Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుర్దశోsధ్యాయః

శివపూజ

ఋషయ ఊచుః |

వ్యాసశిష్య మహాభాగ కథయ త్వం ప్రమాణతః | కైః పుషై#్పః పూజితశ్శంభుః కిం కిం యచ్ఛతి వై ఫలమ్‌ || 1

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ వ్యాసశిష్యా! మహాత్మా! నీవు ప్రమాణ పూర్వకముగా చెప్పుము. శివుని ఏయే పుష్పములతో పూజించిన, ఏయే ఫలముల నిచ్చును ?(1).

సూత ఉవాచ |

శౌనకాద్యాశ్చ ఋషయ శ్శృణుతాదరతోsఖిలమ్‌ | కథయామ్యద్య సుప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయమ్‌ || 2

ఏష ఏవ విధిః పృష్టో నారదేన మహర్షిణా | ప్రోవాచ పరమ ప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయమ్‌ || 3

సూతుడిట్లు పలికెను -

శౌనకాది ఋషులారా! శ్రద్ధతో వినుడు. మీకీనాడు పుష్పములను అర్పించుటయందు గల సర్వ నిర్ణయములను ప్రీతితో చెప్పెదను (2). పుష్పములను అర్పించుటలో గల ఈ నిర్ణయమును నారదమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ మిక్కిలి ప్రీతితో చెప్పియున్నాడు (3).

బ్రహ్మోవాచ |

కమలైర్బిల్వపత్రైశ్చ శతపత్రైస్తథా పునః | శంఖపుషై#్పస్తథా దేవం లక్ష్మీకామోsర్చయేచ్ఛివమ్‌ || 4

ఏతైశ్చ లక్ష సంఖ్యాకైః పూజితశ్చేద్భవేచ్ఛివః | పాపహానిస్తథా విప్ర లక్ష్మీ స్స్యాన్నాత్ర సంశయః || 5

వింశతిః కమలానాం తు ప్రస్థమేకముదాహృతమ్‌ | బిల్వో దలసహస్రేణ ప్రస్థార్థం పరిభాషితమ్‌ || 6

శతపత్రసహస్రేణ ప్రస్థార్థం పరిభాషితమ్‌ | పలైష్షోడశభిః ప్రస్థః పలం టంక దశః స్మృతః || 7

అనేనైవ తు మానేన తులామారోపయేద్యదా |సర్వాన్కామానవాప్నోతి నిష్కామశ్చేచ్ఛివో భ##వేత్‌ || 8

సంపదలను కోరు భక్తుడు శివదేవుని కమలములతో, బిల్వపత్రములతో, పద్మములతో, మరియు శంఖపుష్పములతో అర్చించవలెను (4). హే మహర్షీ! లక్ష సంఖ్య గల ఈ పుష్పములతో శివుని అర్చించినచో, పాపములు పోవుటయే గాక , సంపదలు కలుగుననుటలో సందియము లేదు (5). ఇరువది కమలములకు ఒక ప్రస్థము అని పేరు. వేయి బిల్వ దళములకు అర్థప్రస్థమను వాడుక (6). వేయి పద్మములు అర్థప్రస్థమగును. పది టంకములు ఒక పలమనియు, పదునారు పలములు ఒక ప్రస్థమనియు చెప్పబడినది (7). భక్తుడు ఈ మానముతో పుష్పములను తూచి శివునకు సమర్పించినచో, కోర్కెలన్నియూ ఈడేరును. భక్తుడు కామనలు లేనివాడైనచో శివస్వరూపుడగును (8).

రాజ్యస్య కాముకో యో వై పార్థివానాం చ పూజయా | తోషయేచ్ఛంకరం దేవం దశకోట్యా మునీశ్వరాః || 9

లింగం శివం తథా పుష్పమఖండం తందులం తథా | చర్చితం చందనేనైవ జలధారాం తథా పునః || 10

ప్రతిరూపం తథా మంత్రం బిల్వీదలమనుత్తమమ్‌ | అథవా శతపత్రం చ కమలం వా తథా పునః || 11

శంఖపుషై#్పస్తథా ప్రోక్తం విశేషేణ పురాతనైః || 12

ఓ మునిశ్రేష్ఠులారా! రాజ్యమును కోరువాడు పదికోట్ల పుష్పములతో పార్థివ లింగమును పూజించి శంకరదేవుని సంతోషపెట్టవలెను (9). శివలింగమునకు చందనము నద్దవలెను. జలధారతో అభిషేకించవలెను (10). మంత్ర సహితముగా మారేడు దళములతో పూజించుట సర్వశ్రేష్ఠము. పద్మములతో, కమలములతో (11), మరియు విశేషించి శంఖపుష్పములతో పూజించవలెనని పూర్వర్షులు చెప్పిరి. ఇట్లు పూజించుట వలన ఇహలోకమునందు మాత్రమే గాక, పరలోకమునందు కూడ కోర్కెలన్నియు ఈడేరును (12).

