Varahamahapuranam-1    Chapters   

దశమోధ్యాయః - పదియవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

ఏవం సృష్ట్వా జగత్పర్వం భగవాన్‌ లోకభావనః,

విరరామ తతః సృష్టి ర్వ్యవర్ధత ధరే తదా. 1

ఓ ధరణీ! లోకముల నన్నింటిని చక్కగా మనసున భావించిన ఆ భగవానుడు ఈ సర్వమును సృజించి యూరకుండెను. అంత సృష్టి పెంపొంద దొడగెను.

వృద్ధాయా మథ సృష్టౌతు సర్వే దేవాః పురాతనమ్‌,

నారాయణాఖ్యం పురుషం యజన్తో వివిధై ర్మఖైః. 2

ద్వీపేషు చైవ సర్వేషు వర్షేషు చ మఖై ర్హరిమ్‌,

దేవాః సత్రై ర్మహద్భి స్తే యజన్తః శ్రద్ధయాన్వితాః,

తోషయామాసు రత్యర్థం స్వం పూజ్యం కర్తు మీప్సవః. 3

ఇట్లు సృష్టి వృద్ధిపొందగా దేవతలందరు ఆయా ద్వీపములలో, ఆయా వర్షములలో (వర్షమనగా కొన్ని ఖండములు కలసిన భూభాగము) పెక్కు విధములగు యజ్ఞములతో గొప్ప సత్రయాగములతో తమ పూజ్యత నపేక్షించి పురాతనుడగు శ్రీమన్నారాయణుని సంతోషపరచు చుండిరి.

ఏవం తోషయతాం తేషాం బహువర్ష సహస్రికమ్‌,

కాలే దేవ స్తదా తుష్టః ప్రత్యక్షత్వం జగామ హ. 4

ఇట్లుపెక్కువేలయేండ్లు వారు నారాయణుని సంతోషపెట్టగా తుష్టి నందిన దేవుడు వారికి ప్రత్యక్ష మయ్యెను.

అనేకబాహూదర వక్త్రనేత్రో

మహాగిరేః శృఙ్గ మివోల్లిఖం స్తదా,

ఉవాచ కింకార్య మథో సురేశో

బ్రూతాం వరం దేవవరా వరం వః. 5

పెక్కుచేతులు, కడుపులు, మోములు, కన్నులు గిలిగి పెద్దకొండ కొమ్మువలె ఆకసము నొరయుచు ఆ దేవేశుడు దేవ వరులారా! చెప్పుడు! మీకిష్టమైన వరము కోరుకొనుడు అని పలికెను.

దేవా ఊచుః - దేవత లిట్లనిరి.

జయస్వ గోవిన్ద మహానుభావ

త్వయా వయం నాథ వరేణ దేవాః,

మనుష్యలోకేపి భవన్త మాద్యం

విహాయ నాస్మాన్‌ భవతే హ కశ్చిత్‌. 6

మహానుభావా! గోవిందా! నీకు జయము. నాథా! శ్రేష్ఠుడవగు నీ వలన మేము దేవతలమయితిమి. కాని మనుష్య లోకము నందు ఏ ఒక్కడును ఆద్యుడవగు నిన్ను విడచి మమ్ము మన్నించుట లేదు.

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా

విశ్వేశ్వినౌ మరుత శ్చోష్మపాశ్చ,

సర్వే భవన్తం శరణం గతాః స్మ

కురుష్వ పూజ్యా నిహ విశ్వమూర్తే. 7

రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వులు, అశ్వులు, మరుత్తులు, ఊష్మపులు - అనుపేర్లు గల మేమందరము నిన్ను శరణు చొచ్చితిమి. ఓ విశ్వమూర్తీ! మమ్ములను పూజ్యులనుగా చేయుము.

ఏవ ముక్త స్తదా తైస్తు మహాయోగేశ్వరో హరిః,

కరోమి సర్వాన్‌ వః పూజ్యా నిత్యుక్త్వాన్తరధీయత. 8

వారిట్లు పలుకగా మహా యోగీశ్వరుడగు హరి మీ అందరను పూజ్యులను గావింతు నని అదృశ్యుడాయెను.

దేవా అపి నిజౌకాంసి గతవన్తః సనాతనమ్‌,

స్తువన్తః పరమేశోపి త్రివిధం భావ మాస్థితః. 9

దేవతలును సనాతనుడగు నారాయణుని స్తుతించుచు తమ తమ స్థానముల కరిగిరి. పరమేశ్వరుడు మూడు విధములగు భావములను పొందెను.

