Sri Sivamahapuranamu-I
Chapters
అథ సప్తదశోsధ్యాయః సతీ వరప్రాప్తి బ్రహ్మోవాచ | ఇత్యుక్తా సర్వదేవైశ్చ కృతా శంభోర్నుతిః పరా | శివాచ్చ సా వరం ప్రాప్తా శృణు హ్యాదరతో మునే ||
1 అథో సతీ పునశ్శుక్ల పక్షే sష్టమ్యా ముపోషితా | ఆశ్వినే మాసి సర్వేశం పూజయామాస భక్తితః ||
2 ఇతి నందావ్రతే పూర్ణే నమమ్యాందిన భాగతః | తస్యాస్తు ధ్యానమగ్నాయాః ప్రత్యక్ష మభవద్ధరః ||
3 సర్వాంగ సుందరో గౌరః పంచవక్త్రస్త్రి లోచనః | చంద్రభాలః ప్రసన్నాత్మా శితికంఠశ్చతుర్భుజః ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! ఈ విధముగా దేవతలు శివుని గొప్ప స్తోత్రములతో స్తుతించిరి. శివుని నుండి ఆ సతీదేవి వరమును పొందెను. ఈ వృత్తాంతమును శ్రద్ధతో వినుము (1). అపుడు సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు మరల ఉపవసించి సర్వేశ్వరుని భక్తితో పూజించెను (2). ఈ తీరున నందా వ్రతము పూర్తి అయెను. నవమినాడు పగటి సమయమునందు ఆమె ధ్యానమునందు నిమగ్నురాలై యుండగా శివుడు ప్రత్యక్షమయ్యెను (3). ఆయన సర్వావయములయందు సుందరుడు. తెల్లని వాడు. అయిదు మోముల వాడు. ముక్కంటి . నుదుటిపై చంద్రుని ధరించియుండెను. ప్రసన్నమైన మనస్సు గలవాడు. తెల్లని కంఠము (నీలభాగము తక్క) గలవాడు. నాల్గు భుజములు కలవాడు (4). త్రిశూల బ్రహ్మ కవరాభయధృగ్భస్మభాస్వరః | స్వర్ధున్యా విలసచ్ఛీర్ష స్సకలాంగ మనోహరః ||
5 మహా లావణ్యధామా చ కోటి తంద్ర సమాననః | కోటి స్మర సమా కాంతిస్సర్వథా స్త్రీ ప్రియాకృతిః ||
6 ప్రత్యక్షతో హరం వీక్ష్య సతీ సేదృగ్విధం ప్రభుమ్ | వవందే చరణౌ తస్య సులజ్జావనతాననా ||
7 అథ ప్రాహ మహాదేవస్సతీం సద్ర్వత ధారిణీమ్ | తామచ్ఛన్నపి భార్యర్థం తపశ్చర్యాఫలప్రదః ||
8 త్రిశూలమును బ్రహ్మకపాలమును వరముద్రను అభయముద్రను చేతులయందు ధరించెను. ఆయన భస్మచే తెల్లగా ప్రకాశించుచుండెను. ఆయన శిరస్సుపై మందాకిని విలసిల్లు చుండెను.ఆయన సర్వాంగ సుందరుడు (5). ఆయన లావణ్యమునకు పెన్నిధి. కోటి చంద్రులతో సమానముగా ప్రకాశించెను. కోటి మన్మథులతో సమమగు కాంతిని గలిగి యుండెను.ఆయన ఆకారము యువతులకు అన్ని విధములుగా ప్రీతిపాత్రమగును (6). సతీదేవి ఈ విధముగా నన్ను శివప్రభువును ప్రత్యక్షముగా గాంచి సిగ్గుతో వంగిన ముఖముగలదై ఆయన పాదములకు సమస్కరించెను (7). అపుడు మహాదేవుడు తపస్సునకు ఫలముగా ఆమెను భార్యగా స్వీకరించగోరి, మహావ్రతముననుష్ఠించుచున్న సతీదేవితో నిట్లనెను (8). మహాదేవ ఉవాచ | దక్ష నందిని ప్రీతోsస్మి వ్రతే నానేన సువ్రతే | వరం వరయ సందాస్యే యత్తవాభిమతం భ##వేత్ ||
