Sri Sivamahapuranamu-I
Chapters
అథ త్రయోదశోsధ్యాయః నారదునకు శాపము నారద ఉవాచ | బ్రహ్మన్విధే మహాప్రాజ్ఞ వద నో వదతాం వర | దక్షే గృహం గతే ప్రీత్యా కిమభూత్తదనంతరమ్ ||
1 నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మన్ ! విధీ! నీవు మహా బుద్ధిశాలివి. ప్రవక్తలలో శ్రేష్ఠుడవు. దక్షుడు ప్రీతితో ఇంటికి వెళ్లిన తరువాత ఏమయినది? మాకు చెప్పుము (1). బ్రహ్మోవాచ | దక్షః ప్రజాపతిర్గత్వా స్వాశ్రమం హృష్టమానసః | సర్గం చకార బహుధా మానసం మమ చాజ్ఞయా ||
2 తమ బృంహిత మాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః | దక్షో నివేదయామాస బ్రహ్మణ జనకాయమే ||
3 బ్రహ్మ ఇట్లు పలికెను - దక్ష ప్రజాపతి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై తన ఆశ్రమమునకు వెళ్లి నా ఆజ్ఞచే అనేక తెరంగుల మానసిక సృష్టిని చేసెను (2). దక్ష ప్రజాపతి ఆ సృష్టిలో వృద్ధి లేకపోవుటను గాంచి తండ్రియగు నాకు నివేదించెను (3). దక్ష ఉవాచ | బ్రహ్మం స్తాత ప్రజానాథ వర్థంతే న ప్రజాః ప్రభో | మయా విచరితాస్సర్వాస్తావత్యో హి స్థితాః ఖ లు ||
4 కిం కరోమి ప్రజానాథ వర్థేయుః కథమాత్మనా |తదుపాయం సమాచక్ష్వ ప్రజాః కుర్యాం న సంశయః ||
5 దక్షుడిట్లు పలికెను - హే బ్రహ్మన్! తండ్రీ! ప్రజాపతీ! ప్రభూ! నాచే సృష్టింపబడిన సంతానములో వృద్ధి ఏమియూ కానవచ్చుట లేదు . ఎంతమందిని సృష్టించితినో, అంతమందియే ఉన్నారు (4). హే ప్రజానాథా! నేను ఏమి చేయుదును? ఈ సంతానము తనంత తాను వృద్ధి పొందు ఉపాయమును చెప్పుము. నేను సృష్టిని చేసెదను. దానిలో సంశయము లేదు (5). బ్రహ్మోవాచ | దక్ష ప్రజాపతే తాత శృణు మే పరమం వచః | తత్కురుష్వ సురశ్రేష్ఠ శివస్తే శం కరిష్యతి || 6 యా చ పంచ జనస్యాంగ సుతా రమ్యా ప్రజాపతేః | అసిక్నీ నామ పత్నీత్వే ప్రజేశ ప్రతిగృహ్యతామ్ || 7 వామావ్య వాయధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః | తద్విధాయం చ కామిన్యాం భూరిశో భావయిష్యసి || 8 తతస్సముత్పాదయితం ప్రజామైథునధర్మతః | ఉపయేమే వీరణస్య నిదేశాన్మేసుతాం తతః || 9 బ్రహ్మ ఇట్లు పలికెను - వత్సా! దక్ష ప్రజాపతీ! నా మంచి మాటను విని అటులనే చేయుము. నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. శివుడు నీకు శుభమును చేయగలడు (6). కుమారా! పంచజన ప్రజాపతికి అసిక్నియను అందమైన కుమార్తె గలదు. ఓ ప్రజాపతీ! నీవు ఆమెను భార్యగా స్వీకరించుము (7). నీవు అట్టి సుందరియగు భార్యయందు మైథున ధర్మముచే ఈ ప్రజాసృష్టిని విస్తారముగా చేయగలవు (8). అపుడు దక్షుడు నా ఆదేశముచే వీరణుని (పంచజనుని ) కుమార్తెను, మైథున ధర్మముచే సంతానమును గనుటకై వివాహమాడెను (9). అథ తస్యాం స్వపత్న్యాం చ వీరిణ్యాం స ప్రజాపతిః | హర్యశ్వ సంజ్ఞానయుతం దక్షః పుత్రా నజీజనత్ || 10 అపృథగ్ధర్మశీలాస్తే సర్వ ఆసన్ సుతా మునే | పితృభక్తిరతా నిత్యం వేదమార్గ పరాయణాః || 11 పితృప్రోక్తాః ప్రజాసర్గకరణార్థం