Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్వాదశోsధ్యాయః

దక్షునకు వరము

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ శంభువర ప్రాజ్ఞ సమ్యగుక్తం త్వయానఘ | శివాశివచరిత్రం చ పావితం జన్మ మే హితమ్‌ || 1

ఇదానీం వద దక్షస్తు తపః కృత్వా దృఢవ్రతః | కం వరం దేవ్యాస్తు కథం సా దక్షజాభవత్‌ || 2

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నీకు శివతత్త్వము బాగుగా తెలియును. హే పుణ్యాత్మా! నీవు ఉమాశివుల హితకరమగు చరితమును చక్కగా చెప్పి, నా జన్మను పవిత్రము చేసితివి (1). దృఢముగా వ్రతనియమములను పాలించే దక్షుడు తపస్సును చేసి, దేవి నుండి ఏ వరమును పొందెను? ఆమె దక్షుని కుమార్తె ఎట్లు ఆయెను? ఈగాధను ఇప్పుడు చెప్పుము (2).

బ్రహ్మోవాచ |

శృణు నారద ధన్యస్త్వం మునిభిర్భక్తితో s ఖిలైః |యథా తేపే తపో దక్షో వరం ప్రాచ చ సువ్రతః || 3

మదాజ్ఞప్తస్సుధీర్దక్ష స్సమాధాయ మహాధిపః | అపాద్యష్టుం చ తాం దేవీం తత్కామో జగదంబికామ్‌ || 4

క్షీరదోత్తర తీరస్థో తాం కృత్వా హృదయస్థితామ్‌ | తపస్తప్తుం సమారేభే ద్రష్టుం ప్రత్యక్ష తోంబికామ్‌ || 5

దివ్యవర్షేణ దక్షస్తు సహస్రాణాం త్రయం సమాః | తపశ్చ చార నియతస్సంయతాత్మ దృఢవ్రతః || 6

ఓ నారదా! మునులందరితో గూడి భక్తితో వినుము. నీవు ధన్యుడవు. దృఢవ్రతుడగు దక్షుడు తపమాచరించిన విధమును చెప్పెదను (3). బుద్ధిశాలి, గొప్ప సమర్థుడు అగు దక్షుడు నాచే ఆజ్ఞాపింపబడిన వాడై జగదంబయగు ఆ ఉమాదేవిని కుమార్తెగా పొందగోరి (4), క్షీర సముద్రము యొక్క ఉత్తర తీరమునందు ఉన్నవాడై, ఆ తల్లిని ప్రత్యక్షముగా దర్శించగోరి, ఆమెను హృదయములో నిశ్చలముగా భావన చేసి, తపస్సును చేయుటకు ఆరంభించెను (5). వ్రతమును దృఢముగా పాలించే దక్షుడు విజితేంద్రియుడై మూడు వేల దివ్య సంవత్సరములు నియమముతో తపస్సును చేసెను (6).

మారుతాశీ నిరాహారో జలాహారీ చ పర్ణభుక్‌ | ఏవం నినాయ తం కాలం చింతయన్‌ తాం జగన్మయీమ్‌ || 7

దుర్గాధ్యాన సమాసక్తశ్చిరం కాలం తపోరతః | నియమైర్బహుభిర్దేవీ మారాధయతి సువ్రతః || 8

తతో యమాది యుక్తస్య దక్షస్య మునిసత్తమ | జగదంబాం పూజయతః ప్రత్యక్ష మభవచ్ఛివా || 9

తతః ప్రత్యక్షరో దృష్ట్వా జగదంబాం జగన్మయీమ్‌ | కృతకృత్య మథాత్మానం మేనే దక్షః ప్రజాపతిః || 10

ఆతడు గాలిని భక్షించి ఇతర ఆహారము లేనివాడై, ఒకప్పుడు నీటిని మాత్రమే త్రాగి, మరియొకప్పుడు ఆకులను భక్షించి జగద్రూపిణియగు ఆ తల్లిని ధ్యానిస్తూ అన్ని సంవత్సరముల కాలమును గడిపెను (7). మంచి వ్రతనిష్ఠ గల ఆతడు అనేక నియమములతో తపోనిష్ఠుడై ప్రతిదినము చిరకాలము దుర్గను ధ్యానించుచూ, ఆ దేవిని ఆరాధించెను (8). ఓ మహర్షీ! అపుడు యమనియమాదులతో గూడి జగన్మాతను పూజించుచున్న దక్షునకు ఆ ఉమాదేవి ప్రత్యక్షమయ్యెను (9). దక్ష ప్రజాపతి జగద్రూపిణియగు జగదంబను ప్రత్యక్షముగా చూసి తన జన్మ చరితార్థమైనదని తలంచెను (10).

