Sri Sivamahapuranamu-I    Chapters   

అథ షష్ఠోsధ్యాయః

బ్రహ్మ విష్ణు సంగ్రామము

నందికేశ్వర ఉవాచ |

పురా కదాచిద్యోగీంద్ర విష్ణుర్విషధరాసనః | సుష్వాప పరయా భూత్యా సానుగైరపి సంవృతః || 1

యదృచ్ఛయా గతస్తత్ర బ్రహ్మా బ్రహ్మ విదాం వరః | అపృచ్ఛత్పుండరీకాక్షం శయానం సర్వసుందరమ్‌ || 2

కస్త్వం పురుషవచ్ఛేషే దృష్ట్వా మామపి దృప్తవత్‌ | ఉత్తష్ఠ వత్స మాం పశ్య తవ నాథతమిహాగతమ్‌ || 3

ఆగతం గురు మారాధ్యం దృష్ట్వా యో దృప్తవచ్చరేత్‌ | ద్రోహిణస్తస్య మూఢస్య ప్రాయశ్చిత్తం విధీయతే || 4

నందికేశ్వరుడిట్లు పలికెను-

ఓ యోగిశ్రేష్ఠా! పూర్వము ఒకనాడు విష్ణువు గొప్ప వైభవముతో శేషశయనముపై నిద్రించెను. అనుచరులు ఆయనను చుట్టువారి యుండిరి (1). వేదవేత్తలలో శ్రేష్ఠుడగు బ్రహ్మ అచటకు అనుకోకుండా వెళ్లి, పద్మము వంటి నేత్రములు గలవాడు, సర్వాంగసుందరుడు నగు విష్ణువు పరుండియుండగా, ఇట్లు ప్రశ్నించెను (2). ''నీవెవరవు? నన్ను చూసి కూడా గర్వముతో శేషునిపై పరుండియున్నావు. ఓవత్సా! లెమ్ము. నేను నీ ప్రభువును వచ్చియున్నాను. నన్ను చూడుము (3). ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు చూచి కూడా ఎవడైనతే గర్వించి ప్రవర్తించునో, అట్టి ద్రోహబుద్ధి గల మూర్ఖునకు ప్రాయశ్చిత్తము విధింపబడును (4)''.

ఇతిశ్రుత్వా వచః క్రుద్ధో బహిశ్శాంతవదాచరత్‌| స్వస్తి తే స్వాగతం వత్స తిష్ఠ పీఠమితో విశ || 5

కిముతే వ్యగ్రవద్వక్త్రం విభాతి విషమేక్షణమ్‌|

ఈ మాటలను విన్న విష్ణువు, కోపమును పొందియూ, బాహ్యముగా శాంతుని వలెనే ఆచరించి, ఇట్లు పలికెను. ''ఓ వత్సా! నీకు స్వాగతము. ప్రక్కకు జరుగుము. ఇదిగో ఆసనము .కూర్చుండుము. (5) నీ ముఖము చింతాగ్రస్తమై యున్నదేల? నీ చూపులు ప్రసన్నముగా లేవు.''

బ్రహ్మోవాచ|

వత్స విష్ణో మహామాన మాగతం కాలవేగతః || 6

పితామహాశ్చ జగతః పాతా చ తవ వత్సక|

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! విష్ణో! గొప్ప అభిమానము గల నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను(6). పితామహుడను. వత్సా! జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను.

విష్ణురువాచ|

మత్థ్సం జగదిదం వత్స మనుషే త్వం హి చోరవత్‌|| 7

మన్నాభి కమలా జ్ఞాతః పుత్రస్త్వం భాషసే వృథా|

విష్ణువు ఇట్లు పలికెను-

వత్సా! ఈ జగత్తు నా యందు ఉన్నది. నీవు చోరుని వలె ప్రవర్తించున్నావు. (7) నీవు నా నాభిలోని పద్మము నుండి జన్మించిన నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా పలుకుచున్నావు.

నందికేశ్వర ఉవాచ!

ఏవం హి వదతోస్తత్ర ముగ్ధయోర జయోస్తదా|| 8

అహమేవ వరో న త్వమహం ప్రభు రహం ప్రభుః | పరస్పరం హంతు కామౌ చక్రతుస్సమరోద్యమమ్‌|| 9

యుయుధాతేsమరౌ వీరౌ హంస పక్షీంద్రవాహ నౌ| వైరంచ్యా వైష్ణవాశ్చెవ మిథో యుయుధిరే తదా || 10