ఏవం త్రిధా జగద్ధాతా భూత్వా దేవాన్‌ మహేశ్వరః,

ఆరాధ్య సాత్వికం రాజం తామసం చ త్రిధా స్థితమ్‌. 10

ఇట్లు పరమేశ్వరుడు, లోకపతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనువానితో నేర్పడిన మూడు రూపములను పొందెను. దేవతలను తృప్తిపరచెను.

సాత్వికేన పఠేద్‌ వేదాన్‌ యజేద్‌ యజ్ఞేన దేవతాః

అట్టి సత్త్వస్వరూపముతో వేదములను పఠించును. యజ్ఞము లతో దేవతలను పూజించును.

ఆత్మనో వయవో భూత్వా రాజసేనాపి కేశవః, 11

సకాలరూపిణం రౌద్రం ప్రకృత్యా శూలపాణినమ్‌,

ఆత్మనో రాజసీం మూర్తిం పూజయామాస భక్తితః.

ఆ కేశవుడు తన అంశమగు రజోగుణముతో కాలస్వరూపుడు, స్వభావముతోడనే భయంకరుడు, శూలము చేత ధరించు వాడునగు రుద్రుని సృజించెను. అట్టి తన రాజసమూర్తిని భక్తితో అర్చించెను.

తామసేనాపి భావేన అసురేషు వ్యవస్థితః. 12

»R½®ªsWgRiVß᪫sV¸R…Vª«sVgRiV ˳ت«sª«sVV»][ LRiNRPäxqsVÌÁ ¸R…VLiµR…V ®ƒsÌÁN]®ƒsƒ«sV.

ఏవం త్రిధా జగద్ధాతా భూత్వా దేవాన్‌ మహేశ్వరః,

ఆరాధయామాస తతో లోకేపి త్రివిధోభవత్‌. 13

బ్రహ్మ విష్ణు మహేశాననామ్నా గృహ్య వ్యవస్థితః,

స చ నారాయణో దేవః కృతే యుగవరే ప్రభుః. 14

అట్లు పరమప్రభువు, లోకపాలకుడు మూడు రూపములు పొంది దేవతల నారాధించెను. అటుపై లోకము నందును బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములుగైకొని మూడు విధములుగా నయ్యెను.

త్రేతాయాం రుద్రరూపస్తు ద్వాపరే యజ్ఞమూర్తిమాన్‌,

కలౌ నారాయణో దేవో బహురూపో వ్యజాయత. 15

ఆ దేవుడు కృతయుగమున నారాయణుడుగా, త్రేతాయుగమున రుద్రరూపుడుగా, ద్వాపరమున యజ్ఞమూర్తిగా, కలియందు అనేక రూపములుగలవాడుగా నయ్యెను.

తస్యాదికృత్తతో విష్ణో శ్చరితం భూరితేజసః,

శృణుష్వ సర్వం సుశ్రోణి గదతో మమ భామిని. 16

ఓ సుందరీ! ఇట్లు ఆదిసృష్టి చేసిన మహాతేజస్సు గల ఆవిష్ణువు చరితము చెప్పుదును. వినుము.

ఆసీత్‌ కృతయుగే రాజా సుప్రతీకో మహాబలః,

తస్య భార్యా ద్వయం చాసీ దవిశిష్టం మనోరమమ్‌. 17

మున్ను కృతయుగమున సుప్రతీకుడను మహాబలవంతుడగు రాజుండెను. ఆతనికి సమానమగు సౌందర్యము. ఎగుడుదిగుడులు లేని గుణములు గల యిద్దరు భార్యలుండిరి.

విద్యుత్ర్పభా కాన్తిమితీ తయో రేతే తు నామనీ,

తయోః పుత్రం సమం రాజా న లేభే యత్నవానపి. 18

విద్యుత్ర్పభ, కాంతిమతి యని వారి పేర్లు. ఆ రాజెన్ని సత్కార్యములు చేసినను వారియందు ఆతనికి సంతానము కలుగ లేదు.

యదా తదా మునిశ్రేష్ఠ మాత్రేయం వీతకల్మషమ్‌,

తోషయామాస విధినా చిత్రకూటే నగోత్తమే. 19

అపుడారాజు చిత్రకూటమును దొడ్డ కొండపై పుణ్యాత్ముడగు ఆత్రేయుడను మునిశ్రేష్ఠుని చక్కని పూజతో తృప్తిపరచెను.

స ఋషి స్తోషిత స్తేన దీర్ఘ కాలం వరార్థినా,

వరం దిదత్సయా యావ దబ్రవీ దత్రిజో మునిః. 20

వరము పొందుకోరికతో ఆ రాజు పెద్దకాల మాతనిని సేవించెను. ఆ అత్రివంశపు మునియు వరమునిచ్చు అభిలాషతో ఇట్లు పలుకబోయెను.

