Sri Sivamahapuranamu-I    Chapters   

అథ అష్టత్రింశో ధ్యాయః

క్షువదధీచుల వివాదము

సూత ఉవాచ

ఇత్యాకర్ణ్య వచస్తస్య విధేరమిత ధీమతః| ప్రపచ్ఛ నారదః ప్రీత్యా విస్మితస్తం ద్విజోత్తమః||1

సూతుడిట్లు పలికెను

మహాప్రాజ్ఞుడగు బ్రహ్మ యొక్క ఈ మాటలను ద్విజశ్రేష్టుడుగు నారదుడు విస్మితుడై ప్రేమతో నిట్లు ప్రశ్నించెను(1)

నారద ఉవాచ

శివం విహాయ దక్షస్య సురైర్యజ్ఞం హరిర్గతః| హేతునా కేన తద్బ్రూహి యత్రా వజ్ఞా భవత్తతః||2

జానాతి కిం స శంభుం నో హరిః ప్రలయ విక్రమమ్‌| రణం కథం కృతవాన్‌ తద్గణౖరబుధో యథా||3

ఏష మే సంశయో భూయాంప్త ఛింది కరుణానిధే | చితం బ్రూహి శంభోస్తు చిత్తోత్సాహకరం ప్రభో||4

నారదుడిట్లు పలికెను

విష్ణువు శివుడు లేని దక్షుని యజ్ఞమునకు దేవతలతో గూడి వెళ్ళి, అచట పరాభవమును పొందెను. దీనికి కారణముమేమియో చెప్పుము (2) సర్వసంహారకారకుడుగు శంభుని పరాక్రముమును విష్ణువు ఎరుంగడా? మూర్ఖునివలె ఆయన శివుని గణములతో యుద్ధము నెట్టు చేసెను?(3) ఇది నాకు గల పెద్ద సందేహము ఓ దయానిధీ! నాసందేహము తొలగించుము. హే ప్రభో! మనస్సునకు ఉత్సాహమును కలిగించే శంభుని చిరితమును చెప్పుము(4)

బ్రహ్మోవాచ

ద్విజవర్య శృణు ప్రీత్యా చరితం శశిమౌలినః | యత్పృచ్ఛతే శృణ్వతశ్చ సర్వ సంశయహారకమ్‌||5

దధీచస్య మునిశ్శాసా ద్ర్భష్టజ్ఞానో హరిః పురా| సమారో దక్షయజ్ఞం వై గతః క్షువసహాయకృత్‌||6

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ ద్విజశ్రేష్టా! చంద్రశేఖరుని చరితమును ప్రీతితో వినుము. ఈ చరితము అడిగినవారికి, విన్నవారికి, సంశయముల నన్నిటినీ వారించును(5). దధీచ మహర్షి యొక్క శాపముచే పూర్వము జ్ఞాన భ్రష్టుడైన విష్ణువు దేవతలతో గూడి దక్షుని యజ్ఞమునకు వెళ్లెను. విష్ణువు క్షువునకు సహయమును చేయబోయి దధీచుని శాపమును పొందెను(6)

నారద ఉవాచ|

కిమర్థం శప్త వాన్విష్ణుం దధీదో మునిసత్తమః| కోపకారః కృతస్తస్య హరిణా తత్సహాయినా||7

నారదుడిట్లు పలికెను

మహర్షిశ్రేష్ఠుడగు దధీచుడు విష్ణువును శపించుటకు కారణమేమి? ఆ క్షువునకు సహాయమును చేసిన విష్ణువు ఆయనకు కోపము కలిగే పనిని దేనిని చేసెను? (7)

బ్రహ్మోవాచ

సముత్పన్నో మహాతేజా రాజా క్షువ ఇతి స్మృతః| ఆ భూన్మిత్రం దధీచస్య మునీంద్రస్య మహాప్రభోః|| 8

చిరాత్తపః ప్రసంగాద్వై వాదః క్షువదధీచయోః| మహానర్ధకరః ఖ్యాతిస్త్రి లోకేష్వ భవత్పురా||

తత్ర త్రివర్ణత శ్ర్శేష్ఠో విప్ర ఏవ న సంశయః| ఇతి ప్రాహ దధీచో హి శివభక్తస్తు వేదవిత్‌ ll10

తచ్ఛ్రుత్వా వచనం తస్య దధీచస్య మహామునేః| క్షువః ప్రాహేతి నృపతి శ్శ్రీమదేన విమోహితః||11

బ్రహ్మ ఇట్లు పలికెను

క్షువుడను మహేతేజస్వియగు రాజు ఒకడు ఉండెడివాడు. ఆయనకు మహాప్రభుడగు దధీచ మహర్షితో మైత్రి కలిగెను(8) దీర్ఘకాల తపస్సు అను విషయములో పూర్వము క్షువ దధీచులిద్దరికీ వాదము చెలరేగెను. గొప్ప అనర్ధమును కలిగించు వా వాదము ముల్లోకములలో ప్రసిద్ది గాంచెను(9) మూడు వర్ణముల కంటె శ్రేష్టుడగు బ్రాహ్మణుడే తపస్సునందే సమర్ధుడనియు, సంశయములేదనియు శివభక్తుడు వేదవేత్తయగు దధీచుడు చెప్పెను(10) దధీచ మహర్షి యొక్క ఆ మాటను విని ధనగర్వముచే మిక్కిలి మోహితుడై యున్న క్షువ మహారాజు ఇట్లు పలికెను

క్షువ ఉవాచ

అష్టానాం లోకపానాం వపుర్ధాయతే నృపః | తస్మాన్నృపో వరిష్ఠో హి వర్ణాశ్రమపతిః ప్రభుః||12

సర్వదేవ మయో రాజా శ్రుతిః ప్రాహేతి తత్సరా| మహతీ దేవతా యా సా సోహమేవ తతో మునే||13

తస్మా ద్విప్రాద్వరో రాజా చ్యవనేయ విచార్యతామ్‌ | నావమంతవ్య ఏవాతః పూజ్యో హం సర్వథా త్వాయా||14

క్షువుడిట్లు పలికెను

రాజు ఎనమండుగురు లోకపాలకుల దేహమును తాను ధరించును కాన వర్ణాశ్రమములకు రక్షకుడగు రాజే శ్రేష్ఠుడు(12) రాజధర్మములను భోదించు శ్రుతి 'రాజు సర్వదేవతా స్వరూపుడు' అని చెప్పుచున్నది. కాన రాజు దేవతలలో కెల్ల గొప్పవాడు. ఓ మహర్షీ! అట్టి దేవతను నేనే(13). ఓ చవ్యవనసపుత్రా! ఇందువలన రాజు బ్రాహ్మణుని కంటె శ్రేష్ఠుడు. నీవు ఆలోచించుము. ఈ కారణముగా నన్ను అవమానించరాదు. నీవు నన్ను అన్నివిధముగా పూజించవలసియున్నది(140

బ్రహ్మోవాచ

శుత్వా తథా మతం తస్య క్షువస్య మునిసత్తమః7 శ్రుతిస్మృతి విరుద్ధం తం చుకోపాతీవ భార్గవః||15

అథ క్రుథ్థో మహాతేజా గౌరవాచ్చాత్మనో మునే| అతాయడత్‌ క్షువం మూర్ధ్ని దధీచో వామముష్టితః||16

వజ్రేణ తం చ చిచ్ఛేద దధీచం తాడితః క్షువః| జగర్జాతీవ సంక్రుద్దో బ్రాహ్మాండాధిపతిః కుదీః||17

పపాత భూమౌ నిహతో తేన వజ్రేణ భార్గవః | శుక్రం సస్మార క్షువ కృద్భార్గవస్య కులంధరః||18

బ్రహ్మ ఇట్లు పలికెను

భృగువంశజుడగు దధీచి మహర్షకి ఆ క్షువుని వేదశాస్త్ర విరద్ధమగు ఆ అభిప్రాయమును వినిన పిదప మిక్కిలి కోపము కలిగెను. (15) ఓ మహర్షీ! మహాతేజస్వియగు దధీచుడు కోపించినవాడై, ఆత్మగౌరవమును రక్షించుట కొరకై శిరస్సుపై ఎడమ ముష్టితో కొట్టెను(16) బ్రహ్మాండమునకు ప్రభువు, దర్బుద్ధియగు క్షువుడు దధీచుడు కొట్టుట వలన మిక్కిలి కోపించి, అతనిని వజ్రముతో చీల్చివేసి గర్జించెను(17). భృగువంశమును నిలబెట్టే ఆ దధీచుడు వజ్రముతో క్షువునిచే కొట్టబడిన వాడై నేలమీద బడి శుక్రాచార్యుని స్మరించెను(18)

శుక్రో థ సంథయామాస తాడితం చ క్షువేన తు | యోగీ దధీచస్య తదా దేహమాగత్య స ద్రుతమ్‌||19

సంధాయ పూర్వవద్దేహం దధీచస్యాహ భార్గవః | శివభక్తాగ్రణీర్మృత్యుంజయ విద్యా ప్రవకర్తః||20

అపుడు యోగియగు శుక్రుడు వేగముగా వచ్చి, క్షువునిచే చీల్చివేయబడిన దధీచుని దేహమును మరల సంధించెను(19) శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయోపాసనను లోకములో ప్రవర్తిల్లజేసినవాడు అగు శుక్రుడు దధీచుని దేహమును పూర్వమునందుండిన తీరున సంధించి ఇట్లు పలికెను(20)

శుక్ర ఉవాచ

దధీచ తాత సంపూజ్య శివం సర్వేశ్వరం ప్రభుమ్‌| మహామృత్యుంజయం మంత్రం శ్రౌతమగ్ర్యం వదామి తే||21

త్ర్యంబకం యజామహే త్రైలోక్యం పితరం ప్రభుమ్‌ | త్రిమండలస్య పితరం త్రిగుణస్య మహేశ్వరమ్‌ ||22

త్రి తత్త్వస్య త్రివహ్నేశ్చ త్రిథా భూతస్య సర్వతః| త్రి దివస్య త్రి బాహోశ్చ త్రిధా భూతస్య సర్వతః ||23

త్రి దేవస్య మహాదేవస్సుగంధిం పుష్టివర్ధనమ్‌| సర్వభూతేషు సర్వత్ర త్రిగుణషు కృతౌ యథా||24

శుక్రుడిట్లు పలికెను

వత్సా! దధీచా! సర్వేశ్వరుడగు శివప్రభుని పూజించి వేదోక్తము, సర్వశ్రేష్టమునగు మహా మృత్యుంజయ మంత్రమును నీకు చెప్పెదను(21). త్య్రంబకం యజామహే ముల్లోకములకు తండ్రి, రక్షకుడు, అగ్ని చంద్ర సూర్య మండలములను సృష్ఠించినవాడు, సత్త్వరజస్తమోగుణములపై పూర్ణి అధిపత్యము గలవాడు(22) శ్లేష్మవాత పిత్తములనే మూడు శరీరతత్వములను, అహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులను మూడు అగ్నులను పాలించువాడు, పృథివి జలము అగ్ని అను మూడు బాహువుల వంటి మూడు మూర్త భూతములతో సర్వమును వ్యాపించియున్నవాడు స్వర్గాది లోకస్వరూపుడు, సర్వత్ర సుఖదుఃఖమోహాత్మకమగు జగత్తునందు వ్యాపించి యున్నవాడు (23) త్రిమూర్తి స్వరూరపుడగు శివుని పూజించెదము సుగంధిమ్‌, మహాదేవుడు సర్వభూతములలో సర్వప్రాణములలో, సత్త్వరజస్తమోగుణములలో సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించియున్నాడు(24)

