Sri Sivamahapuranamu-I    Chapters   

అథ త్రింశోధ్యాయః

సతీదేహత్యాగము

నారద ఉవాచ |

మౌనీ భూతా యదా సాసీత్సతీ శంకరవల్లభా | చరిత్రం కిమ భూత్తత్ర విధే తద్వచ చాదరాత్‌ || 1

నారదుడిట్లు పలికెను -

శంకరుని పత్నియగు ఆ సతి మౌనమును వహించిన పిదప, అచట జరిగిన వృత్తాంతమెయ్యది? బ్రహ్మా! దానిని ఆదరముతో చెప్పుము (1).

బ్రహ్మోవాచ |

మౌనీ భూతా సతీ దేవీ స్మృత్వా స్వపతి మాదరాత్‌ | క్షితావుదీచ్యాం సహసా నిషసాద ప్రశాంతధీః || 2

జలమాచ్యమ్య విధివత్‌ సంవృతా వాససా శుచిః | దఙ్‌ నిమీల్య పతిం స్మృత్వా యోగమార్గం సమావిశత్‌ || 3

కృత్వా సమానావనితే ప్రాణాపానౌ సితాననా | ఉత్థాప్యోదాన మథ చ యత్నా త్సా నాభి చక్రతః || 4

హృది స్ధాప్యోరసి ధియా స్థితం కంఠా ద్భ్రువోస్సతీ | అనిందితానయన్మధ్యం శంకర ప్రాణవల్లభా || 5

బ్రహ్మ ఇట్లు పలికెను -

సతీదేవి మౌనమును వహించి ప్రసన్నమగు మనస్సు గలదై తన భర్తను ఆదరముతో స్మరించి వెంటనే ఉత్తర దిక్కునందు నేలపై కూర్చుండెను(2). ఆమె యథావిధిగా జలముతో ఆచనమును చేసి, వస్త్రముతో కప్పుకొని, శుచియై కన్నులను మూసుకొని భర్తను స్మరించి యోగమార్గమును ప్రవేశించెను (3). స్వచ్ఛమగు ముఖము గల ఆ సతి ప్రాణాపానములను వాయువులను సమానములుగా చేసి, తరువాత ఉదానమును నాభి చక్రము నుండి ప్రయత్నపూర్వకముగా ఉత్థాపనము చేసెను (4). శంకరునకు ప్రాణములకంటె ప్రియురాలు, దోష విహీనయగు సతీదేవి ఉదానమును బుద్ధితో సహా హృదయమునందు వక్షస్థ్స లమను స్థానము నందుంచి, తరువాత కంఠ మార్గము గుండా కనుబొమల మధ్య లోనికి తీసుకొని వెళ్లెను (5).

ఏవం స్వదేహం సహసా దక్ష కోపాజ్జిహాసతీ | చక్రే గాత్రే వాయుశుచిర్థారణం యోగమార్గతః || 6

తతస్స్వ భర్తుశ్చరణం చింతయంతీ న చాపరమ్‌ | అపశ్యత్సా సతీ తత్ర యోగమార్గ నివిష్ట ధీః || 7

హత కల్మష తద్దేహః ప్రాపతచ్చ తదగ్నినా | భస్మసాద భవత్సద్యోమునిశ్రేష్ఠ తదిచ్ఛయా || 8

తత్పశ్య తాం చ ఖే భూమౌ వాద్యోభూత్సుమహాంస్తదా | హాహేతి సోద్భుతశ్చిత్ర స్సురాదీనాం భయావహః || 9

