Sri Sivamahapuranamu-I    Chapters   

అథ నవమోsధ్యాయః

శివరాత్రి - అరుణాచలము

నందికేశ్వర ఉవాచ |

తత్రాంతరే తౌ చ నాథం ప్రణమ్య విధిమాధవౌ | బద్ధాంజలిపుటౌ తూష్ణీం తస్థతుర్దక్షవామగౌ || 1

తత్ర సంస్థాప్య తౌ దేవం సకుంటుంబం వరాసనే | పూజయామాసతుః పూజ్యం పుణ్యౖః పురుషవస్తుభిః || 2

పౌరుషం ప్రాకృతం వస్తు జ్ఞేయం దీర్ఘాల్పకాలికమ్‌ | హారనూపుర కేయూర కిరీట మణికుండలైః || 3

యజ్ఞ సూత్రోత్తరీయ స్రక్‌ క్షౌమ మాల్యాంగులీయకైః | పుష్పతాంబూల కర్పూర చందనాగురు లేపనైః || 4

ధూప దీప సితచ్ఛత్ర వ్యజన ధ్వజచామరైః | అన్యైర్ది వ్యోపహారైశ్చ వాఙ్మనో తీతవైభ##వైః || 5

పతియోగ్యైః పశ్వలభ్యైస్తౌ సమర్చయతాం పతిమ్‌ | యద్యచ్ఛ్రైష్ఠతమం వస్తు పతియోగ్యం హితత్‌ ద్విజాః || 6

నందికేశ్వరుడిట్లు పలికెను-

ఆ సమయములో బ్రహ్మ విష్ణువులు ప్రభువగు శివునకు దోసిలి యొగ్గి నమస్కిరించి, నిశ్శబ్దముగా కుడి ఎడమల యందు నిలబడిరి (1). మరియు, శ్రేష్ఠమగు ఆసనముపై పూజనీయుడగు శివుని దేవితో సహా కుర్చుండబెట్టి, పవిత్రమగు పురుషవస్తువులతో పూజించిరి (2). దీర్ఘకాలము స్థిరముగ నుండునవి పురుష వస్తువలనియు, కొద్దికాలము మాత్రమే మనగల్గునవి ప్రాకృతములనియు తెలియవలెను. హారములు, నూపురములు, కేయూరములు, కిరీటము, మణికుండములు (3), యజ్ఞోపవీతము, ఉత్తరీయము, పట్టు వస్త్రములు, పుష్పమాలలు, ఉంగరములు, పుష్పములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరుపూత (4), ధూపము, దీపము, తెల్లని గొడుగు, వింజామరలు, ధ్వజము మొదలగు దివ్యములగు వస్తువులతో (5), వారిద్దరు పశుపతిని పూజించిరి. ఆ వస్తువుల వైభవము వాక్కునకు, మనస్సునకు కూడ అందదు. పశుపతికి అర్హములైన ఆ వస్తువులు జీవులకు పొంద శక్యము కానివి. ఓ ద్విజులారా! సర్వ శ్రేష్ఠమగు వస్తువు లన్నియూ పశుపతికి సమర్పింపదగినవి గదా! (6).

తద్వస్త్వఖిల మీశోsపి పారంపర్య చికీర్షయా | సభ్యానాం ప్రదదౌ హృష్టః పృథక్‌ తత్ర యథాక్రమమ్‌ || 7

కోలాహలో మహానాసీత్తత్ర తద్వస్తు గృహ్ణతామ్‌ | తత్రైవం బ్రహ్మ విష్ణుభ్యాం చార్చితశ్శంకరః పురా || 8

ప్రసన్నః ప్రాహ తౌ నమ్రౌ సస్మితం భక్తి వర్ధనః |

ఈశ్వరుడు సంతసించి పరంపరను నిర్మించు కోరికతో ఆ వస్తువుల నన్నిటినీ సభ్యులకు క్రమముగా ఇచ్చివేసెను (7). వాటిని దేవతలు స్వీకరించుచుండగా పెద్ద కోలాహలము చెలరేగెను. ఈ విధముగా ఆనాడు ఆ సభలో బ్రహ్మ విష్ణువులచే పూజింపబడిన శివుడు (8), ప్రసన్నుడై, భక్తిని పెంపొందిచంచుచూ, వినీతులగు వారిద్దరినీ ఉద్దేశించి, చిరునవ్వుతో నిట్లనెను.