ఇంద్రియేషు తథాన్యేషు దేవేషు చ గణషు చ | పుష్పే సుగంధివత్సూరస్సుగంధి మమరేశ్వరః||25

పుష్టిశ్చ ప్రకృతేర్య స్మాత్పురుషాద్వై ద్విజోత్తమ| మహదాది విశేషాంత వికల్పస్యాపి సువ్రత||

విష్ణోః పితామహస్యాపి మనీనాం చ మహామునే| ఇంద్రస్య చ దేవానాం తస్మాద్వై పుష్టివర్థనః||27

తం దేవమమృతం రుద్రం కర్మణా తపసాపి వా | స్వాధ్యాయేవ చ యేగేన ధ్యాయేన చ ప్రజాపతే||28

ఆ దేవ దేవుడు పుష్పములలో సుంగంధము వలె ఇంద్రియములో ఇతర దేవతలతో శివగణములలో వ్యాపించియున్నాడు (25) పుష్టి వర్దనమ్‌. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! గొప్పవ్రతము గలవాడా!మహత్తు మొదలుకొని పరమాణు గత విశేషము వరకు వివిధ కార్యరూపములలో నున్న ప్రకృతి యొక్క పుష్టి (బలము) పురుషుడగు శివుని నుండి లభించినది(26).మహర్షీ!విష్ణువునకు, బ్రహ్మకు, మునీశ్వరులకు, ఇంద్రునకు, దేవతలకు పుష్టిని ఇచ్చుటచేతనే శివుడు పుష్ఠి వర్దనుడగుచున్నాడు(27) ఓ ప్రజాపతీ! అమృతస్వరూపుడగు ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్టానముచే గాన తపస్సుచేగాని, వేదాధ్యమునుచే గాని, యోగముచే గాని, ధ్యానముచే గాని ఆరాధించవలెను(28)

సత్యే నన్యేన సూక్ష్మాగ్రన్మత్యు పాశాద్భవ స్వ్సయమ్‌| బంధమోక్షకరో యస్మా దుర్వారుకమివప్రభుః||29

మృత సంజీవనీ మంత్రో మమ సర్వోత్తమస్స్మృతః | ఏవం జపరః ప్రీత్యా నియమేన శివం స్మరన్‌|| 30

జప్త్వా హుత్వాభి మంత్య్రైవం జలం పిబ దివానిశమ్‌ | శవస్య సన్నిధౌ ధ్యాత్వా నాస్తి మృత్యుభయం క్వచిత్‌||31

కృత్వా న్యాసాదికం సర్వం సంపూజ్య విధి వచ్ఛివమ్‌ | సంవిధాయేదం నిర్వ్యగ్రశ్శంకరం భక్తవత్సలమ్‌||32

సత్యముచే గాని,లేదా ఇతర ఆరాధనా పద్ధతో గాని పూజింపబడిన శివ ప్రభుడు, పుచ్చకాయను తీగనుండి వలె, భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము లను భంధము నుండి విముక్తిని కలింగించును(29) నా అభిప్రాయములో ఈ మృసంజీవనీ మంత్రము సర్వశ్రేఫ్టమైనది. నీవు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమముతో దీనిని జపించుము(30) జపము అయిన తరువాత హోమమును చేయుము. రాత్రింబగళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రముతో అభిమంత్రించి త్రాగుము. దీనిని శివసన్నిధిలో ధ్యానము చేయువానికి ఎక్కడైననూ మృత్యుభయము ఉండదు(31) న్యాసాదికమునంతనూ చేసి, భక్తవత్సలుడు మంగళరుడు నగు శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రమును జపించి దుఃఖమునుండి విముక్తిని పొందుము(32)