తావ దిన్ద్రోపి కరిణా గతః పార్శ్వేన తస్య హ,

దేవసైన్యైః పరివృత స్తూష్ణీమేవ మహాబలః. 21

ఇంతలో దేవసేనలతో కూడి యున్న మహాబలుడగు దేవేంద్రుడు ఐరావత మెక్కి ఆ ఋషి కడకు ఊరకయే వచ్చెను.

తం దృష్ట్వాన్తర్గతప్రీతి మప్రీతిం ప్రీతవాన్‌ మునిః,

చుకోప దేవరాజాయ శాపముగ్రం ససర్జ హ. 22

రాజునెడల ప్రీతిగా నున్న ఆ ముని, లోపలప్రేమ యున్నను పైకి ప్రీతి లేనట్లు కానవచ్చిన ఇంద్రుని చూచి కోపించి తీవ్రమగు శాపము నిట్లొసగెను.

యస్మాత్‌ త్వయా మమావజ్ఞా కృతా మూఢ దివస్పతే,

తత స్త్వం చాలితో రాజ్యా దన్యలోకే వసిష్యసి. 23

స్వర్గాధిపతీ! ఒడలేరుగక నీవు నాకవమానము చేసితివి. ఆ కారణమున రాజ్యమునుండి భ్రష్టుడవై వేరులోకమున వసింతువు'

ఏవ ముక్త్వాపి కోపేన సురేశం తం చ భూపతిమ్‌,

ఉవాచ రాజన్‌ పుత్ర స్తే భవితా దృఢవిక్రమః. 24

ఇట్లు కోపముతో దేవేంద్రుని శపించి రాజును గాంచి 'రాజా! గట్టి పరాక్రమము గల పుత్రుడు నీకు పుట్టును,' అని పలికెను.

ఇన్ధ్ర రూపోపమః శ్రీమా నుద్యచ్ఛస్త్రః ప్రతాపవాన్‌,

విద్యాప్రభావకర్మజ్ఞః క్రూరకర్మా భవిష్యతి,

దుర్జయోతిబలీ రాజా ఏవ ముక్త్వా గతో మునిః. 25

ఇంద్రుని వంటి రూపము, సంపద, చక్కని ఆయుధ విద్య, ప్రతాపము, విద్య, ప్రభావము, ఆయా పనులు నిర్వహించుటలో నేర్పు, ఎవ్వరికిని జయింపరాని తనము, గొప్పబలము కలవాడయ్యు ఆతడు క్రూరకర్ముడగును - అని పలికి మహర్షి వెడలి పోయెను.

సోపి రాజా సుప్రతీకో భార్యాయాం గర్భ మావహత్‌,

విద్యుత్ర్పభాయాం ధర్మజ్ఞః సాపి కాలే వ్యసూయత. 26

ధర్మవేత్త అయిన ఆ రాజు సుప్రతీకుని భార్య విద్యుత్ర్పభకు గర్భమాయెను. ఆమెయు తగుకాలమున ప్రసవించెను.

తస్యాః పుత్రః సమభవద్‌ దుర్జయాఖ్యో మహాబలః,

జాతకర్మాది సంస్కారం తస్య చక్రే మునిః స్వయమ్‌. 27

ఆ విద్యుత్ప్రభకు దుర్జయుడను పేరుగల, గొప్పబలము గల కొడుకు పుట్టెను. వానికి జాతకర్మము మొదలగు సంస్కారము లను ఆ మునియే స్వయముగా గావించెను.

తస్య చేస్టే ర్బలేనాసౌ మునేః సౌమ్యో బభూవ హ,

వేద శాస్త్రార్థవిద్యాయాం పారగో ధర్మవాన్‌ శుచిః. 28

ఆ ముని కావించిన యజ్ఞము బలమున ఆ బాలుడు మంచి వాడయ్యెను. వేదములలో, శాస్త్రములలో, ఇతర విద్యలలో ఆరితేరిన వాడయ్యెను. ధర్మవంతుడు, శుచియు నయ్యెను.

యా ద్వితీయాభవత్‌ పత్నీ తస్య రాజ్ఞో మహాత్మనః,

నామ్నా కీర్తిమతీ ధన్యా తస్యాః పుత్రో బభూవ హ,

నామ్నా సుద్యుమ్న ఇత్యేవం వేదవేదాఙ్గపారగః. 29

మహాత్ముడగు ఆ రాజు రెండవభార్య యగు కీర్తిమతికి ఒక పుత్రుడు కలిగెను. ఆతనిపేరు సుద్యుమ్నుడు. వేదవేదాంగములను తుదిముట్ట చదివెను.

అథ కాలేన మహతా స రాజా రాజసత్తమః,

సుప్రతీకః సుతం దృష్ట్వా దుర్జయం యోగ్యమన్తికే. 30

ఆత్మనో వృద్ధభావంచ వారాణస్యధిపో బలీ,

చిన్తయామాస రాజ్యార్థం దుర్జయం ప్రతి భామిని. 3

అంత పెద్దకాలము గడచిన పిదప వారాణసి ఏలిక యగు సుప్రతీకుడు యోగ్యుడగు కుమారుని దుర్జయుని గాంచి తన ముదిమిని తలపోసి రాజ్యమున దుర్జయుని నిలుపుటకై యోచన చేసెను.

ఏవం సంచిన్త్య ధర్మాత్మా తస్య రాజ్యం దదౌ నృపః,

స్వయం చ చిత్ర కూటాఖ్యం పర్వతం చ జగామ హ. 32

ఆ ధర్మాత్ముడిట్లు భావించి దుర్జయునకు రాజ్య మిచ్చెను. తానును చిత్రకూట పర్వతమున కరిగెను.

దుర్జయోపి మహద్రాజ్యం హస్త్యశ్వరథ పత్తిభిః,

సంయోజ్య చిన్తయామాస రాజ్యవృద్ధిం ప్రతి ప్రభుః. 33

దుర్జయుడును పెద్దరాజ్యమును పొంది ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బలముగలసేనను సమకూర్చుకొని రాజ్యము పెంపుదలను గూర్చి తలపోసెను.

ఏవం సంచిన్త్య మేధావీ హస్త్యశ్వరథపత్తిభిః,

సమేతాం వాహినీం కృత్వా ఉత్తరాం దిశ మాశ్రితః.

ఆ మేధావి తలపోసి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బలము అనువానితో కూడిన సేనను సమకూర్చుకొని ఉత్తరదిక్కునకు బయలుదేరెను.

తస్య చోత్తరతో దేశాః సర్వే సిద్ధా మహాత్మనః. 34

మహాత్ముడగు ఆతనికి ఉత్తరదిక్కున నున్న దేశములన్నియు వశ##మైనవి.

భారతాఖ్య మిదం వర్షం సాధయిత్వా సుదుర్జయః,

తతః కింపురుషం నామ వర్షం తేనాపి సాధితమ్‌. 35

ఓటమి యెరుగని ఆతడు భారతవర్షమును సాధించి యటుపై కింపురుషుమను వర్షమును గూడ చేజిక్కించుకొనెను (వర్షము - దేశము).

తతః పరతరం చాన్య ద్ధరివర్షం జిగాయ సః,

రమ్యం హిరణ్మయం చాపి కురుభద్రాశ్వ మేవచ,

ఇలావృతం మేరుమధ్య మేతత్సర్వం జిగాయ సః. 36

దానికి పైనున్న హరివర్షమును, రమణీయమగు హిరణ్మయవర్షమును, కురుభద్రాశ్వమును, మేరుపునడుమనున్న ఇలా వృతవర్షమును జయించెను.

జిత్వా జమ్బ్వాఖ్య మేతద్ధి ద్వీపం యావదసౌ నృపః,

జగామ దేవరాజానం జేతుం సర్వసురాన్వితమ్‌. 37

ఇట్లు జంబూద్వీపమునంతటిని జయించి ఆరాజు దేవతలందరితో కూడిన దేవేంద్రుని గెలుచుటకు బయలుదేరెను.

మేరు పర్వత మారుహ్య దేవగన్ధర్వదానవాన్‌,

గుహ్యకాన్‌ కింనరాన్‌ దైత్యాంస్తతో బ్రహ్మసుతో మునిః,

నారదో దుర్జయజయం దేవరాజాయ శంసత. 38

అతడు మేరుపర్వత మెక్కి దేవతలను, గంధర్వులను, దానవులను, గుహ్యకులను, కిన్నరులను, దైత్యులను గెలిచెను. అంత బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు దుర్జయుని జయమును దేవరాజున కెరిగించెను.

తత ఇన్ధ్ర స్త్వరా యుక్తో లోకపాలైః సమన్వితః,

జగామ దుర్జయం హన్తుం సోచిరేణాస్త్రనిర్జితమ్‌,

విహాయ పర్వతం మేరుం మర్త్యలోక మిహాగతః. 39

అంత ఇంద్రుడు హూటాహుటిని లోకపాలురతో గూడి దుర్జయుని చంపుటకై బయలుదేరెను. కాని కొలదికాలమునకే దుర్జయుని బాణములకు ఓడి మేరుపర్వతమును విడచి మర్త్య లోకమునకు వచ్చెను.

పూర్వదేశే చ దేవేన్ద్రో లోకపాలైః సమం ప్రభుః,

స్థితవాం స్తస్య సుమహచ్చరితం సంభవిష్యతి. 40

దేవేంద్రుడు లోకపాలురతోపాటు తూర్పు దేశమున నివసించి యుండెను. ఆతని గొప్పచరితము ఇటుపై చెప్పబడును.

దుర్జయశ్చ సురాఞ్జిత్వా యావత్‌ ప్రతినివర్తతే,

గన్ధమాదన పృష్ఠే తు స్కన్ధావారనివేశనమ్‌,

కృత్వావస్థిత సంభార మాగతం తాపసౌ తు తమ్‌. 41

ఇట్లు దుర్జయుడు దేవతలను గెలిచి తిరిగి వచ్చునపుడు గంధమాదనపర్వతముపై సేనలను విడిది చేయించెను. అట్లు విశ్రమించియున్న ఆతనికడకు ఇద్దరు తాపసు లరుదెంచిరి.

తా వాగతా వథాబ్రూతాం రాజన్‌ దుర్జయ లోకపాః,

నివారితా స్త్వయా సర్వం లోకపాలై ర్వినా జగత్‌,

న ప్రవర్తేత తస్మాన్‌ నౌ దేహి తత్పద ముత్తమమ్‌. 42

అట్లు వచ్చిన వారిరువురు 'దుర్జయా! రాజా! నీవు లోకపాలుర నందరిని ఊడగొట్టితివి. లోకపాలుర లేకుండ లోకము నడవదు. కావున ఉత్తమమగు ఆ పదమును మాకిమ్ము' అని పలికిరి.

ఏవ ముక్తే తత స్తౌ తు దుర్జయః ప్రాహ ధర్మవిత్‌,

కౌ భవన్తా వితి తత స్తా పూచతు రిరిన్దమౌ,

విద్యుత్‌సువిద్యు న్నామానా వసురా వితి మానద. 43

వారిట్లనగా ధర్మమెరిగిన దుర్జయుడు మీరెవ్వరని యడిగెను. అంత వారు 'మేము రాక్షసులము. విద్యుత్తు, సువిద్యుత్తు - అని మా పేర్లు' అని చెప్పిరి.

త్వయా సంప్రతి చేచ్ఛామో ధర్మ్యం సత్సు సుసంస్కృతౌ,

లోకపాలమతం సర్వ మావాం కుర్మ సుదుర్జయః. 44

'దుర్జయా! నీవు మమ్ము చక్కగా తీర్చిదిద్దినచో సజ్జనుల యందు ధర్మము తప్పనిపని చేయ గోరుచున్నాము. లోకపాలుర పనినంతయు మేము చేయుదుము.|

ఏవ ముక్తే దుర్జయేన తౌ స్వర్గే సన్నివేశితౌ,

లోకపాలౌ కృతౌ సద్య స్తతోన్తర్ధానం జగ్మతుః. 45

వారిట్లు పలుకగా దుర్జయుడు వారిరువురను స్వర్గమున పాదుకొలిపెను. లోకపాలురను గావించెను. పిదప వారు అదృశ్యులైరి.

తయో రపి మహత్కర్మ చరితం చ ధరాధరే,

భవిష్యతి మహారాజో దుర్జయో మన్దరోపరి.

ధనదస్య వనం దివ్యం దృష్ట్వా నన్దనసన్నిభమ్‌,

ముదా బభ్రామ రమ్యేస్మిన్‌ సయావ ద్రాజసత్తమః. 47

భూదేవీ! వారు చేసిన ఘన కార్యములను, వారి చరిత్రమును ముందు చెప్పెదను.

మహారాజు దుర్జయుడు మందరపర్వతమున నందనము వంటిదయిన కుబేరుని దివ్యవనమును చూచి అందమైన దానియందు ఆనందముతో విహరించెను.

తావత్‌ సువర్ణ వృక్షాధః కన్యాద్వయ మపశ్యత,

అతీవరూప సంపన్న మతీవాద్భూత దర్శనమ్‌. 48

ఇంతలో ఒక బంగారు చెట్టు క్రింద గొప్పరూప సంపదగల చూడముచ్చట గొలుపు ఇద్దరు కన్యలు ఆతనికి కానవచ్చిరి.

దృష్ట్వా తు విస్మయావిష్టః క ఇమే శుభలోచనే,

ఏవం సంచిన్త్య యావత్‌ స క్షణ మేకం వ్యవస్థితః,

తస్మిన్‌ వనే తానదుభౌ తాడసౌ సోవలోకయత్‌. 49

వారిని చూచి అచ్చెరువున మునుగుచు ఈ సుందరాక్షులెవ్వరో! అని తలపోయుచు ఒక్కక్షణ ముండెను. ఇంతలో ఆ వనమున తాపసు లిరవురు గోచరించిరి.

తౌ దృష్ట్వా సహసా రాజా య¸°ప్రీత్యా పరాంముదమ్‌,

అవతీర్య ద్విపాత్‌ తూర్ణం నమశ్చక్రేతయోః స్వయమ్‌. 50

వారిరువురను గాంచి రాజు ప్రీతితో పరమానంద మందెను. ఏనుగునుండి దిగి వారిరువురకు నమస్కరించెను.

ఉపవిష్టః సతాభ్యాం తు కౌశ్యే దత్తే వరాసనే,

పృష్టః కస్త్వం కుతశ్చాసి కస్య వా కి మిహ స్థితః. 51

వారికి శ్రేష్ఠములగు దర్భాసనములొసగి వారితో పాటు కూర్చున్న పిదప వారు నీవెవరవు? ఎందుండి వచ్చితివి? ఎవని కుమారుడవు? ఇచట ఎందుకున్నావు? అని యడిగిరి.

తౌ ప్రహస్యా బ్రవీద్‌ రాజా సుప్రతీకేతి విశ్రుతః,

తస్య పుత్రః సముత్పన్నో దుర్జయో నామ నామతః. 52

రాజునవ్వి వారితో నేను సుప్రతీకుడను. గొప్ప ప్రతిష్ఠకల రాజు కుమారుడను. నా పేరు దుర్జయుడు.

పృథివ్యాం సర్వరాజానో జిగీషన్నిహ సత్తమౌ,

ఆగతోస్మి ధ్రువం చైవ స్మర్తవ్యోహం తపోధనౌ,

భవన్తౌ కౌ సమాఖ్యాతం మమానుగ్రహకాఙ్‌క్షయా. 53

పుణ్యాత్ములగు తపోధనులారా! నేను రాజుల నందరిని గెలుచుకోరికతో ఇటకు వచ్చితిని. నన్ను స్మరింపుడు. దయచేసి మీరెవ్వరో చెప్పుడు.

తాపసా పూచతుః - తాపసు లిట్లు పలికిరి.

ఆవాం హేతృప్రహేత్రాఖ్యౌ మనోః స్వాయంభువఃసుతౌ,

ఆవాం దేవవినాశాయ గతౌ స్వో మేరు పర్వతమ్‌. 54

మేము స్వాయంభువ మనువు కొడుకులము. హేత, ప్రహేత అని మాపేర్లు. మేము దేవతలను రూపుమాపుటకై మేరు పర్వతమున కేగితిమి.

తత్రావయో ర్మహాసైన్యం గజాశ్వరథ సంకులమ్‌,

జిగాయ సర్వదేవానాం శతశోథ సహస్రశః. 55

అచట మా దొడ్డసేన గజములతో, గుఱ్ఱములతో, రథములతో నిండినదై దేవతలను వందల కొలదిగా, వేలకొలదిగా ఓడించెను.

తే చ దేవా మహత్సైన్యం దృష్ట్వా సర్వం నిపాతితమ్‌,

అసురై రుజ్ఘితప్రాణం తతస్తే శరణం గతాః. 56

క్షీరాబ్ధౌ యత్ర దేవేశో హరిః శేతే స్వయం ప్రభుః,

తత్ర విజ్ఞాపయామాసుః సర్వే ప్రణతిపూర్వకమ్‌. 57

రక్కసులవలన ప్రాణములు కోల్పోయిన పెద్ద సేనను గాంచి ఆ దేవతలు పాలకడలిలో నిద్రించు దేవదేవుడగు హరికడ కరిగి మ్రొక్కులు చెల్లించి యిట్లు విన్నవించుకొనిరి.

దేవ దేవ హరే సర్వం సైన్యం త్వసురసత్తమైః,

పరాజితం పరిత్రాహి భీతం విహ్వలలోచనమ్‌. 58

దేవదేవా! హరీ! మా సైన్యమంతయు గొప్పరక్కసుల చేత ఓడిపోయినది. భయముతో గ్రుడ్లు తేలవైచిన ఆ సేనను రక్షింపుము.

త్వయా దేవాసురే యద్ధే పూర్వం త్రాతాః స్మ కేశవ,

సహస్రబాహోః క్రూరస్య సమరే కాలనేమినః. 59

దేవా! నీవు మనువు కూడ దేవదానవులయుద్ధమున వేయి చేతులుగల, క్రూరుడగు కాలనేమియను రక్కసుని బారి నుండి మమ్ము కాపాడితివి.

ఇదానీమపి దేవేశ అసురౌ దేవకణ్టకౌ,

హేతృప్రహేతృనామానౌ బహుసైన్య పరిచ్ఛదౌ,

తౌ హత్వా త్రాహి నః సర్వాన్‌ దేవదేవ జగత్పతే. 60

దేవాధిదేవా! జగత్పతీ! ఇప్పుడు దేవతలకు ప్రాణకంటకులు గొప్పసేన కలవారునగు హేత ప్రహేత అను రక్కసులను చంపి మమ్ముల నందరను కాపాడుము.

ఏవ ముక్త స్తతో దేవో విష్ణుర్నారాయణః ప్రభుః,

అహం యాస్యామి తౌ హన్తు మిత్యువాచ జగత్పతిః. 6

వారిట్లు పలుకగా దేవదేవుడు వారిరువురను హతమార్చుటకై పోయెద నని పలికెను.

ఏవ ముక్తా స్తతో దేవా మేరు పర్వత సన్ని ధౌ,

ప్రతస్థు స్తేథ మనసా చిన్తయన్తో జనార్దనమ్‌. 62

విష్ణు విట్లు చెప్పగా దేవత లందరు మనసున జనార్దనుని ధ్యానించుచు మేరు పర్వతము కడకు పోయిరి.

తైః సంచిన్తిత మాత్రస్తు దేవ శ్చక్రగదాధరః,

ఆవయోః సైన్య మావిశ్య ఏక ఏవ మహాబలః. 63

ఏకధా దశధాత్మానం శతధా చ సహస్రధా,

లక్షధా కోటిధా కృత్వా స్వభూత్యా చ జగత్పతిః. 64

ఇట్లు వారు మనసున ధ్యానింపగా చక్రమును గదను చేపట్టిన మహాబలుడగు నారాయణదేవుడు ఒక్కడే తన్నుతాను పదుగురు, వందమంది, వేయిమంది, లక్షమంది, కోటిమందిగా తన మహిమతో చేసికొని మాపై బడెను.

ఏవం స్థితే దేవవరే అస్మత్సైన్యే మహాబలః,

యః కశ్చిదసురో రాజ న్నావయో ర్బల మాశ్రితః,

స హతః పతితో భూమౌ దృశ్యతే గతచేతనః. 65

ఆ ప్రభు విట్లు కాగా మాసేనలో దొడ్డబలము గల ప్రతి రాక్షసుడును మా బలము పుంజుకొన్న వాడయ్యు, ఆతని దెబ్బకు నేల గూలి ప్రాణములు కోల్పోయి కన్పట్టు చుండెను.

ఏవం తత్‌ సహసా సైన్యం మాయయా విశ్వమూర్తినా,

నిహతం సాశ్వకలిలం పత్తిద్దిపసమాకులమ్‌. 66

చతురఙ్గం బలం సర్వ హత్వా దేవో రథాఙ్గధృక్‌,

ఆవాం శేషావథో దృష్ట్వా గతోన్తర్ధాన మీశ్వరః. 67

ఆ విశ్వమూర్తి తనమాయతో గుఱ్ఱములు, కాల్బలము, ఏనుగులు మొదలగు చతురంగబలములతో కూడిన మా సేన నంతటిని రూపుమాపి మిగిలిన మా యిద్దరను గాంచి యదృశ్యు డాయెను.

ఆవయో రీదృశం కర్మ దృష్టం దేవస్య శారిఙగణః,

తతస్తమేవ శరణం గతా వారాధనాయ వై. 68

మేమిరువురము శార్జపాణిదగు నీ ఘనకార్యమును గాంచి ఆతనినే శరణు చొచ్చితిమి. ఆతనిని పూజింప దొరకొంటిమి.

త్వం చాస్మ న్మిత్రతనయః సుప్రతీకాత్మజో నృప,

ఇమేచ ఆవయోః కన్యే గృహాన మనుజేశ్వర,

హేతృకన్యా సుకేశీతు మిశ్రకేశీ ప్రహేతృణః. 69

రాజా! నీవు మా మిత్రము కుమారుడవు. వీరిరువురు మా బిడ్డలు. ఇందు హేతుని బిడ్డ సుకేశి. ప్రహేత తనయ మిశ్రకేశి. వీరిరువురను నీవు చేపట్టుము.

దుర్జయ స్త్వేవముక్తస్తు హేతృణా తే ఉభే శుభే,

కన్యే జగ్రాహ ధర్మేణ భార్యార్థం మనుజేశ్వరః. 70

హేత యిట్లు పలుకగా దుర్జయమహారాజు చక్కని ఆ కన్యల నిద్దరను ధర్మమార్గమున భార్యలనుగా స్వీకరించెను.

తే లబ్ధ్వా సహసా రాజా ముదా పరమయా యుతః,

ఆజగామ స్వకం రాష్ట్రం నిజసైన్య సమావృతః. 71

అట్లు రాజు వారిరువురను స్వీకరించి పరమానందముతో తనసేనతో కూడి తన రాష్ట్రమునకు తిరిగి వచ్చెను.

తతః కాలేన మహతా తస్య పుత్రద్వయం బభౌ,

సుకేశ్యాః సుప్రభః పుత్రో మిశ్రకేశ్యాః సుదర్శనః. 72

అంత కొంతకాలమునకు ఆతనికి సుకేశి యందు సుప్రభుడు, మిశ్రకేశియందు సుదర్శనుడు అను కొడుకులు పుట్టిరి.

సరాజా దుర్జయః శ్రీ మాల్లబ్ధ్వా పుత్రద్వయం శుభమ్‌,

స్వయం కాలాన్తరే శ్రీమఞ్జగామారణ్య మన్తికే. 73

ఇట్లు శ్రీమంతుడగు దుర్జయుడు పుత్రుల నిరువురను పొంది కొంత కాలము గడచిన పిదప దగ్గరలో నున్న ఆరణ్యమున కరిగెను.

తత్రస్థో వనజాతీ ర్హి బన్ధయన్‌ వై భయంకరాః,

దదర్శారణ్య మాశ్రిత్య మునిం స్థిత మకల్మషమ్‌. 74

అందుండి ఆతడు భయంకరమగు ఆటవిక జాతుల వారిని లొంగదీసికొనుచు ఒకనాడు అడవిలో నున్న పుణ్యాత్ముడగు ముని నొక్కని గాంచెను.

తపస్యన్తం మహాభాగం నామ్నా గౌరముఖం శుభమ్‌,

ఋషివృన్దస్య గోప్తారం త్రాతారం పాపినః స్వయమ్‌. 75

ఆ మహర్షి తపస్సు చేసికొనుచుండెను. ఆతని పేరు గౌరముఖుడు. ఆతడు ఋషులను కాపాడుచుండెను. పాపాత్ముల పాపములను రూపుమాపుచుండెను.

తస్యాశ్రమే విమలజలావిలే మరు -

త్సుగన్ధి వృక్షప్రవరే ద్విజన్మనః,

రరాజ జీమూత ఇవామ్బరా న్మహీ -

ముపాగతః ప్రవరవిమానవద్‌ గృమః. 76

నిర్మలములగుజలములు, గాలికి కదలాడు పువ్వుల నుండి వీతెంచు సువాసనలుగల వృక్షములు గల ఆ బ్రాహ్మణుని ఆశ్రమమున నింగినుండి నేలకు దిగి వచ్చిన మేఘమో యన్నట్టిదియు, శ్రేష్ఠమగు విమానము వంటిదియు నగు భవనమొకటి వచ్చి నిలిచెను.

జ్వలనమఖాగ్ని ప్రతిభా సితామ్బరః

సుశుద్ధసంవాసిత వేశకుట్టకః,

శిషై#్యః సముచ్చారిత వేదనాదకః

సురుపయోషిదృషి కన్యకా కులః,

ఇతీ దృశో స్యావసథో వరాశ్రమే

సుపుష్పితాశేష తరుప్రసూనః. 77

ఆ భవనము హోమాగ్నుల జ్వాలలతో విరాజిల్లు ఆకాసము కలదై యుండెను. దాని ముంగిలి భాగములు చక్కని సుగంధ ద్రవ్యముల వాసనలను వెదజల్లుచుండెను. శిష్యులు, వేదవాదములు చక్కగా చేయుచుండిరి. రూపవతులగు కాంతలు, కన్యలు అటునిటు అందు తిరుగుచుండిరి. అందలి చెట్లన్నియు విరుగబూచిన పూవులతో అలరారుచుండెను. ఆ దొడ్డ ఆశ్రమమున ఆ మని గృహమట్లు విరాజిల్లుచుండెను.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్చాస్త్రే దశమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పదియవ యధ్యాయము

Varahamahapuranam-1    Chapters