Varahamahapuranam-1    Chapters   

నవాధికశతతమోధ్యాయః - నూటతొమ్మిదవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత పలికెను.

శృణు రాజన్‌ ప్రయత్నేన దానమాహాత్మ్య ముత్తమమ్‌,

యస్య సంకీర్తనా దేవ సంతుష్యేత్‌ పార్వతీ స్వయమ్‌,

విషువే చాయనే వాపి కార్తిక్యాం తు విశేషతః. 1

రాజా! ఉత్తమమగు దానమాహాత్మ్యమును వినుము. దీనిని సంకీర్తించినంతమాత్రమున పార్వతీదేవి సంతోషమందును. విశేషించి విషువమునందును, అయనమునందును, కార్తీకమాసము నందును ఇది వినవలయును.

తదిదానీం ప్రవక్ష్యామి ధాన్యధేనో ర్విధిం పరమ్‌,

యాం దత్వా సర్వపాపేభ్యో విముక్తో రాజసత్తమ,

శోభ##తే కాన్తిమాన్‌ ముక్తః శశాఙ్క ఇవ రాహుణా. 2

అందువలన ఇప్పుడు ధాన్యధేనువు దానపద్ధతిని చెప్పెదను. దీని నిచ్చినచో పాపము లన్నింటినుండి విముక్తుడై రాహువువదలిన చంద్రునివలె కాంతిమంతుడై శోభిల్లును.

దశ##ధేనుప్రదానేన యత్‌ ఫలం రాజసత్తమ,

తత్‌ సర్వమేవ ప్రాప్నోతి వ్రీహిధేనుప్రదో నరః. 3

పది ఆవులను దానము చేయుటవలన కలుగు ఫలమును అంతటిని ధాన్యధేనువు నొసగునరుడు పొందును.

కృష్ణాజినం సమీచీనం ప్రాగ్రీవం విన్యసేద్‌ బుధః,

గోమయేనానులిప్తాయాం శోభనాం వస్త్రసంయుతామ్‌,

పూజయేద్‌ నేదిమధ్యే తు వేదనిర్ఘోష మంగలైః. 4

ఆవుపేడతో అలికిన నేలపై తూర్పుదిక్కునకు కంఠభాగముండునట్లుగా నల్లలేడి చర్మమును ఉంచవలయును. దానిపై వస్త్రములతో కూడిన ధాన్యధేనువును వేదినడుమ ఉంచి వేదనాదములతో మంగళ వాద్యములతో పాటుగ పూజింపవలయును.

ఉత్తమా యా తు ధేనుః స్యాద్‌ ద్రోణౖశ్చాపి చతుష్టయమ్‌,

మధ్యమా చ తదర్ధేన విత్తశాఠ్యం స కారయేత్‌,

చతుర్థాంశేన ధేన్వా వై వత్సం తు పరికల్పయేత్‌. 5

నాలుగుతూములతో చేయు ధేనువు ఉత్తమ. అందుసగమై నచో మధ్యమ, ధనము విషయమున వంచన చేయరాదు. ఆవులో నాలుగవ భాగముతో దూడను కూర్పవలయును.

కర్తవ్యౌ రుక్మ శృఙ్గా తు రాజతం ఖురసంయుతమ్‌,

గోమేధా కుక్షి సంకుర్యాత్‌ ఘ్రాణ మాగురుచందనమ్‌. 6

ముక్తాఫలమయా దన్తా ఘృతక్షౌద్రమయం ముఖమ్‌,

ప్రశస్త పత్రశ్రవణాం కాంస్యదోహనకాన్వితామ్‌. 7

ఇక్షుయష్టిమయాః పాదాః క్షౌమపుచ్ఛసమన్వితామ్‌,

నానాఫలసమోపేతాం రత్నగర్భ సమన్వితామ్‌,

పాదుకోపానహచ్ఛత్రం భాజనం తర్పణం తథా. 8

బంగారముతో కొమ్ములు, వెండితో గిట్టలు, గోమేధికముతో కడుపు, అగురుచందనముతో నాసిక, ముత్యములతో దంతములు, నేయి వెన్నలతో ముఖము, మంచి ఆకులతో చెవులు, కంచుపాత్ర, చెరకుగడలతో పాదములు, పట్టుబట్టతో తోకను కూర్చి సర్వ విధము లగు పండ్లను, రత్నములను సమీపమున నుంచవలయును. పాదుకలు, చెప్పులు, గొడుగు, పాత్ర, మంచి భోజనములను ఏర్పరుపవలయును.

ఇత్యేవం రచయిత్వా తాం కృత్వా దీపార్చనాదికమ్‌,

పుణ్యకాలం చ సంప్రాప్య స్నాతః శుక్లాంబరో గృహీ,

త్రిః ప్రదక్షిణ మావృత్య మన్త్రాణా మనుకీర్తయేత్‌. 9

ఇట్లు అన్నియు చక్కగా ఏర్పరచి దీపార్చన మొదలగునవి కూర్చుకొనవలయును. పుణ్యకాలము రాగా స్నానముచేసి తెల్లని వస్త్రములు తాల్చి గృహస్థు మంత్రములను చదువుచు మూడు మారులు ప్రదక్షిణము తిరుగవలయును.

