Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుర్దశోsధాయః

సతీజన్మ - బాల్యము

బ్రహ్మోవాచ |

ఏతస్మిన్నంతరే దేవమునే లోకపితామహః | తత్రా గమమహం ప్రీత్యా జ్ఞాత్వా తచ్చరితం ద్రుతమ్‌ || 1

ఆ సాంత్వయమహం దక్షం పూర్వవత్సువిచక్షణః |అకార్షం తేన సుస్నేహం తవ సుప్రీతిమావహన్‌ || 2

స్వాత్మజం మునివర్యం త్వాం సుప్రీత్యా దేవవల్లభమ్‌ | సమాశ్వాస్య సమాదాయ ప్రత్యపద్యే స్వధామ హ || 3

తతః ప్రజాపతిర్దక్షోsనునీతో మే నిజస్త్రియామ్‌ | జనయామాస దుహితౄస్సుభగాష్షష్టి సంమితాః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

హే దేవర్షీ! ఇంతలో లోకపితామహుడనగు నేను వాని వృత్తాంతము నెరింగి, ప్రీతితో వేగముగా నచటకు విచ్చేసితిని (1). విద్వాంసుడనగు నేను పూర్వమునందు వలె నే దక్షుని ఓదార్చితిని. వానితో నీకు మంచి స్నేహమును కలిగించి, నీకు మిక్కిలి ప్రీతిని కలిగించితిని (3). నా కుమారుడవు, మునిశ్రేష్ఠుడవు, దేవతలకు ఇష్టుడవు అగు నిన్ను మిక్కిలి ప్రీతితో ఓదార్చి,నిన్ను తీసుకొని నేను నా ధామమునకు చేరుకొంటిని (3). తరువాత నాచే ఓదార్చబడిన దక్ష ప్రజాపతి తన భార్యయందు అరవై మంది సుందరీమణులగు కుమార్తెలను కనెను (4).

తాసాం వివాహం కృతవాన్‌ ధర్మాది భిరంతంద్రితః |తదేవ శృణు సుప్రీత్యా ప్రవదామి మునీశ్వర || 5

దదౌ దశ సుతా దక్షో ధర్మాయ విధివన్మునే |త్రయోదశ కశ్యపాయ మునయే త్రినవేందవే || 6

భూతాంగిరః కృశాశ్వేభ్యో ద్వే ద్వే పుత్రీః ప్రదత్తవాన్‌ | తార్‌ క్ష్యాయ చాపరాః కన్యాః ప్రసూతి ప్రసవైర్యతః || 7

త్రిలోకాః పూరితాస్తన్నో వర్ణ్యతే వ్యాసతో భయాత్‌ | కేచిద్వదంతి తాం జ్యేష్ఠాం

మద్యమాం చాపరే శివామ్‌ || 8

ఆతడు శ్రద్ధతో వారి వివాహమును ధర్మడు మొదలగు వారితో చేసెను. ఓ మహర్షీ! ఆ విషయమును మక్కిలి ప్రీతితో చెప్పెదను. వినుము (5). ఓ మహర్షీ! దక్షుడు ధర్మునకు పదిమందిని, కశ్యప మహర్షికి పదముగ్గురిని, చంద్రునకు ఇరవై ఏడు మందిని (6), అంగిరసునకు ఇద్దరిని, కృశాశ్వునకు ఇద్దరిని, తార్‌ క్ష్యునకు మిగిలిన కన్యలను ఇచ్చి యథావిధిగా వివాహమును చేసెను. వారి సంతానముతో (7) ముల్లోకములు నిండెను. విస్తర భీతిచే ఆ వివరములను చెప్పుట లేదు. సతీదేవి పెద్ద కుమార్తెయని కొందరు మధ్యమ కుమార్తెయని కొందరు చెప్పెదరు (18).

