Varahamahapuranam-1    Chapters   

షోడశాధిక శతతమోధ్యాయః. - నూటపదునారవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు భ##ద్రే మహాశ్చర్య మాహారవిధి నిశ్చయమ్‌,

ఆహారం చాప్యనాహారం తచ్ఛ్రుణుష్వ వసుంధరే. 1

వసుంధరా! మరియొక గొప్పవింతను వినుము. ఇది ఆహార విధికి సంబంధించిన నిశ్చయము. ఏది ఆహారము, ఏదికాదు అను విషయమును గూర్చి వినుము.

భుంజానో యేతి చాశ్నాతి మమ యోగాయ మాధవి,

అతుల్యం కర్మకృత్వాపి పురుషో ధర్మ మాశ్రితః. 2

మాధవీ! నాయోగము కొరకు మిక్కిలిగా భుజించుచు, సాటిలేని కర్మము చేసియు నరుడు ధర్మము నాశ్రయించినవాడే యగును.

ఆహారం చైవ కర్మజ్ఞా ఉపభుఞ్జన్తి నిత్యశః,

సర్వే చాత్రైవ కర్మణ్యా వ్రీహయః శాలయ స్తథా. 3

కర్మవిధానము తెలిసినవారు, కర్మములకు కట్టుబడి యుండువారును అగునరులు ధాన్యములకు సంబంధించిన ఆహారమును నిత్యము తీసికొనుచుందురు.

అకర్మణ్యాని వక్ష్యామి యేన భోజ్యన్తి మాం ప్రతి,

తేన వై ముక్తమార్గేణ అపరాధో మహౌజసః. 4

నా విషయములో కర్మములకు విరుద్ధములైన భోజనములను గూర్చి చెప్పెదను. దారితప్పిన అట్టి ఆహారము చేత గొప్ప శక్తివలవానికిని అపరాధము కలుగును.

ప్రథమం చాపరాధాని న రోచన్తే మమ ప్రియే,

భుక్త్వా తు పరకీయాన్నం తత్పర స్తన్నివర్తనః,

ప్రథమ శ్చాపరాధోయం ధర్మవిఘ్నాయ వై భ##వేత్‌. 5

మొదటగా, ప్రియా, అపరాధములు నాకు రుచింపవు. నరుడు అదియేపనిగా ఇతరుల అన్నమును వృత్తిగాపెట్టుకొని తినుట మొదటి అపరాధము. అది ధర్మమునకు విఘ్నమును కలిగించును.

అభుక్త్వా దన్తకాష్ఠాని యస్తు మాముపసర్పతి,

ద్వితీయ మపరాధం తు కర్మవిఘ్నాయ వర్తతే. 6

పలుదోమువుల్లలను ఉపయోగింపక (పండ్లు తోముకొనక) నాకడకు చేరుట రెండవ అపరాధము. అది కర్మవిఘ్నము కొరకు ప్రవర్తించుట యగును.

గత్వా మైథున సంయోగం యోను మాంస్పృశ##తే నరః.

తృతీయ మపరాధం తు కల్పయామి వషుంధరే. 7

వసుంధరా! స్త్రీసంగమముచేసి వెనువెంటనే నన్ను తాకునరుడు మూడవఅపరాధము చేసినవాడని నేను భావింతును.

దృష్ట్వా రజస్వలాం నారీ మస్మాకం యః ప్రపద్యతే,

చతుర్థ మపరాధం తు దృష్టేవై న క్షమా మ్యహమ్‌. 8

ముట్టుతను చూచి మాకడకు వచ్చుట నాల్గవ అపరాధము. దానిని నేను క్షమింపను.

దృష్ట్వాతు మృతకం చైవ నాచమ్య స్పృశ##తే తు మామ్‌,

పంచమం చాపరాధం తు న క్షమామి వసుంధరే. 9

చచ్చినవానిని చూచి ఆచమనము చేయక నన్ను తాకుట అయిదవ తప్పు. వసుంధరా! నేను దానిని సహింవను.

స్పృష్త్వాతు మృతకం చైవ అసంస్కారకృతం చ వై,

షష్ఠ మిమం చాపరాధం న క్షమామి వసుంధరే. 10

సంస్కారము పొందని శవమును తాకి నన్ను అర్చించుట అను నీ ఆరవతప్పును పును క్షమింపను.

మమై వార్చనకాలే తు పురీషం యస్తు గచ్ఛతి,

సప్తమం చాపరాధం తు కల్పయామి వసుంధరే. 11

నన్ను పూజించు కాలమున మలవిసర్జమున కరుగుట అనుదానిని ఏడవ దోషముగా నేను సంభావింతును.

యస్తు నీలేన వస్త్రేణ ప్రావృతో మాం ప్రపద్యతే,

అష్టమం చాపరాధం తు కల్పయామి వసుంధరే. 12

నల్లని వస్త్రమును చుట్టుకొని నన్ను పూజించుట ఎనిమిదవతప్పుగా నేను పరిగణింతును.

మమై వార్చనకాలే తు యన్త్వసత్యం ప్రభాషతి,

నవమం చాపరాధం తు న రోచామి వసుంధరే. 13

నాపూజాకాలమునందు అబద్ధము పలుకుట తొమ్మిదవ అపరాధము. అదినాకు రుచింపదు.

అవిధానేన సంస్పృశ్య యస్తు మాం ప్రతిపద్యతే,

దశమం చాపరాధం తు మమ చాప్రియకారణమ్‌. 14

విధానమునకు విరుధ్దముగా నన్ను తాకి అర్చనచేయుట నాకు అప్రియమునకు కారణమగు పదియవ దోషము.

క్రుద్ధస్తు యాని కర్మాణి కురుతే కర్మకారకః,

ఏకాదశాపరాధం తు కల్పయామి వసుంధరే. 15

కోపముతో చిరచిరలాడుచు నాపూజాకార్యములను చేయుట పదునొకండవ తప్పుగా నేను లెక్కింతును.

అకర్మణ్యాని పుష్పాణి యస్తు మాముపకల్పయేత్‌,

ద్వాదశం చాపరాధంతు కల్పయామి వసుంధరే. 16

దైవకార్యములకు పనికి రాని పూవులను నా కర్పించుట పండ్రెండవ దోషముగా నేను పరిగణింతును.

యస్తు రక్తేణ వస్త్రేణ కౌసుంభే నోపగచ్ఛతి,

త్రయోదశాపరాధం తు కల్పయామి వసుంధరే. 17

కుసుమపూవువంటి ఎర్రనివన్నెగల వస్త్రము తాల్చి నాకడ కరుదెంచుట పదుమూడవ తప్పు.

అంధకారే చ మాం దేవి యః స్పృశేత కదాచన,

చతుర్ధశాపదాధం తు కల్పయామి వసుంధరే. 18

ఎన్నడుగాని చీకటిలో నన్ను తాకుట పదునాల్గవ దోషముగా నేను లెక్కింతును.

యస్తు కృష్ణేన వస్త్రేణ మమ కర్మాణి కారయేత్‌

పఞ్చదశాపరాధంతం కల్పయామి వరాననే. 19

నల్లని బట్ట కట్టి నాపూజాకార్యములను చేయుట పదునైదవ దోషముగా నేను పరిగణింతును.

వాససా మవధూతంతు యస్తు మాముపకల్పయేత్‌,

షోడశం త్వపరాధానాం కల్పయామి వరాననే. 20

బట్టలు దులుపుచు నాకడ కరుదెంచుట దోషములలో పదునారవదిగా నేను సంభావింతును.

స్వయ మన్నం తు యో దద్యా దజ్ఞానాయ చ మాధవి,

సప్తదశాపరాధం తు కల్పయామి వసుంధరే. 21

జ్ఞానమలేనివానికి పిలిచి అన్నము పెట్టుటను, మాధవీ! పదునేడవతప్పుగా నేను లెక్కింతును.

యస్తు మాత్స్యాని మాంసాని భక్షయిత్వా ప్రపద్యతే,

అష్టాదశాపరాధం తు అనుజానామి మాధవి. 22

చేపలు, మాంసములు మెక్కి నాపూజ కరుదెంచుట పదునెనిమిదవ దోషముగా నేను భావింతును.

