Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచమోsధ్యాయః సంధ్య యొక్క చరిత్ర సూత ఉవాచ | ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః | స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః ||
1 సూతుడిట్లు పలికెను - మునిశ్రేష్ఠుడగు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని, సంతసించిన మనస్సు గలవాడై, శంకరుని స్మరించి ఆనందముతో నిట్లనెను (1). నారద ఉవాచ | బ్రహ్మన్ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే | అద్భుతా కథితా లీలా త్వయా చ శశిమౌలినః ||
2 గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే | దక్షే చ స్వగృహం యాతే తథా హి త్వయి కర్తరి ||
3 మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు | సంధ్యా కుత్ర గతా సా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః ||
4 కిం చకార చ కేనైవ పురుషేణ వివాహితా | ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద || 5 నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! విష్ణుశిష్యా! మహాప్రాజ్ఞా! నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి (2). మన్మథుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్లగా, దక్షుడు తన గృహమును చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడ గృహమును పొందగా (3), మానసపుత్రులు కూడ తమ తమ ధామములకు చేరుకొనగా, బ్రహ్మ పుత్రి, పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచటకు వెళ్లెను ? (4) ఆమె ఏమి చేసెను? ఏ పురుషుని వివాహమాడెను? నీవు సంధ్య యొక్క చరిత్ర నంతనూ విస్తారముగా చెప్పుము (5). సూత ఉవాచ | ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మ పుత్రస్య ధీమతః | సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్త్వవిత్ || 6 సూతుడిట్లు పలికెను - బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడునగు ఆ నారదుని మాటను విని, తత్త్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను (6) బ్రహ్మో వాచ | శృణు త్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభమ్ | యచ్ఛృత్వా సర్వకామిన్య స్సాధ్వ్యస్స్యు స్సర్వదా మునే || 7 సా చ సంధ్యా సుతా మే హి మనో జాతా పురాs భవత్ | తపస్తప్త్వా తనుం త్యక్త్వా సైవ జాతా త్వరుంధతీ || 8 మేధాతి థేస్సుతా భూత్వా మునిశ్రేష్ఠస్య ధీమతీ | బ్రహ్మ విష్ణు మహేశాన వచనా చ్చరితవ్రతా || 9 వవ్రే పతిం మహాత్మానం వసిష్ఠం శంసితవ్రతమ్ | పతివ్రతా చ ముఖ్యా భూద్వంద్యా పూజ్యా త్వభీషణా || 10 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ మునీ! దీనిని ఎల్లవేళలా వినే స్త్రీ లందరు సాధ్వీమణులగుదురు (7). ఆ సంధ్య ముందుగా నాకు కుమారైయై పుట్టెను. ఆమె తపస్సును చేసి, శరీరమును వీడి అరుంధతియై జన్మించెను (8). బుద్ధి మంతురాలగు ఆమె గొప్ప ముని యగు మేథా తిథికి కుమారైయై జన్మించెను. గొప్ప నిష్ఠ గల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే (9) మహాత్ముడు, ప్రశంసింపదగిన తపోనిష్ఠుడునగు వసిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కిరింపదగిన పూజ్యురాలు అయెను (10). నారద ఉవాచ | కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా | కథం శరీరం సా త్యక్త్వాsభవన్మేధాతిథే స్సుతా || 11 కథం వా విహితం దేవైర్బ్రహ్మ విష్ణు శివైః పతిమ్ | వసిష్ఠం తు మహాత్మానం సంవవ్రే శంసిత వ్రతమ్ || 12 ఏతన్మే శ్రోష్యమాణాయ విస్తరేణ పితామహ | కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్త్వతః || 13 నారదుడిట్లు పలికెను - ఆ సంధ్య తపస్సును ఎచట, ఎందుకొరకు, ఎట్లు చేసెను? ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెను? (11) బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు, ప్రశంసింపదగిన తపో నిష్ఠ గలవాడు, మహాత్ముడు అగు వసిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను? (12) ఓ పితామహా! నేను ఈ అరుంధతీ చరిత్రను విన గోరుచున్నాను ఉత్కంఠ గల నాకు ఈ చరిత్రసారమును విస్తరముగా చెప్పుము (13). బ్రహ్మో వాచ | అహం స్వతనయాం సంధ్యాం దృష్ట్వా పూర్వమథాత్మనః | కామాయాశు మనోsకార్షం త్యక్తా శివ భయాచ్చ సా || 14 సంధ్యా యాశ్చలితం చిత్తం కామబాణ విలోడితమ్ | ఋషీణామపి సంరుద్ధ మానసానాం మహాత్మనామ్ || 15 భర్గస్య వచనం శ్రుత్వా సోపహాసం చ మాం ప్రతి | ఆత్మనశ్చలితత్వం వై హ్యమర్యాదమృషీన్ ప్రతి || 16 కామస్య తా దృశం భావం మునిమోహకరం ముహుః | దృష్ట్వా సంధ్యా స్వయం తత్రోపయమా యాతి దుఃఖితా || 17 బ్రహ్మ ఇట్లు పలికెను - పూర్వము నేను నాకుమార్తె యగు సంధ్యను చూచి వెంటనే ఆమెను కామించితిని. కాని శివుని భయము వలన అధర్మమును వీడితిని (14). మన్మథుడు బాణములచే ప్రహారము చేయగా, సంధ్య యొక్క మనస్సు చలించెను. మనోనిగ్రహము గలవారు, మహాత్ములునగు ఋషులకు కూడ మనో వికారము కలిగెను (15). శివడు నాతో పరిహాస పూర్వకముగా పలికిన మాటలను సంధ్య విన్నది. తాను పొందిన మనోవికారమును, ఋషుల విషయములో జరిగిన అమర్యాదను కన్నది (16). మునులకు కూడా మోహమును కలిగించే కాముని సామర్థ్యమును పరిశీలించినది. ఆమె మిక్కిలి దుఃఖితురాలై అచట నుండి వెళ్లిపోయెను (17). తతస్తు బ్రహ్మణా శ##ప్తే మదనే చ మయా మునే | అంతర్భూతే మయి శివే గతే చాపి నిజాస్పదే || 18 అమర్ష వశమా పన్నా సా సంధ్యా మునిసత్తమ | మమ పుత్రీ విచార్యైవం తదా ధ్యాన పరాsభవత్ || 19 ధ్యాయంతీ క్షణమేవాశు పూర్వం వృత్తం మనస్వినీ | ఇదం విమమృశే సంధ్యా తస్మిన్ కాలే యథోచితమ్ || 20 ఓ మహర్షీ! నేను మన్మథుని శపించి అంతర్ధానమైతిని. శివుడు తన ధామకు వెళ్లెను (18). ఓ మహర్షీ! ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును సహించలేక పోయెను. నా కుమారైయగు సంధ్య అపుడు ఇట్లు తలపోసి, ధ్యానమగ్నురాలు అయెను (19). అభిమానవతియగు ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును ధ్యానము చేయు చున్నదై, ఆ కాలమునకు ఉచితమగు విధానములో, ఇట్లు విమర్శ చేసుకొనెను (20). సంధ్యో వాచ | ఉత్పన్న మాత్రాం మాం దృష్ట్వా యువతిం మదనేరితః | అకార్షీత్సాను రాగోsయమభిలాషం పితా మమ || 21 పశ్యతాం మానసానాం చ మునీనాం భావితాత్మనామ్ | దృష్ట్వై వ మామమర్యాదం సకామమభవన్మనః || 22 మమాపి మథితం చిత్తం మదనేన దురాత్మనా | యేన దృష్ట్వా మునీన్ సర్వాంశ్చ లితం మన్మనో భృశమ్ || 23 ఫలమేతస్య పాపస్య మదనస్స్వయమాప్తవాన్ | యస్తం శశాప కుపితః శంభోరగ్రే పితామహః || 24 సంధ్య ఇట్లు పలికెను - నేను యువతిగా జన్మించిన మరుక్షణములో, మన్మథునిచే ప్రేరితుడైన నా తండ్రి నన్ను మన్మథ వికారముతో కామించెను (21). మానసపుత్రులు, అంతః కరణ శుద్ధి గల మునులు చూచుచుండగా ఆయన నన్ను మర్యాద లేని విధముగా చూచి, మనస్సులో కామనను పొందినాడు (22). దుర్మార్గుడగు మన్మథుడు నా మనస్సును కూడ కల్లోల పెట్టగా , ఆ మునుల నందరినీ చూచుచున్న నా మనస్సు మిక్లిలి చలించెను (23). ఈ పాపమునుకు ఫలమును మన్మథుడు పొందినాడు. శంభుని యెదుట పితామహుడు కోపించి వానిని శపించినాడు (24). ప్రాప్నుయాం ఫలమేతస్య పాపస్య స్వఘ కారిణీ | తచ్ఛోధన ఫలమహా మాశు చే చ్ఛామి సాధనమ్ || 25 యున్మాం పితా భ్రాతరశ్చ సకామమపరోక్షతః | దృష్ట్వా చక్రుః స్పృహాం తస్మాన్న మత్తః పాపకృత్పరా || 26 మమాపి కామభావోsభూ దమర్యాదం సమీక్ష్యతాన్ | పత్యా ఇవ స్వకే తాతే సర్వేషు సహజేష్వపి || 27 కరిష్యామ్యస్య పాపస్య ప్రాయశ్చిత్తమహం స్వయమ్ | ఆత్మాన మగ్నౌ హోష్యామి వేదమార్గానుసారతః || 28 ఈ పాపమును చేసిన నేను కూడా ఈ పాపఫలమును పొందగలను. కాని నేను వెంటనే ఆ పాపమును క్షాళన చేయగలిగే సాధనమును స్వీకరించ గోరు చున్నాను (25). నన్ను ప్రత్యక్షముగా చూచిన నా తండ్రి, మరియు సోదరులు కామ వికారములను పొంది నారంటే, నాకంటె పెద్ద పాపాత్మురాలు ఉండబోదు (26). మర్యాద లేకుండగా నాతండ్రిని, సోదరులనందరినీ చూచిన నాకు కూడా కామభావము అంకురించెను (27). నేను ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును స్వయముగా చేసుకొనగలను. నేను వేద ధర్మముననుసరించి నా దేహమును అగ్నిలో హోముము చేయగలను (28). కిం త్వేకాం స్థాపయిష్యామి మర్యాదామిహ భూతలే | ఉత్పన్న మాత్రాన యథా సకామమాస్స్యుశ్శరీరిణః || 29 ఏతదర్థ మహం కృత్వా తపః పరమ దారుణమ్ | మర్యాదాం స్థాపయిష్యామి పశ్చాత్త్యక్ష్యామి జీవితమ్ || 30 యస్మిన్ శరీరే పిత్రా మే హ్యభిలాషస్స్వయం కృతః | భ్రాతృభిస్తేన కాయేన కించిన్నాస్తి ప్రయోజనమ్ || 31 మయా యేన శరీరేణ తాతే చ సహజేషు చ |ఉద్భావితః కామభావో న తత్సు కృత సాధనమ్ || 32 అట్లు చేసి నేను ఈ భూమండలమునందు ఒక మర్యాదను స్థాపించగలను. అది యేదన, మానవులు పుట్టుకతోడనే కామవికారములను పొందకుందురు గాక! (29). దీని కొరకై నేను పరమ ఉగ్ర తపస్సును చేసి, తరువాత ప్రాణములను విడిచి, మర్యాదను నెలకొల్పగలను (30). ఏ శరీరమునందు నా తండ్రి, మరియు సోదరులు స్వయముగా కామ వికారమును ప్రదర్శించినారో, అట్టి ఈ శరీరముతో నాకు ప్రయోజనము లేశ##మైననూ లేదు (31). ఏ శరీరముచే నేను తండ్రి యందు సోదరులయందు కామ వికారమును ఉద్బుద్ధము చేసితినో, ఆ ఈ శరీరము ధర్మసాధనము కాజాలదు (32). ఇతి సంచింత్య మసా సంధ్యా శైలవరం తతః | జగామ చంద్రభాగాఖ్యం చంద్రభాగాపగా యతః || 33 అథ తత్ర గతాం జ్ఞాత్వా సంధ్యాం గిరివరం ప్రతి | తపసే నియాతాత్మానం బ్రహ్మావోచ మహం సుతమ్ || 34 వశిష్ఠం సంయతాత్మనం సర్వజ్ఞం జ్ఞానయోగినమ్ | సమీపే స్వే సమాసీనం వేద వేదాంగ పారగమ్ || 35 సంధ్య ఇట్లు తలపోసి, తరువాత చంద్ర భాగానదీ తీరము నందు గల చంద్ర భాగపర్వతమునకు వెళ్లెను (33). అపుడు బ్రహ్మనగు నేను, సంధ్య తపస్సు కొరకు ఆ పర్వత రాజమునకు వెళ్లినదని యెరింగి, నాకుమారుడు (34), ఇంద్రియనిగ్రహము గల వాడు, సర్వజ్ఞుడు, జ్ఞాన యోగి, వేదవేదాంగముల పారమును చూచిన జ్ఞాని యగు వసిష్ఠుని దగ్గర కూర్చుండ బెట్టుకొని, ఇట్లు పలికితిని (35). బ్రహ్మో వాచ | వసిష్ఠ పుత్ర గచ్ఛ త్వం సంధ్యాం జాతాం మనస్వినీమ్ |తపసే ధృతకామాం చ దీక్షసై#్వనాం యథా విధి || 36 మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వై వ కాముకాన్ | యుష్మాన్మాం చ తథాత్మానం సకామాం మునిసత్తమ || 37 అభూత పూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యసా | యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్ సంత్యక్తుమిచ్ఛతి || 38 సమర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి | తపః కర్తుం గతా సాధ్వీ చంద్ర భాగాఖ్య భూధరే || 39 న భావం తపసస్తాత సానుజానాతి కంచన | తస్మాద్య థోపదేశాత్సా ప్రాప్నోత్విష్టం తథా కురు || 40 బ్రహ్మ ఇట్లు పలికెను - పుత్రా! వసిష్టా! అభిమానవతియగు నాకుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్లుము. ఆమె తపస్సును చేయగోరు చున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము (36). ఓ మహర్షీ! నన్ను, మిమ్ములను కామ వికారముతో కూడి యుండగా పూర్వము ఆమె చూచి, తాను కూడ కామ వికారమును పొందుటను గాంచి, చాల సిగ్గుపడెను (37). నా యొక్క, మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని, పాప భావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి, ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది (38). ఆమె తపస్సుచే లోకములయందు మర్యాదను నెలగొల్ప గలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్ర భాగ పర్వతమునకు వెళ్లినది (39). వత్సా! ఆమెకు తపస్సు ను గురించి ఏమియూ తెలియదు కావున, నీవు ఆమెకు ఉపదేశించి, ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము (40). ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే . పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్ || 41 ఇదం స్వరూపం భవతో దృష్ట్వా పూర్వం యథాత్ర వామ్ | నాప్నుయాత్సాథ కించిద్వై తతో రూపాంతరం కురు || 42 నారదేత్థం వసిష్టో మే సమాజ్ఞప్తో దయావతా |తథాస్త్వితి చ మాం ప్రోచ్య య¸° సంధ్యాంతికం మునిః || 43 తత్ర దేవ సరః పూర్ణం గుణౖర్మానస సంమితమ్ | దదర్శ స వసిష్ఠోsథ సంధ్యాం తత్తీరగామపి || 44 ఓ మహర్షీ! ఈ నీ నిజరూపమును వీడి, మరియొక రూపమును స్వీకరించి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేయు తపస్సును పరిశీలించుము (41). ఆమె నిన్ను ఇచట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో, ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము (42). ఓ నారదా! నేను ఈ తీరున వసిష్ఠుని దయా బుద్ధితో ఆజ్ఞాపించితిని . ఆయన ' అటులనే యగుగాక' అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్లెను (43). ఆ వసిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధములా మానససరోవరమును పోలియున్న దేవరస్సును, దాని తీరమునందున్న సంధ్యను చూచెను (44). తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్జ్వలమ్ | ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా || 45 మునిర్దృష్ట్వాథ తత్ర సుసంభావం స కౌతుకీ | వీక్షాంచక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకమ్ || 46 చంద్రభాగా నదీ తస్మా త్ర్పాకారాద్దక్షిణాంబుధిమ్ | యాంతీ సా చైవ దదృశే తేన సాను గిరేర్మహత్ || 47 నిర్భిద్య పశ్చిమం సా తు చంద్ర భాగస్య సా నదీ | యథా హిమవతో గంగా తథా గచ్ఛతి సాగరమ్ || 48 ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు, ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్జ్వలముగా ప్రకాశించెను (45). వసిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెనచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరు గల ఆ సరస్సును చూచెను (46). ప్రాకారము వలెనున్న ఆ పర్వతమునుండి దక్షిణ సముద్రము వరకు వ్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆనది ఆ పర్వతము యొక్క గొప్ప సానువును (47)భేదించుకొని, పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగవలె ఆనది శోభిల్లెను (48). తస్మిన్ గిరౌ చంద్రభాగే బృహల్లోహితతీరగామ్ | సంధ్యాం దృష్ట్వాథ పప్రచ్ఛ వసిష్ఠస్సాదరం తదా || 49 అపుడు ఆ చంద్ర భాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరము నందున్న సంధ్యను చూచి, వసిష్ఠుడు ఆ దరముతో నిట్లు ప్రశ్నించెను (49). వశిష్ఠ ఉవాచ | కిమర్థ మాగతా భ##ద్రే నిర్జనం త్వం మహీధరమ్ | కస్య వా తనయా కిం వా భవత్యాపి చికీర్షితమ్ || 50 ఏతది చ్ఛామ్యహం శ్రోతుం వద గుహ్యం న చేద్భవేత్ | వదనం పూర్ణచంద్రాభం నిశ్చేష్టం వా కథం తవ || 51 వసిష్ఠుడిట్లు పలికెను - ఓ మంగళ స్వరూపురాలా! ఈ నిర్జనమగు కొండపైకి ఏల వచ్చితివి? నీవు ఎవరి కుమార్తెవు? నీవు ఏమి చేయ దలచితివి? (50). ఇది రహస్యము కానిచో నేను వినగోరు చున్నాను. పున్నమి చంద్రుని వంటి నీ ముఖము అలంకార విహీనము గా ఉన్నది యేల? (51). బ్రహ్మోవాచ | తచ్ఛ్రుత్వా వచనం తస్య వసిష్ఠస్య మహాత్మనః | దృష్ట్వా చ తం మహాత్మానం జ్వలంతమివ పావకమ్ || 52 శరీరధృగ్ బ్రహ్మచర్యం విలసంతం జటా ధరమ్ | సాదరం ప్రణిపత్యాథ సంధ్యోవాచ తపోధనమ్ || 53 బ్రహ్మ ఇట్లు పలికెను - మహాత్ముడగు వసిష్ఠుని ఆ పలుకులను విని, అగ్నివలె ప్రకాశించుచున్న ఆ మహాత్ముని చూచి (52), మూర్తిదాల్చిన బ్రహ్మచర్య మా యన్నట్లు జటలను ధరించి ప్రకాశించుచున్న ఆ తపోనిష్ఠుడగు వసిష్ఠునకు ఆదరముతో ప్రణమిల్లి, అపుడు సంధ్య ఇట్లు పలికెను (53). సంధ్యో వాచ | యదర్థమాగతా శైలం సిద్ధం తన్మే నిబోధ హా | తవ దర్శనమాత్రేణ యన్మే సేత్స్యతి వా విభో || 54 తపశ్చర్తుమహం బ్రహ్మన్నిర్జనం శైలమాగతా | బ్రహ్మణోsహం సుతా జాతా నామ్నా సంధ్యేతి విశ్రుతా || 55 యది తే యుజ్యతే సహ్యం మా త్వం సముపదేశయ | ఏతచ్చికీర్షితం గుహ్యం నాన్యైః కించన విద్యతే || 56 అజ్ఞాత్వా తపసో భావం తపోవనముపాశ్రితా | చింతయా పరి శుష్యేsహం వేపతే హి మనో మమ || 57 సంధ్య ఇట్లు పలికెను - నేను ఏ ప్రయోజనము నాశించి ఈ పర్వతమునుకు వచ్చి యుంటినో, ఆ ప్రయోజనము సిద్ధించినదని యెరుంగుడు. హే ప్రభో! మిమ్ములను దర్శించుట మాత్రము చేతనే, నాకు ఆ ప్రయోజనము సిద్ధించగలదు (54). హే బ్రాహ్మణా!నేను తపస్సును చేయుటకై ఈ జనసంచారము లేని పర్వతమునకు వచ్చి యుంటిని. నేను బ్రహ్మగారి కుమార్తెను. నాకు సంధ్య అనే పేరు ప్రసిద్ధమై యున్నది(55). మీకు ఉచితమని తోచినచో, నాకు చక్కగా ఉపదేశించుడు. నేను ఈ తపస్సును రహస్యముగా చేయగోరితిని. దీనికి ఇతరులతో పనిలేదు (56). తపస్సును చేయువిధమును తెలియకుండగనే, నేను తపోవనమును చేరుకుంటిని. నేను దుఃఖముతో ఎండి పోవుచున్నాను. నామనస్సు వణుకుచున్నది (57). బ్రహ్మోవాచ | ఆకర్ణ్య తస్యా వచనం వసిష్ఠో బ్రహ్మ విత్తమః | స్వయం చ సర్వ కృత్యో జ్ఞో నాన్యత్కించన పృష్టవాన్ || 58 అథ తాం నియతాత్మానం తపసేsతి ధృతోద్యమామ్ | ప్రోవాచ మనసా స్మృత్వా శంకరం భక్తవత్సలమ్ || 59 బ్రహ్మ ఇట్లు పలికెను - బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడు, తపస్సు యొక్క సర్వకార్యములను స్వయముగా నెరింగినవాడు నగు వసిష్ఠుడు ఆమె మాటను విని ఆమెను ఏమియూ ప్రశ్నించలేదు (58). ఆయన భక్తవత్సలుడగు శంకరుని మనస్సులో స్మరించుకొని, నియంత్రింపబడిన దేహేంద్రియమనస్సంఘాతము కల్గినది, తపస్సు కొరకు గొప్ప దీక్షతో ఉద్యమించినది అగు ఆ సంధ్యతో నిట్లనెను (59). వసిష్ఠ ఉనాచ | పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |పరమః పరమారాధ్యః శంభుర్మనసి ధార్యతామ్ || 60 ధర్మార్థ కామ మోక్షాణాం య ఏకస్త్వాదికారణమ్ | తమేకం జగతా మాద్యం భజస్వ పురుషోత్తమమ్ || 61 మంత్రేణానేన దేవేశం శంభుం భజ శుభాననే | తేన తే సకాలావాప్తి ర్భవిష్యతి న సంశయః || 62 ఓం నమశ్శంకరాయేతి ఓమిత్యం తేన సంతతమ్ | మౌనతపస్యా ప్రారంభం తన్మే నిగదతశ్శృణు || 63 వసిష్ఠుడిట్లు పలికెను - ఎవరు తేజో మూర్తులలో కెల్లా గొప్ప తేజో మూర్తియో, తపస్సులలో కెల్లా గొప్ప తపో మూర్తియో, పూజ్యులలో కెల్లా గొప్ప పూజ్యుడో అట్టి శంభుని మనస్సునందు నిలుపుము (60). ధర్మార్థకామ మోక్షములకు ఏకైక ప్రథమ కారణము, జగత్తులకు తండ్రి, పురుషశ్రేష్ఠుడునగు శంభుని సేవింపుము (61). ఓ సుందరవదనా! ఈ మంత్రముతో దేవదేవుడగు శంభుని భజింపుము. అట్లు భజించుట వలన నీకు నిస్సందేహముగా కోర్కెలన్నియూ ఈడేరగలవు (62). ఓం నమశ్శంకరాయ ఓం అను ఆద్యంతములందు ఓంకారము గల మంత్రమును జపించుము. మౌన తపస్సును నేను చెప్పెదను. నీవు విని, ఆరంభింపుము (63). స్నానం మౌనేన కర్తవ్యం మౌనేన హరపూజనమ్ | ద్వయోః పూర్ణజలాహారం ప్రథమం షష్ఠ కాలయోః || 64 తృతీయే షష్ఠకాలే తు హ్యు పవాస పరో భ##వేత్ | ఏవం తపస్సమా ప్తౌ వా షష్ఠే కాలే క్రియా భ##వేత్ || 65 ఏవం మౌనతపస్యాఖ్యా బ్రహ్మ చర్యఫలప్రదా | సర్వా భీష్ట ప్రదా దేవి సత్యం సత్యం న సంశయః || 66 ఏవం చిత్తే సముద్దిశ్య కామం చింతయ శంకరమ్ | స తే ప్రసన్న ఇష్టార్థ మచిరాదేవ దాస్యతి || 67 మౌనముగా స్నానమును చేసి, మౌనముగా శివుని పూజించవలెను. ఆరు ఘడియలు ఒక కాలము అగును.ముందుగా రెండు కాలములయందు పూర్ణముగా నీటిని ఆహారముగా తీసుకొని (64), మూడవ కాలమునందు ఉపవాసమును చేయవలెను. ఈ తీరున తపస్సు పూర్తి యగు వరకు ఆరవకాలము నందు ఉపవాసము, లేక ఆహారము వచ్చు చుండును (65). ఓ దేవీ! ఈ తీరున మౌనతపస్యను చేసినచో, బ్రహ్మ చర్య ఫలము లభించుటయే గాక, కోర్కెలన్నియూ ఈడేరును. ఇది ముమ్మాటికీ సత్యము. సంశయము లేదు (66). ఇట్లు మనస్సులో నిర్ణయించుకొని, యథేచ్ఛగా శంకరుని ధ్యానింపుము. ఆయన ప్రసన్నుడై నీకు శీఘ్రముగా కోరిన ఫలమును ఈయగలడు (67). బ్రహ్మో వాచ | ఉపదిశ్య వసిష్ఠోsథ సంధ్యాయై తపసః క్రియామ్ | తామాభాష్య యథాన్యాయం తత్రైవాంతర్దధే మునిః || 68 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీ ఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ పంచమోsధ్యాయః (5) బ్రహ్మ ఇట్లు పలికెను - వసిష్ఠుడు ఈ తీరున సంధ్యకు తపస్సును చేయవలసిన తీరున యథావిధిగా ఉపదేశించెను. అపుడా ముని అచటనే అంతర్ధనము చెందెను (68). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో సంధ్యా చరిత్ర వర్ణనమనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).