ధూపం దీపం చ నై వేద్యమర్ఘ్యం చారాత్రికం తథా | ప్రదక్షిణాం నమస్కారం క్షమాపన విసర్జనే || 13

కృత్వా సాంగం తథా భోజ్యం కృతం యేన భ##వేదిహ | తస్య వై సర్వథా రాజ్యం శంకరః ప్రదదాతి చ || 14

ప్రాధాన్య కాముకో యో వై తదర్థేనార్చయేత్పుమాన్‌ | కారాగృహగతో యో వై లక్షేనైవార్చయేద్ధరమ్‌ || 15

రోగగ్రస్తో యదా స్యాద్వై తదర్థేనార్చయేచ్ఛివమ్‌ | కన్యాకామో భ##వేద్యోవై తదర్థేన శివం పునః || 16

ధూపదీపనైవేద్యములను, అర్ఘ్యమును, హారతిని ఇచ్చి, ప్రదక్షిణ, నమస్కారములు చేయవలెను. క్షమార్పణ చేప్పి విసర్జించవలెను (13). తరువాత మృష్టాన్న భోజనమును పెట్టవలెను. ఇట్లు చేయు భక్తునకు శంకరుడు నిశ్చయముగా రాజ్యాధికారమును ఇచ్చును (14). ప్రధానాధికారమును కోరు పురుషుడు దీనిలో సగము పూజను చేయవలెను. కారాగృహమును పొందిన వ్యక్తి శివునకు లక్షార్చనను చేయవలెను (15). రోగపీడితుడగు భక్తుడు దానిలో సగము పూజను, కన్యను కోరువాడు మరల దానిలో సగము పూజను శివునకు చేయవలెను (16).

విద్యాకామస్తథా యస్స్యాత్తదర్థేనార్చయేచ్ఛివమ్‌ | వాణీకామో భ##వేద్యో వైఘృతేనైవార్చ యేచ్ఛివమ్‌ || 17

ఉచ్చాటనార్థం శత్రూణాం తన్మితేనైవ పూజనమ్‌ | మారణవై తు లక్షేణ మోహమే తు తదర్థతః || 18

సామంతానాం జయే చైవ కోటిపూజా ప్రశస్యతే | రాజ్ఞామయుత సంఖ్యం చ వశీ కరణకర్మణి || 19

యశ సే చ తథా సంఖ్యా వాహనాద్యైస్సహస్రికా | ముక్తికామోర్చయేచ్ఛంభుం పంచకోట్యా సుభక్తితః || 20

విద్యను కోరువాడు దానిలో సగము పూజను శివునకు చేయవలెను. మధురమగు కంఠ ధ్వనిని కోరువాడు శివుని నేతితో అభిషేకించవలె%ు (17). శత్రు నాశమును కోరువాడు కోరికకు అనురూపముగా పూజించవలెను. శత్రు సంహారమైనచో లక్షార్చనను, శత్రుమోహనము కొరకై దానిలో సగము పూజను చేయవలెను.(18). సామంతులను జయించగోరు రాజులు కోటిపూజను చేయవలెను. వశీకరణమును కోరువాడు పదివేల పూజను (19), యశస్సును కోరువాడు కూడా అదే పూజను, వాహనాదులను కోరువాడు సహస్రార్చనను చేయవలెను. ముక్తిని కోరువాడు భక్తితో శివునకు అయిదు కోట్ల పుష్పములతో పూజను చేయవలెను (20).

జ్ఞానార్థీ పూజయేత్కో ట్యా శంకరం లోకశంకరమ్‌ | శివదర్శనకామో వై తదర్ధేన ప్రపూజయేత్‌ || 21

తథా మృత్యుంజయో జాప్యః కామనాఫలరూపతః | పంచలక్షా జపా యర్హి ప్రత్యక్షం తు భ##వేచ్ఛివః || 22

లక్షేణ భజతే కశ్చి ద్ద్వితీయో జాతి సంభవః | తృతీయే కామనాలాభశ్చ తుర్థే తం ప్రపశ్యతి || 23

పంచమం చ యదా లక్షం ఫలం యచ్ఛత్యసంశయమ్‌ | అనేనైవ తు మంత్రేణ దశలక్షే ఫలం లభేత్‌ || 24

