Sri Sivamahapuranamu-I
Chapters
అథ సప్తమోऽధ్యాయః పార్వతి బాల్యము బ్రహ్మోవాచ | తతో మేనా పురస్సావై సుతా భూత్వా మహాద్యుతిః | చకార రోదనం తత్ర లౌకికీం గతి మాశ్రితా ||
1 అరిష్టశయ్యాం పరితస్సద్విసారి సుతేజసా | నిశీథ దీపా విహతత్విష ఆసన్నరం మునే || 2 శ్రుత్వా తద్రోదనం రమ్యం గృహస్థాస్సర్వయోషితః | జహృషుస్సంభ్రమాత్తత్రాః ప్రీతిపురస్సరాః || 3 తచ్ఛుద్ధాంత చర శ్శీఘ్రం శశంస భూభృతే తదా | పార్వతీ జన్మ సుఖదం దేవ కార్యకరం శుభమ్ || 4 బ్రహ్మ ఇట్లు పలికెను- మహా తేజస్వినియగు ఆమె అపుడు మేన యెదుట కుమార్తెయై జన్మించి లోకపు పోకడననుసరించి రోదించెను (1). ఓ మహర్షీ! ఆమె పరుండిన మంచము చుట్టూ వ్యాపించిన ఆమె యొక్క గొప్ప తేజస్సుచే, రాత్రియందు కూడా అచటి దీపములు వెనువెంటనే వెలవెలబోయినవి (2). ఇంటియందలి స్త్రీలందరు ఆమె ఏడ్చుటను వినిరి. ఆ ఏడుపు మనోహరముగ నుండెను. వారు తొందరగా అచటకు వచ్చి, ప్రేమతో ఆనందముతో పులకించిరి (3). అపుడు దేవ కార్యమును సిద్ధింపజేసే, సుఖకరము శుభకరమునగు ఆ పార్వతి పుట్టుటను గూర్చి హిమవంతుని అంతఃపుర పరిచారకుడు ఆ రాజునకు శీఘ్రమే తెలిపెను (4). తచ్ఛుద్దాంతచరాయాశు పుత్రీజన్మ సుశంసతే | సితాత పత్రం నాదేయమాసీత్తస్య మహీభృతః || 5 గతస్తత్ర గిరిః ప్రీత్యా సపురోహిత సద్విజః | దదర్శ తనయాం తాం తు శోబమానాం సుభాససా || 6 నీలోత్పలదలశ్యామాం సుద్యుతిం సుమనోరమామ్ | దృష్ట్వా చ తా దృశీం కన్యాం ముమోదాతి గిరీశ్వరః || 7 సర్వే చ ముముదుస్తత్ర పౌరాశ్చ పురుషాస్త్ర్సియః | తదోత్సవో మహానాసీన్నేదుర్వాద్యాని భూరిశః || 8 ఆ పర్వత రాజునకు కుమార్తె జన్మించినదను శుభవార్తను చెప్పిన ఆ అంతఃపురపరిచారకునకు తన శ్వేతచ్ఛత్రమును దానము చేయుట విడ్డూరమనిపించలేదు (5). ఆ శైలరాజు పురోహితునితో, బ్రాహ్మణులతో గూడి ఆనందముతో అచటకు వెళ్లి గొప్ప కాంతులతో శోభిల్లుచున్న ఆ కుమార్తెను చూచెను (6). నల్లకలువ రేకుల వలె శ్యామలవర్ణము గలది, గొప్ప కాంతులతో మనస్సును రంజింపజేయునది అగు అట్టి కన్యను చూచి ఆ పర్వత రాజు మిక్కిలి ఆనందించెను (7). అచటనున్న పురుషులు, స్త్రీలు, అందరు పౌరులు కూడ ఆనందించిరి. అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. అనేక వాద్యములు మ్రోగించబడినవి (8). బభూవ మంగలం గానం నవృతుర్వారయోషితః |దానం దదౌ ద్విజాతిభ్యో జాతకర్మ విధాయచ || 9 అథ ద్వారం సమాగత్య చకార సుమహోత్సవమ్ | హిమాచలః ప్రసన్నాత్మా భిక్షుభ్యో ద్రవిణం దదౌ || 10 అథో ముహూర్తే సుమతే హిమవాన్ముభిస్సహ | నామాకరోత్సుతాయాస్తు కాలీత్యాది సుఖ ప్రదమ్ || 11 దానం దదౌ తదా ప్రీత్యా ద్విజేభ్యో బహు సాదరమ్ | ఉత్సవం కారయామాస వివిధం గానపూర్వకమ్ || 12 మంగల గానములు పాడబడెను. వారాంగనలు నాట్యమును చేసిరి. హిమవంతుడు జాతకర్మను చేసి బ్రాహ్మణులకు దానమునిచ్చెను (9). అపుడు హిమవంతుడు సింహద్వారము వద్దకు వచ్చి, గొప్ప ఉత్సవమును చేసెను. ఆయన ప్రసన్నమగు మనస్సు గలవాడై భిక్షుకులకు ధనము నిచ్చెను (10). ఓ సుబుద్ధీ! హిమవంతుడు శుభముహూర్తమునందు మునులతో గూడి ఆమెకు కాళి మొదలగు సుఖకరమగు పేర్లను పెట్టెను (11). అపుడాయన మిక్కిలి ఆదరముతో బ్రాహ్మణులకు దానమునిచ్చెను. మరియు వివిధ గానకచేరిలతో గూడిన ఉత్సవమును చేయించెను (12). ఇత్థం కృత్వోత్సవం భూరి కాలీం పశ్యన్ముహుర్మహుః |లేభే ముదం సపత్నీకో బహుపుత్రోऽపి భూధరః || 13 తత్ర సా వవృధే దేవీ చార్వంగీ చారుదర్శనా | దధ్రే చానుదినం రమ్యాం చంద్రబింబకలామివ || 14 కులోచితేన నామ్నా తాం పార్వతీ త్యాజుహావ హ | బంధుప్రియాం బంధుజనస్సౌశీల్య గుణ సంయుతామ్ || 15 ఏవం సా కాలికా దేవీ గిరిరాజగృహే శివా | గంగేన వర్షసమయే శరదీవాథ చంద్రికా || 16 ఆ హిమవంతుడు అనేక పుత్రులు గలవాడైననూభార్యతో గూడి ఈ తీరున పెద్ద ఉత్సవమును చేసి, ఆ కాళిని మరల మరల చూచుచూ, ఆనందమును పొందెను (13). సుందరమగు అంగములతో చూడ చక్కనైన ఆ దేవి అచట ప్రతి దినము సుందరమగు శుక్ల పక్షచంద్ర బింబము వలె పెరుగజొచ్చెను (14). బంధువులకు ఇష్టురాలు, మంచి శీలముతో గుణముతో కూడియున్నది అగు ఆమెను బంధుజనులు కులమునకు తగిన 'పార్వతి' అను పేరుతో పిలువజొచ్చిరి (15). ఆ ఉమాదేవి హిమవంతుని గృహములో వర్షకాలమందలి గంగవలె, శరత్కాలమందలి వెన్నెలవలె ప్రకాశించెను (16). ఉమేతి మాత్రా తపసే నిషిద్ధా కాలికా చ సా | పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామ భువనే మునే || 17 దృష్టిః పుత్రవతోऽప్యద్రేస్త స్మింస్తృప్తిం జగామ న | ఆపత్యే పార్వతీ త్యాఖ్యే సర్వసౌభాగ్య సంయుతే || 18 మధో రనంతపుష్పస్య చూతే హి భ్రమరావలిః | విశేషసంగా భవతి సహకారే మునీశ్వర || 19 పూతో విభూషితశ్చాపి స బభూవ తయా గిరిః | సంస్కారవత్యేవ గిరా మనీషీవ హిమాలయః || 20 ఓ మహర్షీ! భవిష్యత్తులో ఆ కాళి తపస్సునకు పక్రమించగా, తల్లి 'ఉమా (అబ్బే, వద్దు)' అని నిషేధించును. అప్పటి నుండియూ ఆ సుందరికి ఉమ అను పేరు లోకములో ప్రసిద్ధిని గాంచెను (17). హిమవంతుడు పుత్రసంతానము గలవాడే. అయిననూ, సర్వసౌభాగ్యవతి యగు పార్వతియను పుత్రికను ఎంత చూచిననూ, ఆతనికి తనివి తీరలేదు (18). వసంతర్తువు యందు అనంత సంఖ్యలో పుష్పములున్ననూ, తమ్మెదల దండు మామిడి చెట్టు పై విశేష ప్రీతిని కలిగియుండును గదా! ఓ మహర్షీ! (19) సంస్కారవంతమగు వాక్కుచే విద్వాంసుడు వలె ఆ హిమవంతుడు ఆమెచే పవిత్రితుడాయెను. మరియు అలంకృతుడాయెను (20). ప్రభామహత్యా శిఖయేవ దీపో భవనస్య చ | త్రిమార్గయేవ సన్మార్గ స్తద్వద్గిరిజయా గిరిః || 21 కందుకైః కృత్రిమైః పుత్రైస్సఖీమధ్యగతా చ సా | గంగాసైకతవేదీభిర్బాల్యే రేమే ముహూర్ముహుః || 22 అథ దేవీ శివా సా చోపదేశ సమయే మునే |పపాఠ విద్యాస్సుప్రీత్యా యతచిత్తా చ సద్గురోః || 23 గొప్ప కాంతులను విరజిమ్మే అగ్ని శిఖతో దీపమువలె, మందాకిని (పాలపుంత)తో బ్రహ్మండములోని నక్షత్ర మార్గమువలె, హిమవంతుడు గిరిజతో కూడి ప్రకాశించెను (21). ఆమె బాల్యమునందు సుఖురాండ్రతో గూడి గంగానది యొక్క ఇసుకతిన్నెలపై బంతులతో, ఆట బొమ్మలతో చిరకాలము క్రీడించెను (22). ఓ మహర్షీ! తరువాత ఆ శివాదేవి విద్యా రంభ సమయములో ఆరంభించి, సద్గురువు వద్ద నుంచి పరమ ప్రీతితో మనస్సును లగ్నము చేసి విద్యలను స్వీకరించి పఠించెను (23). ప్రాక్తనా జన్మ విద్యాస్తాం శరదీవ ప్రపేదిరే | హంసాళి స్స్వర్ణదీ నక్త మాత్మభాసో మహౌషధిమ్ || 24 ఇత్థం సువర్ణితా లీలా శివాయాః కాచిదేవ హి | అన్యలీలాం ప్రవక్ష్యేऽహం శృణు త్వం ప్రేమతో మునే || 25 ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే పార్వతీ బాల్య లీలావర్ణనం నామ సప్తమోऽధ్యాయః (7). ఓ మహర్షీ! ఈ తీరున నేను అనిర్వచనీయమగు శివాలీలను చక్కగా వర్ణించితిని. మరికొన్ని లీలలను చెప్పగలను. నీవు ప్రేమపూర్వకముగా వినుము (25). శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ బాల్యలీలల వర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).