జాలపాదం భక్షయిత్వా యస్తు మాముపసర్పతి,

ఏకోనవింశాపరాధం ప్రతిజానామి సుందరి. 23

సుందరీ! బాతుమాంసము తిని నన్ను దరిజేయుటను పందొమ్మిదవతప్పుగా నేను భావింతును.

నాచామేద్‌ దీపకం స్పృష్ట్వా యో మాం స్పృశతి మాధవి,

వింశకం చాపరాధాని కల్పయామి వరాననే. 24

దీపమును తాకి ఆచమనము చేయక నన్నుతాకుట, మాధవీ! ఇరువదియవ దోషము.

శ్మశానం యశ్చ వై గత్వా యో మామే వాభిగచ్చతి,

ఏకవింశాపరాధం తం కల్పయామి వసుంధరే 25

వల్లకాటికరిగి నాకడ కరుదెంచుట ఇరువదియొకటవ తప్పు.

పిణ్యాకం భక్షయిత్వా తు యో మామేవోపచక్రమే,

ద్వావింశత్యపరాధంతు తమహం చోపకల్పయే. 26

పిండి తిని నన్నర్చింప వచ్చుట యిరువది రెండవ తప్పుగా నేను సంభావింతును.

యస్తు వారాహమాంసాని ప్రాపణ నోపపాదయేత్‌,

అపరాధం త్రయోవింశం కల్పయామి వసుంధరే. 27

పందిమాంసములను నాకు నైవేద్యముగా తెచ్చుటను ఇరువదిమూడవ అపరాధముగా పరిగణింతును.

సురాం పీత్వా తు యో మర్త్యః కదాచిదుపసర్పతి,

అపరాధం చతుర్వింశం కల్పయామి వసుంధరే. 28

నరు డెన్నడైనను మద్యము త్రావి నన్నర్చింపవచ్చినచో దానిని ఇరువదినాల్గవ దోషముగా నేను పరిగణింతును.

యః కుసుంభం చ మేశాకం భక్షయిత్వోపచక్రమే,

అపరాధం పఞ్చవింశం కల్పయామి సుమధ్యమే. 29

కుసుమల కూరను తిని నన్ను పూజించుటకు పూనుకొనుట ఇరువది యైదవ దోషము.

పరప్రావరణ చైవ యస్తు మాముపసర్పతి,

అపరాధేషు షడ్వింశం కల్పయామి మనోరమే. 30

ఇతరుల వస్త్రములను తాల్చి నన్ను పూజింప నరుదెంచుట ఇరువది ఆరవదోషము.

నవాన్నం యస్తు భ##క్షే న దత్వా పితృదేవతే,

సప్తవింశం చాపరాధం కల్పయామి గుణాన్వితే. 31

పితృదేవతలకు పెట్టక క్రొత్త అన్నమును కుడుచుట ఇరువదియేడవదోషము.

ఉపానహా సహాసీనో మమార్చాయోపచక్రమే,

అష్టావింశాపరాధంతం కల్పయామి గుణాన్వితే. 32

చెప్పులతోపాటు కూర్చుండి నాపూజకు ఉపక్రమించుట ఇరువదియెనిమిదవ తప్పు.

శరీరం మర్దయిత్వా తు యో మామాప్నోతి మాధవి,

ఏకోనత్రింశాపరాధస్తత్‌ స్వర్గేషు న గచ్ఛతి. 33

శరీరమును మర్దనచేసికొని నాకడకు వచ్చుట ఇరువదితొమ్మిదవ తప్పు. అది చేసినవాడు స్వర్గమును పొందడు.

అజీర్ణేన సమావిష్టో యస్తు మాముపగచ్ఛతి,

త్రింశకం చాపరాధంతు కల్పయామి వసుంధరే. 34

అజీర్ణము పైకొనగా నన్ను సమీపించుట ముప్పది యవదోషముగా నేను భావింతును.

గంధపుష్పాణ్యదత్వా తు యస్తు ధూపం ప్రయచ్ఛతి,

ఏకత్రింశాపరాధం తు కల్పయామి మనస్విని. 35

అభిమానవతీ! గంధము, పూవులు సమర్పింపక ధూపము నిచ్చుట ముప్పదియొకటవ దోషముగా నేను లెక్కింతును.

వానా భేర్యాది శ##బ్దేన ద్వారస్యోద్ఘాటనం మమ,

మహాపరాధం విద్యేత తద్‌ద్వాత్రింశాపరాధకమ్‌. 36

భేరిమొదలగువాని నాదము లేకుండ నా వాకిలి తలుపు తెరచుట పెద్దతప్పు. అదిముప్పదిరెండవదోషము.

అన్యచ్ఛ్రుణు ప్రవక్ష్యామి దృఢవ్రత మనుత్తమమ్‌,

కృత్వా తు పుష్కలం కర్మ మమలోకం చ గచ్ఛతి. 37

మిక్కిలి శ్రేష్ఠమైనది, చాలగట్టిది అగుమరియొకదానిని గూర్చి చెప్పెదను వినుము. పుష్కలమైన ఆ కర్మము నాచరించినవాడు నాలోకమున కరుగును.

నిత్యో యుక్తశ్చ శాస్త్రజ్ఞో మమ కర్మపరాయణః,

అహింసాపరమ శ్చైవ సర్వభూతదయా పరః. 38

సామాన్యశ్చ శుచిర్దక్షో మమ నిత్యం పథి స్థితః,

నిగృహ్య ఇన్ద్రియాన్‌ సర్వా సపరాధవివర్జితః. 39

నిత్యము నాయందు లగ్నమైన భావము కలవాడు, నా అర్చనలయందు మిక్కిలి శ్రద్ధకలవాడు, అహింసపరమధర్మమని నమ్మినవాడు, అన్ని భూతముల యందును దయకలవాడు, సమానదృష్టికలవాడు, పరిశుద్దుడు, నామార్గమును ఎన్నడును తప్పనివాడు, ఇంద్రియములపై అదుపుకలిగి సర్వాపరాధములను వదలినవాడును నాలోకమున కరుగును (38, 39)

ఉదారో ధార్మికశ్చైవ స్వదారేషు సునిష్ఠితః,

శాస్త్రజ్ఞః కుశలశ్చైవ మమ కర్మపరాయణః. 40

ఉదారుడు, ధర్మప్రవర్తనకలవాడు, ధర్మపత్నియందు చెదరనిబుద్ధికలవాడు, శాస్త్రములరహస్యముల నెరిగినవాడు, పనులయందు నేర్పరి, నా అర్చనలయందు నిష్ఠకలవాడు, నాలోకమున కరుగును.

చాతుర్వర్ణ్యస్య మే భ##ద్రే సన్మార్తే నిశ్చితా స్థితిః,

మిధ్యా మే వచనం నైవ మమ లోకాయ గచ్ఛతి. 41

ఈ చక్కని మార్గమున నిలుకడతో నుండు నాలుగు వర్ణములవారును, నామాట అబద్ధముకానే కాదు, నాలోకమున కరుగుదురు.

యస్య భార్యా శుచి ర్దక్షా మమ కర్మపథి స్థితా,

ఆచార్యభక్తా దేవేషు భక్తా భర్తరి వత్సలా. 42

సంసారేష్వసి వర్తన్తీ గచ్ఛతే అగ్రతో యది,

మమ లోకస్థితా స్థానే భర్తారం సంప్రతీక్షతే 43

పవిత్రయు, సమర్థయు, నా అర్చనలయందు నిలుకడకలదియు ఆచార్యులయందు, దైవములయందు భక్తి కలదియు, భర్తయందు పుత్రప్రేమ కలదియు అగు ఇల్లాలు సంసారమునందు వర్తించుచున్నదై ముందుగా మరణించినచో నాలోకమున ఉత్తమ స్థానమున నిలిచి భర్తకొరకు ఎదురు చూచుచుండును.

పురుషో యది మద్భక్తః స్త్రియం త్యక్త్వా సగచ్ఛతి,

సతతోత్ర ప్రతీక్షేత భార్యాం భర్తరి వత్సలామ్‌. 44

నా భక్తుడగు పురుషుడు, ముందు భార్యను వదలి మరణించినచో భర్తయందు పరమానురాగముగల ఆమెకొరకు ఎదురుచూచుచు నాలోకమున నిలిచి యుండును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి కర్మణాం కర్మ చోత్తమమ్‌,

ఋషయో మాం న వశ్యన్తి మమ కర్మపథి స్థితాః,

యథా పశ్యతి సుశ్రోణి దృఢో భగవతః శుచిః. 45

మఱియొక విషయమును కూడ నీకు వక్కాణింతును. ఇది కర్మముల కెల్ల ఉత్తమమైనది. నామార్గమున చెదరని బుద్ధితో నిలిచిన ఋషులు కూడ, శుచియగు భాగవతుడు నన్ను చూచినట్లు, చూడజాలరు.

ఏతేన విధానేన మమ కర్మాణి కారయేత్‌,

శ్వేతద్వీపం ప్రపశ్యన్తి మమ కర్మపరాయణాః. 46

నా పనులయందు అధికశ్రద్ధకలవారై నాపనులు ఈ విధానముతో చేయువారు శ్వేతద్వీపమును దర్శింతురు.

ద్రష్టవ్యా మమ లోకేషు ఋషయోపి వరాననే,

కిం పున ర్మానుషా యేచ మమ కర్మపథి స్థితాః. 47

నాలోకములందున్న ఋషులు కూడ ఇతరులకు భక్తితో కనుగొనదగినవారు. నా పూజలం దాసక్తి కల మనుష్యులసంగతి చెప్పనేల?

అస్యదేవేషు యే భక్తా మూఢా వై పాపచేతసః,

మమ మాయా విమూఢాత్మా నప్రపద్యన్తి మాధవి. 48

మాధవీ! మూఢులు, పాపబుద్ధి కలవారునై ఇతర దేవతలయందు భక్తిచూపువారు, నామాయ క్రమ్మినబుద్ది కలవారై ఎన్నటికిని నన్ను పొందజాలరు.

మాంతు యేవై ప్రపద్యన్తే మోక్షకామా వసుంధరే,

తానహం భావసంసిద్ధాన్‌ నయామి స్వపురం ధరే. 49

మోక్షమును కాంక్షించి నన్నే శరణు పొందు నిశ్చలభావము కలవారిని నాపురమునకు నేను చేర్తును.

యేనాసి పరయా భక్త్యా యేన త్వం ధారితా మయా,

తేన తే కధితం హీదం గుప్తం ధర్మం మహాయశాః. 50

నీకు నాయందు పరమభక్తి కలదు, నిన్ను నేను ప్రీతితో ధరించితిని. కావున పరమరహస్యమైన ఈ ధర్మమును నీకు చెప్పితిని

పిశునాయ న దాతవ్యం న చ మూర్ఖాయ మాధవి,

నాదీక్షితాయ దాతవ్యం నోపసర్పాయ యత్నతః. 51

ఓ మాధవీ! లోభికి, మూర్ఖునకు, దీక్ష లేనివానికి, పనిగట్టుకొని దరిజేరినివానికి దీని నొసగరాదు.

తతో న చోపదిష్టాయ న శఠాయ చ దాపయేత్‌,

వర్జయిత్వా భాగవతం మమ కర్మపరాయణమ్‌. 52

నా పూజాకార్యములయందు పరమశ్రద్ధకల భాగవతుని తప్పించి, గురూపదేశము పొందనివాడు, మొండివాడు నగుపురుషునకు దీని నొసగరాదు.

ఏతత్‌ తే కథితం దేవి మమ ధర్మం మహౌజసమ్‌,

సర్వలోకహితార్థాయ కిమన్యత్‌ పరిపృచ్ఛసి. 53

దేవీ! గొప్పశక్తిగల నాధర్మమును నీకు చెప్పితిని. సర్వలోకముల మేలుకొరకు మరల ఏమి అడుగుదునో అడుగుము.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే షోడశాధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదునారవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters