Sri Sivamahapuranamu-I    Chapters   

అథ సప్తమోsధాయః

అరుంధతి

బ్రహ్మోవాచ |

వరం దత్త్వా మునే తస్మిన్‌ శంభావంతర్హితే తదా | సంధ్యా ప్యగచ్ఛత్తత్రైవ యత్ర మేధాతిథిర్మునిః || 1

తత్ర శంభోః ప్రసాదేన న కేనాప్యుపలక్షితా | సస్మార వర్ణినం తం వై స్వోపదేశకరం తపః || 2

వసిష్ఠేన పురా సా తు వర్ణీ భూత్వా మహామునే | ఉపదిష్టా తపశ్చర్తుం వచనాత్పరమేష్ఠినః || 3

తమేవ కృత్వా మనసా తపశ్చర్యోప దేశకమ్‌ | పతిత్వేన తదా సంధ్యా బ్రాహ్మణం బ్రహ్మచారిణమ్‌ || 4

సమిద్ధేగ్నౌ మహాయజ్ఞే మునిభిర్నో పలక్షితా | హృష్టా శంభుప్రసాదేన సా వివేశ విధేస్సుతా || 5

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శంభుడు వరములనిచ్చి అంతర్ధానము కాగానే, సంధ్య మేధాతిథి మహర్షి ఉన్న స్థానమునకు వెళ్లెను (1).శంభుని అనుగ్రహముచే ఆమె ఎవ్వరికీ కానరాలేదు. ఆమె తనకు తపస్సు చేయు విధానమునుపదేశించిన బ్రహ్మచారిని స్మరించెను (2).ఓ మహర్షీ! పూర్వము బ్రహ్మ గారి ఆదేశముచే వసిష్ఠుడు బ్రహ్మచారి రూపములో ఆమెకు తపస్సు చేయు విధానమునుపదేశించెను (3).తపస్సు చేయు విధమును ఉపదేశించిన ఆ బ్రాహ్మణ బ్రహ్మ చారిని ఆమె మనస్సులో భర్తగా స్వీకరించెను (4). ఆ మహాయజ్ఞములో ప్రజ్వరిల్లుచున్న అగ్నియందు బ్రహ్మమానస పుత్రికయగు సంధ్య మునులకు కానరానిదై ఆనందముతో ప్రవేశించెను (5).

తస్యాః పురోడాశమయం శరీరం తత్‌ క్షణాత్తతః | దగ్ధం పురోడాశగంధం తస్తార యదలక్షితమ్‌ || 6

వహ్నిస్తస్యాశ్శరీరం తు దగ్ధ్వా సూర్యస్య మండలమ్‌ | శుద్ధం ప్రవేశయా మాస శంభోరేవాజ్ఞయా పునః || 7

సూర్యో వ్యర్థం విభజ్యాథ తచ్ఛరీరం తదా రథే | స్వకేశం స్దాపయామాస ప్రీతయే పితృదేవయోః || 8

త దూర్ధ్వ భాగస్త స్యాస్తు శరీరస్య మునీశ్వర | ప్రాతస్సంధ్యాsభవ త్సా తు అహోరాత్రాది మధ్యగా || 9

పురోడాశరూపముగా సమర్పింపబడిన ఆమె దేహము తత్‌ క్షణమే దగ్ధమై పురోడాశ గంధము సర్వత్రా వ్యాపించెను. ఈ గంధమునకు హేతువు ఎవ్వరికీ తెలియలేదు (6). అగ్ని శివుని ఆజ్ఞచే ఆమె శరీరమును దహించి, శుద్ధమగు సూక్ష్మశరీరమును సూర్యమండలమునందు ప్రవేశ##పెట్టెను (7). సూర్యుడు ఆమె శరీరమును రెండుగా విభజించి, పితరులకు దేవతలకు ప్రీతిని కలిగించుట కొరకై తన రథమునందు స్థాపించెను (8). ఓ మహర్షీ! ఆమె శరీరము యొక్క పై భాగము రాత్రికి పగటికి మధ్య లో నుండే ప్రాతస్సంధ్య అయెను (9).

తచ్ఛేష భాగస్తస్యాస్తు అహోరాత్రాంత మధ్యగా | సా సాయమభవత్సంధ్యా పితృప్రీతిప్రదా సదా || 10

సూర్యోదయాత్తు ప్రథమం యదా స్యాదరుణోదయః | ప్రాతస్సంధ్యా తదోదేతి దేవానాం ప్రీతి కారిణీ || 11

అస్తం గతే తతస్సూర్యే శోణ పద్మనిభే సదా | ఉదేతి సాయం సంధ్యాపి పితౄణాం మోదకారిణీ || 12

తస్యాః ప్రాణాస్తు మనసా శంభునాథ దయాలునా | దివ్యేన తు శరీరేణ చక్రిరే హి శరీరిణః || 13

ఆమె యొక్క మిగిలిన భాగము సదా పితృదేవతలకు ప్రీతినీ కలిగించునది, పగటికి రాత్రికి మధ్యలో నుండునది యగు సాయం సంధ్య ఆయెను (10). సూర్యుని ఉదయమునకు ముందుగా అరుణుడు ఉదయించును. ఆ సమయములోనే దేవతలకు ప్రీతిని కలిగించే ప్రాతస్సంధ్య ఉదయించును (11). ఎర్రని పద్మమును పోలు సూర్యుడు అస్తమించగానే, పితృదేవతల కానందమునిచ్చు సాయంసంధ్య ఉదయించును (12). అపుడు దయాళువగు శంభుడు ఆమె ప్రాణములను మనస్సుతో కలిపి స్థూల శరీరముగల దేహి యొక్క దివ్యమగు సూక్ష్మ శరీరముగా నిర్మాణము చేసెను (13).

మునేర్యజ్ఞావసానే తు సంప్రాప్తే మునితా తు సా | ప్రాప్తా పుత్రీ వహ్నిమధ్యే తప్త కాంచన సుప్రభా || 14

తాం జగ్రాహ తదా పుత్రీం మునిరామోద సంయుతః | యజ్ఞార్థం తాం తు సంస్నాప్య నిజక్రోడే దధౌ మునే || 15

అరుంధతీ తు తస్యాస్తు నామ చక్రే మహామునిః | శిషై#్యః పరివృతస్తత్ర మహామోదమవాప హ || 16

న రుణద్ధియతో ధర్మం సా కస్మాదపి కారణాత్‌ | అతస్త్రిలోకే విదితం నామ సంప్రాప తత్స్వయమ్‌ || 17

యజ్ఞము పూర్తి కాగానే ఆ మహర్షి అగ్ని మధ్యము నుండి పుటము పెట్టిన బంగారము వలె వెలిగిపోవుచున్న కుమార్తెను పొందెను (14). ఆ మహర్షి ఆనందముతో గూడినవాడై ఆ కుమార్తెను స్వీకరించెను. ఓ మహర్షీ! ఆయన ఆమెను యజ్ఞము కొరకై స్నానము చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను (15). ఆ మహర్షి ఆమెకు అరుంధతి అను పేరు పెట్టి, తన శిష్యులతో గూడి మిక్కిలి ఆనందించెను (16).ఆమె ఏ కారణము చేతనైననూ ధర్మమునకు అడ్డు పడదు. అందువలననే, ఆమె ముల్లోకములలో అరుంధతియను అన్వర్థనామమును పొందెను (17).

