Sri Sivamahapuranamu-I
Chapters
అథ షోడశోsధ్యాయః సృష్టి వర్ణనము బ్రహ్మోవాచ | శబ్దాదీని చ భూతాని పంచీకృత్వాహమాత్మనా | తేభ్యస్థ్సూలం నభో వాయుం వహ్నిం చైవ జలం మహీమ్ ||
1 పర్వతాంశ్చ సముద్రాంశ్చ వృక్షాదీనపి నారద | కలాదియుగపర్యంతాన్ కాలానన్యానవాసృజమ్ ||
2 సృష్ట్యం తానపరాంశ్చాపి నాహం తుష్టోsభవం మునే | తతో ధ్యాత్వా శివం సాంబం సాధకానసృజం మునే || 3 మరీచిం చ స్వనేత్రాభ్యాం హృదయాద్భృగుమేవ చ | శిరసోsంగిరసం వ్యానాత్పులహం మునిసత్తమమ్ || 4 బ్రహ్మ ఇట్లు పలికెను - నేను శబ్దరూపరసస్పర్శగంధములనే సూక్ష్మ భూతములను పంచీకరణము (ఏభై శాతము పృథివికి మిగిలిన నాల్గు భూత సూక్ష్మములను పన్నెండున్నర శాతము చొప్పున కలిపితే స్థూల పృథివి అగును ) చేసి, వాటినుంటి ఆకాశవాయు అగ్ని జల పృథివులను స్థూల భూతములను సృజించితిని (1). ఓ నారదా! పర్వతములను, సముద్రములను, వృక్షాదులను, కళ మొదలు యుగము వరకు గల కాలావయవములను సృష్టించితిని (2). ఓ మహర్షీ! జన్మమరణములుగల ప్రాణులను సృష్టించితిని. కాని సంతుష్టి కలుగలేదు. అపుడు సాంబసదాశివుని ధ్యానించి సృష్టి సాధకులగు ఋషులను సృష్టించితిని (3). నాకళ్ల నుండి మరీచిని, హృదయము నుండి భృగుని, శిరస్సు నుండి అంగిరసుని, వ్యానము నుండి మునిశ్రేష్ఠుడగు పులహుని సృష్టించితిని (4). ఉదానాచ్చ పులస్త్యం హి వసిష్ఠం చ సమానతః | క్రతుం త్వపానాచ్ఛ్రోత్రాభ్యామత్రిం దక్షం చ ప్రాణతః || 5 అసృజం త్వాం తదోత్సంగాచ్ఛాయాయాః కర్దమం మునిమ్ | సంకల్పాదసృజం ధర్మం సర్వసాధన సాధనమ్ || 6 ఏవ మేతానహం సృష్ట్వా కృతార్థస్సాధకోత్తమాన్ | అభవం మునిశార్దూల మహాదేవప్రసాదతః || 7 తతో మదాజ్ఞయా తాత ధర్మస్సంకల్ప సంభవః | మానవం రూపమాపన్నస్సాధకైస్తు ప్రవర్తితః || 8 ఉదానము నుండి పులస్త్యుని, సమానము నుండి వసిష్ఠుని, అపానము నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణము నుండి దక్షుని (5), తొడ నుండి నిన్ను, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పము నుండి సర్వసాధనములకు సాధనమైన ధర్మమును సృష్టించితిని (6). సృష్టి సాధకులగు ఈ ఉత్తములను మహాదేవుని అనుగ్రహముచే సృష్టించి, నేను కృతార్థుడనైతిని (7). ఓముని శ్రేష్ఠా! అపుడు సంకల్పము నుండి పుట్టిన ధర్మము నా ఆజ్ఞచే మానవుని రూపమును పొందగా, సృష్టి సాధకులు దానిని ప్రవర్తిల్లజేసిరి (8). తతోsసృజం స్వగాత్రేభ్యో వివిధేభ్యోsమితాన్సుతాన్ | సురాసురాదికాంస్తేభ్యో దత్త్వా తాం తాం తనుం మునే || 9 తతోsహం శంకరేణాథ ప్రేరితోsంతర్గతేన హ | ద్విధా కృత్వాత్మనో దేహం ద్విరూపశ్చాభవం మునే|| 10 అర్ధేన నారీ పురుషశ్చార్థేన సంతతో మునే | స తస్యా మసృజద్ద్వంద్వం సర్వసాధనముత్తమమ్ || 11 స్వాయం భువో మనుస్తత్ర పురుషః పరసాధనమ్ | శతరూపాభిధా నారీ యోగినీ సా తపస్వినీ || 12 ఓ మహర్షీ! అపుడు నేను నా దేహావయవముల నుండి దేవతలు, రాక్షసులు మొదలైన లెక్కలేనంతమంది సంతానమును వారికి ఆయా దేహములనిచ్చి సృష్టించితిని (9). ఓ మహర్షీ! అపుడు నేను అంతర్యామియగు శంకరునిచే ప్రేరేపింబడిన వాడనై, నాదేహమును రెండు భాగములుగా చేసి రెండు రూపములను ధరించితిని (10). ఓ మునీ! ఒక సగము స్త్రీ కాగా, మరియొక సగము పురుషుడాయెను. వీరిద్దరి మధ్య విభేదము లేకుండెను. ఆ పురుషుడు ఆమె యందు సర్వమునకు సాధనమైన శ్రేష్ఠమగు జంటను సృష్టించెను (11). ఆ జంటలోని పురుషుడు ఉత్తమ సాధకుడగు స్వాయంభువమనువు. శతరూపయను పేరు గల స్త్రీ యోగిని, మరియు తపస్విని (12). సా పునర్మనునా తేన గృహీతాతీవ శోభనా | వివాహ విధినా తాతాసృజత్సర్గం సమైథునమ్ || 13 తస్యాం తేన సముత్పన్నస్తనయశ్చ ప్రియవ్రతః | తథైవోత్తానపాదశ్చ తథా కన్యాత్రయం పునః || 14 ఆ కూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః | ఆకూతిం రుచయే ప్రాదాత్కర్దమాయ తు మధ్యమామ్ || 15 దదౌ ప్రసూతిం దక్షాయోత్తానపాదానుజాం సుతాః |తాసాం ప్రసూతి ప్రసవైస్సర్వం వ్యాప్తం చరాచరమ్ || 16 హే వత్సా! మనువు మిక్కిలి సుందరియగు ఆమెను యథావిధిగా వివాహమాడి స్త్రీ పురుష సంపర్కజనితమగు సృష్టిని చేసెను (13). వారికి ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే కుమారులు, మరియు ముగ్గురు కుమార్తెలు జన్మించిరి (14). వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని పేర్లు. ఆ కూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి (15), ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహమును చేసిరి. వారిలో ప్రసూతి యొక్క సంతానముచే స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతయూ వ్యాప్తమయ్యెను (16). ఆ కూత్యాం చ రుచేశ్చాభూ ద్ద్వంద్వం యజ్ఞశ్చ దక్షిణా | యజ్ఞస్య జజ్ఞిరే పుత్రా దక్షిణాయాం చ ద్వాదశ || 17 దేవహూత్యాం కర్దమాచ్చ బహ్వ్యో జాతాస్సుతా మునే | దక్షాజ్ఞాతాశ్చతస్రశ్చ తథా పుత్ర్యశ్చ వింశతిః || 18 ధర్మాయ దత్తా దక్షేణ శ్రద్ధాద్యాస్తు త్రయోదశ | శృణు తాసాం చ నామాని ధర్మ స్త్రీ ణాం మునీశ్వ ర || 19 శ్రద్ధా లక్ష్మీర్ధృతిస్తుష్టిః పుష్టిర్మేధా తథా క్రియా | వసుర్బుద్ధిర్లజ్జా శాంతిస్సిద్ధిః కీర్తి స్త్రయోదశ || 20 రుచికి ఆకూతి యందు యజ్ఞము , దక్షిణ అను ద్వంద్వము కలిగెను. యజ్ఞమునకు దక్షిణయందు పన్నెండుమంది పుత్రులు కలిగిరి (17). ఓ మహర్షీ! కర్దమునకు దేవహూతియందు చాలామంది కుమారులు కలిగిరి. దక్షునకు ఇరువది నల్గురు కుమార్తెలు కలిగిరి (18). దక్షుడు శ్రద్ధా మొదలగు పదముగ్గురిని ధర్మునకు ఇచ్చి వివాహము చేసెను. ఓ మహర్షీ! ధర్ముని భార్యల నామములను వినుము (19). శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జా, శాంతి, సిద్ధి, కీర్తి