Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచదశోsధ్యాయః రుద్రావతారావిర్భావము నారద ఉవాచ | విధే విధే మహాభాగ ధన్యస్త్వం సురసత్తమ | శ్రావితాద్యాద్భుతా శైవకథా పరమపావనీ ||
1 తత్రాద్భుతా మహాదివ్యా లింగోత్పత్తి శ్ర్శుతా శుభా | శ్రుత్వా యస్యాః ప్రభావం చ దుఃఖనాశో భ##వేదిహ ||
2 అనంతరం చ యజ్ఞాతం మహాత్మ్యం చరితం తథా | సృష్టైశ్చైవ ప్రకారం చ కథయ త్వం విశేషతః ||
3 నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మన్! మహాత్మా! సురశ్రేష్ఠా! నీవు ధన్యుడవు. నీవీనాడు అద్భుతము, పరమపవిత్రమునగు శివగాథను వినిపించితివి (1). ఆ గాథలో భాగముగా మిక్కిలి దివ్యమైనది, శుభకరము అగు లింగోద్భవమును వినిపించితివి. లింగ మహాత్మ్యమును విన్న మానవులకు ఈ లోకములో దుఃఖము నశించును (2). లింగోద్భవము తరువాత జరిగిన వృత్తాంతమును, మహత్మ్యమును, సృష్టి ప్రకారమును వివరించి చెప్పుము (3). బ్రహ్మోవాచ | సమ్యక్ పృష్టం చ భవతా యజ్ఞాతం తదనంతరమ్ | కథయిష్యామి సంక్షేపాద్యథా పూర్వం శ్రుతం మయా ||
4 అంతర్హితే తదా దేవే శివరూపే సనాతనే | అహం విష్ణుశ్చ విప్రేంద్ర అధికం సుఖమాప్తవాన్ || 5 మయా చ విష్ణునా రూపం హంస వారాహయోస్తదా | సంవృతం తు తతస్తాభ్యాం లోకసర్గావనేచ్ఛయా ||
6 బ్రహ్మ ఇట్లు పలికెను - నీవు చక్కగా ప్రశ్నించితివి. తరువాత జరిగిన వృత్తాంతమును నేను పూర్వము వినియుంటిని. ఆ వృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను (4). అపుడు సనాతనుడగు శివదేవుడు అంతర్హితుడయ్యెను. హే విప్రశ్రేష్ఠా! నేను మరియు విష్ణువు మిక్కిలి సుఖమును పొందితిని (5). అపుడు లోకములను సృష్టించవలెననే కోరిక గలవాడనై నేను హంసరూపమును ఉపసంహరించుకుంటిని. విష్ణువు లోకములను రక్షించుటకై వరాహ రూపమను ఉపసంహరించెను (6). నారద ఉవాచ | విధే బ్రహ్మాన్ మహాప్రాజ్ఞ సంశయో హృది మే మహాన్ | కృపాం కృత్వాతులాం శీఘ్రం తం నాశయితుమర్హసి ||
7 హంస వారాహయో రూపం యువాభ్యాం చ ధృతం కథమ్ | అన్యద్రూపం విహాయైవ కిమత్ర వద కారణమ్ ||
8 నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మాన్! నీవు మహాప్రాజ్ఞుడవు. నా హృదయములో గొప్ప సందేహము ఒకటి గలదు. నీవు దయతో ఆ సందేహమును వెనువెంటనే పారద్రోల దగుదువు. (7). మీరిద్దరు ఇతర రూపములను వీడి హంస వరాహరూపములను మాత్రమే ధరించుటకు గల కారణమేమియో చెప్పుము (8). సూత ఉవాచ | ఇత్యేతద్వచనం శ్రుత్వా నారదస్య మహాత్మనః | స్మృత్వా శివపదాం భోజం బ్రహ్మా సాదరమబ్రవీత్ ||
