Sri Sivamahapuranamu-I    Chapters   

అథ తృతీయో ధ్యాయః

దేవీస్తుతి

నారద ఉవాచ|

విధేప్రాజ్ఞ మహాధీమన్‌ పద మే వదతాం వర | తతః వరం కిమభవచ్చరితం విష్ణుసద్గురో||1

అద్భుతేయం కథా ప్రోక్తా మేనా పూర్వ గతి శ్శుభా| వివాహశ్చ శ్రుతస్సమ్యక్‌ పరమం చరితం పద||2

మేనాం వివాహ్య స గిరిః కృతవాన్‌ కిం తతః పరమ్‌| పార్వతీ కథముత్పన్నా తస్యాం వై జగదంబికా||3

తతస్సుదుస్సమం కృత్వా కథం ప్రాప పతిం హరమ్‌ | ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరాచ్ఛాంకరం యశః|| 4

నారదడిట్లు పలికెను-

ఓ బ్రహ్మా ! నీవు ప్రాజ్ఞుడువు, మహాధీమంతుడవు. వక్తలలో శ్రేష్ఠుడవు. విష్ణువు సద్గురువుగా గలవాడవు. తరువాత జరిగిన వృత్తాంతమును నాకు చెప్పుము(1) శుభకరము, అద్భుతము అగు ఈ మేనకా పూర్వచరిత్రను చెప్పి యుంటిని ఆమె వివామమును గురించి కూడ వింటిని. తరువాత చరితమును చెప్పుము(2) ఆ హిమవంతుడు మేనను వివాహమాడిన పిదప ఏమి చేసెను? ఆమె యందు జగన్మాత యగు పార్వతి జన్మించి వృత్తాంతమెట్టిది?(3) తరువాత ఆమె దుష్కరమగు తపస్సును చేసి శివుని పొందిన తీరు ఎట్టిది? శివుని యశస్సును వర్ణించే ఈ వృత్తాంము నంతనూ విస్తరముగా చెప్పుము(4)

బ్రహ్మోవాచl

మునే త్వం శృణు సుప్రీత్యా శాంకరం సుయశశ్శుభమ్‌| యచ్ఛ్రు త్వా బ్రహ్మహా శుధ్యేత్సర్వాన్‌ కామానవాప్ను యాత్‌||5

యదా మేనా వివాహం తు కృత్వాగచ్ఛ ద్గిరే ర్గృహమ్‌| తదా సముత్సవో జాతస్త్రిషు లోకేషు నారద|| 6

హిమాచలోపి సుప్రీతశ్చ కార పరమోత్సవమ్‌ | భూసురాన్‌ బంధువర్గాంశ్చ పరానానర్చ సద్ధియా||7

సర్వే ద్విజాశ్చ సంతుష్టా దత్త్వాశీర్వచనం వరమ్‌| యుయుస్తసై#్మ స్వస్వధామ బంధువర్గాస్తథాపరే|| 8

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ మహర్షీ! శంకరుని శుభకరమగు పుణ్యకీర్తిని మిక్కిలి ప్రీతితో వినుము. ఈ కీర్తిని విన్నచో బ్రహ్మ హత్య చేసివాడైననూ పవిత్రుడై సమస్త కామనలను పొందును(5) ఓ నారదా! మేన హిమవంతుని వివాహమాడి ఆయన గృహమునకు వెళ్ళినప్పుడు ముల్లోకములలో గొప్ప ఉత్సవము జరిగెను(6). హిమవంతుడు కూడ మిక్కిలి ఆనందించి గొప్పవేడుకలను జరిపించి, బ్రాహ్మణులను బంధువులను మరియు ఇతరులను మంచి మనస్సుతో పూజించెను(7) బ్రాహ్మణులు, బంధువులు మరియు ఇతరులు అందదరు సంతసించి మహదాశీర్వచనములను ఆ హిమవంతునకు ఇచ్చి తమ తమ స్థానములకు మరలి వెళ్ళిరి(8)

