Sri Sivamahapuranamu-I
Chapters
అథ అష్టమోsధ్యాయః అసత్యము పలికిన తల తెగినది నందికేశ్వర ఉవాచ | ససర్జాథ మహాదేవః పురుషం కంచి దద్భుతమ్ | భైరవాఖ్యం భ్రవోర్మధ్యా ద్బ్రహ్మదర్పజిఘాంసయా || 1 సవై తదా తత్ర పతిం ప్రణమ్య శివమంగణ | కిం కార్యం కరవాణ్యత్ర శీఘ్ర మాజ్ఞాపయ ప్రభో|| 2 వత్స యోsయం విధి స్సాక్షాజ్జగతా మాద్యదైవతమ్ | నూనమర్చయ ఖడ్గేన తిగ్మేన జవసా పరమ్ || 3 సవై గృహీత్వైక కరేణ కేశం తత్పంచమం దృప్త మసత్యభాషణమ్ | ఛిత్వా శిరాంస్యస్య నిహంతు ముద్యతః ప్రకంపయన్ ఖడ్గమతి స్ఫుటం కరైః || 4 నందికేశ్వరుడిట్లు పలికెను - అపుడు మహాదేవుడు బ్రహ్మదేవుని గర్వము నడంచు కోరికతో కనుబొమల మధ్య నుండి భైరవుడనబడే అద్భుతమగు ఒకానొక పురుషుని సృష్టించెను (1). అపుడా పురుషుడు ఆ రణాంగణములో ప్రభువగు శివునకు నమస్కరించి, 'ప్రభో!నేను చేయదగిన పని యేది? వెనువెంటనే ఆజ్ఞాపించుడు' అని పలికెను (2). 'వత్సా! ఈ బ్రహ్మ లోకములకు మొదటి దైవము. కావున, ఈతనిని వేగముగా పదునైన కత్తితో నిశ్చయముగా బాగుగా అర్చించుము' అని శివుడు పలికెను (3). ఆ భైరవుడు ఒక చేతితో జుట్టును పట్టి, గర్వించిన బ్రహ్మ యొక్క అసత్యమును పలికిన ఐదవ శిరస్సును ఖండించి, ప్రకాశించే కత్తిని చేతులతో త్రిప్పుతూ, మిగిలిన శిరస్సులను కూడ ఖండించుటకు సిద్ధపడుచుండెను (4). పితా తవోత్సృష్ట విభూషణాంబర స్రగుత్తరీయామలకేశ సంహతిః | ప్రవాత రంభేవ లతేవ చంచలః పపాత వై భైరవపాద పంకజే || 5 తావద్విధిం తాత దిదృక్షురచ్యుతః కృపాలురస్మత్పతి పాదపల్లవమ్ | నిషిచ్య బాషై#్ప రవదత్ కృతాంజలిః యథా శిశుస్స్వం పితరం కలాక్షరమ్ || 6 నీ తండ్రి అలంకారములను, ఉత్తరీయమును, మాలను, స్వచ్ఛమగు కేశముల ముడిని జారవిడచి, తుఫానులో అరటిచెట్టు వలె, తీగ వలె వణకుచూ, భైరవుని పద్మముల వంటి పాదములపై పడెను (5). ఇంతలో, బ్రహ్మను రక్షించు ఉద్దేశ్యముతో, దయగల విష్ణువు, మన ప్రభువు అగు శివుని చిగురుటాకు వంటి పాదమును కన్నీటితో అభిషేకించి, దోసిలి యొగ్గి, పిల్లవాడు తన తండ్రిని వేడుకొన్న తీరున, మధురమగు స్వరముతో ఇట్లు పలికెను (6). అచ్యుత ఉవాచ | త్వయా ప్రయత్నేన పురా హి దత్తం యదస్య పంచానన మీశ చిహ్నమ్ | తస్మాత్ క్షమస్వాద్య మనుగ్రహార్హం కురు ప్రసాదం విధయే హ్యముషై#్మ|| 7 ఇత్యర్థితోsచ్యుతే నేశః తుష్టస్సురగణాంగణ | నివర్తయామాస తదా భైరవం బ్రహ్మదండతః || 8 అథాహ దేవః కితవం విధిం విగతకంధరమ్ | బ్రహ్మం స్త్వ మర్హణాకాంక్షీ శఠమీశత్వ మాస్థితః || 9 నాతస్తే సత్కృతిర్లోకే భూయత్ స్థానోత్సవాదికమ్ | విష్ణువు ఇట్లు పలికెను- పూర్వము నీవు ఈ బ్రహ్మకు ఈశ్వర చిహ్నముగా ఐదు ముఖములను ప్రయత్నపూర్వకముగా నిచ్చియుంటివి. అందువలన, ఈమొదటి దైవమగు బ్రహ్మను క్షమింపుము. ఈతడు నీ అనుగ్రహమునకు యోగ్యుడు. నీవు ఈ బ్రహ్మ యందు ప్రసన్నతను చూపుము (7). విష్ణువుచే దేవతల సమక్షములో ఈ విధముగా ప్రార్థింపబడని శివుడు బ్రహ్మను దండించవద్దని భైరవుని అపుడు వెనకకు పిలిచెను (8). అపుడు శివుడు, మోసము చేసి తలను పోగొట్టుకున్న బ్రహ్మతో నిట్లనెను. ఓ బ్రహ్మన్! నీవు ఈశ్వరత్వమునకు అర్హతను సంపాదించగోరి, మోసమునకు తలపడితివి గాన (9) లోకములో నీకు స్థానము, ఉత్సవము, పూజ మొదలగునవి లేకుండుగాక! బ్రహ్మోవాచ| స్వామిన్ ప్రసీదాద్య మహావిభూతే | మన్యే వరం వరద మే శిరసః ప్రమోక్షమ్ || 10 నమస్తుభ్యం భగవతే బంధవే విశ్వయోనయే | సహిష్ణవే సర్వదోషాణాం శంభ##వే శైలధన్వనే || 11 బ్రహ్మ ఇట్లు పలికెను - స్వామీ! నీవు మహా మహిమాన్వితుడవు. ప్రసన్నుడవు కమ్ము. వరముల నిచ్చువాడా! శిరస్సు తెగుటను నేను వరముగనే భావించుచున్నాను (10). భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, దోషముల నన్నిటిని సహించువాడు, మేరు పర్వతము ధనస్సుగా గలవాడు, మంగళస్వరూపుడు నగు నీ కొరకు నమస్కారము (11). ఈశ్వర ఉవాచ | అరాజ భయమేతద్వై జగత్సర్వం నశిష్యతి | తతస్త్వం జహి దండార్హం వహ లోకధురం శిశో || 12 వరం దదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్ | వైతానికేషు గృహ్యేషు యజ్ఞేషు చ భవాన్గురుః || 13 నిష్ఫలస్త్వదృతే యజ్ఞః సాంగశ్చ సహ దక్షిణః | అథాహ దేవః కితవం కేతకం కూటసాక్షిణమ్ || 14 ఈశ్వరుడిట్లు పలికెను - నీవు నశించినచో, పాలకుని భయములేని ఈ జగత్తు పూర్తిగా నశించగలదు. అందువలన, దండార్హడవగు నిన్ను విడిచిపెట్టినాను. ఓబాలుడా! నీవు లోకము యొక్క భారమును వహించుము (12). నీకు దుర్లభమగు గొప్ప వరమును ఇచ్చెదను. అగ్నిష్టో మము, దర్శ మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము (13). అంగము లన్నియూ ఉన్నా, దక్షిణల నిచ్చినా, నీవు లేని యజ్ఞము వ్యర్థమగును. అపుడు శివుడ, మోసబుద్ధితో కూట సాక్ష్యమును పలికిన మొగలి పువ్వుతో నిట్లనెను (14). రేరే కేతక దుష్టస్త్వం శఠ దూరమితో వ్రజ | మమాపి ప్రేమ తే పుష్పే మాభూత్పూజాస్వితః పరమ్ || 15 ఇత్యుక్తే తత్ర దేవేన కేతకం దేవజాతయః | సర్వా నివారయామాసుః తత్పార్శ్వాదన్యతస్తదా || 16 ఓసి దుష్టకేతకమా! నీవు మోసమును చేసితివి. ఆవలకు బొమ్ము. ఇకపైన నాకు పూజాదులలో నీ యందు ప్రేమ ఉండకుండు గాక! (15) శివుడిట్లు పలుకగా, దేవతలా పుష్పమును శివుని పార్శ్వము నుండి దూరముగా తొలగించిరి. కేతక ఉవాచ | నమస్తే నాథ మే జన్మ నిష్ఫలం భవదాజ్ఞయా | సఫలం క్రియతాం తాత క్షమ్యతాం మమ కిల్బిషమ్ || 17 జ్ఞానా జ్ఞానకృతం పాపం నాశయత్యేవ తే స్మృతిః | తాదృశే త్వయి దృష్టే మే మిథ్యా దోషః కుతో భ##వేత్ | 18 తథా స్తుతస్తు భగవాన్ కేతకేన సభాతలే | న మే త్వద్ధారణం యోగ్యం సత్యవాగహ మీశ్వరః || 19 మదీయాస్త్వాం ధరిష్యంతి జన్మ తే సఫలం తతః | త్వం వై వితాన వ్యాజేన మమోపరి భవిష్యసి || 20 ఇత్యనుగృహ్య భగవాన్ కేతకం విధి మాధవౌ | విరరాజ సభామధ్యే సర్వదేవైరభిష్టుతః || 21 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయా మష్టమోsధ్యాయః (8) మొగలిపువ్వు ఇట్లు పలికెను - ఓ నాథా! నీకు నమస్కారము. నీ ఆజ్ఞచే నా జన్మ వ్యర్థమగును. తండ్రీ! నాతప్పును క్షమించి, నా జన్మను సఫలము చేయుము (17). తెలిసి గాని, తెలియక గాని చేసిన పాపము నిన్ను స్మరించుట చేతనే నశించును. అట్టి నిన్ను నేను దర్శించితిని. నాలో అసత్యదోషము ఇంకనూ ఎట్లుడును? (18). సభా మధ్యములో ఇట్లు కేతకము చేత స్తుతింపబడిన భగవానుడు ఇట్లనెను. ఈశ్వరుడనగు నేను పలికినది సత్యమై తీరును. కాన, నేను నిన్ను ధరించుట తగదు (19). కాని, నా భక్తులు నిన్ను ధరించెదరు. దాని వలన, నీజన్మ సఫలమగును. నీవు ఛత్రరూపమున నాపై ఉండగలవు (20). భగవానుడు ఈ విధముగా కేతకమును, బ్రహ్మను, మాధవుని అనుగ్రహించి, సభామధ్యములో దేవతలందరిచే స్తుతింపబడుచున్నవాడై విరాజిల్లెను (21). శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.