Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచదశోsధ్యాయః నందావ్రతము - శివస్తుతి బ్రహ్మోవాచ | అథైకదా పితుః పార్శ్వే తిష్ఠంతీం తాం సతీమహమ్ | త్వయా సహ మునేsద్రాక్షం సారభూతాం త్రిలోకకే ||
1 పిత్రా నమస్కృతం వీక్ష్య సత్కృతం త్వాం చ మాం సతీ ప్రణనామ ముదా భక్త్యా లోకలీలానుసారిణీ ||
2 ప్రణామాంతే సతీం వీక్ష్య దక్షదత్త శుభాసనే | స్థితోsహం నారద త్వం చ వినతామహమాగదమ్ ||
3 త్వామేవ యః కామయతే యం తు కామయసే సతి | తమాప్నుహి పతిం దేవం సర్వజ్ఞం జగదీశ్వరమ్ ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మునీ! తరువాత ఒకనాడు నేను నీతో గూడి తండ్రి ప్రక్కన నిలబడియున్న ఆ సతీ దేవిని చూచితిని. ముల్లోకముల సారభూతమైన ప్రకృతి ఆమెయే (1). తండ్రి నీకు, నాకు నమస్కరించి సత్కరించుటను చూచిన సతీదేవి ఆనందముతో లోకలీలను అనుసరించునదై భక్తితో మనలకు నమస్కరించెను (2). ఓ నారదా! మనమిద్దరము దక్షునిచే ఈయబడిన శుభాసనము నందు కూర్చుండి యుంటిమి. అపుడు నమస్కారము చేసి వినయముగా నిలబడియున్న సతిని చూచి నేను ఇట్లంటిని (3). నిన్ను ఎవడు ఏకాంత నిష్ఠతో ప్రేమించుచున్నాడో, ఓ సతీ! ఎవనిని నీవు ప్రేమించుచున్నావో అట్టి సర్వజ్ఞుడుస,జగత్ర్పభువు అగు దేవ దేవుని భర్తగా పొందుము (4). యో నాన్యాం జగృహే నాపి గృ హ్ణాతి న గ్రహీష్యతి | జాయాం సతే పతిర్భూయాదనన్య సదృశశ్శుభే || 5 ఇత్యుక్త్వా సుచిరం తాం వై స్థిత్వా దక్షాలయే పునః | విసృష్టౌ తేన సంయాతౌ స్వస్థానం తౌ చ నారద || 6 దక్షోSభవచ్చ సుప్రీతస్తదాకర్ణ్య గతజ్వరః | ఆదదే తనయాం స్వాం తాం మత్వా హి పరమేశ్వరీమ్ || 7 ఇత్థం విహారై రుచిరైః కౌమారై ర్భక్తవత్సలా | జహావవస్థాం కౌమారీం స్వేచ్ఛాదృతనరాకృతిః || 8 ఏ ఈశ్వరుడు ఇతర స్త్రీని స్వీకరించలేదో, స్వీకరించుట లేదో, భవిష్యత్తులో స్వీకరించడో ఆతడు నీకు భర్తయగుగాక! ఓ శుభకరీ! నీ భర్తకు సాటి మరియొకరు లేరు (5). నారదా!మనము ఇట్లు పలికి చాలసేపు దక్షుని ఇంటిలో నుండి ఆమెను చూచితిమి. తరువాత దక్షుడు సాగనంపగా స్వస్థానమును పొందితిమి (6). ఆ మాటను విని దక్షుడు మిక్కిలి సంతసించెను. ఆతని చింత తొలగెను. ఆతడు తన కుమార్తెను దగ్గరకు తీసుకొనెను. ఆమె పరమేశ్వరియని ఆతడు ఎరుంగును (7). భక్తవత్సల, స్వేచ్ఛచే ధరింపబడిన మానవాకృతి గలది యగు సతీదేవి ఈ తీరున బాల్యమును అందమగు ఆట పాటలతో గడిపి, కాలక్రమములోబాల్యావస్థను దాటి ఎదిగెను (8). బాల్యం