యయుర్దిశమ్ | ప్రతీచీం తపసే తాత సర్వే దాక్షాయణా స్సుతా ః || 12 తత్ర నారాయణ సరస్తీర్థం పరమపావనమ్ | సంగమో యత్ర సంజాతో దివ్య సింధుసముద్రయోః || 13 అపుడా దక్ష ప్రజాపతి వీరణుని కుమార్తె యగు అసిక్నియందు హర్యశ్వులు అను పేరుగల పదివేల మంది కుమారులను గనెను (10). ఓ మహర్షీ! వారందరు ఒకే ధర్మము గలవారై ఉండిరి. వారు తండ్రియందు భక్తి గలవారై నిత్యము వేదమార్గము నందు నిష్ఠ కలిగియుండిరి (11). తండ్రి వారిని సంతానమును గనుడని చెప్పెను వత్సా! ఆ దక్షపుత్రులందరు తపస్సు కొరకు పశ్చిమ దిక్కునకు వెళ్లిరి (12). అచట దివ్యమగు సింధునది సముద్రములో కలిసే సంగమము వద్ద పరమ పవిత్రమైన నారాయణ సరస్సు అనే తీర్థము గలదు (13). తదుపస్పర్శనా దేవ ప్రోత్పన్న మతయోsభవన్ | ధర్మే పారమహం సే చ వి నిర్ధూతమలాశయాః || 14 ప్రజావివృద్ధయే తే వై తేపిరే తత్ర సత్తమాః | దాక్షాయణా దృఢాత్మానః పిత్రాదేశ సుయంత్రితాః || 15 త్వం చ తాన్నారద జ్ఞాత్వా తపతస్సృష్టి హేతవే | అగమస్తత్ర భావం చ హార్దమాజ్ఞాయ మాపతేః || 16 అదృష్ట్వాంతం భువస్సృష్టిం కథం కుర్తుం సముద్యతాః | హర్యశ్వా దక్షతనయా ఇత్యవోచస్త మాదరాత్ || 17 తన్నిశమ్యాథ హర్యశ్వాస్తే త్వదుక్త మతంద్రితాః | ఔత్పత్తి కధియస్సర్వే స్వయం విమమృశుర్భృశమ్ || 18 ఆ జలములను స్పృశించినంతనే వారి హృదయములలోని మాలిన్యములు క్షాళితమై పోయెను. వారి బుద్ధి పరమ హంస ధర్మము (నివృత్తి ధర్మము) నందు పరినిష్ఠితమయ్యెను (14). పుణ్యాత్ములు, జితేంద్రియులు అగు దక్షపుత్రులు తండ్రియొక్క ఆదేశముచే నియంత్రింపబడిన వారై, సంతాన వృద్ధి కొరకై అచట తపస్సును చేయుచున్నారని నీకు తెలిసినది. నీవు విష్ణువు హృదయములోని భావమునెరింగి అచటకు వెళ్లితివి (16). దక్షకుమారులారా! హర్యశ్వులారా! భూమి యొక్క అంతము నెరుంగనే మీరు సృష్టిని చేయుటకు ఎట్లు సిద్ధమైతిరి? అని నీవు ఆదరముతో ప్రశ్నించితివి (17). ఆ హర్యశ్వులు జాగరూకులై నీ మాటను వినిరి. వారందరు పుట్టుకతోడనే బుధ్దిశాలురు గదా ! వారు నీ మాటలను సమగ్రముగా విచారణ చేసిరి (18). సుశాస్త్ర జనకాదేశం యో న వేద నివర్తకమ్ | స కథం గుణవిశ్రంభీ కర్తుం స ర్గముపక్రమే త్ || 19 ఇతి నిశ్చిత్య తే పుత్రా స్సుధియశ్చైక చేతసః | ప్రణమ్య తం పరిక్రమ్యాయుర్మార్గ మనివర్తకమ్ || 20 నారద త్వం మనశ్శంభోర్లో కానన్యచరో మునే | నిర్వికారో మహేశాన మనోవృత్తికరస్సదా || 21 కాలే గతే బహుతరే మమ పుత్రః ప్రజాపతిః | నాశం నిశమ్య పుత్రాణాం నారదా దన్వతప్యత || 22 శాస్త్రమే తండ్రి. శాస్త్రము నివృత్తిని బోధించుచున్నది. అట్టి శాస్త్రాదేశమును తెలియనివాడు త్రిగుణములను నమ్ముకొని సృష్టికి పూనుకొనుట యెట్లు పొసగును? (19). బుద్ది శాలులు, దృఢనిశ్చయము గలవారునగు ఆ దక్ష పుత్రులు ఇట్లు నిశ్చయించుకొని, ఆ నారదునకు నమస్కరించి, ప్రదక్షిణము చేసి పునరావృత్తి లేని జ్ఞానమార్గములోనికి వెళ్లిరి (20). ఓ నారదా! శంభుని మనస్సు నీవే (ఎరుంగుదువు) .