ఆమె ఈ తీరున దక్షునియందలి కోపము వలన తన దేహమును త్యజించ గోరినదై, వెంటనే యోగమార్గము ననుసరించి దేహమునందు వాయువును, అగ్నిని ధరించెను (6). అపుడు యోగమార్గమునందు లగ్నమైన మనస్సు గల ఆ సతి తన భర్తయొక్క పాదములను ధ్యానిస్తూ ఇతరమును దేనినీ చూడలేదు (7). ఓ మహర్షీ !వెంటనే కల్మషములు తొలగిపోయి ఆమె దేహము ఆమె కోర్కెకు అనుగుణముగా ఆ అగ్ని చే భస్మము చేయబడి క్రిందబడెను (8). భూమియందు, ఆకాశమునందు గల దేవతలు మొదలగు వారు ఆ దృశ్యమును చూచి భయమును కలగించె, మిక్కిలి పెద్ద హాహాకారమును చేసిరి. ఆ దృశ్యము అద్భుతముగను, చిత్రముగను ఉండెను (9).

హం ప్రియా పరా శంభోర్దేవీ దైవతమస్య హి | అహాదసూన్‌ సతీ తేన సుదుష్టేన ప్రకోపితా || 10

అహో త్వనాత్మ్యం సుమహదస్య దక్షస్య పశ్యత | చరాచరం ప్రజా యస్య యత్పుత్రస్య ప్రజాపతేః || 11

అహోద్య విమనా భూత్సా సతీదేవీ మనస్వినీ | వృషధ్వజప్రియాభీక్ణం మానయోగ్యా సతాం సదా || 12

సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మధృక్‌ స ప్రజాపతిః | మహతీమపకీర్తిం హి ప్రాప్స్యతి త్వఖిలే భ##వే || 13

అయ్యో !శంభునకు సతీదేవి మిక్కిలి ప్రియురాలు. ఆయన ఆమెను దైవమును వలె ప్రేమించెను. ఆమె మిక్కిలి దుష్టుడగు ఆ దక్షునిచే అవమానింపబడి ఆ కోపముతో ప్రాణములను వీడెను (10). ఆశ్చర్యము !చరాచర ప్రపంచము సంతానముగా గలవాడు, బ్రహ్మగారి కుమారుడు అగు ఈ దక్షుని అతిశయించిన దుష్టత్వమును పరికించును (11). అయ్యో! మానవతి, వృషధ్వజునకు ప్రియురాలు, సత్పురుషులచే సర్వదా సన్మానమునకు అర్హురాలు అగు ఆ సతీదేవి ఈనాడు మిక్కిలి మానసిక దుఃఖమునకు గురి అయెను (12). దుష్ట హృదయుడు, పరబ్రహ్మయగు శివుని ద్వేషించువాడు అగు ఆ దక్ష ప్రజాపతి సమస్త లోకములలో పెద్ద అపకీర్తిని పొందగలడు (13).

యత్స్వాం గజాం సుతాం శంభుద్విట్‌ న్యషేధత్స ముద్యతామ్‌ | మహానరక భోగీ స మృతయే నోపరాధతః || 14

వదత్యేవం జనే సత్యా దృష్ట్వాసుత్యాగ మద్భుతమ్‌ | ద్రుతం తత్పార్షదాః క్రోధాదుద తిష్ఠన్నుదా యుధాః || 15

ద్వారి స్థితా గణాస్సర్వే రసాయుతమితా రుషా | శంకరస్య ప్రభోస్తే వాక్రు ధ్యన్నతి మహాబలాః || 16

హాహాకార మకుర్వంస్తే ధిక్‌ ధిక్‌ న ఇతి వాదినః | ఉచ్చైస్సర్వేసకృద్వీరాశ్శం కరస్య గణాధిపాః || 17