వ్యతీత్య సా ప్రాప కించిద్యౌవనతాం సతీ | అతీవ తనునాంగేన సర్వాంగేషు మనోహరా || 9 దక్షస్తాం వీక్ష్య లోకేశః ప్రోద్భిన్నాంతర్వయస్థ్సి తామ్ | చింతయామాస భర్గాయ కథం దాస్య ఇమాం సుతామ్ || 10 అథ సాపి స్వయం భర్గం ప్రాప్తుమైచ్ఛత్త దాన్వహమ్ | పితుర్మనోగతిం జ్ఞాత్వా మాతుర్ని కటమాగమత్ || 11 పప్రచ్ఛాజ్ఞాం తపో హేతో శ్శంకరస్య వినీతధీః | మాతుశ్శివాథ వీరిణ్యాస్సా సతీ పరమేశ్వరీ || 12 ఆ సతీదేవి బాల్యమును దాటి ¸°వనములో అడుగిడెను. ఆమె సర్వాయవ సుందరియై యుండెను. ఆమె సన్నని దేహముతో శోభిల్లెను (9). దక్ష ప్రజాపతి ¸°వనములో అడుగిడిన ఆమెను చూచి, ఈమెను శివునకు ఇచ్చి వివాహమును చేయుట ఎట్లాయని ఆలోచించెను (10). ఆమె కూడా అదే కాలములో శివుని భర్తగా పొందవలెనని గోరెను. ఆమె తండ్రి మనస్సును ఎరింగి తల్లి వద్దకు వచ్చెను (11). పరమేశ్వరియగు ఆ సతీదేవి వినయముతో కూడిన మనస్సుగలదై, శివుని ఉద్దేశించి తపస్సునుచేయుటకై తల్లియగు వీరిణిని అనుమతిని గోరెను (12). తతస్సతీ మహేశానం పతిం ప్రాప్తుం దృఢవ్రతా | సా తమారాధయామాస గృహే మాతురనుజ్ఞయా || 13 అశ్వినే మాసి నందాయాం తిథావానర్చ భక్తితః | గుడౌదనైస్సలవణౖర్హరం నత్వా నినాయ తమ్ || 14 కార్తికస్య చతుర్దశ్యామపూపైః పాయసైరపి | సమాకీర్ణైస్సమారాధ్య సస్మార పరమేశ్వరమ్ || 15 మార్గశీర్షేsసితాష్టమ్యాం సలిలైస్స యవౌదనైః | పూజయిత్వా హరం క్షీరైర్నినాయ దివసాన్ సతీ || 16 దృఢమగు వ్రతముగల సతీదేవి మహేశ్వరుని భర్తగా పొందుట కొరకై తల్లి అనుజ్ఞను పొంది ఇంటియందు ఆయనను ఆరాధించెను (13). ఆమె ఆశ్వయుజమాసములో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులయందు పులిహోరను, మధురాన్నమును నైవేద్యమిడి శివుని భక్తితో పూజించుచూ గడిపెను (14). కార్తీక చతుర్దశినాడు చక్కగా తయారుచేసిన అప్పములను, పాయసములను నైవేద్యమిడి పరమేశ్వరుని ఆరాధించెను (15). మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు నీటితో అభిషేకించి యవధాన్యపు అన్నమును నైవేద్యమిడి సతీదేవి శివుని మరల పాలతో అభిషేకించెను. ఆమె దినములనీ తీరున గడిపెను (16). పౌషే తు శుక్ల సప్తమ్యాం కృత్వా జాగరణం నిశి | అపూజయచ్ఛివం ప్రాతః కృశరాన్నేన సా సతీ || 17 మాఘే తు పూర్ణమాస్యాం కృత్వా జాగరణం నిశి | ఆర్ద్రవస్త్రా నదీతీరేsకరోచ్ఛంకర పూజనమ్ || 18 తపస్యసిత భూతాయాం కృత్వా జాగరణం నిశి | విశేషతస్సమానర్చ శైలూషైస్సర్వయామసు || 19 చైత్రే శుక్ల చతుర్దశ్యాం పలాశైర్దమనైశ్శివమ్ | అపూజయద్దివారాత్రౌ సంస్మరన్ సా నినాయ తమ్ || 20 పుష్య శుక్ల సప్తమినాడు రాత్రియందు జాగరణము చేసి , ఆ సతి ఉదయము కూరగాయలతో కలిపి వండిన అన్నమును శివునకు నైవేద్యమిడి పూజించెను (17). ఆమె మాఘపూర్ణిమ నాడు రాత్రి యందు జాగరణము చేసి తడి బట్టలతో నదీ తీరముందు శంకరుని పూజించెను (18). ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి నాల్గు యామముల యందు మారేడు దళములతో విశేష పూజలను చేసెను (19). చైత్ర శుక్ల చతుర్దశి నాడు ఆమె రాత్రింబగళ్లు శివుని మోదుగు పుష్పములతో మరియు దమనము అనే సుగంధి పత్రములతో పూజించెను. మరియు ఆ మాసమును శివధ్యానముతో గడిపెను (20). రాధశుక్ల తృతీయాయాం తిలాహారయవౌదనైః | పూజయిత్వా సతీ రుద్రం నవ్యైర్మాసం నినాయ తమ్ || 21 జ్యేష్ఠస్య పూర్ణిమాయాం వై రాత్రౌ సంపూజ్య శంకరమ్ | వసననైర్బహతీ పుషై#్పర్నిరాహారా నినాయ తమ్ || 22 ఆషాఢస్య చతుర్దశ్యాం శుక్లాయాం కృష్ణవాససా | బృహతీకుసుమైః పూజా రుద్ర స్యాకారివై తయా || 23 శ్రావణస్య సితాష్టమ్యాం చతుర్దశ్యాం చ సా శివమ్ | యజ్ఞోపవీతై ర్వాసోభిః పవిత్రైరప్యపూజయత్ || 24 భాద్రే కృష్ణత్రయోదశ్యాం పుషై#్పర్నానావిధైః ఫలైః | సంపూజ్య చ చతుర్దశ్యాం చకార జలభోజనమ్ || 25 వైశాఖ శుక్ల తదియనాడు సతీదేవి నువ్వుల ఆహారమును, జొన్నల అన్నమును నైవేద్యమిడి రుద్రుని పూజించెను. ఆమె ఆ నెలను అదే తీరున ఆరాధించుచూ గడిపెను (21). జ్యేష్ఠపూర్ణిమనాడు రాత్రియందు ఆమె శంకరుని నూత్న వస్త్రములతో, మరియు బృహతీ పుష్పములతో పూజించి ఉపవాసము చేసెను. ఆమె ఆ మాసమును ఇట్టి ఆరాదనతో గడిపెను (22). ఆమె ఆషాడ శుక్ల చతుర్దశినాడు నల్లని వస్త్రమును ధరించి బృహతీ పుష్పములతో రుద్రుని పూజించెను (23). శ్రావణ శుద్ధ అష్టమినాడు, మరియు చతుర్దశినాడు ఆమె శివుని యజ్ఞో పతీతములను పవిత్రమగు వస్త్రములను సమర్పించి పూజించెను (24). ఆమె భాద్రపద కృష్ణ త్రయోదశినాడు, మరియు చతుర్దశినాడు నానావిధముల పుష్పములతో, ఫలములతో శివుని పూజించి, నీటిని మాత్రమే త్రాగి ఉపవసించెను (25). నానావిధైః ఫలైః పుషై#్ప స్ససై#్యస్తత్కాల సంభ##వైః | చక్రే సునియతాహార జపన్మాసే శివార్చనమ్ || 26 సర్వమాసే సర్వదినే శివార్చనరతా సతీ | దృఢవ్రతాsభవద్దేవీ స్వేచ్ఛాధృతనరాకృతిః || 27 ఇత్థం నందావ్రతం కృత్స్నం సమాప్య సుసమాహితా | దధ్యౌశివం సతీ ప్రేవ్ణూ నిశ్చలా భూదనన్యధీః || 28 ఏతస్మిన్నంతరే దేవా మునయశ్చాఖిలా మునే | విష్ణుం మాం చ పురస్కృత్య యయుర్ద్రష్టుం సతీతపః || 29 ఆమె అన్ని మాసముల యందు గొప్ప ఆహారనియమము గలదై ఆయా ఋతువులలో లభించు సస్యములతో నైవేద్యమును తయారుచేసెను. ఆయా ఋతువులలో లభించు పుష్పములతో పూజించి ఫలములను కూడా నైవేద్యమిడి శివుని అర్చించి మంత్రమును జపించెను (26). తన ఇచ్ఛచే మానవాకృతిని ధరించిన ఆ సతీదేవి మాసములన్నిటితో ప్రతిదినము దృఢ దీక్షతో శివార్చనయందు లగ్నమయ్యెను (27). ఆ సతీదేవి మిక్కిలి శ్రద్ధతో నందా వ్రతమును ఈ తీరున ముగించి, ఇతర విషయములపై ప్రసరించకుండగా నిశ్చలముగనున్న మనస్సుతో శివుని ప్రేమ పూర్వకముగా ధ్యానించెను (28). ఓ మహర్షీ! ఇంతలో దేవతలు, మహర్షులు అందరు విష్ణువును, నన్ను ముందిడుకొని, సతీదేవి యొక్క తపస్సును తిలకించుటకు బయలుదేరిరి (29). దృష్టాగత్య సతీ దేవైర్మూర్తా సిద్ధిరివాపరా | శివధ్యాన మహామగ్నా సిద్ధావస్థాం గతా తదా || 30 చక్రుస్సర్వే సురాస్సత్యై ముదా సాంజలయో నతిమ్ | మునయశ్చ నతస్కంధా విష్ణ్వాద్యాః ప్రీతమానసాః || 31 అథ సర్వే సుప్రసన్నా విష్ణ్వాద్యాశ్చ సురర్షయః | ప్రశశంసుస్తపస్తస్యా స్సత్యాస్తస్మాత్సవిస్మయాః || 32 తతః ప్రణమ్య తాం దేవీం పునస్తే మునయస్సురాః | జగ్ముర్గిరివరం సద్యః కైలాసం శివవల్లభమ్|| 33 దేవతలు అచటకు వచ్చి, మూర్తీభవించిన తపస్సిద్ధి వలెనున్నది, శివుని ధ్యానమునందు పూర్ణముగా నిమగ్నమైనది, సిద్ధుల అవస్థను పొందియున్నది అగు సతీదేవిని దర్శించిరి (30). దేవతలందరు, మునులు మరియు విష్ణువు మొదలగు వారు ప్రీతితో గూడిన మనస్సు గలవారై ఆనందముతో శిరసువంచి దోసిలి యొగ్గి సతీదేవికి నమస్కరించిరి (31). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, ఋషులు మిక్కిలి ఆశ్చర్యమును పొందిరి. వారు సతీదేవి యొక్క తపస్సును చూసి మిక్కిలి ప్రసన్నులై ఆమెను కొనియాడిరి (32). ఆ దేవతలు, ఋషులు ఆ సతీదేవికి మరల ప్రణమిల్లి, వెంటనే శివునికి ప్రియమగు కైలాస పర్వత రాజమునకు వెళ్లిరి (33). సావిత్రీ సహితశ్చాహం సహ లక్ష్మ్యా ముదాన్వితః | వాసుదేవోsపి భగవాన్ జగామాథ హరాంతికమ్ || 34 గత్వా తత్ర ప్రభుం దృష్ట్వా సుప్రణమ్య సుసంభ్రమాః | తుష్ణువు ర్వివిధై స్త్సోత్రైః కరౌ బద్ధ్వా వినమ్రకాః || 35 సరస్వతీ సనాథుడనగు నేను, లక్ష్మీదేవితో కూడియున్న వాసు దేవ భగవానుడు కూడా ఆనందించుచూ శివుని సన్నిధికి వెళ్లితిమి (34). అచటకు వెళ్లి శివప్రభువును చూచి తొట్రుపాటుతో ప్రణమిల్లి చేతులు జోడించి వివిధ స్తోత్రములతో సవినయముగా స్తుతించితిమి (35). దేవా ఊచుః || నమో భగవతే తుభ్యం యత ఏతచ్చరాచరమ్ | పురుషాయ మహేశాయ పరేశాయ మహాత్మనే || 36 ఆది బీజాయ సర్వేషాం చిద్రూపాయ పరాయ చ | బ్రహ్మణ నిర్వికారాయ ప్రకృతేః పురుషస్య చ || 37 య ఇదం ప్రతి పంచ్యేదం యేనేదం విచకాస్తి హి | యస్మాదిదం యతశ్చేదం యస్యేదం త్వం చ యత్నతః || 38 యోsస్మాత్పరస్మాచ్చ పరో నిర్వికారీ మహాప్రభుః |ఈక్షతే యస్స్వాత్మనీదం తం నతాస్స్మ స్వయంభువమ్ || 39 దేవతలిట్లు పలికిరి - భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అగు నీకు నమస్కారము. ఈ చరాచరజగత్తు నీనుండి ఉద్భవించినది (36). సర్వప్రాణుల ఆది కారణము, చిద్ఘనము, ప్రకృతి పురుష వికార రహిత పరబ్రహ్మమునగు నీకు నమస్కారము (37). ఎవడు ఈ జగద్రూపమున నున్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశించుచున్నదో, ఎవని నుండి ఉద్భవించినదో, ఎవనికి సంబంధించి ఉన్నదో, ఎవని యందు లీనమగునో అట్టి పరమాత్మవు నీవే. నీకు యత్నపూర్వకముగా నమస్కరించుచున్నాము (38). ఇహ పరలోకములకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అగు నీకు నమస్కారము. నీవు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శించుచున్నావు (39). అవిద్ధదృక్ పరస్సాక్షీ సర్వాత్మాsనేకరూపధృక్ | ఆత్మ భూతః పరబ్రహ్మ తపంతం శరణం గతాః || 40 న యస్య దేవా ఋషయస్సిద్ధాశ్చ న విదుః పదమ్ | కః పునర్జంతురపరో జ్ఞాతుమర్హతి వేదితుమ్ || 41 దిదృక్ష వోయస్య పదం ముక్తసంగా స్సుసాధవః |చరితం సుగతిర్నస్త్వం సలోకవ్రతమవ్రణమ్ || 42 త్వజ్ఞన్మాదివికారా నో విద్యంతే కేsపి దుఃఖదాః | తథాపి మాయయా త్వం హి గృహ్ణాసి కృపయా చ తాన్ || 43 తసై#్మనమః పరేశాయ తుభ్యమాశ్చర్య కర్మణ | నమో గిరాం విదూరాయ బ్రహ్మణ పరమాత్మనే || 44 అమోఘమగు దృష్టి గలవాడు, పరమాత్మ, సాక్షి, సర్వాత్మ, అనేక రూపములను ధరించువాడు, అన్నిటికి ఆత్మయైనవాడు, పరబ్రహ్మ, తపస్సును చేయుచున్నవాడు అగు నిన్ను శరణు వేడెదను (40). నీ పదమును దేవతలు, ఋషులు, మరియు సిద్ధులు కూడా ఎరుంగును. ఇతర ప్రాణులలో ఎవ్వరు నిన్ను ఎరుంగ గలరు? (41). నీ పదమును చూడగోరిన మానవులు సంగమును వీడి సాధువులగుచున్నారు. నీ చరితము మాకు మోక్షమునిచ్చును. లోకములను నీనుండియే సృష్టించిననూ, నీవు వ్రణము (ఛిద్రము) లేని వాడవు (42). నీకు దుఃఖమునిచ్చే జన్మాది వికారములు లేమియూ లేవు కాని, నీవు మాయాచే దయతో వాటిని స్వీకరించుచున్నావు (43). పరమేశ్వరుడు, ఆశ్చర్యకరమగు కర్మలను చేయువాడు, మాటలకు అందని వాడు, పరబ్రహ్మ, పరమాత్మ అగు నీకు నమస్కారము (44). అరూపాయోరు రూపాయ పరాయానంతశక్తయే | త్రిలోకపతయే సర్వసాక్షిణ సర్వగాయ చ || 45 నను ఆత్మ ప్రదీపాయ నిర్వాణ సుఖసంపదే | జ్ఞానాత్మనే నమస్తేsస్తు వ్యాపకాయేశ్వరాయ చ || 46 నైష్కర్మ్యేణ సులభ్యాయ కైవల్య పతయే నమః | పురుషాయ పరేశాయ నమస్తే సర్వదాయ చ || 47 క్షేత్ర జ్ఞా యాత్మ రూపాయ సర్వప్రత్య యహేతవే | సర్వాధ్యక్షాయ మహతే మూల ప్రకృతయే నమః || 48 రూపము లేనివాడు, పెద్ద రూపము గలవాడు, అనంతశక్తి గలవాడు, ముల్లోకములకు ప్రభువు. సర్వసాక్షి, సర్వమును పొందియున్నవాడు (45), ఆత్మరూపుడుగా నుండి సర్వమును ప్రకాశింప జేయువాడు, మోక్షస్వరూపుడు, ఆనందఘనుడు, జ్ఞానఘనుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు (46), సర్వకర్మ సన్న్యాస యోగముచే తేలికగా లభించువాడు, మోక్షమునిచ్చు ప్రభువు, పురుష స్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వమునిచ్చువాడు (47), దేహమునందుండే సాక్షి, ఆత్మ రూపుడు, మనోవృత్తులన్నింటికీ కారణమైనవాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమష్టి బుధ్ధి స్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారము (48). త్రినే త్రాయేషువక్త్రాయ సదాభాసాయ తే నమః | సర్వేంద్రియగుణ ద్రష్ట్రే నిష్కారణ నమోsస్తుతే || 49 త్రిలోకకారణాయాథాపవర్గాయ నమో నమః | అపవర్గ ప్రదాయాశు శరణా గత తారిణ || 50 సర్వామ్నాయా గమానాం చోదధయే పరమేష్ఠినే | పరాయణాయ భక్తానాం గుణానాం చ నమోsస్తుతే || 51 నమో గుణారణిచ్ఛన్న చిదూష్మాయ మహేశ్వర | మూఢ దుష్ప్రాప రూపాయ జ్ఞాని హృద్వాసినే సదా || 52 మూడు నేత్రములు గలవాడు, శిరస్సు వెనుక బాణములను ధరించినవాడు, సద్ఘనుడు, చిద్ఘనుడు, ఇంద్రియ గుణములన్నింటికి సాక్షి, కారణము లేనివాడు (49), ముల్లోకములకు కారణమైనవాడు, మోక్షస్వరూపుడు, శీఘ్రముగ మోక్షము నిచ్చువాడు, శరణు పొందిన వారిని రక్షించువాడు (50), సర్వవేద శాస్త్రములకు పెన్నిధి, పరమేష్ఠి స్వరూపుడు, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్ఠమగు స్థానము అయినవాడు, సర్వసద్గుణ నిధి (51), సత్త్వరజస్తమోగుణములు అనే అరణిచే దాచియుంచబడిన చిద్ఘనుడు, మహేశ్వరుడు, మూఢులచే పొంద శక్యము కాని రూపము గలవాడు, జ్ఞానుల హృదయములో నిత్య నివాసి అగు శివునకు నమస్కారము.(52). పశుపాశ విమోక్షాయ భక్తసన్ముక్తి దాయ చ| స్వప్రకాశాయ నిత్యాయావ్యయా యాజస్రసంవిదే || 53 ప్రత్యగ్ద్రష్ట్రేsవికారాయ పరమైశ్వర్య ధారిణ | యం భజంతి చతుర్వర్గం కామయంతీష్ట సద్గతిమ్ || 54 సోsభూదకరుణస్త్వం నః ప్రసన్నో భవ తే నమః | ఏకాంతినః కంచనార్థం భక్తా వాంఛంతి యస్య న || 55 కేవలం చరితం తే తే గాయంతి పరమంగలమ్ | అక్షరం పరమం బ్రహ్మ తమవ్యక్తాకృతిం విభుమ్ || 56 అధ్యాత్మ యోగగమ్యం త్వాం పరిపూర్ణం స్తుమో వయమ్ | అతీంద్రియమనాధారం సర్వాధారమహేతుకమ్ || 57 అనంత మాద్యం సూక్ష్మం త్వాం ప్రణమామోsఖిలేశ్వరమ్ | జీవుల బంధమును పోగొట్టువాడు, భక్తులకు సద్రూపమగు ముక్తిని ఇచ్చువాడు, స్వప్రకాశస్వరూపుడు, నిత్యుడు, నాశములేనివాడు, జ్ఞానఘనుడ (53), ప్రత్యగాత్మ రూపుడుగా నుండి సర్వమును చూచువాడు, కాని వికారములు లేనివాడు, పరమేశ్వర్యమును ధరించియున్నవాడు అగు పరమాత్మకు నమస్కారము. నిన్ను సేవించువారికి ధర్మార్ధకామమోక్షములు మరియు అభిలషితమగు సద్గతి లభించును (54). అట్టి నీవు మా యందు దయను వీడితివి. మాపై ప్రసన్నుడవు కమ్ము. నీకు మనస్కారము. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైననూ కోరరు (55). వారు పరమ మంగళకరమగు నీ చరిత్రను మాత్రమే గానము చేసెదరు. అక్షర పరబ్రహ్మ, అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి (56), అధ్యాత్మయోగముచే పొందబడువాడు, పరిపూర్ణుడు, ఇంద్రియములకు గోచరము కానివాడు, ఆధారములేనివాడు, సర్వమునకు ఆధారమైన వాడు, కారణము లేని వాడు అగు నిన్ను మేము స్తుతించుచున్నాము (57). అనంతుడు, ఆద్యుడు, ఇంద్రియాగోచరుడు, సర్వేశ్వరుడు అగు నీకు ప్రణమల్లు చున్నాము. హర్యాదయోsఖిలా దేవాస్తథా లోకాశ్చరాచరాః || 58 నామరూపవిభేదేన ఫల్గ్వా చ కలయా కృతాః | యథార్చిషోsగ్నే స్సవితుర్యాంతి నిర్యాంతి చాసకృత్ || 59 గభస్తయస్తథాయం వై ప్రవాహో గౌణ ఉచ్యతే | న త్వం దేవోsసురో మర్త్యో న తిర్యఙ్ న ద్విజః ప్రభో || 60 న స్త్రీ న షంఢో న పుమాన్ సదసన్న చ కించన | నిషేధశేషస్సర్వం త్వం విశ్వకృద్విశ్వపాలకః || 61 విశ్వలయ కృద్విశ్వాత్మా ప్రణతాస్స్మప్త మీశ్వరమ్ | విష్ణువు మొదలగు సమస్త దేవతలను, లోకములను, చరాచర జగత్తును నీవు నామరూపభేదము కలుగునట్లుగా అల్పప్రయత్నముచే నిర్మించితివి (58). అగ్ని నుండి విస్ఫు లింగములు వలె, సూర్యుని నుండి కిరణములు వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి ఉద్భవించి మరల నీలో లీనమగుచున్నది (59). హే ప్రభో! నీ వు దేవతవు కాదు, రాక్షసుడవు కాదు, మానవుడు కాదు, పశువు కాదు , పక్షివి కాదు (60). నీవు స్త్రీ కాదు, నపుంసకుడవు కాదు, పురుషుడవు కాదు, సత్ కాదు, అసత్ కాదు, ద్రవ్యము కాదు సర్వమును నిషేధించగా మిగిలే అద్వయతత్త్వమే నీవు. విశ్వమును నిర్మించి, పాలించి (61), లయమును చేయు విశ్వ స్వరూపుడవు నీవే. సర్వేశ్వరుడవగు నీకు ప్రణమిల్లుచున్నాము. యోగరంధితకర్మాణో యం ప్రపశ్యంతి యోగినః || 62 యోగ సంభావితే చిత్తే యోగేశం త్వాం నతా వయమ్ | నమోsస్తు తేsసహ్యవేగ శక్తిత్రయ త్రయీమయ || 63 నమః ప్రసన్న పాలాయ నమస్తే భూరిశక్తయే | కదింద్రియాణాం దుర్గేశా నవాప్య పరవర్త్మనే || 64 భక్తో ద్ధార రతాయాథ నమస్తే గూఢవర్చసే | యచ్ఛక్త్యాహం ధీయాత్మానం హతం వేద న మూఢధీః || 65 తం దురత్యయ మహాత్మ్యం త్వాం న తాః స్మో మహాప్రభుమ్ | యోగులు, యోగముచే శుద్ధమైన కర్మలు గలవారై, యోగముచే నిర్మిలమైన చిత్తము నందు యోగేశ్వరుడవగు నిన్ను దర్శించెదరు. అట్టి నిన్ను మేము నమస్కరించుచున్నాము (62). నీ వేగము సహింపరానిది. ఇచ్ఛా శక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తులు, ఋగ్యజుస్సామ వేదములు నీ స్వరూపమే (63). శరణు జొచ్చిన వారిని రక్షించువాడు, అనంత శక్తి మంతుడు అగు నీకు నమస్కారము. ఉమాపతీ!ఇంద్రియ నిగ్రహములేని వారికి పొంద శక్యము కాని జ్ఞానమార్గము నీది (64). భక్తులనుద్ధరించుట యందు ప్రీతి గల నీకు నమస్కారము. నీ ప్రకాశము నిగూఢముగ నుండును. నీ మాయా శక్తిచే నేను మోహమును పొంది, మూర్ఖుడనై నీ మహిమను, నా అసమర్థతను తెలుసుకొన లేకపోతిని (65). నీ మహిమ అపారము. మహాప్రభువగు నిన్ను మేము నమస్కరించుచున్నాము. ఇతి స్తుత్వా మహాదేవం సర్వే విష్ణ్వా దికాస్సురాః || 66 తూష్ణీమాసన్ ప్రభోరగ్రే సద్భక్తి నత కంధరాః || 67 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే నందావ్రత విధాన శివస్తుతి వర్ణనం నామ పంచదశోsధ్యాయః (15). విష్ణ్వాది దేవతలందరు మహా దేవుని ఈ విధముగా స్తుంతిచి (66), ఆ ప్రభువు యెదుట మంచి భక్తితో సాష్ణాంగ ప్రణామమును చేసి, మిన్నకుండిరి (67). శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో నందా వ్రత విధానము, శివస్తుతి అనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).