Sri Sivamahapuranamu-I
Chapters
అథ చతుర్థోsధ్యాయః కామ వివాహము నారద ఉవాచ | విష్ణుశిష్య మహాప్రాజ్ఞ విధే లోకకర ప్రభో | అద్భుతేయం కథా ప్రోక్తా శివలీలామృతాన్వితా ||
1 తతః కిమభవత్తాత చరితం తద్వదాధునా | అహం శ్రద్ధాన్విత శ్ర్శోతుం యది శంభుకథాశ్రయమ్ ||
2 నారదుడిట్లు పలికెను - ఓ విష్ణుశిష్యా! నీవు గొప్ప ప్రాజ్ఞుడవు. హే విధే! నీవు లోకములను సృష్టించితివి. హే ప్రభో! శివుని లీలలు అనే అమృతముతో కూడిన ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1). తండ్రీ! ఆతరువాత ఏమైనది? ఆ వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము. నేను శంభుని గాథను వినుటయందు శ్రద్ధ గల వాడను (2). బ్రహ్మోవాచ | శంభౌ గతే నిజస్థానే వేధస్యంతర్హితే మయి | దక్షః ప్రాహాథ కందర్పం సంస్మరన్ మమ తద్వచః || 3 బ్రహ్మ ఇట్లు పలికెను - శంభుడు తన స్థానమునకు వెళ్లెను. బ్రహ్మనగు నేను అంతర్థానము చెందితిని. అపుడు దక్షుడు నా ఆ మాటను స్మరించుచూ, మన్మథునితో నిట్లనెను (3). దక్ష ఉవాచ | మద్దేహజేయం కందర్ప సద్రూపగుణసంయుతా | ఏనాం గృహ్ణీష్వ భార్యార్థం భవతస్సదృశీం గుణౖః || 4 ఏషా తవ మహాతేజా స్సర్వదా సహచారిణీ | భవిష్యతి యథాకామం ధర్మతో వశవర్తినీ || 5 దక్షుడిట్లు పలికెను - ఓ మన్మథా! ఈమె నా దేహమునుండి పుట్టినది. మంచి రూపము, గుణములు కలది. ఈమె గుణములలో నీకు తగినది. ఈమెను భార్యగా స్వీకరింపుము (4). గొప్ప తేజస్వినియగు ఈమె సదా నీకు తోడుగా నుండును. ఈమె నిన్ను ప్రేమించును. నీకు అనుకూలముగా నుండి ధర్మమును పాలించగలదు (5). బ్రహ్మో వాచ | ఇత్యుక్త్వా ప్రదదౌ తసై#్మ దేహ స్వేదాంబుసంభవామ్ | కందర్పాయాగ్రతః కృత్వా నామ కృత్వా రతీతి తామ్ || 6 విహహ్య తాం స్మరస్సోsపి ముమోదాతీవ నారద | దక్షజాం తనయాం రమ్యాం మునీనామపి మోహినీమ్ || 7 అథ తాం వీక్ష్య మదనో రత్యాఖ్యాం స్వస్త్రియం శుభామ్ | ఆత్మా గుణన విద్దోసౌ ముమోహ రతిరంజితః || 8 క్షణ ప్రదాsభవత్కాంతా గౌరీ మృగదృశీ ముదా | లోలాపాంగ్యథ తసై#్యవ భార్యా చ సదృశీ రతౌ || 9 బ్రహ్మ ఇట్లు పలికెను - దక్షుడు ఇట్లు పలికి తన దేహము యొక్క చెమటనుండి పుట్టిన ఆమెకు రతియను నామకరణము చేసి ఆమెను కందర్పుని ఎదుట నిలిపి సమర్పించెను (6). ఓ నారదా! సుందరి, మునులను కూడ మోహింపజేయునది అగు ఆ దక్షపుత్రిని వివాహమాడి మన్మథుడు మిక్కిలి ఆనందించెను (7). అపుడు మన్మథుడు రతి అనే శోభాయుక్తమగు తన భార్యను చూచి, అనురాగముచే నిండిన మనస్సు గలవాడై, తన బాణములచే తానే కొట్టబడినవాడై, మోహమును పొందెను (8). గౌరవర్ణము గలది, లేడికన్నులు గలది, చంచలమగు ఓర చూపులు గలది, సుందరి అగు ఆ మన్మథుని భార్య అతనితో సమమైన అనురాగము గలదియై, అతనికి ఉత్సవమును కలిగించెను (9). తస్యా భ్రూయుగలం వీక్ష్య సంశయం మదనోsకరోత్ | ఉత్సాదనం మత్కోదండం విధాత్రాస్యాం నివేశితమ్ || 10 కటాక్షాణా మాశుగతిం దృష్ట్వా తస్యా ద్విజోత్తమ | ఆశు గంతుం నిజాస్త్రాణాం శ్రద్దధేన చచారుతామ్ || 11 తస్యాస్స్వభావ సురభి ధీర శ్వాసానిలం తథా | ఆఘ్రాయ మదనశ్శద్ధాం త్యక్తవాన్మలయాంతికే || 12 పూర్ణేందు సదృశం వక్త్రం దృష్ట్వా లక్ష్మ సులక్షితమ్ | న నిశ్చికాయ మదనో భేదం తన్ముఖ చంద్రయోః || 13 ఆమె కను బొమలను చూచి, ' బ్రహ్మ నా ధనస్సును లాగుకొని ఈమె కనుబొమలను మలచినాడా యేమి?' అని మన్మథుడు సందేహపడెను (10). ఓ ద్విజశ్రేష్ఠా! ఆతడు ఆమె యొక్క వేగము గల చూపులను పరికించి, తన అస్త్రముల యందు శ్రద్ధను శీఘ్రమే కోల్పోయెను. ఆమె ఇతర సౌందర్యమునైననూ ఆతడు పరికించలేదు (11). స్వభావ సిద్ధముగా పరిమళముగల ఆమె యొక్క నిటారైన శ్వాస వాయువును ఆఘ్రాణించి మన్మథుడు మలయమారుతమునందు విశ్వాసమును విడిచిపెట్టెను (12). పూర్ణిమనాటి చంద్రుని బోలియున్న, చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖమును చూచి, మన్మథుడు ఆమె ముఖమునకు, చంద్రునకు గల భేదమును ఎరుంగలేపోయెను (13). సువర్ణ పద్మకలికాతుల్యం తస్యాః కుచద్వయమ్ | రేజే చూచుకయుగ్మేన భ్రమరేణవ వేష్టితమ్ || 14 దృఢీపీనోన్నతం తస్యాస్త్సనమధ్యం విలంచినీమ్ | ఆనాభి ప్రతలం మాలాం తన్వీం చంద్రాయితాం శుభమ్ || 15 జ్యాం పుష్పధనుషః కామః షట్పదావలి సంభ్రమామ్ | విసస్మార చ యస్మాత్తాం విసృజ్యైనాం నిరీక్షతే || 16 గంభీరనాభి రంధ్రాంతశ్చతుః పార్శ్వత్వగావృతమ్ | ఆననాబ్జేsక్షణద్వంద్వ మారక్తక ఫలం యథా || 17 బంగరుపద్మముల మొగ్గలవంటి ఆమె కుచ ద్వయము భ్రమరములు వాలినవా యన్నట్లున్న చూచుకములతో ప్రకాశించెను (14). దృఢముగా బలిసి ఎత్తుగా నున్న ఆమె స్తనముల మధ్యలో నాభి గహ్వరము వరకు వెన్నెల వలె తెల్లనైన సన్నని మాల వ్రేలాడుచుండెను. శుభకరమగు (15) ఆ మాలను నిరీక్షించుచూ, మన్మథుడు తుమ్మెదల పంక్తిచే నిర్మితమై అల్లకల్లోలముగా నున్న పుష్పధనుస్సు యొక్క నారిత్రాటిని మరిచిపోయెను (16). అన్ని వైపుల మృదువగు చర్మముచే ఆవరింపబడియున్న నాభీరంధ్రములోతుగనున్నది. పద్మము వంటి ఆమె ముఖమునందలి రెండు కన్నులు ఎర్రని ఫలముల వలె ప్రకాశించుచున్నవి (17). క్షీణాం మధ్యేన వపుషా