ఏలయనగా,శంభుని ద్వేషించు ఆ దక్షుడు తన దేహమునుండి పుట్టిన కుమార్తె ప్రయాణమై రాగా అవమానించినాడు. ఆతడు మరణించిన మహానరకము ననుభవించగలడు. దీనిలో మన అపరాధము కూడా గలదు (14). సతీదేవి ప్రాణములను వీడుట అను అద్భుత దృశ్యమును గాంచిన జనులు ఇట్లు పలుకుచుండగా, వెనువెంటనే శివగణములు క్రోధముతో ఆయుధములను పైకి ఎత్తి లేచి నిలబడిరి (15). ద్వారమునందు అరవై వేల గణములు నిలబడియుండిరి. శంకర ప్రభుని సేవకులగు వారు మహాబలశాలురు. వారు క్రోధముతో మండిపడిరి (16). 'మాకు నిందయగు గాక !అని' పలుకుచూ, వీరులగు శివగణ నాయకులందరు పెద్ద స్వరముతో అనేక పర్యాయములు హాహాకారములను చేసిరి (17).

హాహాకారేణ మహతా వ్యాప్తమాసీద్దిగంతరమ్‌ | సర్వే ప్రాపన్‌ భయం దేవా

మునయోన్యేపి తే స్థితాః || 18

గణాస్సం మంత్ర్య తేసర్వేభూవన్‌ క్రుద్ధా ఉదాయుధాః |

కుర్వంతః ప్రలయం వాద్య శ##సై#్ర ర్వ్యాప్తం దిగంతరమ్‌ || 19

శ##సై#్త్ర రఘ్ను న్నిజాంగాని కే చిత్తత్ర శుచాకులాః | శిరోముఖాని దేవర్షే సుతీక్ణైః ప్రాణనాశిభిః || 20

ఇత్థం తే విలయం ప్రాప్తా దాక్షాయణ్యా సమం తదా | గణాయుతే ద్వే చ తదా తదద్భుతమివాభవత్‌ || 21

ఆ పెద్ద హాహాకారముతో దిక్కులన్నియు పిక్కటిల్లెను. అచట నున్న దేవతలు, మునులు, ఇతరులు అందరు భయమును పొందిరి (18). ఆ గణములన్నియూ కోపించి, ఆయుధములను పైకెత్తి, పరస్పరము సంప్రదించుకొని, ప్రలయమును సృష్టించనారంభించిరి. వారు చేయు వాద్య ధ్వనులతోనే గాక, వారి శస్త్రములచే దిక్కులు నిండెను (19). ఓ దేవర్షీ !అచట కొందరు గణములు దుఃఖముచే వ్యాకులులై, ప్రాణములను తీసే మిక్కిలి పదునైన ఆయుధములతో తమ శిరస్సులను, ముఖములను, ఇతరు అవయవములను ఖండించు కొనిరి (20). ఈ విధముగా ఆ సమయమునందు ఇరువది వేల గణములు దక్షపుత్రితో బాటు ప్రాణములను వీడిరి. ఆ దృశ్యము అత్యాశ్చర్యమును కలిగించెను (21).

గణా నాశావశిష్టా యే శంకరస్య మహాత్మనః | దక్షం తం క్రోధితం హంతు ముదాతిష్ఠ న్నుదాయుధాః || 22

తేషా మాపతతాం వేగం నిశమ్య భగవాన్‌ భృగుః | యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌజుహోన్మునే || 23

హూయమానే చ భృగుణా సముత్పేతుర్మహాసురాః | ఋ భవో నామ ప్రబల వీరాస్తత్ర సహస్రశః || 24

తైరలాతాయుధై స్తత్ర ప్రమథానాం మునీశ్వర | అభూద్యుద్ధం సువికటం శృణ్వతాం రోమహర్షణమ్‌ || 25

ఋభుభిసై#్తర్మహావీరై ర్హన్యమానాస్సమంతతః | అయత్నయానాః ప్రమథా ఉశద్భి ర్బ్రహ్మతేజసా || 26