ధ్యానమస్య ప్రవక్ష్యామి యథా ధ్యాత్వా జపేన్మనుమ్‌l సిద్ధమంత్రో భ##వేద్ధీమాన్‌ యావచ్ఛంభు ప్రభావతః||33

హస్తాంభోజ యుగస్థ కుంభయుగలా దుద్ధృత్య తోయం

శిరస్శించంతం కరయోర్యుగేన దధతం స్వాంకే సకుంభై కరౌ

అక్షప్రజ్‌ మృగహస్త మంబుజగతం మూర్దస్థ చంద్రస్రవత్‌

పీయూషార్ద్రతనుం భ##జే సగిరిజం త్ర్యక్షం చ మృత్యుంజయమ్‌||34

ఈ మంత్రమునకు ధ్యానము చెప్పెదను. ఇట్లు ధ్యానించి మంత్రమును జపించు జ్ఞాని శంభుని అనుగ్రహముచే శీఘ్రముగా మంత్రసిద్ధిని పొందును(33) పద్మముల వంటి రెండు చేతుల యందున్న రెండు కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సు పై అభిషేకించుకొను చున్నట్టియు, రెండు చేతులతో తన తొడపై రెండు కుంభములను ధరించినట్టియు, అక్షమాలను మృగమును చేతియందు కలిగి ఉన్నట్టియు, పద్మమునందాసీనుడై ఉన్నట్టియు, శిరస్సు పై నున్న చంద్రునినుండి జాలువారిన అమృతముతో తడిసిన దేహము కల్గినట్టియు, పార్వతీ దేవితో కూడి ఉన్నట్టియు మూడు కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదను(34)

బ్రహ్మోవాచl

ఉపదిశ్యేతి శుక్రస్స్వం దధీచో మునిసత్తమమ్‌ | స్వస్థానమగత్తాత సంస్మరన్‌ శంకరం ప్రభుమ్‌||

తస్య తద్వచనం శ్రుత్వా దధీచో హి మహామునిఃl వనం జగామ తపసే మహాప్రీత్యా శివం స్మరమ్‌|| 36

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! శుక్రుడు తన వంశములోని వాడు, మహర్షియగు దధీచికి ఇట్లు ఉపదేశించి, శంకర ప్రభుని స్మరిస్తూ తన స్థానమునకు వెళ్ళెను(35). దధీచి మహాముని ఆయన చెప్పిన ఆ మాటలను విని, మహాప్రీతితో శివుని స్మరిస్తూ , తపస్సు కొరకు వనమునకు వెళ్ళెను(36)

తత్ర గత్వా విధానేన మహామృత్యుంజయాభిధమ్‌ | తం మనుం ప్రజపన్‌ ప్రీత్యా తపస్తేపే శివం స్మరన్‌||37

తన్మనుం సుచిరం జప్త్వా తపసారాధ్య శంకరమ్‌| శివం సంతోషయామాస మహామృత్యుం జయం హి సః|| 38

అథ శంభుః ప్రసన్నాత్మా తజ్జపాద్భక్త వత్సలః | ఆవిర్భ భూవ పురతస్తస్య ప్రీత్య మహామునే|| 39

తం దృష్ట్వా స్వప్రభుం శంభుం స ముమోద మునీశ్వరః| ప్రణమ్య విధివద్భక్త్యా తుష్టావ సుకృతాంజలిః|| 40

ఆయన వనమునకు వెళ్ళి ఆ మహామృత్యుంజయ మంత్రమును యథావిధిగా జపిస్తూ శివుని ప్రీతితో స్మరిస్తూ తపస్సును చేసెను (37). ఆయన ఆ మంత్రమును చిరకాలము జపించి తపస్సును చేసి శంకరుని ఆరాధించెను. ఆయన మహామృత్యుంజయ మంత్రమును జపించుటచే శివుడు సంతసించెను(38) ఓ మహర్షీ! అపుడు భక్తవత్సలుడగు శంభుడు ఆ జపముచే ప్రసన్నమైన మనస్సు గలవాడై ప్రీతితో అతని ఎదుట ఆవిర్భవించెను(39) ఆ మహర్షి తన ప్రభుడగు ఆ శంభుని చూచి సంతోషించి ప్రణమిల్లి దోసిలి యొగ్గి భక్తితో స్తుతించెను(40

