Sri Sivamahapuranamu-I
Chapters
శ్రీ గణశాయ నమః రుద్ర సంహిత - సతీ ఖండము అథ ప్రథమోsధ్యాయః సంక్షేప సతీచరిత్రము శ్రీ గణశాయ నమః | అథ సతీఖండో ద్వితీయః ప్రారభ్యతే || నారద ఉవాచ | విధే సర్వం విజానాపి కృపయా శంకరస్య చ | త్వయాsద్భుతా హి కథితాః కథా మే శివయోశ్శుభాః ||
1 త్వన్ముఖాంభోజ సంవృత్తాం శ్రుత్వా శివకథాం పరామ్ | అతృప్తో హి పునస్తాం వై శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ||
2 పూర్ణాంశశ్శంకరసై#్యవ యో రుద్రో వర్ణతః పురా | విధే త్వయా మహేశానః కైలాసనిలయో వశీ ||
3 స యోగీ సర్వవిష్ణ్వాది సురసేవ్యస్సతాం గతిః | నిర్ద్వంద్వః క్రీడతి సదా నిర్వికారీ మహాప్రభుః ||
4 శ్రీ గణశునకు నమస్కరించి, రెండవది యగు సతీఖండము ఆరంభింపబడుచున్నది. నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మన్ ! శంకరుని కృపచే నీకు సర్వము దెలియును. నీవు నాకు అద్భుతములైన, శుభకములైన పార్వతీ పరమేశ్వరుల గాథలను చెప్పియుంటివి (1). హే ప్రభో! నీ ముఖపద్మము నుండి వెలువడే శ్రేష్ఠమగు శివకథను వినినాను. కాని నాకు ఇంకనూ తృప్తి కలుగలేదు. మరల శివకథను వినగోరుచున్నాను (2). హే బ్రహ్మన్! శంకరుని పూర్ణాంశావతారమగు రుద్రుని తమరు ఇదివరలో వర్ణించియుంటిరి. జితేంద్రియుడు, కైలాసవాసి, మహేశ్వరుడు (3), యోగి, విష్ణ్వాది దేవతలచే సేవింపబడువాడు, సత్పురుషులకు శరణము, సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడు, వికారరహితుడు, మహా ప్రభువు అగు రుద్రుడు సర్వదా క్రీడించుచున్నాడు (4). సోsభూత్పునర్గృహస్థశ్చ వివాహ్య పరమాం స్త్రియమ్ | హరి ప్రార్థనయా ప్రీత్యా మంగలాం స్వతపస్వినీమ్ || 5 ప్రథమం దక్ష పుత్రీ సా పశ్చాత్సా పర్వతాత్మజా | కథ మేక శరీరేణ ద్వయో రప్యాత్మజా మతా || 6 కథం సతీ పార్వతీ సా పునశ్శివముపాగతా | ఏతత్సర్వం తథాన్యచ్చ బ్రహ్మన్ గదితుమర్హసి || 7 ఆయన విష్ణువు ప్రార్థననంగీకరించి, తన గురించి, తపస్సు చేసిన పతివ్రతారత్నమగు సర్వమంగళను ప్రీతితో వివాహమాడి గృహస్థుడాయెను (5). ఆమె ముందుగా దక్షుని కుమార్తె, తరువాత హిమవంతుని కుమార్తె. ఇది ఎట్లు పొసగును? ఒకే శరీరముతో ఇద్దరికీ కుమార్తె ఎట్లు కాగలదు? (6) సతి పార్వతియై మరల శివుని పొందిన విధమెట్టిది? హె బ్రహ్మన్! నీవీ గాథను, ఇతర గాథలను పూర్తిగా చెప్పదగుదువు (7). సూత ఉవాచ | ఇతి తస్య వచశ్ర్శుత్వా సురర్షే శ్శంకరాత్మనః | ప్రసన్న మానసో భూత్వా బ్రహ్మా వచనమబ్రవీత్ || 8 బ్రహ్మోవాచ | శృణుతాత మునిశ్రేష్ఠ కథయామి కథాం శుభామ్ | యాం శ్రుత్వా సఫలం జన్మ భవిష్యతి న సంశయః || 9 పురాహం స్వసుతాం దృష్ట్వా సంధ్యాహ్వాం తనయైస్సహ |అభవం వికృతస్తాత కామబాణ ప్రపీడితః || 10 ధర్మ స్మృతస్తదా రుద్రో మహాయోగీ పరః ప్రభుః | ధిక్కృత్య మాం సుతైస్తాత స్వస్థానం గతవానయమ్ || 11 యన్మాయా మోహితశ్చాహం వేదవక్తా చ మూఢధీః | తేనాకార్షం సహాకార్యం పరమేశేన శంభునా || 12 తదీర్ష్య యాహమకార్షం బహూ పాయాన్సుతైస్సహ | కర్తుం తన్మోహనం మూఢశ్శివమాయా విమోహితః || 13 బ్రహ్మ ఇట్లు పలికెను - వత్సా! మహర్షీ! వినుము. శుభకరమగు కథను చెప్పెదను. ఈకథను విన్నవారి జన్మ సార్థకమగుననుటలో సందేహము లేదు (9). వత్సా! పూర్వమునేను నాకుమారులతో గూడి యుండగా, నా కుమార్తె యగు సంధ్య కనబడెను. అపుడు నేను మన్మథ బాణములచే పీడితుడనై, వికారమును పొందితిని (10). అపుడు ధర్మునిచే స్మరింపబడి, మహాయోగి, మహాప్రభువునగు రుద్రుడు కుమారులతో కూడిన నన్ను నిందించెను. వత్సా! ఆయన అట్లు నన్ను నిందించి తన ధామకు వెళ్లెను (11). నేను వేదములను లోకములకందజేసిన వాడనే అయినా, శివుని మాయచే మోహితుడనై, మూర్ఖుడనైతిని. అందువలన పరమేశ్వరుడగు శంభుని విషయములో దోషము నాచరించితిని (12). శివమాయచే మోహితుడనై మూర్ఖుడనైన నేను ఆయన యందలి ఈర్ష్యచే, కుమారులతో గూడి ఆయనను మోహింపజేయుటకు అనేక యత్నములను చేసితిని (13). అభవంస్తేsథ వై సర్వే తస్మిన్ శంభౌ పరప్రభౌ | ఉపాయ నిష్పలాస్తేషాం మమ చాపి మునీశ్వర || 14 తదాsస్మరం రమేశానం వ్యర్థోపాయస్సుతై స్సహ | అబోధయత్స ఆగత్య శివభక్తి రతస్సుధీః || 15 ప్రబోధితో రమేశేన శివతత్త్వ ప్రదర్శినా | తదీర్ష్యామత్యజం సోహం తం హఠం న విమోహితః || 16 శక్తిం సంసేవ్య తత్ర్పీత్యో త్పాదయామాస తాం తదా | దక్షాదశిక్న్యాం వీరిణ్యాం స్వపుత్రాద్ధరమోహనే || 17 ఓ మహర్షీ! పరమాత్మయగు ఆ శంభునిపై నేను, వారు ప్రయోగించిన ఉపాయములన్నియు వ్యర్థమయ్యెను (14). ఈ రకముగా ఉపాయములన్నియూ వ్యర్థము కాగా, నేను సుతులతో గూడి రమాపతిని స్మరించితిని. అపుడు శివభక్తియందు తత్పరుడు, జ్ఞానియగు ఆ విష్ణువు వచ్చి నా మౌఢ్యమును పోగొట్టెను (15). శివతత్త్వమును బోధించు రమాపతి నా కళ్లు తెరిపించెను. అపుడు నేను ఈర్ష్యము విడిచి పెట్టితిని. కాని మోహితుడనగు నేను మొండి పట్టును వీడలేదు (16).అపుడు శక్తిని సేవించి ఆమె అనుగ్రహముచే, శివుని మోహింపజేయుట కొరకై, నా కుమారుడగు దక్షుని వలన వీరిణి అనబడే అశిక్ని యందు ఆమె జనించినట్లు చేసితిని (17). సోమా భూత్వా దక్షసుతా తపః కృత్వా తు దుస్సహమ్ | రుద్రపత్న్య భవ ద్భక్త్యా స్వభక్తహితకారిణీ || 18 సోమో రుద్రో గృహీ భూత్వాsకార్షీల్లీలాం పరాం ప్రభుః | మోహయిత్వాsథ మాం తత్ర స్వవివాహేsవికారధీః || 19 వివాహ్య తాం స ఆగత్య స్వగిరౌ సూతికృత్తయా | రేమే బహువిమోహో హి స్వతంత్రస్స్వాత్తవిగ్రహః || 20 తయా విహరతస్తస్య వ్యతీయాయ మహాన్మనే | కాలస్సుఖరశ్శంభోర్నిర్వి కారస్య సద్రతేః || 21 తతో రుద్రస్య దక్షేణ స్పర్ధా జాతా నిజేచ్ఛయా | మహామూఢస్య తన్మాయో మోహితస్య సుగుర్విణః || 22 ఆ ఉమాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి, దుస్సహమగు తపస్సును భక్తితో చేసి రుద్రునకు పత్ని ఆయెను. ఆమె తన భక్తులకు హితమును కలుగజేయును (18). పరమేశ్వరుడగు రుద్రుడు ఉమాదేవితో కూడి గృహియై లీలలను ప్రకటించెను. ఆయన బుద్ది యందు వికారములేమియూ ఉండవు. ఆయన తన వివాహముందు నన్ను మోహింపజేసెను (19). సృష్టిని చేయువాడు, మోహములేని వాడు, స్వతంత్రుడు, స్వేచ్ఛచే రూపమును ధరించిన వాడునగు రుద్రుడు ఆమెను వివాహమాడి, తన పర్వతమును చేరి బహువిధముల రమించెను (20). ఓ మహర్షీ! వికారములు లేనివాడు, సద్విహారియగు శంభుడు చిరకాలము ఆమెతో కలిసి విహరించుచూ సుఖముగా గడిపెను (21). అపుడు రుద్రునకు మహామూర్ఖుడు, శివమాయచే మోహితుడు, గర్విష్ఠి అగు దక్షునితో, తన ఇచ్ఛ చేత విరోధము ఏర్పడెను (22). తత్ర్పభావాద్ధరం దక్షో మహాగర్వి విముఢధీః | మహాశాంతం నిర్వికారం నినింద బహు మోహితః || 23 తతో దక్షస్స్వయం యజ్ఞం కృతవాన్ గర్వితోsహరమ్ | సర్వా నాహూయ దేవాదీన్ విష్ణుం మాం చాఖిలాధిపః || 24 నాజుహావ తథాభూతో రుద్రం రోషసమాకులః |తథా తత్ర సతీం నామ్నా స్వపుత్రీం విధి మోహితః || 25 యదా నాకారితా పిత్రా మాయామోహిత చేతసా | లీలాం చకార సుజ్ఞానా మహాసాధ్వీ శివా తదా || 26 గొప్ప గర్వము గలవాడు, విమోహితమైన బుధ్ధి గలవాడునగు దక్షుడు, మిక్కిలి శాంతుడు, వికార రహితుడునగు శివుని మాయా ప్రభావముచే మిక్కలి మోహితుడై అనేక విధములుగా నిందించెను (23). అపుడు గర్వితుడగు దక్ష ప్రజాపతి దేవతలను, ఇతరులను, నన్ను, విష్ణువును అందరినీ ఆహ్వానించి శివుడు లేని యజ్ఞమును చేసెను (24). మాయామోహితుడు, గర్విష్ఠి, రోషముతో కల్లోలితమైనమనస్సు గలవాడునగు దక్షుడు రుద్రుని, సతియను తన పుత్రికను ఆ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (25).మాయచే విమూఢమైన మనస్సు గల తండ్రి ఆహ్వానించకపోగా, గొప్ప జ్ఞానవతి మహాసాధ్వియగు సతీదేవి లీలను ప్రకటించెను (26). అథగతా సతీ తత్ర శివాజ్ఞామధిగమ్య సా | అనాహూతాపి దక్షేణ గర్విణా స్వపితుర్గృహమ్ || 27 విలోక్య రుద్ర భాగం నో ప్రాప్యావజ్ఞాం చ తాతతః | వినింద్య తత్ర తాన్ సర్వాన్ దేహ త్యాగమథాకరోత్ || 28 తచ్ఛ్రుత్వా దేవ దేవేశః క్రోధం కృత్వా తు దుస్సహమ్ | జటాముత్కృత్య మహతీం వీరభద్రమజీజనత్ || 29 సగణం తం సముత్పాద్య కిం కుర్యామితి వాదినమ్ | సర్వాపమాన పూర్వం హి యజ్ఞధ్వంసం దిదేశ హ || 30 అపుడు సతీదేవి శివుని ఆజ్ఞను పొంది, గర్విష్ఠియగు దక్షుడు ఆహ్వానించకపోయినా, పుట్టింటికి విచ్చేసెను (27). ఆమెకు ఆ యజ్ఞములో రుద్రుని భాగము కానరాలేదు. దానిని ఆమె తండ్రి చేసిన అవమానముగా గ్రహించి, అచట ఉన్న వారందరినీ నిందించి, తరువాత దేహమును విడిచి పెట్టెను (28). దేవదేవుడగు శివుడు ఈ వృత్తాంతమును విని, సహింపరాని కోపమును పొంది, పెద్దజటనొకదానిని పీకి వీరభద్రుని సృష్టించెను (29). వీరభద్రుని గణములతో సహా సృష్టించెను. 'నేను ఏమి చేయవలెను?' అని ప్రశ్నించిన వీరభద్రునకు అందరినీ అవమానించి, యజ్ఞమును ధ్వంసము చేయుమని ఆదేశించెను (30). తదాజ్ఞాం ప్రాప్య స గణాధీశో బహుబలాన్వితః | గతోsరం తత్ర సహసా మహాబల పరాక్రమః || 31 మహోపద్రవమాచేరుర్గణాస్తత్ర తదాజ్ఞయా | సర్వాన్ స దండయామాస న కశ్చిదవ శేషితః || 32 విష్ణుం సంజిత్య యత్నేన సామరం గణసత్తమః | చక్రే దక్ష శిరశ్ఛేదం తచ్ఛిరోsగ్నౌ జుహావ చ || 33 యజ్ఞధ్వంసం చకారాశు మహోపద్రవమాచరన్ | తతో జగామ స్వగిరిం ప్రణనామ ప్రభుం శివమ్ || 34 గణాధీశుడగు ఆ వీరభద్రుడు శివుని యాజ్ఞను పొంది గొప్ప సైన్యముతో కూడిన వాడై శీఘ్రముగా అచటకు వెళ్లెను. గొప్ప బలము, పరాక్రమముగల (31), ఆ వీరభద్రుని ఆజ్ఞచే గణములచట గొప్ప ఉపద్రవమును కలుగజేసిరి. ఆతడు ఎవ్వరినీ మిగల్చకుండగా, అందరినీ దండించెను (32). గణశ్రేష్ఠుడగు నాతడు ప్రయత్న పూర్వకముగా, దేవతలతో కూడియున్న విష్ణువును జయించి, దక్షుని తలను నరికి, దానిని అగ్నియందు వ్రేల్చెను (33). గొప్ప ఉపద్రవమును కలిగించి, ఆతడు శీఘ్రముగా యజ్ఞమును ధ్వంసము చేసి, తరువాత కైలాస పర్వతమును చేరి, శివప్రభువకు నమస్కరించెను (34). యజ్ఞధ్వంసోsభవచ్చేత్థం దేవలోకే హి పశ్యతి | రుద్రస్యానుచరైస్తత్ర వీరభద్రాదిభిః కృతః || 35 మునే నీతిరియం జ్ఞేయా శ్రుతిస్మృతిషు సంమతా | రుద్రే రుష్టే కథం లోకే సుఖం భవతి సుప్రభౌ || 36 తతో రుద్రః ప్రసన్నోభూత్ స్తుతిమాకర్ణ్య తాం పరామ్ | విజ్ఞప్తిం సఫలాం చక్రే సర్వేషాం దీనవత్సలః || 37 పూర్వ వచ్చ కృతం తేన కృపాలుత్వం మహాత్మనా | శంకరేణ మహేశేన నానాలీలావిహారిణా || 38 వీరభద్రుడు మొదలగు రుద్రాను చరులు, దేవతలు చూచుచుండగా, ఈ తీరున యజ్ఞమును ధ్వంసమొనర్చిరి (35). ఓ మహర్షీ! మహా ప్రభువగు రుద్రుడు కోపించినచో, లోకములో సుఖమెట్లుండును? ఈ నీతిని వేదములు, స్మృతులు చెప్పుచున్నవి. మనమీ నీతిని తెలియవలెను (36). అపుడు ఆ దేవతలందరు చేసిన గొప్ప స్తోత్రమును విని, దీనవత్సలుడగు రుద్రుడు ప్రసన్నుడై, వారి విజ్ఞప్తిని సఫలము చేసెను (37). శుభకరుడు, మహేశ్వరుడు,అనేక లీలలను ప్రదర్శించి విహరించువాడు, మహాత్ముడు నగు రుద్రుడు ఎప్పటివలెనే కరుణను చూపెను (38). జీవతస్తేన దక్షో హి తత్ర సర్వే హి సత్కృతాః | పునస్స కారితో యజ్ఞ శ్శంకరేణ కృపాలునా || 39 రుద్రశ్చ పూజితస్తత్ర సర్వై ర్దేవైర్వి శేషతః | యజ్ఞే విష్ణ్వాదిభిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే || 40 సతీదేహ సముత్పన్నా జ్వాలా లోక సుఖావహా | పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయినీ || 41 జ్వాలా ముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రదా | బభూవ పరమా దేవీ దర్శనా త్పాపహారిణీ || 42 ఆయన దక్షుని జీవింపజేసి, అందరినీ సత్కరించెను. కృపానిధి యగు శంకరుడు మరల ఆ యజ్ఞమును చేయించెను (39). ఆ యజ్ఞములో దేవతలందరు విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి (40). ఓ మహర్షీ! సతియొక్క దేహము నుండి పుట్టినట్టియు, లోకములకు సుఖమనిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును (41). ఆ పర్వతమునందు సర్వకామనలనీడేర్చునట్టియు, దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖియను పేర ప్రసిద్ధిని గాంచెను (42). ఇదానీం పూజ్యతే లోకే సర్వకామఫలాప్తయే | సంవిధాభి రనేకాభిః మహోత్సవ పురస్సరమ్ || 43 తతశ్చ సా సతీ దేవీ హిమాలయ సుతాsభవత్ | తస్యాశ్చ పార్వతీ నామ ప్రసిద్ధమభవత్తదా || 44 సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై | తమేవ పరమేశానం భర్తారం సముపాశ్రితా || 45 ఏ తత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 46 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీసంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమః అధ్యాయః (1). ఇప్పటికీ ఆమె లోకమునందు, కోర్కెలన్నియు ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పుజింపబడుచున్నది (43). ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయుని కుమార్తె అయెను. అపుడామెకు పార్వతియను పేరు ప్రఖ్యాతమాయెను (44). ఆమె మరల కఠోరమగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను (45). ఓమునిశ్రేష్ఠా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములనన్నిటినీ చెప్పతిని. దీనిని విన్నవారి పాపములన్నియు తొలగిపోవుననటలో సందేహము లేదు (46). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితములో రెండవ ఖండలో సతీసంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).