Varahamahapuranam-1    Chapters   

చతుర్వింశత్యధిక శతతమోధ్యాయః - నూటయిరువదినాల్గవ అధ్యాయము

సూత ఉవాచ - సూతుడు చెప్పెను.

శ్రుత్వా షడృతు కర్మాణి పృథివీ శంసితవ్రతా,

తతో నారాయణం భూయః ప్రత్యువాచ వసుంధరా. 1

కొనియాడబడువ్రతములు గల భూదేవి ఆరుఋతువుల కర్మములను విని నారాయణ దేవునితో మరల ఇట్లనెను.

మంగల్యాశ్చ పవిత్రాశ్చ యేత్వయా సముదాహృతాః

మమ లోకేషు విఖ్యాతా మనః ప్రహ్లాదయన్తి మే. 2

మంగళకరములు, పవిత్రములు నగు విషయములను చెప్పితివి. ఇవి నాలోకములందు తేటతెల్లములగును. నామనస్సునకు మిక్కిలి ఆనందమును కూర్చుచున్నవి.

శ్రుత్వాత్వేతాని కర్మాణి త్వన్ముఖోక్తాని మాధవ

జాతాస్మి నిర్మలా దేవ శశాఙ్క ఇవ శారదః. 3

నీ ముఖమునుండి పలుకబడిన యీ అర్చన కర్మములను విని, దేవా! మాధవా! శరత్కాలపు చంద్రుని వలె నిర్మల నయితిని.

ఏతన్మే పరమం గుహ్యం పరం కౌతూహలం తథా

మమైవ చ హితార్థం త్వం విష్ణో వక్తు మిహార్హసి. 4

మిక్కిలి రహస్యము, వేడుక పుట్టించునదియునగు ఈ విషయమును, నామేలుకొరకు విష్ణూ! నీవు చెప్పదగును.

యా మేనాం భాషసే దేవ మమ మాయేతి నిత్యశః,

కా మాయా కీదృశీ విష్ణో కిం వా మాయేతి చోచ్యతే

జ్ఞాతు మిచ్ఛామి మాయార్థం రహస్యం పర ముత్తమమ్‌ 5

దేవా! పలుమారులు నీవు 'నామాయ' అనుచుందువు. ఆమాయ అనగానేమి? ఎటువంటిది? దేనిని మాయ యందురు. ఈ మాయా రహస్యమును మిక్కిలి ఉత్తమమైన దానిని తెలియగోరుచున్నాను.

తత స్తస్యా వచః శ్రుత్వా విష్ణు ర్మాయా కరండకః,

ప్రహస్య మధురం వాక్యం ప్రత్యువాచ వసుంధరామ్‌. 6

అంత ఆమెమాటను విని మాయకు బరణియగు విష్ణువు చిరునవ్వు నవ్వి భూదేవితో మధురమగు ఈ వాక్యమును పలికెను.

ఇయం మా భూమి తేమాయా యాం మాంత్వం పరిపృచ్ఛసి

కించ మాక్లిశ్యతే భూమి నమాయాంజ్ఞాతు మిచ్ఛసి. 7

భూదేవీ! ఈ మాయను గూర్చి అడుగకుము. నీవు కష్టపడనేల? మాయను తెలిసికొనజాలవు.

అద్యాపి మాం నజానన్తి రుద్రేన్ద్రాః సపితామహాః

మమ మాయాం విశాలాక్షి కిం పునస్త్వం వసుంధరే. 8

ఈనాటికిని రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మయు నామాయను తెలియజాలరు. విశాలాక్షీ! ఇంక నీ సంగతి చెప్పనేల?

పర్జన్యో వర్షతే యత్ర తజ్జలేన ప్రపూరయేత్‌

దేశో నిర్జలతాం యాతి ఏషా మాయా మమప్రియే. 9

ఒకచోట వానదేవుడు పెద్దగా కురియును. ఆప్రాంతము నీటితో నిండిపోవును. మరియొక దేశము నీటిబోట్టు లేక యెండిపోవును. ప్రియా! ఇది నామాయ.