హిమాచలోపి సుప్రీతో మేనయా సుఖదే గృహే| రేమేన్యత్ర చ సుస్థానే నందనాది వనేష్వపి||9

తస్మిన్నవసరే దేవా మునే విష్ణ్వా దయోఖిలాః | మునయశ్చ మహాత్మానః ప్రజగ్ము ర్భూధరాంతికే||10

దృష్ట్వా తానాగతాన్దేవాన్‌ ప్రణనామ ముదా గిరిః | సమ్మానం కృతవాన్‌ భక్త్వాప్రశంసన్‌ స్వవిధిం మహాన్‌||11

సాంజలిర్నతశీర్షో హి స తుష్టావ సుభక్తితః | రోమోద్గమో మహానాసీద్గిరేః ప్రేమాశ్రవో పతన్‌||12

తతః ప్రణమ్య సుప్రీతో హిమశైలః ప్రసన్నధీః | ఉవాచ ప్రణతో భూత్వా మునే విష్ణ్వాదికాన్‌ సురాన్‌|| 13

హిమవంతుడు కూడ మిక్కిలి ఆనందించినవాడై మేనతో గూడి సకల సుఖములు గల గృహమునందు మాత్రమే గాక, నందనవనము ఇత్యాది సుందర ప్రదేశముల యందు గూడ రమించెను(9) ఆ సమయములో విష్ణువు మొదలగు గల సర్వదేవతలు, మరియు మహాత్ములగు మునులు హిమవంతుని వద్దకు వెళ్ళిరి(10). వచ్చినవారి నందరిని చూచి మహాత్ముడగుహిమవంతుడు తన భాగ్యమును కొనియాడి ఆనందముతో వారకి ప్రణమిల్లి భక్తితో వారిని సన్మానించెను(11). అతడు భక్తితో దోసిలి యొగ్గి శిరసు వంచి స్తుతించెను ఆ పర్వతునకు ఆనందముచే గొప్ప గగుర్పాటు కలుగటయే గాక, ఆనందబాష్పములు రాలెను(12) అపుడు ప్రసన్నమగు మనస్సు గల హిమవంతుడు గొప్ప ఆనందముతో ప్రణమిల్లెను. ఓ మహర్షీ! అతడు అపుడు ప్రణమిల్లిన పిదప, విష్ణువు మొదలుగా గల దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను(13)

హిమచల ఉవాచ|

అద్యమేసఫలం జన్మ సుమహత్తపః| అద్యమే సఫలం జ్ఞాన మద్య మే సఫలాః క్రియాః||14

ధన్యోహమద్య సంజాతో ధన్యా మే సకలా క్షితిః| ధన్యం కులం తథా దారా స్సర్వం ధన్యం సంశయః||15

యతస్సమాగతా యూయం మిలిత్వా సర్వ ఏకదా| మాం నిదేశయత ప్రీత్యోచితం మత్వా స్వసేవకమ్‌||16

హిమవంతుడిట్లు పలికెను-

ఈనాడు నా పుట్టుక సఫలమైనది నేను చేసిన గొప్ప తపస్సు ఫలించినది. ఈనాడు నా జ్ఞానము సార్థకమైనది. ఈనాడు నేను చేసిన పుణ్యకర్మలు ఫలమునిచ్చినవి(14) నేనీనాడు ధన్యుడనైతిని. నా భూభాగమంతయూ ధన్యమైనది మరియు కులము, భార్య మరియు సర్వము ధన్యమైనదనుటలో సందియుము లేదు(15) కారణమేమనగా, మీ సేవకునిగా తలంచి ప్రీతితో ఉచితమగు తీరున నన్ను కార్యమునందు నియోగించుడు(16)

బ్రహ్మోవాచl

ఇతి శ్రుత్వా మహీధ్రస్య వచనం తే సురాస్తదా| ఊచుర్హర్యాదయః ప్రీతాస్సిద్ధిం మత్వా స్వకార్యతః||17

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటను విని విష్ణువు మొదలగు ఆ దేవతలు అపుడు తమ కార్యము సిద్దించినదని తలంచి సంతసించినవారై, ఇట్లు పలికిరి(17)

