Sri Sivamahapuranamu-I    Chapters   

అథ నవమోsధ్యాయః

మారగణములు

బ్రహ్మో వాచ |

తస్మిన్‌ గతే సానుచరే శివస్థానం చ మన్మ థే | చరిత్ర మభవచ్చిత్రం తచ్ఛృణుష్వ మునీశ్వర || 1

గత్వా తత్ర మహావీరో మన్మథో మోహకారకః | స్వప్రభావం తతానాశు మోహయామాస ప్రాణినః || 2

వసంతోsపి ప్రభావం స్వం చకార హరమోహనమ్‌ | సర్వే వృక్షా ఏకదైవ ప్రపుల్లా అభవన్మునే || 3

వివిధాన్‌ కృతవాన్‌ యత్నాన్‌ రత్యా సహ మనో భవః | జీవాస్సర్వే వశం యాతాస్సగణశశ్శివో న హి || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన అనుచరులతో గూడి శివస్థానమునకు వెళ్లగానే, చిత్రమగు వృత్తాంతము జరిగినది. దానిని వినుము (1). మహావీరుడు, మోహకారకుడు నగు మన్మథుడు అచటకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను. మరియు ప్రాణులను మోహపెట్టెను (2). వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను . ఓమునీ! ఏకకాలములో వృక్షములన్నియు పుష్పభరితములైనవి (3). మన్మథుడు రతితో గూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నియు వశ##మైనవి.కాని గణశుడు, శివుడు వానికి వశము కాలేదు (4).

సమధోర్మదనస్యాసన్‌ ప్రయాసా నిష్ఫలా మునే | జగామ స మమ స్థానం నివృత్య విమదస్తదా || 5

కృత్వా ప్రణామం విధయే మహ్యం గద్గదయా గిరా | ఉవాచ మదనో మాం చోదాసీనో విమదో మునే || 6

ఓ మహర్షీ! మన్మథుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నియూ వ్యర్థము కాగా, ఆతని గర్వము తొలగి పోయెను. అపుడా తడు నా వద్దకు మరలి వచ్చెను (5). ఓ మహర్షీ! ఆతడు గర్వము తొలగినవాడై, నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గదస్వరముతో నిట్లు పలికెను (6).

కామ ఉవాచ |

బ్రహ్మన్‌ శంభుర్మోహనీయో నవై యోగ పరాయణః | న శక్తిర్మమ నాన్యస్య తస్య శంభోర్హి మోహనే || 7

సమిత్రేణ మయా బ్రహ్మన్ను పాయా వివిధాః కృతాః | రత్యా సహాఖిలాస్తే చ నిష్ఫలా అభవన్‌ శివే || 8

శృణు బ్రహ్మన్‌ యథాస్మాభిః కృతా హి హరమోహనే | ప్రయాసా వివిధాస్తాత గదతస్తాన్మునే మమ || 9

యదా సమాధిమాశ్రిత్య స్థితశ్శంభుర్నియంత్రి తః | తదా సుగంధివాతేన శీతలే నాతి వేగినా || 10

ఉద్వీజ యామి రుద్రం స్మ నిత్యం మోహనకారిణా | ప్రయత్నతో మహాదేవం సమాధిస్థం త్రిలోచనమ్‌ || 11

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా! నాకు గాని, ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు (7). హే బ్రహ్మన్‌! నేను నా మిత్రుడగు వసంతునితో, మరియు రతితో గూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నియూ వ్యర్థయమ్యెను (8). హే బ్రహ్మన్‌! మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రీ! వినుము (9). శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధియందుండగా, అపుడు నేను సమాధియందున్న ఆ ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని, వేగముగల, మోహమును కలిగించే, పరిమళభరితమైన వాయువుతో వీచితిని (10.11).