సోమోపి క్షీయతే పక్షే పక్షే చాపి వివర్ధతే,

అమాయాం న సదృశ్యేత మాయేయం మమ సుందరి 10

చంద్రుడు ఒకపక్షమున తరుగుదలనందును. మఱియొక పక్షమున పెరుగుదల పొందును. అమావాస్యనాడు మొత్తముగా కనబడడు. ఇదియే నామాయ.

హేమన్తే సలిలం కూపే ఉష్ణం భవతి తత్త్వతః,

భ##వేచ్చ శీతలం గ్రీష్మే మాయేయం మమ తత్త్వతః. 11

హేమంతమున (చలికాలమున) నూతిలో నీరు వేడిగానుండును. గ్రీష్మమున (వేసవియందు) చల్లగానుండును. ఇది తత్వమునుబట్టి నామాయ.

పశ్చిమాం దిశ మాస్థాయ యదస్తం యాతి భాస్కరః

ఉదేతి పూర్వతః ప్రాత ర్మాయేయం మమ సుందరి. 12

సూర్యుడు పడమటిదిక్కున చేరి అస్తమించి మరల ఉదయమున తూర్పుదిక్కున ఉదయించును. ఇది నామాయ.

శోణితం చైవ శుక్లం చ ఉభే ప్రాణిషు సంస్థితే

గర్భే చ జాయతే జన్తు ర్మమ మాయే య ముత్తమా. 13

రక్తము, శుక్లము రెండును ప్రాణుల యందు ఉండుననియే. అవి గర్భమున చేరి క్రొత్త జీవియగుచున్నది. ఇది నా ఉత్తమమాయ.

జీవః ప్రవిశ్య గర్భేతు సుఖం దుఃఖాని విన్దతి

జాతశ్చ విస్మరేత్‌ సర్వ మేషా మాయా మమోత్తమా. 14

జీవుడు గర్భమున ప్రవేశించి సుఖమును, దుఃఖమునను పొందును. పుట్టినంతనే దానినంతటిని మరచిపోవును. ఇది నా గొప్ప మాయ.

ఆత్మకర్మాశ్రితో జీవో నష్టసంజ్ఞో గతస్పృహః

కర్మణా నీయతేన్యత్ర మాయైషా మమ చోత్తమా. 15

తాను చేసిన కర్మములను పట్టివ్రేలాడి జీవుడు తెలివిని, చేష్టను కోల్పోవును, కర్మము వానిని మరియొకచోటికి గుంజుకొని పోవును. ఇది నాదొడ్డమాయ.

శుక్రశ్రోణితసంయోగా జ్జాయన్తే యది జన్తవః,

అంగుల్య శ్చరణౌ చైవ భుజౌ శీర్షం కటి స్తథా. 16

పృష్ఠం తథోదరం చైవ దంతోష్ఠ పుటనాసికా

కర్ణనేత్ర కపోలౌ చ లలాటం జిహ్వయా సహ

ఏతయా మాయయా యుక్తా జాయన్తే యది జన్తవః. 17

రక్తము, వీర్యము, కలిసికదా జంతువులు పుట్టుట! వ్రేళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, కనులు, బుగ్గలు, నుదురు, నాలుక ఇవన్నియు ఏర్పడుట నామాయ, దానితోడనే ప్రాణుల పుట్టుట.

తసై#్యవ జీర్యతే భుక్త మగ్నినా పీత మేవచ,

అధశ్చ స్రవతే జన్తు రేషా మాయా మమోత్తమా. 18

ఆతడు తిన్నతిండిని జఠరాగ్ని పీల్చి వేయగా అది అరిగిపోవుచున్నది. పిదప క్రిందినుండి మలరూపమున జారిపోవుచున్నది. ఇది నామహామాయ.

శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గన్ధశ్చ పఞ్చమః,

అతః ప్రవర్తతే జన్తు రేషామాయా మమప్రియే. 19

శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనువానితో జంతువు ప్రవర్తించుచున్నది. ప్రియా! ఇదినామాయ (జంతువనగా పుట్టిన ప్రాణి అని అర్థము)

సర్వర్తుషు నిజాకారః స్థావరే జంగమే తథా,

తత్త్వం నజ్ఞాయతే తస్య మాయైషా మమసుందరి. 20

స్థావరము, జంగమము అనువారియందు అన్ని ఋతువులలో ఒకే ఆకారము. కాని దానితత్త్వము తెలియరాదు. ఇది నామాయ.

ఆపో దివ్యా స్తథా భౌమా ఆపో యేషు ప్రతిష్ఠితాః

వ చ వృద్ధిం ప్రయాన్త్యత్ర మాయైషా పరమా మమ. 21

ఆకసమున నీరు కలదు. భూమియందు నీరున్నది. అవి వృద్ధి పొందకున్నవి. ఇది నాపరమ మాయ.

వృష్టౌ బహూదకాః సర్వే పల్వలాని సరాంసి చ

గ్రీష్మే సర్వాణి శుష్యన్తి ఏతన్మాయాబలం మమ. 22

వర్షర్తువున గుంటలు, చెరువులు నీటితో నిండిపోవును. గ్రీష్మమున అవియన్నియు ఎండిపోవును. ఇది నామాయాబలము.

హిమవచ్చిఖరా న్ముక్తా నామ్నా మన్దాకినీ నదీ,

గాం గతా సా భ##వేద్‌ గంగా మాయైషా మమకీర్తితా. 23

హిమవంతుని శిఖరమునుండి జాలువారిన నదికి మందాకిని అనిపేరు. అదియే నేలకు దిగునప్పటికి గంగ అయినది. ఇదినామాయ. (గాంగతా-నేలకు వచ్చినది - గంగా).

మేఘా వహన్తి సలిలం లవణం సలిలార్ణవే

వర్షన్తి మధురం లోకే సర్వం మాయాబలం మమ. 24

ఉప్పునీటి సముద్రమునుండి మేఘములు నీరు గ్రహించుచున్నవి. లోకమున తీయని నీటిని కురియుచున్నవి. ఇది నామాయాబలము.

రోగార్తా జన్తవః కేచిద్‌ భక్షయన్తి మహౌషధమ్‌,

తస్య వీర్యం సమాశ్రిత్య మాయాంతు విసృజామ్యహమ్‌. 25

కొన్నిప్రాణులు రోగములను పొంది గొప్ప ఔషధములను తినుచుందురు. వాని శక్తియందు నేను నామాయను జారవిడుతును.

ఔషధే దీయమానేపి జన్ముః పఞ్చత్వ మేతి యత్‌,

నిర్వీర్య మౌషధం కృత్వా కాలో భూత్వా హరామ్యహమ్‌. 26

మందు నొసగినను ప్రాణి మరణించుచున్నది. అనగా ఔషధమును శక్తిహీనము చేసి నేను కాలరూపుడనై హరించు వేయుదు నన్నమాట.

ప్రథమం జాయతే గర్భః పశ్చా జ్జాయేత వై పుమాన్‌,

జాయతే మధ్యమ స్తత్ర తతోపి జరసా పునః,

తత ఇన్ద్రియ నాశశ్చ ఏతన్మాయాబలం మమ. 27

మొదట గర్భము ఏర్పడుచున్నది. తరువాగ పురుషుడు పుట్టుచున్నాడు. కొంతకాలమునకు నడివయస్సువాడగుచున్నాడు. అటుపై ముసలితనము, ఆపై ఇంద్రియములు నశించుచున్నవి. ఇది యంతయు నామాయాబలము.

యద్భూమౌ నిహితం బీజం తస్మాత్త జ్జాయతేంకురమ్‌,

ఏకబీజాద్‌ ప్రకీర్ణాద్‌ వై జాయన్తే తాని భూరిశః,

తత్రామృతం విసృజామి మాయాయోగేన మాధవి. 28

నేలయందు విత్తనము నాటుదురు. అది మొలకెత్తుచున్నది. వెదజల్లిన ఒక్క విత్తనమునుండి గింజలు పెక్కులు కలుగుచున్నవి. దానియందు నేను మాయకూర్పుతో అమృతమును జాలువార్తును.