ఓ మహర్షీ! నీవు ఒంటరిగా లోకములను తిరుగాడెదవు. నీవు వికారములు లేనివాడవై సర్వదా మహేశ్వరుని మనోవృత్తులను (ఆశయములను ) నెరవేర్చెదవు (21). చాల కాలము గడచిన తరువాత నా కుమారుడగు దక్ష ప్రజాపతి తన కుమారులు నారదుని వలన ప్రవృత్తి మార్గము నుండి తొలగిరని విని మిక్కిలి దుఃఖించెను (22). ముహుర్ముహురువాచేతి సుప్రజాత్వం శుచం పదమ్ | శుశోచ బహుశో దక్ష శ్శివమాయా విమోహితః || 23 అహమాగత్య సుప్రీత్యా సాంత్వయం దక్ష మాత్మజమ్ | శాంతి భావం ప్రదర్శ్యైవ దేవం ప్రబలమిత్యత || 24 అథ దక్షః పాంచజన్యాం మయా స పరిసాంత్వితః | శబలాశ్వాభిధాన్ పుత్రాన్ సహస్రం చాప్య జీజనత్ || 25 తేsపి జగ్ముస్తత్ర సుతాః పిత్రాదిష్టా దృఢవ్రతాః | ప్రజాసర్గే యత్ర సిద్ధా స్స్వపూర్వభ్రాతరో యయుః || 26 మంచి కుమారులను కలిగి యుండుట దుఃఖములకు నిధానము అని పలుమార్లు పలుకుచూ దక్షడు శివమాయచే మోహితుడై అనేక విధములుగా దుఃఖించెను (23). నేను వచ్చి కుమారుడగు దక్షునకు శాంతముగా నుండుమనియు, దైవము బలీయమైనదనియు చెప్పి ప్రీతిపూర్వకముగా ఓదార్చితిని (24). నాచే ఇట్లు ఓదార్చ బడిన దక్షుడు పాంచజన్య (పంచజనుని కుమార్తె) యను తన భార్యయందు శబలాశ్వులను పేరుగల వేయిమంది కుమారులను గనెను (25). దృఢమైన వ్రతము గల ఆ దక్షపుత్రులు కూడా తండ్రిచే ఆదేశింపబడిన వారై ప్రజా సృష్టిని చేయగోరి, తమ సోదరులు పూర్వము సిద్ధి పొందిన తీర్థమునకే వెళ్లిరి (26). తదుపస్పర్శనాదేవ నష్టాఘా విమలాశయాః | తేపుర్మహత్తపస్తత్ర జపంతో బ్రహ్మ సువ్రతాః || 27 ప్రజాసర్గోద్యతాంస్తాన్ వై జ్ఞాత్వా గత్వేతి నారద | పూర్వవచ్చాగదో వాక్యం సంస్మరన్నైశ్వరీం గతిమ్ || 28 భ్రాతృపంథాన మాదిశ్య త్వం మునేsమోఘదర్శనః | అయశ్చోర్ధ్వగతిం తేsపి భ్రాతృమార్గం యయుస్సుతాః || 29 ఉత్పాతాన్ బహుశోsపశ్యత్తదైవ స ప్రజాపతిః | విస్మితోsభూత్స మేపుత్రో దక్షో మనసి దుఃఖితః || 30 పూర్వ వత్త్వత్కృతం దక్ష శ్శుశ్రావ చకితో భృశమ్ | పుత్రనాశం శుశోచాతి పుత్రశోకవిమూర్ఛితః || 31 ఆ తీర్థజలములను స్పృశించుటతోడనే వారి పాపములు నశించి, అంతఃకరణములు శుద్ధమాయెను. వారచట వ్రతపరాయణులై ఓం కారమును జపించుచూ గొప్ప తపస్సును చేసిరి (27). ఓ నారదా! వారు ప్రజాసృష్టికి సిద్ధపడుచుండగా ఆ సంగతి తెలిసి నీవు పూర్వములో వలెనే వారి వద్దకు వెళ్లి, ఈశ్వరుని భావమును స్మరించి, మరల వారికి ఉపదేశించితివి (28). మహర్షీ! అమోఘజ్ఞానము గల నీవు వారికి సోదరులు వెళ్లిన మార్గమును ఉపదేశించి, నీ దారిన వెళ్లితివి. వారు కూడ సోదరుల మార్గములో పయనించి మోక్షమును పొందిరి (29). అదే సమయములో ఆ దక్ష ప్రజాపతికి అనేక ఉత్పాతములు కానవచ్చెను. నా కుమారుడు దక్షుడు ఆశ్చర్యచకితుడై మనస్సు లో చాల దుఃఖించెను (30). నారదుడు పూర్వము చేసిన విధముగనే ఇప్పుడు కూడ చేసినాడని దక్షుడు విని మిక్కిలి దుఃఖించెను. ఆతడు ఆశ్చర్యచకితుడై పుత్రశోకముచే మూర్ఛితుడయ్యెను (31). చుక్రోధ తుభ్యం దక్షోsసౌ దుష్టోయమితి చాబ్రవీత్ | ఆగతస్తత్ర దైవాత్త్వమనుగ్రహకరస్తదా || 32 శాకావిష్టస్స దక్షో హి రోషవిస్ఫురితాధరః | ఉపలభ్య తమాహత్య ధిక్ ధిక్ ప్రోచ్య విగర్హయన్ || 33 ఈ దక్షుడు నీపై కోపించి 'వీడు దుష్టుడు' అని కూడ పలికెను. అనుగ్రహమును ఇచ్చే నీవు అపుడు అచటకు దైవవశమున వచ్చితివి (32). శోకముచే ఆవిష్టుడై యున్న దక్షునకు రోషముచే అధరము వణకెను. నిన్ను చూచినంతనే ధిక్, ధిక్ (నింద) అని పలికి నిన్ను అసహ్యించుకొనెను (33). దక్ష ఉవాచ | కిం కృతం తేsధమశ్రేష్ఠ సాధూనాం సాధులింగతః |భిక్షా మార్గోsర్భకానాం వై దర్శిత స్సాధుకారి నో || 34 ఋణౖ స్త్రిభిరముక్తానాం లోకయోరుభయోః కృతః | విఘాతశ్ర్శేయసోsమీషాం నిర్దయేన శ##ఠేన తే || 35 ఋణాని త్రీణ్యపాకృత్య యో గృహా త్ప్రవ్రజేత్పుమాన్ | మాతరం పితరం త్యక్త్వా మోక్షమిచ్ఛన్ వ్రజత్యధః || 36 నిర్దయస్త్వం సునిర్లజ్జ శ్శిశుధీశుధీభిద్యశోsపహా | హరేః పార్షదమధ్యే హి వృథా చరసి మూఢధీః || 37 దక్షుడిట్లు పలికెను - నీకు నేను ఏమి అపకారమును చేసితిని? నీవు సాధువేషములోనున్న కపటివి. పిల్లలకు భిక్షామార్గము (సన్న్యాసము) ను చూపించితివి. ఇది సాధుకృత్యము కాదు (34). వారికింకనూమూడు ఋణముల నుండి విముక్తి కలుగలేదు. వారు ఇహపరముల నుండి భ్రష్టులైరి. దయలేని మోసగాడవు నీవు. వారి శ్రేయస్సునకు విఘాతమును కలిగించితివి (35). మూడు ఋణముల నుండి విముక్తి పొందకుండగా తల్లి దండ్రులను విడచి మోక్షమును గోరువాడై ఇంటిని వీడి సన్న్యసించు వ్యక్తి పతితుడగును (36). నీకు దయలేదు.సిగ్గు అసలే లేదు. పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించితివి. మూర్ఖుడవగు నీవు విష్ణు సేవకులలో కలిసి వృథాగా సంచరించుచున్నావు (37). ముహుర్ముహురభద్రం త్వమచరోమేsధమాధమ | విభ##వేద్భ్రమతస్తేsతః పదం లోకేషు న స్థిరమ్ || 38 శశాపేతి శుచా దక్షస్త్వాం తదా సాధుసంమతమ్ | బుబోధ నేశ్వరేచ్ఛాం స శివమాయా విమోహితః || 39 శాపం ప్రత్యగ్రహీశ్చ త్వం స మునే నిర్వికారధీః | ఏ ష ఏవ బ్రహ్మ సాధో సహతే సోsపి చ స్వయమ్ || 40 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయో సతీఖండే నారదశాపో నామ త్రయో దశోsధ్యాయః (13). నీవు అనేక పర్యాయములు నాకు అమంగళమునాచరించిన అధమాధముడవు. నీవు స్థిరమగు స్థానము లేనివాడై లోకములలో తిరుగాడుచుండగలవు (38) అని దక్షుడు అపుడు సాధువులకు గూడ పూజ్యుడవగు నిన్ను శపించెను. శివమాయచే విమోహితుడగు నాతనికి ఈశ్వరుని సంకల్పము అర్థము కాలేదు (39). ఓ మహర్షీ! నీవు వికారము లేని మనస్సుతో ఆ శాపమును స్వీకరించితివి. బ్రహ్మనిష్ఠ అనగా నిదియే. హే సాధూ!భగవానుడు కూడ ఇటులనే సహించును (40). శ్రీశివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితలో రెండవదియగు సతీ ఖండలో నారదునకు శాపము అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).