సర్వానంతర జాం కేచిత్కల్ప భేదాత్త్రయం చ సత్‌ | అనంతరం సుతోత్పత్తే స్సపత్నీకః ప్రజాపతిః || 9

దక్షో దధౌ సుప్రీతాత్మాతాం మనసా జగదంబికామ్‌ | అతః ప్రేవ్ణూ చ తుష్టావ గిరా గద్గదయా హిసః || 10

భూయో భూయో నమస్కృత్య సాంజలిర్వినయాన్వితః | సంతుష్టా సా తదా దేవీ విచారం మనసీతి చ || 11

చక్రేsవతారం వీరిణ్యాం కుర్యాం పణ విపూర్తియే | అథ సోవాస మనసి దక్షస్య జగదంబికా || 12

కనిష్ఠ కుమార్తె యని మరి కొందరి మతము. కల్ప భేదముచే ఈ మూడు పక్షములు సత్యమే. కుమారులు పుట్టిన తరువాత దక్ష ప్రజాపతి భార్యతో గూడి (9), మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై ఆ జగన్మాతను మనస్సులో ధ్యానించెను. ఆతడు గద్గ దమగు వాక్కుతో ప్రేమతో ఆమెను స్తుతించెను (10). ఆమెకు వినయముతో దోసిలి యొగ్గి అనేక ప్రణామములాచరించెను. అపుడా దేవి సంతసించి మనస్సులో ఇట్లు తలపోసెను (11). నేను ప్రతిజ్ఞను నెరవేర్చుకొనుటకై ఈ వీరిణియందు అవతరించెదను. ఇట్లు తలచి ఆ జగన్మాత దక్షుని మనసులో స్థిరముగనుండెను (12).

విలలాస తదాతీవ స దక్షో మునిసత్తమ | సుమూహూర్తేనాథ దక్షోsపి స్వపత్న్యాం నిదధే ముదా || 13

దక్ష పత్న్యాస్తదా చిత్తే శివోవాస దయాన్వితా | ఆవిర్బ భూవుశ్చిహ్నాని దోహదస్యా ఖిలాని వై || 14

విరేజే వీరిణీ తాత హృష్టచిత్తాధికా చ సా | శివావాస ప్రభావాత్తు మహా మంగల రూపిణీ || 15

కులస్య సంపదశ్చైవ శ్రుతేశ్చిత్త సమున్నతేః | వ్యధత్త సుక్రియా దక్షః ప్రీత్యా పుంసవనాదికాః || 16

ఓ మరర్షీ! అపుడా దక్షుడు మిక్కిలి ఉల్లాసముగ నుండెను. అపుడు దక్షుడు సుముహూర్తమునందు ఆనందముతో భార్యతో కలిసి రమించెను (13). అపుడు దయావతియగు ఉమ దక్షుని భార్య యొక్క మనస్సులో నివసించెను. దక్షుని భార్యకు తరువాత గర్భిణీ చిహ్నములన్నియూ బయలు దేరెను (14). వత్సా! మిక్కిలి ఆనందముతో నిండిన మనస్సుగల ఆ వీరిణి అధికముగా ప్రకాశించెను. ఉమ ఆమె గర్భములో నుండుటచే ఆమె మహా మంగళ రూపిణిగా కన్పట్టెను (15). దక్షుడు తన కులమునకు, సంపదకు, విద్యకు, మనస్సు యొక్క ఉదారతకు అనురూపముగా ప్రీతితో ఆమెకు పుంసవనాది సంస్కారములను చేయించెను (16).

ఉత్సవోsతీవ సంజాతస్తదా తేషు కర్మసు | విత్తం దదౌ ద్విజాతిభ్యో యథాకామం ప్రజాపతిః || 17

అథ తస్మిన్నవసరే సర్వే హర్యాదయస్సురాః | జ్ఞాత్వా గర్భ గతాం దేవీం వీరిణ్యాస్తే ముదం యయుః || 18

తత్రాగత్య చ సర్వే తే తుష్టువుర్జగదంబికామ్‌ | లోకోప కారకరిణీం ప్రణమ్య చ ముహుర్ముహుః || 19

కృత్వా తతస్తే బహుధా ప్రశంసాం హృష్టమానసాః | దక్ష ప్రజాపతేశ్చైవ వీరిణ్యాస్స్వ గృహం యయుః || 20

అపుడా సంస్కార కర్మలయందు గొప్ప ఉత్సవము జరిగెను. ఆ ప్రజాపతి బ్రాహ్మణులకు కోరినంత ధనమునిచ్చెను (17). అపుడు ఉమాదేవి వీరిణి యొక్క గర్భములో నున్నదని యెరింగి విష్ణువు మొదలగు దేవతలు ఆనందించిరి (18). వారందరు అచటకు వచ్చి జగన్మాతను స్తుతించిరి. లోకములకు ఉపకారమును చేయు ఆ తల్లికి అనేక పర్యాయములు ప్రణమిల్లిరి (19). అపుడు వారు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై దక్ష ప్రజాపతిని, వీరిణిని అనేక విధములుగా ప్రశంసించి తమ గృహములకు వెళ్లిరి (20).

