Sri Sivamahapuranamu-I    Chapters   

అథ సప్తదశోsధ్యాయః

గుణనిధిచరిత్ర

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణస్స తు నారదః | పునః పప్రచ్ఛ తం నత్వా వినయేన మునీశ్వరాః || 1

సూతుడిట్లు పలికెను -

ఓ మహర్షులారా! బ్రహ్మయొక్క ఈ పలుకులను వినిన నారదుడు వినయముతో నమస్కరించి ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను (1).

నారద ఉవాచ |

కదా గతో హి కైలాసం శంకరో భక్తవత్సలః | క్వ వా సఖిత్వం తస్యా సీత్కుబేరేణ మహాత్మనా || 2

కిం చ కార హరస్తత్ర పరిపూర్ణశ్శివాకృతిః | ఏతత్సర్వం సమాచక్ష్వ పరం కౌతూ హలం హి మే || 3

నారదుడిట్లు పలికెను -

భక్తవత్సలుడగు శంకరుడు కైలాసమునకు ఎప్పుడు వెళ్లెను ? ఆయనకు మహాత్ముడగు కుబేరునితో స్నేహము ఎక్కడ కలిగెను ? (2) మంగళ స్వరూపుడు, పరిపూర్ణుడనగు శివుడు అక్కడ ఏమి చేసెను? ఈ విషయమునంతనూ చెప్పుడు నాకు వినుటయందు అతిశయించిన కుతూహలము గలదు (3).

బ్రహ్మోవాచ |

శృణు నారద వక్ష్యామి చరితం శశి మౌలినః | యథా జగామ కైలాసం సఖిత్వం ధనదస్య చ || 4

ఆసీత్కాం పిల్య నగరే సోమయాజికులోద్భవః | దీక్షితో యజ్ఞదత్తాఖ్యో యజ్ఞవిద్యావిశారదః || 5

వేదవేదాంగ విత్ర్పాజ్ఞో వేదాంతాదిషు దక్షిణః | రాజమాన్యోsథ బహుధా వదాన్యః కీర్తి భాజనః || 6

అగ్ని శుశ్రూషణరతో వేదాధ్యయనతత్పరః | సుందరో రమణీయాంగ శ్చంద్ర బింబ సమాకృతిః || 7

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదా! వినుము. చంద్రమౌళి యొక్క చరితమును చెప్పెదను. ఆయన కైలాసమునకు ఎట్లు వెళ్లెను? కుబేరునితో స్నేహము ఎట్లు కలిగెను? అను విషయములను వివరించెదను (4). కాంపిల్య నగరములో యజ్ఞ దత్తుడను పండితుడు ఉండెను. ఆయన సోమయాజుల వంశములో జన్మించెను. ఆయన యజ్ఞదీక్షను స్వీకరించినవాడు, యజ్ఞ విద్యలో సమర్థుడు (5). వేదవేదాంగముల నెరింగిన వాడు, వేదాంతము మొదలగు వాటియందు సమర్థుడు, అనేక రాజసన్మానములను పొందిన వాడు, దాత, కీర్తి గలవాడు (6).అగ్ని శశ్రూషయందు శ్రద్ధ గలవాడు, వేదాధ్యయమునందు నిరతుడు, రమణీయమగు అవయవములు గల సుందరుడు మరియు చంద్రబింబము వంటి ముఖము గలవాడు (7).

అసీద్గుణనిధిర్నామ దీక్షితస్యాస్య వై సుతః | కృతోపనయనస్సోఎ్టౌ విద్యా జగ్రాహ భూరిశః || 8

అథ పిత్రానభిజ్ఞాతో ద్యూత కర్మరతోsభవత్‌ | ఆదాయాదాయ బహుశో ధనం మాతుస్సకాశతః || 9

సమదాద్ద్యూత కారేభ్యోమైత్రీం చకార సః | సంత్యక్త బ్రాహ్మణాచారస్సంధ్యాస్నాన పరాజ్ముఖః || 10