అథ ప్రీత్యా శివస్తాత ప్రసన్న శ్చ్యావనిం మునే| వరం బ్రూహీతి స ప్రాహ సుప్రసన్నేన చేతసా||41

తచ్ఛ్రుత్వా శంభువచనం దధీచో భక్త సత్తమః | సాం జలిర్నతకః ప్రాహ శంకరం భక్తవత్సలమ్‌||42

వత్సా! నారదమునీ! అపుడు శివుడు ప్రసన్నమైన మనస్సుగలవాడై చ్యవనుని కుమారుడగు దధీచితో వరమును కోరుకొమ్మనెను(41). భక్త శిఖామణి యగు దధీచుడు ఆ శంభుని మాటను విని దోసిలి యొగ్గి నమస్కరించి భక్తవత్సలుడగు శంకరునితో నిట్లనెను(42).

దధీచ ఉవాచ|

దేవదేవ మహాదేవ మహ్యం దేహి వరత్రయమ్‌ | వజ్రాస్థిత్వ మవధ్యత్వ మదీనత్వం హి సర్వతః || 43

దధీచుడు పలికెను -

దేవదేవా! మహాదేవా! వజ్రమువలె దృఢమగు ఎముకలను కలిగియుండుట, ఎవ్వరైననూ నన్ను సంహరింపలేక పోవుట, సర్వకాలములయందు దైన్యము లేకుండుట అను మూడు వరములను నాకు ఇమ్ము (43).

బ్రహ్మోవాచ |

తదుక్త వచనం శ్రుత్వా ప్రసన్నః పరమేశ్వరః | వరత్రయం దదౌ తసై#్మ దధీచాయ తథాస్త్వితి || 44

వరత్రయం శివాత్ర్పాప్య సానందశ్చ మహామునిః | క్షువస్థానం జగామాశు వేదమార్గే ప్రతిష్ఠితః || 45

ప్రాప్యా వధ్యత్వముగా త్స వజ్రాస్థిత్వమదీనతామ్‌ | అతాడయచ్చ రాజేంద్రం పాదమూలేన మూర్ధని || 46

క్షువో దధీచం వజ్రేణ జఘానోరస్యథో నృపః | క్రోధం కృత్వా విశేషేన విష్ణు గౌరవ గర్వితః || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

పరమేశ్వరుడు ఆతని మాటను విని ప్రసన్నుడై దధీచుని కొరకు 'తథాస్తు' అని పలికి ఆ మూడు వరములను ఇచ్చెను (44). వేద మార్గమునందు స్థిరమైన నిష్ఠగల ఆ మహాముని శివుని నుండి ఆ మూడు వరములను పొంది ఆనందించిన వాడై వెంటనే క్షువుడు ఉన్న స్థలమునకు వెళ్లెను (45). ఆతడు శివుని నుండి అవధ్యత్వము, వజ్రాస్థిత్వము, అదైన్యము అను మూడు వరములను పొంది ఆ మహారాజును అరికాలితో శిరస్సుపై తన్నెను (46). అపుడు క్షువమహారాజు విష్ణువు తనకు ఇచ్చిన ఆదరముచే గర్వితుడై గొప్ప క్రోధమును పొంది దధీచుని వక్షస్థ్సలమునందు వజ్రముతో కొట్టెను (47).