గతేషు నవమాసేషు కారయిత్వా చ లౌకికీమ్‌ | గతిం శివా చ పూర్ణే సా దశ##మే మాసి నారద ||| 21

ఆవిర్బ భూవ పురతో మాతుస్సద్యస్తదా మునే | ముహూర్తే సుఖదే చంద్రగ్రహ తారానుకూలకే || 22

తస్యాం తు జాతమాత్రాయం సుప్రీతోsసౌ ప్రజాపతిః | సైవ దేవీతి తాం మేనే దృష్ట్వా తాం తే జసోల్బణామ్‌ || 23

తదా భూత్పుష్ప సద్వృష్టిర్మేఘాశ్చ వవృఘర్జలమ్‌ | దిశశ్శాంతా ద్రుతం తస్యాం జాతాయాం చ మునీశ్వర || 24

అవాదయంత త్రిదశా శ్శుభవాద్యాని ఖే గతాః | జజ్వలు శ్చాగ్నయశ్శాంతా స్సర్వమాసీత్సుమంగలమ్‌ || 25

ఓ నారదా! తొమ్మిది మాసములు గడువగానే దక్షుడు లౌకిక కర్మలను చేయించెను. పదవ మాసము నిండగానే ఆ ఉమాదేవి (21) తల్లిముందు వెంటనే ఆవిర్భవించెను. సుఖకరమగు ఆ ముహూర్తములో చంద్ర గ్రహతారలు అనుకూలముగ నుండెను (22). ఆమె పుట్టిన తోడనే ప్రజాపతి ఎంతయూ సంతసించెను. తేజోమండలముచే చుట్టు వారబడియున్న ఆ శిశువును చూచి ఆమెయే దేవియని ఆతడు మురిసెను (23). అపుడు చక్కని పుష్పవృష్టి కురిసెను. మేఘములు నీటిని వర్షించినవి. ఓ మహర్షీ! ఆమె పుట్టిన వెనువెంటనే దిక్కులు ప్రసన్నములాయెను (24). దేవతలు ఆకాశమునందు శుభవాద్యములను మ్రోగించిరి. అగ్నులు శాంతముగా ప్రజ్వరిల్లినవి. సర్వము సుమంగళమాయెను (25).

వీరిణో సంభవాం దృష్ట్వా దక్షస్తాం జగదంబికామ్‌ | నమస్కృత్య కరౌ బద్ధ్వా బహు తుష్టావ భక్తితః || 26

దక్షుడు వీరిణి యందు జన్మించిన ఆ జగన్మాతను చూచి, చేతులు కట్టి నమస్కరించి, భక్తితో పలువిధముల స్తుతించెను (26).

దక్ష ఉవాచ |

మహేశాని నమస్తుభ్యం జగదంబే సనాతని | కృపాం కురు మహాదేవి సత్యే సత్య స్వరూపిణి || 27

శివా శాంతా మహామాయా యోగనిద్రా జగన్మయీ | యా ప్రోచ్యతే వేద విద్భిర్నమామి త్వాం హితావహామ్‌ || 28

యయా ధాతా జగత్సృష్టౌ నియుక్తస్తాం పురాకరోత్‌ | తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీమ్‌ || 29

యయా విష్ణుర్జగత్‌ స్థిత్యై నియుక్తస్తాం సదాకరోత్‌ | తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీమ్‌ || 30

దక్షుడిట్లు పలికెను -

హే మహేశ్వరీ! జగన్మాతా! నీవు సనాతనివి. నీకు నమస్కారము. ఓ మహాదేవీ! దయను చూపుము. సత్యము నీవే. సత్యము నీ స్వరూపము (27). వేదవేత్తలు నిన్ను శివా, శాంతా, మహా మయా, యోగనిద్రా, జగత్స్వరూపిణీ అని వర్ణింతురు. హితములను చేగూర్చు నిన్ను నేను నమస్కరించుచున్నాను (28). పూర్వము నీవు ధాతను సృష్టికార్యము నందు నియోగించగా, ఆయన సృష్టిని చేసెను. అట్టి నీకు నమస్కారము. నీవు విష్ణువును జగద్రక్షణ కార్యమునందు నియోగించగా,ఆతడు జగద్రక్షణను చేసెను. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి. జగన్మాతవు. మహేశ్వరివి (30).