నిసర్గాష్టాపదప్రభా | రుక్మవేదీవ దదృశే కామేన రమణీ హి సా || 18 రంభా స్తంభాయతం స్నిగ్ధం యదూరు యుగలం మృదు | నిజశక్తి సమం కామో వీక్షాం చ క్రే మనోహరమ్ || 19 ఆరక్త పార్ష్ణి పాదాగ్ర ప్రాంతభాగం పదద్వయమ్ | అను రాగమివానేన మిత్రం తస్యా మనోభవః || 20 తస్యాః కరయుగం రక్తం నఖరైః కింశుకోపమైః | వృత్తాభిరంగులీభిశ్చ సూక్ష్మా గ్రా భిర్మనోహరమ్ || 21 సన్నని నడుము గలది, సహజముగా బంగరు వన్నె గలది అగు ఆ రమణి మన్మథునకు బంగరు వేదిక వలె కన్పట్టెను (18). అరటి బోదెల వలె పొడవైనది, స్నిగ్ధమృదు మనోహరము అగు ఆమె యొక్క ఊరు ద్వంద్వమును చూచి మన్మథుడు తన సమ్మోహనశక్తితో సమమైనదిగా భావించెను (19). ఆమె రెండు పాదముల అగ్రములు, మధ్య భాగము, మడమలు మిక్కిలి ఎర్రగా నుండి, ఆమెకు ప్రియుడగు మన్మథుని యందు గల అనురాగము వాటి యందు ప్రకటమైనదా అన్నట్లుండెను (20). ఆమె చేతులు ఎర్రగా నుండి, చిగుళ్లవంటి గోళ్లతో, గుండ్రని సన్నని అగ్రములు గల వ్రేళ్లతో మనోహరముగా నుండెను (21). తద్బాహుయుగలం కాంతం మృణాల యుగలాయతమ్ | మృదు స్నిగ్ధం చిరం రాజాత్కాంతి లోహ ప్రవాలవత్ || 22 నీల నీరద సంకాశః కేశపాశో మనోహరః | చమరీ వాలభరవద్విభాతి స్మ స్మరప్రియః || 23 ఏతా దృశీం రతిం నామ్నా ప్రాలేయాద్రి సముద్భవామ్ | గంగామివ మహాదేవో జగ్రా హోత్ఫుల్ల లోచనః || 24 చక్రపద్మాం చారు బాహు మృణాల శకలాన్వితామ్ | భ్రూయుగ్మ విభ్రమవ్రాత తనూర్మి పరిరాజితామ్ || 25 సుందరములు, మృదువైనవి, సిగ్ధమైనవి అగు ఆమె బాహువులు తామర తూడుల వలె పొడవుగా నుండి బంగారు వన్నెతో పగడముల కాంతులతో అతిశయించి ప్రకాశించెను (22).నల్లని మేఘముల వలె మనస్సును హరించే ఆమె కేశపాశము చమరీమృగము యొక్క గుబురైన తోకవలె భాసించెను (23). వికసించిన నేత్రములు గల మన్మథుడు ఆ రతీ దేవిని, మహాదేవుడు హిమవత్పర్వతమునుండి పుట్టిన గంగను స్వీకరించెను (24). ఆమె స్తనములనే పద్మములు కలిగినది, సుందర బాహువులనే తామరతూడులు గలది, కనుబొమల విరుపుల వరుసలనే పిల్ల కెరటములతో ప్రకాశించునది అగు సరస్సువలె విరాజిల్లెను (25). కటాక్ష పాత తుంగౌఘాం స్వీయ నేత్రోత్పలాన్వితామ్ | తనులోమాంబు శైవాలాం మనోద్రుమవిలాసినీమ్ || 26 నిమ్న నాభిహ్రదాం క్షామాం సర్వాంగరమణీయకామ్ | సర్వలావణ్యసదనాం శోభమానాం రమామివ || 27 ద్వాదశాభరణౖ ర్యుక్తాం శృంగారైష్షోడశైర్యుతామ్ | మోహినీం సర్వలోకానాం భాసయంతీం దిశో దశ || 28 ఇతి తాం మదనో వీక్ష్య రతిం జగ్రాహ సోత్సుకః | రాగాదుపస్థితాం లక్ష్మీం హృషీ కేశ ఇవోత్తమామ్ || 29 ఆమె వాడి చూపులనే గొప్ప ప్రవాహము గలది, నేత్రములనే నల్ల కలువలు గలది, సన్నని రోమావళి అనే నీటినాచు, గలది, మనోవృత్తులనే వృక్షములతో (ఒడ్డుపై నున్నవి) ప్రకాశించునది (26). తోతైన నాభి అనే సరస్సు గలది అగు నది వలె ప్రకాశించెను. సన్నని ఆ యువతి సర్వావయములయందు రమణీయముగా నుండెను. లావణ్యము ఆమె యందు నివాసముండెను. ఆమె లక్ష్మివలె ప్రకాశించెను (27). పన్నెండు ఆ భరణములను ధరించి, పదునారు అలంకారములను చేసుకొని, సర్వలోకములను మోహింపజేయుచూ, పది దిక్కులను ప్రకాశింపజేయుచున్న (28) ఆ రతిని చూచి, ప్రేమతో దగ్గరకు వచ్చి ఉత్తమమగు లక్ష్మిని విష్ణువు వలె, మన్మథుడు ఆమెను ఉత్సాహముతో స్వీకరించెను (29). నోవాచ చ తదా దక్షం కామో మోద భవాత్తతః | విస్మృత్య దారుణం శాపం విధిదత్తం విమోహితః || 30 తదా మహోత్సవస్తాత బభూవ సుఖ వర్ధనః | దక్షః ప్రీత తరశ్చాసీన్ముముదే తనయా మమ || 31 కామోsతీవ సుఖం ప్రాప్య సర్వదుఃఖ క్షయం గతః | దక్షజాపి రతిః కామం ప్రాప్య చాపి జహర్ష హ || 32 రరాజ చ తయా సార్ధం భిన్న శ్చారు వచస్స్మరః | జీమూత ఇవ సంధ్యాయాం సౌదామిన్యా మనోజ్ఞయా || 33 ఇతి రతి పతిరుచ్చై ర్మోహయుక్తో రతిం తాం హృదుపరి జగృహే వై యోగ దర్శీవ విద్యామ్ | రతిరపి పతిమగ్య్రం ప్రాప్య సా చాపి రేజే హరిమివ కమలా వై పూర్ణ చంద్రో పమాస్యా || 34 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామవివాహవర్ణనం నా మ చతుర్థోsధ్యాయః (4). అపుడు మిక్కిలి మోహితుడై యున్న మన్మథుడు బ్రహ్మచే ఈయబడిన దారుణమగు శాపమును ఆనందములో నుండుటచే మరచి, దక్షునితో చెప్పలేదు (30). వత్సా! అపుడు సుఖమును వర్ధిల్ల జేయు మహోత్సవము ప్రవర్తిల్లెను. తన కుమార్తె యొక్క ఆనందమును చూచి, దక్షుడు మిక్కిలి సంతసిల్లెను (31). కాముడు మిక్లిలి సుఖమును పొందెను. ఆతని దుఃఖములన్నియూ తొలగిపోయెను. దక్షుని కుమార్తె యగు రతి కూడ కాముని పొంది ఆనందించెను (32). సుందరముగా మాటలాడు మన్మథుడు ఆమె గూడి, సంధ్యాకాలమునందు సుందరమగు మెరపుతో గూడిన మేఘము వలె ప్రకాశించెను (33). మిక్కిలి మోహముతో కూడిన మన్మథుడు రతిని, యోగి ఆత్మ విద్యను వలె, హృదయసింహాసనమునందధిష్ఠింప జేసెను. పూర్ణచంద్రుని వంటి ముఖము గల లక్ష్మి హరిని వలె, రతి గొప్ప భర్తను పొంది మిక్కిలి ప్రకాశించెను (34). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు రెండవది యగు సతీఖండములో కామ వివాహ వర్ణనమనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).