ఈశ్వర ఉవాచ |

తుష్టోsహ మద్య వాం వత్సౌ పూజయాsస్మిన్మహాదినే || 9

దినమేతత్తతః పుణ్యం భవిష్యతి మహత్తరమ్‌ | శివరాత్రిరితి ఖ్యాతా తిథిరేషా మమ ప్రియా || 10

ఏతత్కాలే తు యః కుర్యాత్పూజాం మల్లింగ బేరయోః | కుర్యాత్తు జగతః కృత్యం స్థితి సర్గాదికం పుమాన్‌ || 11

శివరాత్రావహోరాత్రం నిరాహారో జితేంద్రియః | అర్చయేద్వా యథాన్యాయం యథాబల మవంచకః || 12

ఈశ్వరుడిట్లు పలికెను -

కుమారులారా! మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని (9). ఈ దినము చాల గొప్పది. పవిత్రమైనది. ఈ దినము శివరాత్రి యని పేరు గాంచగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది (10). ఈ తిథినాడు నా మూర్తిని, లింగమును పూజించు వ్యక్తి జగత్తు యొక్క సృష్టిస్థితి లయములను చేయగల్గునంతటి సమర్థుడగును.(11). శివరాత్రినాడు మానవుడు ఉపవసించి, జితేంద్రియుడై, యథాశాస్త్రముగా, యథాశక్తిగా, శక్తివంచన లేకుండగా నన్ను ఆరాధించవలెను (12).

యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరమ్‌ | తత్ఫలం లభ##తే సద్య శ్శివరాత్రౌ మదర్చనాత్‌ || 13

మద్ధర్మవృద్ధి కాలోsయం చంద్రకాల ఇవాంబుధేః | ప్రతిష్ఠాద్యుత్సవో యత్ర మామకో మంగలాయనః || 14

యత్పునః స్తంభరూపేణ స్వావిరాసమహం పూరా | స కాలో మార్గశీర్షే తు స్యాదార్ద్రా ఋక్ష మర్భకౌ || 15

ఆర్ద్రాయాం మార్గశీర్షే తు యః పశ్యేన్మాముమా సఖమ్‌ | మద్బేరమపి వా లింగం స గుహాదపి మే ప్రియః || 16

అలం దర్శనమాత్రేణ ఫలం తస్మిన్‌ దినే శుభే | అభ్యర్చనం చేదధికం ఫలం వాచామగోచరమ్‌ || 17

శివరాత్రినాడు నన్ను అర్చించుట వలన, ఒక సంవత్సరకాలము నిరంతరముగా నన్ను అర్చించిన ఫలము లభించును (13). చంద్రోదయ వేళ సముద్రము ఉప్పొంగినట్లు, శివరాత్రినాడు నా ధర్మము వర్థిల్లును. ఆ సమయములో నా ప్రతిష్ఠ మొదలగు ఉత్సవముల వలన సమస్త మంగళములు కలుగును (14). మరియు, ఓ కుమారులారా! నేను పూర్వము ఆర్ద్రా నక్షత్రయుక్త మార్గశీర్ష పూర్ణిమ నాడు స్తంభాకారముగా ఆవిర్భవించితిని (15). మార్గశీర్ష మాసములో ఆర్ద్రా నక్షత్రము నాడు పార్వతీ సమేతుడనగు నా మూర్తిని, మరియు లింగమును దర్శించువాడు నాకు కుమారస్వామి కంటె అధికప్రీతి పాత్రుడగును (16). ఆ శుభదినమున దర్శన మాత్రము చేతనే మహాఫలము లభించును. ఆనాడు అర్చన కూడ చేసినచో లభించు అధికఫలమును వర్ణించుటకు మాటలు చాలవు (17).

రణరంగతలేsముష్మిన్‌ యదహం లింగవర్ష్మణా | జృంభితో లింగవత్తస్మాల్లింగ స్థా నమిదం భ##వేత్‌ || 18

అనాద్యంతమిదం స్తంభమణు మాత్రం భవిష్యతి | దర్శనార్థం హి జగతాం పూజనార్థం హి పుత్రకౌ || 19

భోగవహమిదం లింగం భుక్తి ముక్త్యేకసాధనమ్‌ | దర్శన స్పర్శన ధ్యానాజ్జంతూనాం జన్మమోచనమ్‌ || 20

అనలాచల సంకాశం యదిదం లింగముత్థితమ్‌ | అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతి మేష్యతి|| 21

అత్ర తీర్థం చ బహుధా భవిష్యతి మహత్తరమ్‌ | ముక్తిరప్యత్ర జంతూనాం వాసేన మరణన చ || 22

నేనీ యుద్ధ స్థలము నందు లింగాకారముగా ఆవిర్భవించినాను గనుక, ఈ స్థానము లింగస్థానము అని ప్రసిద్ధి గాంచును(18). ఓ పుత్రులారా! ఆద్యంతములు లేని ఈ స్తంభము లోకుల దర్శనమునకు, పూజకు అనుకూలముగ నుండుటకై చిన్నది కాగలదు (19). ఈ లింగము మానవులకు భోగముల నిచ్చును. భుక్తికి, ముక్తికి ఇదియే ఏకైక సాధనము. దీనిని దర్శించి, స్పృశించి, ధ్యానించు వారలకు పునర్జన్మ ఉండదు (20). ఈ లింగము అగ్ని పర్వతము వలె ఉద్భవించుట వలన, దీనికి అరుణాచలము అను పేరు ఖ్యాతిగాంచును (21). ఇచట గొప్ప తీర్థము నిర్మాణమగును. ఇచట నివసించి, మరణించు మానవులకు ముక్తి లభించును (22).

రథోత్సవాది కల్యాణం జనవాసం తు సర్వతః | అత్ర దత్తం హుతం జప్తం సర్వం కోటిగుణం భ##వేత్‌ || 23

మత్‌ క్షేత్రాదపి సర్వస్మాత్‌ క్షేత్రమేతన్మహత్తరమ్‌ | అత్ర సంస్మృతి మాత్రేణ ముక్తిర్భవతి దేహినామ్‌ || 24

తస్మాన్మహత్తర మిదం క్షేత్ర మత్యంతశోభనమ్‌ | సర్వ కల్యాణ సంపూర్ణం సర్వ ముక్తి కరం శుభమ్‌ || 25

అర్చయిత్వాత్ర మామేవ లింగే లింగిన మీశ్వరమ్‌ | సాలోక్యం చైవ సామీప్యం సారూప్యం సార్ఘి రేవ చ || 26

సాయుజ్యమితి పంచైతే క్రియాదీనాం ఫలం మతమ్‌ | సర్వేపి యూయం సకలం ప్రాప్స్యథాశు మనోరథమ్‌ || 27

ఇచట రథోత్సవము మొదలగు మంగళకార్యములు జరుగును. ఇచట అంతటా జనులు నివసింతురు. మరియు, ఇచట చేసిన దాన, హోమ, జపములకు కోటి రెట్లు ఫలము లభించును (23). నా క్షేత్రములలో కెల్లా ఇది గొప్పది కాగలదు. ఇచట నన్ను స్మరించినంత మాత్రాన మానవుడు ముక్తిని పొందును (24). కావున, ఈ అతి సుందరమగు క్షేత్రము మిక్కిలి శ్రేష్ఠమైనది; సర్వ మంగళములతో నిండినది; సర్వులకు శుభములను,ముక్తిని ఒసగునది (25). ఇచట లింగాకారముగా ఆవిర్భవించిన నన్ను అర్చించినచో, సాలోక్యము (కైలాసప్రాప్తి), సామీప్యము (ఈశ్వరుని సమీప్యము నందుండుట), సారూప్యము (ఈశ్వరుని పోలిన రూపమును కలిగియుండుట), సార్షి (ఈశ్వరునితో సమమగు శక్తిని కలిగియుండుట) (26), మరియు సాయుజ్యము (ఈశ్వరునిలో ఐక్యమగుట) అనే ఐదు విధముల కర్మఫలము లభించును. మీరందరు మీకు నచ్చిన మనోరథములను వెనువెంటనే పొందెదరు గాక! (27)

నందికేశ్వర ఉవాచ |

ఇత్యనుగృహ్య భగవాన్‌ వినీతౌ విధి మాధవౌ | యత్పూర్వ ప్రహతం యుద్ధే తయోసై#్సన్యం పరస్పరమ్‌ || 28

తదుత్థాపయదత్యర్థం స్వశక్త్యాsమృతధారయా | తయోర్మౌఢ్యం చ వైరం చ వ్యపనేతుమువాచ తౌ || 29

సకలం నిష్కలం చేతి స్వరూప ద్వయమస్తిమే | నాన్యస్య కస్య చిత్త స్మాదన్య స్సర్వోsప్యనీశ్వరః || 30

