Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ఏకత్రింశోధ్యాయః

ఆకాశవాణి

బ్రహ్మోవాచ |

ఏతస్మిన్నంతరే తత్ర నభోవాణీ మునీశ్వర | అవోచచ్ఛృణ్వతాం దక్షసురాదీనాం యథార్థతః || 1

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఇంతలో నచట దక్షుడు, దేవతలు మొదలగువారు వినుచుండగా ఆకాశవాణి సత్యమును పలికెను (1).

వ్యోమవాణ్యువాచ !

రేరే దక్ష దూరాచార దంభాచార పరాయణ | కిం కృతం తే మహామూఢ కర్మ చానర్థకారకమ్‌ || 2

న కృతం శైవరాజస్య దధీచే ర్వచనస్య హి | ప్రమాణం తత్కృతే మూఢ సర్వానందకరం శుభమ్‌ || 3

నిర్గతస్తే మఖాద్విప్ర శ్శాపం దత్త్వా సుదుస్సహమ్‌ | తతో%పి బుద్ధం కించిన్నో త్వయా మూఢేన చేతసి || 4

తతః కృతః కథం నో వై స్వపుత్ర్యాస్త్వాదరః పరః | సమాగతాయాస్సత్యాశ్చ మంగలాయా గృహం స్వతః || 5

సతీభవౌ నార్చితౌ హి కిమిదం జ్ఞాన దుర్బల | బ్రహ్మపుత్ర త వృథా గర్వితో%సి విమోహితః || 6

ఆకాశవాణి ఇట్లు పలికెను -

ఓరీ దక్షా!దుష్టుడా !నీవు దంభము కొరకై యజ్ఞమును చేయుటయందు నిష్ఠగలవాడవు. ఓరీ మహమూర్ఖా! హానిని కలిగించే ఈ కర్మను ఏల చేసితివి? (2) ఓరీ మూర్ఖా !శైవ శిఖామణియగు దధీచి యొక్క మాటను ప్రమాణముగా స్వీకరించిక పోతివి. ఆయన మాటను పాటించినచో, సర్వులకు ఆనందము, శుభము కలిగి యుండెడిది (3). ఆ బ్రాహ్మణుడు సహింప శక్యముగాని శాపమునిచ్చి, నీ యజ్ఞమును వీడి నిష్క్రమించినాడు. కాని మూర్ఖడవగు నీకు అప్పుడైననూ బుద్ధి రాలేదు (4). నీ కుమార్తె, మంగళ స్వరూపురాలు అగు స్వతి స్వయముగా నీ గృహమునకు రాగా, ఆమెను గొప్పగా ఆదరించవలెను. నీవు అట్లు చేయక పోవుటకు కారణమేమి?(5)ఓరీ అజ్ఞానీ !సతీ శివులను నీవు అర్చించవైతివి. కాణమేమి? బ్రహ్మపుత్రుడననే గర్వముచే మోహితుడవైతివి. నీ గర్వము వ్యర్థము (6).

సా సత్యేవ సదారాధ్యా సర్వా పాప ఫలప్రదా | త్రిలోకమాతా కల్యాణీ శంకరార్థాంగ భాగినీ || 7

సా సత్యేవార్చితా నిత్యం సర్వసౌభాగ్యదాయినీ | మహేశ్వరీ స్వభక్తానాం సర్వమంగల దాయినీ || 8

సా సత్యేవార్చితా నిత్యం సంసార భయనాశినీ | మనోభీష్ట ప్రదా దేవీ సర్వోపద్రవ హారిణీ || 9

సా సత్యేవార్చితా నిత్యం కీర్తి సంపత్ర్పదాయినీ | పరమా పరమేశానీ భుక్తి ముక్తి ప్రదాయినీ || 10

ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆమె పుణ్య ఫలముల నన్నిటినీ ఇచ్చును. ఆమె ముల్లోకములకు తల్లి. మంగళస్వరూపురాలు. శంకరుని అర్థ శరీరమును పొందినది (7). ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆ మహేశ్వర పత్ని తన భక్తులకు సమస్త సౌభాగ్యములను, సర్వమంగళములను ఇచ్చును (8). ఆ సతిని నిత్యము అర్చించువానికి సంసార భయము నాశమగును. ఆ దేవి మనస్సులోని కోర్కెలనీడేర్చి, సమస్త విపత్తులను తొలగించును (9). నిత్యము ఆరాధిచువారికి ఆమె కీర్తిని, సంపత్తులను, భుక్తిని, ముక్తిని ఇచ్చును. పరమేశ్వరుని అర్థాంగియగు ఆమె పరమ తత్త్వమగు బ్రహ్మస్వరూపిణి (10).

