Sri Sivamahapuranamu-I
Chapters
అథ ఏకవింశోऽధ్యాయః సతీ శివుల విహారము నారద ఉవాచ | సమీచీనం వచస్తాత సర్వజ్ఞస్య తవానఘ | మహాద్భుతం శ్రుతం నో వై చరితం శివయోశ్శుభమ్ ||
1 వివాహశ్చ శ్రుతస్సమ్యక్ సర్వ మోహాపకారకః | పరమజ్ఞానసంపన్నో మంగలాలయ ఉత్తమః ||
2 భూయ ఏవ వివిత్సా మే చరితం శివయోశ్శుభమ్ | తద్వర్ణయ మహాప్రాజ్ఞ కృపాం కృత్వాऽతులా మరమ్ || 3 నారదుడిట్లు పలికెను - తండ్రీ! సర్వజ్ఞుడవు, పుణ్యాత్ముడవు అగు నీ వాక్కు పవిత్రమైనది. మేము మహాద్భుతము, శుభకరమునగు ఉమాపరమేశ్వరుల చరితమును వింటిమి (1). మోహములనన్నింటినీ పోగొట్టునది, పరమ జ్ఞానముతో సంపన్నమైనది, మంగలములకు నిలయము, ఉత్తమమునగు వారి వివాహ వృత్తాంతమును చక్కగా వింటిమి (2). శివాశివుల శుభచరితమును ఇంకనూ తెలుసు కొనవలెనని నాకు కోరిక గలదు. ఓ మహాప్రాజ్ఞా! కావున, సాటిలేని దయను చూపి శీఘ్రమే ఆ చరితమును వర్ణించుము (3). బ్రహ్మోవాచ | సమ్యక్ కారుణికసై#్యవ మునే తే విచికిత్సతమ్ | యదహం నోదితస్సౌమ్య శివలీలాను వర్ణనే || 4 వివాహ్య దక్షజాం దేవీం సతీం త్రైలోక్యమాతరమ్ | గత్వా స్వధామ సుప్రీత్యా యదకార్షీన్ని భోద మే || 5 తతో హరస్స స్వగణ స్స్వస్థానం ప్రాప్య మోదనమ్ | దేవర్షే తత్ర వృషభాదవాతరదతి ప్రియత్ || 6 యథా యోగ్యం నిజస్థానం ప్రవిశ్య స సతీసఖః | ముముదేऽతీవ దేవర్షే భవాచారకరశ్శివః || 7 బ్రహ్మ ఇట్లనెను - ఓ మహర్షీ! హే సౌమ్యా!నీవు నన్ను శివలీలలను వర్ణించుమని ప్రేరేపించుచుంటివి. నీ ఈ సందేహము సహృదయమునకు కలిగే యోగ్యమైన సందేహమే (4). ముల్లోకములకు తల్లి, దక్షునకు కుమార్తె అగు సతీదేవిని వివాహ మాడి, శివుడు తన ధామమునకు ఆనందముగా చేరి ఏమి చేసెనోచెప్పెదను తెలుసుకొనుము (5). అపుడు శివుడు తన గణములతో గూడి ఆనందముతో తన ధామమును చేరెను. ఓ దేవర్షీ! ఆయన అచట తనకు మిక్కిలి ప్రియమగు వృషభమునుండి క్రిందకు దిగెను (6). ఓ దేవర్షీ! సతీదేవితో గూడి శివుడు లోకాచార ప్రవర్తకుడై తన స్థానమును యధావిధిగా ప్రవేశించి, మిక్కిలి ఆనందించెను (7). తతో విరూపాక్ష ఇమాం ప్రాప్య దాక్షాయణీం గణాన్ | స్వీయాన్నిర్యాపయామాస నంద్యాదీన్ గిరికందరాత్ || 8 ఉవాచ చైతాంస్తాన్ సర్వాన్నంద్యాదీనతి సూనృతమ్ | లౌకికీం రీతి మాశ్రిత్య కరుణా సాగరః ప్రభుః || 9 అపుడా ముక్కంటి దేముడు దాక్షాయణిని భార్యగా పొంది తన గణములను నంది మొదలగు వారిని తన పర్వత గుహనుండి బయటకు పంపెను (8). కరుణా సముద్రుడగు ఆ ప్రభువు నంది మొదలగు ఆ గణములతో లోకపు పోకడనను సరించి ఇట్లు పలికెను (9). మహేశ ఉవాచ | యదాహం చ స్మరామ్యత్ర స్మరణాదరమానసాః | సమాగమిష్యథ తదా మత్పార్శ్వం మే గణా ద్రుతమ్ || 10 ఇత్యుక్తే వామదేవేన నంద్యాద్యాస్స్వగణాశ్చ తే | మహావేగా మహావీరా నానాస్థానేషు సంయయుః || 11 ఈశ్వరోऽపి తయా సార్థం తేషు యాతేషు విభ్రమీ | దాక్షాయణ్య సమం రేమే రహస్యే ముదితో భృశమ్ || 12 కదాచిద్వన్య పుష్పాణి సమాహృత్య మనోహరామ్ | మాలాం విధాయ సత్యాస్తు హారస్థానే స యోజయత్ || 13 మహేశ్వరుడిట్లు పలికెను - ఓ గణములారా! నేను మిమ్ములను ఏ కాలములో స్మరించెదనో, అపుడు నా స్మరణయందు ఆదరము గల మనస్సు గలవారై వెంటనే నా సమీపమునకు రండు (10). వామదేవుడు ఇట్లు పలుకగా, నంది మొదలగు మహావీరులైన ఆ గణములు మహావేగముతో వివిధ స్థానములకు వెళ్లిరి (11). వారు వెళ్లగానే ఈశ్వరుడు తొందరపాటు గలవాడై ఆ రహస్యస్థానమునందు ఆ దాక్షాయణితో గూడి ఆనందముతో మిక్కిలి రమించెను (12). ఆయన ఒకనాడు వనమునందలి పుష్పములను దెచ్చి, అందమగు మాలను చేసి ఆమెకు హారముగా వేసెను (13). కదాచిద్దర్పణ చైవ వీక్షంతీ మాత్మనస్సతీమ్ | అనుగమ్య హరో వక్త్రం స్వీయమప్యవలోకయత్ || 14 కదాచిత్కుండలం తస్యా ఉల్లాస్యోల్లాస్య సంగతః | బధ్నాతి మోచయత్యేవ సా స్యయం మార్జయత్యపి || 15 సరాగౌ చరణావస్యాః పావకేనోజ్వలేన చ | నిసర్గ రక్తౌ కురుతే పూర్ణ రాగౌ వృషధ్వజః || 16 ఉచ్చైరపి యదాఖ్యేయమన్యేషాం పురతో బహు | తత్కర్ణే కథయత్యస్యా హరో ద్రష్టుం తదాననమ్ || 17 ఒకప్పుడు తన ముఖమును సతి అద్దములో చూచు కొనుచండగా, శివుడు వెనుకగా వెళ్లి తన ముఖమును కూడ చూచుకొనెను (14). ఒకప్పుడు శివుడు ఆమె యొక్క కుండలములను మెరియునట్లు చేసి చేసి, దగ్గరా కూర్చుండి విడదీసి ఈయగా, ఆమె వాటిని వస్త్రముతో శుభ్రముగా చేసెడిది. అపుడాయన మరల వాటిని కూర్చెడివాడు (15). ఆమె పాదములు సహజముగా ఎర్రనివి. వాటిపై ఎర్రని లాక్షారసము అలంకరింపబడెను. ఆపై వృషభధ్వజుడు తన మూడవ కంటిలోని అగ్నియొక్క ప్రకాశము వాటిపై పడునట్లు చేసి, వాటి రక్తమను పూర్ణముగా ఇనుమడింప జేసెను (16). శివుడు ఆమె ముఖమును చూచుటకై ఇతరుల యెదుట బిగ్గరగా చెప్పదగిన మాటను కూడా ఆమె చెవిలో చెప్పెడి వాడు (17). న దూరమపి సంతాసౌ సమాగత్య ప్రయత్నతః | అను బధ్నాతి నామాక్షీ పృష్ఠదేశేऽన్యమానసామ్ || 18 అంతర్షితస్తు తత్రైవ మాయయా వృషభధ్వజః | తామాలిలింగ భీత్యా స్వం చకితా వ్యాకులాsభవత్ || 19 సౌవర్ణ పద్మ కలికాతుల్యే తస్యాః కుచుద్వయే | చకార భ్రమరాకారం మృగనాభి విశేషకమ్ || 20 హారమస్యాః కు చయుగాద్వి యోజ్య సహసా హరః | న్యయోజయచ్చ తత్రైవ స్వకరస్పర్శనం ముహుః || 21 ఆయన కొద్ది దూరము మాత్రమే వెళ్లి జాగ్రత్తగా వెనుకకు మరలివచ్చి, అన్యమనస్కురాలై కూర్చుండి యున్న ఆమె వెనుకకు వచ్చి కనులను మూసెడివాడు (18). వృషభధ్వజుడగు శివుడు తన మాయచే హఠాత్తుగా అదృశ్యుడై ఆమెను కౌగిలించుకొనగా, ఆమె మిక్కిలి భయమును, విస్మయమును పొంది కంగారు పడెను (19). బంగరు పద్మములను బోలిన ఆమె స్తనద్వయము నందు ఆయన కస్తూరి బొట్టుతో తుమ్మెద ఆకారమును చిత్రించెను (20). శివుడు హఠాత్తుగా ఆమె స్తనయుగము నుండి హారమును తీయుట, మరల హారమును వేయుట అను పనులను చేసి చేతితో ఆమెను పునః పునః స్పృశించెను (21). అంగదాన్వలయానూర్మీన్ విశ్లేష్య చ పునః పునః | తత్ స్థానాత్పురేవాసౌ తత్ స్థానే ప్రత్యయోజయత్ || 22 కాలికేతి సమాయాతి సవర్ణా తే సఖీ త్వియమ్ | యాస్య త్వస్యాస్తథేక్షంత్యాః ప్రోత్తుంగౌ సహసా కుచౌ || 23 కదాచిన్మదనోన్మాద చేతనః ప్రమథాధిపః | చకార నర్మశర్మాణి తథాకృత్ర్పియయా ముదా || 24 ఆహృత్య పద్మ పుష్పాణి రమ్యపుష్పాణి శంకరః | సర్వాంగేషు కరోతి స్మ పుష్పాభరణమాదరాత్ || 25 అంగదములను, కంకణములను, ఉంగరములను మరల మరల వాటి స్థానములనుండి విడదీసి, శివుడు వాటిని మరల అదే స్థానములో అమర్చెడి వాడు (22). కాలికా! నీతో సమానమైన వర్ణము గల ఈ నీ చెలికత్తె వచ్చు చున్నది అని శివుడు పిలిచెడి వాడు. ఆమె ఆ దిశలో చూచుచుండగా, ఆమె ఉన్నతమగు స్తనములను దర్శించుట కొరకై అట్లు పిలిచెడివాడు (23). ఒకప్పుడు మన్మథవికారముచే ఉన్మత్తమైన మానసము గల ఆ ప్రమధగణాధిపతి నర్మకేళి యందు ప్రీతిగల ఆమెతో గూడి ఆనందముతో నర్మకేళి యందు లగ్న మయ్యెడి వాడు (24). శంకరుడు పద్మములను, సుందరమగు పుష్పములను తెచ్చి సర్వావయవముల యందు ఆదరముతో పుష్పాభరణములను సమకూర్చెడివాడు (25). గిరికుంజేషు రమ్యేషు సత్యా సహ మహేశ్వరః | విజహార సమస్తేషు ప్రియయా భక్తవత్సలః || 26 తయా వినా స్మ నో యాతి నాస్థితో న స్మచేష్టతే | తయా వినా క్షణమపి శర్మ లేభేన శంకరః || 27 విహృత్య సుచిరం కాలం కైలాసగిరికుంజకే | అగమద్ధిమవత్ర్పస్థం సస్మార స్వేచ్ఛయా స్మరన్ || 28 తస్మిన్ ప్రవిష్టే కామే తు వసంతశ్శంకరాంతికే | వితస్తార నిజం భావం హార్దం విజ్ఞాయ యత్ర్పభోః || 29 భక్తవత్సలుడగు మహేశ్వరుడు కైలాసమునందు రమ్యములైన లతా గృహములన్నింటి యందు ప్రియురాలగు సతీదేవితో గూడి విహరించెను (26). ఆయన ఆమె లేనిదే ఎచటికైననూ వెళ్లడు; ఒంటరిగా ఉండడు; ఏ పనినీ చేయడు. శంకరుడు ఆమె లేనిదే క్షణమైననూ సుఖముగా నుండలేకపోయెను (27). కైలాస పర్వత లతా గృహము లందు చిరకాలము విహరించి, శివుడు తన ఇచ్ఛచే హిమవత్పర్వతమును స్మరించి అచటకు వెళ్ళెను (28). మన్మథుడు శంకరుని సమీపమునందు ప్రవవేశించగానే, వసంతుడు కూడ ఆ ప్రభువు యొక్క హృదయములోని భావమును గ్రహించి తన ప్రభావమును విస్తరించెను (29). సర్వేచ పుష్పితా వృక్షా లతాశ్చాన్యశ్చ పుష్పితాః | అంభాంసి పుల్ల పద్మాని సపద్మ భ్రమరాస్త థా || 30 ప్రవిష్టే తత్ర సదృతౌ వవౌ స మలయో మరుత్ | సుగంధి గంధ పుష్పేణ మోదకశ్చ సుగంధియుక్ || 31 సంధ్యార్ద్ర చంద్ర సంకాశాః పలాశాశ్చ విరేజిరే | కామాస్త్ర వత్సుమనసః ప్రమోదాత్పాదపాధరే || 32 బభుః పంకజ పుష్పాణి సరస్సు సకలాన్ జనాన్ | సమ్మోహయితు ముద్యుక్తా సుముఖీ వాయుదేవతా || 33 వృక్షములన్నియు పుష్పించినవి. లతాదులు పుష్పించినవి. సరస్సులు వికసించిన పద్మములతో నిండినవి. పద్మములు తుమ్మెదలతో శోభిల్లినవి (30). అచట వసంతర్తువు ప్రవేశించ గానే, మలయమారుతము వీచెను. మంచి సువాసన గల పుష్పములు పడుటచే జలములు పరిమళ భరితములాయెను (31). సంధ్యా కాలము నందలి చంద్రుని వలె ప్రకాశించే మోదుగు పుష్పములు ఆ వృక్షములు అనే యువతుల అధరములపై వసంతుని చిహ్నములు వలె, మన్మథుని అస్త్రము వలె రాజిల్లెను (32). సరస్సులయందు పద్మములు ప్రకాశించినవి. మెల్లగా వీచే వాయుదేవత సర్వమానవులను మోహింపజేయుటకు సంసిద్ధమగు చుండెను (33). నాగకేశరవృక్షాశ్చ స్వర్ణవర్ణైః ప్రసూనకైః బభుర్మదనకేత్వాభా మనోజ్ఞాశ్శంకరాంతికే || 34 లవంగవల్లీ సురభి గంధేనోద్వాస్య మారుతమ్ | మోహయామాస చేతాంసి భృశం కామిజనే పురా || 35 చారు పావక చర్చిత్సు (?) సుస్వరాశ్చూతశాలినః | బభుర్మదన బాణౌఘ పర్యంక మదనా వృతాః || 36 అంభాంసి మలహీనాని రేజుః పుల్లకుశాశయాః | మునీనామివ చేతాంసి ప్రవ్యక్త జ్యోతిరుద్గమమ్ || 37 శంకరుని సన్నిధిలో నాగకేశర వృక్షములు బంగరువన్నె గల పుష్పములతో మన్మథిని జెండాల వలె మనోహరముగా ప్రకాశించినవి (34). లవంగముల తీగ పరిమళ గంధముచే వాయువును సువాసితము చేసి కామి జనుల మనస్సులను మిక్కిలి మోహింపజేసెను (35). మామిడి చిగుళ్లను భక్షించి మధురముగా కూయు కోయిలలు మన్మథ బాణముల సముదాయమువలె నున్న మామిడి చిగుళ్లు అనే పర్యంకములపై మన్మథపీడితములై భాసిల్లెను (36). నిర్మలములగు సరస్సులు వికసించిన పద్మములతో కూడి, ఆత్మ జ్యోతి యొక్క ప్రకాశముతో నిండియున్న మహర్షుల హృదయముల వలె ప్రకాశించెను (37). తుషారాస్సూర్య రశ్మీనాం సంగమాదగమన్ బహిః | ప్రమత్వానీక్ష్యతేక్షాశ్చ (?) సలిలీహృదయాస్తదా || 38 ప్రసన్నాస్సహ చంద్రేణ సతుషారాస్తదాऽభవన్ | విభావర్యః ప్రియేణౖవం కామిన్య స్సుమనోహరాః || 39 తస్మిన్ కాలే మహాదేవస్సహ పత్యా ధరోత్తమే | రేమే ససుచిరం ఛందం నికుంజేషు నదీషు చ || 40 తథా తేన సమం రేజే తదా దాక్షాయణీ మునే | యథా హరః క్షణమపి శాంతిం నాప తయా వినా || 41 మంచు తునకలు సూర్యరశ్ముల సంగమముచే నీరుగారిని హృదయము గలవై అంతరిక్షములోనికి ఆవిరి రూపములో ఎగసినవి (38). అపుడు రాత్రులు చంద్రునితో, మంచుతో కూడియున్నవై ప్రియునితో కూడిన అందమైన యువతులవలె నిర్మలముగా ప్రకాశించుచున్నవి (39). ఆ సమయములో మహాదేవుడు భార్యతో గూడి ఆ గొప్ప పర్వతమునందు లతా గృహములలో, మరియు నదులలో యథేచ్ఛగా చిరకాలము రమించెను (40). ఓ మహర్షీ! శివుడు ఆమె లేనిదే క్షణమైననూ శాంతముగా నుండలేక పోయెను. అదే తీరున, ఆ దాక్షాయణి కూడా ఆయనతో సమానముగా విహరించుచూ ప్రకాశించెను (41). సంభోగవిషయే దేవీ సతీ తస్య మనః ప్రియా | విశతీవ హరస్యాంగే పాయయన్నివ తద్రసమ్ || 42 తస్యాః కుసుమ మాలాభిర్భుషయన్స కలాం తనుమ్ | స్వహస్తరచితాభిస్తు నవశర్మాకరోచ్చ సః || 43 ఆలాపై ర్విక్షితై ర్హాస్యెస్తథా సంభాషణౖర్హరః | తామా దిదేశ గిరిజాం స పదీవాత్మ సంవిదమ్ || 44 తద్వక్త్ర చంద్ర పీయూష పానస్థిరతనుర్హరః | నానావైశేషికీం తన్వీమవస్థాం స కదాచన || 45 సంభోగ విషయములో సతీదేవి ఆయన మనస్సునకు ప్రీతిని కలిగించెను. ఆమె శివుని దేహములో ప్రవేశించు చున్నదా యన్నట్లు , ఆయన శక్తిని ఆ స్వాదించు చున్నదా యన్నట్లు ఉండెను (42). శివుడు ఆమె దేహమునంతనూ తాను స్వయముగా రచించిన పుష్పమాలలతో నూతన గృహమా యన్నట్లు అలంకరించెను (43). శివుడు సల్లాపములతో, చూపులతో, హాస్యములతో, మరియు ప్రసంగములతో ఆ సతీదేవికి ఆ క్షణమునందే ఆత్మ జ్ఞానమును బోధించినాడా యన్నట్లుండెను (44). ఆమె ముఖార వింద సౌందర్యమును పానము చేసి హరుడు ఆనందముగా నుండెను. ఆయన ఆ సుందరితో అనేక విశేషములతో గూడిన గార్హస్థ్యములో ప్రేమావస్థను బడసెను (45). తద్వక్త్రాంబుజ వాసేన తత్సౌందర్యైశ్చ నర్మభిః | గుణౖరివ మహాదంతీ బద్ధోనాన్య విచేష్టితః || 46 ఇతి హిమగిరి కుంజ ప్రస్థభాగే దరీషు ప్రతి దినమభిరేమే దక్షపుత్ర్యా మహేశః | క్రతుభుజపరిమాణౖః క్రీడతస్తస్య జాతా దశ దశ చ సురర్షే వత్సరాః పంచ చాన్యే || 47 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీ శివక్రీడా వర్ణనం నామ ఏక వింశోsధ్యాయః (21). ఆమె ముఖ పద్మము యొక్క సుగంధము చేత, ఆమె సౌందర్యములచేత, నర్మకేళుడు చేత బంధింపబడిన శివునకు, త్రాళ్లచే బంధిపబడిన మహాగజమునకు వలె, ఇతర చేష్టలు లేకుండెను (46). మహేశ్వరుడు దక్షపుత్రితో గూడి ఈ తీరున హిమ వత్పర్వతమునందలి లతాగృహములలో, గుహలలో ప్రతిదినము రమించెను. ఓ దేవర్షీ! ఆయన ఇట్లు క్రీడించుచుండగా దివ్యమానముచే ఇరవై అయిదు సంవత్సరములు గడచినవి (47). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో సతీశివక్రీడా వర్ణనమనే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).