9 మహాదేవుడు ఇట్లు పలికెను - ఓ దక్షపుత్రీ! నీవు మంచి వ్రతమును చేసితివి. నీ యీ వ్రతముచే నేను సంతసించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. ఇచ్చెదను (9). బ్రహ్మోవాచ | జానన్న పీహ తద్భావం మహాదేవో జగత్పతిః | జగౌ వరం వృణీష్వేతి తద్వాక్యశ్రవణచ్ఛయా ||
10 సాపి త్రపావశా యుక్తా వక్తునం నో హృది యత్ స్థితమ్ | శశాక సా త్వభీష్టం యత్తల్లజ్జాచ్ఛాదితం పునః || 11 బ్రహ్మ ఇట్లు పలికెను - జగత్ర్ప భువగు మహాదేవునకు ఆమె మనస్సులో భావము తెలిసినదే. కాని ఆమె మాటను విను కోరికతో వరమును కోరుకొనుము అని పలికెను (10). కాని ఆమె లజ్జచే హృదయములోని మాటను చెప్పలేకపోయెను. ఆమె అభిష్టము లజ్జచే కప్పివేయబడెను (11). ప్రేమమగ్నాsభవత్సాతి శ్రుత్వా శివవచః ప్రియమ్ | తద్ జ్ఞాత్వా సుప్రసన్నోsభూచ్ఛంకరో భక్తవత్సలః || 12 వరం బ్రూహి వరం బ్రూహి ప్రాహేతి స పునర్ద్రుతమ్ | సతీ భక్తి వశ శ్శంభురంతర్యామీ సతాం గతిః || 13 అథ త్రపాం స్వాం సంధాయ యదా ప్రాహ హరం సతీ | యథేష్టం దేహి వరద వరమిత్యనివారకమ్ || 14 తదా వాక్యస్యావసాన మనవేక్ష్య వృషధ్వజః | భవ త్వం మమ భార్యేతి ప్రాహ తాం భక్తవత్సలః || 15 ఆమె శివుని ప్రియమైన పలుకులను విని అతిశయించిన ప్రేమలో మునిగిపోయెను. భక్తవత్సలుడగు శంకరుడా విషయమునెరింగి మిక్కిలి ప్రసన్నుడాయెను (12). అంతర్యామి, సత్పురుషులకు శరణ్యుడు అగు శంభుడు సతీదేవి యొక్క భక్తికి వశుడై వెంటనే 'వరము నడుగుము, వరము నడుగుము' అని మరల పలికెను (13). అపుడామె తన సిగ్గును నియంత్రించుకొని, 'వరములనిచ్చువాడా! నివారింపశక్యము కాని వరమును నీకు ఇష్టమైన దానిని ఇమ్ము' అని పలుకగా (14), అపుడు భక్తవత్సలుడగు వృషభధ్వజుడు వాక్యము పూర్తి యగువరకు వేచి యుండలేదు. నీవు నా భార్యవు కమ్ము అని ఆయన ఆమెతో పలికెను (15). ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య సా భీష్ట ఫలభావనమ్ | తూష్ణీం తస్ధౌ ప్రముదితా వరం ప్రాప్య మనోగతమ్ || 16 సకామస్య హరస్యాగ్రే స్థితా సా చారుహాసినీ . అకరోన్నిజభావాంశ్చ హావాస్కామవిర్ధనాన్ || 17 తతో భావాన్ సమాదాయ శృంగారాఖ్యో రసస్తదా | తయోశ్చిత్తే వివేశాశు కలా హావా యథోదితమ్ || 18 తత్ర్పవేశాత్తు దేవర్షే లోకలీలానుసారిణోః | కాప్యభిఖ్యా తయోరాసీ చ్చిత్రా చంద్రమసోర్యథా || 19 అభీష్ట ఫలమును ప్రదానము చేసే శివుని ఈ మాటను విని, తన మనస్సులో నున్న కోరిక తీరుటచే మిక్కిలి ఆనందించినదై సతీదేవి మిన్నకుండెను (16). ప్రేమతో