9 సూతుడిట్లు పలికెను- నారద మహాత్ముని ఈ మాటను విని, బ్రహ్మ శివుని పాదపద్మములను స్మరించి ప్రేమతో నిట్లనెను (9). బ్రహ్మోవాచ | హంసస్య చోర్ధ్వ గమనే గతిర్భవతి నిశ్చలా |తత్త్వాతత్త్వ వివేకోS స్తి జలదుగ్ధ విభాగవత్ || 10 అజ్ఞాన జ్జానయోస్తత్వం వివేచయతి హంసకః |హంసరూపం ధృతం తేన బ్రహ్మణా సృష్టికారిణా || 11 వివేకో నైవ లబ్ధశ్చ యతో హంసో వ్యలీయత | శివస్వరూపతత్త్వస్య జ్యోతీరూపస్య నారద || 12 సృష్టి ప్రవృత్తి కామస్య కథం జ్ఞానం ప్రజాయతే | యతో లబ్దో వివేకోsపి న మయా హంసరూపిణా || 13 బ్రహ్మ ఇట్లు పలికెను - హంస నిశ్చలముగా పైకి పయనించగలదు. మరియు నీటిని పాలను వేరు చేసిన తీరున, హంస తత్త్వమును, అతత్త్వమును (10), జ్ఞానమును, అజ్ఞానమును వేరు చేయగలదు. అందువలననే, సృష్టికర్తయగు బ్రహ్మ హంసరూపమును ధరించెను (11). ఓ నారదా! జ్యోతిస్స్వరూపుడగు శివుని తత్త్వము యొక్క వివేకము, ఆ హంస రూపము లీనమగుటచే, నాకు లభించనే లేదు (12). సృష్టిలో ప్రవర్తిల్లవలెననే కోరిక గలవానికి జ్ఞానము ఎట్లు కలుగును? హంస రూపమును పొందియూ నేను వివేకమును పొందలేకపోతిని (13), గమనేsధో వరాహస్య గతిర్భవతి నిశ్చలా | ధృతం వారాహరూపం హి విష్ణునా వన చారిణా || 14 అథవా భవకల్పార్థం తద్రూపం హి ప్రకల్పితమ్ | విష్ణునా చ వరాహస్య భువనావన కారిణా || 15 యద్దినం హి సమారభ్య తద్రూపం ధృతవాన్హరిః | తద్దినం ప్రతి కల్పోs సౌ కల్పో వారాహసంజ్ఞకః || 16 ఇతి ప్రశ్నోత్తరం దత్తం ప్రస్తుతం శృణు నారద | స్మృత్వా శివపదాంభోజం వక్ష్యే సృష్టివిధిం మునే || 17 అంతర్హితే మహాదేవే త్వహం లోకపితామహః | తదీయం వచనం కర్తు మధ్యాయన్ ధ్యానతత్పరః || 18 క్రిందికి దూసుకుపోవుటలో వరాహమునకు స్థిరమైన గమనము గలదు. అందువలననే, వనములయందు సంచరించు విష్ణువు వరాహరూపమును ధరించెను (14). లేదా, లోకములను రక్షించు విష్ణువు సృష్టిలో కల్ప వ్యవస్థ కొరకై ఆ రూపమును ధరించియుండును (15). ఏనాడు హరి ఆ రూపమును ధరించెనో, ఆ నాటి నుండి ప్రవర్తిల్లిన కల్పముకు వరాహకల్పమని పేరు వచ్చెను (16). ఓ నారదా! నీప్రశ్నలలో కొన్నింటికి నీకు సమాధానముల నిచ్చితిని. ఓమహర్షీ! నేనిపుడు శివుని పాదపద్మములను స్మరించి సృష్టి ప్రకారమును చెప్పెదను (17). మహాదేవుడు అంతర్ధానము కాగానే లోకములకు పితామహుడనగు నేను శివుని ఆజ్ఞను పాలించుటకై ధ్యానమగ్నుడనైతిని (18). నమస్కృత్య తదా శంభుం జ్ఞానం ప్రాప్య హరేస్తదా | ఆనందం పరమం గత్వా సృష్టిం కర్తుం మనో