ఇట్లు నశించగా మిగిలిన, మహాత్ముడగు శంకరుని గణములు ఆయుధములను పైకెత్తి కోపించియున్న ఆ దక్షుని సంహరించుటకు ముందునకురికిరి (22). ఓ మహర్షీ !ఉరుకుచున్న వారి వేగమును విని భృగు మహర్షి యజ్ఞనాశకులగు రాక్షసులను సంహరించే యజుర్వేదమంత్రముతో దక్షిణాగ్ని యందు హోమమును చేసేను (23). భృగువు హోమమును చేసిన వెంటనే మహావీరులు, ఋభునామము గలవారు నగు గొప్ప దేవతలు ఆ అగ్ని నుండి పైకివేలాదిగా లేచిరి (24). ఓ మహర్షీ! ప్రమథగణములకు, కాగడాలను ఆయుధములుగా ధరించిన ఆ దేవతలకు అచట మిక్కిలి బీభత్సమును కలిగించునది, వినువారికి రోమహర్షణమును కలుగుజేయునది అగు యుద్ధము జరిగెను (25). బ్రహ్మతేజస్సుతో నిండియున్న మహావీరులగు ఆ బు భువులు అన్నివైపుల నుండి ప్రమథ గణములపై దాడి చేయగా, వారి తిరుగు ప్రయాణము వారి యత్నము లేకుండగానే సిద్ధించినది (26).

ఏవం శివగణాస్తే వై హతా విద్రావితా ద్రువతమ్‌ | శివేచ్ఛయా మహాశక్త్యా తదుద్భతమివా భవత్‌ || 27

తద్దృష్ట్వా ఋషయో దేవాశ్శక్రాద్యా స్సమరుద్గణాః | విశ్వేశ్వినౌ లోకపాలాస్తూష్ణీం భూతస్తదాభవన్‌ || 28

కేచి ద్విష్ణుం ప్రభుం తత్ర ప్రార్థయంతస్స మంతతః | ఉద్విగ్నం మంత్రయంతశ్చ విఘ్నా భావం ముహూర్ముహుః || 29

ఈ విధముగా శివుని మహాశక్తియుతమగు ఇచ్ఛచే ఆఋభువులు శివగణములను కొట్టి వేగముగా తరిమివేసిరి. ఆ దృశ్యము అద్భుతముగ నుండెను (27). అపుడా దృశ్యమును చూచి, ఋషులు, ఇంద్రుడు మొదలగు దోవతలు, మరుద్గణములు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, లోకపాలురు మిన్నకుండిరి (28). వారిలో కొందరు విష్ణుప్రభుని చుట్టూ చేరి ప్రార్థించుచుండిరి. మరికొందరు యజ్ఞము విఘ్నము లేకుండగా జరుగు విధమును ఉద్వేగముతో పునః పునః సమాలోచన చేయుచుండిరి (29).

సువిచార్యోదర్కఫలం మహోద్విగ్నాస్సుబుద్ధయః | సురవిష్ణ్వా దయోభూవన్‌ తన్నా శాద్ద్రావణాన్ముహుః || 30

ఏవం బూతస్తదా యజ్ఞే విఘ్మో జాతో దురాత్మనః | బ్రహ్మ బంధోశ్చ దక్షస్య శంకర ద్రోహిణో మునే || 31

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సత్యుపాఖ్యానే సతీదేహత్యాగో పద్రవ వర్ణనం నామ త్రింశోధ్యాయః (30).

గొప్ప బుద్ధిశాలురగు విష్ణువు మొదలగు దేవతలు సతీ దేహత్యాగమునకు, శివగణములను తరిమివేయుటకు భవిష్యత్తులో కలుగుబోవు ఫలమును గూర్చి బాగుగా విచారించి తీవ్రమైన ఆదుర్దాను పొందిరి (30). ఓ మహర్షీ! దుష్ట బ్రాహ్మణుడు, శివద్రోహి, దుర్మార్గుడునగు దక్షుని యజ్ఞములో అపుడీవిధమైన విఘ్నము ఘటిల్లెను (31).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీదేహత్యాగమనే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

Sri Sivamahapuranamu-I    Chapters