యయా రుద్రో జగన్నాశే నియుక్తస్తాం సదాsకరోత్‌ | తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీమ్‌ || 31

రజస్సత్త్వతమోరూపాం సర్వకార్యకరీం సదా | త్రిదేవ జననీం దేవీం త్వాం నమామి చ తాం శివామ్‌ || 32

యస్త్వాం విచింతయేద్దేవీం విద్యా విద్యాత్మికాం పరామ్‌ | తస్య భుక్తిశ్చ ముక్తిశ్చ సదా కరతలే స్థితా || 33

యస్త్వాం ప్రత్యక్షతో దేవి శివాం పశ్యతి పావనీమ్‌ | తస్యా వశ్యం భ##వేన్ముక్తి ర్విద్యావిద్యా ప్రకాశికా || 34

నీవు రుద్రుని జగన్నాశము కొరకు నియోగించగా, ఆయన అట్లు చేసెను. అట్టి నీకు నమస్కారము. పరబ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవు, మహేశ్వరివి నీవే (31). రజస్సత్త్వతమోగుణాత్మికవగు నీవు త్రిమూర్తుల రూపములో సర్వకార్యములను చేయుచున్నావు. నీవు జననివి. హేశివే! నీకు నేను నమస్కరించుచున్నాను (32). విద్య , అవిద్యలు నీ స్వరూపమే. పరాదేవివి అగు నిన్ను ధ్యానించువానికి ఇహలోకసౌఖ్యమే గాక, మోక్షము కూడ అరచేతి యందుడుంను (33). ఓ దేవీ! పావనివగు నిన్ను ప్రత్యక్షముగా దర్శించువానికి అవిద్యను ప్రకాశింపజేయు విద్య ఉదయించి ముక్తి లభించుట నిశ్చయము (34).

యేస్తువంతి జగన్మాత ర్భవానీ అంబికేతి చ | జగన్మాయీతి దుర్గేతి సర్వం తేషాం భవిష్యతి || 35

ఓ జగన్మాతా! నిన్ను ఎవరైతే భవానీ! అంబికా! జగన్మాతా! దుర్గా! అని స్తుతించెదరో వారికి సర్వము సిద్ధించును (35).

బ్రహ్మోవాచ |

ఇతి స్తుతా జగన్మాతా శివా దక్షేణ ధీమతా |తథోవాచ తదా దక్షం యథా మాతా శృణోతి న || 36

సర్వం ముమోహ తధ్యం చ తథా దక్షశ్శృణోతు తత్‌ | నాన్యస్తథా శివా ప్రాహ నానోతిః పరమేశ్వరీ || 37

బ్రహ్మ ఇట్లు పలికెను -

బుద్ధి శాలియగు దక్షుడిట్లు స్తుతించగా, జగన్మాత యగు ఆ ఉమ తల్లికి వినబడని విధముగా దక్షునితో ఇట్లనెను (36). ఆచటనున్న ఇతరులందరూ మోహమును పొందిరి. ఆమె మాటలను దక్షుడు తక్క ఇతరులు వినలేకపోయిరి. ఆ పరమేశ్వరి లీలలు అసంఖ్యాకములు గదా!(37).

దేవ్యువాచ |

అహమారాధితా పూర్వం సుతార్థం తే ప్రజాపతే | ఈప్సితం తవ సిద్ధం తు తపో ధారయ సంప్రతి || 39

దేవి ఇట్లు పలికెను -

ఓ ప్రజాపతీ! నీవు పూర్వము నన్ను కుమార్తె కావాలని కోరి ఆరాధించితివి. నీకోరిక సిద్ధించినది. ఇపుడు నీవు నీ తపఃఫలమును అందుకొంటివి (39).

బ్రహ్మోవాచ |

ఏ వముక్త్వా తదా దేవీ దక్షం చ నిజమాయయా | ఆస్థాయశైశవం భావం జనన్యంతే రురోద సా || 40

దృష్ట్వా సిక్నీ సుతారూపం ననందుస్సర్వ యోషితః | సర్వే పౌరజనాశ్చాపి చక్రుర్జయరవం తదా || 41

ఉత్సవశ్చ మహానాసీ ద్గానవాద్య పురస్సరమ్‌ | దక్షోసిక్నీ ముదం లేభే శుభం దృష్ట్వా సుతాననమ్‌ || 42

దక్షశ్ర్శుతికులాచారం చక్రే చ విధివత్తదా | దానం దదౌ ద్విజాతిభ్యోsన్యేభ్యశ్చ ద్రవిణం తథా || 43

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ దేవి అపుడు దక్షునితో నిట్లు పలికి, తన మాయచే మరల శిశుభావమును పొంది, తల్లి సమీపములో రోదించెను (40). అసిక్ని, మరియు ఇతర స్త్రీలు అందరు ఆ శిశువు యొక్క రూపమును చూచి ఆనందించిరి. పౌరజనులందరు కూడా అపుడు జయధ్వానములను చేసిరి (41). గానములు, వాద్యములతో గూడిన గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను. ఆ కుమార్తె యొక్క మంగళ రూపమును చూచి దక్షుడు మరియు అసిక్ని ఆనందించిరి (42). అపుడు దక్షుడు యథావిధిగా వేదోక్త సంస్కారములతో బాటు కులాచారములను కూడా అనుష్ఠించెను. బ్రాహ్మణులకెందరికో ధనమును దానము చేసెను (43).

బభూవ సర్వతో గానం నర్తనం చ యథో చితమ్‌ | నేదుర్వాద్యాని బహుశస్సుమంగల పురస్సరమ్‌ || 44

అథ హర్యాదయో దేవాస్సర్వే సానుచరాస్తదా |మునిబృందైస్సమాగత్యోత్సవం

చక్రుర్యథావిధి || 45

దృష్ట్వా దక్ష సుతామంబాం జగతః పరమేశ్వరీమ్‌ | నేముస్సవినయాస్సర్వే తుష్టువుశ్చ శుభైస్స వైః || 46

ఉచుస్సర్వే ప్రముదితా గిరం జయజయాత్మికామ్‌ | ప్రశశంసుర్ముదా దక్షం వీరిణీం చ విశేషతః || 47

అంతటా సముచితమగు గాన నాట్యములతో, మంగల వాద్యములతో ఉత్సవము ప్రవర్తిల్లెను (44). అపుడు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు మహర్షి సంఘములతో కూడి వచ్చేసి యథావిధిగా ఉత్సవము నందు పాల్గొనిరి (45). దక్షుని కుమార్తెగా అవతరించిన జగన్మాతయగు పరమేశ్వరిని చూచి వరాందరు వినయముతో నమస్కరించి శుభస్తోత్రములతో స్తుతించిరి (46). వారందరు మిక్కిలి ఆనందించి జయజయ శబ్దములను పలికి, ప్రీతితో దక్షుని, ప్రత్యేకించి వీరిణిని ప్రశంసించిరి (47).

తదోమేతి నామ చక్రే తస్యా దక్షస్తదా జ్ఞయా | ప్రశస్తాయాస్సర్వగుణ సత్త్వాదపి ముదాన్వితః || 48

నామాన్యన్యాని తస్యాస్తు పశ్చజ్ఞాతాని లోకతః | మహామంగలదాన్యేన దుఃఖాఘ్నాని విశేషతః || 49

దక్షస్తదా హరిం నత్వా మాం సర్వానమరానపి | మునీనపి కరౌ బద్ధ్వా స్తుత్వా చానర్చ భక్తితః || 50

అథ విష్ణ్వాదయస్సర్వే సుప్రశస్యాజనందనమ్‌ | ప్రీత్యా యయుస్స్వధామాని సంస్మరన్‌ సశివం శివమ్‌ || 51

అపుడు దక్షుడు ఆమె ఆజ్ఞచే ఆమెకు ఉమయని పేరిడెను. ఆమె యొక్క ప్రశంసింప దగిన సర్వగుణములను చూచి ఆతడు ఆనందించెను (48). తరువాత ఆమెకు లోకములో ఇతరనామములు కలిగెను. ఆ నామములన్నియూ మహామంగళముల నిచ్చునవే. ఆ నామములు విశేషించి దుఃఖములను పోగొట్టును (49). అపుడు దక్షుడు విష్ణువునకు, నాకు, సర్వదేవతలకు, మునులకు చేతులు జోడించి నమస్కరించి స్తుతించి భక్తితో ఆరాధించెను (50). అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు బ్రహ్మ కుమారుడగు దక్షుని ప్రశంసించి ఆనందముతో ఉమాపరమేశ్వరులను స్మరించుకుంటూ తమతమ ధామములకు వెళ్లిరి (51).

అతస్తాం చ సుతాం మాతా సుసంస్కృత్య యథోచితమ్‌ | శిశుపానేన విధినా తసై#్యస్తన్యాదికం దధౌ || 52

పాలితా సాథ వీరిణ్యా దక్షేణ చ మహాత్మనా | వవృధే శుక్ల పక్షస్య యథా శశికలాన్వహమ్‌ || 53

తస్యాం తు సద్గుణాస్సర్వే వివిశుర్ద్విజసత్తమ |శైశ##వేsపి యథా చంద్రే కలాస్సర్వా మనోహరాః || 54

ఆచరన్నిజభావేన సఖీమధ్యగతా యదా | తదా లిలేఖ భర్గస్య ప్రతిమామన్వహం ముహుః || 55

అపుడా తల్లి శిశువును యథాయోగ్యముగా సంస్కరించి ఆమెకు స్తన్యము నిచ్చి లాలించెను (52). మహాత్ముడగు దక్షుడు మరియు వీరిణి ఆమెను పెంచుచుండిరి. ఆమె శుక్ల పక్షములోని చంద్రరేఖ వలె దినదిన ప్రవర్థమానయై విలసిల్లెను (53). ఓ బ్రాహ్మణశ్రేష్టా! ఆమెయందు సద్గుణములన్నియూ ప్రవేశించినవి. ఆమె బాల్యమునందే మనోహరమగు కళలన్నింటితో గూడిన చంద్రునివలె విరాజిల్లెను (54). ఆమె సఖురాండ్ర మధ్యలో నున్నప్పుడు తన మనస్సులోని భావమునకు అనురూపముగా ప్రతిదినము అనేక పర్యాయములు శివుని చిత్రమును లిఖించుచుండెడిది (55).

యదా జగౌ సుగీతాని శివా బాల్యోచితాని సా | తదా స్థాణుం హరం రుద్రం సస్మార స్మరశాసనమ్‌ || 56

వవృధేsతీవ దంపత్యోః ప్రత్యహం కరుణాsతులా |తస్యా బాల్యేsపి భక్తాయాస్తయోర్నిత్యం ముహుర్ముహుః || 57

సర్వబాల గుణాక్రాంతా సదా స్వాలయకారిణీ | తోషయామాస పితరౌ నిత్యం నిత్యం ముహుర్ముహుః || 58

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే సతీజన్మ బాలలీలా వర్ణనం నామ చతుర్దశోsధ్యాయః (14).

ఆమె బాల్యావస్థకు తగిన పాటలను పాడుతూ స్థాణువు, హరుడు, రుద్రుడు, స్మరశాసనుడు (మన్మథుని నియంత్రించిన వాడు) ఇత్యాది శివనామములను స్మరించెడిది (56). ఆమె బాల్యము నుండియూ ప్రతి దినము భక్తురాలివలె ప్రవర్తించుటను గాంచిన ఆ తల్లిదండ్రులకు సాటిలేని కరుణ కలిగి వృద్ధి పొందజొచ్చెను (57). బాల్య గుణములన్నింటితో కూడియున్న ఆ సతి ప్రతిదినము ధ్యానమునందు నిమగ్నురాలగుచూ, అనేక పర్యాయములు తల్లిదండ్రులకు ఆనందమును కలిగించెను (58).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు సతీఖండములో సతీ జన్మ మరియు బాల లీలలు అనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).

Sri Sivamahapuranamu-I    Chapters