స్వసాయకాంస్తథా పంచ సమాదాయ శరాసనమ్‌ | తస్యాభితో భ్రమంతస్తు మోహయంస్తద్గణానహమ్‌ || 12

మమ ప్రవేశ మాత్రేణ సువశ్యాస్సర్వ జంతవః |అభవద్వికృతో నైవ శంకరస్సగణః ఫ్రభుః || 13

యదా హిమవతః ప్రస్థంస గతః ప్రమథాధిపః | తత్రా గతస్తదైవాహం స రతిస్సమధుర్విధే || 14

యదా మేరుంగతో రుద్రో యదా వా నాగ కేశరమ్‌ | కైలాసం వాయదా యాతస్తత్రాహం గతవాంస్తదా || 15

నేను నా అయిదు బాణములను మరియు ధనస్సును చేత బట్టి శివగణములను మోహింపజేయుచూ ఆయన చుట్టు ప్రక్కల తిరుగాడితిని (12). నేను ప్రవేశించుట తోడనే సర్వ ప్రాణులు నాకు తేలికగా వశమగును. కాని, శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమునూ పొందనే లేదు (13). హే బ్రహ్మన్‌! ప్రమథ గణాధిపతి యగు ఆ శివుడు హిమవత్పర్వత మైదానములకు వెళ్లగా, అపుడు నేను గూడ రతితి, వసంతునితో గూడి అచటకు వెళ్లితిని (14). ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని, నాగకేశర (?) పర్వతమునకు గాని, లేదా కైలాసమునకు గాని వెళ్లినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్లితిని (15).

యదాత్యక్త సమాధిస్తు హరస్తస్థౌ కదాచన | తదా తస్య పురశ్చక్రయుగం రచితవానహమ్‌ || 16

తచ్చ భ్రూయుగలం బ్రహ్మన్‌ హావ భావయుతం ముహుః | నానా భావానకార్షీచ్చ దాంపత్యక్రమముత్తమమ్‌ || 17

నీలకంఠం మహాదేవం సగణం తత్పురస్థ్సితా ః | అకార్షుర్మోహితం భావం మృగాశ్చ పక్షిణస్తథా || 18

మయూరమిథునం తత్రాకార్షీద్భావం రసోత్సుకమ్‌ |వివిధాం గతి మాశ్రిత్య పార్శ్వే తస్య పురస్తథా || 19

ఎపుడైననూ శివుడు సమాధిని వీడినచో, ఆ సమయములో నేను ఆయన యెదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించితిని (16). హేబ్రహ్మన్‌! ఆ పక్షుల జంట పునః పునః హావభావములను ప్రకటించుచూ ఉత్తమమగు దాంపత్యపద్ధతిని ప్రకటించినవి (17). గణములతో కూడియున్న, నల్లని కంఠము గల ఆ మహాదేవుని యెదుట మృగములు, పక్షులు శృంగామును ప్రకటించినవి (18).ఆయన యెదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగారరసమును ఉద్ధీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్య మాడినది (19).

నాల భద్వివరం తస్మిన్‌ కదాచిదపి మచ్ఛరః | సత్యం బ్రవీమి లోకేశ మమ శక్తిర్న మోహనే || 20

మధురప్యకరోత్కర్మ యుక్తం యత్తస్య మోహనే | తచ్ఛృణుష్వ మహాభాగ సత్యం సత్యం వదా మ్యహమ్‌ || 21

చంపకాన్‌ కేశరాన్‌ బాలాన్‌ అరుణాన్‌ పాటలాంస్తథా | నాగకేశరపున్నాగాన్‌ కింశుకాన్‌ కేతకాన్‌ కరాన్‌ || 22

మాగధీ మల్లికా పర్ణ భరాన్‌ కురవకాంస్తథా | ఉత్ఫల్లయతి తత్ర స్మ యత్ర తిష్ఠతి వై హరః || 23

నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివునియందు నాకు ఏనాడూ కానరాలేదు. హే జగత్ర్ప భూ! నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు (20). వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా! ఆ వృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికీ సత్యమునే పలుకుచున్నానను (21). శివుడు ఉన్నచోట వసంతుడు సంపెంగలను, కేసరపుష్పములను, కురువేరు పుష్పములను, అరుణవర్ణము గల పొన్నలను, నాగకేశరములను, కింశుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను (22), అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను (23).

