Sri Sivamahapuranamu-I
Chapters
అథ తృతీయోsధ్యాయః కామశాపానుగ్రహములు బ్రహ్మోవాచ | తతస్తే మునయస్సర్వే తదభిప్రాయ వేదినః | చక్రుస్తదుచితం నామ మరీచి ప్రముఖాస్సుతాః ||
1 ముఖావలోకనాదేవ జ్ఞాత్వా వృత్తాంతమన్యతః | దక్షాదయశ్చ స్రష్టార స్థ్సానం పత్నీం చ తే దదుః || 2 తతో నిశ్చిత్య నామాని మరీచి ప్రముఖా ద్విజాః | ఊచుస్సంగతమేతసై#్మ పురుషాయ మమాత్మజాః || 3 బ్రహ్మ ఇట్లు పలికెను - మరీచి మొదలగు ఆ మునులందరు, మరియు కుమారులు బ్రహ్మయొక్క అభిప్రాయము నెరింగి ఆ పురుషునకు యోగ్యమగు పేర్లనిడిరు (1). బ్రహ్మ గారు వారి ముఖములోనికి చూడగా ఆయన అభిప్రాయమును గ్రహించి దక్షాది ప్రజాపతులు ఆ పురుషునకు స్థానమును, భార్యను కల్పించిరి (2). అపుడు నా కుమారులైన మరీచి మొదలగు మహర్షులు ఆతని పేర్లను నిశ్చియించి ఈ యుక్తియుక్తమగు మాటను ఆపురుషునితో పలికిరి (3). ఋషయ ఊచుః | యస్మాత్ర్ప మథసే తత్త్వం జాతోsస్మాకం యథా విధేః | తస్మాన్మన్మథ నామా త్వం లోకే ఖ్యాతో భవిష్యసి || 4 జగత్సు కామరూపస్త్వం త్వత్సమో న హి విద్యతే | అతస్త్వం కామనామాపి ఖ్యాతో భవ మనోభవ || 5 మదనాన్మదనాఖ్యస్త్వం జాతో దర్పాత్స దర్పకః | తస్మాత్కం దర్పనామాపి లోకే ఖ్యాతో భవిష్యసి || 6 త్వత్సమం సర్వ దేవానాం యద్వీర్యం న భవిష్యతి |తతస్థ్సా నాని సర్వాణి సర్వవ్యాపీ భవాంస్తతః || 7 దక్షోయం భవతే పత్నీం స్యయం దాస్యతి కామినీమ్ | ఆద్యః ప్రజాపతిర్యో హి యథేష్టం పురుషోత్తమః || 8 నీవు పుట్టగనే మాయొక్క బ్రహ్మ యొక్క మనస్సులను మథించినాడవు గనుక, నీకు లోకములో మన్మథుడను పేరు ప్రసిద్ధి గాంచ గలదు (4). మనస్సులో పుట్టే ఓ మన్మథా! యధేఛ్ఛగా వివిధ రూపములను ధరించుటలో నీతో సమమైన వాడు జగత్తులలో లేడు గనుక, నీవు 'కాముడు' అను పేర ప్రఖ్యాతిని బడయుము (5). నీవు జనులను మదాన్వితులను చేయుదువు గాన నీకు మదనుడని పేరు. నీవు దర్పము గలవాడవు. దర్పము నుండి పుట్టినవాడవు. కాన నీకు లోకములో కందర్పుడు అనే పేరు గూడ ప్రసిద్ధిని గాంచగలదు (6). నీతో సమానమైన బలము గలవాడు దేవతలలో మరియొకరు ఉండబోరు. కావున స్థానములన్నియు నీవియే. నీవు సర్వవ్యాపివి (7). పురుషశ్రేష్ఠుడు, మొదటి ప్రజాపతియగు ఈ దక్షుడు తనకు నచ్చిన విధముగా నీకు నిన్ను ప్రేమించు భార్యను స్వయముగా ఈయగలడు (8). ఏషా చ కన్యకా చారురూపా బ్రహ్మమనోభవ | సంధ్యా నామ్నేతి విఖ్యాతా సర్వలోకే భవిష్యతి || 9 బ్రహ్మణో ధ్యాయతో యస్మాత్సమ్యగ్జాతా వరాంగనా | అతస్సంధ్యేతి. విఖ్యాతా క్రాంతాభా తుల్య మల్లికా || 10 బ్రహ్మయొక్క మనస్సు నుండి పుట్టిన ఈ సుందర రూపము గల కన్య లోకములన్నింటియందు సంధ్య యను పేరుతో ప్రసిద్ధిని గాంచెను (9). ధ్యానము చేయుచున్న బ్రహ్మ నండి ఈ సుందరి చక్కగా జన్మించినది గాన, ఈమె సంధ్యయని ప్రసిద్ధిని బడసినది. ఈ సుందరి మల్లె తీగవలె విశేషంచి ప్రకాశించుచున్నది (10). బ్రహ్మోవాచ | కౌసుమాని తథాస్త్రాణి పంచాదాయ మనోభవః | ప్రచ్ఛన్నరూపీ తత్రైవ చింతయామాస నిశ్చయమ్ || 11 హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా | మారణం చేతి ప్రోక్తాని మునే ర్మోహకరాణ్యపి || 12 బ్రహ్మణా మమ యత్కర్మ సముద్దిష్టం సనాతనమ్ | తదహైవ కరిష్యామి మునీనాం సన్నిధౌ విధేః || 13 తిష్ఠంతి మునయశ్చాత్ర స్వయం చాపి ప్రజాపతిః | ఏతేషాం సాక్షి భూతం మే భవిష్యంత్యద్య నిశ్చయమ్ || 14 సంధ్యాపి బ్రహ్మణా ప్రోక్తా చేదానీం ప్రేషయేద్వచః | ఇహ కర్మ పరీక్ష్యైవ ప్రయోగాన్మోహయామ్యహమ్ || 15 బ్రహ్మ ఇట్లు పలికెను - మనస్సులో ఉదయించు మన్మథుడు అయిదు పుష్పబాణములను తీసుకొని, ప్రచ్ఛన్న రూపముతో అక్కడనే యుండి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను (11). మునులకు కూడ మోహమును కలిగించు ఈ బాణములకు హర్షణము, రోజనము, మోహనము, శోషము మరియు మారణము అని పేర్లు (12). బ్రహ్మ నాకు ఉపదేశించిన సనాతన సృష్టి కార్యమును నేను ఇచటనే ఈ మునుల సన్నిధిలో, బ్రహ్మ సన్నిధిలో ప్రయోగించెదను (13). ఇచట మునులు ఉన్నారు. ప్రజాపతి కూడ స్వయముగ ఉన్నాడు. నా నిశ్చయమునకు వీరందరు ఈనాడు సాక్షులు కాగలరు (14). సంధ్య కూడ ఇచట గలదు. బ్రహ్మచే నిర్దిష్టమైన పుష్పబాణ ప్రయోగరూప కర్మను పరీక్షకొరకై ఈమె యందు ఆచరించి నేను ఈమెను మోహింపజేయగలను (15). ఇతి సంచింత్య మనసా నిశ్చిత్య చ మనోభవః | పుష్పజం పుష్పజాతస్య యోజయామాస మార్గణౖః || 16 ఆలీఢ స్థానమాసాద్య ధనురాకృష్య యత్నతః | చకార వలయాకారం కామో దన్వివరస్తదా || 17 సంహితే తేన కోదండే మారుతాశ్చ సుగంధయః | వవుస్తత్ర మునిశ్రేష్ఠ సమ్యగాహ్లాద కారిణః || 18 తతస్తానపి ధా త్రా దీన్ సర్వానేవ చ మానసాన్ | పృథక్ పుష్పశ##రైస్తీక్ణై ర్మోహయామాస మోహనః || 19 తతస్తే మునయస్సర్వే మోహితాశ్చాప్యహం మునే | సంహితో మనసా కంచిద్వికారం ప్రాపురాదితః || 20 మన్మథుడు మనసులో నిట్లు నిశ్చయించుకొని పుష్పధనస్సుపై పుష్ప బాణములను ఎక్కు పెట్టెను (16). అపుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు కాముడు కుడికాలును ముందుకు వంచి, ఎడమ కాలును వెనుకకు పెట్టి, ధనస్సును బలముగా లాగి గుండ్రముగా చేసెను. (17). ఆతడు ధనస్సును ఎక్కు పెట్టగానే పరిమళ భరితములు అగు వాయువులు అచట వీచినవి. ఓ మహర్షీ! ఆ వాయువులు గొప్ప ఆహ్లాదమును కలిగించినవి (18). మోహింప జేయు ఆ మన్మథుడు తీక్ణములగు పుష్పబాణములతో బ్రహ్మను, ఆతని మానస పుత్రులనందరినీ మోహింపజేసెను (19). ఓ మునీ! అపుడు నేను మరియు ఆ మునులందరు మోహితులమైతిమి. మొట్టమొదటిసారిగా బ్రహ్మాదులు మనస్సులో ఒక విలక్షణమైన వికారమును పొందిరి (20). సంధ్యాం సర్వే నిరీక్షంతస్సవికారం ముహుర్ముహుః | ఆసన్ ప్రవృద్ధమదనాః స్త్రీ యస్మాన్మదనైధినీ || 21 తతస్సర్వాన్ స మదనో మోహయిత్వా పునః పునః | యథేంద్రియవికారంతే ప్రాపుస్తానకరోత్తథా || 22 ఉదీరితేంద్రియో ధాతా వీక్ష్యాహం స యదా చ తామ్ | తదైవ చోన పంచాశద్భావా జాతాశ్శరీరతః || 23 సాపి తైర్వీక్ష్య మాణాథ కందర్పశరపాతనాత్ | చక్రే ముహుర్ముహుర్భావాన్ కటాక్షావరణాదికాన్ || 24 వారందరు సంధ్యను మరల మరల వికారములతో చూచిరి. వారి మన్మథ వికారములు వృద్ధిపొందెను. స్త్రీ కామవికారమును వృద్ధి జేయును గదా! (21). ఇట్లు ఆ మన్మథుడు వారినందరిని మరల మరల మోహింపజేసి, వారు ఇంద్రియ వికారమును పొందునట్లు చేసెను (22). బ్రహ్మనగు నేను ఆమెను వృద్ధిపొందిన ఇంద్రియ వికారముతో చూచుచున్న సమయములో శరీరము నుండి నలభై తొమ్మిది పదార్థములు పుట్టినవి (23). వారు ఇట్లు చూచుచుండగా, ఆమెపై కూడ మన్మథ బాణముల ప్రభావము పడెను. ఆమెయు క్రీగంటితో చూచుట, సంజ్ఞలతో ఆహ్వానించుట మొదలగు శృంగార వికారములను అధికముగా చేయజొచ్చెను (24). నిసర్గసుందరీ సంధ్యా తాన్ భావాన్ మానసోద్భవాన్ |కుర్వంత్యతిరాం రేజే స్వర్నదీప తనూర్మి భిః || 25 అథ భావయుతాం సంధ్యాం వీక్ష్యాకార్షం ప్రజాపతిః | ధర్మాభిపూరిత తను రభిలాషమహం మునే || 26 తతస్తే మునయస్సర్వే మరీచ్యత్రిముఖా ఆపి | దక్షాద్యాశ్చ ద్విజశ్రేష్ఠ ప్రాపుర్వై కారికేంద్రియమ్ || 27 దృష్ట్వా తథావిధా దక్షమరీచిప్రముఖాశ్చ మామ్ | సంధ్యాం చ కర్మణి నిజే శ్రద్దధే మదనస్తదా || 28 సహజ సుందరి యగు సంధ్య , మనస్సులో పుట్టే కామభావములను ప్రకటించుచున్నదై, చిన్న తరంగములతో కూడిన మందాకిని నదివలె మిక్కిలి ప్రకాశించెను (25). ఓ మహర్షీ! ప్రజాపతియగు నేను కామభావముతో కూడిన సంధ్యను చూచి, కామభావముతో నిండిన శరీరము గలవాడనై ఆమెను అభిలషించితిని (26). అపుడా మరీచి , అత్రి మొదలగు మునులు, దక్షుడు మొదలగు ప్రజాపతులు కూడా ఇంద్రియ వికారములను పొందిరి (27). ఓ విప్రశ్రేష్ఠా! దక్షుడు, మరీచి మొదలగు వారు, మరియు నేను అట్లు అగుటను చూచి, మరియు సంధ్యను చూచి, మన్మథునకు తన సామర్ధ్యము పై విశ్వాసము కలిగెను (28). యదిదం బ్రహ్మణా కర్మ మమోద్దిష్టం మయాపి తత్ | కర్తుం శక్యమితి హ్యద్ధా భావితం స్వభువా తదా || 29 ఇత్థం పాపగతిం వీక్ష్య భ్రాతౄణాం చ పి తుస్తథా | ధర్మ స్సస్మార శంభుం వై తదా ధర్మావనం ప్రభుమ్ || 30 సంస్మరన్మనసా ధర్మశ్శంకరం ధర్మపాలకమ్ | తుష్టావ వివిధైర్వాక్యైర్దీనో భూత్వాజసంభవః || 31 'బ్రహ్మ నాకు అప్పజెప్పిన ఈ కర్మను నేను చేయగలను ' అనే విశ్వాసము మన్మథునకు దృఢముగా కలిగెను (29). అపుడు ధర్ముడు పాపభావనతో కూడిన సోదరులను, తండ్రిని చూచి, ధర్మ రక్షక ప్రభువగు శంభువును స్మరించెను (30). బ్రహ్మ పుత్రుడగు ధర్మడు దీనుడై, ధర్మ పాలకుడగు శంకరుని మనస్సులో స్మరించుచూ అనేక వాక్యములతో ఇట్లు స్తుతించెను (31). ధర్మ ఉవాచ | దేవ దేవ మహాదేవ ధర్మపాల నమోsస్తుతే | సృష్టి స్థితి వినాశానాం కర్తా శంభో త్వమేవ హి || 32 సృష్టౌ బ్రహ్మా స్థితౌ విష్ణుః ప్రలయే హరరూపధృక్ | రజస్సత్త్వ తమోభిశ్చ త్రిగుణౖరగుణః ప్రభో || 33 నిసై#్రగుణ్యశ్శివస్సాక్షాత్తుర్యశ్చ ప్రకృతేః పరః | నిర్గుణో నిర్వికారీ త్వం నానాలీలా విశారదః || 34 రక్ష రక్ష మహాదేవ పాపాన్మాం దుస్తరాదితః | మత్పితాయం తథా చేమే భ్రాతరః పాపబుద్ధయః || 35 ధర్ముడు ఇట్లు పలికెను - దేవ దేవా! మహాదేవా! ధర్మరక్షకా! నీకు నమస్కారము. శంభో! సృష్టిస్థితిలయకర్తవు నీవే గదా!(32). ప్రభో! గుణరహితుడవగు నీవు రజస్సు, సత్త్వము, తమస్సు అను గుణములను స్వీకరించి, సృష్టియందు బ్రహ్మ రూపమును, స్థితియందు విష్ణురూపమును, ప్రళయమునందు రుద్రరూపమును ధరించెదవు (33). శివుడు త్రిగుణా తీతుడు. త్రిమూర్తుల కతీతమైన తురీయతత్త్వమే శివుడు. ఆయన ప్రకృతి కంటె ఉత్కృష్టుడు. అట్టి నీవు నిర్గుణుడవు. నిర్వికారుడవు. అయిననూ, అనేక లీలలను ప్రకటించుటలో సమర్థుడవు (34). మహాదేవా! నన్ను తరింప శక్యము గాని ఈ పాపము నుండి రక్షింపుము. రక్షింపుము. ఈ నా తండ్రి, మరియు ఈ నా సోదరులు పాప బుద్ధిని కలిగియున్నారు (35). బ్రహ్మోవాచ | ఇతి స్తుతో మహేశానో ధర్మేణౖవ పరః ప్రభుః | తత్రా జగామ శీఘ్రం వై రక్షితుం ధర్మమాత్మభూః || 36 జాతో వియద్గతశ్శంభుర్విధిం దృష్ట్వా తథావిధమ్ | మాం దక్షాద్యాంశ్య మనసా జహా సోపజహాస చ || 37 స సాధువాదం తాన్ సర్వాన్ విహస్య చ పునః పునః | ఉవాచేదం మునిశ్రేష్ఠ లజ్జయన్ వృషభధ్వజః || 38 బ్రహ్మ ఇట్లు పలికెను - పరమ ప్రభువు, స్వయంభువునగు మహేశ్వరుడు ధర్మునిచే ఈ విధముగా స్తుతింపబడినవాడై, వెంటనే అచటకు ధర్మ రక్షణ కొరకై విచ్చేసెను (36). బ్రహ్మను (నన్ను) , దక్షుడు మొదలగు వారిని ఆ విధముగా చూసిన శంభుడు ఆకాశమునందే ఉండి ఎంతయూ నవ్వుకొనెను (37). వృషభవాహనుడగు ఆ శివుడు వారందరితో 'సాధు సాధు' అని పిలికెను. ఓ మహర్షీ! ఆయన మరల మరల నవ్వి, వారికి సిగ్గు కలుగు విధముగా ఇట్లు పలికెను (38). శివ ఉవాచ | అహో బ్రహ్మంస్తవ కథం కామభావస్సముద్గతః | దృష్ట్వా చ తనయాం నైవ యోగ్యం వేదాను సారిణామ్ || 39 యథా మతా చ భగినీ భ్రాతృపత్నీ తథా సుతా | ఏతాః కుదృష్ట్యా ద్రష్టవ్యా న కదాపి విపశ్చితా || 40 ఏష వై వేదమార్గస్య నిశ్చయస్త్వన్ముఖే స్థితః | కథం తు కామమాత్రేణ స తే విస్మారితో విధే || 41 ధైర్యం జాగరితం బ్రహ్మన్ మనస్తే చతురానన | కథం క్షుద్రేణ కామేన రంతుం విగటితం విధే || 42 శివుడిట్లు పలికెను - అహో బ్రహ్మన్! కుమార్తె ను చూచి నీకు కామభావము ఎట్లు కలిగినది? వేద మార్గానుయాయులకు ఇది తగదు (39). వివేకి తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, మరియు కుమార్తెను తప్పు దృష్టితో ఎన్నడునూ చూడరాదు (40). ఇది వేద మార్గము యొక్క నిర్ణయము. వేదము నీ ముఖమునందు గలదు. హే బ్రహ్మన్! అల్పుడగు కాముడు నీవు దీనిని విస్మరించునట్లు ఎట్లు చేయగలిగెను ?(41). నాల్గు ముఖములు గల ఓ బ్రహ్మ!నీవు మనస్సునందు వివేకమును మేల్కొలుపుము. విధే! నీవు క్షుద్రమగు కామముతో మనస్సును ఎట్లు రంజింపజేయగలవు? (42). ఏకాంత యోగినస్తస్మాత్సర్వదాదిత్యదర్శినః | కథం దక్షమరీ చ్యాద్యా లోలుపాస్త్రీషు మానసాః || 43 కథం కామోsపి మందాత్మా ప్రాబల్యాత్సోsధునైవ హి | వికృతాన్ బాణౖః కృతవానకాలజ్ఞోల్ప చేతనః || 44 ధిక్తం శ్రు తం సదా తస్య యస్య కాంతా మనోహరత్ | ధైర్యా దాకృష్య లౌల్యేషు మజ్జయత్యపి మానసమ్ || 45 మానసపుత్రలగు దక్ష మరీచ్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు. అందువలననే, వారు సదా ఆదిత్యుని దర్శించువారు. అట్టి వారు స్త్రీ వ్యామోహమునెట్లు పొందిరి? (43) మూర్ఖుడు, కాలము యొక్క ఔచిత్యమునెరుంగని వాడు, అల్పశక్తిమంతుడునగు కాముడు పుట్టిన కొద్ది సేపటికే గర్వితుడై బాణములతో మీయందు వికారమునెట్లు కల్గించినాడు? (44). ఎవని మనస్సును స్త్రీ అపహరించునో, వానికి వాని పాండిత్యమునకు నిందయగుగాక! అవివేకులు ధైర్యము(వివేకజ్ఞానము) నుండి మనస్సును మరల్చి చంచలమగు విషయ సుఖముల యందు నిమగ్నము చేయుదురు (45) బ్రహ్మోవాచ | ఇతి తస్య వచశ్ర్శుత్వా లోకే సోహం శివస్య చ | వ్రీడయా ద్విగుణీ భూత స్స్వేదార్ద్రస్త్వభవం క్షణాత్ || 46 తతో నిగృహ్యైంద్రియకం వికారం చాత్యజం మునే | జిఘృక్షురసి తద్భీత్యా తాం సంధ్యాం కామరూపిణీమ్ || 47 మచ్ఛరీరాత్తు ఘర్మాంభో యత్పపాత ద్విజోత్తమ | అగ్ని ష్వాత్తాః పితృగణా జాతాః పితృగణాస్తతః || 48 భిన్నాంజన నిభాస్సర్వే పుల్లరాజీవలోచనాః | నితాంత యతయః పుణ్యాస్సంసారవిముఖాః పరే || 49 బ్రహ్మ ఇట్లు పలికెను - అట్టి నేను ఆ శివుని మాటలను విని రెండు రెట్లు అధికముగా సిగ్గుచెందితిని. క్షణములో నా శరీరమంతయూ చెమటతో నిండెను (46). ఓ మునీ! మనోహర రూపిణి యగు ఆ సంధ్యను పట్టుకొనవలెననే కోరిక ఉన్ననూ, నేను శివుని భయముచే నిగ్రహించుకొని ఇంద్రియ వికారమును విడిచి పెట్టితిని (47). ఓ ద్విజశ్రేష్ఠా! నా శరీరము నుండి జారిన చెమట నీటి నుండి అగ్నిష్వాత్తులనే పితృదేవతలు, మరియు ఇంకో పితరులు జన్మించిరి (48). వారందరు కాటుక పొడివలెనుండిరి. వారి నేత్రములు వికసించిన పద్మములవలె నుండెను. ఆ పుణ్యాత్ములు గొప్ప యతిశ్రేష్ఠులు. వారు సంసారమునందు విరక్తిగల మహానుభావులు (49). సహస్రాణాం చతుషృష్టి రగ్ని ష్వాత్తాః ప్రకీర్తితాః | షడశీతి సహస్రాణి తథా బర్హిషదో మునే || 50 ఘర్మాంభః పతితం భూమౌ తదా దక్షశరీరతః | సమస్త గుణ సంపన్నా తస్మా జ్ఞాతా వరాంగనా || 51 తన్వంగీ సమమధ్యా చ తనురోమావలీ శ్రుతా | మృద్వంగీ చారుదశనా నవకాంచన సుప్రభా || 52 సర్వావయవరమ్యా చ పూర్ణ చంద్రాననాంబుజా | నామ్నా రతిరితి ఖ్యాతా మునీనామపి మోహినీ || 53 ఓ మహర్షీ! అగ్ని ష్వాత్తుల సంఖ్య అరవై నాలుగు వేలు. బర్హిషదుల సంఖ్య ఎనభై ఆరు వేలు (50). అపుడు దక్షుని శరీరము నుండి చెమట నీరు భూమిపై బడెను. దాని నుండి సమస్తగుణములతో కూడిన ఒక శ్రేష్ఠయువతి జన్మించెను (51). ఆమె సుందరమగు అవయములను, సమమైన నడుమును, సన్నని రోమ పంక్తిని కలిగియుండెను. ఆమె అవయవములు మృదువుగా నుండెను. ఆమె దంతములు సుందరముగా నుండెను. ఆమె మెరుగుపెట్టిన బంగారము వలె కాంతులీనెను (52). ఆమె అన్ని అవయవముల యందు రమ్యముగా నుండెను. ఆమె ముఖము పున్నమి నాటి చంద్రుని బోలియుండెను. మునులను కూడ మోహింపజేయు ఆమెకు రతి యని పేరు (53). మరీచి ప్రముఖాష్షడ్వై నిగృహీతేంద్రియక్రియాః |ఋతేక్రతుం వసిష్ఠం చ పులస్త్యాంగిరసౌ తథా || 54 క్రత్వాదీనాం చతుర్ణాం చ బీజం భూమౌ పపాత చ | తేభ్యః పితృగణా జాతా అపరే మునిసత్తమ || 55 సోమపా ఆజ్యపా నామ్నా తధైవాన్యే సుకాలినః | హవిష్మంతస్సుతాస్సర్వే కవ్యవాహః ప్రకీర్తితః || 56 క్రతోస్తు సోమపాః పుత్రా వసిష్ఠాత్కాలినస్తథా | ఆజ్యపాఖ్యాః పులస్త్యస్య హవిష్మంతో ంగిరస్సుతాః || 57 క్రతు, వసిష్ఠ, పులస్త్య, అంగిరసులను మినహాయించి, మరీచి మొదలగు ఆర్గురు ఋషులు ఇంద్రియ వికారమును నిగ్రహించగల్గిరి.(54). క్రతువు మొదలగు ఆ నల్గురు ఋషుల బీజము భూమిపై పడెను. ఓమునిశ్రేష్ఠా! అపుడు మరికొందరు పితృగణములు జన్మించిరి (55). సోమపులు, ఆజ్యపులు, సుకాలులు, మరియు హవిష్మంతులని వారి పేర్లు. వీరందరికి హవిర్భాగములను (కవ్యము) అందజేయు అగ్ని కవ్యవాహుడనబడును (56).క్రతువు నుండి సోమపులు, వసిష్ఠుని నుండి కాలులు అను పుత్రులు జన్మించిరి. పులస్త్యుని సుతులు ఆజ్యపులనియు, అంగిరసుని సుతులు హవిష్మంతలనియు అనబడుదురు (57). జాతేషు తేషు విప్రేంద్ర అగ్ని ష్వాత్తాదికేష్వథ | లోకానాం పితృవర్గేషు కవ్యవాట్ స సమంతతః || 58 సంధ్యా పితృప్రసూర్భూత్వా తదుద్దేశయుతాs భవత్ | నిర్దోషా శంభు సందృష్టా ధర్మకర్మపరాయణా || 59 ఏతస్మిన్నంతరే శంభురనుగృహ్యాఖిలాన్ ద్విజాన్ | ధర్మం సంరక్ష్య విధివదంతర్ధానం గతో ద్రుతమ్ || 60 అథ శంకరవాక్యేన లజ్జితోsహం పితామహః | కందర్పాయాకోపితం హి భ్రుకుటీ కుటిలాననః || 61 ఓ విప్రశ్రేష్ఠా! అగ్ని ష్వాత్తులు మొదలగు ఈ పితృదేవతలు జన్మించగా, వారందరికి మానవులు సమర్పించే హవ్యములను సమర్పించు అగ్ని కవ్యవాట్ అయినాడు (58). బ్రహ్మ కుమార్తెయగు సంధ్య తండ్రి గుణములను పుణికి పుచ్చుకొనెను. శంభునిచే చూడబడిన ఆమె దోషములు లేనిదై, ధర్మ బద్ధమగు కర్మలయందు అభిరుచిగలదై యుండెను (59). ఇంతలో శంభుడు ఆ ఋషులనందరిని అనుగ్రహించి, ధర్మమును యథావిధిగా సంరక్షించి, వెంటనే అంతర్థానము జెందెను (60). అపుడు పితామహుడనగు నేను శంకరుని మాటలచే సిగ్గు చెందియుంటిని. మన్మథునిపై కోపము కలిగి నా కనుబొమలు ముడివడెను (61). దృష్ట్వా ముఖమభిప్రాయం విదిత్వా సోsపి మన్మథః | స్వబాణాన్ సంజహారాశు భీతః పశుపతేర్మునే || 62 తతః కోపసమాయుక్తః పద్మయోనిరహం మునే | అజ్వలం చాతిబలవాన్ దిధక్షురివ పావకః || 63 భవనేత్రాగ్ని నిర్దగ్ధః కందర్పో దర్పమోహితః | భవిష్యతి మహాదేవే కృత్వా కర్మ సుదుష్కరమ్ || 64 ఇతి వేధా స్త్వహం కామమక్షయం ద్విజసత్తమ | సమక్షం పితృసంఘస్య మునీనాం చ యతాత్మనామ్ || 65 ఇతి భీతో రతిపతిస్తత్ క్షణాత్త్యక్తమార్గణః | ప్రాదుర్బభూవ ప్రత్యక్షం శాపం శ్రుత్వాతి దారుణమ్ || 66 ఆ మన్మథుడు నా ముఖమును చూచి నా అభిప్రాయమును గ్రహించెను. ఓమునీ! ఆతడు శివునకు భయపడి వెంటనే తన బాణములనుపసంహరించెను (62). ఓ మహర్షీ! గొప్ప బలము గలవాడను, పద్మము నుండి పుట్టిన వాడను అగు నేను అప్పుడు కోపముతో నిండిన స్వరమును తగులబెట్టు అగ్నివలె మండి పడితిని (63). గర్వముచే మోహితుడై యున్న ఈ మన్మథుడు మహాదేవుని యందు చేయ శక్యము కాని కర్మను చేయబూని, ఆయన నేత్రము నుండి బయల్వెడలిన అగ్నిచే దహింపబడగలడు (64). ఓ ద్విజశ్రేష్ఠా! నేను ఈ తీరున, యతీశ్వరులగు మునులు, పితృదేవతలు చూచుచుండగా, కాముని శపించితిని (65). కాముడు భయపడి వెంటనే బాణములను ఆవల పారవేసి, అతి దారుణమగు ఈ శాపమును విన్న వెంటనే నా ఎదుట ప్రత్యక్షమాయెను (66). బ్రహ్మాణం మాముహచేదం సదక్షాదిసుతం మునే | శృణ్వతాం పితృసంఘానాం సంధ్యాయాశ్చ విగర్వధీః || 67 ఓ మహర్షీ! దక్షుడు మొదలగు కుమారులతో కూడియున్న బ్రహ్మతో (నాతో) గర్వము తొలగిన బుద్ధిగల కాముడు, పితృదేవతలు, సంధ్య వింటూ ఉండగా, ఇట్లు పలికెను (67). కామ ఉవాచ | కిమర్ధం భవతా బ్రహ్మన్ శప్తోహమతి దారుణమ్ |అనాగస్తవ లోకేశ న్యాయ్యమార్గనుసారిణః || 68 త్వయా చోక్తం ను మత్కర్మ యత్తద్బ్రహ్మన్ కృతం మయా | తత్ర యోగ్యోన శాపో మే యతో నాన్యత్ కృతం మయా 69 అహం విష్ణుస్తథా శంభుస్సర్వే త్వచ్ఛరగోచరాః |ఇతి యద్భవతా ప్రోక్తం తన్మయాపి పరీక్షితమ్ || 70 నాపరాధో మమాప్యత్ర బ్రహ్మన్మయి నిరాగసి | దారుణస్సమయశ్చైవ శాపో దేవ జగత్పతే || 71 ఓ బ్రహ్మా! నీవు నన్ను మిక్కిలి దారుణముగా శపించుటకు కారణమేమి ? ఓ లోక ప్రభూ! నీవు చేయు పనులు పాపరహితములు, న్యాయ్యామార్గమును అనుసరించునవి అయి ఉండును (68). నేను చేయవలసిన పనిని నీవు నిర్దేశించితివి. ఏ బ్రహ్మా! నేను దానినే చేసితిని. ఆ విషయములో నాకు శాపము నీయదగదు. నేను నీవు చెప్పిన దానికంటె భిన్నమగు పనిని చేయలేదు (69). నేను, విష్ణువు, శంభుడు, అందరు నీ బాణములకు వశులగుదురు అని నీవు చెప్పిన మాటను మాత్రమే నేను పరీక్షించితిని (70). ఓ బ్రహ్మా! దీనిలో నా అపరాధము లేదు. ఓ దేవా! జగత్ర్పభూ! తప్పును చేయని నాకు దారుణమగు శాపమునిచ్చితివి (71). బ్రహ్మో వాచ | ఇతి తస్య వచశ్ర్శుత్వా బ్రహ్మాహం జగతాం పతిః| ప్రత్యవోచం యతాత్మనం మదనం దమయన్ముహుః || 72 ఆత్మజా మమ సంధ్యేయం యస్మాదేతత్స కామతః | లక్ష్మీకృతోSహం భవతా తతశ్శాపో మయా కృతః || 73 అధునా శాంతరోషోsహం త్వాం వదామి మనోభవ | శృణుష్వ గత సందేహస్సుఖీ భవ భయం త్య జ || 74 త్వం భస్మ భూత్వా మదన భర్గలోచన వహ్నినా | తథైవాశు సమం పశ్చా చ్ఛరీరం ప్రాపయిష్యతి || 75 యదా కరిష్యతి హరోంజసా దారపరిగ్రహమ్ | తదా స ఏవ భవతశ్శరీరం ప్రాపయిష్యతి || 76 బ్రహ్మ ఇట్లు పలికెను - మన్మథుని ఈ మాటలను విని, జగత్ర్పభువు బ్రహ్మ అగు నేను ఆత్మ నియంత్రణము గల మన్మథుని అనేక పర్యాయములు నిగ్రహించి ఇట్లు బదులిడితిని (72). ఈ సంధ్య నాకు కుమార్తె. నేను ఈమె యందు కామవికారమును పొందునట్లు నీవు నన్ను నీ బాణములకు లక్ష్యము చేసితివి. అందువలననే , నేను శాపమునిచ్చితిని (73). ఇపుడు నా కోపము తగ్గినది. ఓ మన్మథా! నేను చెప్పు మాటలను వినుము. నీ సందేహములు తొలగును. నీవు సుఖివి కమ్ము. భయమును వీడుము (74). మన్మథా! శివుని నేత్రము నుండి వచ్చిన అగ్ని నిన్ను భస్మము చేయును. ఆ తరువాత నీవు శీఘ్రముగా మరల శరీరమును పొందగలవు (75). శివుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించి, ఆయనయే నీకు శరీరము కలుగునట్లు చేయగలడు (76). ఏవ ముక్త్వాథ మదనమహం లోకపితామహః | అంతర్దధే మునీంద్రాణాం మానసానాం ప్రపశ్యతామ్ || 77 ఇత్యేవం మే వచశ్ర్శుత్వా మదనస్తేSపి మానసాః | సంబభూవుస్సుతాస్సర్వే సుఖినోsరం గృహం గతాః || 78 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామశాపానుగ్రహో నామ తృతీయోsధ్యాయః (3). లోకపితామహుడనగు నేను మునీశ్వరులు, మానసపుత్రులు చూచుచుండగా, ఇట్లు పలికి అంతర్ధానమును చెందితిని (77). ఈ నామాటలను విని, మన్మథుడు, మరియు మానసపుత్రులు అందరు సుఖమును పొంది, శీఘ్రమే గృహములకు వెడలిరి (78). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో కామశాపానుగ్రహములనే మూడవ అధ్యాయము ముగిసినది (3).