తావద్విమానగతయః సర్వావై దేవజాతయః | దిదృక్షవస్సమాజగ్ముః సమరం తం మహాద్భుతమ్‌ || 11

నందికేశ్వరు డిట్లనెను-

అజులగు వారిద్దరు అపుడీ తీరును మోహమును పొంది మాటలాడ జొచ్చిరి(8) 'నేనే గొప్పవాడను; నీవుకాదు; నేను ప్రభుడను ;నేనే ప్రభుడను' అంటూ వారిద్దరు ఒకరినొకరు హింసించగోరి, యుద్ధమునకు సన్నద్ధులు కాజొచ్చిరి (9) క్రమముగా హంస, గరుడుడు వాహనములు గాగల ఆ దేవతా వీరులిద్దరూ యుద్ధమును చేయుచుండగా, వారి వారి అనుయాయులు కూడా పరస్పరము యుద్ధము చేయ మొదలిడిరి(10) అపుడు దేవజాతుల వారందరూ విమానముల నధిరోహించి, ఆ మహాద్భుత యుద్ధమును చూచు ఉత్కంఠతో అచటకు విచ్చేసిరి(11).

క్షిపంతః పుష్పవర్షాణి పశ్యంతః సై#్వరమంబరే |సువర్ణ వాహనస్తత్ర క్రుద్ధో వై బ్రహ్మవక్షసి|| 12

ముమోచ బాణాన సహా నస్త్రాంశ్చ వివిధాన్‌ బహున్‌ | ముమోచాథ విధిః క్రుద్ధో విష్ణోరురసి దుస్సహాన్‌ || 13

బాణాననలసంకాశాన్‌ అస్త్రాంశ్చ బహుశస్తదా| తదాశ్చర్యమితి స్పష్టం తయోస్సమరగోచరమ్‌|| 14

సమీక్ష్య దైవతగణా శ్శశంసుర్భృ శమాకులాః | తతో విష్ణు స్సుసంక్రుద్ధః శ్వసన్‌ వ్యసన కర్శితః || 15

మహేశ్వరాస్త్రం మతిమాన్‌ సందధే బ్రహ్మణోపరి | తతో బ్రహ్మాభృశం క్రుద్ధః కంపయన్‌ విశ్వమేవ హి|| 16

అస్త్రం పాశుపతం ఘోరం సందధే విష్ణు వక్షసి|

వారు ఆకసము నుండి చూచుచూ, యథేచ్ఛగా పుష్పవృష్టిని కురిపించిరి. అపుడు గరుడ వాహనుడు కోపించి, బ్రహ్మ యొక్క వక్షస్థ్సలము నందు (12) , సహింప శక్యము కాని బాణములను, వివిధ అస్త్రములను ప్రయోగించెను. అపుడు బ్రహ్మ కోపించి,

విష్ణువు యొక్క వక్షస్థ్సలము నందు (13), అగ్నిహోత్రము వలె సహింప శక్యము కాని బాణములను, వివిధ అస్త్రములను ప్రయోగించెను. వారి ఆ యుద్ధము ఆశ్చర్యమును కలిగించెను. (14). దేవతా గణముల ఆ యుద్ధమును చూచి, చాల కంగారుపడిరి. అపుడు విష్ణువు మిక్కిలి కోపించి, గాయములచే పీడితుడై, దీర్ఘ నిశ్శ్వాసములను విడిచిపెట్టుచూ (15) మాహేశ్వరాస్త్రమును స్మరించి బ్రహ్మపై సంధానము చేసెను. అపుడు బ్రహ్మ ఇంకనూ కోపించి, జగత్తును వణికింప జేయుచూ (16), విష్ణువు యొక్క వక్షస్థ్సలముపై భయంకరమగు పాశుపతాస్త్రమును సంధానము చేసెను.

తతస్తదుత్థితం వ్యోమ్ని తపనాయుత సన్నిభమ్‌ || 17

సహస్రముఖ మత్యుగ్రం చండవాత భయంకరమ్‌| అస్త్ర ద్వయమిదం తత్ర బ్రహ్మ విష్ణోర్భయంకరమ్‌ || 18

ఇత్థం బభూవ సమరో బ్రహ్మ విష్ణ్వోః పరస్పరమ్‌| | తతో దేవగణా స్సర్వే విషణ్ణా భృశమాకులాః || 19