అనునవి వారిపేర్లు (20). తాభ్యాం శిష్టా యవీయస్య ఏకాదశ సులోచనాః | ఖ్యాతి స్సతీ చ సంభూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా || 21 సన్నతిశ్చానురూపా చ ఊర్జా స్వాహా స్వధా తథా | భృగుర్భవో మరీచిశ్చ తథా చైవాంగిరా మునిః || 22 పులస్త్యః పులహశ్చైవ క్రతుశ్చర్షివరస్తథా | అత్రిర్వసిష్ఠో వహ్నిశ్చ పితరశ్చ యథాక్రమమ్ || 23 ఖ్యాతాస్తా జగృహుః కన్యా భృగ్వాద్యాస్సాధకా వరాః | తతస్సంపూరితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్ || 24 మిగిలిన పదకొండు సుందరులు వారికంటె చిన్నవారు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ (21), సన్నతి, అనురూప, ఊర్జ, స్వాహా, స్వధా అనునవి వారిపేర్లు. వీరిని క్రమముగా భృగువు, భవుడు, మరీచి, అంగిరస్సు (22), పులస్త్యుడు, పులహుడు, ఋషిశ్రేష్ఠుడగు క్రతువు, అత్రి, వసిష్ఠుడు అగ్ని మరియు పితరులు వివాహమాడిరి (23). భృగ్వాది సాధకశ్రేష్ఠులు ఈ కన్యలను స్వీకరించిన తరువాత స్థావర జంగమ ప్రాణులతో ముల్లోకములు నిండెను (24). ఏవం కర్మానురూపేణ ప్రాణినా మంబికాపతేః | ఆజ్ఞయా బాహవో జాతా అసంఖ్యాతా ద్విజర్షభాః || 25 కల్పభేదన దక్షస్య షష్టిః కన్యాః ప్రకీర్తితాః | తాసాం దశ చ ధర్మాయ శశినే సప్తవింశతిమ్ || 26 విధినా దత్తవాన్దక్షః కశ్యపాయ త్రయోదశ | చతస్రః పరరూపాయ దదౌ తార్ క్ష్యాయ నారద || 27 భృగ్వంగిరః కృశాశ్వేభ్యో ద్వే ద్వే కన్యే చ దత్తవాన్ | తాభ్యస్తేభ్యస్తు సంజాతా బహ్వీ సృష్టిశ్చరాచరా || 28 ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! పార్వతీపతి యొక్క ఆదేశముచే ప్రాణుల కర్మలకనుగుణముగా లెక్కలేనన్ని జీవులు పుట్టినారు (25). మరియొక కల్పములో దక్షునకు అరవై కన్యలు కలిగిరని చెప్పబడెను. వారిలో పది మందిని ధర్మునకు, ఇరవై ఏడు మందిని చంద్రునకు (26), కశ్యపునకు పదముగ్గురిని ఇచ్చి దక్షుడు యథావిధిగా వివాహమును చేసెను. ఓ నారదా!దక్షుడు నల్గురు కన్యలను గొప్ప రూపముగల తార్ క్ష్యునకు ఇచ్చి వివాహము చేసెను (27). భృగువు, అంగిరస్సు, కృశాశ్వులకు ఇద్దరిద్దరు కన్యలనిచ్చెను. ఈ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమగు సృష్టి విస్తారముగా కలిగెను (28). త్రయోదశమితాస్తసై#్మ కశ్యపాయ మహాత్మనే | దత్తా దక్షేణ యాః కన్యా విధివన్ము నిసత్తమ || 29 తాసాం ప్రసూతిభిర్వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్ | స్థావరం జంగమం చైవ శూన్యం నైవ తు కించన || 30 దేవాశ్చ ఋషయశ్చైవ దైత్యాశైవ ప్రజజ్ఞిరే | వృక్షాశ్చ పక్షిణశ్చైవ సర్వే పర్వతవీరుధః || 31 దక్షకన్యా ప్రసూతైశ్చ వ్యాప్తమేవం చరాచరమ్ | పాతాల తల మారభ్య సత్యలోకావధి ధ్రువమ్ || 32 ఓ మహర్షీ! దక్షుడు మహాత్ముడగు కశ్యపునకు ఏ పద ముగ్గురు కన్యలనిచ్చి యథావిధిగా వివాహము చేసెనో , వారి సంతానముచే స్థావర జంగమాత్మకమగు ముల్లోకములు నిండి, శూన్యస్థలము లేకుండెను (30). దేవతలు, ఋషులు, దైత్యులు, వృక్షములు, పక్షులు, పర్వతములు, లతలు మొదలైనవి సృష్టింపబడెను (31). పాతాలము నుండి సత్యలోకము వరకు గల చరాచర జగత్తు అంతయూ దక్షకన్యల సంతానముచే నిశ్చితముగా నిండెను (32). బ్రహ్మాండం సకలం వ్యాప్తం శూన్యం నైవ కదాచన | ఏవం సృష్టిః కృతా సమ్యగ్ర్బహ్మణా శంభుశాసనాత్ || 33 సతీ నామ త్రిశూలాగ్రే సదా రుద్రేణ రక్షితా | తపోర్థం నిర్మితా పూర్వం శంభునా సర్వ విష్ణునా || 34 సైవ దక్షాత్సముద్భూతా లోకకార్యార్థమేవ చ | లీలాం చకార బహుశో భక్తోద్ధరణ హేతవే || 35 వామాంగో యస్య వైకుంఠో దక్షిణాంగోsహమేవ చ | రుద్రో హృదయజో యస్య త్రివిధస్తు శివస్స్మృతః || 36 బ్రహ్మాండ మంతయూ వ్యాపింపబడి శూన్యస్థానము లేకుండెను. ఈ తీరున, శంభుని యాజ్ఞచే బ్రహ్మ చక్కగా సృష్టిని చేసెను (33). పూర్వము సర్వవ్యాపకుడగు శంభునిచే తపస్సు చేయుట కొరకు నిర్మింపబడిన సతీదేవిని రుద్రుడు సర్వకాలములయందు త్రిశూలపు కొనయందుంచి రక్షించెను (34). ఆమెయే లోకకార్యములను సిద్దింపజేయుట కొరకు దక్షుని కుమార్తెగా జన్మించి, భక్తులనుద్ధరించగోరి అనేక లీలలను ప్రదర్శించెను (35). శివుని వామభాగము విష్ణువు. కుడి భాగము నేను. హృదయము నుండి రుద్రుడు జన్మించెను. ఈ తీరున శివుడు మూడు రూపములలో నున్నాడని మహర్షులు చెప్పిరి (36). అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణాస్త్రయ ఉదాహృతాః | స్వయం సదా నిర్గుణశ్చ పరబ్రహ్మ వ్యయశ్శివః || 37 విష్ణుస్సత్త్వం రజోsహం చ తమో రుద్ర ఉదాహృతః | లోకాచారత ఇత్యేవం నామతో వస్తుతోsన్యథా || 38 అంతస్తమో బహిస్సత్త్వో విష్ణూ రుద్రస్తథా మతః | అంతస్సత్త్వస్తమో బాహ్యో రజోsహం సర్వధా మునే || 39 రాజసీ చ సురా దేవీ సత్త్వరూపాత్తు సా సతీ | లక్ష్మీస్తమోమయీ జ్ఞేయా త్రిరూపా చ శివా పరా || 40 నేను, విష్ణువు మరియు రుద్రుడు త్రిగుణస్వరూపులము. శివపర బ్రహ్మ సదా నిర్గుణుడు, వికారములు లేనివాడు (37). విష్ణువు సత్త్వ గుణము. నేను రజోగుణము. రుద్రుడు తమోగుణము. సృష్టి కార్యములను బట్టి ఈ నామము లేర్పడినవి. కాని వస్తుతత్త్వమునందు భేదము లేదు (38). ఓ మహర్షీ! విష్ణువునకు లోపల తమోగుణము, బయట సత్త్వగుణము ఉండును. రుద్రునకు లోపల సత్త్వగుణము, బయట తమోగుణము ఉండును. నాకు లోపల, బయట రజోగుణము గలదు (39). సరస్వతి రజోగుణ ప్రధాన. సతీదేవి సత్త్వ స్వరూపురాలు. లక్ష్మీదేవి తమోమయి. శివాపరాభట్టారికయే ఈ మూడు రూపములుగా నున్నదని తెలియవలెను (40). ఏవం శివా సతీ భూత్వా శంకరేణ వివాహితా | పితుర్యజ్ఞే తనుం త్యక్త్వా నాదాత్తాం స్వపదం య¸° || 41 పునశ్చ పార్వతీ జాతా దేవ ప్రార్థనయా శివా | తపః కృత్వా సువిపులం పునశ్శివముపాగతా || 42 తస్యా నామాన్యనే