Varahamahapuranam-1    Chapters   

శతతమోధ్యాయః - నూరవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత చెప్పెను.

రసధేనువిధానం తే కథయామి సమాసతః,

అనులిప్తే మహీవృష్ఠే కృష్ణాజిన కుశోత్తరే. 1

రసస్యతు ఘటం రాజన్‌ సంపూర్ణం స్థాపయేత్‌ తతః,

తురీయాంశేన వత్సంతు తత్పార్శ్వే స్థాపయేత్‌ సుధీః. 2

రాజా! రసధేను విధానమును సంక్షేపముగా చెప్పెదను. అలికిన నేలపై నల్లలేడి చర్మమును, దర్భాసనమును ఉంచి దానిపై చెరకురసము నింపినఘటమును ఉంచవలయును. దానిలో నాలుగవ భాగముతో దూడను ఏర్పరచి దానిప్రక్క నిలుపవలయును.

ఏవం కార్యా రసధేను రిక్షు పాదసమన్వితా,

సువర్ణశృంగాభరణా వస్త్ర పుచ్ఛా ఘృతస్తనీ,

పుష్పకంబల సంసక్తా శర్కరాముఖిజిహ్వికా. 3

రసధేనువు నిట్లు చేయవలయును. చెరకుగడల కాళ్ళు, బంగారు నగల కొమ్ములు, వస్త్రముతోడితోక, నేతితో పొదుగు. పూవులు కూర్చిన గంగడోలు, చక్కెరతో ముఖము, నాలుక - ఇవి కూర్పవలయును.

దన్తాః ఫలమాయాస్తస్యాః పృష్ఠే తామ్రమయీం శుభామ్‌,

పుష్పరోమాం తు రాజేన్ధ్ర ముక్తాఫలకృతేక్షణామ్‌. 4

సప్తవ్రీహిసమాయుక్తాం చతుర్దిక్షు చ దీపికామ్‌,

సర్వోపస్కరసంయుక్తాం సర్వగన్ధాధివాసితామ్‌,

చత్వారి తిలపాత్రాణి చతుర్దిక్షు నివేశ##యేత్‌. 5

ఫలములతో దంతములు, రాగితో వెనుకభాగము, పూవులతో వెంట్రుకలు, ముత్యములతో చూపులు కల్పించి ఏడు విధములగు ధాన్యములను కూర్పవలయును. మంచిపరిమళము లను కూర్పవలయును. నాలుగు వైపుల నాలుగు నూగుల పాత్ర లను ఉంచవలయును.

బ్రాహ్మణ వేదవిదుషే శ్రోత్రియాయాహితాగ్నయే,

పురాణజ్ఞే విశేషేణ సాధువృత్తాయ ధీమతే,

తాదృశాయ ప్రదాతవ్యా రసధేనుః కుటుంబినే. 6

వేదవిద్వాంసుడు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, పురాణముల నెరిగినవాడు, విశేషించి మంచి నడవడి గల బుద్ధిశాలి, కుటుంబము కలవాడు అగు బ్రాహ్మణునకు ఆ గోవును దాన మీయవలయును. (శ్రోత్రియుడనగా వేదములను అధ్యయనము చేసినవాడు, వేద విద్వాంసుడనగా - వేదార్థములను చక్కగా తెలిసినవాడు; అహితాగ్ని - ఇంటిలో నిరంతరము అగ్నులను ఉంచుకొని పూజించువాడు)

దాతా స్వర్గ మవాప్నోతి సర్వపాపవివర్జితః,

దాతా చ గ్రాహకో వాథ ఏకాహం రసభోజనే. 7

దాత పాపములులేనివాడై స్వర్గమును పొందును. దాతయు, గ్రహించువాడును ఒకదినము రసము మాత్రమే ఆహారముగా గొనవలయును.

సొమపానఫలం తస్య సర్వక్రతుఫలం భ##వేత్‌,

దీయమానాం తు పశ్యన్తే తే యాన్తి పరమాం గతిమ్‌. 8

సోమముపానము చేసిఫలము, అన్నియాగములు చేసిన ఫలము అతనికి కలుగును. ఆ ఆవును దానమిచ్చుచుండగా చూచువారును పరమగతి కరుగుదురు.

ధేనుం చ పూజయిత్వాగ్రే గంధధూపస్రగాదిభిః,

పూర్వోక్తాని చ మన్త్రాణి తాని చ ప్రయతః స్మరేత్‌. 9

ముందు గంధము, ధూపము, మాలలు మొదలగువానితో ధేనువును పూజించి మునుపు చెప్పిన మంత్రములను శ్రద్ధతో స్మరింపవలయును.

ఏవ ముచ్చారయిత్వా తు దీయతే వై ద్విజోత్తమే,

దశ పూర్వాన్‌ పరాంశ్చైవ ఆత్మానం చైకవింశకమ్‌.

ప్రాపయేత్‌ పరమం స్థానం స్వర్గాన్నావర్తతే పునః. 10

ఇట్లు పలికి ద్విజశ్రేష్ఠునకు ఇచ్చినవాడు, తన వెనుక పదితరముల వారిని, తనముందు పదితరములవారిని, తనతో కలుపుకొని మొత్తము ఇరువదియొక్క తరములవారిని పరమగతిని పొందించును. స్వర్గమునుండి మరల తిరిగి రాడు.

ఏషా తే కథితా రాజన్‌ రసధేను రనుత్తమా,

దదస్వ చ మహారాజ పరం స్థానం తథాప్నుహి. 11

రాజా! ఇట్లు నీకు మిక్కిలి ఉత్తమమైన రసధేనువును గూర్చి చెప్పితిని. దానిని దానమిమ్ము. పరమస్థానమును ఆ విధముగా పొందుము.

య ఇదం పఠతే నిత్యం శృణుయా దథ భక్తితః,

సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే. 12

దీనిని భక్తితో చదువువాడును, వినువాడును సర్వపాపము లను పోగొట్టుకొని విష్ణులోకమునందు ప్రతిష్ఠనొందును.

ఇతి శ్రీ వరహపురాణ భగవచ్ఛాస్త్రే శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణ మను భగవచ్ఛాస్త్రమున నూరవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters