Sri Sivamahapuranamu-I
Chapters
అథ అష్టవింశోsధ్యాయః సతీ యాత్ర బ్రహ్మోవాచ | యదా యయుర్దక్షమఖముత్సవేన సురర్షయః | తస్మిన్నే వాంతరే దేవీ పర్వతే గంధమాదనే ||
1 ధారాగృహే వితానేన సఖీభిః పరివారితా | దాక్షాయణీ మహాక్రీడాశ్చ కార వివిధాస్సతీ ||
2 క్రీడాసక్తా తదా దేవీ దదర్శాథ ముదా సతీ | దక్షయజ్ఞే ప్రయాంతం చ రోహిణ్యా పృఛ్ఛ్య సత్వరమ్ ||
3 దృష్ట్వా సీమంతయా భూతాం విజయాం ప్రాహ సా సతీ | స్వసఖీం ప్రవరాం ప్రాణిప్రియాం సా హి హితావహామ్ ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను- దక్షుని యజ్ఞమునకు దేవతలు, ఋషులు వెళ్లుచున్న సమయములోనే సతీదేవి గంధమాదన పర్వతమునందుండెను (1). దక్షపుత్రియగు సతి ఎత్తైన అరుగులతో కూడిన ఈత కొలను యందు సఖురాండ్రతో గూడి చిరకాలము క్రీడించెను (2). దక్షుని పుత్రియగు సతి ఆనందముతో క్రీడించుచూ, రోహిణీతో కలిసి దక్ష యజ్ఞమునకు వెళ్లుచున్న చంద్రుని చూచెను. ఆమె వెంటనే క్రీడలనుండి సెలవు తీసుకొని (3), తనకు ప్రాణ ప్రియురాలు, తనక్షేమమును చేయునది, విజయ అను పేరు గలది అగు తన సఖి కేశాలంకారమును చేసుకొనుచుండగా చూచెను. ఆ సతీదేవి ఆమెతో నిట్లనెను (4). సత్యువాచ | హే సఖీ ప్రవరే ప్రాణప్రియా త్వం విజయే మమ | క్వ గమిష్యతి చంద్రోऽయం రోహిణ్యాపృచ్ఛ్య సత్వరమ్ ||
5 సతీదేవి ఇట్లు పలికెను - ఓ విజయా! నీవు నాకు ప్రాణసమమైన ప్రీతిగల, సఖురాండ్రలో కెల్ల శ్రేష్ఠమైన సఖివి. ఈ చంద్రుడు రోహిణితో గూడి ఎచటకు వెళ్లుచున్నాడు? వెంటనే తెలుసుకొని రమ్ము (5). బ్రహ్మోవాచ | తథోక్తా విజయా సత్యా గత్వా తత్సన్నిధౌ ద్రుతమ్ | క్వ గచ్ఛ సీతి పప్రచ్ఛ శశినం తం యథోచితమ్ || 6 విజయోక్త మథాకర్ణ్య స్వయాత్రాం పూర్వమాదరాత్ | కథితం తేన తత్సర్వం దక్షయజ్ఞోత్సవాదికమ్ || 7 తచ్ఛ్రుత్వా విజయా దేవీం త్వరితా జాతసంభ్రమా | కథయామాస తత్సర్వం యదుక్తం శశినా సతీమ్ || 8 తచ్ఛ్రుత్వా కాలికా దేవీ విస్మితా భూత్సతీ తదా | విమృశ్య కారణం తత్రాజ్ఞాత్వా చేతస్య చింతయత్ || 9 బ్రహ్మ ఇట్లు పలికెను - సతి అట్లు ఆజ్ఞాపించగా, విజయ వెంటనే చంద్రుని వద్దకు వెళ్లి ఎచటకు వెళ్లుచుంటివి? అని మర్యాదగా ప్రశ్నించెను (6). విజయ యొక్క ప్రశ్వను విని చంద్రుడు తాను దక్షుని యజ్ఞమనే ఉత్సవమునకు వెళ్లుచున్నానని చెప్పెను. మరియు ఆదరపూర్వకముగా వివరములనన్నిటినీ చెప్పెను (7). ఆ మాటలను విని ఆశ్చర్యమును పొందిన విజయ వేగముగా సతీదేవి వద్దకు వెళ్లి, చంద్రుడు చెప్పిన ఆ వృత్తాంతమునంతనూ చెప్పెను (8). ఆ మాటను విని నీలవర్ణముగల ఆ సతీదేవి చాల ఆశ్చర్యమును పొందెను. అట్లు జరుగుటకు గల కారణమును గూర్చి ఆలోచించిననూ, ఆమెకు తెలియలేదు. ఆమె తన మనస్సులో ఇట్లు తలపోసెను (9). దక్షః పితా మే మాతా చ వీరిణీ నౌ కుతుస్సతీ | ఆహ్వానం న కరోతి స్మ విస్మృతా మాం ప్రియాం సుతామ్ || 10 పృచ్ఛేయం శంకరం తత్ర కారణం సర్వ మాదరాత్ | చింతయిత్వేతి సాసీద్వై తత్ర గంతు సునిశ్చయా || 11 అథ దాక్షాయణీ దేవీ విజయాం ప్రవరాం సఖీమ్ | స్థాపయిత్వా ద్రుతం తత్ర సమగచ్ఛ చ్ఛివాంతికమ్ || 12 దదర్శ తం సభామధ్యే సంస్థితం బహుభిర్గణౖః | నంద్యాదిభిర్మహావీరైః ప్రవరైర్యూథయూథపైః || 13 నా తండ్రియగు దక్షుడు, తల్లియగు వీరిణి మమ్ములనిద్దరినీ ఏల ఆహ్వానించలేదో! ప్రియకుమార్తెనగు నన్ను మరచినా యేమి? (10). దీనికి గల కారణమును గూర్చి శంకరుని అడిగెదను. ఇట్లు తలపోసి ఆమె ఆ యజ్ఞమునకు వెళ్లుటకై నిశ్చయించుకొనెను (11). అపుడా దాక్షాయణీ దేవి తన ప్రియ సఖియగు విజయను అచటనే యుంచి వెంటనే శివుని వద్దకు వెళ్లెను (12). సభామద్యములో అనేక గణములతో, నంది మొదలగు మహా వీరులతో, శ్రేష్ఠులగు గణాధ్యక్షులతో చుట్టు వారబడియున్న ఆ శివుని చూచెను (13) దృష్ట్వా తం ప్రభుమీశాననం స్వపతిం సాథ దక్షజా | ప్రష్టుం తత్కారణం శీఘ్రం ప్రాప శంకరసన్నిధిమ్ || 14 శివేన స్థాపితా స్వాంకే ప్రీతియుక్తేన స్వప్రియా | ప్రమోదితా వచోభిస్సా బహుమాన పురస్సరమ్ || 15 అథ శంభుర్మహా లీల స్సర్వేశస్సుఖదస్సతామ్ | సతీమువాచ త్వరితం గణమధ్యస్థ ఆ దరాత్ || 16 ఆ దాక్షాయణి తన భర్తయగు ప్రభువును అచట చూచి, ఆహ్వానము రాకుండుటకు గల కారణమునడుగుటకై శంకరుని సన్నిధికి వెంటనే వెళ్లెను (14). శివుడు తన ప్రియురాలగు ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో, ఆదరముతో మాటలాడగా, ఆమె చాల సంతసించెను (15). అపుడు గొప్ప లీలలను ప్రకటించువాడు, సర్వేశ్వరుడు, సత్పురుషులకు సుఖములనిచ్చువాడునగు శంభుడు గణముల మధ్య విరాజిల్లువాడై ఆదరముతో వెంటనే సతీదేవితో నిట్లనెను (16). శంభురువాచ | కిమర్థమాగతాత్ర త్వం సభామధ్యే సవిస్మయా |కారణం తస్య సుప్రీత్యా శీఘ్రం వద సుమధ్యమే || 17 శంభుడిట్లు పలికెను - ఓ సుందరీ! ఈ సభా మధ్యములోనికి విస్మయముతో గూడిన దానవై నీవు వచ్చుటకు గల కారణమును ప్రీతితో నాకు వెంటనే చెప్పుము (17). బ్రహ్మోవాచ | ఏవముక్తా తదా తేన మహేశేన మునీశ్వర | సాంజలిస్సుప్రణమ్యాశు సత్యువాచ ప్రభుం శివా || 18 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! ఆ మహేశ్వరుడు అపుడిట్లు పలుకగా, శివపత్నియగు సతి చేతులు జోడించి నమస్కరించి వెంటనే ఇట్లు పలికెను (18). సత్యువాచ | పితుర్మమ మహాన్ యజ్ఞో భవతీతి మయా శ్రుతమ్ | తత్రోత్సవో మహానస్తి సమవేతాస్సురర్షయః || 19 పితుర్మమ మహాయజ్ఞే కస్మాత్తవ న రోచతే | గమనం దేవదేవేశ తత్సర్వం కథయ ప్రభో || 20 సుహృదామేష వై ధర్మస్సుహద్భిస్సహ సంగతిః | కుర్వంతి యన్మహాదేవ సుహృదః ప్రీతివర్ధినీమ్ || 21 తస్మాత్సర్వప్రయత్నేన మయా గచ్ఛ సహ ప్రభో | యజ్ఞవాటం పితుర్మేऽద్య స్వామిన్ ప్రార్ధనయా మమ || 22 సతీదేవి ఇట్లనెను - నా తండ్రి గొప్ప యజ్ఞమును చేయుచున్నాడని నేను వింటిని. అచట గొప్ప ఉత్సవము జరుగుచున్నది. దేవతలు, ఋషులు వచ్చియున్నారు (19). ఓ దేవదేవేశ! ప్రభూ! నా తండ్రిచేయు మహాయజ్ఞమునకు వెళ్లుట నీకు అభీష్టము ఏల కాలేదు? ఆ విషయమునంతనూ చెప్పుము (20). మహాదేవా! మంచి హృదయముగల వారితో కలిసిమెలిసి ఉండి వారికి ప్రీతిని వర్థిల్లజేయుట మంచి హృదయము గల వారి ధర్మము గదా! (21). ఓ ప్రభూ! స్వామీ! కావున నీవు అన్ని ఏర్పాట్లను చేసి, నా ప్రార్ధనను మన్నించి, నాతో గూడి నా తండ్రి యొక్క యజ్ఞశాలకు ప్రయాణమును ఈనాడే ఆరంభించుము (22). బ్రహ్మోవాచ | తస్యాస్తద్వచనం శ్రుత్వా సత్యా దేవో మహేశ్వరః | దక్ష వాగిషుహృద్విద్ధో బభాషే సూనృతం వచః || 23 బ్రహ్మ ఇట్లు పలికెను - మహేశ్వర దేవుడు ఆ సతీదేవి యొక్క ఆ మాటలను విని, దక్షుని వాక్కులనే బాణములచే కొట్టబడిన హృదయము గలవాడై, ఈ యథార్థవచనములను పలికెను (23). మహేశ్వర ఉవాచ | దక్షస్తవ పితా దేవి మమ ద్రోహి విశేషతః | యస్య యే మానినస్సర్వే ససురర్షిముఖాః పరే || 24 తే మూఢా యజనం ప్రాప్తాః పితుస్తే జ్ఞానవర్జితాః | అనాహూతాశ్చ యే దేవి గచ్ఛంతి పరమందిరమ్ || 25 అవమానం ప్రాప్నువంతి మరణాదధికం తథా | పరాలయం గతోऽపీంద్రో లఘుర్భవతి తద్విధః || 26 కా కథా చ పరేషాం వై రీఢా యాత్రా హి తద్విధా | తస్మాత్త్వయా మయా చాపి దక్షస్య యజనం ప్రతి || 27 న గంతవ్యం విశేషేణ సత్యముక్తం మయా ప్రియే | మహేశ్వరుడిట్లు పలికెను - ఓ దేవీ! నీ తండ్రియగు దక్షుడు నాకు విశేషించి ద్రోహమును చేసినాడు. గర్విష్ఠులు, జ్ఞాన విహీనులు అగు దేవతలు, ఇతరులు అందురు (24) ఆ నీ తండ్రి యొక్క యజ్ఞమునకు వెళ్లినారు. వారు మూర్ఖులు. ఓ దేవీ! ఎవరైతే ఆహ్వానము లేకుండగా ఇతరుల గృహమునకు వెళ్లెదరో (25), వారు మరణము కంటె అధికమగు దుఃఖమునిచ్చే అవమానమును పొందెదరు. ఆ విధముగా ఆహ్వానము లేనిదే ఇతరుల గృహమునకు వెళ్లువాడు ఇంద్రుడైననూ తేలికయగు (26). ఇతరుల మాట చెప్పునదేమున్నది? ఆ విధముగా వెళ్లువారికి అవమానము లభించును. కావున నీవు గాని, నేను గాని విశేషించి దక్షుని యజ్ఞమునకు (27) వెళ్లరాదు. ఓ ప్రియురాలా! నేను యథార్థమును చెప్పితిని . తథారిభిర్న వ్యథతే హ్యర్దితోऽపి శ##రైర్జనః || 28 స్వానాం దురుక్తి భిర్మర్మతాడితస్స యథా మతః | విద్యాదిభిర్గుణౖష్షడ్భి రసదన్యైస్సతాం స్మృతౌ || 29 హతాయాం భూయసాం ధామ న పశ్యంతి ఖలాః ప్రియే | 30 తనకు కావలసిన వారి నిందావచనములచే హృదయమునందు వేధింపబడినవాడు పొందే దుఃఖమును, శత్రువులైననూ బాణములతో కొట్టి కలిగించలేరు. ఓ ప్రియురాలా! సత్పురుషుల యందు ఉండే విద్య మొదలగు ఆరు సద్గుణములు ఎవరి బుద్ధియందు లేకుండా నశించినవో, అట్టి దుష్టులు మహాత్ముల దివ్యశక్తిని గనలేరు (28,29,30). బ్రహ్మోవాచ | ఏవముక్తా సతీ తేన మహేశేన మహాత్మనా || 31 ఉవాచ రోషసంయుక్తా శివం వాక్య విదాం వరమ్ | బ్రహ్మ ఇట్లు పలికెను - మహాత్ముడగు మహేశ్వరుడిట్లు పలుకగా, సతీదేవి రోషముతో కూడినదై, వాక్యవేత్తలలో శ్రేష్ఠడగు శివునితో నిట్లనెను (31). సత్యువాచ | యజ్ఞ స్స్యాత్సఫలో యేన స త్వం శంభోఖిలేశ్వర || 32 అనాహూతోऽసి తేనాద్య పిత్రా మే దుష్టకారిణా | తత్సర్వం జ్ఞాతుమిచ్ఛామి భవ భావం దురాత్మనః || 33 సురర్షీణాం చ సర్వేషామాగతానాం దురాత్మనామ్ | తస్మాచ్చాద్యైవ గచ్ఛామి స్వపితుర్య జనం ప్రభో || 34 అను జ్ఞాం దేహిమే నాథ తత్రగంతుం మహేశ్వర | సతీదేవి ఇట్లు పలికెను - ఓ శంభో!నీవుఅఖిలేశ్వరుడవు. నీ సన్నిధిచే యజ్ఞము సఫలమగును (32). కాని దుర్బుద్ధియగు నా తండ్రి ఈ నాడు నిన్ను ఆహ్వానించలేదు. ఓ భవా !ఆ దురాత్ముని మనోభావములనన్నిటినీ నేను తెలియగోరుచున్నాను (33). ఆ యజ్ఞమునకు విచ్చేసిన దుష్టులగు దేవతల, ఋషుల అభిప్రాయములను కూడ నేను తెలియగోరుచున్నాను. కావున, ఓ ప్రభూ !నేనీనాడే నా తండ్రి యజ్ఞమునకు వెళ్లెదను (34). నాథా! మహేశ్వరా! అచటికి వెళ్లుటకు నాకు అనుమతినిమ్ము. బ్రహ్మోవాచ | ఇత్యుక్తో భగవాన్ రుద్రస్తయాదేవ్యా శివస్స్వయమ్ || 35 విజ్ఞాతాఖిలదృక్ ద్రష్టా సతీం సూ తికరోऽబ్రవీత్ | బ్రహ్మ ఇట్లు పలికెను - ఆ దేవి రుద్ర భగవానునితో నిట్లు పలుకగా, స్వయముగా సర్వమును చూచే సాక్షిస్వరూపుడు (35), జగత్కారణుడు అగు శివుడు సతీదేవితో నిట్లనెను. శివ ఉవాచ | యద్యేవం తే రుచిర్దేవ తత్ర గంతు మవశ్యకమ్ || 36 సువ్రతే వచననాన్మేత్వం గచ్ఛ శీఘ్రం పితుర్మఖమ్ | ఏతం నందిన మారుహ్య వృషభం సజ్జమాదరాత్ || 37 మహారాజోపచారాణి కృత్వా బహుగుణాన్వితా | భూషితం వృషమారోహేత్యుక్తా రుద్రేణ సా సతీ || 38 సుభూషితా సతీ యుక్తా హ్యాగమత్పితృమందిరమ్ | మహారాజోపచారాణి దత్తాని పరమాత్మనా || 39 సుచ్ఛత్ర చామరాదీని సద్వస్త్రాభరణాని చ | శివుడిట్లు పలికెను - ఓదేవీ!గొప్పవ్రతము గలదానా!నీవు అచటకు తప్పక వెళ్లవలెనని కోరుచున్నట్లైతే, నేను అనుమతి నిచ్చుచున్నాడు. నీవు శీఘ్రమే నీ తండ్రి చేయు యజ్ఞమునకు వెళ్లుము. ఈ నందిని శ్రద్ధగా సజ్జితము చేసి, దానిని అధిష్ఠించి వెళ్లుము (36,37). సర్వ సద్గుణ సంపన్నవగు నీవు మహారాజోపచారములనన్నింటిని వెంటదీసుకుని, అలంకారముతో గూడిన వృషభమునధిష్ఠించుము. అని రుద్రుడు సతీదేవితో చెప్పెను (38). సతీదేవి చక్కగా అలంకరించుకొని పరివారముతో గూడి తండ్రి ఇంటికి వెళ్లెను. పరమాత్మ ఆమెకు గొప్ప ఛత్రము, చామరము, విలువైన వస్త్రములు, ఆభరణములు మొదలగు రాజోపచారములను ఏర్పాటు చేసెను (39). గణాష్షష్టి సహస్రాణి రౌద్రా జగ్ముశ్శివాజ్ఞయా || 40 కుతాహలయుతాః ప్రీతా మహోత్సవ సమన్వితాః | తదోత్సవో మహానాసీ ద్యజనే తత్ర సర్వతః || 41 సత్యాశ్శివ ప్రియాయాస్తు వామదేవగణౖః కృతాః | కుతూహలం గణాశ్చక్రు శ్శివయోర్యశ ఉజ్జగుః || 42 మార్గాంతే పుప్లువుః ప్రీత్యా మహావీరాశ్శివ ప్రియాః | సర్వథాసీన్మహోశోభా గమనే జగదంబికే || 43 సుఖారావస్సంబభూవ పూరితం భవనత్రయమ్ || 44 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీయాత్రావర్ణనం నామ అష్టావింశోऽ ధ్యాయః (28). కుతూహలములతో ప్రీతితో గూడిన అరువది వేల రుద్ర గణములు మహోత్సవ పూర్వకముగా శివుని ఆజ్ఞచే ఆమె వెంట వెళ్లిరి. అచట యజ్ఞమునందు సర్వత్రా గొప్ప ఉత్సవము జరుగుచుండెను (40,41). శివుని ప్రియురాలగు సతీదేవి యొక్క ప్రయాణములో వామదేవుని గణములు ఉమాశంకరుల కీర్తిని కుతూహలముతో, ఉత్సాహముతో గానము చేసిరి (42). శివునకు ప్రియులు, మహావీరులునగు ఆ గణములు మార్గ మధ్యములో ఆనందముతో గెంతుచుండిరి. జగన్మాత యొక్క ఆ ప్రయాణములో అన్ని విధములుగా గొప్ప శోభ కలిగెను (43). ఆ సుఖకరమగు ధ్వనిచే ముల్లోకములు నిండెను (44). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీఖండములో సతీయాత్రా వర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).