Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచమోsధ్యాయః లింగము - మూర్తి సూత ఉవాచ | శ్రవణాదిత్రికేsశక్తః లింగ బేరం చ శంకరమ్ | సంస్థాప్య నిత్యమభ్యర్చ్య తరేత్సంసార సాగరమ్ || 1 అపి ద్రవ్యం వహేదేవ యథాబల మవంచయన్ | అర్పయేల్లింగ బేరార్థి మర్చయేదపి సంతతమ్ ||
2 సూతుడిట్లు పలికెను - శ్రవణ, కీర్తన, మననములనే మూడింటి యందు శక్తిలేనివాడు శంకరుని లింగము నందు, మూర్తి యందు ఆవాహన చేసి, ప్రతిదినము అర్చించి, సంసార సమూద్రమును దాటివేయును (1). శక్తిని మించకుండా, వంచన లేకుండా ధనమును సంపాదించి, నిత్యము శివుని లింగమునకు, మూర్తికి అర్చన కొరకు అర్పించవలెను (2). మండపం గోపురం తీర్థం మఠం క్షేత్రం తథోత్సవమ్ | వస్త్రం గంధం చ మాల్యం చ ధూపం దీపం చ భక్తితః || 3 వివిధాన్నం చ నైవేద్యం అపూపవ్యంజనైర్యుతమ్ | ఛత్రం ధ్వజం చ వ్యజనం చామరం చాపి సాంగకమ్ || 4 రాజోపచార వత్సర్వం ధారయేల్లింగ బేరయోః | ప్రదక్షిణాం నమస్కారం యథాశక్తి జపం తథా || 5 ఆవాహనాది సర్గాంతం నిత్యం కుర్యాత్సు భక్తితః | ఇత్థ మభ్యర్చయన్ దేవం లింగే బేరే చ శాంకరే || 6 సిద్ధిమేతి శివప్రీత్యా హిత్వాపి శ్రవణాదికమ్ | లింగ బేరార్చనా మాత్రాన్ముక్తాః పూర్వే మ హాజనాః || 7 మండపమును, గోపురమును, సమీపములో జలాశయమును, మఠమును, శిపక్షేత్రమును నిర్మించి, ఉత్సవమును చేయవలెను. వస్త్రమును, గంధమును, పుష్పమాలికలను, ధూపదీపములను భక్తితో అర్పించవలెను (3). అపూపములతో, పచ్చళ్లతో కూడిన వివిధాన్నములను నైవేద్యము చేయవలెను. ఛత్రము, ధ్వజము, వింజామరలను వీచుట ఇత్యాది సేవల నన్నింటినీ (4),రాజునకు ఉపచారములు చేసిన తీరున చేయవలెను. మరియు ప్రదక్షిణమును, నమస్కారమును, శక్తిమేరకు జపమును చేయవలెను (5). ప్రతిదినము ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు భక్తిశ్రద్ధలతో చేయవలెను. ఇట్లు శివుని లింగమును, మూర్తిని అర్చించి (6), శివుని అనుగ్రహమును పొందిన వ్యక్తి, శ్రవణాదులను విడిచిననూ, సిద్ధిని పొందును. పూర్వము మహాత్ములు లింగమును, మూర్తిని అర్చించుట మాత్రము చేతనే ముక్తిని పొందిరి (7). మునయః ఊచుః | బేర మాత్రే తు సర్వత్ర పూజ్యంతే దేవతా గణాః | లింగే బేరే చ సర్వత్ర కథం సంపూజ్యతే శివః || 8 మునులు ఇట్లు పలికిరి - దేవతలందరు మూర్తి రూపములో మాత్రమే పూజింపబడుచుండగా, శివుడు లింగము నందు, మూర్తి యందు కూడ పూజింపబడుటకు కారణమేమి? (8) సూత ఉవాచ | అహో మునీశ్వరాః పుణ్యం ప్రశ్నమేతన్మహాద్భుతమ్ | అత్ర వక్తా మహాదేవో నాన్యోsస్తి పురుషః క్వచిత్ || 9 శివేనోక్తం ప్రవక్ష్యామి క్రమాద్గురు ముఖాచ్ఛ్రుతమ్ | శివైకో బ్రహ్మరూపత్వాన్నిష్కలః పరికీర్తితః || 10 రూపిత్వా త్సకల స్తద్వత్ తస్మాత్సకల నిష్కలః | నిష్కలత్వాన్నిరాకారం లింగం తస్య సమాగతమ్ || 11 సకల త్వాత్తథా బేరం సాకారం తస్య సంగతమ్ | సకలాకలరూపత్వా ద్ర్బహ్మ శబ్దా భిధః పరః || 12 సూతుడిట్లు పలికెను - ముని శ్రేష్ఠులారా! మీరు వేసిన ఈ ప్రశ్న పవిత్రమైనది; విస్మయమును కలిగించునది. దీనికి మహాదేవుడు తక్క సమాధానమును చెప్పగల పురుషుడు మరియొకడు