యజ్ఞం సమాప్య స మునిః కృత కృత్య భావ మాసాద్య సంపదయుతస్తనయా ప్రలంభాత్‌ |

తస్మిన్ని జాశ్రమపదే సహ శిష్యవర్గై స్తామేవ సంతతమసౌ దయితే సురర్షే || 18

అథ సా వవృధే దేవీ తస్మిన్మునివరాశ్రమే | చంద్రభాగానదీతీరే తాపసారణ్య సంజ్ఞకే || 19

సంప్రాప్తే పంచమే వర్షే చంద్రభాగానం తదా గుణౖః | తాపసారణ్యమపి సా పవిత్రమకరోత్సతీ || 20

వివాహం కారయామాసుస్తస్యా బ్రహ్మసుతేన వై | వసిష్ఠేన హ్యరుంధత్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరాః || 21

తద్వివాహే మహోత్సాహో బభూవ సుఖవర్థనః | సర్వే సురాశ్చ మున యస్సుఖమాపుః పరం మునే || 22

ఆ మహర్షి యజ్ఞమును పూర్తి గావించి, కుమార్తెను పొంది, సంపదలతో కూడినవాడై తనను తాను కృతార్థునిగా భావించెను. ఓ దేవర్షీ! ఆయన తన ఆశ్రమములో తన శిష్యులతో గూడిన ఆమెను అన్నివేళలా లాలించి పాలించుచూ గడిపెను (18). అపుడా దేవి చంద్రభాగా నదీ తీరమునందు గల, తాపసారణ్యము అను పేరగల, ఆ మహర్షి యొక్క ఆశ్రయములో పెరిగెను (19). ఆ సాధ్వి అయిదవ ఏడు వచ్చునాటికి తన గుణములచే చంద్ర భాగా నదిని, తాప సారణ్యమును కూడ పవిత్రము గావించెను(20). బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అరుంధతికి బ్రహ్మ కుమారుడగు వసిష్ఠునితో పరిణయమును గావించిరి (21). ఓ మునీ! ఆ వివాహములో సుఖమును వృద్ధి పొందించు గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను. అందరు దేవతలు, మరియు ఋషులు ఆనందించిరి (22).

బ్రహ్మ విష్ణు మహేశానాం కరనిస్సృతతోయతః | సప్తనద్యస్సముత్పన్నా శ్శిప్రాద్యా స్సుపవిత్ర కాః || 23

అరుంధతీ మహా సాధ్వీ సాధ్వీనాం ప్రవరోత్తమా | వసిష్ఠం ప్రాప్య సంరేజే మేధాతిథి సుతా మునే || 24

యస్యాః పుత్రాస్సముత్పన్నాశ్రేష్ఠా శ్శక్త్యాదయశ్శుభాః | వసిష్ఠం ప్రాప్య తం కాంతం సంరేజే మునిసత్తమాః || 25

ఏవం సంధ్యా చరిత్రం తే కథితం మునిసత్తమ | పవిత్రం పావనం దివ్యం సర్వకామ ఫలప్రదమ్‌ || 26

య ఇదం శృణుయాన్నారీ పురుషో వా శుభవ్రతః | సర్వాన్కా మానవాప్నోతి నాత్ర కార్య విచారణా || 27

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సప్తమోధ్యాయః (7).

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల హస్తముల నుండి జారిన నీటి నుండి పరమపావనములైన శిప్రా మొదలగు ఏడు నదులు పుట్టెను (23). ఓ మహర్షీ! సాధ్వీ మణులలో కెల్లా శ్రేష్ఠురాలు, మేధాతిథియొక్క కుమార్తె యగు అరుంధతి వసిష్ఠుని వివాహమాడి శోభిల్లెను (24). ఓ మునిశ్రేష్ఠులారా! వసిష్ఠుని భర్తగా పొందిన ఆమెకు శ్రేష్ఠులు, పుణ్యాత్ములు అగు శక్తి మొ దలగు కుమారులు కలిగిరి (25). ఓమహర్షీ! పవిత్రము , పావనము, దివ్యము, కోర్కెలన్నిటినీ ఈడేర్చునది అగు సంధ్యా వృత్తాంతమును నేను నీకు చెప్పితిని (26). స్త్రీ గాని, పురుషుడు గాని పవిత్రమగు నిష్ఠతో ఈ గాథను విన్నచో, వారి కోర్కెలన్నియూ సిద్ధించుననుటలో సందియము లేదు (27).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండయందు ఏడవ అధ్యాయము ముగిసినది(7).

Sri Sivamahapuranamu-I    Chapters