ఊచుః పరస్పరం తాత రాజక్షోభే యథా ద్విజాః| సృష్టిః స్థితిశ్చ

సంహారః తిరో భావోsప్యనుగ్రహాః || 20

యస్మాత్ప్రవర్తతే తసై#్మ బ్రహ్మణ చ త్రిశూలినే |

అశక్య మన్యైర్యదనుగ్రహం వినా తృణక్షయోsప్యత్ర యదృచ్ఛయా క్వచిత్‌|| 21

ఆ పాశుపతాస్త్రము ఆకసము నందు లేచి, కోటి సూర్యుల ప్రకాశముతో (17), వేయి ముఖములు గలదై చండవాయువు వలె మిక్కిలి భయమును గొల్పుచుండెను. బ్రహ్మ విష్ణువుల ఈ రెండు అస్త్రములు చాల భీతిని గొల్పుచుండెను. (18). ఈ విధముగా బ్రహ్మ విష్ణువుల ద్వంద్వయుద్ధము కొనసాగుచుండగా, దేవగణముల వారందరూ మిక్కిలి కంగారుపడిరి(19), వత్సా! రాజ ప్రాసాదములో సంక్షోభము ఏర్పడినప్పటి బ్రాహ్మణుల వలె, ఆ దేవతలు పరస్పరము ఇట్లు పలుకుచుండిరి. సృష్టి, స్థితి, సంహారము (జగత్తు ప్రకృతి యందు లయమగుట), తిరోభావము (ప్రకృతి పరమాత్మ యందు లయమగుట), మరియు అనుగ్రహము (పునస్సృష్టికి అనుజ్ఞ) అనునవి (20) ఏ పరబ్రహ్మ నుండి ప్రవర్తిల్లునో, అట్టి త్రిశూలి యగు శివునకు నమస్కారము. ఆయన అనుగ్రహము లేనిదే ఈ లోకములో ఎక్కడైననూ ఇతరులు గడ్డిపోచను కూడ త్రుంచలేరు (21).'

ఇతి దేవా భయం కృత్వా విచిన్వంతః శివక్షయమ్‌ | జగ్ముఃకైలాసశిఖరం యత్రాస్తే చంద్రశేఖరః || 22

దృష్ట్వైవమమరా హృష్టాః పదం తత్పారమేశ్వరమ్‌ | ప్రణముః ప్రణవాకారం ప్రవిష్టాస్తత్ర సద్మని || 23

తేపి తత్ర సభామధ్యే మండపే మణి విష్టరే | విరాజమానముమయా దదృశుర్దేవపుంగవమ్‌ || 24

సవ్యోత్తరేతర పదం తదర్పిత కరాంబుజమ్‌ | స్వగణౖ స్సర్వతో జుష్టం సర్వలక్షణ లక్షితమ్‌ || 25

వీజ్యమానం విశేషజ్ఞైః స్త్రీజనై స్తీవ్రభావనైః | శస్యమానం సదా వేదైరనుగృహ్ణంత మీశ్వరమ్‌ || 26

దృష్ట్వైవ మీ శమమరాస్సంతోష సలిలేక్షణాః | దండవద్దూరతో వత్స నమశ్చక్రుర్మహాగణాః || 27

తాన వేక్ష్య పతిర్దేవాన్‌ సమీపే చాహ్వయద్గణౖః | అథ సంహ్లాదయన్‌ దేవాన్దేవో దేవశిఖామణిః |

అవోచ దర్ధ గంభీరం వచనం మధు మంగలమ్‌ || 28

ఇతి శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం షష్ఠో

sధ్యాయః (6)

ఇట్లు భీతిల్లిన దేవతలు శివుని నివాసమును వెదుకుతూ కైలాస శిఖరమునకు వెళ్లిరి. చంద్రశేఖరుడు నివసించు స్ధానమదియే (22). దేవతలు పరమేశ్వరుని ఆ స్ధానమును చూచి, సంతసించిన వారై, ఆ నివాసము లోపల ప్రవేశించి, ఓంకార స్వరూపుడగు శివునకు ప్రణమిల్లిరి (23). అచట సభామధ్యములో మణులు పొదిగిన మంటపము నందు ఉమాదేవితో కూడి విరాజిల్లుచున్న మహాదేవుని గాంచిరి (24). ఆయన ఎడమ కాలిపై కుడికాలిని ఉంచి, దానిపై పద్మము వంటి చేతిని ఉంచి కూర్చుండెను. సర్వ కల్యాణ గుణములతో విరాజిల్లే శివుని ప్రమథ గణములు చుట్టు వారి యుండిరి (25).పరిచారికలు శ్రద్ధతో వింజామరలను వీచుచుండిరి. వేదములు సంతతము ఆయనను స్తుతించుచుండెను (26). ఓవత్సా! ఈవిధముగా నున్న ఈశ్వరుని చూచిన దేవతా గణములు ఆనందముతో కన్నుల నీరు గార్చుచూ, సాష్టాంగ ప్రణామముల నాచరించిరి (27). అపుడు శివుడు ప్రమథ గణముల చేత ఆ దేవతలను దగ్గరకు పిలిపించెను. దేవ దేవుడగు శివుడు అపుడు దేవతల నానందపరచుచూ, తియ్యని, అర్థ గాంభీర్యము గల, మంగళకరమైన మాటలను పలికెను.

శ్రీ శివ మహా పురాణములో విద్యేశ్వర సంహిత యందు ఆరవ అధ్యాయము ముగిసినది(6).

Sri Sivamahapuranamu-I    Chapters