సింహస్థాం కాలికాం కృష్ణాం చారువక్త్రాం చతుర్భుజామ్‌ | వరదా భయనీలాబ్జ ఖడ్గహస్తాం మనోహరామ్‌ || 11

ఆరక్తనయనాం చారుముక్తకేశీం జగత్ర్పసూమ్‌ | తుష్టావ వాగ్భిశ్చిత్రాభిస్సుప్రణమ్యాథ సుప్రభామ్‌ || 12

సింహమునధిష్ఠించినది, నల్లని వర్ణము గలది, సుందరమగు ముఖము గలది, నాల్గు చేతులు గలది, వరముద్ర అభయముద్ర నల్లని కలువ మరియు ఖడ్గము అను వాటిని నాల్గు హస్తములలో ధరించి రమ్మయముగా నున్నది (11). ఎర్రని నేత్రములు గలది, వ్రేలాడుచున్న అందమగు శిరోజములు గలది, గొప్ప కాంతి గలది అగు ఆ జగన్మాతను నమస్కరించి ఆతుడు చిత్రములగు వాక్కులతో స్తుతించెను (12).

దక్ష ఉవాచ |

జగదంబ మహామాయే జగదీశే మహేశ్వరి | కృపాం కృత్వా నమస్తేస్తు దర్శితం స్వవపుర్మమ || 13

ప్రసీద భగవత్యాద్యే ప్రసీద శివరూపిణి | ప్రసీద భక్తవరదే జగన్మాయే నమోsస్తుతే || 14

దక్షుడిట్లు పలికెను -

ఓ జగన్మాతా! మహామాయా! జగత్పాలనీ! మహేశ్వరీ! నీకు నమస్కారము. నీవు నాపైదయచూపి నాకు ప్రత్యక్షమైతివి (13). ఓ ఆదిభగవతీ! దయ చూపుము. శివస్వరూపిణీ! ప్రసన్నురాలవు కమ్ము. భక్తులకు వరములనిచ్చు ఓ తల్లీ! అనుగ్రహించుము ఓ జగన్మాయా! నీకు నమస్కారమగు గాక! (14).

బ్రహ్మోవాచ |

ఇతి స్తుతా మహేశానీ దక్షేణ ప్రయతాత్మనా | ఉవాచ దక్షం జ్ఞాత్వాపి స్వయం తస్యేప్సితం మునే || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దక్షుడు దేవియందు లగ్నమైన మనస్సు గలవాడై ఇట్లు ప్రార్ధించగా, ఆ మహేశ్వరి ఆతని కోరిక తెలిసి ఉండియూ, దక్షునితో నిట్లనెను (15).

దేవ్యువాచ |

తుష్టాహం దక్ష భవతస్సద్భక్త్యాహ్యనయా భృశమ్‌ | వరం వృణీష్వ స్వాభీష్టం నాదేయం విద్యతే తవ || 16

దేవి ఇట్లు పలికెను -

హే దక్షా! నీ మంచి భక్తిచే నేను మిక్కిలి సంతసించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (16).

బ్రహ్మోవాచ |

జగదంబ వచశ్ర్శుత్వా తతో దక్షః ప్రజాపతిః | సుప్రహృష్టతరః ప్రాహ నామం నామం చ తాం శివామ్‌ || 17

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్ష ప్రజాపతి జగన్మాత యొక్క పలుకులను విని, మిక్కిలి సంతసించిన వాడై, ఆ ఉమాదేవికి అనేక పర్యాయములు నమస్కరించి ఇట్లు పలికెను (17).