నా భూన్నాశాయ తద్వజ్రం దధీచస్య మహత్మనః | ప్రభావాత్పరమేశస్య ధాతృపుత్రో విసిస్మియే || 48

దృష్ట్వాప్య వధ్యత్వ మదీనతాం చ వజ్రస్య చాత్యంత పరప్రభావమ్‌ |

క్షువో దధీచస్య మునీశ్వరస్య విసిస్మియే చేతసి ధాతృపుత్రః || 49

ఆరాధయామాస హరిం ముకుంద మింద్రానుజం కానన మాశు గత్వా |

ప్రసన్న పాలం చ పరాజితో హి దధీచ మృత్యుంజయ సేవకేన || 50

పరమేశ్వరుని ప్రభావముచే ఆ వజ్రము మహాత్ముడగు దధీచుని నశింప జేయలేక పోయెను. బ్రహ్మపుత్రుడగు క్షువుడు అచ్చెరువందెను (48). వజ్రమునకు అతిశయించిన ప్రభావము గలదు. కాని దధీచి మహర్షి అవధ్యుడుగ, అదీనుడుగ నిలిచియుండుటను గాంచి బ్రహ్మపుత్రుడగు క్షువుడు మనస్సులో విస్మయమును పొందెను (49). మృత్యుంజయ జపము చేయు దధీచునిచే పరాజితుడైన ఆ క్షువుడు వెంటనే అడవికి పోయి, పాపములను పోగొట్టువాడు, ఇంద్రుని సోదరుడు, భక్తులను రక్షించువాడు అగు విష్ణువును ఆరాధించెను (50).

పూజయా తస్య సంతుష్టో భగవాన్మధుసూదనః | ప్రదదౌ దర్శనం తసై#్మ దివ్యం వై గరుడధ్వజః || 51

దివ్యేన దర్శనేవైవ దృష్ట్వా దేవం జనార్దనమ్‌ | తుష్టావ వాగ్భిరిష్టాభిః ప్రణమ్య గరుడధ్వజమ్‌ || 52

సంపూజ్య చైవం త్రిదశేశ్వరాద్యైః స్తుతం దేవ మజేయ మీశమ్‌ |

విజ్ఞాపయామాస నిరీక్ష్య భక్త్యా జనార్దనాయ ప్రణిపత్య మూర్ధ్నా|| 53

గరుడధ్వజుడగు మధుసూదనుడు ఆతని పూజచే సంతసించి ఆతనికి తన దివ్య దర్శనము నొసంగెను (51). గరుడధ్వజుడగు జనార్దన దేవుని దివ్యదర్శనమును పొందిన క్షువుడు ప్రణమిల్లి ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను (52). దేవతలచే, ఇంద్రాదులచే స్తుతింపబడు వాడు, అజేయుడు, సర్వరక్షకుడు అగు జనార్దన దేవుని ఈ తీరున పూజించి, ఆయనను దర్శించి, భక్తితో శిరసువంచి నమస్కరించి ఆతడు ఇట్లు విన్నవించుకొనెను (53).

రాజోవాచ |

భగవన్‌ బ్రాహ్మణః కశ్చిద్దధీచ ఇతి విశ్రుతః | ధర్మవేత్తా వినీతాత్మా సఖా మమ పురాభవత్‌ || 54

అవధ్య స్సర్వదా సర్వైశ్శంకరస్య ప్రభావతః | తమారాధ్య మహాదేవం మృత్యుంజయ మనామయమ్‌ || 55