దధే || 19 విష్ణుశ్చాపి తదా తత్ర ప్రణిపత్య సదాశివమ్ | ఉపదిశ్య చ మాం తాత హ్యంతర్ధానముపాగతః || 20 బ్రహ్మాండాచ్చ బహిర్గత్వా ప్రాప్య శంభోరనుగ్రహమ్ | వైకుంఠనగరం గత్వా తత్రోవాస హరిస్సదా || 21 అహం స్మృత్వా శివం తత్ర విష్ణుం వై సృష్టికామ్యయా | పూర్వం సృష్టం జలం యచ్చ తత్రాంజలిముదాక్షిపమ్ || 22 అపుడు నేను శంభునకు నమస్కరించి, విష్ణువునుండి జ్ఞానమును పొంది, పరమానందమును పొంది, సృష్టిని చేయుటకు నిశ్చయించితిని (19). అపుడు విష్ణువు కూడా, ఓవత్సా! సదాశివునకు నమస్కరించి, నాకు ఉపదేశించి, అంతర్ధానమయ్యెను (20). విష్ణువు బ్రహ్మాండమునకు ఆవలనున్న వైకుంఠనగరమును శంభుని అనుగ్రహముచే పొంది అచట శాశ్వత కాలము నివసించెను (21). నేను సృష్టిని చేయగోరి, శివుని విష్ణువుని స్మరించి, పూర్వము సృష్టింపబడిన జలము నుండి దోసిలితో నీటిని స్వీకరించితిని (22). అతోsండమభవత్తత్ర చతుర్విశతిసంజ్ఞకమ్ | విరాడ్రూపమ భూద్విప్ర జడరూపమపశ్యతః || 23 తతస్సంశయమాపన్నస్తపస్తేపే సుదారుణమ్ | ద్వాదశాబ్దమహం తత్ర విష్ణుధ్యానపరాయణః || 24 తస్మింశ్చ సమయే తాత ప్రాదుర్భూతో హరిస్స్వయమ్ | మామువాచ మహాప్రీత్యా మదంగం సంస్పృశన్ముదా || 25 హే విప్రా! ఆనీటి నుండి ఇరువది నాలుగు తత్త్వములతో గూడిన విరాట్ అండాకారముగా జన్మించెను. ఆ విరాడ్రూపములో జడత్వమే గాని, చైతన్యము కన్పట్టలేదు (23). అపుడు నాకు సందేహము కలిగి విష్ణుధ్యానతత్పరుడనై పన్నెండు సంవత్సరముల దారుణముగ తపస్సును ఆచరించితిని (24). ఓవత్సా! అపుడు విష్ణువు స్వయముగా ప్రత్యక్షమై ప్రీతితో నా దేహమును స్పృశించి నాతో ఇట్లు పలికెను (25). విష్ణు రువాచ | వరం బ్రూహి ప్రసన్నోsస్మి నాదేయో విద్యతే తవ | బ్రహ్మన్ శంభుప్రసాదేన సర్వం దాతుం సమర్థకః || 26 విష్ణువు ఇట్లు పలికెను - ఓ బ్రహ్మా! వరమును కోరము. నేను నీపై ప్రసన్నుడనైతిని. నేను నీకీయజాలని వరము లేదు. శంభుని అనుగ్రహముచే నేను సర్వమును ఈయగల సమర్థుడను (26). బ్రహ్మోవాచ | యుక్తమేతన్మహాభాగ దత్తోsహం శంభునా చ తే | తదుక్తం యాచతే మేsద్య దేహి విష్ణో నమోsస్తుతే || 27 విరాడ్రూపమిదం హ్యండం చతుర్వింశతి సంజ్ఞకమ్ | న చైతన్యం భవత్యాదౌ జడీభూతం ప్రదృశ్యతే || 28 ప్రాదుర్భూతో భవానద్య శివానుగ్రహతో హరే | ప్రాప్తం శంకర సంభూత్యా హ్యండం చైతన్య మావహ || 29 ఇత్యుక్తే చ మహావిష్ణుశ్శంభోరాజ్ఞాపరాయణః | అనంతరూపమాస్థాయ ప్రవివేశ తదండకమ్ || 30 బ్రహ్మ ఇట్లు పలికెను - మహాత్మా! నీవు చక్కగా