జ్ఞానమును కోరువాడు లోకములకు మంగళములనిచ్చే శంకరునకు కోటిపూజను చేయవలెను. శివుని దర్శించగోరువాడు దానిలో సగము పూజను చేయవలెను (21). ఇదే విధముగా మృత్యుంజయమంత్రమును కోరికలను బట్టి జపించవలెను. అయిదు లక్షలు జపించినచో శివుడు ప్రత్యక్షమగును (22). లక్ష జపించగానే ఒక మహాత్ముడు భక్తుడై సేవించును. రెండు లక్షలు జపించగానే పూర్వ జన్మస్మృతి కలుగును. మూడు లక్షలు జపించినచో కోర్కెలు ఈడేరును. నాల్గవ లక్ష పూర్తి అయినచో శివుడు ప్రత్యక్షమై ఫలమునిచ్చుననుటలో సందేహము లేదు. ఈ మృత్యుంజయ మంత్రమును పది లక్షలు జపించినచో మహా ఫలము సిద్ధించును (24).

ముక్తికామో భ##వేద్యో వై దర్భైశ్చ పూజనం చరేత్‌ | లక్ష సంఖ్యా తు సర్వత్ర జ్ఞాతవ్యా మునిసత్తమ || 25

ఆయుః కామో భ##వేద్యే వై దూర్వాభిః పూజనం చరేత్‌ | పుత్రకామో భ##వేద్యో వై ధత్తూరకుసుమైశ్చరేత్‌ || 26

రక్తదండశ్చ ధత్తూరః పూజనే శుభదః స్మృతః | అగస్త్యకుసుమైశ్చైవ పూజకస్య మహద్యశః || 27

ముక్తిని కోరువాడు దర్భలతో పూజించవలెను. ఓ మునిశ్రేష్ఠా! ఈ పూజలనన్నిటిని లక్ష సంఖ్యలో చేయవలెనని యెరుంగుము(25).ఆయుర్దాయమును కోరువాడు దూర్వలతో పూజించవలెను. పుత్రుని కోరువాడు ధత్తూర పుష్పములతో పూజించవలెను (26).ఎర్రని కాడగల ధత్తూర (ఉమ్మెత్త) పుష్పములతో పూజించినచో శుభములు కలుగునని చెప్పబడెను. అగస్త్య (అవిసె ) పుష్పములతో పూజించువానికి గొప్ప కీర్తి కలుగును (27).

భుక్తిముక్తి ఫలం తస్య తులస్యా పూజయేద్యది | అర్కపుషై#్పః ప్రతాఫశ్చ కుబ్జ కల్హారకైస్తథా || 28

జపాకుసుమపూజా తు శత్రూణాం మృత్యుదా స్మృతా | రోగోచ్చాటనకానీహ కరవీరాణి వై క్రమాత్‌ || 29

బంధుకైః భూషణావాప్తిర్జాత్యా వాహాన్న సంశయః | అతసీ పుష్పకైర్దేవం విష్ణువల్లభతామియాత్‌ || 30

శమీపత్రైస్తథా ముక్తిః ప్రాప్యతే పురుషేణ చ | మల్లికాకుసుమై ర్దత్తైస్త్స్రి యం శుభతరాం శివః || 31

తులసితో పూజించు భక్తునకు భుక్తి, ముక్తి లభించును. జిల్లేడు పుష్పములతో పూజించిన భక్తునకు పరాక్రమము కలుగును. ఎర్రకలువలతో, మరియు ఉత్తరేణి పుష్పములతో పూజించిననూ అదే ఫలము కలుగును (28). ఎర్ర గులాబి పువ్వులతో పూజించినచో, శత్రువునకు మృత్యువు కలుగును. ఎర్రగన్నేరు పుష్పములతో పూజించినచో రోగములు తొలగి పోవును. జాజి పువ్వులతో పూజించు వానికి వాహనములు లభించుననుటలో సందేహము లేదు. శివుని అవిసె పువ్వులతో పూజించువాడు విష్ణువునకు ప్రియుడగును (30). జమ్మిపత్రితో పూజించు భక్తుడు ముక్తిని పొందును. మల్లెలతో పూజించు భక్తునకు శివుడు పతివ్రత యగు భార్యను అను గ్రహించును (31).

యూథికా కుసుమై స్ససై#్యర్గృహం నైవ విముచ్యతే | కర్ణికారైస్తథా వస్త్ర సంపత్తి ర్జాయతే నృణామ్‌ || 32

నిర్గుండీ కుసుమై ర్లోకే మనో నిర్మలతాం వ్రజేత్‌ | బిల్వపత్రైస్తథా లక్షై స్సర్వాన్కామానవాప్నుయాత్‌ || 33

శృంగార హారపుషై#్ప స్తు వర్ధతే సుఖ సంపదా | ఋతు జాతాని పుష్పాణి ముక్తి దాని న సంశయః || 34

రాజికాకుసుమానీహ శత్రూణాం మృత్యుదాని చ | ఏషాం లక్షం శివే దద్యాద్ద దాచ్చ విపులం ఫలమ్‌ || 35