దేవా ఊచుః|

హిమాచల మహాప్రాజ్ఞ శృణ్వస్మద్వచనం హితమ్‌| యదర్ధమా గతాస్సర్వే తద్బ్రూమః ప్రీతితో వయమ్‌||18

యా పురా జగదం బోమా దక్ష కన్యాభవద్గిరే| రుద్రపత్నీ హి సా భూత్వా చిక్రీడే సుచిరం భువి|| 19

పితృతోనాదరం ప్రాప్య సంస్మృత్య స్వపణం సతీ| జగామ స్వపదం త్యక్త్వా తచ్ఛరీరం తదాంబికా||20

సా కథా విదితా లోకే తవాపి హిమ భూధర| ఏవం పతి మమాలాభో భ##వే ద్దేవగణస్య హి||21

సర్వస్య భవతశ్చాపి స్యుస్సర్వే తే వశే సురాః||22

దేవతలిట్లు పలికిరి-

ఓయీ హిమవంతా| మహాప్రాజ్ఞా| మేము చెప్పే హితకరమగు వచనమును వినుము మేమందరము ఏ పని కొరకు వచ్చితిమో, దానిని ప్రీతితో చెప్పెదము(18) ఓ పర్వతరాజా| జగన్మాతయగు ఉమ పూర్వము దక్షుని కుమార్తె యై జన్మించి, రుద్రనకు భార్యయై చిరకాలము భూమండలమునందు క్రీడించెను(19) ఆ సతీదేవి తండ్రిచే అవమానింపబడి తన ప్రతిజ్ఞను గుర్తునకు తెచ్చుకొనెను. అపుడా జగన్మాత ఆ దేహమును త్యజించి తన ధామమునకు వెళ్ళెను(20) ఓ హిమగిరీ! ఆ కథ లోకములో ప్రసిద్ధి గాంచినది. నీకు కూడా ఆ గాథ తెలియును. ఇట్లు అయినచో, దేవతలకందరికి గొప్ప లాభము ఒనగూరును(21) మరియు నీకు కూడ గొప్ప ప్రయోజనము చేకూరును దేవతలందరు నీకు వశవర్తులై ఉండగలరు(22)

బ్రహ్మోవాచl

ఇత్యాకర్ణ్య వచస్తేషాం హర్యాదీనాం గిరీశ్వరః | తథాస్త్వితి ప్రసన్నాత్మా ప్రోవాచ స చ సాదరమ్‌||23

అథతే చ సమాదిశ్య తద్విధిం పరమాదరాత్‌| స్వయం జుగ్ముశ్చ శరణ ముమాయా శ్శంకరస్త్రియః ||24

సుస్థలే మనసా స్థిత్వా నస్మరుర్జగదంబికామ్‌| ప్రణమ్య బహుశస్త్ర తుష్టువుశ్శ్రద్ధయా సురాః ||25

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ పర్వతరాజు విష్ణువు మొదలుగా గల ఆ దేవతల మాటలను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై అదరముతో అటులనే అగు గాక! అని పలికెను(23) అపుడు వారు మిక్కిలి అదరముతో ఆ విధివిధానము నంతయు హిమవంతునకు భోదించి తాయుమ శంకరపత్నియగు ఉమాదేవిని శరణము జొచ్చిరి(24). వారు మంచి స్థలములో నిలబడి మనస్సులో ఆ జగన్మాతను స్మరించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి శ్రద్ధతో స్తుతించిరి(25)

దేవా ఊచుః|

దేవ్యుమే జగతామంబ శివలోక నివాసిని| సదాశివ ప్రియే దుర్గే త్వాం నమామో మహేశ్వరి||26

శ్రీ శక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమపావనీమ్‌| వయం నమామమే భక్త్వా మహ దవ్యక్తరూపిణీమ్‌||27

శివాం శివకరాం శుద్ధాం స్థూలాం సూక్ష్మాం పరాయణామ్‌| అంతర్విద్యాసువిద్యాభ్యాం

సుప్రీతాం త్వాం నమామహే|| 28

త్వం శ్రద్ధా త్వం ధృతిస్త్వం శ్రీస్త్వమేవ సర్వగోచరా| త్వం దీధితి స్సూర్యగతా స్వప్రపంచ ప్రకాశినీ|| 29

దేవతలిట్లు పలికిరి-

ఓ ఉమాదేవీ! జగన్మాతా! దుర్గా! మహేశ్వరి! సదాశివునకు ప్రియురాలనవై శివలోకము నందు నివసించు నీకు నమస్కారము (26). పవిత్రము చేయునది. శాంతిస్వరూపురాలు, పుష్టిని కలిగించునది, మహత్తు, ప్రకృతి స్వరూపముగా గలది అగు శ్రీ శక్తిని మేము భక్తితో నమస్కరించుచున్నాము(27) మంగళ స్వరూపురాలు, మంగళమునిచ్చునామె, శుద్ధ, స్థూలరూపిణి(కార్య రూపిణ) సూక్ష్మ (కారణ) రూపిణీ, సర్వశ్రేష్ఠ లక్ష్యము, అంతర్ముఖత్వముచే మరియు అధ్యాత్మ విద్యచే మిక్కలి ప్రీతిని పొందునది అగు నిన్ను నమస్కరించు చున్నాము(28). శ్రద్ధ నీవే, ధైర్యము నీవే, సర్వ ప్రాణములలోని శోభ నీవే. సూర్యుని యందలి ప్రకాశమునీవే. నీ స్వరూపమగు ప్రపంచమును నీవే ప్రకాశింప జేయుచున్నావు(29)

యా చ బ్రహ్మాండసంస్థానే జగజ్జీవేషు యా జగత్‌ | అప్యాయయతి బ్రహ్మాదితృణాంతం తాం నమామహే||30

గాయత్రీం త్వం వేదమాతా త్వం సావిత్రీ సరస్వతీ| త్వం వార్తా సర్వ జగతాం త్వ త్రయీ ధర్మరూపిణీ||31

నిద్రా త్వం సర్వభేతేషు క్షుధా తృప్తిస్త్వ మేవ హి| తృష్ణా కాంతి శ్చవిస్తుష్టి స్సర్వానందకరీ సదా||32

త్వం లక్ష్మీః పుణ్య కర్తౄణాం త్వం జ్యేష్టా పాపినాం సదా| త్వం శాన్తిస్సర్వ జగతాం త్వం ధాత్రీ ప్రాణపోషిణి||33

ఏదేవి బ్రహ్మాండమే దేహముగా కలిగియున్నదో, బ్రహ్మాండములోని ప్రాణులన్నింటిలో చలన శక్తిరూపములో నున్నదో, బ్రహ్మగారి నుండి తృణము వలరకు గల సర్వప్రాణులను సంతృప్తి పరచు చున్నదో అట్టి ఆ ఉమాదేవిని నమస్కరించు చున్నాము(30) వేదమాత యగు గాయత్రివి నీవే. సవితృమండలాదధిష్టాన దేవతవు నీవే. సరస్వతివి నీవే. సర్వ ప్రాణులలోని తెలిసే సామర్థ్యము నీవే. ధర్మమూలమగు వేదము నీవే (31). సర్వ ప్రాణుల యందలి నిద్ర, ఆకలి, మరియు తృప్తి నీవే . ప్రాణుల యందలి తృష్ట, కాంతి, సౌందర్యము మరియు తుష్టి నీవే. నీవు సదా సర్వులకు ఆనందము నిచ్చెదవు (32). పుణ్యాత్ములకు లభించు లక్ష్మివి నీవే. పాపులకు నిశ్చితముగా సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే. సర్వప్రాణులలోని శాంతివి నీవే. సర్వ ప్రాణులను పోషించు తల్లివి నీవే (33).

తత్త్వ స్వరూపా భూతానాం పంచానా మపి సారకృత్‌ | త్వం హి నీతి భృతాం నీతి ర్వ్యవసాయస్వరూపిణీ || 34

గీతిస్త్వం సామవేదస్య గ్రంధిస్త్వం యుజుషాం హుతిః | బుగ్వేదస్య తతా మాత్రా థర్వణస్య పరా గతిః || 35

సమస్తగీర్వాణ గణస్య శక్తిః తమో మయీ ధాతృ గుణౖకదృశ్యా |

రజః ప్రపంచాత్తు భ##వైకరూపా యా నశ్శ్రుతా భవ్యకరీ స్తుతేహ || 36

పంచభూతములలోని సారతత్త్వము నీ స్వరూపమే. నీతి శాస్త్రజ్ఞుల, మరియు నీతి మంతుల నీతి నీవే. నిశ్చయాత్మకమగు బుద్ధి నీ స్వరూపమే (34). సామవేదమునందలి గీతి నీవే. యజుర్వేదములోని ఆహుతి నీవే. మరియు బుగ్వేదము యొక్క మాత్ర నీవే. అథర్వణ వేదము యొక్క పరమతాతత్పర్యము నీవే (35). సమస్త దేవతా బృందముల శక్తి నీవే. లోకములకు తల్లి వగు నీ యందు తమోగుణము ఒకానొక రూపములో కనబుడును. రజోగుణ స్వరూపిణి వగు నీ నుండియే ఈ ప్రపంచము పుట్టినది. మాకు మంగళములనిచ్చు నిన్ను ఇచట మేము వేద వాక్కులచే స్తుతించుచున్నాము (36).

సంసార సాగర కరాల భవాంగ దుఃఖ నిస్తారకారి తరణిశ్చ నివీత మీనా |

అష్టాంగ యోగ పరిపాలన కేలి దక్షాం వింధ్యాగవాస నిరతాం ప్రణ మామ తాం వై ||

నానాక్షి వక్త్ర భుజవక్షసి మానసే చ ధృత్యా సుఖాని వితనోషి సదైవ జన్తోః |

నిద్రేతి యాతి సుభగా జగతీ భవా నః సా నః ప్రసీదతు భవస్థితి పాలనాయ|| 38

సంసార సముద్రములో పుట్టుట యనే భయంకరమగు దుఃఖమును దాటించే పడవ నీవే. అజ్ఞానావరణ నీకు లేదు. ఎనిమిది అంగములోత గూడిన యాగమును పాలించుట అను క్రీడలో సమర్థురాలు, వింధ్య పర్వత నివాసముచే ప్రీతిని పొందునది అగు ఆ దేవిని నమస్కరించుచున్నాము(37) ప్రాణులలో ముక్కు, కన్ను మొదలగు జ్ఞానేంద్రియముల యందు, నోరు, భుజములు మొదలగు కర్మేంద్రియముల యందు మరియు మనస్సునందు ఓ జోరూపముగా నుండి, మరియు ప్రాణుల హృదయ పుండరీకమునందు నివసించి వారికి సదా నీవు సుఖమును కలిగించుచున్నాము. జగదేక సుందరివగు నీవు మా యందు నిద్రా రూపమున ఉన్నావు. అజ్ఞాన రూపములో నున్నావు. అట్టి నీవు ఈ జగుత్తు యొక్క ఉనికిని రక్షించి మమ్ములను పాలించుము(38)

బ్రహ్మోవాచ|

ఇతిస్తుత్వా మహేశానీం జగదంబామునాం సతీమ్‌ | సుప్రేయమనసస్సర్వే తస్థుస్తే

దర్శనే ప్సవః|39

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్రసంహితాయాం తృతీయే పార్వతీ ఖండే దేవస్తుతిర్నామ తృతీయోధ్యాయః(3).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందురు మహేశ్వరి, జగన్మాత, సతీ దేహధారిణి అగు ఉమాదేవిని ఈ విధముగా స్తుతించి, మిక్కిలి ప్రీతితో నిండిన మనస్సు గలవారై ఆమెను దర్శించు కోరికతో అచటనే వేచి యుండిరి(39) .

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసంహితయందు యగు పార్వతీ ఖండలో దేవీస్తుతి అనే మూడవ అధ్యాయము ముగిసినది(3).

Sri Sivamahapuranamu-I    Chapters