పలికితివి. శంభుడు నన్ను నీకు అప్పిగించినాడు. హే విష్ణో! నేను కోరిన దానిని నాకు ఇమ్ము. నీకు నమస్కారమగు గాక! (27). ఇరువది నాల్గు తత్త్వములు కలిగిన విరాడ్రూపమగు ఈ అండము జడాత్మకముగా నున్నది. దీనియందు చైతన్యము కానరాకున్నది (28). హే విష్ణో! నీవీనాడు శివుని అనుగ్రహము వలన ప్రత్యక్షమైతివి. శంకరుని అనుగ్రహముచే లభించిన ఈ అండమును చైతన్యముతో నింపుము (29). బ్రహ్మ ఇట్లు పలుకగా, శంభుని ఆజ్ఞను శ్రద్ధతో పాలించే మహా విష్ణువు అనంత రూపముతో ఆ అండమును ప్రవేశించెను (30). సహస్ర శీర్షా పురుషస్సహస్రాక్షస్సహస్రపాత్ | స భూమిం సర్వతో వృత్వా తదండం వ్యాప్త వానితి || 31 ప్రవిష్టే విష్ణునా తస్మిన్నండే సమ్యక్ స్తుతేన మే | సచేతన మభూదండం చతుర్వింశతి సంజ్ఞకమ్ || 32 పాతాలాది సమారభ్య సప్తలోకాధిపస్స్వయమ్ | రాజతే స్మ హరిస్తత్ర వైరాజః పురుషః ప్రభుః || 33 కైలాసనగరం రమ్యం సర్వోపరి విరాజితమ్ | నివాసార్థం నిజసై#్యవ పంచవక్త్రశ్చకార హ || 34 ఆయన అనంత శిరస్సులు, అనంత నేత్రములు, అనంత పాదములు గల విరాట్పురుషుడై, భూమినంతయూ వ్యాపించి, ఆ అండమును వ్యాపించినాడు (31). నేను చక్కగా ఆయనను ప్రార్ధించితిని. ఆయన నా ప్రార్థనను మన్నించి అండమునందు ప్రవేశించగనే, ఇరువది నాల్గు తత్త్వముల ఆ అండము చేతన సహితమాయెను (32). విరాట్పురుషుడు, జగత్ర్పభువునగు విష్ణువు పాతాలముతో మొదలిడి ఏడు లోకములకు ప్రభువై బ్రహ్మాండములో స్వయముగా ప్రకాశించుచున్నాడు (33). ఈ ఏడు లోకములపైన సుందరమగు కైలాసనగరమును అయిదు మోముల దైవము తన నివాసము కొరకు నిర్మించెను (34). బ్రహ్మాండస్య తథా నాశే వైకుంఠస్య చ తస్య చ | కదాచిదేవ దేవర్షే నాశో నాస్తి తయోరిహ || 35 సత్యం పదముపాశ్రిత్య స్థితోsహం మునిసత్తమ | సృష్టికామోsభవం తాత మహాదేవాజ్ఞయా హ్యహమ్ || 36 సిసృక్షోరథ మే ప్రాదురభవత్పాప సర్గకః | అవిద్యా పంచకస్తాత బుద్ధి పూర్వస్తమోపమః || 37 తతోsప్రసన్న చిత్తోsహమసృజం స్థావరాభిధమ్ | ముఖ్య సర్గం చ నిస్సంగమధ్యాయం శంభుశాసనాత్ || 38 ఓ దేవర్షీ! బ్రహ్మాండము నశించిననూ, వైకుంఠకైలాసములకేనాడూ నాశము లేదు (35). ఓ మహర్షీ! నేను సత్యలోకమునాశ్రయించి ఉన్నాను. వత్సా! నేను మహాదేవుని యాజ్ఞచే సృష్టిని చేయతలపెట్టితిని (36). సృష్టిని చేయసంకల్పించి, నేను ముందుగా తమోగుణప్రధానము, పంచ అవిద్యలతో కూడినది యగు పాపసర్గమును చేసితిని (37). అపుడు నేను మనస్సులో దుఃఖించి వృక్షలతాదిరూపమగు ముఖ్య సర్గమును సృష్టించితిని. అపుడు