నిందకో వేదశాస్త్రాణాం దేవ బ్రహ్మణ నిందకః | స్మృత్యాచార విహీనస్తు గీతవాద్య వినోదభాక్‌ || 11

నట పాఖండ భాండైస్తు బద్ధ ప్రేమపరంపరః |

దీక్షితుడగు యజ్ఞ దత్తునకు గుణనిధియను కుమారుడుండెను. అతడు ఎనిమిదవ యేట ఉపనీతుడై అనేక విద్యలనభ్యసించెను (8). ఆతడు తండ్రికి తెలియకుండగా జూదమునందు అభిరుచి గలవాడాయెను. తల్లివద్ద నుండి అనేక పర్యాయములు ధనమును తీసుకొని (9) జూదగాళ్లకు ఆ ధనమును సమర్పించి, వారితో మైత్రిని చేసెను. ఆతడు స్నానసంధ్యాది బ్రాహ్మణాచారముల యందు రుచిలేని వాడై వాటిని పరిత్యజించెను (10). ఆతడు వేద శాస్త్రములను, దేవబ్రాహ్మణులను నిందించువాడై, స్మృతి, విహితములగు ఆచారములను విడనాడి సంగీతము మొదలగు వినోదములయందు నిమగ్నుడాయెను (11).ఆతడు నటులతో, హాస్యగాళ్లతో, మరియు పాపులతో దృఢమగు స్నేహమును చేసెను.

ప్రేరితోsపి జనన్యా స న య¸° పితురంతికమ్‌ || 12

గృహకార్యాంతరవ్యాప్తో దీక్షితో దీక్షితాయినీమ్‌ |యదా యదైవ తాం పృచ్ఛేదయే గుణనిధిస్సుతః || 13

న దృశ్యతే మయా గేహే కల్యాణి విదధాతి కిమ్‌ | తదా తదేతి సా బ్రూయాదిదానీం స బహిర్గతః || 14

స్నాత్వా సమర్చ్యవై దేవా నేతావంత మనేహసమ్‌ | అధీత్యాధ్యయనార్థం స ద్విత్రై స్సమం య¸° || 15

ఏకపుత్రేతి తన్మాతా ప్రతారయతి దీక్షితమ్‌ | న తత్కర్మ చ తద్వృత్తం కించిద్వేత్తి దీక్షితః || 16

తల్లి ప్రోత్సహించిననూ, ఆతడు తండ్రి వద్దకు వెళ్లలేదు (12). దీక్షితుడగు ఆ తండ్రి ఇతర గృహకార్యములలో నిమగ్నుడై యుండి భార్యతో'ఓసీ! మన కుమారుడు గుణనిధి (13) నాకు ఇంటిలో కనబడుటలేదు. ఓ కల్యాణీ! వాడు ఏమి చేయుచున్నాడు? అని ప్రశ్నించిన ప్రతి పర్యాయము ఆమె 'ఇప్పుడే బయటకు వెళ్లినాడు (14). స్నానము చేసి దేవతల నారాధించి ఇంతవరకు పాఠములను చదువుకొని, మరల అధ్యయనము కొరకు ఇద్దరు, ముగ్గురు మిత్రులతో కూడి వెళ్లినాడు' అని చెప్పెడిది (15). ఏకైక కుమారుడగుటచే ఆ తల్లి దీక్షితుని మోసపుచ్చెడిది. ఆయనకు వాని చేతల గురించి, వ్యవహారముల గురించి ఏ మాత్రమూ తెలియకుండెను (16).

సర్వం కేసాంతకర్మాస్య చక్రే వర్షేsథ షోడశే | అ థో స దీక్షితో యజ్ఞదత్తః పుత్రస్య తస్య చ || 17

గృహ్యోక్తేన విధానేన పాణి గ్రాహమకారయత్‌ | ప్రత్యహం తస్య జననీ సుతం గుణనిధిం మృదు || 18

శాస్తి స్నేహార్ద్ర హృదయా హ్యుపవేశ్య స్మ నారద | క్రోధనస్తేsస్తి తనయ స మహాత్మా పితేత్యలమ్‌ || 19

యది జ్ఞాస్యతి తే వృత్తం త్వాం చ మాం తాడయిష్యతి | ఆచ్ఛాదయామితే నిత్యం పితురగ్రే కుచేష్టితమ్‌ || 20

దీక్షితుడగు యజ్ఞదత్తుడు కుమారునకు పదునారవయేట స్నాతకము చేసి, సంస్కారములనన్నిటినీ చేయించి (17), గృహ్యసూత్రోక్త విధానముతో వివాహము చేసెను. ఓ నారదా! ప్రతి దినము ప్రేమతో నిండిన హృదయము గల తల్లి కుమారుడగు గుణనిధిని కూర్చుండబెట్టి (18) భయమును చెప్పెను. కుమారా! మహాత్ముడగు నీ తండ్రి కోపిష్ఠి. ఈ చేష్టలను కట్టిపెట్టుము (19). నీ వృత్తాంతము ఆయనకు తెలిసినచో, నిన్ను నన్ను కూడ దండించును. ప్రతి దినము నీ చెడు చేష్టము ఆయనకు తెలియకుండగా కప్పిపుచ్చుచున్నాను (20).

లోకమాన్యోsస్తి తే తాతస్స దాచారైర్న వై ధనైః | బ్రాహ్మణానాం ధనం తాత సద్విద్యా సాధుసంగమః || 21

కిమర్థం న కరోషి త్వం సురుచిం ప్రీతమానసః | సచ్ఛ్రోత్రియాస్తేsనూచానా దీక్షితాస్సోమయాజినః || 22

ఇతి రూఢిమిహ ప్రాప్తాస్తవ పూర్వ పితామహాః | త్యక్త్యా దుర్వృత్త సంసర్గం సాధుసంగరతో భవ || 23

సద్విద్యాసు మనో ధేహి బ్రాహ్మణాచారమాచర | తాతాను రూపో రూపేణ యశసా కుల శీలతః || 24

వత్సా! నీ తండ్రి ధనముచే గాక, సదాచారముచే లోకపూజ్యుడైనాడు. వత్సా! బ్రాహ్మణులకు సద్విద్య, మరియు సాధుసంగమము అనునవియే ధనము (21). నీకు వీటియందు అభిరుచి లేకపోవుటకు కారణమేమి? నీ పూర్వీకులు, తాతముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాగమును చేసినవారు (22) అని లోకమునందు ప్రతిష్ఠగలదు. నీవు చెడు స్నేహములను విడ నాడి సత్పురుషులు స్నేహమును అలవరచుకొనుము (23). సద్విద్యలయందు మనస్సును నిలుపుము. బ్రాహ్మణాచారముల ననుష్ఠించుము. రూపములో, కీర్తిలో, కులములో, శీలములో తండ్రికి దగ్గవాడవు కమ్ము (24).

తతో న త్రపసే కిన్న త్యజ దుర్వృత్తతాం స్వకామ్‌ | ఊనవింశతికోsసి త్వ మేషా షోడశవార్షికీ || 25

ఏతాం సంవృణు సద్వృత్తాం పితృభక్తియుతో భవ | శ్వశురోsపి హి తే మాన్య స్సర్వత్ర గుణశీలతః || 26

తతో న త్రపసే కిన్న త్య జ దుర్వృత్తతాం సుత | మాతులాస్తేsతులాః పుత్ర విద్యా శీలకులాది భిః || 27

తేభ్యోsపి న భిభేషి త్వం శుద్ధోsస్యుభయవంశతః | పశ్యైతాన్‌ ప్రతివేశ్మస్థాన్‌ బ్రాహ్మణానాం కుమారకాన్‌ || 28

ఆయన వలన నీవేల భయపడవు? నీ చెడు చేష్టలను విడువుము. నీకు పందొమ్మిది సంవత్సరములు. ఈమె పదునారు సంవత్సరముల యువతి (25). పతివ్రతయగు ఈమెను ప్రేమించుము. తండ్రియందు భక్తి గలవాడవు కమ్ము. నీ మామగారు కూడ గుణముచే, శీలముచే అంతటా పూజింపబడును (26). నీకు ఆయన వలనైననూ భయము లేకపోవుటకు కారణమేమి?కుమారా! చెడు పనులను కట్టిపెట్టుము. పుత్రా! విద్య, శీలమ, కులము ఇత్యాదులలో నీ మోనమామలు సాటిలేని వారు (27). నీకు వారి వలనైననూ భయము లేకున్నది. నీ తండ్రివైపు, తల్లివైపు వంశములు రెండు శుద్ధమైనవి. మన చుట్టుప్రక్కల గృహములలోని బ్రాహ్మణబాలకులను చూడుము(28).

గృహేsపి శిష్యాన్‌ పశ్యైతాన్‌ పితుస్తే వినయోచితాన్‌ | రాజాపి శ్రోష్యతి యదా తవ దుశ్చేష్టితం సుత || 29

శ్రద్దాం విహాయ తే తాతే వృత్తిలోపం కరిష్యతి | బాలచేష్టితమేవైత ద్వదంత్యద్యాపి తే జనాః || 30

అనంతరం హరిష్యంతి యుక్తాం దీక్షిత తామిహ | సర్వేsప్యాక్షారయిష్యంతి తవ తాతం చ మామపి || 31

మాతుశ్చరింత్రం తనయో ధత్తే దుర్భాషణౖరితి | పితాపి తే న పాపీయాన్‌ శ్రుతిస్మృతి పథానుగః || 32

మన ఇంటిలో గల నీ తండ్రి గారి శిష్యులను, వారి వినయమును చూడము. కుమారా! నీ చెడు ప్రవృత్తిని గురించి రాజు గారికి తెలియగలదు (29). అపుడు వారికి నీ తండ్రి యందు శ్రద్ధ తొలగి పోయి, మన జీవికకు ముప్పు రాగలదు. జనులీనాటికీ నీచేష్టలను చిన్న కుర్రవాని చేష్టలనియే భావించుచున్నారు (30). కాని వారు కొద్ది కాలములోనే మీ తండ్రిగారి దీక్షితత్వమును రద్దు చేయగలరు. జనులందరు తండ్రిని, నన్ను కూడ నిందించెదరు (31). 'తల్లి శీలము కుమారునకు సంక్రమించును' ఇత్యాది దుర్భాషలాడెదరు. శ్రుతిస్మృతులు విధించిన మార్గములో జీవించు నీ తండ్రి పాపము నెరుంగడు (32).

తదంఘ్రి లీన మనసో మమ సాక్షీ మహేశ్వరః | న చర్తు స్నాతయాపీహ ముఖం దుష్టస్య వీక్షితమ్‌ || 33

అహో బలీయాన్స విధిర్యేన జాతో భవానితి | ప్రతిక్షణం జనన్యేతి శిక్ష్యమాణోsతి దుర్మతిః|| 34

న తత్యాజ చ తద్ధర్మం దుర్బోధో వ్యసనీ యతః | మృగయా మద్యపైశున్యా నృత చౌర్య దురోదరైః || 35

స వారదారై ర్వ్యసనైరేభిః కోత్ర న ఖండితః | యద్యన్మధ్య గృహే పశ్యేత్తత్త న్నీత్వా సుదుర్మతిః || 36

అర్పయేద్ద్యూతకారాణాం సకుప్యం వసనాదికమ్‌ |

నేను ఆయన పాదములయందు లగ్నమైన మనస్సు గలదానను. నాకు మహేశ్వరుడు సాక్షి. నేను ఋతుస్నానమును చేసిన తరువాత దుష్టుల ముఖమునైననూ చుడలేదు (33). నీవు నా కుమారుడవగుట విధి బలీయమనుటకు నిదర్శనము. ఈ విధిముగా ఆ తల్లి ఆతనికి ఎన్నో సార్లు బోధించిననూ, అతి దుష్టుడగు ఆతడు తన చెడు తిరుగుళ్లను వీడలేదు (34). వ్యసనములకు బానిసయైన వ్యక్తికి బోధించుట దుస్సాధ్యము. వేట , మద్యపానము, కొండెములు చెప్పుట, అసత్యమును పలుకుట, చౌర్యము, జూదము (35), వేశ్యాగమనము అను వ్యసనములచే పతితుడు కాని వాడెవ్వడు? దుష్టుడగు నాతడు ఇంటిలో కనబడిన వస్తువులనన్నిటినీ (36), గిన్నెలు వస్త్రములతో సహా, జూదగాళ్లకు అర్పించెడివాడు.

న్యస్తాం రత్నమయీం గేహే కరస్య పితురూర్మికా మ్‌ || 37

చోరయిత్వై కదాదాయ దురోదరకరేsర్పయత్‌ | దీక్షితేన పరిజ్ఞాతో దైవాద్ద్యూతకృతః కరే || 38

ఉవాచ దీక్షితస్తం చ కుతో లబ్దా త్వయోర్మికా | పృష్టస్తేనాథ నిర్బంధాదసకృత్తమువాచ సః || 39

మామాక్షిపసి విప్రోచ్చైః కిం మయా చౌర్యకర్మణా | లబ్ధా ముద్రా త్వదీయేన పుత్రేణౖవ సమర్పితా || 40

మమ మాతుర్హి పూర్వేద్యుర్జిత్వా నీతో హి శాటకః | న కేవలం మమైవై త దంగులీయం సమర్పితమ్‌ || 41

ఒకనాడు, ఆతడు, తండ్రి తన వ్రేలి రత్నపు ఉంగరమును ఇంటిలో నుంచగా (37) దానిని అపహరించి జూదగానికి అర్పించెను. దైవ వశమున దీక్షితుడు ఆ జూదగానిచేతికి గల తన ఉంగరమును గుర్తించి ఆతనితో నిట్లు పలికెను. నీకీ ఉంగరము ఎక్కడ నుంచి వచ్చినది? ఆయన వానిని నిర్బంధముతో అనేక పర్యాయములిట్లు ప్రశ్నించగా, ఆతడిట్లనెను (39). హే విప్ర! నన్ను బలముగా ప్రశ్నించుచున్నావు. నేను చౌర్యము చేసి ఈ ఉంగరమును సంపాదించితి ననుకొంటివా? దీనిని నీ కుమారుడే నాకు ఇచ్చినాడు (40). ఆతడు నాకు సమర్పించినది ఈ ఉంగరము మాత్రమే కాదు. మొన్న ఆతడు తన తల్లియొక్క చీరను జూదములో పోగొట్టుకొనెను (41).

అన్యేషాం ద్యూతకర్తృణాం భూరి తేనార్పింతం వసు | రత్న కుప్యదుకూలాని శృంగార ప్రభృతీని చ || 42

భాజనాని విచిత్రాణి కాంస్య తామ్ర మయాని చ | నగ్నీకృత్య ప్రతిదినం బధ్యతే ద్యూతకారిభిః || 43

న తేన సదృశః కశ్చి దాక్షికో భూమిమండలే | ఆద్యావధి త్వయా విప్ర దురోదర శిరోమణిః || 44

కథం నా జ్ఞాయి తనయోs వినయానయ కోవిదః | ఇతి శ్రుత్వా త్రపాభార వినమ్ర తర కంధరః || 45

ప్రావృత్య వాససా మౌలిం ప్రావిశన్నిజమందిరమ్‌ | మహాపతివ్రతామస్య పత్నీం ప్రోవాచ తామథ || 46

స దీక్షితో యజ్ఞదత్తశ్ర్శౌతకర్మ పరాయణః |

ఆతడు ఇతర జూదగాండ్రకు కూడా చాల ధనమును సమర్పించినాడు. రత్నములను, గిన్నెలను, పట్టు వస్త్రములను, ఇతరములగు వస్త్రములను (42), విచిత్రములగు పాత్రలను, కంచు పాత్రలను, రాగి పాత్రలను కూడ ఆతడు జూదములో ఓడినాడు. ఆతనిని జూదగాండ్రు ప్రతి దినము బంధించి బట్టలను ఒలుచుకొనెడివారు (43). ఈ భూమండలముతో ఆతనితో సమానమైన జూదగాడు లేడు. హే విప్రా! నీ కుమారుడు జూదగాండ్రకు నాయకుడు, అవినయములో మోసములో పండితుడు అను సంగతి నీకీనాటి వరకు (44) ఎట్లు తెలియలేదు? ఈ మాటలను విని సిగ్గుతో తలను, భుజస్కంధములను వంచుకొని (45),బట్టతో శిరస్సును కప్పుకొని తన గృహమునకు చేరుకొనెను. అపుడా దీక్షితుడు, వేదోక్తకర్మలయందు నిరతుడునగు యజ్ఞదత్తుడు మహాపతివ్రతయగు భార్యతో నిట్లనెను (46)

యజ్ఞదత్త ఉవాచ |

దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధిస్తుతః || 47

అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమశుభోర్మికా | అంగోద్వర్తన కాలే యా త్వయా మేsంగులితో హృతా || 48

సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే | ఇతి శ్రుత్వాథ తద్వాక్యం భీతా సా దీక్షితాయనీ || 49

ప్రోవాచ స్నానమధ్యాహ్నీం క్రియాం నిష్పాదయంత్యథ | వ్యగ్రాస్మి దేవ పూజార్ధ ముపహారాది కర్మణి || 50

సమయోsయ మతిక్రామే దతిథీనాం ప్రియాతిథే | ఇదానీమేవ పక్వాన్న కారణవ్యగ్రయా మయా || 51

స్థాపితా భాజనే క్వాపి విస్మృతేతి న వేద్మృహమ్‌ |

యజ్ఞదత్తుడిట్లు పలికెను -

ఓ సోమిదేవమ్మా! ధూర్తురాలా! గుణనిధియగు నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడు? (47) కానిమ్ము. వానితో నాకు పని యేమి ? నా మంగళకరమగు ఉంగరమెక్కడ ? నీవు నావంటికి తైలాదులను మర్దించిన సమయములో నా వ్రేలి నుండి తీసితివి (48). కాన నీవు నా రత్నపుటుంగరమును వెనువెంటనే తెచ్చి నాకిమ్ము. ఈ మాటలను విని భయపడిన సోమిదేవమ్మ (49) ఇట్లు పలికెను. నేను మీకు మధ్యాహ్న స్నానమునకు ఏర్పాట్లు చేయుచున్నాను. మరియు దేవ పూజకు కావలిసిన సంభారముల నమర్చుటలో తీరిక లేకయున్నాను (50). మీకు అతిథులు ప్రియమైన వారు గదా! అతిథులకు భోజన వేళ మించి పోరాదు. నేను ఇప్పుడు అన్నమును వండుటలో తీరిక లేకుండా ఉన్నాను (51). నేనా ఉంగరమును ఏదో గిన్నెలో మరచినాను. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు.

దీక్షిత ఉవాచ |

హం హేsసత్పుత్రజనని నిత్యం సత్య ప్రభాషిణి || 52

యదా యదా త్వాం సంపృచ్ఛే తనయః క్వ గతస్త్వితి | తదా తదేతి త్వం బ్రూయాన్నాథేదానీం స నిర్గతః || 53

అధీత్యాధ్యయనార్థం చ ద్విత్రైర్మి త్రై స్సయుగ్బహిః | కుతస్తే శాటకః పత్ని మాంజిష్ఠో యో మయార్పితః || 54

లంభ##తే యోsనిశం ధామ్మి తథ్యం బ్రూహి భయం త్యజ | సాంప్రతం నేక్ష్యతే సోsపి భృంగారో మణిమండితః || 55

పట్టసూత్రమయీ సాపి త్రిపటీ యా మయార్పితా | క్వ దాక్షిణాత్యం తత్కాంస్యం గౌడీ తామ్రఘటీ క్వ సా || 56

దీక్షితుడిట్లు పలికెను -

ఓసీ!దుష్టకుమారుని తల్లీ! నీవు నిత్యము సత్యమునే పలుకుచుంటివి కాబోలు! (52). కుమారుడు ఎక్కడకు వెళ్లినాడు అని నేను ప్రశ్నించిన ప్రతిసారి, ' నాథా! ఇప్పటి వరకు చదువుకొని ఇద్దరు ముగ్గురు మిత్రులతో కలిసి చదువుకొనుటకొరకై ఇప్పుడే బయటకు వెళ్లినాడు' అని చెప్పెడిదానవు (53). హేపత్నీ! నేను నీకు చక్కగా ప్రకాశించే ఎర్రని పట్టుచీరను ఇచ్చియుంటిని. అది ఏమైనది?(54)భయమును వీడి సత్యమును చెప్పుము. మరియు, మణులను పొదిగిన బంగరు గిన్నె కానవచ్చుట లేదు (55). నేను నీకు మూడు పేటల పట్టుతో నేసిన పట్టు పంచను ఇచ్చితిని. అది కనబడుటలేదు. దక్షిణ దేశము నుండి కొని తెచ్చిన ఇత్తడి పాత్ర ఏది? గౌడ దేశము నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడ నున్నది (56).

నాగదంతమయీ సా క్వ సుఖ కౌతుక మంచికా | క్వసా పర్వతదేశీయా చంద్రకాంతిరివాద్భుతా || 57

దీపకవ్యగ్ర హస్తాగ్రా లంకృతా శాలభంజికా | కిం బహూక్తేన కులజే తుభ్యం కు ప్యామ్యహం వృథా || 58

తదాభ్యవ హరిష్యేహ ముపయంస్యామ్యహం యదా | అనపత్యోsస్మి తేనాహం దుష్టేన కులదూషిణా || 59

ఉత్తిష్ఠానయ పాథస్త్వం తసై#్మ దద్యాస్తి లాంజలిమ్‌ | అపుత్రత్వం వరం నౄణాం కుపుత్రాత్కుల పాంసనాత్‌ || 60

ఏనుగు దంతముతో చేసినది, సుఖమును ఉత్సాహమును కలిగించునది, పర్వత ప్రాంతములో తయారైనది, వెన్నెల వలె అద్భుతముగా ప్రకాశించునది యగు మంచము ఎక్కడ ఉన్నది?(57) చేతిలో దీపమును పట్టుకొని ప్రకాశించే శాలభంజిక యేది? ఇన్ని మాటలేల? నీవు కులస్త్రీవి. నీపై కోపించుట వ్యర్థము (58).నేను వివాహమును చేసుకున్న తరువాతనే భుజించెదను. దుష్టుడు, కులపాంసనుడు అగు వాడు నా కుమారుడే కాదు (59). లెమ్ము. నీటిని తెమ్ము. వానికి నువ్వులను, నీళ్లను వదలి వేయుము. కుల దూషకుడగు కుపుత్రుని కంటె మానవులకు పుత్రుడు కలగకుండుటయే మేలు (60).

త్యజేదేకం కులస్యార్థే నీతిరేషా సనాతనీ | స్నాత్వా నిత్యవిధిం కృత్వా తస్మిన్నేవాహ్ని కస్యచిత్‌ || 61

శ్రోత్రియస్య సుతాం ప్రాప్య పాణిం జగ్రాహ దక్షితః || 62

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యు పాఖ్యానే గుణనిధి చరిత్ర వర్ణనం నామ సప్తదశోsధ్యాయః (17).

కులము కొరకు ఒకనిని విడువవలెనని సనాతన ధర్మము చెప్పుచున్నది. అతడు స్నానము చేసి నిత్యకర్మననుష్ఠించి, అదే దినమున ఒకానొక (16) శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడెను (62).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సృష్ట్యు పాఖ్యానమనే మొదటి ఖండలో గుణనిధి చరిత్ర యను పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

Sri Sivamahapuranamu-I    Chapters