త్వం హి విప్ర మహాభాగ వేదవేదాంగపారగ,

ఏతాం మమోపకారాయ గృఫ్ణీష్వ త్వం ద్విజోత్తమ,

ప్రీయతాం మమ దేవేశో భగవాన్‌ మధుసూదనః. 10

మహనుభావా! వేదవేదాంగ విశారదా! ద్విజోత్తమా! విప్రి! నీవు నా ఉపకారమునకై ఈ ఆవును గ్రహింపుము. దీని వలన భగవంతుడు, దేవదేవుడు, మధుసూదనుడు నా విషయమున ప్రీతి నందుగాక.

త్వమేకా లక్ష్మి గోవిందే స్వాహా యాచ విభావసోః,

శ##క్రే శచీతి విఖ్యాతా శివే గౌరీతి సంస్థితా. 11

గాయత్రీ బ్రాహ్మణ ప్రోక్తా జ్యోత్స్నా చన్ధ్రే రవేః ప్రభా,

బుద్ధి ర్బృహస్పతేః ఖ్యాతా మేధా మునిషు సత్తమా,

తస్మాత్‌ సర్వమయీ దేవీ ధాన్యరూపేణ సంస్థితా. 12

తల్లీ ధాన్యలక్ష్మీ! నీవు గోవిందుని యందు లక్ష్మిని. అగ్ని యందు స్వాహవు. ఇంద్రునియందు శచివి. శివుని విషయమున గౌరివి. బ్రాహ్మణుని యందు గాయత్రివి. చంద్రునియందు వెన్నెలవు. రవియందు ప్రభవు. బృహస్పతి యందలి బుద్ధివి. మునులయందు ఉత్తమయగు మేధవు. ఇట్లని ప్రశస్తికెక్కితివి. అందువలన నీవు సర్వమయిని. ధాన్యరూపమున నెలకొనియున్నావు.

ఏవ ముచ్చార్య తాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌,

దత్వా ప్రదక్షిణం కృత్వా తం క్షమాప్య ద్విజోత్తమమ్‌. 13

ఇట్లు పలికి ఆ ధేనువును ప్రదక్షిణించి బ్రాహ్మణునికి క్షమాపణము చెప్పుకొని దానమొసగవలయును.

యావచ్చ పృథివీ సర్వా వస్తురత్నాని భూపతే,

తావత్‌ పుణ్యసమాధిక్యం వ్రీహిధేనోశ్చ తత్ఫలమ్‌. 14

సమస్తమైన పృథివి ఎంతయో, సమస్తమగు వస్తురత్నము లెంతటియో వానినన్నింటి నిచ్చిన పుణ్యముతో వ్రీహిధేనువు నిచ్చిన ఫలము సమానమగును. లేదా అధికమగును.

తస్మా న్నరేన్ధ్ర దాతవ్యా భుక్తిముక్తి ఫలప్రదా,

ఇహలోకే చ సౌభాగ్యమాయు రారోగ్య వర్ధనమ్‌. 15

అందువలన రాజా! భుక్తి ముక్తలనెడు ఫలముల నొసగు ఈ ధాన్యధేనువును దానమీవలమును. దీనివలన ఈ లోకమున సౌభాగ్యము, ఆయువు, ఆరోగ్యము పెంపొందును.

విమానేనార్కవర్ణేన కింకిణీరత్నమాలినా,

స్తూయమానో ప్సరోభిశ్చ స యాతి శివమందిరమ్‌. 16

సూర్యునికాంతివంటి కాంతికలదియు, చిరుగంటల రత్నముల మాలలు కలదియునగు విమానముతో, అప్సరసలు కొనిమాడుచుండగా అతడు శివమందిరమున కరుగును.

యావచ్చ స్మరతే జన్మ తావత్‌ స్వర్గే మహీయతే,

తతః స్వర్గాత్‌ పరిభ్రష్టో జంబూద్వీపపతి ర్భవేత్‌. 17

జన్మస్మరణమున్నంతకాలము స్వర్గమున ప్రసిద్ధిపడయును. పిమ్మట స్వర్గమునుండి దిగివచ్చి జంబూద్వీపపతి యగును.

ఏవం హరముఖోద్గీర్ణం శ్రుత్వా వాక్యం నరోత్తమ,

సర్వపాపవిశుద్ధాత్మా రుద్రలోకే మహీయతే. 18

ఇట్లు శివునిముఖము నుండి వెలువడిన వాక్యమును విని సర్వపాపములు పోగా విశుద్ధమైన ఆత్మకలవాడై రుద్రలోకమున ప్రతిష్ఠ నొందును.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే నవాధికశథతతమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పరాణమను భగవచ్ఛాస్త్రమున నూటతొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters