Sri Sivamahapuranamu-I    Chapters   

అథ అష్టమోధ్యాయః

నారద హిమాలయ సంవాదము

బ్రహ్మోవాచ |

ఏకదా తు శివజ్ఞానీ శివలీలావిదాం వరః | హిమాచలగృహం ప్రీత్యా గమస్త్వం శివప్రేరితః || 1

దృష్ట్వా మునే గిరీశస్త్వాం నత్వానర్చ స నారద | ఆహూయ చ స్వతనయాం త్వదంఘ్రోస్తామపాతయత్‌ || 2

పునర్నత్వా మునీశ త్వామువాచ హిమ భూధరః | సాంజలిస్స్వ విధిం మత్వా బహుసన్నతమస్తకః || 3

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివజ్ఞాని, శివలీలలనెరింగిన వారిలో శ్రేష్ఠుడు అగు నీవు ఒకనాడు శివునిచే ప్రేరేపింపబడినవాడై, ఆనందముతో హిమవంతుని గృహమునకు వెళ్లితివి (1). ఓ మహర్షీ! నారదా! ఆ పర్వత రాజు నిన్ను చూచి నమస్కరించి పూజించెను. మరియు తన కుమార్తెను పిలిపించి నీ పాదములపై బడవైచెను (2). ఓ మహర్షీ! హిమవంతుడు నీకు చేతులు ఒగ్గి శిరసును బాగుగా వంచి మరల నమస్కరించిన వాడై, ఈ ప్రసంగమును తన విధిగా భావించెను (3).

హిమాలయ ఉవాచ |

హే మునే నారద జ్ఞానిన్‌ బ్రహ్మ పుత్రవర ప్రభో | సర్వజ్ఞస్త్వం సకరుణః పరోపకరణ రతః || 4

మత్సుతా జాతకం బ్రూహి గుణదోష సముద్భవమ్‌ | కస్య ప్రియా భాగ్యవతీ సుతా మమ || 5

హిమవంతుడిట్లు పలికెను -

ఓ మహర్షీ ! నారదా ! ప్రభూ! నీవు బ్రహ్మ పుత్రులలో శ్రేష్ఠుడవగు జ్ఞానివి. నీవు

సర్వము నెరింగిన దయామూర్తివి. నీకు పరోపకరమునందు ప్రీతి మెండు (4). నా కుమార్తె యొక్క జాతకమును, దానిలోని గుణదోషముల వలన కలుగబోవు పరిణామములను చెప్పుము. భాగ్యవంతురాలగు నా కుమార్తె ఎవని ప్రియురాలు కాగలదు?(5)

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తో ముని వర్య త్వం గిరీశేన హిమాద్రిణా | విలోక్య కాలికా హస్తం సర్వాంగం చ విశేషతః || 6

అవోచస్త్వం గిరిం తాత కౌతుకీ వాగ్వి శారదః | జ్ఞానీ విదిత వృత్తాంతో నారదః ప్రీతమానసః || 7

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! పర్వతరాజగు హిమవంతుడిట్లు పలుకగా, నీవు కాళికా దేవి యొక్క హస్తమును, విశేషించి సర్వాయవములను పరిశీలించితివి (6). వత్సా! ఉత్కంఠను రేకెత్తించువాడు, వాగ్విశారదుడు, జ్ఞాని, వృత్తాంతము నంతనూ ఎరింగిన వాడు అగు నీవు సంతసించిన హృదయము గలవాడవై హిమవంతునితో నిట్లంటివి (7).

నారద ఉవాచ |

ఏషా తే తనయా మేనే సుధాంశోరివ వర్థితా | ఆద్యా కలాశైలరాజ సర్వలక్షణ శాలినీ || 8

స్వపతేస్సుఖదాత్యంతం పిత్రోఃకీర్తి వివర్థినీ | మహాసాధ్వీ చ సర్వాసు మహానందకరీ సదా || 9

సులక్షణాని సర్వాణి త్వత్సుతాయాః కరే గిరే | ఏకా విలక్షణా రేకా తత్ఫలం శృణు తత్త్వతః || 10

యోగీ నగ్నోగుణోకామీ మాతృతాత వివర్జితః | అమానోశివవేషశ్చ పతిరస్యాః కిలేదృశః || 11

నారదుడిట్లు పలికెను -

ఓ పర్వతరాజా! ఈ నీ కుమార్తె పెరిగి సర్వలక్షణములతో కూడినదై చంద్రుని ప్రతిపత్కళ వలె ప్రకాశించుచున్నదని తలంచుచున్నాను (8). ఈమె తన భర్తకు అతి శయించిన సుఖమునిచ్చి, తల్లి దండ్రుల కీర్తిని పెంపొందించ గలదు. ఈమె అన్ని అవస్థలయందు మహా పతివ్రతయై, సర్వదా మహానందము నీయగలదు (9). ఓ పర్వతరాజా! నీ కుమార్తె యొక్క చేతియందు మంచి లక్షణములన్నియూ కనిపించుచున్నవి. మరియు ఒక విలక్షణమైన రేఖ గలదు. దాని యథార్థ ఫలమును వినుము (10). యోగి, దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లి దండ్రులు లేని వాడు, అహంకార విహీనుడు, అమంగళ##వేషధారి అగు వాడు ఈమెకు భర్త కాబోవు చున్నాడు సుమా! (11).

బ్రహ్మోవాచ |

ఇత్యా కర్ణ్య వచస్తే హి సత్యం మత్వా చ దంపతీ | మేనా హిమాచలశ్చాపి దుఃఖితౌ తౌ బభూవతుః || 12

శివాకర్ణ్య వచస్తే హి తాదృశం జగదంబికా | లక్షణౖస్తం శివం మత్వా జహర్షాతి మునే హృది || 13

న మృషా నారద వచస్త్వితి సంచింత్య సా శివా | స్నేహం శివపదద్వంద్వే చకారాతి హృదా తదా || 14

ఉవాచ దుఃఖితశ్సైల స్త్వాం తదా హృది నారద | కముపాయం మునే కుర్యా మతి దుఃఖమభూదితి || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

మేనా హిమవంతులనే ఆ దంపతులు నీ మాటను విని, సత్యము స్వీకరించి, మిక్కిలి దుఃఖించిరి (12). ఓ మహర్షీ! ఆ జగన్మాత కూడ నీ ఈ మాటను విని, ఆ లక్షణములను బట్టి ఆతడు శివుడేనని నిర్ణయించుకొని హృదయములో గొప్ప ఆనందమును పొందెను (13). ఆ శివా దేవి నారదుని వచనము అసత్యము కాబోదని తలంచి, అపుడు మనస్సులో శివుని పాదపద్మములపై అతిశయించిన ప్రేమను నింపుకొనెను (14). ఓ నారదా! అపుడా పర్వతరాజు దుఃఖితుడై నీతో నిట్లనెను. ఓ మహర్షీ! నేనేమి ఉపాయమును చేయవలెను. నాకు మహాదుఃఖము కలుగుచున్నది (15).

తచ్ర్ఛుత్వా త్వం మునే ప్రాత్థ మహా కౌతుక కారకః | హిమాచలం శుభైర్వాక్యైర్హర్షయన్‌ వాగ్విశారదః || 16

ఓ మహర్షీ! గొప్ప ఉత్కంఠను రేకెత్తించే వాగ్విశారదుడవగు నీవు ఆ మాటను విని శుభవాక్యములతో హిమవంతునికి హర్షమును కలిగించు వాడవై ఇట్లు పలికితివి (16).

నారద ఉవాచ |

స్నేహాచ్ఛృణు గిరే వాక్యం మమ సత్యం మృషా న హి | కరలేఖా బ్రహ్మలిపిర్న మృషా భవతి ధ్రువమ్‌ || 17

తాదృశోస్యాః పతిశైల భవిష్యతి న సంశయః | తత్రోపాయం శృణు ప్రీత్యా యం కృత్వా లప్స్యసే సుఖమ్‌ || 18

తాదృశోస్తి వరశ్శంభుర్లీలారూపధరః ప్రభుః | కులక్షణాని సర్వాణి తత్ర తుల్యాని సద్గుణౖః || 19

ప్రభౌ దోషా న దుః ఖాయ దుఃఖదోత్య ప్రభౌ హి సః | రవి పావక గంగానాం తత్ర జ్ఞేయా నిదర్శనా || 20

నారదుడిట్లు పలికెను -

ఓ పర్వత రాజా! నేను ప్రేమతో చెప్పు మాటను వినుము. నా మాట సత్యము. నా మాట ఎన్నటికీ అసత్యము కాదు. బ్రహ్మచే నిర్మించబడిన చేతిలోని రేఖలు నిశ్చయముగా అసత్యము గావు (17). హే పర్వత రాజా! ఈమె భర్త అట్టి వాడగు ననుటలో సందేహము లేదు. కాని ఈ విషయములో ఒక ఉపాయమును వినుము. అట్లు చేసినచో, నీవు సుఖమును పొందగలవు (18). లీలారూపధారియగు శంభుప్రభుడు అట్టి వరుడై యున్నాడు. కాని ఆయన యందలి చెడు లక్షణములన్నియూ సద్గుణములతో సమానము (19). ఆ ప్రభువు నందు దోషము దుఃఖకారి కాదు. ఆ దోషమే ప్రభువు కంటె ఇతరుల యందున్నచో మహాదుఃఖమును కలిగించును. దీనికి సూర్యుడు, అగ్ని, గంగానది దృష్టాంతములని తెలియదగును (20).

తస్మాచ్ఛివాయ కన్యాం స్వాం శివాం దేహి వివేకతః | శివస్సర్వేశ్వరస్సేవ్యోవికారీ ప్రభురవ్యయః || 21

శీఘ్రప్రసాదస్స శివస్తాం గ్రహీష్యత్యసంశయమ్‌ | తపస్సాధ్యో విశేషేణ యది కుర్యాచ్ఛివా తపః || 22

సర్వథా సుసమర్థో హి స శివస్సకలేశ్వరః | కులిపేరపి వధ్వంసీ బ్రహ్మాధీనస్త్వక ప్రదః || 23

కాన నీవు వివేకము గలవాడవై నీ కుమార్తె యగు శివాదేవిని శివునకు ఇచ్చి వివాహమును చేయుము. సర్వేశ్వరుడు, వికార రహితుడు, అవినాశి యగు శివప్రభుడు సేవించదగినవాడు (21). అ శివుడు తొందరగా ప్రసన్నుడగును. ఆయన ఈమెను తప్పక స్వీకరించగలడు. ఈ శివాదేవి తపస్సును చేసినచో, ఆయన విశేషించి అట్టి తపస్సుచే పొందదగిన వాడు అగును (22). ఆ శివుడు సర్వవిధములా అత్యంత సమర్థుడు, సర్వేశ్వరుడు, చెడు రాతను గూడ తుడచి పెట్టగలవాడు, బ్రహ్మ అధీనమునందు గలవాడు, మరియు ఆనందము నిచ్చువాడు (23).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా త్వం పునస్తాత కౌతుకీ బ్రహ్మ విన్మునే | శైలరాజ మవోచో హి హర్షయన్‌ వచనైశ్శుభైః || 24

భావినీ దయితా శంభోస్సానుకూలా సదా హరేః | మహాసాధ్వీ సువ్రతా చ పిత్రోస్సుఖ వివర్థినీ || 25

శంభోశ్చిత్తం వశే చౌషా కరిష్యతి తపస్వినీ | స చాప్యేనామృతే యోషాం న హ్యన్యాముద్వహిష్యతి || 26

ఏతయో స్సదృశం ప్రేమ న కస్యాప్యేవ తాదృశమ్‌ | భూతం వా భవితా వాపి నాధునా చ ప్రవర్త తే || 27

బ్రహ్మ ఇట్లు పలికెను -

హే వత్సా !మహర్షీ !ఉత్కంఠను కలిగించువాడు, బ్రహ్మవేత్త అగు నీవు ఇట్లు పలికి, ఆ పర్వత రాజును శుభవచనములతో ఆనందింపజేయుచూ, మరల నిట్లంటివి (24).ఈమె శంభునకు పత్నియై, ఆయనకు సర్వదా అనుకూలవతియై, మహాపతివ్రతయై, గొప్ప నిష్ఠగలదియై తల్లిదండ్రుల సుఖమును వృద్ధిచేయగలదు (25). ఈ తపస్విని శంభుని చిత్తమును తన వశము చేసుకొనగలదు. ఆయన కూడా ఈమెను తక్క మరియొక స్త్రీని వివాహమాడడు (26). వీరిద్దరు ప్రేమతో తుల్యమగు ప్రేమ ఏ ఇద్దరి మధ్యనైననూ భూతకాలములో లేదు ; వర్తమానకాలములో లేదు; భవిష్యత్తులో ఉండబోదు (27).

అనయో స్సురకార్యాణి కర్త వ్యాని మృతాని చ | యాని యాని నగశ్రేష్ఠ జీవితాని పునః పునః || 28

అనయా కన్యయా తేద్రే అర్ధనారీశ్వరో హరః | భవిష్యతి తథా హర్ష మనయోర్మిలితం పునః || 29

శరీరార్ధం హరసై#్యషా హరిష్యతి సుతా తవ | తపః ప్రభావాత్సంతోష్య మహేశం సకలేశ్వరమ్‌ || 30

స్వర్ణ గౌరీ సువర్ణభా తపసా తోష్య తం హరమ్‌ | విద్యుద్గౌరతమా చేయం తవ పుత్రీ భవిష్యతి || 31

గౌరీతి నామ్నా కన్యాతు ఖ్యాతిమేషా గమిష్యతి | సర్వదేవగణౖః పూజ్యా హరి బ్రహ్మాదిభిస్తథా || 32

వీరిద్దరు చేయ దగిన దేవకార్యములు గలవు. ఓ పర్వత రాజా! వీరు మృతులనెందరినో జీపింప చేయవలసి యున్నది (28). ఓ పర్వతరాజా! శివుడు ఈ కన్యకు తన శరీరములోని అర్థభాగము నిచ్చి అర్ధనారీశ్వరుడు కాగలడు. మరియు వీరిద్దరి కలయిక మరల సర్వత్ర ఆనందమును కలిగించును (29). ఈ నీ కుమార్తె శివుని శరీరము యొక్క అర్థ భాగమును తన అధీనము చేసుకొనగలదు. ఈమె తన తపశ్శక్తిచే సకలేశ్వరుడగు మహేశ్వరుని సంతోష పెట్ట గలదు (30). తపస్సుచే ఆ శివుని సంతోష పెట్టి ఈ నీ కుమార్తె బంగారము వలె, మెరుపు తీగవలె పచ్చని కాంతులతో శోభిల్ల గలదు (31). ఈ కన్య గౌరి యను పేరుతో ఖ్యాతిని గాంచగలదు. ఈమెను విష్ణువు, బ్రహ్మ మొదలగు వారితో గూడి దేవతా గణములన్నియూ పూజించగలరు (32).

నాన్యసై#్మ త్వమిమాం దాతుమిహార్హసి నగోత్తమ | ఇదం చోపాంశు దేవానాం న ప్రకాశ్యం కదాచన || 33

ఓ పర్వతరాజా! నీవు ఈమెను మరియొకనికి ఇచ్చి వివాహము చేయుట తగదు. ఇది దేవరహస్యము.ఎవరికైననూ, ఎప్పుడైననూ వెల్లడి చేయరాదు (33).

బ్రహ్మోవాచ |

ఇతి తస్య వచశ్ర్శుత్వా దేవర్షే తవ నారద | ఉవాచ హిమవాన్‌ వాక్యం మునే త్వాం వాగ్వి శారదః || 34

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారద! దేవర్షీ! ఈ నీ మాటను విని, వాక్కులో నైపుణ్యముగల ఆ హిమవంతుడు నీతో నిట్లనెను (34).

హిమాలయ ఉవాచ |

హే మునే నారద ప్రాజ్ఞ విజ్ఞప్తిం కాంచిదేవ హి | కరోమి తాం శృణు ప్రీత్యాతస్త్వం ప్రముదమావహ || 35

శ్రూయతే త్యక్తసంగస్స మహాదేవో యతాత్మవాన్‌ | తపశ్చరతి సన్నిత్యం దేవానా మప్య గోచరః || 36

స కథం ధ్యాన మార్గస్థః పరబ్రహ్మార్పితం మనః | భ్రంశయిష్యతి దేవర్షే తత్ర మే సంశయో మహాన్‌ || 37

అక్షరం పరమం బ్రహ్మ ప్రదీపకలికోపమమ్‌ | సదాశివాక్యం స్వం రూపం నిర్వికారమజామరమ్‌ || 38

నిర్గుణం సగుణం తచ్చ నిర్విశేషం నిరీహకమ్‌ | అతః పశ్యతి సర్వత్ర న తు బాహ్యం నిరీక్షతే || 39

హిమవంతుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! నారదా! నీవు ప్రజ్ఞా శాలివి. నేనొక విన్నపమును చేసెదను. దానిని నీవు ప్రీతితో విని, ఆపైన నాకు ఆనందమును కలుగు జేయుము (35). ఆ మహాదేవుడు సర్వ సంగపరిత్యాగి అనియు, ఆత్మ నిగ్రహము గలవాడనియు, నిత్యము తపస్సు చేయుచుండుననియు, దేవతలకు కూడా కానరాడనియు విని యుంటిని (36). ఓ దేవర్షీ! పరబ్రహ్మ యందు అర్పితమైన మనస్సు గల ఆ శివుడు ధ్యాన మార్గము నుండి చ్యుతుడగుట యెట్లు? ఈ విషయములో నాకు పెద్ద సంశయము గలదు (37). వినాశము లేనిది, హృదయములో దీపశిఖవలె ప్రకాశించునది, సదాశివనామధేయమముగలది, వికారములు లేనిది, పుట్టుక మరణము లేనది, నిర్గుణము గుణములకు అధిష్టానము, విశేషరహితము కామనాసంబంధము లేనిది అగు పరబ్రహ్మను ఆయన స్వస్వరూపముగా దర్శించును. ఆయన సర్వత్ర బ్రహ్మమునే దర్శించును గాన, ఆయనకు బాహ్య దృష్టి లేదు (38,39).

ఇతి స శ్రుయతే నిత్యం కిన్నరాణాం ముఖాన్మునే | ఇహాగతానాం సుప్రీత్యా కిం తన్మిథ్యా వచో ధ్రువమ్‌ || 40

విశేషతశ్ర్శూయతే స సాక్షాన్నామ్నాతథా హరః | సమయం కృతవాన్‌ పూర్వం తన్మయా గదితం శృణు || 41

న త్వామృతేన్యాం వరయే దాక్షాయణి ప్రియే సతి | భార్యార్థం న గ్రహీష్యామి సత్యమేతద్బ్రవీమితే || 42

ఇతి సత్యా సమం తేన పురైవ సమయః కృతః | తస్యాం మృతాయాం స కథం స్వయమన్యాం గ్రహీష్యతి || 43

ఓ మహర్షీ!ఇచటకు విచ్చేసి నాతో ప్రీతిగా మాటలాడే కిన్నరుల ముఖము నుండి నేను అనేక పర్యాయములు ఇట్లు వినియుంటిని. ఈ మాట అసత్యము అనుట నిశ్చయమేనా? (40). ఆయనకు హరుడని పేరు గలదు. ఆ పేరును బట్టి (హరించువాడ హరుడు)

ఆయన అట్టి వాడే అయి ఉండునని లోకములో వినబడు చున్నది. ఆయన పూర్వము ఒక ప్రతిజ్ఞను చేసినాడట. దానిని చెప్పెదను వినుము (41).'దక్షపుత్రీ! సతీ! ప్రియురాలా! నిన్ను తక్క మరియొక స్త్రీని నేను భార్యగా స్వీకరించను. వరించను. నేను సత్యమును చెప్పుచున్నాను' (42). ఇట్లు ఆయన పూర్వమే సతీదేవి ఎదుట ప్రతిజ్ఞను చేసియున్నాడు. ఆమె మరణించినది. ఇపుడాతడు మరియొక స్త్రీని ఎట్లు వివాహమాడగలడు? (43)

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా స గిరిస్తూష్ణీమాస తస్య పురస్తవ | తదాకర్ణ్యాధ దేవర్షే త్వం ప్రావోచస్సుతత్త్వతః|| 44

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ హిమవంతుడు నీ ఎదుట ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ దేవర్షీ! నీవా మాటను విని,యధార్ధమును నిశ్చయించి, అతనితో నిట్లంటివి (44).

నారద ఉవాచ|

నవై కార్యా త్వయా చింతా గిరిరాజ మహామతే | ఏషా తవ సుతా కాలీ దక్షజా హ్యభవత్సురా|| 45

సతీ నామాభవత్తస్యాస్సర్వమంగలదం సదా | సతీ సావై దక్ష కన్యా భూత్వా రుద్రప్రియాభవత్‌|| 46

పితుర్యజ్ఞే తధా ప్రాప్యానాదరం శంకరస్య చ| తం దృష్ట్యా కోపమాధాత్యాక్షీద్దేహం చ సౌ సతీ || 47

పునసై#్సవ సముత్పన్నా తవ గేహే మ్చికా శివా | పార్వతీ హరిపత్నీయం భవిష్యతి న సంశయః|| 48

నారదుడిట్లు పనికెను-

ఓ పర్వతరాజా! మహాత్మా! నీవు చింతిల్లకుము.న నీ కుమార్తె యగు ఈ కాళియే పుర్వము దక్ష పుత్రియై జన్మించెను (45) సర్వకాలములలో సర్వమంగళములనిచ్చే సతియను పేర ఆమె అపుడు ప్రసిద్ధిగాంచెను. ఆ సతి దక్ష పుత్రియై రుద్రునకు పత్ని ఆయెను (46). ఆసతి తండ్రి చేసిన యజ్ఞములో శంకరునకు అనాదరము జరుగుటను గాంచి కోపమును చెంది దేహమును త్యజించెను (47). జగన్మాతయగు ఆ శివాదేవియే మరల నీ గృహములో జన్మించినది. ఈ పార్వతి శివుని పత్ని యగుననుటలో సందేహము లేదు(48).

ఏతత్సర్వం విస్తరాత్త్వం ప్రోక్తవాన్‌ భూభృతే మునే| పూర్వరూపం చరిత్రం చ పార్వత్యాః ప్రీతి వర్ధనమ్‌ || 49

తం సర్వం పూర్వవృత్తాంతం కాల్యా మునిముఖాద్గిరిః | శ్రుత్వా సపుత్ర దారస్స తదా నిస్సంశయోభవత్‌ || 50

తతః కాలీ కధాం శ్రుత్వా నారతస్య ముఖాత్తదా| లజ్జయాధోముఖీ భూత్వా స్మితవిస్తారితాననా || 51

కరేణ తాం తు సంస్పృశ్య శ్రుత్వా తచ్చరితం గిరిః | మూర్ధ్ని శశ్వత్తధాఘ్రాయ స్వాసనాన్తే న్యవేశయత్‌|| 52

ఓ సహర్షీ! నీవు ఈ వృత్తాంతమునంతనూ ఆ పర్వత రాజునకు చెప్పితివి. నీవు చెప్పిన ఆ పూర్వ చరిత్ర పార్వతికి మహానందమును కలిగించెను(49). హిమవంతుడు. ఆయన భార్య,కుమారులు మహర్షి ముఖము నుండి కాళిక యెక్క ఆ పూర్వ వృత్తాంతము నంతయూ విని, సంశయములను వీడిరి (50). అపుడు నారదుని ముఖము నుండి ఆ గాధను విని కాళిక సిగ్గుతో తలను వంచుకొనెను.ఆమె ముఖము చిరునవ్వుతో విప్పారెను (51). ఆ చరిత్రను విని హిమవంతుడు ఆమెను చేతితో స్పృశించి, శిరస్సు పై ముద్దాడి తన ఆసన సమీపములో కూర్చుండబెట్టు కొనెను (52).

తతస్త్వం తాం పునర్దృష్ట్వావోచస్తత్ర స్ధితాం మునే | హార్షయన్‌ గిరిరాజం చ మేనకాం తనయై స్సహ|| 53

సింహాసనం తు కింత్వస్యాశ్శైలరాజ భ##వేదతః | శంభో రూరౌ సదైతస్యా ఆసనం తు భవిష్యతి|| 54

హరేరూర్వాసనం ప్రాప్య తనయా తవ సంతతమ్‌ | న యత్ర కస్యాశ్చి ద్దృష్టిర్మాలమం వా గమిష్యతి|| 55

ఓ మహర్షీ! అచటనున్న అమెను చూచి నీవు మరల ఇట్లు పలికితివి. నీ పులుకులు హిమవంతునకు, మేనకు, వారి కుమారులకు ఆనందమును కలిగించినవి(53). ఓ పర్వతరాజా! ఈ పైన ఈమె యొక్క సింహాసనము సర్వదా శివుని ఊరువులు కాగలవు(54). నీ కుమార్తె శవుని ఊరువులు అనే ఆసనమును సర్వకాలముల యందు పొంది, ఎవ్వరి తృష్టికి గాని, మనస్సులకైననూ గాని గోచరము గాని స్ధానమును పొందగలదు (55).

బ్రహ్మోవాచ|

ఇతి వచనముదారం నారద త్వం గిరీశం త్రిదివమగమ ఉక్త్వా తత్‌క్షణాదేవ ప్రీత్యా|

గిరిపతిరపి చిత్తే చారు సమ్మోద యుక్తః స్వ గృహమగమదేవం సర్వసంపత్సమృద్ధమ్‌|| 56

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం పార్వతీ ఖండే నారద హిమాలయ సంవదవర్ణనం నామాష్టమోధ్యాయః (8).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదా! నీవు ఈ విధముగా పర్వతరాజుతో ఉదారమగు వచనములను పలికి వెంటనే ఆనందముతో స్వర్గమునకు వెళ్లి యుంటివి. ఆ హిమవంతుడు ఆనందముతో నిండిన హృదము గలవాడై సర్వ సంపదలతో నలరారు తన గృహమునకు వెళ్లెను(56).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారద హిమాలయ సంవాద వర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Sri Sivamahapuranamu-I    Chapters