లోక ఏవం విజానాతి గరుడో వహతేచ్యుతమ్‌,

భూత్వా వేగేన గరుడో వహామ్యాత్మాన మాత్మనా. 29

గరుడుడు విష్ణువును మోయుచున్నాడని లోకము సంభావించును. నిజమునకు నేనే వేగముతో గరుడుడనై నన్నునేను మోసికొనుచున్నాను.

యా ఏతా దేవతాః సర్వా యజ్ఞభాగేన తోషితాః,

మాయా మేతా మహం కృత్వా తోషయామి దివౌకసః. 30

ఈ దేవతలందరు యజ్ఞభాగముతో సంతసించుచున్నారు. నేనే ఈ మాయను కల్పించి స్వర్గవాసులను తృప్తిపరచుచున్నాను.

లోకాః సర్వే విజానన్తి దేవా నిత్యం మఖాశినః,

మాయామేతా మహం కృత్వా రక్షామి త్రిదశాన్‌ సదా. 31

దేవతలు ఎల్లవేళల యజ్ఞమునందలి హోమద్రవ్యములను భుజింతురని లోకులందరు తలచుచున్నారు. నేనే మాయను కల్పించి సర్వదా ఆదేవతలను రక్షించుచుందును.

సర్వోపి భజతే లోకో యష్టారం చ బృహస్పతిమ్‌,

మాయా మాంగిరసీం కృత్వా యాజయామి దివౌకసః. 32

బృహస్పతి యజ్ఞకర్త అనిలోకమంతయు కొనియాడుచుండును. ఆంగీరస మాయను కల్పించి దేవతల యాగములను చేయించునది నేనే.

సర్వే లోకే విజానన్తి వరుణః పాతి సాగరమ్‌,

మాయాంతు వారుణీం కృత్వా అహం కృత్వా అహంపామి మహోదధిమ్‌. 33

వరుణుడు సముద్రమును పాలించుచున్నాడని లోకులందరు తలతురు. వారుణమాయ కల్పించి మహాసముద్రమును కాపాడుచున్నవాడను నేనే.

సర్వే లోకా విజానన్తి కుబేరోయం ధనేశ్వరః,

కుబేర మాయా మాదాయ అహం రక్షామి తద్ధనమ్‌. 34

కుబేరుడు ధనమునకు ప్రభువని లోకములన్నియు సంభావించును. కుబేరమాయను స్వీకరించి ఆధనమును నేనే రక్షింతును.

ఏవం లోకా విజానన్తి వృత్రఃశ##క్రేణ సూదితః,

శాక్రీం మాయాం సమాస్థాయ మయా వృత్రో నిఘాదితః. 35

వృత్రుని ఇంద్రుడు పరిమార్చెనని లోకులు అనుకొనుచున్నారు. ఇంద్రసంబంధమగుమాయను తాల్చి వృత్రుని రూపుమాపినది నేనే!

ఏవం లోకా విజానన్తి ఆదిత్య శ్చ ధ్రువో మహాన్‌

దేహం మాయామయం కృత్వా వహామ్యాదిత్య మేవచ. 36

లోకులు ఆదిత్యుడు కదలని మహాగ్రహమని తలపోయుదురు. మాయామయమగు దేమమును తాల్చి ఆదిత్యుని మోయుచున్నది నేనే.

ఏవ మాభాషతే లోకో జలం కిం నశ్యతేఖిలమ్‌,

బడబాముఖమాయేన పిబామి తదహం జలమ్‌,

వాయుమాయా మహం కృత్వా మేఘేఘ విసృజామ్యహమ్‌. 37

నీరంతయు వట్టి పోవుచున్నదని లోకము వాకొనును. బడబాగ్ని రూపముతాల్చి దానింతటిని నేనే త్రాగివేయుచున్నాను. వాయుమాయను తాల్చి దానిని మేఘములందు వదలుచున్నాను.