కూడియున్న శివుని యెదుట నిలబడి సుందరమగు చిరునవ్వుగల ఆ సతి శివుని కామమును వృద్ధి పొందించే హావ భావములను ప్రకటించెను (17). అపుడు భావములతో కూడి శృంగారరసము వెంటనే వారి హృదయములలో ప్రవేశించెను. పైగా చెప్పిన తీరున హావభావములు సుందరముగా ప్రకటమయ్యెను (18). ఓ దేవర్షీ! లోకలీలలను అనుకరించే వారిద్దరిలో శృంగార ప్రవేశము వలన చిత్రాచంద్రమసులయందు వలె వారిద్దరి యందు వర్ణింపశక్యము కాని శోభ కన్పట్టెను (19). రేజే సతీ హరం స్నిగ్ధభిన్నాంజన సమప్రభ | చంద్రా భ్యాశేsభ్రలేఖేవ స్ఫటికోజ్జ్వల వర్ష్మణః || 20 అథ సా తమువాచేదం హరం దాక్షాయణీ ముహుః | సుప్రసన్నా కరౌ బద్ధ్వా నతాకా భక్తవత్సలమ్ || 21 చిక్కని కాటుక కాంతి గల సతి స్ఫటికమువలె ప్రకాశించు దేహముగల శివుని సమీపములో చంద్రుని ప్రక్కన మేఘపంక్తి వలె భాసిల్లెను(20).అపుడా దాక్షాయణీ మిక్కిలి ప్రసన్నురాలై భక్త వత్సలుడగు శివునకు చేతులు జోడించి అనేక నమస్కారములను చేసి, ఆయనతో నిట్లనెను (21). సత్యువాచ | దేవ దేవ మహాదేవ వివాహ విధినా ప్రభో | పితుర్మే గోచరీకృత్య మాం గృహాణ జగత్పతే || 22 సతి ఇట్లు పలికెను - దేవదేవా! మహాదేవ! ప్రభూ! జగత్పాలకా! నా తండ్రికి తెలుపుడు జేసి నన్ను యథావిధిగా వివాహమాడి స్వీకరించుము (22). బ్రహ్మోవాచ | ఏవం సతీవచశ్ర్శుత్వా మహేశో భక్తవత్సలః | తథాస్త్వితి వచః ప్రాహ నిరీక్ష్య ప్రేమతశ్చ తామ్ || 23 దాక్షాయణ్యపి తం నత్వా శంభుం విజ్ఞాప్య భక్తితః | ప్రాప్తాజ్ఞా మాతురభ్యాశమగాన్మో హముదాన్వితా || 24 హరోsపి హివవత్ర్పస్థం ప్రవిశ్య చ నిజాశ్రమమ్ | దాక్షాయణీ వియోగాద్వై కృచ్ఛ్రధ్యానపరోsభవత్ || 25 సమాధాయ మనశ్శంభు ర్లౌకికీం గతి మాశ్రితిః | చింతయామాస దేవర్షే మనసా మాం వృషధ్వజః || 26 బ్రహ్మ ఇట్లు పలికెను - భక్త వత్సలుడగు మహేశ్వరుడు సతీ దేవి యొక్క ఈ మాటను విని, ఆమెను ప్రేమతో చూచి 'అటులనే అగుగాక!'అని పలికెను (23). దాక్షాయణి కూడా శంభునకు నమస్కరించి భక్తితో విన్నవించి ఆజ్ఞను పొంది ప్రేమతో ఆనందముతో నిండిన మనస్సుగలదై తల్లి వద్దకు వెళ్లెను (24). శివుడు కూడా హిమవత్పర్వత మైదానములోని తన ఆశ్రమములో ప్రవేశించి, దాక్షాయణి వియోగముచే అతి కష్టముతో ధ్యానమును చేయ మొదలిడెను (25). వృషభధ్వజుడగు శంభుడు మనస్సును నియంత్రించుకొనెను. ఓ దేవర్షీ! ఆయన లౌకిక ప్రవృత్తి నాశ్రయించి, మనస్సులో నన్ను తలంచెను (26). తతస్సంచింత్య మానోsహం మహేశేన త్రిశూలినా |పురస్తాత్ర్పావిశం తూర్ణం హరసిద్ధిప్రచోదితః || 27 యత్రాసౌ హిమవత్ర్పస్థే త ద్వియోగీ హరస్థ్సి తః | సరస్వతీ యుతస్తాత తత్రైవ సముపస్థితః || 28 సరస్వతీయుతం మాం చ దేవర్షే వీక్ష్య స ప్రభుః | ఉత్సుకః ప్రేమ బద్ధశ్చ సత్యా శంభురువాచ హ || 29 త్రిశూలి, మహేశ్వరుడు నగు హరుడు నన్ను స్మరించగా ఆయన యొక్క సిద్ధిచే ప్రేరితుడనై నేను ఆయన ముందు వెంటనే నిలబడితిని (27). వత్సా! శివుడు సతీవియోగముతో హిమవత్పర్వతముయొక్క మైదానములో ఉండెను. నేను సరస్వతితో గూడి అచటకు చేరుకుంటిని (28). ఓ దేవర్షీ! సతీదేవి యందు దృఢమైన ప్రేమగల ఆ శంభు ప్రభుడు ఉత్కంఠతో గూడి యుండెను సరస్వతితో గూడి వచ్చిన నన్ను చూచి ఆయన ఇట్లు పలికెను (29). శంభురువాచ | అహం బ్రహ్మన్ స్వార్థపరః పరిగ్రహకృతౌ చ యత్ | తదా స్వత్వమివ స్వార్థే ప్రతిభాతి మయా ధునా || 30 అహ మారాధిత స్సత్యా దాక్షాయణ్యాథ భక్తితః | తసై#్య వరో మయా దత్తో నందావ్రత ప్రభావతః || 31 భర్తా భ##వేతి చ తయా మత్తో బ్రహ్మన్ వరో వృతః | మమ భార్యా భ##వేత్యుక్తం మయా తుష్టేన సర్వథా || 32 అథావదత్తదా మాం సా సతీ దాక్షాయణీ త్వితి | పితుర్మే గోచరీకృత్య మాం గృహాణ జగత్పతే || 33 శంభుడు ఇట్లు పలికెను - హే బ్రహ్మన్! నేను వివాహము చేసుకొనగోరి స్వార్ధ పరుడనైనాను. ఇప్పుడు నాకు స్వార్థచించనయే నా స్వభావమన్నట్లు తోచుచున్నది (30). దక్షుని కుమార్తె యగు సతి నన్ను భక్తితో ఆరాధించెను. ఆమె చేసిన నందా వ్రతము యొక్క ప్రభావముచే ఆమెకు నేను వరమునిచ్చితిని (31). హే బ్రహ్మన్! 'నాకు భర్తవు కమ్ము' అని ఆమె వరమును నానుండి కోరెను. నేను ఎంతయూ సంతసించి యుంటిని. 'నా భర్యవు కమ్ము' అని అంటిని (32). అపుడు దక్షపుత్రియగు ఆ సతీ దేవి నాతో నిట్లనెను. హే జగత్ర్పభో! నా తండ్రికి నివేదించి నన్ను స్వీకరించుము (33). తదప్యంగీకృతం బ్రహ్మన్మయా తద్భక్తితుష్టితః | సా గతా భవనం మాతు రహమత్రాగతో విధే || 34 తస్మాత్త్వం గచ్ఛ భవనం దక్షస్య మమ శాసనాత్ | తాం దక్షోsపి యథా కన్యాం దద్యాన్మేsరం తథా వద || 35 సతీవియోగ భంగస్స్యాద్యథామే త్వం తథా కురు | సమాశ్వాసయ తం దక్షం సర్వవిదాయ విశారదః || 36 హే బ్రహ్మన్! ఆమె భక్తిచే సంతసిల్లిన నేను దానికి కూడా అంగీకరించితిని. ఓ బ్రహ్మా! ఆమె తన భవనమునకు తల్లి వద్దకు వెళ్లెను. నేనిచటకు వచ్చితిని (34). కావున నీవు నా ఆజ్ఞచే దక్షుని గృహమునకు వెళ్లుము. దక్షుడు నాకు ఆ కన్యను వివాహములో శీఘ్రముగా ఇచ్చు తీరున దక్షునకు నచ్చ జెప్పుము (35). నాకు ఈ సతీవియోగము నుండి విముక్తి కలుగు ఉపాయము ననుష్ఠింపుము. నీవు అన్ని విద్యల యందు దిట్టవు. ఆ దక్షని ఒప్పించుము (36). బ్రహ్మోవాచ | ఇత్యుదీర్య మహాదేవస్సకాశేమే ప్రజాపతేః | సరస్వతీం విలోక్యాశు వియోగవశగోsభవత్ || 37 తేనా హమపి చాజ్ఞప్తిః కృతకృత్యో ముదాన్వితః | ప్రోవాచం చేతి జగతాం నాథం తం భక్తవత్సలమ్ || 38 యదాత్థ భగవాన్ శంభో తద్విచార్య సునిశ్చితమ్ | దేవానాం ముఖ్య స్స్వార్థో హి మమాపి వృషభధ్వజ|| 39 దక్షస్తుభ్యం సుతాం స్వాం చ స్వయమేవ ప్రదాస్యతి | అహం చాపి వదిష్యామి త్వద్వాక్యం తత్సమక్షతః || 40 ఇత్యుదీర్య మహాదేవమహం సర్వేశ్వరం ప్రభుమ్ | అగమం దక్ష నిలయం స్యందనే నాతి వేగినా || 41 బ్రహ్మ ఇట్లు పలికెను - ప్రజాపతిని అగు నాతో ఇట్లు మాటలాడి మహాదేవుడు సరస్వతిని చూచి, వెంటనే సతీవియోగమునకు వశుడయ్యెను (37). శివుడు ఈ తీరున ఆజ్ఞాపించగా, కృతకృత్యుడనై నేను మిక్కిలి సంతసించితిని. భక్తవత్సలుడగు ఆ జగన్నాథునితో నేను ఇట్లు పలికితిని (38). హే భగవాన్! శంభో! నీవు చెప్పిన పలుకులను విచారణ చేసి యుక్తమేనని నేను నిశ్చయించుకొంటిని. హే వృషభధ్వజా! ఈ వివాహమునందు ప్రధానముగా దేవతలకు, మరియు నాకు కూడ స్వార్థము గలదు (39). దక్షుడు స్వయముగనే నీకు తన కుమార్తెను ఈయగలడు. నీమాటను నేను కూడా ఆతనికి చెప్పగలను (40). సర్వేశ్వరుడు, ప్రభువు అగు మహాదేవునితో నేనిట్లు పలికి మిక్కిలి వేగముగల రథముపై నెక్కి దక్షుని ఇంటికి వెళ్లితిని (41). నారద ఉవాచ | విధే ప్రాజ్ఞ మహాభాగ వద నో వదతాం వర | సత్యై గృహాగతాయై స దక్షః కి మకరోత్తతః || 42 నారదుడిట్లు పలికెను - హే విధే! ప్రాజ్ఞా! మహాత్మా! నీవు ప్రవక్తలలో శ్రేష్ఠుడవు. సతీదేవి గృహమునకు వచ్చిన తరువాత దక్షుడేమి చేసెను ? మాకు చెప్పుము (42) బ్రహ్మోవాచ | తపస్తప్త్వా వరం ప్రాపయ మనోభిలషితం సతీ | గృహం గత్వా పితుర్మాతుః ప్రణామమకరోత్తదా || 43 మాత్రే పిత్రేsథ తత్సర్వం సమాచఖ్యౌ మహేశ్వరాత్ | వరప్రాప్తిస్స్వ సఖ్యా వై సత్యాస్తుష్టస్తు భక్తితః || 44 మాతా పితా చ వృత్తాంతం సర్వం శ్రుత్వా సఖీముఖాత్ | ఆనందం పరమం లేభే చక్రే చ పరమోత్సవమ్ || 45 ద్రవ్యం దదౌ ద్విజాతిభ్యో యథాభీష్టముదారధీః | అన్యేభ్యశ్చాంధ దీనేభ్యో వీరిణీ చ మహామనాః || 46 బ్రహ్మ ఇట్లు పలికెను - సతీ తపస్సును చేసి, మనస్సునకు అభీష్టమైన వరమును పొంది, ఇంటికి వెళ్లి,అపుడు తల్లిదండ్రులకు నమస్కరించెను (43). సతీదేవి యొక్క భక్తికి సంతసించి మహేశ్వరుడు వరమునిచ్చిన వృత్తాంతమును ఆమె తన సఖి చేత సమగ్రముగా తల్లి దండ్రులకు చెప్పించిరి (44). సఖి నోటినుండి ఈ వత్తాంతమును వినిన తల్లిదండ్రులు పరమానందమును పొంది, గొప్ప ఉత్సవమును చేసిరి (45). విశాల హృదయుడగు దక్షుడు బ్రహ్మణులకు కోరినంత ధనమునిచ్చెను. గొప్ప మనసు గల వీరిణి కూడా అంధులు, దీనులు మొదలగు వారికి ధనమునిచ్చెను (46). వీరిణీ తాం సమాలింగ్య స్వసుతాం ప్రీతి వర్థినీమ్ | మూర్ధ్న్యుపాఘ్రాయ ముదితా ప్రశంస ముహుర్ముహుః || 47 అథ దక్షః కియత్కాలే వ్యతీతే ధర్మవిత్తమః | చింతయామాస దేయేయం స్వసుతా శంభ##వే కథమ్ || 48 ఆగతోsపి మహాదేవః ప్రసన్నస్స జగామ హ | పునరేవ కథం సోsపి సుతార్థేsత్రాగమిష్యతి || 49 ప్రాస్థాప్యోsథ మయా కశ్చి చ్ఛంభోర్నికటమంజసా | నైతద్యోగ్యం గృహ్ణీయా ద్యద్యేవం విఫలార్థనా || 50 వీరిణి ప్రేమను వర్థిల్ల జేయు తన కుమార్తెను కౌగిలించుకొని, లలాటమునందు ముద్దిడి, ఆనందముతో మరల మరల కొనియాడెను (47). కొంత కాలము గడిచిన తరువాత ధర్మవేత్తలలో శ్రేష్ఠుడగు దక్షుడు ఇట్లు చింతిల్లెను. ఈ నా కుమార్తెను శివునకిచ్చి వివాహమును చేయుట యెట్లు?(48) ప్రసన్నుడై విచ్చేసిన ఆ మహాదేవుడు తిరిగి వెళ్లినాడట. ఈ నా కుమార్తె కొరకు ఆతడు మరల ఇచటకు వచ్చు ఉపాయమేది? (49) నేను వెంటనే ఎవరినో ఒకరిని శంభునివద్దకు పంపించవలెను. కాని అట్లు చేయుట యోగ్యము కాదేమో! ఆయన నా కుమార్తెను గ్రహించనిచో నా ప్రార్థన వ్యర్థమగును (50). అథవా పూజయిష్యామి తమేవ వృషభద్వజమ్ | మదీయతనయా భక్త్యా స్వయమేవ యథా భ##వేత్ || 51 తయైవ పూజితస్సోsపి వాంఛత్యార్య ప్రయత్నతః | శంభుర్భవతు మద్భర్తేత్యేవం దత్తవరేణ తత్ || 52 ఇతి చింతయతస్తస్య దక్షస్య పురతోsన్వహమ్ | ఉపస్థితోsహం సహసా సర్వస్వత్యన్వితస్తదా || 53 మాం దృష్ట్వా పితరం దక్షః ప్రణమ్యావనతస్థ్సితః | ఆసనం చ దదౌ మహ్యం స్వభవాయ యథోచితమ్ || 54 తతో మాం సర్వలోకేశం తత్రాగమనం కారణమ్ | దక్షః పప్రచ్ఛ స క్షిప్రం చింతా విష్టోsపి హర్షితః || 55 లేదా, నేను ఆ వృషభధ్వజుని పూజించెదను. ఇట్టి భక్తిచే నా కుమార్తె స్వయముగనే ఆయనకు భార్య కాగలదు (51). మరియు, ఆమెచే పూజింపబడిన శంభుడు తాను ఆమెకు భర్త కాగలనని వరమిచ్చి యున్నాడు. ఆయన కూడా పెద్దల ద్వారా వివాహయత్నమును చేయవచ్చును (52). దక్షుడు ఈ తీరున చింతిల్లు చుండగా నేను సరస్వతితో కూడి ఆతని ఎదుట వెనువెంటనే నిలబడితిని (53). తండ్రినగు నన్ను చూచి దక్షుడు ప్రణమిల్లి వినయముతో నిలబడెను. మరియు ఆతడు నాకు యోగ్యమగు ఆసనమును సమర్పించెను (54). దక్షుడు చింతతో కూడి యున్ననూ నన్ను చూచి ఆనందించి, వెంటనే సర్వజగత్ర్పభువునగు నన్ను అట్లు విచ్చేయుటకు గల కారణమును గూర్చి ప్రశ్నించెను (55). దక్ష ఉవాచ | తవాత్రా గమనే హేతుః కః ప్రవేశే స సృష్టికృత్ | మమో పరి సుప్రసాదం కృత్వాచక్ష్వ జగద్గురో || 56 పుత్ర స్నేహాత్కార్య వశాదథవా లోక కారక | మామాశ్రమం సమాయాతో హృష్టస్య తవ దర్శనాత్ || 57 దక్షుడిట్లు పలికెను - హే జగద్గురో! సృష్టికర్తవగు నీవు నాపై గొప్ప అనుగ్రహము గలవాడవై ఇచటకు వచ్చి యుంటివి. నీ రాకకు కారణమును చెప్పుము (56). హే లోకకర్తా! నీవు నా ఆశ్రమమునకు పుత్రప్రేమచే వచ్చితివా లేక, ఏదేని కార్యము కొరకై వచ్చితివా? మీ దర్శనముచే నాకు ఆనందము కలిగినది (57). బ్రహ్మోవాచ | ఇతి పృష్టస్స్వపుత్రేణ దక్షేణ మునిసత్తమ | విహసన్నబ్రువం వాక్యం మోదయంస్తం ప్రజాపతిమ్ || 58 శృణు దక్ష యదర్థం త్వత్సమీపమహమాగతః | త్వత్తోకస్య హితం మేsపి భవతోsపి తదీప్సితమ్ || 59 తవ పుత్రీ సమారాధ్య మహాదేవం జగత్పతిమ్ | యో వరః ప్రార్థితస్తస్య సమయోsయముపాగతః || 60 శంభునా తవ పుత్ర్యర్థం త్వత్సకాశమహం ధ్రువమ్ | ప్రస్థాపితోsస్మి యత్ కృత్యం శ్రేయస్తదవధారయ || 61 బ్రహ్మ ఇట్లు పలికెను - నా కుమారుడగు దక్ష ప్రజాపతి ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షీ! నేను చిరునవ్వు నవ్వి ఆతనికి ఆనందమును కలిగించుచూ ఇట్లు పలికితిని (58). హే దక్షా! నేను నీ వద్దకు వచ్చిన కారణమును వినుము. నేను నీ కుమార్తె హితమును గోరుచున్నాను. నీ కోరిక కూడ అదియే (59). నీ కుమార్తె శివుని ఆరాధించి ఒక వరమును కోరియున్నది. దానికి ఇపుడు సమయము ఆసన్నమైనది (60). శివుడు నన్ను నీ వద్దకు పంపినాడు. ఆయన నీ కుమార్తె కొరకు నన్ను పంపినాడు. నీకర్తవ్యమును, నీకు శ్రేయస్సు కలుగు విధముగా శ్రద్ధగా వినుము (61). వరం దత్త్వా గతో రుద్ర స్తావత్ర్ప భృతి శంకరః | త్వత్సుతాయా వియోగేన న శర్మ లభ##తేంజసా || 62 అలబ్ధచ్ఛిద్రమదనో జిగాయ గిరిశం న యమ్ | సర్వైః పుష్పమయైర్బాణౖ ర్యత్నం కృత్వాపి భూరిశః || 63 స కామబాణావిద్ధోsపి పరిత్యజ్యాత్మచింతనమ్ | సతీం విచించతయాన్నాస్తే వ్యాకులః ప్రాకృతో యథా || 64 విస్మృత్య ప్రశ్రుతాం వాణీం గణాగ్రే విప్రయోగతః | క్వ సతీత్యేవమభితో భాషతే నిశ్శ్వసత్యపి || 65 శివుడు వరము నిచ్చి వెళ్లిన నాటినుండియూ నీ కుమార్తె యొక్క వియోగముచే సుఖమును పొందలేకున్నాడు (62). మన్మథుడు పుష్పబాణములన్నింటితో పెద్ద ప్రయత్నమును చేసియూ, ఛిద్రము (దౌర్బల్యము) లభించకపోవుటచే ఏ శివుని జయింపలేకపోయినాడో(63),ఆ శివుడు ఇపుడు కామబాణములచే కొట్టబడకపోయిననూ, ఆత్మ ధ్యానమును వీడి, దుఃఖితుడై ప్రాకృతజనునివలె సతిని ధ్యానించుచున్నాడు (64). ఆయన వియోగ దుఃఖితుడై గణముల ఎదుట ఆరంభించిన ప్రసంగమును మరిచి 'సతి ఎక్కడ?' అని పలికి నలువైపులా పరికించుచున్నాడు. మరియు నిట్టూర్పులను విడుచుచున్నాడు(65). మయా యద్వాంఛితం పూర్వం త్వయా చ మదనేన చ | మరీచ్యాద్యైర్మునివరై స్తతిస్సద్ధ మధునా సుత || 66 త్వత్ర్పుత్ర్యా రాధిత శ్శంభుస్సోsపి తస్యా విచింతనాత్ | అనురోధయితుం ప్రేప్సుర్వర్తతే హిమవద్గిరౌ || 67 యథా నానా విధైర్భావై స్సత్త్వాత్తేన వ్రతేన చ | శంభురారాధితస్తేన తథైవరాధ్యతే సతీ || 68 తస్మాత్తు దక్షతనయాం శంభ్వర్థం పరికల్పితామ్ | తసై#్మదే హ్యవిలంబేన కృతా తే కృతకృత్యతా || 69 కుమారా! పూర్వము నేను, నీవు, మన్మథుడు, మరియు మరీచి మొదలగు మహర్షులు దేనిని కోరిరో, అది ఇప్పుడు సిద్ధించినది (66). నీ కుమార్తె శంభుని ఆరాధించినది. ఆయన ఆమెను ధ్యానించుచూ ఆమెను పొందగోరి ఆమెకు అనుకూలుడై హిమవత్పర్వతమునందున్నాడు (67). ఆమె నానా విధ భావములతో, సత్త్వగుణశీలియై దృఢవ్రతముతో శంభుని ఏ తీరున ఆరాధించినదో,ఆయన ఆ సతిని అటులనే ఆరాధించుచున్నాడు (68). కావున, శంభుని కొరకు తనువును దాల్చిన దాక్షాయణిని ఆయనకు సమర్పించుము. విలంబమును చేయకుము. అట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (69). అహం తమానయిష్యామి నారదేన త్వదాలయమ్ | తసై#్మ త్వమేనాం సంయచ్ఛ తదర్థే పరికల్పితామ్ || 70 శ్రుత్వా మమ వచశ్చేతి స మే పుత్రోsతిహర్షితః | ఏవ మేవేతి మాం దక్ష ఉవాచ పరిహర్షితః || 71 తతస్సోsహం మునే తత్రా గమమత్యంతహర్షితః | ఉత్సుకో లోకనిరతో గిరిశో యత్ర సంస్థితః || 72 గతే నారద దక్షోsపి సదారతనయో హ్యపి |అభవత్పూర్ణ కామస్సుత పీయూషైరివ పూరితః || 73 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే సతీవరలాభఃనామ సప్తదశోsధ్యాయః (17). నేను నారదుని ద్వారా ఆయనను నీ ఇంటికి రప్పించెదను. నీవు ఆయన కొరకు తనువును దాల్చిన ఈమెను ఆయనకు సమర్పించుము (70). నా కుమారుడగు దక్షుడు నా ఈ మాటను విని, మిక్కిలి సంతసిల్లి, 'అటులనే అగుగాక!'అని నాతో పలికెను (71). ఓ మహర్షీ! అపుడు లోకకార్యము నందు నిమగ్నుడనైన నేను ఉత్సాహముతో మిక్కిలి ఆనందముతో శివుడు ఉన్న స్థానమునకు వచ్చితిని (72).ఓ నారదా! నేను వెళ్లగానే దక్షుడు భార్యతో , కుమార్తెతో గూడి అమృత పానమును తృప్తిగా చేసిన వాడు వలె పూర్ణమనోరథుడాయెను (73). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీవరప్రాప్తి అనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).