మల్లెలతో, మరియు ధాన్యములతో ఆరాధించు వానికి నివాసగృహము చేయి జారిపోదు. కొండగోగు పువ్వులతో పూజించు మానవులకు వస్త్రసమృద్ధి కలుగును (32). లోకములో వావిలి పువ్వులతో పూజించు వారికి మనస్సు నిర్మలమగును. లక్ష బిల్వార్చన చేయు మానవునకు కోర్కెలన్నియూ ఈడేరును (33). సిందూరపుష్పములతో మరియు మాలతో అర్చించు వానికి సుఖసంపదలు వర్ధిల్లును. ఆయా ఋతువుల యందు లభించు పుష్పములతో పూజించినచో ముక్తి లభించుననుటలో సందేహము లేదు (34). ఆవ పుష్పములతో పూజించిన వాని శత్రువులు మరణించెదరు. వీటిని లక్షపుష్పములను శివునకు అర్పించినచో, శివుడు మహాఫలము నిచ్చును (35).

విద్యతే కుసుమం తన్న యన్నైవ శివవల్లభమ్‌ | చంపకం కేతకం హిత్వా త్వన్యత్సర్వం సమర్పయేత్‌ || 36

అతః పరం చ ధాన్యానాం పూజనే శంకరస్య చ | ప్రమాణం చ ఫలం సర్వం ప్రీత్యా శృణు చ సత్తమ || 37

తందులా రోపణ నౄణాం లక్ష్మీ వృద్ధిః ప్రజాయతే | అఖండితవిధౌ విప్ర సమ్యగ్భక్త్యా శివో పరి || 38

షట్కేనైవ తు ప్రస్థానాం తదర్ధేన తథా పునః | పలద్వయం తథా లక్ష మానేన సముదాహృతమ్‌ || 39

పూజాం రుద్ర ప్రధానేన కృత్వా వస్త్రం సుసుందరమ్‌ | శివో పరి న్యసేత్తత్ర తందులార్పణ ముత్తమమ్‌ || 40

శివునకు ప్రియము కాని పుష్పము లేనే లేదు. సంపంగి, మొగలి పువ్వులను విడిచి పెట్టి, మిగిలిన పుష్పములన్నిటినీ సమర్పించవలెను (36). ఓ మహర్షీ!శంకరునకు ధాన్యములతో చేయు పూజలకు ఫలమును, ధాన్యముల ప్రమాణమును వివరముగా ఇప్పుడు చెప్పెదను. ప్రీతితో వినుము (37). ఓ విప్రా! మానవులు శివునిపై చక్కని భక్తితో నూకలు లేని బియ్యమును పోసి పూజించినచో, సంపదలు అభివృద్ది చెందును (38). ఆరు ప్రస్థములు గాని దానిలో సగము గాని, రెండు పలములు గాని, మరియు లక్ష (ఒక మానము) గాని బియ్యముతో పూజించవలెను (39). ప్రధానముగా రుద్రాధ్యాయముతో పూజను చేసి, శివుని పై సుందరమగు వస్త్రమునుంచి, దానిపై శ్రేష్ఠమగు బియ్యమును అర్పించవలెను.

ఉపరి శ్రీ ఫలం త్వేకం గంధపుష్పాదిభిస్తథా |రోపయిత్వా చ ధూపాది కృత్వా పూజిఫలం లభేత్‌ || 41

ప్రాజాపత్యం ద్వయం రౌప్య మాసంఖ్యా చ దక్షిణా | దేయా తదుపదేష్ట్రై హి శక్త్యా వా దక్షిణా మతా || 42

ఆదిత్య సంఖ్య యా తత్ర బ్రాహ్మణాన్‌ భోజయేత్తతః | లక్షపూజా తథా జాతా సాంగం చ మంత్ర పూర్వకమ్‌ || 43

శతమష్టోత్తరం తత్ర మంత్రే విధిరుదాహృతః | తిలానాం చ పలం లక్షం మహాపాతకనాశనమ్‌ || 44

ఏకాదశపలైరేవ లక్షమానము దాహృతమ్‌ | పూర్వవత్పూ జనం తత్ర కర్తవ్యం హిత కామ్యయా || 45

దానిపైన గంధపుష్పాదులచే అలంకరింపబడిన మారేడు ఫలము నొకదానిని ఉంచి ధూపాది ఉపచారములను చేసినచో పూజా ఫలము సిద్ధించును (41). ఆ బియ్యము నంతనూ రెండు రూప్యముల దక్షిణతో సహా ఈ వ్రతమును ఉపదేశించిన వానికి ఈయవలెను. దక్షిణ యథాశక్తి యైననూ కావచ్చును (42). తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఇట్లు చేయట వలన మంత్ర పూర్వకముగా సంపూర్ణ లక్షార్చనా ఫలము లభించును (43). మంత్రమును నూట యెనిమిది సార్లు జపించవలెనని విధి గలదు. పలము, లేక లక్ష (ఒక మానము) తిలలతో ఇదే విధముగా పూజించినచో, మహాపాపములు తొలగిపోవును (44). పదకొండు పలములు ఒక లక్ష యగును. తిలలను శివుని పైనుంచి తరువాత పూర్వము చేసిన విధముగా పూజించు భక్తుడు హితములతను పొందును (45).

భోజ్యా వై బ్రాహ్మణాస్తస్మాదత్ర కార్యా నరేణ హి | మహాపాతకజం దుఃఖం తత్‌ క్షణాన్న శ్యతి ధ్రువమ్‌ || 46

యవపూజా తథా ప్రోక్తా లక్షేణ పరమా శివే | ప్రస్థానా మష్టకం చైవ తథా ప్రస్థార్ధకం పునః || 47

పల ద్వయ యుతం తత్ర మానమేత త్పురాతనమ్‌ | యవపూజా చ ముని భిస్స్వర్గ సౌఖ్య వివర్దినీ || 48

ప్రాజాపత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం చ ఫలేప్సుభిః | గోధూమాన్నైస్తథా పూజా ప్రశస్తా శంకరస్య వై || 49

భక్తుడు అటు పిమ్మట బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇట్లు చేయుట వలన మహాపాపములనుండి పుట్టే దుఃఖము వెను వెంటనే నిశ్చితముగా నాశనమగును (46). లక్ష మానము గల సగ్గు బియ్యమును శివునకు అర్పించుట చాల శ్రేష్ఠము. మరియు ఎనిమిదిన్నర ప్రస్థములు (47), రెండు పలముల సగ్గు బియ్యమును అర్పించవలెనని పూర్వర్షులు మానమును నిర్ణయించిరి. ఇట్లు సగ్గు బియ్యమును అర్పించుట వలన స్వర్గసౌఖ్యములు లభించునని మహర్షులు చెప్పిరి (48). ఫలమును కోరు భక్తులు ఆ బియ్యమును అంతయూ బ్రాహ్మణులకు దానమీయవలెను. శంకరుని గోధుమలతోను, అన్నముతోను పూజించుట మిక్కిలి శ్రేష్ఠము (49).

సంతతి ర్వర్థతే తస్య యది లక్షావధిః కృతా | ద్రోణార్థేన భ##వేల్లక్షం విధానం విధిపూర్వకమ్‌ || 50

ముద్గానాం పూజనే దేవశ్శివో యచ్ఛతి సుఖమ్‌ | ప్రస్థానాం సప్తకేనైవ ప్రస్థార్ధేనాథ వా పునః || 51

పల ద్వయముతే నైవ లక్షముక్తం పురాతనైః | బ్రాహ్మణాశ్చ తథా భోజ్యా రుద్ర సంఖ్యా ప్రమాణతః || 52

ప్రియంగు పూజ నాదేవ ధర్మాధ్యక్షే పరాత్మని | ధర్మార్థ కామా వర్థంతే పూజా సర్వ సుఖావహా || 53

ప్రస్థైకేన చ తస్యోక్తం లక్షమేకం పురాతనైః | బ్రహ్మ భోజం తథా ప్రోక్తమర్క సంఖ్యా ప్రమాణతః || 54

లక్ష పరిమాణము గల బియ్యమును అర్పించు భక్తునికి సంతానము వర్ధిల్లును. ద్రోణము అనే పరిమాణములో సగము లక్ష అగును. ఇది శాస్త్రీయ విధానము (50). పెసలతో పూజించినచో శివుడు సుఖము నిచ్చును. ఏడున్నర ప్రస్థములకు (51) రెండు పలములను కలిపినచో లక్ష అగునని పూర్వర్షులు చెప్పిరి. మరియు, పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (52). ధర్మాధ్యక్షుడు, పరమాత్మయగు శివునకు ప్రియంగు ధాన్యము (కొర్ర ధాన్యము) ను సమర్పించినచో, ధర్మార్థకామములు వర్దిల్లి, సర్వసుఖములు కలుగును (53). ఈ ధాన్యమును ఒక ప్రస్థముతో కూడ ఒక లక్ష ప్రమాణములో అర్పించవలెనని పూర్వర్షులు చెప్పిరి. మరియు పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనము నిడవలెనని చెప్పబడినది (54).