దక్ష ఉవాచ |

జగదంబ మహామాయే యది త్వం వరదా మమ | మద్వచశ్శృణు సుప్రీత్యా మమ కామం ప్రపూరయ || 18

మమ స్వామీ శివో యో హి స జాతో బ్రహ్మణస్సుతః | రుద్ర నామా పూర్ణరూపావతారః పరమాత్మ నః || 19

తవావతారో నో జాతః కా తత్పత్నీ భ##వేదతః | తం మోహయ మహేశానమవతీర్య క్షితౌ శివే || 20

త్వదృతే తస్య మోహాయ న శక్తాన్యా కదాచన | తస్మాన్మమ సుతా భూత్వా హరజాయా భవాsధునా || 21

దక్షుడు ఇట్లు పలికెను -

హే జగన్మాతా! మహామాయవునీవే. నీవు నాకు వరమీయ దలచినచో, ప్రీతితో నా మాటను విని, నా కోరిన వరమును ఇమ్ము (18). నా ప్రభువగు శివ పరమాత్మ పూర్ణావతారుడై రుద్రుడు అను పేరుతో బ్రహ్మకు కుమారుడై జన్మించెను (19). కాని నీవు ఇంకనూ అవతరించలేదు. ఆయనకు నీవు తక్క మరి ఎవ్వరు భార్య కాగల్గుదురు ? హే శివే! నీవు భూమి యందవతరించి ఆ మహేశ్వరుని మోహింపజేయుము (20). నీవు తక్క మరియొకరు ఏనాడైననూ ఆయనను మోహింపచేయజాలరు. కావున నీవు నాకు కుమార్తెవై జన్మించి హరునకు పత్నివి కమ్ము (21).

ఇత్థం కృత్వా సులీలాం చ భవ త్వం హరమోహినీ | మమైవైష వరో దేవి సత్యముక్తం తవాగ్రతః || 22

కేవలం స్వార్థమితి చ సర్వే షాం జగతామపి | బ్రహ్మ విష్ణు శివానాం చ బ్రహ్మణా ప్రేరితో హ్యహమ్‌ || 23

నీవు ఇట్టి చక్కని లీలను ప్రదర్శించి శివుని మోహింపజేయుము. ఓ దేవీ! ఇదియే నేను గోరు వరము. నీ ఎదుట సత్యమును పలికితిని (22). దీనిలో నా స్వార్థము మాత్రమే గాక, సర్వ జగత్తుల క్షేమము, బ్రహ్మ విష్ణుశివల ఆకాంక్ష కూడ గలవు. ఈ పనికి బ్రహ్మ నన్ను ప్రేరేపించెను (23).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య ప్రజేశస్య వచనం జగదంబికా | ప్రత్యువాచ విహస్యేతి స్మృత్వాతం మనసా శివమ్‌ || 24

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగన్మాత ప్రజాపతి యొక్క ఈ మాటను విని, నవ్వి, మనస్సులో శివుని స్మరించి, ఇట్లు బదులిడెను (24).

దేవ్యువాచ |

తాత ప్రజాపతే దక్ష శృణు మే పరమం వచః | సత్యం బ్రవీమి త్వద్భక్త్యా సుప్రసన్నాఖిల ప్రదా || 25

అహం తవ సుతా దక్ష త్వ జ్ఞయాయాం మహేశ్వరీ | భవిష్యామి న సందేహస్త్వద్భక్తి వశవర్తినీ || 26

తథా యత్నం కరిష్యామి తపః కృత్వా సుదుస్సహమ్‌ | హరజాయా భవిష్యామి తద్వరం ప్రాప్య చానఘ || 27

నాన్యథా కార్యసిద్ధిర్హి నిర్వికారీ చ స ప్రభుః | విధేర్విష్ణోశ్చ సంసేవ్యః పూర్ణ ఏవ సదాశివః || 28

దేవి ఇట్లు పలికెను -

వత్సా! దక్ష ప్రజాపతీ!నేను చెప్పే హితకరమగు మాటను వినుము. నేను సత్యమును చెప్పెదను. నేను నీ భక్తిచే మిక్కిలి ప్రసన్నురాలనైతిని. నీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చెదను (25). హే దక్షా! మహేశ్వరినగు నేను నీభక్తికి వశురాలనై నీ భార్యయందు నీ కుమార్తెగా జన్మించెదను. దీనిలో సందేహము లేదు (26). హే అనఘా! ఘోరమైన తపస్సను ను చేసి శివుని వరమును పొంది శివునకు భార్యను కాగల్గే విధముగా యత్నించెదను (27). కార్యసిద్ధికి తపస్సు తక్క మరియొక మార్గము లేదు. ఆ ప్రభువు వికారరహితుడు. బ్రహ్మ విష్ణువులచే సేవింపబడువాడు. సదాశివుడు మాత్రమే పూర్ణుడు (28).

అహం తస్య సదా దాసీ ప్రియా జన్మని జన్మని | మమ స్వామీ స వై శంభుర్నా నా రూప ధరోపి హ || 29

వరప్రభావాద్ర్భు కుటేరవతీర్ణో విధేస్స్మచ | అహం తద్వరతో పీహా వతరిష్యే తదాజ్ఞయా || 30

గచ్ఛ స్వభవనం తాత మయా జ్ఞాతా తు దూతికా | హరజాయా భవిష్యామ భూతా తే తనయాsచిరాత్‌ || 31

నేను ఆయనకు జన్మ జన్మల యందు దాసిని, ప్రియురాలను. శివుడు అనేక రూపములను ధరించిననూ నా ప్రభువు ఆయనయే (29). ఆయన వర ప్రభావముచే బ్రహ్మ యొక్క కనుబొమనుండి అవతరించివాడు. నేను కూడా ఆయన వరము వలన ఆయన ఆదేశముచే ఈ లోకమునందు అవతరించగలను (30). వత్సా! నీవు ఇంటికి వెళ్లుము. నాకు, శివునకు మధ్య దౌత్యమును చేయవలసిన వ్యక్తిని కూడా నేను ఎరుంగుదును. నేను కొద్దికాలములో నీకు కుమార్తెగా జన్మించి, శివుని భార్య కాగలను (31).

ఇత్యుక్త్వా సద్వచో దక్షం శివాజ్ఞాం ప్రాప్య చేతసి | పునః ప్రోవాచ సా దేవీ స్మృత్వా శివపదాంబుజమ్‌ || 32

పరం తు పణ ఆధే యో మనసా తే ప్రజాపతే | శ్రావయిష్యామి తే తం వై సత్యం జానీహి నో మృషా || 33

యదా భవాన్మయి పునర్భవేన్మందాదరస్తదా | దేహం త్యక్ష్యే నిజం సత్యం స్వాత్మన్యస్మయథవేతరమ్‌ || 34

ఏష దత్తస్తవ వరః ప్రతిసర్గం ప్రజాపతే | అహం తవ సుతా భూత్వా భవిష్యామి హరప్రియా || 35

ఆ దేవి దక్షునితో ఇట్లు మంచి వచనములను పలికి, మనస్సులో శివుని ఆజ్ఞను పొంది, శివుని పాదపద్మములను స్మరించి, మరల ఇట్లు పలికెను (32). హే ప్రజాపతే! కాని, ఒక షరతు గలదు. నీవు దీనిని నీ మనస్సులో దృఢముగా నుంచుకొనుము. నేను నీకు ఆ షరతును చెప్పెదను. అది సత్యమనియు, అసత్యము కాదనియు తెలుసుకొనుము (33). ఏనాడైతే నీవు నాయందు ఆదరమును కోల్పోయెదవో, ఆనాడు నేను నా దేహమును విడిచి పెట్టెదను. ఇది సత్యము. దేహమును వీడి నేను స్వస్వరూపము నందుండెదను. లేదా, మరియొక దేహమును ధరించెదను (34). ఓ ప్రజాపతీ! ప్రతికల్పముందు నీకు ఈ వరమీయబడినది. నేను నీ కుమార్తెగా జన్మించి, హరునకు పత్ని కాగలను (35).

బ్రహ్మోవాచ |

ఏవముక్త్వా మహేశానీ దక్షం ముఖ్య ప్రజాపతిమ్‌ | అంతర్దధే ద్రుతం తత్ర సమ్యగ్ధక్షస్య పశ్యతః || 36

అంతర్హితాయాం దుర్గాయాం స దక్షోsపి నిజాశ్రమమ్‌ | జగామ చ ముదం లేభే భవిష్యతి సుతేతి సా || 37

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే దక్ష వరప్రాప్తివర్ణనం నామ ద్వాదశోsధ్యాయః (12).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ప్రజాపతులలో ముఖ్యుడగు దక్షునితో నిట్లు పలికి ఆ మహేశ్వరి వెంటనే దక్షుడు చూచుచుండగా అచటనే అంతర్థానమయ్యెను (36). ఆ దక్షుడు దుర్గ అంతర్ధానము కాగానే తన ఆశ్రమమునకు వెళ్లెను. ఆమె కుమార్తెగా జన్మించ బోవుచున్నందుల కాతడు సంతసించెను (37).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో దక్షవరప్రాప్తి అనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Sri Sivamahapuranamu-I    Chapters