సరాంస్యుత్ఫుల్ల పద్మాని వీజయన్‌ మలయానిలైః | యత్నాత్సు గంధీన్యకరో దతీవ గిరిశాశ్రమే || 24

లతాస్సర్వాస్సుమనసో దధు రంకుర సంచయాన్‌ | వృక్షాంకం చిరభావేన వేష్టయంతి స్మ తత్ర చ || 25

తాన్‌ వృక్షాంశ్చ సుపుష్పౌఘాన్‌ తైస్సుంగంధి సమీరణౖః | దృష్ట్వా కామవశం యాతా మునయోsపి పరే కిము || 26

ఏవం సత్యపి శంభోర్న దృష్టం మోహస్య కారణమ్‌ | భావమాత్ర మకార్షీన్నో కోపో మయ్యపి శంకరః || 27

ఆతడు ప్రయత్న పూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధభరితములగునట్లు చేసి మలయానిలము వీచునట్లు చేసెను (24). అచట గల లతలన్నియూ పూలతో, చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని యుండెను (25). పుష్పములతో నిండియున్న ఆ వృక్షములను చూచి, ఆ సుంగధి భరితములగు గాలులను అనుభవించిన మునులు కూడా కామమునకు వశ##మైరి. ఇతరుల గురించి చెప్పనదేమున్నది? (26). ఇట్లు ఉన్ననూ శివునకు మోహమును పొందే హేతువు గాన రాలేదు. ఆయనలో లేశ##మైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడ చేయలేదు (27).

ఇతి సర్వమహం దృష్ట్వా జ్ఞాత్వా తస్య చ భావనామ్‌ | విముఖోsహం శంభుమోహాన్నియతం తే వదామ్యహమ్‌ || 28

తస్య త్యక్త సమాధేస్తు క్షణం నో దృష్టిగోచరే | శక్నుయామో వయం స్థాతుం తం రుద్రం కో విమోహయేత్‌ || 29

జ్వలదగ్ని ప్రకాశాక్షం జట్టారాశి కరాలినమ్‌ | శృంగిణం వీక్ష్య కస్థ్సాతుం బ్రహ్మన్‌ శక్నోతి తత్పురః || 30

ఈ వృత్తాంతమునంతనూ చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేనీ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను (28). ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడుటకైననూ సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? (29). హే బ్రహ్మన్‌! మండే అగ్నివలె ప్రకాశించు కన్నులు కలిగినట్టియు, జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు, విషమును ధరించియున్న శివుని చూచి, ఆయన యెదుట నిలబడ గలవారెవ్వరు? (30).

బ్రహ్మోవాచ |

మనో భవవచశ్ఛేత్థం శ్రుత్వాహం చతురాననః | వివక్షురపి నావోచం చింతావిష్టోsభవం తదా || 31

మోహనేsహం సమర్థో న హరస్యేతి మనో భవః | వచశ్ర్శుత్వా మహాదుఃఖాన్ని రశ్వసమహం మునే|| 32

నిశ్శ్వా సమారుతాన్మే హి నానారూపా మహా బలాః |జాతా గతా లోలజిహ్వా లోలాశ్చాతి భయంకరాః || 33

ఆవాదయంత తే సర్వే నానావాద్యానసంఖ్యకాన్‌ | పటహాది గణా స్తాంస్తాన్‌ వికరాలాన్మ హారవాన్‌ || 34

బ్రహ్మ ఇట్లు పలికెను -

నాల్గు మోములు గల నేను ఈ మన్మథుని మాటలను విని, సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అపుడు నా మనస్సు చింతతో నిండి పోయెను (31). శివుని నేను మోహింపచేయ జాలను అను మన్మథుని పలుకులను వింటిని. ఓ మహర్షీ! ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని (32). నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి (33). వారందరు అసంఖ్యాకములు, గొప్ప భయంకరమైన ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి (34).