సా సత్యేవ జగద్ధాత్రీ జగద్రక్షణ కారిణీ | అనాది శక్తిః కల్పాంతే జగత్సంహారకారిణీ || 11

సా సత్యేవ జగన్మాతా విష్ణుమాతా విలాసినీ | బ్రహ్మేంద్ర చంద్ర వహ్న్యర్క దేవాది జననీ స్మృతా || 12

సా సత్యేవ త పో ధర్మ దానాది ఫలదాయినీ | శంభు శక్తిర్మహాదేవీ దుష్టహంత్రీ పరాత్పరా || 13

ఈ దృగ్విధా సతీ దేవీ యస్య పత్నీ సదా ప్రియా | తసై#్మ భాగో న దత్తస్తే మూఢేన కు విచారిణా || 14

ఆ సతియే జగత్తును సృష్టించును, జగత్తును రక్షించును. అనాది శక్తియగు ఆమె కల్పాంతమునందు జగత్తును ఉపసంహరించును (11). ఆ సతియే జగన్మాత. ఆ జగదేక సుందరి విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, అగ్ని, సూర్యాది దేవతలకు తల్లియని మహర్షులు చెప్పుచున్నారు (12). శంభుని శక్తి, దుష్టవినాశిని, పరాత్పరయగు ఆ సతీ మహాదేవియే తపస్సు, ధర్మము దానము మొదలగు వాటి ఫలముల నిచ్చును (13). ఇట్టి సతీదేవి ఎవని పత్నియో, ఎవని నిత్యప్రియురాలో, అట్టి శివునకు మూఢుడు, దుష్ట బుద్ధి అగు నీవు యజ్ఞములో భాగము నీయలేదు (14).

శంభుర్గి పరమేశాన స్సర్వస్వామీ పరాత్పరః | విష్ణు బ్రహ్మాది సంసేవ్య స్సర్వ కల్యాణకారకః || 15

తప్యతే హి తపస్సిద్ధై రేతద్దర్శన కాంక్షిభిః | యుజ్యతే యోగిభిర్యోగైరేతద్దర్శన కాంక్షిభిః || 16

అనంత ధన ధాన్యానాం యాగాదీనాం తథైవ చ | దర్శనం శంకరసై#్యవ మహత్ఫలముదా హృతమ్‌ || 17

శివ ఏవ జగద్ధాతా సర్వవిద్యాపతిః ప్రభుః | ఆది విద్యా వరస్వామీ సర్వమంగల మంగలః || 18

తచ్ఛక్తేర్న కృతో యస్మాత్సతారోద్య త్వయా ఖల | అత ఏవాధ్వరస్యాస్య వినాశో హి భవిష్యతి || 19

శంభువు పరమేశ్వరుడు. సర్వజగత్తులకు ప్రభువు. పరాత్పరుడు. విష్ణుబ్రహ్మాదులు ఆయనను సేవింతురు. ఆయన అందరికీ కల్యాణమును చేయును (15). ఈ శివుని దర్శించు కోరికతో సిద్ధులు తపస్సును చేయుదురు. ఈ శివుని దర్శించు కాంక్షతో యోగులు యోగము నభ్యసింతురు (16). అనంత ధన ధాన్యములను పొందుటకంటె, యజ్ఞాది పుణ్యకర్మల ఫలము కంటె శంకరుని దర్శనము యొక్క ఫలమే గొప్పదియని చెప్పబడినది (17). శివుడే జగత్కారణము. సర్వవిద్యలకు మూలము ఆయనయే. సర్వ సమర్థుడగు ఆయనయే వేద విద్యకు శ్రేష్ఠమగు ప్రభువు. ఆయన మంగలములన్నిటిలో మంగళుడు (18). దుష్టుడా !ఆయన శక్తికి నీవీనాడు సత్కారమును చేయకుంటివి. ఈ కారణముగా ఈ నీ యజ్ఞము వినాశమును పొందగలదు (19).

అమంగలం భవత్యేవ పూజార్హాణా మపూజయా | పూజ్యమానా చ నా సౌ హి యతః పూజ్యతమా శివా || 20

సహస్రేణాపి శిరసాం శేషో యత్పాదజం రజః | వహత్యహరహః ప్రీత్యా తస్య శక్తిశ్శివా సతీ || 21

యత్పాద పద్మమనిశం ధ్యాత్వా సంపూజ్య సాదరమ్‌ | విష్ణుర్విష్ణుత్వ మాపన్నస్తస్య శంభోః ప్రియా సతీ || 22

యత్పాద పద్మమనిశం ధ్యాత్వా సంపూజ్య సాదరమ్‌ | బ్రహ్మా బ్రహ్మత్వ మాపన్నస్తస్య శంభోః ప్రియా సతీ || 23

పూజింప దగిన వారిని పూజించనిచో, నిశ్చయముగా అమంగళము కలుగును. శివుని పత్ని అందరిలో అధికముగా పూజార్హురాలు. కాని ఆమెకు పూజ జరుగలేదు (20). శేషుడు ఎవని పాదధూళిని నిత్యము వేయి పడగలతో ప్రీతితో ధరించుచున్నాడో, అట్టి శివుని శక్తియే సతీదేవి (21). ఎవని పాదపద్మములను నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి విష్ణువు విష్ణుపదవిని పొందినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (22). ఎవని పాదపద్మమును నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి బ్రహ్మ సృష్టికర్త అయినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (23).

యత్పాదపద్మమనిశం ధ్యాత్వా సంపూజ్య సాదరమ్‌ | ఇంద్రా దయో లోకపాలాః ప్రాపుస్స్వం స్వం పరం పదమ్‌ || 24

జగత్పితా శివశ్శక్తిర్జగన్మాతా చ సా సతీ | సత్కృతౌ న త్వయా మూఢ కథం శ్రేయో భవిష్యతి || 25

దౌర్భాగ్యం త్వయి సంక్రాంతం సంక్రాంతాస్త్వయి చాపదః | ¸° చానారాధితౌ భక్త్యా భవానీ శంకరౌ చ తౌ || 26

అనభ్యర్చ్య శివం శంభుం కల్యాణం ప్రాప్నుయామితి | కిమస్తి గర్వో దుర్వారస్స గర్వోద్య వినశ్యతి || 27

ఎవని పాద పద్మమును నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి ఇంద్రాది లోకపాలకులు తమ తమ గొప్ప పదవులను పొందిరో (24), అట్టి శివుడు జగత్తునకు తండ్రి. ఆయన యొక్క శక్తియగు ఆ సతీదేవి జగత్తునకు తల్లి. ఓరీమూఢా! నీవు వారి నిద్దరినీ పూజించలేదు. నీకు శ్రేయస్సు ఎట్లు కలుగును? (25) నీ యందు దౌర్భాగ్యము సంక్రమించినది. నీకు ఆపదలు సంక్రమించినవి. ఏలయన, నీవు భక్తితో ఆ భవానీ శంకరుల నారాధించకపోతివి (26). మంగళకరుడగు శంభుని ఆరాధించకుండగనే నేను కల్యాణములను పొందగలనననే గర్వము నీకు గలదు. ఈ గర్వము వారించ శక్యముగానిదా యేమి? ఈనాడు ఆ గర్వము నశించగలదు (27).

సర్వేశ విముఖో భీత్వా దేవేష్వే తేషు కస్తవ | కరిష్యతి సహాయం తం న తే పశ్యామి సర్వథా || 28

యది దేవాః కరిష్యంతి సాహాయ్య మధునా తవ | తదా నాశం గమిష్యంతి శలభా ఇవ వహ్నినా || 29

జ్వలత్వద్య ముఖం తే వై యజ్ఞ ధ్వంసో భవత్వతి | సహాయాస్తవ యావంతస్తే జ్వలంత్వద్య సత్వరమ్‌|| 30

అమరాణాం చ సర్వేషాం శపథోమంగలాయ తే | కరిష్యంత్యద్య సాహాయ్యం యదేతస్య దురాత్మనః || 31

సర్వేశ్వరునకు విముఖుడై నీకు సాహాయ్యమును చేయగలవాడు ఈ దేవతలలో ఎవడు గలడు ?ఎంత వెదికిననూ అట్టివాడు నాకు కానవచ్చుట లేదు (28). ఇపుడు నీకు దేవతలు సాహాయ్యమును చేసినచో, వారు నిప్పుయందు పడిన శలభముల వలెన నాశమును పొందెదరు (29). ఈనాడు నీ ముఖము మండిపోవుగాక !నీ యజ్ఞము నాశమగు గాక !నీకు ఎంతమంది సాహాయ్యమును చేసెదరో, వారందరు వెంటనే మాడి మసియగుదురు గాక !(30) దుష్టబుద్ధియగు నీకు ఈనాడు ఏ దేవతలు సాహాయ్యమును చేసెదరో, వారందరికి అమంగళము కలుగుట నిశ్చయము. ఇది నా శపథము (31).

నిర్గచ్ఛంత్వమరా స్స్వోక మేత దధ్వర మండపాత్‌ | అన్యథా భవతాం నాశో భవిష్యత్యద్య సర్వథా || 32

నిర్గచ్ఛం త్వపరే ముని నాగాదయో ముఖాత్‌ | అన్యథా భవతాం నాశో భవిష్యత్యద్య సర్వథా || 33

నిర్గచ్ఛ త్వం హరే శీఘ్రమేత దధ్వరమండపాత్‌ | అన్యథా భవతో నాశో భవిష్యత్యద్య సర్వథా || 34

ఓ దేవతలారా !మీరీ యజ్ఞమండపము నుండి మీ గృహములకు మరలుడు. అట్లు గానిచో ఈనాడు మీ నాశము నిశ్చయము (23). మునులు, నాగులు మొదలగు ఇతరులందరు ఈ యజ్ఞము నుండి బయటకు పొండు. అట్లు గానిచో, ఈనాడు మీ నాశము నిశ్చితము (33). ఓ హరీ !నీవు వెంటనే ఈ యజ్ఞముమండపము నుండి బయటకు పొమ్ము. లేనిచో, ఈనాడు నీవిచట నాశమును పొందుట నిశ్చతము (34).

నిర్గచ్ఛ త్వం విధే శీఘ్రమేత దధ్వరమండపాత్‌ | అన్యథా భవతో నాశో భవిష్యత్య ద్య సర్వథా || 35

ఓ బ్రహ్మా! నీవు శీఘ్రముగా ఈ యజ్ఞమండపము నుండి నిష్క్రమించుము. అట్లుగానిచో, నీవీనాడు నాశమును పొందుట నిశ్చయము (35).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా ధ్వరశాలాయా మఖిలాయాం సు సంస్థితాన్‌ | వ్యరమత్సా నభోవాణీ సర్వ కల్యాణ కారిణీ || 36

తచ్ఛ్రుత్వా వ్యోమవచనం సర్వే హర్యా దయస్సురాః | అకార్షుర్విస్మయం తాత మునయశ్చ తథా పరే || 37

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సత్యుపాఖ్యనే న భోవాణీ వర్ణనం నామైకత్రింశోధ్యాయః (31).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సర్వరులకు మంగళములనిచ్చే ఆ ఆకాశవాణి యజ్ఞశాల అంతటా కూర్చుండియున్న వారిని ఉద్దేశించి ఇట్లు పలికి విరమించెను (36). ఓ కుమారా !ఆకాశవాణి యొక్క ఆ ప్రసంగమును విని విష్ణువు మొదలగు దేవతలు, మునులు, మరియు ఇతరులు అందరు ఆశ్చర్యమును పొందిరి (37).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీఖండలో సత్యుపాఖ్యనమునందు ఆకాశవాణీ వర్ణనమనే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).

Sri Sivamahapuranamu-I    Chapters