ఎక్కడనూ లేడు (9). శివునిచేత చెప్పబడి, గురువు నుండి నాచే తెలియబడిన సమాధానమును క్రమబద్ధముగా చెప్పెదను. శివుడు ఒక్కడే పరబ్రహ్మరూపుడు. కావున, ఆయన నిరాకారుడని చెప్పబడును (10). శివునకు రూపము కూడ ఉండుటచే, ఆయన నిరాకారుడు, సాకారుడా కూడా. ఈశ్వరుడు నిరాకారుడు గనుక, ఆయన నిరాకారమగు లింగము నందు పూజింపబడుచున్నాడు (11). ఆయన సాకారుడు గనుక మూర్తి యందు కూడ ఆరాధింపబడుచున్నాడు. ఇట్లు ఆయన సాకార, నిరాకార రూపుడగుటచే, పరబ్రహ్మ శబ్దవాచ్యుడగుచున్నాడు (12). అపి లింగే చ బేరే చ నిత్యమభ్యర్య్చతే జనైః | అబ్రహ్మత్వాత్తదన్యేషాం నిష్కలత్వం న హి క్వచిత్ || 13 తస్మాత్తే నిష్కలే లింగే నారాధ్యంతే సురేశ్వరాః | అబ్రహ్మత్వాచ్చ జీవత్వాత్తథాన్యే దేవతాగణాః || 14 తూష్ణీం సకల మాత్రత్వా దర్చ్యంతే బేరమాత్రకే | జీవత్వం శంకరాన్యేషాం బ్రహ్మత్వం శంకరస్యచ || 15 వేదాంత సార సంసిద్ధం ప్రణవార్ధే ప్రకాశనాత్ | ఏవ మేవ పరామృష్టో మందరే నందికేశ్వరః || 16 సనత్కుమార మునినా బ్రహ్మపుత్రేణ ధీమతా | శివుడు మానవులచే లింగము నందు, మూర్తి యందు కూడ నిత్యము ఆరాధింపబడుచున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ రూపులు కాదు గనుక, వారికి నిరాకారత్వము లేదు (13). కావున, ఇతర దేవతలు బ్రహ్మరూపులు కాక, జీవులగుటచే నిరాకారమగు లింగము నందు ఆరాధింపబడరు (14). వారు సాకారులు మాత్రమే. గనుక, మూర్తి యందు మాత్రమే ఆరాధింపబడుచున్నారు. శంకరుడు పరబ్రహ్మ; శంకరుని కంటె భిన్నులైన దేవతలు జీవులు (15). శంకరుని బ్రహ్మత్వము ఉపనిషత్తుల సారముగా, ఓంకారము యొక్క అర్థముగా నిరూపింపబడినది. మందర పర్వతము నందు (16) బ్రహ్మపుత్రుడు, బుద్ధిమంతుడునగు సనత్కుమార మహర్షి నందికేశ్వరుని ఇదే తీరున ప్రశ్నించెను. సనత్కుమార ఉవాచ | శివాన్య దేవ వశ్యానం సర్వేషామపి సర్వతః || 17 బేరమాత్రం చ పూజార్థం శ్రుతం దృష్టం చ భూరిశః | శివమాత్రస్య పూజాయాం లింగం బేరం చ దృశ్యతే || 18 అతస్త ద్ర్బూహి కల్యాణ తత్త్వం మే సాధు బోధనమ్ | సనత్కుమారుడిట్లు పలికెను - శివుని కంటె భిన్నమైన దేవతలను భక్తులు సర్వత్ర (17), మూర్తి యందు చేయు ఆరాధనను గురించి మాత్రమే వినుచున్నాము; కనుచున్నాము. కేవలము శివార్చన యందు మాత్రమే లింగము, మూర్తి కనబడును (18). కావున, ఓ మంగళ స్వరూపా! నాకు బాగుగా అర్థమగునట్లు ఈ తత్త్వమును వివరింపుము. నందికేశ్వర ఉవాచ | అనుత్తర మిమం ప్రశ్నం రహస్యం బ్రహ్మలక్షణమ్ || 19 కథయామి శివేనోక్తం భక్తి యుక్తస్య తేsనఘ | శివస్య బ్రహ్మరూపత్వాన్నిష్కలత్వాచ్చ నిష్కలమ్ || 20 లింగం తసై#్యవ పూజాయాం సర్వవేదేషు సంమతమ్ | తసై#్యవ సకలత్వాచ్చ తథా సకలనిష్కలమ్ || 21 సకలం చ తథా బేరం పూజాయాం లోక సంమతమ్ | శివాన్యేషాం చ జీవత్వాత్ సకలత్వాచ్చ సర్వతః || 22 బేరమాత్రం చ పూజా యాం సంమతం వేద నిర్ణయే | స్వావిర్భావే చ దేవానాం సకలం రూపమేవ హి || 23 శివస్య లింగం బేరం చ దర్శనే దృశ్యతే ఖలు | నందికేశ్వరుడిట్లు పలికెను- ఈ ప్రశ్నకు సమాధానము అసంభవము. ఇది రహస్యమగు బ్రహ్మ విద్య (19). పాపములు లేనివాడా! భక్తుడవగు నీకు శివుడు చెప్పిన ఈ రహస్యమును చెప్పెదను. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు. నిరాకారుడు (20). శివునికి మాత్రమే లింగము నందు అర్చన వేదములన్నిటి యందు నిర్ణీతమై యున్నది. శివుడు సాకారుడు కూడా (21). కావున, లోకములో శివుడు మూర్తి రూపములో కూడ పూజల నందుకొనును. శివుని కంటె భిన్నమైన దేవతలు జీవులు, సాకారులు (22). కనుక, వారికి మూర్తి యందు మాత్రమే అర్చన వేదముచే నిర్ణయింపబడినది. దేవతలు ఆవిర్భవించినప్పుడు సాకారముగనే ఆవిర్భవింతురు. (23). కాని, శివుడు లింగముగను, మూర్తిగను కూడ దర్శనమిచ్చును. సనత్కుమార ఉవాచ| ఉక్తం త్వయా మహాభాగ లింగబేర ప్రచారణమ్ || 24 శివస్య చ తదన్యేషాం విభజ్య పరమార్థతః | తస్మాత్తదేవ పరమం లింగబేరాది సంభవమ్ || 25 శ్రోతుమిచ్ఛామి యోగీంద్ర లింగావిర్భావ లక్షణమ్ | సనత్కుమారుడిట్లు పలికెను- ఓ మహానుభావా! (24), శివునకు లింగము నందు, మూర్తి యందు అర్చన, ఇతర దేవతలకు మూర్తి యందు మాత్రమే అర్చన ప్రచారములో నుండుటకు గల కారణములను విభాగము చేసి, నీవు పరమార్థ దృష్టితో వివరించితివి. కావున, ఓ యోగి శ్రేష్ఠా! నేను శ్రేష్ఠమైన లింగము, మూర్తి ఇత్యాదుల ఆవిర్భావమును గూర్చి (25) వినగోరుచున్నను. ఓ యోగిశ్రేష్ఠా! లింగము ఆవిర్భవించిన విధమును తెలుపుడు. నందికేశ్వర ఉవాచ | శృణు వత్స భవత్ర్పీత్యై వక్ష్యామి పరమార్థతః || 26 పురాకల్పే మహాకాలే ప్రపన్నే లోకవిశ్రుతే | అయుధ్యేతాం మహాత్మానౌ బ్రహ్మ విష్ణూ పరస్పరమ్ || 27 తయోర్మానం నిరాకర్తుం తన్మధ్యే పరమేశ్వరః | నిష్కలస్తంభ రూపేణ స్వరూపం సమదర్శయత్ || 28 తతః స్వలింగ చిహ్నత్వాత్ స్తంభతో నిష్కలం శివః | స్వలింగం దర్శయా మాస జగతాం హితకామ్యయా || 29 తదాప్రభృతి లోకేషు నిష్కలం లింగమైశ్వరమ్ | సకలం చ తథా బేరం శివసై#్యవ ప్రకల్పితమ్ || 30 శివాన్యేషాం తు దేవానాం బేరమాత్రం ప్రకల్పితమ్ | తత్తద్బేరం తు దేవానాం తత్తద్భోగప్రదం శుభమ్ | శివస్య లింగబేరత్వం భోగమోక్షప్రదం శుభమ్ || 31 ఇతి శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం పంచమోsధ్యాయః (5) నందికేశ్వరుడు ఇట్లు పలికెను- ఓ వత్సా! నీ ప్రీతి కొరకు పరమార్ధమును చెప్పెదను. వినుము (26). పూర్వకల్పము నందు ప్రలయకాలము సంప్రాప్తము కాగా, మహాత్ములగు బ్రహ్మ విష్ణువులు ఒకరితో నొకరు పోట్లాడుకొనిరి (27). వారి అహంకారమును తొలగించుటకై, పరమేశ్వరుడు వారి మధ్యలో నిరాకారమగు స్తంభరూపముగా తన రూపమును ప్రదర్శించెను (28). అపుడు శివుడు లోకముల క్షేమమును గోరి, ఆ స్తంభము నుండి నిరాకారమగు లింగరూపముగా ఆవిర్భవించెను (29). అప్పటి నుండియు, లోకములో శివునకు మాత్రమే నిరాకారమగు లింగము నందు, సాకారముగ మూర్తి యందు అర్చనలు చేయబడుచున్నవి (30). శివుని కంటె భిన్నమగు దేవతలకు మూర్తి అర్చన మాత్రమే విహితమైనది. దేవతలు ఆయా మూర్తులను అర్చించినచో, ఆ యా భోగములు, శుభములు కలుగును. శివుని లింగమును, మూర్తిని అర్చించినచో భోగములు, శుభము, మోక్షము కూడ లభించును (31). శ్రీ శివ మహా పురాణములో విద్యేశ్వర సంహిత యందు ఐదవ అధ్యాయము ముగిసినది. (5)