ఆథ తే మమ నిశ్శ్వాస సంభవాశ్చ మహాగణాః| మారయ చ్ఛేదయే త్యూచు ర్బ్రహ్మణో మే పురస్థ్సితాః || 35

తేషాం తు వదతాం తత్ర మారయ చ్ఛేదయేతి మామ్‌ | వచశ్ర్శుత్వా విధిం కామః ప్రవక్తు ముపచక్రమే || 36

మునేsథ మాం సమాభాష్య తాన్‌ దృష్ట్వా మదనో గణాన్‌ | ఉవాచ వారయన్‌ బ్రహ్మన్‌ గణానా మగ్రతః స్మరః || 37

నా నిట్టూర్పుల నుండి పుట్టిన ఆ మహాగణములు నా ఎదుట నిలబడి 'చంపుడు నరుకుడు' అని కేకలు వేసినవి (35). నన్ను ఉద్దేశించి వారు 'చంపుడు నరుకుడు' అని వేయుచున్న కేకలను విని మన్మథుడు వారిని ఎదుర్కొనెను (36). ఓ మహర్షీ! అపుడు మన్మథుడు నాయెదుటనున్న ఆ గణములను వారించి, నాతో బ్రహ్మన్‌ అని సంబోధించి ఇట్లు పలికెను (37).

కామ ఉవాచ |

హే బ్రహ్మన్‌ హే ప్రజానాథ సర్వసృష్టి ప్రవర్తక | ఉత్పన్నాః క ఇమే వీరా వికరాలా భయంకరాః || 38

కిం కర్మైతే కరిష్యంతి కుత్ర స్థాస్యంతి వా విధే | కిన్నామధేయా ఏతే తద్వద తత్ర నియోజయ|| (39)

నియోజ్య తాన్ని జే కృత్యే స్థానం దత్త్వా చ నామ చ | మామా జ్ఞాపయ దేవేశ కృపాం కృత్వా యథోచితామ్‌ || 40

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! ప్రజాపతీ! సృష్టినంతనూ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే . ఈ భయంకర వీరులు ఉత్పన్నమైరి. వీరెవ్వరు? (38). హే విధీ! వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరినామము ఏమి? ఈ విషయములను చెప్పి, వీరిని నియోగింపుము (39). వారికి స్థానమునిచ్చి, పేరు పెట్టి, వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశా! అపుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము (40).

బ్రహ్మోవాచ |

ఇతి తద్వాక్యమాకర్ణ్య మునేsహం లోకకారకః | తమవోచం హ మదనం తేషాం కర్మాదికం దిశన్‌ || 41

ఏత ఉత్పన్న మాత్రా హి మారయేత్యవదన్వచః | ముహుర్ముహురతోsమీషాం నామ మారేతి జాయతామ్‌ || 42

సదైవ విఘ్నం జంతూనాం కరిష్యన్తి గణా ఇమే | వినా నిజార్చనం కామ నానా కామరతాత్మన్మామ్‌ || 43

తవాను గమనం కర్మ ముఖ్యమేషాం మనోభవ | సహాయినో భవిష్యంతి సదా తవ న సంశయః || 44

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! సృష్టికర్తనను నేను మన్మథుని ఆ వాక్యమును విని వారి కర్తవ్యము, పేరు ఇత్యాదులను నిర్దేశిస్తూ, మన్మథునితో నిట్లంటిని (41). వీరు పుట్టుచుండగనే 'మారయ (చంపుడు)' అని పలుమార్లు అరచిరి గాన, వీరికి మారులు అనుపేరు సార్థకమగు గాక! (42). ఈ గణములు తమను అర్చించకుండగా వివిధములగు కామనలను పొందగోరు మానవులకు సర్వదా విఘ్నములను కలిగించెదరు (43). హే మన్మథా! నిన్ను అనుసరించి ఉండుట వీరి ప్రధాన కర్తవ్యము. వీరు ఎల్ల వేళలా నిన్ను అను సరించి ఉందురనుటలో సందియము లేదు (44).