కాని జాతాని చ మునీశ్వర | కాలికా చండికా భద్రా చాముండా విజయా జయా || 43 జయంతీ భద్రకాలీ చ దుర్గా భగవతీతి చ | కామాఖ్య కామదా హ్యంబా మృడానీ సర్వమంగలా || 44 నామధేయాన్యనేకాని భుక్తిముక్తి ప్రదానిచ | గుణ కర్మాను రూపాణి ప్రాయశస్తత్ర పార్వతీ || 45 శివాదేవి సతియై శంకరుని వివాహమాడినది. తండ్రియగు దక్షుని యజ్ఞములో ఆమె శరీరమును విడచి, మరల ఆ శరీరమును స్వీకరించలేదు. ఆమె తన ధామమును పొందెను (41). మరల దేవతలు ప్రార్ధించగా శివాదేవి పార్వతియై జన్మించెను. ఆమె ఘోరమగు తపస్సును జేసి మరల శివుని పొందెను (42). ఓ మహర్షీ! ఆమెకు అనేక నామములు గలవు. కాలిక, చండికా, భద్ర, చాముండ, విజయ, జయ (43), జయంతి, భద్రకాలి, దుర్గ, భగవతి, కామాఖ్యా, కామద, అంబ, మృడాని, సర్వమంగల (44) ఇత్యాదిఅనేక నామములు ఆమెకు గుణములను బట్టి, కర్మలను బట్టి ఏర్పడినవి. ఈ నామములు భక్తిని, ముక్తిని ఇచ్చును. వాటిలో పార్వతి యను పేరు ప్రసిద్ధమైనది (45). గుణమయ్యస్తథా దేవ్యో దేవా గుణ మయాస్త్రయః | మిలిత్వా వివిధం సృష్టేశ్చక్రుస్తే కార్యముత్తమమ్ || 46 ఏవం సృష్టిప్రకారస్తే వర్ణితో మునిసత్తమ | శివాజ్ఞయా విరచితో బ్రహ్మాండస్య మయాsఖిలః || 47 పరం బ్రహ్మ శివః ప్రోక్తస్తస్య రూపాస్త్రయస్సురాః | అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణభేదానురూపతః || 48 గుణస్వరూపులగు త్రిమూర్తులు గుణ స్వరూపలు అగు దేవీ మూర్తులతో గూడి ఉత్తమమగు సృష్టి కార్యమును చేసిరి (46). ఓ మహర్షీ! నేనీ సృష్టి ప్రకారమును నీకు వివరించి చెప్పితిని. నేను బ్రహ్మాండములనన్నిటినీ శివుని ఆజ్ఞచే రచించితిని (47). శివుడు పరబ్రహ్మ, నేను, విష్ణువు, రుద్రుడు అనే త్రిమూర్తులు గుణభేదముచే ఏర్పడిన ఆ శివుని రూపములు మాత్రమేనని ఋషులు చెప్పుచున్నారు. (48). శివయా రమతే సై#్వరం శివలోకే మనోరమే | స్వతంత్రః పరమాత్మా హి నిర్గుణ స్సగుణోsపి వై || 49 తస్య పూర్ణావతారో హి రుద్రస్సాక్షాచ్ఛివః స్మృతః | కైలాసే భవనం రమ్యం పంచవక్త్రశ్చ కార హ || 50 బ్రహ్మాండస్య తథా నాశే తస్య నాశోsస్తి వై న హి || 51 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే బ్రహ్మనారద సంవాదే సృష్టి వర్ణనం నామ షోడశః అధ్యాయః (16). ఆయన మనోహరమగు శివలోకములో ఉమతో గూడి యథేచ్ఛగా సంచరించును. ఆయన స్వతంత్రుడగు పరమాత్మ. నిర్గుణుడు, సగుణుడు కూడా (49). రుద్రుడు ఆయన యొక్క పూర్ణావతారము గనుక సాక్షాత్తు శివుడే యని చెప్పబడినాడు. అయిదు మోముల శివుడు కైలాసమునందు సుందరమగు భవనమును నిర్మించినాడు (50). బ్రహ్మాండము నశించిననూ దానికి నాశము లేదు (51). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో సృష్ట్యుపాఖ్యానమునందు బ్రహ్మ నారద సంవాదములో సృష్టివర్ణనమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).