పురస్తాత్‌ స్తంభరూపేణ పశ్చాద్రూపేణ చార్భకౌ | బ్రహ్మత్వం నిష్కలం ప్రోక్తమీశత్వం సకలం తథా || 31

ద్వయం మమైవ సంసిద్ధం న మదన్యస్య కస్యచిత్‌ | తస్మాదీశత్వమన్యేషాం యువయోరపి న క్వచిత్‌ || 32

నందికేశ్వరుడిట్లు పలికెను-

భగవాన్‌ శంకరుడు బ్రహ్మ విష్ణువుల నీ విధముగా అనుగ్రహించి, అంతకు ముందు జరిగిన యుద్ధములో ప్రాణములను కోల్పోయిన వారిద్దరి సైనికులను (28), అమృతధారా రూపమగు తన శక్తితో లేచి నిలబడునట్లు చేసెను. శంకరుడు వారిద్దరి మూర్ఖత్వమును, శత్రుత్వమును తొలగింపబూని, వారితో నిట్లనెను (29). నాకు రెండు రూపములు గలవు. ఒకటి సాకారము కాగా, మరియొకటి నిరాకారము. ఇట్టి రెండు రూపములు మరెవ్వరికీ లేవు. కాన, వేరెవ్వరూ ఈశ్వరులు కారు (30). ఓ కుమారులారా!నేను ముందుగా స్తంభరూపముగను, తరువాత సాక్షాద్రూపముగను ఆవిర్భవించితిని. బ్రహ్మభావము నిరాకారము. ఈశ్వర తత్త్వము సాకారము (31). ఈ రెండు నాకు మాత్రమే సిద్ధించి యున్నవి. నా కంటె వేరుగా మరియొకనికి ఈ రెండు స్వరూపములు లేవు. కనుక, ఇతరులకు గాని, మీ ఇద్దరికి గాని ఈశ్వరత్వము లేదు (32).

తదజ్ఞానేన వాం వృత్తం ఈశమానం మహాద్భుతమ్‌ | తన్నిరాకర్తు మత్రైవముత్థితోsహం రణక్షితౌ || 33

త్యజతం మానమాత్మీయం మయీశే కురు తం మతిమ్‌ | మత్ర్పసాదేన లోకేషు సర్వోsప్యర్థః ప్రకాశ##తే || 34

గురూక్తి ర్వ్యంజకం తత్ర ప్రమాణం వా పునః పునః | బ్రహ్మ తత్త్వ మిదం గూఢం భవత్ర్పీత్యా భణామ్యహమ్‌ || 35

అహమేవ పరం బ్రహ్మ మత్స్వరూపం కలాకలమ్‌ | బ్రహ్మత్వా దీశ్వరశ్చాహం కృత్యం మేనుగ్రహాదికమ్‌ || 36

బృహత్త్వాద్బృంహణత్వాచ్చ బ్రహ్మాహం బ్రహ్మకేశవౌ | సమత్వా ద్వ్యాపకత్వాచ్చ తథైవాత్మహ మర్భకౌ || 37

కాన మీ ప్రవర్తన అజ్ఞాన జనితము.'నేను ఈశుడను' అను గర్వము మీకు కలుగుటయే గొప్ప ఆశ్చర్యము. ఈ గర్వమును తొలగించుట కొరకై నేనిచట రణరంగము నందు ఆవిర్భవించితిని (33). మీరీ గర్వమును వీడి, ఈశుడనగు నన్ను ధ్యానించుడు. ఈ లోకములో సర్వ పదార్థములు నా అనుగ్రహము చేతనే ప్రకాశించుచున్నవి (34). గురువచనము ఈ సత్యమునే బోధించుచున్నది. ఇదియే ప్రామాణిక వచనము. ఈ బ్రహ్మతత్త్వము రహస్యము. నేను దీనిని మీయందలి ప్రీతి వలన చెప్పుచున్నాను (35). పరబ్రహ్మ నేనే. నాస్వరూపము సాకారము, నిరాకారము కూడా. పరబ్రహ్మను నేనే; ఈశ్వరుడను నేనే. అనుగ్రహము, సృష్టి ఇత్యాది జగత్కార్యమును చేయునది నేనే (36). బ్రహ్మ విష్ణువులారా! సర్వము కంటె పెద్దవాడను అగుటచేతను, సర్వమును వ్యాపించుట చేతను, నాకు బ్రహ్మ అని పేరు. కుమారులారా! సర్వులలో ఏకరూపముగ వ్యాపించియుండటచే నాకు ఆత్మ యని పేరు (37).

