత్సాంబకం శివమ్ | కుర్యాత్తత్ర్పార్థనాం భక్త్యా సాంజలిర్నతమస్తకః ||
2 ఉత్తష్ఠోత్తిష్ఠ దేవేశ ఉత్తిష్ఠ హృదయేశయ | ఉత్తిష్ఠ త్వముమాస్వామిన్ బ్రహ్మాండే మంగలం కురు ||
3 జానామి ధర్మం న చమే ప్రవృత్తిః జానా మ్యధర్మం న చ మే నివృత్తిః | త్వయా మహాదేవ హృది స్థితేన యథా నియుక్తోsస్మి తథా కరోమి || 4 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ ఋషులారా! దేవతలారా! మీకీపైన సర్వశ్రేష్ఠము, సర్వకామనలను సుఖమును ఇచ్చునది యగు పూజావిధిని చెప్పగలను. వినుడు (1). బ్రాహ్మ మూహూర్తము నందు లేచి సాంబ సదాశివుని స్మరించవలెను. తలవంచి, అంజలి యొగ్గి భక్తి తో ఆయనను ప్రార్థించవలెను (2). ఓ దేవదేవా! లెమ్ము. హృదయము నందుండు వాడా! లెమ్ము. ఉమాపతే! నీవు లెమ్ము. జగత్తునకు మంగళములనిమ్ము (3). నేను ధర్మము నెరింగియూ, అనుష్ఠంపకున్నాను. అధర్మము నెరింగి యూ పరిహరింపకున్నాను. ఓ మహాదేవా! హృదయమునందున్న నీవు ఎట్లు ఆజ్ఞాపించిననూ, అటులనే చేసెదను (4). ఇత్యుక్త్వా వచనం భక్త్వా స్మృత్వా చ గురుపాదకే | బహిర్గచ్ఛే ద్దక్షిణాశాం త్యాగార్ధం మలమూత్రయోః || 5 దేహ శుద్ధిం తతః కృత్వా సమృజ్జలవిశోధనైః | హస్తౌ పాదౌ చ ప్రక్షాల్య దంత ధావనమాచరేత్ || 6 దివానాథే త్వనుదితే కృత్వా వై దంతధావనమ్ | ముఖం షోడశవారం తు ప్రక్షాల్యాంజలిభిస్తథా || 7 షష్ఠ్యాద్యమాశ్చ తిథయో నవమ్యర్కదినే తథా | వర్జ్యాస్సురర్షయో యత్నాద్భక్తేన రదధావనే || 8 ఈ విధముగా భక్తితో స్తోత్రము చేసి, గురు పాదములను స్మరించి, మలమూత్ర విసర్జన కొరకు దక్షిణ దిక్కునకు వెళ్లవలెను (5). తరువాత మట్టితో, మరియు నీటితో దేహశుద్ధి గావించుకొని, చేతులను కాళ్లను కడుగు కొని దంతధావనమును చేయవలెను. (6). సూర్యుడు ఉదయించుటకు ముందే దంత ధావనము చేసి, దోసిలి లోని నీటితో ముఖమును పదునారు సార్లు కడుగు కొనవలెను (7). ఓ దేవతలారా! ఋషులారా! షష్ఠి, పాడ్యమి, అమావాస్య, నవమి, అను తిథుల యందు, ఆదివారమునాడు భక్తుడు (పుల్లతో) దంత ధావనమును వీడవలెను (8). యథా వకాశం సుస్నాయా న్నద్యాదిష్వథవా గృహే | దేశకాలా విరుద్ధం చ స్నానం కార్యం నరేణ చ || 9 రవేర్దినే తథా శ్రాద్ధే సంక్రాంతౌ గ్రహణ తథా | మహాదినే తథా తీర్థే హ్యు పవాసదినే తథా || 10 ఆశౌచేప్యథవా ప్రాప్తే న స్నాయాదుష్ణవారిణా | యథా సాభి ముఖం స్నాయాత్తీర్థదౌ భక్తి మాన్నరః || 11 తైలా భ్యంగం చ కుర్వీత వారాన్ దృష్ట్వా క్రమేణ చ | నిత్యమ భ్యంగకే చైవ వాసితం వా న దూషి తమ్ || 12 శ్రాద్ధే చ గ్రహణ చైవోపవాసే ప్రతి పద్దినే | అథవా సార్షపం తైలం న దుష్యేద్గ్రహణం వినా || 13 అవకాశమును బట్టి నదిలో గాని, సరస్సులోగాని, లేదా గృహమునందు గాని, చక్కగా స్నానమును చేయవలెను. మానవుడు దేశకాలములకు విరోధము లేకుండా స్నానము నాచరించవలెను (9). ఆదివారమునాడు, శ్రాద్ధ దినము నాడు, సంక్రాంతి యందు, గ్రహణమునందు, శివరాత్రి నాడు,పుణ్యక్షేత్రము నందు ఉపవాసము చేసిన నాడు (10), మరియు ఆ శౌచము వచ్చినప్పుడు వేడినీటితో స్నానమాడరాదు. భక్తి గలవాడు మానవుడు తీర్థాదులయందు ప్రవాహమునకు అభిముఖముగా స్నానము చేయవలెను (11). వారములోని గుణదోషములను పరికించి, నూనెతో అభ్యంగనన స్నానమును చేయవలెను. నిత్యము అభ్యంగనము చేయు వ్యక్తి తైలమును వాడుటలో దోషము లేదు. సుగంధ ద్రవ్యములను కలిపిన తైలమును వాడుటలో దోషము లేదు (12). శ్రాద్ధమునాడు, గ్రహణకాలముందు , ఉపవాసమున్ననాడు, మరియు పాడ్యమి నాడు ఆవాల నూనెను వాడుట దోషము కాదు (13). దేశం కాలం విచార్యైవం స్నాం కుర్యాద్యథావిధి | ఉత్తరాభిముఖశ్చైవ ప్రాజ్ఞ్ముఖోsప్యథవా పునః || 14 ఉచ్ఛిష్టైనైవ వసై#్రణ న స్నాయాత్స కదాచన | శుద్ధవస్త్రేణ స స్నాయాత్తద్దేవస్మరపూర్వకమ్ || 15 పరధార్యం చ నోచ్ఛిష్టం రాత్రౌ చ విధృతం చ యత్ | తేన స్నానం తథా కార్యం క్షాలితం చ పరిత్యజేత్ || 16 తర్పణం చ తతః కార్యం దేవర్షి పితృతృప్తిదమ్ | ధౌతవస్త్రం తతో ధార్యం పునరాచమనం చరేత్ || 17 శుచౌ దేశే తతో గత్వా గోమయాద్యుపమార్జితే | ఆసనం చ శుభం తత్ర రచనీయం ద్విజోత్తమాః || 18 ఈ విధముగా దేశకాలములను విచారణ చేసి, తూర్పువైపునకు, లేదా ఉత్తరాభిముఖముగా తిరిగి యథావిధిగా స్నానమును చేయవలెను (14). కట్టి విడిచిన వస్త్రముతో ఎన్నడునూ స్నానము చేయరాదు. శుద్ధవస్త్రమును ధరించి పరమేశ్వరుని స్మరిస్తూ స్నానము చేయవలెను (15). ఇతరులు ధరించిన వస్త్రము, రాత్రి కట్టి విడిచిన వస్త్రము స్నానమునకు పనికిరాదు. అట్టి వస్త్రమును ఉతుకుటకు ఈయవలెను (16). స్నానము చేసిన తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములనిచ్చి తృప్తిని కలిగించవలెను. తరువాత తెల్లని వస్త్రమును ధరించి, మరల ఆచమనమును చేయవలెను (17). తరువాత శుభ్రమగు గోమయముతో అలుకబడిన స్థానమును చేరవలెను. ఓ విప్రశ్రేష్ఠులారా! అట్టి స్థానము నందు శుభమగు ఆసనమును ఏర్పాటు చేసుకొనవలెను (18). శుద్ధ కాష్ఠ సముత్పన్నం పూర్ణం స్తరిత మేవ వా | చిత్రాసనం తథా కుర్యాత్సర్వ కామఫలప్రదమ్ || 19 యథా యోగ్యం పునర్గ్రాహ్యం మృగచర్మాదికం చ యత్ | తత్రోపవిశ్య కుర్వీత త్రిపుండ్రం భస్మనా సుధీః || 20 జపస్తపస్తథా దానం త్రిపుండ్రాత్సఫలం భ##వేత్ | అభావే భస్మనస్తత్ర జలస్యాది ప్రకీర్తితమ్ || 21 ఏవం కృత్వా త్రిపుండ్రం చ రుద్రాక్షాన్థారయేన్నరః | సంపాద్య భస్మనస్తత్ర జలస్యాది ప్రకీర్తితమ్ || 21 ఏవం కృత్వా త్రిపుండ్రం చ రుద్రాక్షాన్థారయేన్నరః | సంపాద్య చ స్వకం కర్మ పునరారాధయే చ్ఛివమ్ || 22 చక్కని చెక్కతో చేసి పూర్తిగా విడదీసి యున్న పీటపై కోర్కెలన్నిటినీ ఈడేర్చు చిత్రాసనమును ఏర్పాటు చేయవలెను (19). ఆపైన మృగచర్మ మొదలగు వాటిని ఉచితమగు తీరున ఏర్పాటు చేసి, దానిపై కూర్చుండి విద్వాంసుడు భస్మతో త్రిపుండ్రమును ధరించవలెను (20). త్రిపుండ్రమును ధరించి చేసిన జపము, తపస్సు మరియు దానములు సఫలమగును (21). ఈ తీరున త్రిపుండ్రమును ధరించి సాధకుడు రుద్రాక్షలను ధరించవలెను. అటు పిమ్మట నిత్య కర్మను అనుష్ఠించి, మరల శివుని ఆరాధించవలెను (22). పునరాచమనం కృత్వా త్రివారం మంత్ర పూర్వకమ్ | ఏకం వాథ ప్రకుర్యాచ్చ గంగా బిందురితి బ్రువన్ || 23 అన్నోదకం తథా తత్ర శివపూజార్థ మహారేత్ | అన్యద్వస్తు చ యత్కించి ద్యథా శక్తి సమీపగమ్ || 24 కృత్వా స్థేయం చ తత్రైవ ధైర్యమాస్థాయ వై పునః | అర్ఘ్య పాత్రం తథా చైకం జలగంధాక్షతైర్యుతమ్ || 25 దక్షిణాంసే తథా స్థాప్యముప చారస్య క్లప్తయే | గురోశ్చ స్మరణం కృత్వా తదను జ్ఞామవాప్య చ || 26 సంకల్పం విధివత్ కృత్వా కామనాం చ నియుజ్య వై | పూజయేత్పరయా భక్త్యా శివం సపరివారకమ్ || 27 మరల మంత్రపూర్వకముగా మూడుసార్లుగాని, ఒకసారి గాని ఆచమనము చేయవలెను. తరువాత శివపూజ కొరకై జలమును గంగా నదిని స్మరించి (23) తీసుకురావలెను. మరియు పూజకు కావలసిన ఇతర వస్తువులను కూడా యథాశక్తిగా దగ్గర నుండి తెచ్చుకొనవలెను (24). తరువాత ఆసనము పై స్థిరముగా ధైర్యముతో కూర్చుండవలెను. తరువాత ఒక అర్ఘ్య పాత్రను జలముతో నింపి, గంధముతో అక్షతలతో అలంకరించి (25) కుడివైపున స్థాపించి, ఆ జలముతో ఉపచారమును చేయవలెను. గురువును స్మరించి, వారి అనుజ్ఞను పొంది (26) యథావిధిగా సంకల్పమును చేసి, మనస్సులోని కామనను కూడ ప్రకటించి, గొప్ప భక్తితో పరివారముతో గూడిన శివుని పూజించవలెను (27). ముద్రామేకాం ప్రదర్శ్యైవ పూజయేద్విఘ్నహారకమ్ | సిందురాది పదార్థైశ్చ సిద్ధిబుద్ధి సమన్వితమ్ || 28 లక్ష లాభయుతం తత్ర పూజయిత్వా నమేత్పనః | చతుర్థ్యం తైర్నామపదైర్న మోంతైః ప్రణవాదిభిః || 29 క్షమాపై#్యనం తదా దేవం భ్రాత్రా చైవ సమన్వితమ్ | పూజయేత్పరయా భక్త్యా నమస్కుర్యాత్పునః పునః || 30 ద్వారపాలం సదా ద్వారి తిష్ఠంతం చ మహోదరమ్ | పూజయిత్వా తతః పశ్చాత్పూజయేద్గిరిజాం సతీమ్ || 31 ఒక ముద్రను ప్రదర్శించి, సిద్ధి బుద్ధులతో కూడిన విఘ్నేశ్వరుని సిందూరము మొదలగు పదార్ధములతో పూజించవలెను (28). లెక్కలేనన్ని లాభములను కలుగుజేయు విఘ్నేశ్వరుని, ఓం కారముతో ఆరంభ##మై చతుర్థీ విభక్తి కలిగి నమః తో అంతమయ్యే నామములతో పూజించి మరల నమస్కరించవలెను (29). కుమార స్వామితో కూడియున్న విఘ్నేశ్వరునికి అపరాధ క్షమాపణను ప్రకటించి, గొప్ప భక్తితో పూజించి అనేక పర్యాయములు నమస్కరించవలెను (30) ఎల్లవేళలా ద్వారమునందు నిలబడియుండు మహోదరుడను ద్వారపాలుని పూజించి, తరువాత గిరిజాదేవిని పూజించవలెను (31). చందనైః కుంకుమైశ్చైవ ధూపైర్దీపై రనేకశః | నైవేద్యైర్వివిధైశ్చైవ పూజయిత్వా తతశ్శివమ్ || 32 నమస్కృత్య పునస్తత్ర గచ్ఛేచ్చ శివసన్నిధౌ | యది గేహే పార్థివీం వా హైమీం వా రాజతీం తథా || 33 ధాతుజన్యాం తథైవాన్యాం పారదాం వా ప్రకల్పయేత్ | నమస్కృత్య పునస్తాం చ పూజయేద్భక్తితత్పరః || 34 తస్యాం తు పూజితాయాం వై సర్వే స్యుః పూజితాస్తథా | స్థాపయేచ్చ మృదా లింగం విధాయ విధిపూర్వకమ్ || 35 తరువాత గంధములు, కుంకుమములు, ధూపములు, అనేక దీపములు, మరియు వివిధములైన నైవేద్యములతో శివుని పూజించవలెను (32). మరల శివునికి నమస్కరించి శివాలయమునకు వెళ్లవలెను. లేదా ఇంటియందు మట్టితో గాని, బంగారముతో గాని, వెండితో గాని (33), ఇతర ధాతువులతో గాని, లేదా పాదరసముతో గాని శివుని ప్రతిమను నిర్మించవలెను. ఆ ప్రతిమకు భక్తితో నమస్కరించి మరల పూజించవలెను (34). శివుని ప్రతిమను పూజించినచో దేవతలనందరినీ పూజించినట్లే యగును. మట్టితో యథావిధిగా లింగమును నిర్మించి స్థాపించవలెను (35). కర్తవ్యం సర్వథా తత్ర నియమాస్స్వగృహే స్థితైః | ప్రాణ ప్రతిష్ఠాం కుర్వీత భూతశుద్ధిం విధాయ చ || 36 దిక్పాలాన్పూజయోత్తత్ర స్థాపయిత్వా శివాలయే | గృహే శివస్సదా పూజ్యో మూలమంత్రాభియోగతః || 37 తత్ర తు ద్వారపాలానాం నియమో నాస్తి సర్వథా | గృహే లింగం చ యత్పూజ్యం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ || 38 పూజాకాలే చ సాంగం వై పరివారేణ సంయుతమ్ | ఆవాహ్య పూజయేద్దేవం నియమోsత్ర న విద్యతే || 39 లింగసన్నిధిలో నియమములనన్నిటినీ తన గృహమునందు లభ్యమయ్యే పదార్థములతో ఆచరించవలెను. భూత శుద్ధిని చేసి ప్రాణ ప్రతిష్ఠను చేయవలెను (36). శివాలయమునందు దిక్పాలకులను స్థాపించి పూజించవలెను. గృహమునందు శివుని నిత్యము మూలమంత్రముతో నారాధించవలెను (37). గృహమునందు ద్వారపాలకులను ప్రతిష్ఠించవలెననే నియమము లేదు. గృహమునందు పూజింపబడే లింగమునందు సర్వము ప్రతిష్ఠితమై యున్నది (38). పూజాకాలమునందు శివుని సాంగముగా సపరివారముగా ఆవాహన చేసి పూజించవలెను. ఇంతకు మించి నియమము ఏదియూ లేదు (39). శివస్య సన్నిధిం కృత్వా స్వాసనం పరికల్పయేత్ | ఉదజ్ఞ్మఖస్తదా స్థిత్వా పునరాచమనం చరేత్ || 40 ప్రక్షాల్య హస్తౌ పశ్చాద్వై ప్రాణాయామం ప్రకల్పయేత్ | మూలమంత్రేణ తత్రైవ దశావర్తం నయేన్నరః || 41 పంచముద్రాః ప్రకర్తవ్యః పూజావశ్యం కరేప్సితాః | ఏతా ముద్రాః ప్రదర్శ్యైవ చరేత్పూజావిధిం నరః || 42 దీపం కృత్వా తదా తత్ర నమస్కారం గురోరథ | బద్ధ్వా పద్మాసనం తత్ర భద్రాసనమథాపి వా || 43 ఉత్తానాసనకం కృత్వా పర్యంకాసనకం తథా | యథాసుఖం తథా స్థిత్వా ప్రయోగం పునరేవ చ || 44 భక్తుడు శివుని సన్నిధిలో ఆసనమును ఏర్పాటు చేసుకొని ఉత్తరదిక్కుగా నిలబడి మరల ఆచమనమును చేయవలెను (40). తరువాత చేతులను కడుగుకొని భక్తుడు శివసన్నిధిలో కూర్చుండి మూలమంత్రముతో పదిసార్లు ప్రాణాయామమును చేయవలెను (41). పూజ సార్థకమగుటకై అయిది ముద్రలను ప్రదర్శించవలెను. భక్తుడు ఈ ముద్రలను ప్రదర్శించిన తరువాతనే పూజా విధిని అనిష్ఠించవలెను (42). తరువాత అచట దీపమును వెలిగించి, గురువునకు నమస్కరించి పద్మాసనమును గాని, లేక భద్రాసనమును గాని (43), ఉత్తానాసనమును గాని, పర్యంకాసనమును గాని వేసి, సుఖముగా ఆసనమునందుండి, పూజా విధిని అనుష్ఠించవలెను (44). కృత్వా పూజాం పురాజాతాం వట్టకేనైవ తారయేత్ | యది వా స్వయమేవేహ గృహేన నియమోsస్తి చ || 45 పశ్చాచ్చైవార్ఘ్య పాత్రేణ క్షారయే ల్లింగముత్తమమ్ |అనన్యమానసో భూత్వా పూజాద్రవ్యం నిధాయ చ || 46 పశ్చాచ్చావాహయేద్దేవం మంత్రేణానేన వై నరః | స్వయంభులింగమును పానువట్టముతో సహా పూజించిన వ్యక్తి ముక్తిని పొందును. ఇట్టి లింగమును పానువట్టము లేకుండగనైననూ పూజించవచ్చును. ఇంటిలో చేయు ఆరాధనకు ఈ విషయములో నియమము లేదు (45). తరువాత అర్ఘ్యపాత్రతో ఉత్తమమగు ఆ శివలింగమును క్షాళన చేయవలెను. మనస్సును ఇటునటు మరలనీయకుండా, పూజాద్రవ్యములను సిద్ధము చేసుకొని (46) భక్తుడు ఈ మంత్రముతో శివుని ఆవాహన చేయవలెను. కైలాస శిఖరస్థం చ పార్వతీ పతిముత్తమమ్ || 47 యథోక్తరూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణమ్ | పంచవక్రం దశభుజం త్రినేత్రం వృషభధ్వజమ్ || 48 కర్పూర గౌరం దివ్యాంగం చంద్రమౌలిం కపర్దినమ్ | వ్యాఘ్రచర్మోత్తరీయం చ గజచర్మాంబరం శుభమ్ || 49 వాసుక్యాదిపరీతాంగం పినాకాద్యాయుధాన్వితమ్ | సిద్ధయోsఎ్టౌ చ యస్యాగ్రే నృత్యంతీహ నిరంతరమ్ || 50 జయ జయేతి శ##బ్దైశ్చ సేవితం భక్తపూజకైః | తేజసా దుస్సహేనైవ దుర్లక్ష్యం దేవ సేవితమ్ || 51 శరణ్యం సర్వసత్త్వానాం ప్రసన్న ముఖపంకజమ్ | వేదైశ్శాసై#్త్రర్యథా గీతం విష్ణుబ్రహ్మనుతం సదా || 52 భక్తవత్సల మానందం శివమావాహయామ్యహమ్ | కైలాస శిఖరము నందుండు వాడు, పార్వతీ పతి, దేవోత్తముడు (47), మంగళముల నిచ్చువాడు, నిర్గుణుడు, గుణరూపములో వ్యక్తమగువాడు, అయిదు మోములు పదిచేతులు మూడు కన్నులు గలవాడు, వృషభము ధ్వజమునందు గలవాడు (48). కర్పూరమువలె తెల్లని వాడు, దివ్యదేహుడు, చంద్రుని శిరసునందు ధరించిన వాడు, జటాజూటము గలవాడు, వ్యాఘ్ర చర్మము ఉత్తరీయముగా గలవాడు, గజచర్మమును ధరించిన వాడు, శుభకరుడు (49), వాసుకి మొదలగు సర్పములచే చుట్టబడిన దేహము గల వాడు, పినాకము మొదలగు ఆయుధములతో కూడినవాడు, తన యెదుట సర్వదా నృత్యము చేయు అష్టసిద్ధులు గలవాడు (50), పూజలు చేయు భక్తులచే జయజయారావములతో సేవింపబడువాడు, సహింప శక్యము కాని తేజస్సును కలిగియుండుటవలన చూడ శక్యము కానివాడు, దేవతలచే సేవింపబడువాడు (51), సర్వప్రాణులకు శరణు పొంద దగినవాడు, ప్రసన్నమైన ముఖపద్మము గలవాడు, వేద శాస్త్రములచే గానము చేయబడువాడు, విష్ణువుచే మరియు బ్రహ్మచే సర్వదా స్తుతింపబడువాడు (52), భక్తులయందు వత్సలుడు, ఆనందరూపుడునగు శివుని నేను ఆవాహన చేయుచున్నాను . ఏవం ధ్యాత్వా శివం సాంబ మాసనం పరికల్పయేత్ || 53 చతుర్థ్యంతపదేనైవ సర్వం కుర్యాద్యథాక్రమమ్ . తతః పాద్యం ప్రదద్యాద్వై తతోsర్ఘ్యం శంకరాయ చ || 54 తతశ్చాచమనం కృత్వా శంభ##వే పరమాత్మనే | పశ్చాచ్చ పంచభిర్ద్రవ్యై స్స్నాపయేచ్ఛంకరం ముదా || 55 వేదమంత్రై ర్యథాయోగ్యం నామభిర్వా సమంత్రకైః | చతుర్ధ్యంతపదైర్భక్త్యా ద్రవ్యాణ్యవార్పయేత్తదా || 56 తథాభిలషితం ద్రవ్య మర్పయే చ్ఛంకరోపరి . తతశ్చ వారుణం స్నానం కరణీయం శివాయ వై || 57 ఈ విధముగా సాంబశివుని ధ్యానించి ఆసనము నేర్పాటు చేయవలెను (53). సర్వోపచారములను చతుర్థీ విభక్తి పదములతో వరుసగా చేయవలెను. తరువాత, శంకరునకు పాద్యమును, ఆర్ఘ్యమును ఈయవలెను (54). తరువాత, శంభుపరమాత్మకు ఆచమనమునిచ్చి, తరువాత పంచామృతములతో శంకరునకు ఆనందముగా అభిషేకము చేయవలెను (55). వేద మంత్రములతో గాని, మంత్రములతో గూడిన నామములతో గాని అభిషేకించవలెను. అపుడు భక్తితో చతుర్థీ విభక్తి పదములనుచ్చరించి వివిధ ద్రవ్యముల నర్పించవలెను (56). మానవుడు తనకు అభిష్టములగు ద్రవ్యములను శివునకు అర్పించవలెను. తరువాత, శివునకు శుద్ధోదకస్నానమును చేయించవలెను (57). సుగంధం చందనం దద్యాదన్యలేపాని యత్నతః | ససుగంధ జలేనైవ జలధారాం ప్రకల్పయేత్ || 58 వేదమంత్రైః షడంగైర్వా నామభీ రుద్రసంఖ్యయా | యథా వకాశం తాం దత్వా వస్త్రేణ మార్జయేత్తతః || 59 పశ్చాదాచమనం దద్యాత్తతో వస్త్రం సమర్పయేత్ | తిలాశ్చైవ జవా వాపి గోధూమా ముద్గమాషకాః || 60 అర్పణీయాశ్శివాయైవం మంత్రైర్నానావిధై రపి | తతః పుష్పాణి దేయాని పంచాస్యాయ మహాత్మనే || 61 సువాసనగల గంధమును, ఇతర లేపములను శ్రద్ధతో అర్పించవలెను. సుగంధముగల నీటితో మాత్రమే జలధారను కల్పించవలెను (58).షడంగములతో కూడిన వేద మంత్రములతో గాని, పదకొండు నామములతో గాని వీలును బట్టి జలధారను అర్పించి, తరువాత వస్త్రముతో తుడువవలెను (59). తరువాత ఆచమనమును, వస్త్రమును అర్పించవలెను. తిలలను, యవలను, గోధుమలను, పెసలను, మినుములను (60) అనేక విధములగు మంత్రములతో శివునకు అర్పించవలెను. తరువాత ఐదు మోముల మహాదేవునకు పుష్పముల నర్పించవలెను (61). ప్రతివక్త్రం యథా ధ్యానం యథాయోగ్యాభిలాషతః | కమలైశ్శతపత్రైశ్చ శంఖపుషై#్పః పరైస్తథా || 62 కుశపుషై#్పశ్చ ధత్తూరై ర్మందారై ర్ద్రోణసంభ##వై | తథా చ తులసీపత్రైర్బిల్వపత్రై ర్విశేషతః || 63 పూజయేత్పరయా భక్త్యా శంకరం భక్తవత్సలమ్ | సర్వాభావే బిల్వ పత్రమర్పణీయం శివాయ వై || 64 బిల్వ పత్రార్పణనైవ సర్వపూజా ప్రసిధ్యతి | తతస్సుగంధ చూర్ణం వై వాసితం తైలముత్తమమ్ || 65 అర్పణీయం చ వివిధం శివాయ పరయా ముదా | తతో ధూపః ప్రకర్తవ్యో గుగ్గలా గురుభిర్ముదా || 66 యోగ్యతకు, కామనకు అనురూపముగా భక్తుడు ఐదు మోములను ధ్యానించవలెను. వందరేకుల కమలములతో, గొప్పవి యగు శంఖపుష్పములతో (62), కుశపుష్పములతో, ధత్తూరపుష్పములతో, మందారములతో, ద్రోణపుష్పములతో, తులసీ పత్రములతో, మరియు విశేషించి బిల్వదళములతో (63), భక్తవత్సలుడగు శంకరుని గొప్ప భక్తితో పూజించవలెను. ఇతర పుష్పములు లేకపోయిననూ, శివునకు బిల్వ పత్రము నర్పించవలెను (64). బిల్వ పత్రము నర్పించినచో అన్ని పుష్పములతో పూజించినట్లగును. తరువాత సుగంధ చూర్ణమును, ఉత్తమమగు సుగంధినూనెను (65), శివునకు మిక్కిలి యానందముతో అర్పించవలెను. తరువాత గుగ్గిలముతో, అగరుతో ధూపమును ఆనందముగా నర్పిపవలెను (66). దీపో దేయస్తతస్తసై#్మ శంకరాయ ఘృతప్లుతః | అర్ఘ్యం దద్యాత్ పునస్తసై#్మ మంత్రేణానేన భక్తితః || 67 కారయేద్భావతో భక్త్యా వస్త్రేణ ముఖమార్జనమ్ |రూపం దేహి యశో దేహి భోగం దేహి చ శంకర || 68 భుక్తిముక్తిఫలం దేహి గృహీత్వార్ఘ్యం నమోsస్తుతే | తతో దేయం శివాయైవ నైవేద్యం వివిధం శుభమ్ || 69 తత ఆచమనం ప్రీత్యా కారయేద్వా విలంబతః | తతశ్శివాయ తాంబూలం సాంగోపాంగం విధాయ చ || 70 తరువాత శంకరునకు నేయితో దీపమును పెట్టవలెను. అపుడు మరల శివునకు ఈ మంత్రమునుచ్చరించి భక్తితో అర్ఘ్యమునీయవలెను (67). వస్త్రముతో శివునకు, భక్తిశ్రద్ధాపూర్వకముగా ముఖమును వత్తవలెను. ' హే శంకరా! రూపమునిమ్ము. కీర్తిని ఇమ్ము. భోగమునిమ్ము (68). నీకు నమస్కారమగుగాక ఈ అర్ఘ్యమును స్వీకరించి, భుక్తిని, మోక్షఫలమును ఇమ్ము' . తరువాత శివునకు వివిధ శుభపదార్ధములను నైవేద్యమిడవలెను (69). తరువాత కొద్ది కాలము వేచియుండి శివునకు ప్రీతితో ఆచమనము నీయవలెను. పిమ్మట శివునకు వివిధ ద్రవ్యములతో కూడిన తాంబూలము నర్పించవలెను (70). కుర్యాదారార్తికం పంచవర్తికామనుసంఖ్యయా | పాదయోశ్చ చతుర్వారం ద్విః కృత్యో నాభిమండలే || 71 ఏకకృత్వో ముఖే సప్తకృత్వస్సర్వాగ ఏవ హి| తతో ధ్యానం యథోక్తం వై కృత్వా మంత్రముదీరయేత్ || 72 యథాసంఖ్యం యథాజ్ఞానం కుర్యాన్మంత్ర విధిం నరః | గురూపదిష్ట మర్గేణ కృత్వా మంత్రజపం సుధీః || 73 స్తోత్రైర్నానావిధైః ప్రీత్యా స్తువీత వృషభద్వజమ్ |తతః ప్రదక్షిణాం కుర్యాచ్ఛివస్య చ శ##నైశ్సనైః || 74 అయిదు వత్తుల గల హారతిని సంఖ్యానియమానుసారముగా ఈయవలెను. పాదములకు నాలుగు సార్లు, నాభీమండలమునందు రెండుసార్లు (71), ముఖమునందొకసారి, సర్వాగములయందు ఏడుసార్లు హారతినీయవలెను. తరువాత ధ్యానమును చేయవలెను. మంత్రమును జపించవలెను (72). భక్తుడు గురువు ఉపదేశించిన మార్గములో ధ్యానపూర్వకముగా మంత్రమును శాస్త్రోక్త సంఖ్యలో జపించవలెను (73). తరువాత వృషభము ధ్వజమునందు గల శివుని ప్రేమతో అనేక స్తోత్రములతో స్తుతించవలెను. అటు పిమ్మట శివునకు మెల్లగా ప్రదక్షిణమును చేయవలెను (74). నమస్కారం తతః కుర్యాత్సాష్టాంగం విధివత్పుమాన్ | తతః పుష్పాంజలిర్దేయో మంత్రేణానేన భక్తితః || 75 శంకరాయ పరేశాయ శివ సంతోషహేతవే | అజ్ఞానాద్యది వా జ్ఞానాద్యద్యత్పూజాదికం మయా || 76 కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర | తావకస్త్వద్గత ప్రాణ స్త్వచ్చిత్తోహం సదా మృడ || 77 ఇతి విజ్ఞాయ గౌరీశ భూతనాథ ప్రసీద మే | భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనమ్ || 78 త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం ప్రభో | ఇత్యాది బహువిజ్ఞప్తిం కృత్వా సమ్యగ్విధానతః || 79 తరువాత భక్తుడు యథావిధిగా సాష్టాంగ నమస్కారమును చేయవలెను. తరువాత దేవదేవుడగు శంకరునికి ప్రీతిని కలిగించుటకై భక్తితో ఈ మంత్రమును నుచ్చరించి పుష్పాంజలినీయవలెను (75). హే శంకరా! నేను తెలిసి గాని, తెలియక గాని చేసిన పూజాదికము (76) నీదయవలన సఫలమగు గాక! హే మృడా! నేను నీవాడను. నా ప్రాణములు నీయందే ఉన్నవి. నేను సర్వదా నిన్నే స్మరించెదను (77). ఈ విధముగా పార్వతీపతికి విజ్ఞాపన చేయవలెను. హే భూతనాథా! నాయందు దయ చూపుము. భూమి యందు జారిపడిన వారికి భూమియే ఆలంబనమగును (78). హే ప్రభో! అదే తీరున, నీయందు అపరాధము చేసిన వారికి నీవే శరణు. ఇత్యాదిగా శివునకు చక్కని విధములో అనేక విజ్ఞప్తులను చేయవలెను (79). పుష్పాంజలిం సమర్ప్యైవం పునః కుర్యాన్నంతి ముహుః | స్వస్థానం గచ్ఛ దేవేశ పరివారయుతః ప్రభో || 80 పూజాకాలే పునర్నాథ త్వయా గంతవ్యమాదరాత్ | ఇతి సంప్రార్ధ్య బహుశశ్శంకరం భక్తవత్సలమ్ || 81 విసర్జయేత్స్వ హృదయే తదపో మూర్ద్ని విన్యసేత్ | ఇతి ప్రోక్త మశేషేణ మునయ శ్శివపూజనమ్ || 82 భుక్తి ముక్తి ప్రదం చైవ కిమన్యచ్ఛ్రోతు మర్హథ || 83 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే శివపూజన వర్ణనం నామ త్రయో దశోsధ్యాయః (13). ఈ విధముగా పుష్పాంజలిని సమర్పించి మరల అనేక పర్యాయములు నమస్కరించవలెను. హే దేవదేవా! ప్రభో! పరివారముతో గూడి స్వస్థానమునకు వెళ్లుము (80). హేనాథా! పూజాకాలమునందు మరల దయతో విచ్చేయుము. ఈ రీతిగా భక్తవత్సలుడగు శంకరుని అనేక తెరంగుల ప్రార్థించి (81) తన హృదయములోనికి విసర్జన చేసుకొనవలెను. ఆ జలములను శిరస్సుపై ఉంచుకొనవలెను. ఓ మునులారా! మీకీ విధముగా శివపూజను నిశ్శేషముగా చెప్పితిని (82). ఈ పూజ వలన భుక్తి,మరియు ముక్తి లభించును. మీరింకనూ ఏమి వినగోరుచున్నారు? (83). శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్రసంహిత యందు మొదటిదియగు సృష్ట్యుపాఖ్యాన ఖండములో శివ పూజా వర్ణనము అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).