శివుడు యాజ్ఞచే నేను మరల సృష్టిని గూర్చి ధ్యానము చేసితిని (38). తం దృష్ట్వా మే సిసక్షోశ్చ జ్ఞాత్వాsసాధక మాత్మనః | సర్గోsవర్తత దుఃఖాఢ్యస్తిర్యక్ స్రోతా న సాధకః || 39 తంచాసాధకమాజ్ఞాయా పునశ్చింతయతశ్చమే | అభవత్సాత్త్వికస్సర్గ ఊర్ధ్వస్రోతా ఇతి ద్రుతమ్ || 40 దేవసర్గః ప్రతిఖ్యాత స్సత్యోsతీవ సుఖావహః | తమప్య సాధకం మత్వాsచింతయం ప్రభుమాత్మనః || 41 ప్రాదురాసీత్తతస్సర్గో రాజసశ్శంకరాజ్ఞయా | అర్వాక్ స్రోతా ఇతి ఖ్యాతో మానుషః పరసాధకః || 42 ఈ సృష్టి కూడ పురుషార్థ సాధకము కాదని భావించితిని. తరువాత పశు పక్ష్యాదులతో కూడిన (తిర్యక్ స్రోతస్సు), దుఃఖబహుళమగు సర్గమును చేసితిని. అదియు పురుషార్థసాధకము కాలేదు (39). అందువలన మరల నాకు చింత కలిగినది. అపుడు వెంటనే సత్త్వగుణ ప్రధానము, ఊర్ధ్వ స్రోతస్సు అను పేరు గలది (40). సత్యగుణము కలది, మిక్కిలి సుఖమును కలిగించునది యగు దేవ సర్గము ఆవిర్భవించెను. అది కూడా పురుషార్తసాధకము కాదని తలంచి, నా ప్రభువగు శివుని స్మరించితిని (41). అపుడు శంకరుని యాజ్ఞచే అర్వాక్ స్రోతస్సు అని ప్రఖ్యాతి గాంచినది, పురుషార్థసాధకము, రజోగుణప్రధానమైనది యగు మానుష సర్గము ఆవిర్భవించెను (42). మహాదేవాజ్ఞయా సర్గస్తతో భూతాదికోsభవత్ | ఇతి పంచవిధా సృష్టిః ప్రవృత్తావై కృతా మయా || 43 త్రయస్సర్గాః ప్రకృత్యాశ్చ బ్రహ్మణః పరికీర్తితాః | తత్రాద్యో మహతస్సర్గో ద్వితీయ స్సూక్ష్మ భౌతికః || 44 వైకారికస్తృతీయశ్చ ఇత్యేతే ప్రాకృతాస్త్రయః | ఏవం చాష్ట విధాస్సర్గాః ప్రకృతేర్వైకృతైస్సహ || 45 కౌమారో నవమః ప్రోక్తః ప్రాకృతో వైకృతశ్చ సః | ఏషామవాంతరో భేదో మయా వక్తుం న శక్యతే || 46 తరువాత మహాదేవుని యాజ్ఞచే భూతాది సృష్టి జరిగెను. ఈ తీరున నేను ఐదు విధములుగా సృష్టిని ప్రవర్తిల్లజేసితిని (43). మరియు ప్రకృతి నుండి మూడు సర్గములు బయలుదేరినవి. మొదటి మహత్ (సమష్టిబుద్ధి) సర్గము. రెండవది భూతసూక్ష్మముల సృష్టి (44). మూడవది పాంచభౌతిక (వైకారిక) సృష్టి. ఇవి మూడు ప్రకృతి నుండి బయలుదేరిన సృష్టులు. ఈ విధముగా ప్రకృత్యుద్భవములగు వాటితో కలిసి ఎనిమిది రకముల సర్గములు గలవు (45). తొమ్మిదవది కౌమార సర్గము. అది ప్రాకృతము, వైకృతము కూడా. ఈ సర్గములలోని అవాంతర భేదములను నేను చెప్పజాలను (46). అల్పత్వాదుపయోగస్య వచ్మి సర్గం ద్విజాత్మకమ్ | కౌమారః సనకాదీనాం యత్ర సర్గో మహానభూత్ || 47 సనకాద్యాస్సుతా మేహి మానసా బ్రహ్మసంమితాః | మహావైరాగ్య సంపన్నా