అనాత్మనః పరే సర్వే జీవా ఏవన సంశయః | అనుగ్రహాంతం సర్గాద్యం జగత్‌ కృత్యం చ పంచకమ్‌ || 38

ఈశత్వాదేవ మే నిత్యం న మ దన్యస్య కస్య చిత్‌ | అదౌ బ్రహ్మత్వ బుద్ధ్యర్థం నిష్కలం లింగముత్థితమ్‌ || 39

తస్మాదజ్ఞాతమీశత్వం వ్యక్తం ద్యోతయితుం హి వామ్‌ | సకలోsహమతో జాతస్సాక్షాదీశస్తు తత్‌ క్షణాత్‌ || 40

సకలత్వమతో జ్ఞేయ మీశత్వం మయి సత్వరమ్‌ | యదిదం నిష్కలం స్తంభం మమ బ్రహ్మత్వ బోధకమ్‌ || 41

ఇతరులందరు అనాత్మలు, జీవులు అనుటలో సందియము లేదు. సృష్టి మొదలు అనుగ్రహము వరకు గల పంచ విధి జగత్కార్యము (38). ఈశుడనగు నా యందు నిత్యముగ నుండును. నాకంటె వేరుగా మరియొకనికి ఈ ఐదు కర్మలే లేవు. ముందుగా బ్రహ్మభావనను బుద్ధియందు కలిగించుటకై నేను నిరాకార లింగరూపముగా ఆవిర్భవించితిని (39). కాని, లింగదర్శనము వలన మీకు నా ఈశ్వరభావము తెలియకుండును గాన, సాక్షాత్తుగా ఈశుడనగు నేను వెనువెంటనే మీ ముందు సాకారముగా ప్రత్యక్షమైతిని (40). సాకారుడనగు నేను ఈశుడనని తెలియుడు. ఈ నిరాకారస్తంభము నా బ్రహ్మభావమును బోధించును (41).

లింగలక్షణ యుక్తత్వాన్మమ లింగం భ##వేదిదమ్‌ | తదిదం నిత్యమభ్యర్చ్యం

యువాభ్యామత్ర పుత్రకౌ || 42

మదాత్మక మిదం నిత్యం మమ సాన్నిధ్య కారణమ్‌ | మహత్పూజ్యమిదం నిత్యమభేదాల్లింగలింగినోః || 43

యత్ర ప్రతిష్ఠితం యేన మదీయం లింగమీదృశమ్‌ | తత్ర ప్రతిష్ఠితస్సోsహ మప్రతిష్ఠోsపి వత్సకౌ || 44

మత్సామ్యమేక లింగస్య స్థాపనే ఫలమీరితమ్‌ | ద్వితీయే స్థాపితే లింగే మదైక్యం ఫలమేవ హి || 45

లింగం ప్రాధాన్యతః స్థాప్యం తథా బేరం తు గౌణకమ్‌ | లింగాభావే న తత్‌ క్షేత్రం సబేరమపి సర్వతః || 46

ఇతి శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం నవమోsధ్యాయః || (9)

ఈ స్తంభము లింగాకారముగా నున్నది గనుక, లింగమే యగును. పుత్రులారా! మీరిద్దరు దీనిని నిత్యము అర్చించుడు (42). లింగము నా స్వరూపమే. లింగ సన్నిధి నా సన్నిధియే. ఈ మహాలింగమును నిత్యము పూజించవలెను. నాకు, లింగమునకు భేదము లేదు (43). వత్సలారా! నేను నిరాశ్రయుడనే, అయిననూ, ఇట్టి లింగము ప్రతిష్ఠింబడినచోట నేను కూడ స్థిరముగ నుందును (44). ఒక లింగమును స్ధాపించిన వానికి సారూప్యము అను మోక్షము ఫలము. అదే వ్యక్తి రెండవ లింగమును కూడ స్థాపించినచో, సాయుజ్యమను మోక్షమును పొందును (45). సర్వత్రా లింగమును ప్రధానముగను, మూర్తిని అప్రధానముగను స్థాపించవలెను. మూర్తి ఉన్ననూ, లింగము లేనిచో, అది క్షేత్రము కానేరదు (46).

శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.

Sri Sivamahapuranamu-I    Chapters