యత్ర యత్ర భవాన్‌ యాతా స్వకర్మార్థం యదా యదా | గంతా స తత్ర తత్రైతే సహాయార్థం తదా తదా || 45

చిత్త భ్రాంతిం కరిష్యన్తి త్వదస్త్ర వశ వర్తి నామ్‌ | జ్ఞానినాం జ్ఞాన మార్గం చ విఘ్న యిష్యంతి సర్వథా || 46

ఇత్యాకర్ణ్య వచో మే హి సరతిస్సహానుగః | కించిత్ర్పసన్న వదనో బభూవ మునిసత్తమ || 47

శ్రుత్వా తేsపి గణాస్సర్వే మదనం మాం చ సర్వతః | పరివార్య యథాకామం తస్థుస్తత్ర నిజాకృతిమ్‌ || 48

నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించుటకై ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడకు వెళ్లెదవో, అప్పుడప్పుడు అక్కడక్కడకు వీరు నీ సహయము కొరకు అనుసరించి రాగలరు (45). నీ అస్త్రములకు వశమగు మానవులకు వీరు చిత్తభ్రాంతిని కలిగించెదరు. వీరు జ్ఞానుల జ్ఞానమార్గమునకు అనేక విధముల విఘ్నములను కలిగించెదరు (46). ఓ మహర్షీ! ఈ నా మాటను విని, రతీ దేవితో మరియు అనుచరులతో కూడియున్న మన్మథుని ముఖములో కొంత ప్రసన్నత కానవచ్చెను (47). ఆ గణములన్నియూ కూడ ఈ మాటను విని, నన్ను మన్మథుని చుట్టు వారి యథేచ్చగా అచట నిలబడి యుండిరి (48).

అథ బ్రహ్మాస్మం ప్రీత్యాsగదన్మే కురు శాసనమ్‌ | ఏభిస్సహైవ గచ్ఛ త్వం పునశ్చ హరమోహనే|| 49

మన ఆధాయ యత్నాద్ధి కురు మారగణౖస్సహ | మోహో భ##వేద్యథా శంభోర్దారగ్రహణ హేతవే || 50

ఇత్యాకర్ణ్య వచః కామః ప్రోవాచ వచనం పునః | దేవర్షే గౌరవం మత్వా ప్రణమ్య వినయేన మామ్‌ || 51

అపుడు బ్రహ్మ మన్మథుని ఉద్దేశించి ప్రీతితో నిట్లనెను. నా ఆజ్ఞను పాలింపుము. నీవు మరల వీరితో గూడి వెళ్లుము. మనస్సును లగ్నము చేసి శివుని మోహింపజేయు (49) యత్నమును చేయుము . ఈ మారగణములతో సహావెళ్లి, శివుడు మోహమును పొందునట్లు చేయుము. అపుడు శివుడు వివాహమును చేసుకొనగలడు (50). ఈ మాటలను విని మన్మథుడు నన్ను మర్యాద చేసి వినయముతో ప్రణమిల్లెను. ఓ దేవర్షీ! అపుడాతడు నాతో నిట్లనెను.

కామ ఉవాచ |

మయా సమ్యక్‌ కృతం కర్మ మోహనే తస్య యత్నతః | తన్మో హో నా భవత్తాత న భవిష్యతి నాధునా || 52

తవ వాగ్గౌరవం మత్వా దృష్ట్వా మారగణానపి | గమిష్యామి పునస్తత్ర సదారోహం త్వదాజ్ఞయా || 53

మనో నిశ్చితమేతద్ధి తన్మోహో న భవిష్యతి | భస్మ కుర్యాన్న మే దేహమితి శంకాస్తి మే విధే || 54

ఇత్యుక్త్వా సమధుః కామస్సరతిస్సభయస్తదా |య¸° మారగణౖస్సార్ధం శివ స్థానం మునీశ్వర || 55

మన్మథుడు ఇట్లు పలికెను -

తండ్రీ! శివుని మోహింపజేయు ప్రయత్నమును నేను శ్రద్ధగా చేసితిని. కాని ఆయన మోహమును పొందలేదు. ఇపుడు గాని ఆతడు మోహమును పొందడు (52). నీ మాట యందలి గౌరవముతో నీ యాజ్ఞాను సారముగా నేను మరల శివుని ధామమునకు వెళ్లెదను. ఈ మారగణములు నాకు కొంత ఆశను కల్గించు చున్నవి (53). కాని నా మనస్సు లో శివుడు మోహమును పొందడనియే నిశ్చయముగా తోచుచున్నది. హే బ్రహ్మన్‌ ! శివుడు నా దేహమును భస్మము చేయడు గదా యను శంక నాకు గలదు (54). మన్మథుడు ఇట్లు పలికి భయము గలవాడై వసంతునితో, రతీ దేవితో గూడి అపుడు శివుని ధామమునకు వెళ్లెను. ఓముని శ్రేష్ఠా! మారగణములు కూడ ఆతనిని అనుసరించినవి (55).

పూర్వవత్స్వ ప్రభావం చ చక్రే మన సిజస్తదా | బహూపాయం స హి మధుర్వివిధాం బుద్ధి మావహన్‌ || 56

ఉపాయం స చకారాతి తత్ర మారగణోsపి చ | మోహోs భవన్న వై శంభో రపి కశ్చిత్పరాత్మనః || 57

నివృత్త్య పునరాయతో మమ స్థానం స్మరస్తదా | ఆసీన్మారగణోs గర్వోsహర్షోమేsపి పురస్థ్సితః || 58

కామః ప్రోవాచ మాం తాత ప్రణమ్య చ నిరుత్సవః | స్థిత్వా మమ పురోsగర్వో మారైశ్చ మధునా తదా || 59

అపుడు మన్మథుడు పూర్వమునందు వలెనే వసంతునితో గూడి బాగుగా ఆలోచించి అనేక ఉపాయములను శివుని పై ప్రయేగించి తన ప్రభావమును చూపెను (56). మారగణములు కూడా అనే ఉపాయములను చేసిరి. కాని శివ పరమాత్మకు మోహము కలుగనే లేదు (57). అపుడు మన్మథుడు వెనుదిరిగి నా స్థానమునకు వచ్చెను. మారగణములు గర్వమును వీడి దుఃఖముతో నా ముందు నిలబడెను (58), కుమారా! అపుడు నిరుత్సాహముతో నిండియున్న మన్మథుడు మారగణులతో, వసంతునితో గూడి గర్వమును వీడి నా ముందు నిలబడి ఇట్లు పలికెను (59).

కృతం పూర్వాదధికతః కర్మ తన్మోహనే విధే | నాభవత్తస్య మోహోsపి కశ్చి ద్ధ్యా నరతాత్మనః || 60

న దగ్ధా మే తనుశ్చైవ తత్ర తేన దయాలునా | కారణం పూర్వపుణ్యం చ నిర్వికారీ స వై ప్రభుః || 61

చేద్వరస్తే హరో భార్యాం గృహ్ణీ యాదితి పద్మజ | పరోపాయం కురు తదా విగర్వ ఇతి మే మతి ః || 62

హే బ్రహ్మన్‌! శివుని మోహింప జేయు యత్నమును పూర్వము కంటె అధికముగా చేసితిని. కాని ధ్యానమునందు లగ్నమైన మనస్సు గల శివునకు మోహము లేశ##మైననూ కలుగలేదు (60). దయామయుడగు శివుడు నా దేహమును భస్మము చేయలేదు. పూ ర్వపుణ్యమే దీనికి కారణమై యుండును. ఆ ప్రభువు నందు వికారము లేమియూ కలుగలేదు (61). ఓ పద్మ సంభవా! శివుడు వివాహమాడ వలెననే ఇచ్ఛ నీకు ఉన్నచో, నీవు గర్వమును వీడి, మరియొక ఉపాయమును చేయవలెనని నా అభిప్రాయము (62).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా సపరివారో య¸° కామస్స్వమాశ్రమమ్‌ | ప్రణమ్య మాం స్మరన్‌ శంభుం గర్వదం దీనవత్సలమ్‌ || 63

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీ ఖండే కామప్రభావ మారగణోత్పత్తి వర్ణనం నామ నవమోsధ్యాయః (9).

బ్రహ్మ ఇట్లు పలికెను -

మన్మథుడిట్లు పలికి , నాకు నమస్కరించి, గర్వమును దునుమువాడు దీనులపై ప్రేమను గురిపించువాడునగు శంభుని స్మరించుచూ, తన అనుచరులతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లెను (63).

శ్రీశివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో కామ ప్రభావము - మారగణముల పుట్టుక అనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Sri Sivamahapuranamu-I    Chapters