రాజి కాపూజనం శంభోశ్శత్రోర్మృత్యుకరం స్మృతమ్‌ | సార్షపానాం తథా లక్షం పలైర్వింశతి సంఖ్యయా || 55

తేషాం చ పూజనాదేవ శత్రోర్మృత్యురుదాహృతః |ఆఢీకానాం దలైశ్చైవ శోభయిత్వార్చయేచ్ఛివమ్‌ || 56

వృతా గౌశ్చ ప్రదాతవ్యా బలీవర్దస్తథైవ చ | మహిచసంభవా పూజా శత్రోర్నాశకరీ స్మృతా || 57

నానా సుఖకరీ హ్యేషా పూజా సర్వఫలప్రదా | ధాన్యానామితి ప్రోక్తం మయా తే మునిసత్తమ || 58

శంభుని నల్ల ఆవాలతో పూజించినచో శత్రువు మృత్యువును పొందును. ఇరువది పలముల తెల్ల ఆవాలు ఒక లక్ష మానమగును. (55).లక్ష ఆవాలతో శివుని పూజించుట తోడనే శత్రువు నశించును. కందిపువ్వుల దళములతో శివుని అలంకరించి పూజిచవలెను (56). దూడతో కూడిన ఆవును, ఎద్దును దానము చేయవలెను. మిరియాలతో పూజించినచో శత్రువు నశించునని చెప్పబడినది (57). ఈ పూజ సర్వసుఖములను, సర్వఫలములను ఇచ్చును. ఓ మునిశ్రేష్ఠా! నేను నీకింతవరకు ధాన్యములతో పూజచేయు విధమును తెలిపితిని (58).

లక్ష మానం తు పుష్పాణాం శృణు ప్రీత్యా మునీశ్వర | ప్రస్థానాం చ తథా చైకం శంఖపుష్పసముద్భవమ్‌ || 59

ప్రోక్తం వ్యాసేన లక్షం హి సూక్ష్మమాన ప్రదర్శినా | ప్రస్థై రేకాదశైర్జాతీ లక్ష మానం ప్రకీర్తితమ్‌ || 60

యూథికాయాస్తథా మానం రాజికాయాస్తదర్ధకమ్‌ | ప్రస్థైర్వింశతికైశ్చైవ మల్లికామానముత్తమ్‌ || 61

తిలపుషై#్పస్తథా మానం ప్రస్థాన్న్యూనం తథైవ చ | తతశ్చ ద్విగుణం మానం కరవీరభ##వే స్మృతమ్‌ || 62

ఓ మునిశ్రేష్ఠా! పుష్పములకు వర్తించే లక్షమానమును ప్రీతితో వినుము. శంఖపుష్పముల ఒక ప్రస్థము ఒక లక్షయగునని (59) సూక్ష్మమానమును వివరించిన వ్యాసుడు చెప్పినాడు. పదకొండు ప్రస్థముల అడవి మల్లెలు ఒక లక్ష యగును (60). కొండమల్లెల మానము కూడా ఇంతే. దీనిలో సగము ఆవపువ్వులు లక్షయగును. ఇరువది ప్రస్థముల తీగమల్లె పువ్వులు ఒక లక్షయగును (61).ప్రస్థము కంటె కొద్ది తక్కువ నువ్వుల పువ్వులు ఒక లక్షయగును. దీనికి రెండు రెట్లు ఎర్రగన్నేరు పువ్వులు ఒక లక్ష మానమగును (62).

నిర్గుండీకుసుమే మానం తథైవ కథితం బుధైః | కర్ణికారే తథా మానం శిరీషకు సుమే పునః || 63

బంధుజీవే తథా మానం ప్రస్థానాం దశ##కేన చ | ఇత్యాద్యైర్వివిధైర్మానం దృష్ట్వా కుర్యాచ్ఛివార్చనమ్‌ || 64

సర్వకామసమృద్ధ్యర్థం ముక్త్యర్థం కామనోజ్ఘితః | అతః పరం ప్రవక్ష్యామి ధారాపూజాఫలం మహత్‌ || 65

యస్య శ్రవణ మాత్రేణ కల్యాణం జాయతే నృణామ్‌ | విధాన పూర్వకం పూజాం కృత్వా భక్త్యా శివస్య వై || 66

పశ్చాచ్చ జలధారా హి కర్తవ్యా భక్తి తత్పరైః |

సిందూర పుష్పముల విషయములో కూడ మానము ఇటులనే అనియు, కొండగోగు పువ్వులకు మరియు దిరిసెన పువ్వులకు ఇదియే మానమనియు పండితులు చెప్పెదరు (63). మంకెన పుష్పముల వి,యములో నలభై మానికెల కొలత ఒక లక్షయగును. భక్తుడు ఈ వివిధ మానములను పరిశీలించి, శివుని అర్చించినచో (64), సర్వకామనలు సిద్ధించును. కామనలు లేని భక్తునకు ముక్తి లభించును. ఈపైన పరమ పవిత్రమైన ధారాపూజ యొక్క ఫలమును చెప్పెదను (65). దీనిని విన్నంత మాత్రానా మానవులకు మంగళములు కలుగును. శివునకు యథావిధిగా భక్తితో పూజసలిపి (66), ఆ తరువాత భక్తి తత్పరులగు సాధకులు శివునిపై జలధారను ఏర్పాటు చేయవలెను.

జ్వరప్రలాప శాంత్యర్థం జలధారా శుభావహా || 67

శతరుద్రియ మంత్రేణ రుద్రసై#్యకాదశేన తు | రుద్ర జాప్యేన వా తత్ర సూక్తేన పౌరుషేణ వా || 68

షడంగేనాథ వా తత్ర మహామృత్యుం జయేన చ | గాయత్ర్యా వా నమోంతైశ్చ నామభిః ప్రణవాది భిః || 69

మంత్రైర్వాథాగమోక్తైశ్చ జలధారాదికం తథా | సుఖసంతానవృద్ధ్యర్ధం ధారాపూజనముత్తమమ్‌ || 70

నానాద్రవ్యైశ్శు భైర్దివ్యైః ప్రీత్యా సద్భస్మధారిణా | ఘృతధారా శివే కార్యా యావన్మంత్ర సహస్రకమ్‌ || 71

జ్వరము, దానిలో కలిగే ప్రలాపము శాంతించి, శుభములు కలుగవలెనన్నచో, శివునిపై జలధారను అభిషేకించవలెను (67). శతరుద్రీయమును పదకొండు సార్లు , లేదా పురుషసూక్తమును పఠించి అభిషేకించవలెను (68). ఋషి, దేవత, ఛందస్సు, బీజము, శక్తి, కీలకము అను ఆరు అంగములతో కూడిన మహామృత్యుంజయ మంత్రముతో గాని, గాయత్రీ మంత్రముతో గాని, తేదా ఓం కారముతో మొదలిడి నమః తో అంతమయ్యే నామములతో గాని అభిషేకించవలెను (69). లేదా, ఆగమోక్త మంత్రములచే జలధారను శివునిపై అభిషేకించినచో, అది ఉత్తమమగు అభిషేకమగును. దానివలన చక్కని సంతానము కలుగును (70). భక్తుడు మంచి భస్మను ధరించి, శుభద్రవ్యములతో శివుని పూజించవలెను. సహస్రనామములను పఠిస్తూ నేతిధారతో శివుని అభిషేకించవలెను (71).

తథా వంశస్య విస్తారో జాయతే నాత్ర సంశయః | ఏవం మదుక్త మంత్రేణ కార్యం వై శివపూజనమ్‌ || 72

బ్రహ్మ భోజ్యం తథా ప్రోక్తం ప్రాజాపత్యం మునీశ్వరైః | కేవలం దుగ్ధధారా చ తదా కార్యా విశేషతః || 73

శర్కరామిశ్రితా తత్ర యదా బుద్ధిర్జడో భ##వేత్‌ | తస్యా సంజాయతే జీవసదృశీ బుద్ధిరుత్తమా || 74

యావన్మంత్రాయుతం న స్యా త్తావద్ధారాప్ర పూజనమ్‌ |

అపుడు వంశము విస్తరించుననుటలో సందియము లేదు. ఈ విధముగా నేను చెప్పిన మంత్రముతో శివుని పూజించవలెను (72). మరియు బ్రాహ్మణులకు భోజనమునిడి, ప్రాజాపత్యవ్రతము నాచరించవలెనని మునిశ్రేష్ఠులు చెప్పినారు. బుద్ధి మాంద్యము గల భక్తుడు శివునిపై పంచదార కలిపిన పాలతో ధారారూపముగా అభిషేకించినచో (73), అట్టి భక్తునకు తగిన ఉత్తమమగు బుద్ధి కలుగును (74). పదివేల మంత్ర జపము పూర్తియగు వరకు ధారతో నిరంతరము అభిషేకించవలెను.

యదా చోచ్చాటనం దేహే జాయతే కారణం వినా || 75

యత్ర కుత్రాపి వా ప్రేమ దుఃఖం చ పరివర్థితమ్‌ | స్వగృహే కలహో నిత్యం యదా చైవ ప్రజాయతే || 76

తద్ధారాయాం కృతాయాం వై సర్వం దుఃఖం విలీయతే | శత్రూణాం తాపనార్థం వై తైలాధారా శివోపరి || 77

కర్తవ్యా సుప్రయత్నేన కార్య సిద్ధిర్ధ్రువం భ##వేత్‌ | వాసితేనైవ తైలేన భోగవృద్ధిః ప్రజాయతే || 78

శరీరములో కారణము లేకుండా ఉద్వేగము కలిగినప్పుడు (75), ఏదో ఒక వస్తువుపై లేక వ్యక్తిపై ప్రేమ కలిగి దుఃఖము పెరిగినప్పుడు, ఇంటిలో నిత్యము కొట్లాటలు బయలుదేరినప్పుడు (76), అట్టి ధారతో అభిషేకించినచో దుఃఖములన్నియు తొలగిపోవును. శత్రువులను తపింపజేయ గోరు వ్యక్తి శివునిపై తైలధారతో (77) ప్రయత్నపూర్వకముగా అభిషేకించినచో, తప్పక కార్యసిద్ధి కలుగను. సువాసన నూనెతో అభిషేకించినచో భోగములు వర్ధిల్లును (78).

సార్షపేనైవ తైలేన శత్రునాశో భ##వేద్ధ్రువమ్‌ | మధునా యక్ష్మరాజో వై గచ్ఛేచ్చ శివపూజనాత్‌ || 79

ధారా చేక్షురసస్యాపి సర్వానందకరీ శివే | ధారా గంగాజలసై#్యవ భుక్తిముక్తి ఫలప్రదా || 80

ఏతాస్సర్వాశ్చ యాః ప్రోక్తా మృత్యుంజయ సముద్భవాః | తత్రాయుత ప్రమాణం హి కర్తవ్యం తద్విధానతః || 81

కర్తవ్యం బ్రాహ్మణానాం చ భోజ్యం వై రుద్ర సంఖ్యయా | ఏతత్తే సర్వమాఖ్యాతం యత్‌ పృష్టోsహం మునీశ్వర|| 82

ఏతద్వై సఫలం లోకే సర్వకామహితావహమ్‌ |

ఆవాల నూనెతో అభిషేకించినచో, శత్రువులు నిశ్చయముగా నశించెదరు. తేనెతో శివుని అభిషేకించి పూజించినచో, దీర్ఘవ్యాధి తొలగిపోవును (79). శివునకు చెరుకురసముతో అభిషేకించినచో సర్వా నందములు కలుగును. గంగా జలధారతో అభిషేకించినచో భుక్తి, ముక్తి కలుగును (80). ఈ అభిషేకములనన్నిటినీ పదివేల మృత్యుంజయ జపము పూర్తియగు వరకు చేయవలెనని విధి (81). అభిషేకానంతరము పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనమునడవలెను. ఓమునిశ్రేష్ఠా! నీవు అడిగిన దానిని అంతయూ నీకు చెప్పితిని (82). ఈ జ్ఞానమును విన్న మానవుడు ఈ లోకములో సర్వకామనలను, హితములను పొందును.

స్కందోమాసహితం శంభుం సంపూజ్య విధినా సహ || 83

యత్ఫలం లభ##తే భక్త్యా తద్వదామి యథాశ్రుతమ్‌ | అత్ర భుక్త్వాఖిలం సౌఖ్యం పుత్ర పౌత్రాభిశ్శుభమ్‌ || 84

తతో యాతి మహేశస్య లోకం సర్వసుఖావహమ్‌ | సూర్యకోటి ప్రతీకాశైర్విమానై స్సర్వకామగైః || 85

రుద్ర కన్యాసమాకీర్ణైర్గేయవాద్య సమన్వితైః | క్రీడతే శివభూతశ్చ యావదాభూతసంప్లవమ్‌ || 86

తతో మోక్షమవాప్నోతి విజ్ఞానం ప్రాప్య చావ్యయమ్‌ || 87

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమ ఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యుపాఖ్యానే శివపూజా విధాన వర్ణనం నామ చతుర్దశోsధ్యాయః (14).

స్కందునితో, పార్వతితో కూడియున్న శంభుని యథావిధిగా భక్తితో పూజించిన వానికి కలుగు ఫలమును నేను విన్న మేరకు చెప్పెదను. అట్టివాడు ఈ లోకములో పుత్రులతో, పౌత్రులతో కూడిన మంగళకరములగు సౌఖ్యములనన్నిటినీ అనుభవించి (84), ఆ తరువాత సర్వసుఖముల నొసగు మహేశుని లోకమును పొందును. అచట శివస్వరూపుడై, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే, యథేచ్ఛా సంచారము గల (85), రుద్ర కన్యలతో నిండియున్న గానముతో వాద్యములతో అలరారే విమానములనధిష్ఠించి, మహా ప్రలయము వరకు క్రీడించును (86). తరువాత వినాశరహితమగు విజ్ఞానమును పొంది, మోక్షమును పొందును (87).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండమునందు శివపూజావర్ణనమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).

Sri Sivamahapuranamu-I    Chapters