అభవన్ పంచ సువ్రతాః || 48 మయాజ్ఞప్తా ఆపి చ తే సంసారవిముఖా బుధాః | శివధ్యానైక మనసో న సృష్టౌ చక్రిరే మతిమ్ || 49 ప్రత్యుత్తరం చ తైర్దత్తం శ్రుత్వాహం మునసత్తమ | అకార్షం క్రోధమత్యుగ్రం మోహమాప్తశ్చ నారద || 50 ఈ అవాంతర భేదముల ప్రయోజనము అల్పమగుటచే చెప్పుటలేదు. ఇపుడు ద్విజ సర్గమును చెప్పెదను. కౌమార సర్గమనగా నిదియే. దీనిలో సనకాది మహాత్ముల సృష్టి జరిగెను (47). నాకు నాతో సమమైనవారు, గొప్పవైరాగ్య సంపన్నులు, దృఢవ్రతులు అగు సనకాది మనసపుత్రులు అయిదుగురు కలిగిరి (48). పండితులు, శివధ్యానము నందు మాత్రమే నిమగ్నులు అగువారు సంసారమునందు అభిరుచి లేనివారై, నేను ఆజ్ఞాపించినప్పుటికీ, సృష్టియందు మనస్సును లగ్నము చేయరైరి (49). ఓ మహర్షీ! వారు ఇచ్చిన ప్రతివచనమును విని నేను తీవ్రమగు కోపమును చేసితిని. ఓ వారదా! నేను మోహమును కూడ పొంది యుంటిని (50). క్రుద్ధస్య మోహితస్యాథ విహ్వలస్య మునే మమ | క్రోధేన ఖలు నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవః || 51 తస్మిన్న వసరే తత్ర స్మృతేన మనసా మయా | ప్రబోధితోsహం త్వరితమాగతేన హి విష్ణునా || 52 తపః కురు శివస్యేతి హరిణా శిక్షితోsప్యహమ్ | తపోకారి మహద్ఘోరం పరమం మునిసత్తమ || 53 తపస్యతశ్చ సృష్ట్యర్థం భ్రువోర్ఘ్రాణస్య మధ్యతః |అవిముక్తాభిధాదేశాత్ స్వకీయాన్మే విశేషతః || 54 త్రిమూర్తీనాం మహేశస్య ప్రాదురాసీద్ఘృణానిధిః | అర్ధనారీశ్వరో భూత్వా పూర్ణాంశస్సకలేశ్వరః || 55 ఓ మహర్షీ! మోహముచే కోపించి విహ్వలుడనైన నాకు కోపము వలన కళ్లనుండి కన్నీటి బిందువులు రాలినవి (51). ఆ సమయములో నేను మనస్సులో విష్ణువును స్మరించగా, ఆయన వెంటనే వచ్చి నాకు కర్తవ్యమును బోధించెను (52). శివుని గూర్చి తపస్సు చేయుమని విష్ణువు హెచ్చరించగా నేను ఘోరమగు తపమునాచరించితిని (53). ఓ మహర్షీ!నేను సృష్టిని చేయగోరి తపస్సు చేయుచుండగా, కనుబొమలకు నడుమ ముక్కుపై గల అవిముక్తమను పేరు గల స్థానము నుండి (54), త్రిమూర్తులకు ప్రభువు, దయానిధి,సర్వ జగత్ర్పభువునగు పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్థనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించెను (55). తమజం శంకరం సాక్షాత్తేజోరాశిముమాపతిమ్ | సర్వజ్ఞం సర్వకర్తారం నీలలోహిత సంజ్ఞకమ్ || 56 దృష్ట్వా నత్వా మహాభక్త్యా స్తుత్వాహం తు ప్రహర్షితః | అవోచం దేవదేవేశం సృజ త్వం వివిధాః ప్రజాః || 57 శ్రుత్వా మమ వచస్సోsథ దేవదేవో మహేశ్వరః | ససర్జ స్వాత్మనస్తుల్యాన్రుద్రో రుద్రగణాన్ బహూన్ || 58 అవోచం పునరేవేశం మహారుద్రం మహేశ్వరమ్ | జన్మమృత్యుభయా విష్టాస్సృజ దేవ ప్రజా ఇతి || 59 ఏవం శ్రుత్వా మహాదేవో మద్వచః కరుణానిధిః | ప్రహస్యోవాచ మాం సద్యః ప్రహస్య మునిసత్తమ|| 60 పుట్టుక లేనివాడు, తేజోరాశి, పార్వతీ పతి, సర్వము దెలిసిన వాడు, సర్వమునకు కర్త, నీలలోహితుడను పేరుగలవాడు నగు ఆ శంకరుని ప్రత్యక్షముగా (56) చూచి, మహాభక్తితో నమస్కరించి, మహానందముతో స్తుతించితిని. దేవ దేవుడగు శివునితో విభిన్న ప్రజలను నీవే సృష్టింపుమని అంటిని (57). దేవదేవుడగు ఆ మహేశ్వరుడు అపుడు నా మాటను విని, తనతో సమానమైన అనేక రుద్రగణములను సృష్టించెను (58). అపుడు నేను మరల మహేశ్వరునితో 'దేవా! ప్రజలను జన్మమృత్యుభయము కలవారినిగా సృష్టింపుము' అంటిని (59). ఓ మహర్షీ! దయానిధియగు మహాదేవుడు నా మాటను విని, వెంటనే చిరునవ్వుతో నాతో నిట్లనెను (60). మహాదేవ ఉవాచ | జన్మమృత్యు భయావిష్టా నాహం స్రక్ష్యే ప్రజా విధే | అశోభనాః కర్మవశా విమగ్నా దుఃఖ వారిధౌ || 61 అహం దుఃఖోదధౌ మగ్నా ఉద్దరిష్యామి చ ప్రజాః | సమ్యక్ జ్ఞాన ప్రదానేన గురుమూర్తి పరిగ్రహః || 62 త్వమేవ సృజ దుఃఖాఢ్యాః ప్రజాస్సర్వాః ప్రజాపతే | మదాజ్ఞయా న బద్ధస్త్వం మాయయా సంభవిష్యసి || 63 మహాదేవుడిట్లు పలికెను - ఓ బ్రహ్మా! జన్మ మృత్యు భయముచే నిండినవారు, శోభ##లేనివారు, కర్మకు వశులై దుఃఖసముద్రములో మునిగిన వారు అగు ప్రజలను నేను సృష్టించను (61). నేను గురు రూపమును స్వీకరించి యథార్థ జ్ఞానమునిచ్చి దుఃఖ సముద్రమునందు మునిగి పోవుచున్న ప్రజలను ఉద్ధరించెదను (62). ఓ ప్రజాపతీ! నీవేనా యాజ్ఞచే దుఃఖితులగు ప్రజలనందరినీ సృజించుము. నీకు మాయా బంధము ఉండబోదు (63). బ్రహ్మోవాచ | ఇత్యుక్త్వా మాం స భగవాన్ సుశ్రీమాన్నీలలోహితః |సగణః పశ్యతో మే హి ద్రు త మంతర్దధే హరః || 64 ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమ ఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యు పక్రమే రుద్రావతారవిర్భావ వర్ణనం నామ పంచ దశోsధ్యాయః (15). బ్రహ్మ ఇట్లు పలికెను - శోభాయుతుడు, నీలరక్త వర్ణములతో కూడిన దేహము గల వాడు నగు హరభగవానుడు నాతో ఇట్లు పలికి గణములతో కూడి నేను చూచుచుండగనే వెంటనే అంతర్ధానమయ్యెను (64). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటిదియగు సృష్టి ఖండలో రుద్రావతారావిర్భావము అనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).