సావజ్ఞం వామపాదేన మమ మూర్ధ్ని సదస్యపి | తాడయామాస వేగేన స దధీచో మహాతపాః || 56

ఉవాచ చ గర్వేణ న బిభేమీతి సర్వతః | మృత్యుంజయాప్త సువరో గర్వితో హ్యతులం హరే|| 57

క్షువ మహారాజు ఇట్లు పలికెను -

హే భగవన్‌! ధర్మములు తెలిసినవాడు, వినయముతో నిండిన మనస్సు గలవాడు, దధీచుడని పేరు బడిసినవాడు అగు ఒకానొక బ్రాహ్మణుడు నాకు పూర్వము మిత్రుడుగ నుండెడివాడు (54). మృత్యుంజయుడు, దోషరహితుడు, మహాదేవుడు అగు శంకరుని ఆరాధించి ఆతడు ఆ ప్రభావముచే సర్వకాలములయందు సర్వులకు వధింప శక్యము కాని వాడుగా అయినాడు (55). మహాతపస్వియగు ఆ దధీచి సభామధ్యమునందు అవమానకరముగా తన ఎడమకాలితో నా శిరస్సుపై వేగముగా తన్నెను (56). మరియు 'నేను మృత్యుంజయుని వద్దనుండి మంచి వరములను పొందియున్నాను గాన, నేను దేనికీ భయపడను ' అని ఆతడు గర్వముతో పలికెను. హే విష్ణో! ఆతడు అతిశయించిన గర్వము కలిగియున్నాడు (57).

బ్రహ్మోవాచ |

అథ ధ్యాత్వా దధీచస్య హ్యవధ్యత్వం మహాత్మనః | సస్మారాస్య మహేశస్య ప్రాభావమతులం హరిః || 58

ఏవం స్మృత్వా హరిః ప్రాహ క్షువం విధిసుతం ద్రుతమ్‌ | విప్రాణాం నాస్తి రాజేంద్ర భయమణ్వపి కుత్రచిత్‌ || 59

విశేషాద్రుద్ర భక్తానాం భయం నాస్తి చ భూపతే | దుఃఖం కరోతి విప్రస్య శాపార్థం ససురస్య మే || 60

భవితా తస్య శాపేన దక్షయజ్ఞే సురేశ్వరాత్‌ | వినాశో మమ రాజేంద్ర పునరుత్థానమేవ చ || 61

బ్రహ్మఇట్లు పలికెను -

అపుడు మహాత్ముడగు దధీచుని ఎవ్వరైననూ సంహరించలేరను సత్యమును భావన చేసిన శ్రీహరి మహేశ్వరుని సాటిలేని మహిమను స్మరించుకొనెను (58). ఇట్లు స్మరించి శ్రీహరి బ్రహ్మపుత్రుడగు క్షువునితో వెంటనే ఇట్లనెను; ఓ రాజా శ్రేష్ఠా! బ్రాహ్మణులకు ఎచటనైననూ లేశ##మైననూ భయము లేదు (59). ఓ రాజా! ప్రత్యేకించి రుద్రభక్తులకు భయము లేనే లేదు. ఆ బ్రాహ్మణునకు దుఃఖమును కలిగించినచో, ఆతడు దేవతనగు నాకు కూడ శాపము నీయగల్గును (60). ఆయన శాపముచే దక్షయజ్ఞములో దేవదేవుడగు శివుని వలన నాకు వినాశము కలుగును. ఓ రాజేంద్రా! నాకు మరల అభివృద్ధి కూడ కలుగ గలదు (61).

తస్మాత్సమేత్య రాజేంద్ర సర్వయత్నో న భూయతే | కరోమి యత్నం రాజేంద్ర దధీచ విజయాయ తే || 62

శ్రుత్వా వాక్యం క్షువః ప్రాహ తథాస్త్వితి హరేర్నృపః | తస్థా తత్రైవ తత్కామోత్సుక మానసః || 63

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే క్షువ దధీచి వాద వర్ణనం నామాష్ట త్రింశోధ్యాయః (38).

ఓ రాజేంద్రా! కావున నేను నీతో కలిసి సర్వయత్నములు చేసిననూ వ్యర్థము. నీకు దధీచిపై విజయము లభించుటకై నేనే యత్నించెదను (62). విష్ణువు యొక్క ఈ మాటను విని క్షువ మహారాజు 'సరే' అనెను. ఆ కోరిక (దధీచిపై విజయము) యందు ఉత్కంఠతో గూడిన మనస్సు గల క్షువుడు విష్ణువుయందలి ప్రీతితో అచటనే ఉండెను (63).

శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో క్షువ దధీచి వివాద వర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).

Sri Sivamahapuranamu-I    Chapters