యదిదం భాషతే లోకః కృత్వైతత్‌ తిష్ఠతే జలమ్‌,

దేవా అపి నజానన్తి అమృతం కుత్ర తిష్ఠతి,

మమమాయానియోగేన తిష్ఠతేహ్యౌషధీషు తత్‌. 38

లోకము ఈనీరంతయు గూడుకట్టియొక్కడ నిలుచుచున్నది అని పలుకును. అమృతమొక్కడ నిలుచునో దేవతలును ఎరుగరు. అది నామాయచేసిన ఆజ్ఞమేరకు ఓషధులయందు నిలిచియున్నది.

లోకోహ్యేవం విజానాతి రాజా పాలయతే ప్రజాః,

రాజమాయామహం కృత్వా పాలయామి వసుంధరమ్‌. 39

రాజు ప్రజలను పాలించునని లోకము భావన. కాని రాజమాయను కల్పించి వసుంధరను నేను పాలించుచున్నాను.

యేతు వై ద్వాదశాదిత్యా ఉదేష్యన్తి యుగక్షయే,

ప్రవిశ్య తానహం భూమి మాయాం లోకే సృజామ్యహమ్‌. 40

యుగముముగియునప్పుడు పన్నిద్దరుభాస్కరులు ఉదయింతురు. నేను వారిలో చొరబడి లోకమున మాయను సృజింతును.

వర్షశ్చ పాంసునా భూమి లోకేషు పతతే సదా.

మాయాంపాంసుమయీం కృత్వాపూరయామ్యఖిలం జగత్‌. 41

భూమి! వర్షము ధూళితోపాటు లోకములయందు పడుచున్నది. పాంసుమయామాయను కల్పించి నేనే జగత్తును నింపుదును.

వర్షతే యత్ర సంవర్తో ధారై ర్ముసల సన్నిభైః,

మాయాం సాంవర్తికీం గృహ్య పూరయామ్యఖిలం జగత్‌. 42

సంవర్తమనుమేఘము రోకలిపాటిధారలతో కురియును. సంవర్తకమాయను గ్రహించి లోకమంతటిని నింపువాడను నేను.

యత్‌ స్వపామి వరారోహే శేషస్యోపరి ధారిణి

అనన్త మాయయా చాహం ధారయామి స్వపామి చ. 43

ధాత్రీ! నేను శేషునిపై పవ్వళించి నిద్రింతుని లోకము భావించును. అనంతమాయతో ఆశేషుని మోయుచు నిద్రించుచుందును. (అనంతుడు-ఆదిశేషుడు)

వరాహమాయామాదాయ భూమే జానాసి కింనవై

దేవా యత్ర నిలీయన్తే సామాయా మమ కీర్తితా. 44

భూమి! వరాహమాయను తాల్చిన సంగతి నీవెరుగవా! దేవలందరు అందు లీనమై పోవుదురు. అదినామాయ.

తదాపి వైష్ణవీం మాయాం కస్మాజ్జానాసి నైవ చ

ధారితాసి చ సుశ్రోణి వారాన్‌ సప్తదశైవ తు. 45

అయినను నీవు విష్ణుమాయను ఏవిధముగను ఎరుగజాలవు. నిన్ను నేను పదునేడుమారులు పట్టినిలిపితిని.

మాయా తు మమ దేవీయం కృత్వా హ్యేకార్ణవీం మహీమ్‌,

మమ మాయాబలం హ్యేతద్‌ యేన తిష్ఠామ్యహంజలే. 46

నేను ఈభూమినంతటిని ఒకే సముద్రముగా చేసి ఆజలమును నిలుతును. ఇది నామాయాబలము.

ప్రజాపతించ రుద్రం చ సృజామి చ హరామి చ

తేపి మాయాం నజానన్తి మమమాయావిమోహితాః. 47

నేను బ్రహ్మను, రుద్రుని సృజింతును. హరింతును. అయినను వారు నామాయకు మోహితులై దాని నెరుగకుందురు.

అథో పితృగణాశ్చైవ యఏతే సూర్యజసః,

మాయాం పితృమయీం హ్యేతాం గృహ్లామీహ చ తత్త్వతః. 48

సూర్యుని తేజస్సు వంటి తేజస్సుగల ఈ పితృగణముల వారున్నారే వారినిపితృమయయగు మాయతో నేను పట్టుకొని యుందును.

కింతు మాయైవ సుశ్రోణి అన్యచ్చ శృణు సుందరి

ఋషి ర్మానుష సారేణ స్త్రియో యోనిం ప్రవేశితః. 49

మరియు శోభనాంగీ! మరియొక మాయను గూర్చిచెప్పెదను. వినుము. ఒక ఋషిని పురుష స్వరూపుని స్త్రీయోనియందు ప్రవేశ##పెట్టితిని. (స్త్రీని చేసితి నని భావము)

తతో విష్ణో ర్వచః శ్రుత్వా శ్రోతకామా వసుంధరా

కరాభ్యా మంజలిం కృత్వా వాక్యమేతత్‌ తదాబ్రవీత్‌. 50

అంత విష్ణుని పలుకువిని మరియు వినగోరినదై వసుంధర చేతులతో దోసిలి పట్టి యీవాక్యమును పలికెను.

కింతేన ఋషిముఖ్యేన కృతం కర్మ సుదుష్కరమ్‌,

స్త్రీత్వం చైవ పునః ప్రాప్తం స్త్రీయోనించ ప్రజాపతిః. 51

ఏతన్మే సర్వ మాఖ్యాహి పరం కౌతూహలం మమ

తస్య బ్రాహ్మణముఖ్యస్య స్త్రీత్వే యత్కర్మ పాపకమ్‌. 52

ఆఋషిముఖ్యుడు అంత చేయరాని పనిచేమిచేసెను? ఆతడు స్త్రీరూపము నేల పొందెను? ఆ బ్రాహ్మణముఖ్యుడు స్త్రీయగుటకు చేసిన పాపమెట్టిది? నాకు మిక్కలి కుతూహలము కలుగుచున్నది. అదియంతయు వివరించి చెప్పుము.

తతో మహ్యా వచః శ్రుత్వా హృష్టతుష్టమనా హరిః,

మధురం వాక్యమాదాయ ప్రత్యువాచ వసుంధరామ్‌. 53

అంత భూదేవి మాటవిని మిక్కిలి ఆనందమందిన హృదయముగల హరి తీయని మాటను గొని భూదేవి కిట్లనెను.

శృణు తత్వైనే మే దేవి ధర్మాఖ్యానం మహామతే

మాయా మమ విశాలాక్షి రోహిణీ లోమహర్షిణీ. 54

దేవీ!విశాలాక్షీ!మహామతీ! ఆ ధర్మాఖ్యానమును వినుము. ఒడలు గగుర్పొడుచు నామాయను గూర్చి చెప్పెదను.

మాయయా మమ యోగేన సోమశర్మా చ క్లేశితః

గతో గతీ రనేకాశ్చ ఉత్తమాధమ మధ్యమాః

బ్రాహ్మణత్వం పునః ప్రాప్తో మమమాయాప్రణోదితః. 55

నామాయకూర్పువలన సోమశర్మ పడరానిపాట్లుపడెను. పెక్కుగతులు పొందెను. అందుకొన్ని ఉత్తమములు, కొన్నినీచములు, కొన్ని మధ్యమములు. మరియు తిరిగి నామాయ త్రోయగా బ్రాహ్మణత్వమును పొందెను.

యథా బ్రాహ్మణముఖ్యేన స్త్రియో యోనిశ్చ ప్రాపితా,

న తస్య వికృతం కర్మ అపరాధో న విద్యతే. 56

ఆ బ్రాహ్మణముఖ్యుడు స్త్రీరూపమునెట్లు పొందెనో తెలిపెదను. ఆతడు చేసిన వికృతకర్మము లేదు. అపరాధము లేదు.

మమై వారాధనపరో మమ కర్మపరాయణః

నిత్యం చిన్తయతే భూమి మమ చిన్తాం మనోరమామ్‌. 57

ఆతడు నిత్యము నా అర్చనయందు, నాపనులయందు మిక్కిలి శ్రద్ధకలవాడు. సర్వదా నన్నుగూర్చిన భావనయే అతని హృదయము నలరించును.

అథ దీర్ఘేణ కాలేన తస్య తుష్టోస్మి సుందరి

తపసా కర్మణా భక్త్యా అనన్యమనసా స్తుతః. 58

అంత పెద్దకాలమునకు ఈతడు అనన్యహృదయముతో చేసిన తపస్సు. కర్మము, భక్తి అనువానికి నేను మిక్కిలి తృప్తి నందితిని.

తత స్తస్య మయా దేవి దత్వా దర్శన ముత్తమమ్‌,

వరేణ ఛందితో విప్రః సాధు తుష్టోస్మి తే ప్రభో. 59

అంతనేనతనికి నా ఉత్తమమగుదర్శన మొసగితిని నీవిషయమున తృప్తుడనైతిని. వరము కోరుకొమ్మంటిని.

వరం వరయ భద్రంతే తవ యద్‌ హృది వర్తతే

తత్‌ తత్‌ సర్వం ప్రదాస్యామి సర్వకామసమాశ్రితమ్‌. 60

నాయనా! నీ హృదయమున నున్నవరమునెల్లకోరుకొనుము. అన్ని కోరికలతో కూడిన ఆవరములనెల్ల నీకు ఇత్తును.

కింనువై కాఞ్చనం గావః కించ రాజ్య మకంటకమ్‌,

అథ చేచ్ఛసి స్వర్గం చయత్ర తే చాప్సరోగణాః. 61

సువర్ణమా? గోవులా? ఏపీడయులేని రాజ్యమా? లేక అప్సరసల గణములస్వర్గమా? దేనిని కోరుదువు?

అథ చేచ్ఛసి విప్రేన్ద్ర ఋషీణాం వా తపో మహత్‌,

భవితా వా తతశ్చైవ మమ కర్మ పరాయణః. 62

లేదా! ఓవిప్రవరా! ఋషుల మహాతపస్సును కోరెదవా? కాక నాకర్మములయందు మహాశ్రద్ధకలవాడగుదువా?

అథ చేచ్ఛసి కన్యానాం సహస్రం దివ్య ముత్తమమ్‌,

ధన రత్న సమృద్ధానాం హేమ భాండ విభూషితమ్‌. 63

అట్లు కాక వేయుమంది దివ్యకన్యలను ధనములు రత్నములు సమృద్ధిగా కలవారిని, స్వర్ణాభరణములు అలంకరించుకొన్నవారిని కోరెదవా?

సర్వాసాం దివ్యరూపానాం భవన్త్య ప్సరసోపమాః

దదామి తేవరం చైవ విప్ర యత్తే విచిన్తితమ్‌. 64

అప్సరసలకీడైన దివ్యరూపముగల ఇంతులను కోరెదవా? నీకువరమిత్తును. నీవేదితలతువో చెప్పుము.

తతో మమ వచః శ్రుత్వా సచ బ్రాహ్మణపుంగవః

శిరసా పతితో భూమ్యా మువాచ మధురాం గిరిమ్‌. 65

అంత ఆ బ్రాహ్మణ వరేణ్యుడు నామాటవిని శిరస్సునేలకు తాకునట్లుగా నేలపై వ్రాలి తీయనిపలుకుతో ఇట్లనెను

అథ నో కుప్యసే దేవ వరం సమనుయాచతే,

యత్త్వయా భాషితం దేవ మమ దేయం యదృచ్ఛయా. 66

నచాహం కాంచనం దేవ నచస్త్రీ రాజ్యమేవ చ

నాప్సరోనైవ చ స్వర్గ మైశ్వర్యం న మనోహరమ్‌. 67

దేవా! నీవుకోపగింపవేని ఒక్క వరమడుగుదును. నీవు పలికిన విధముగా నేను కోరిన దొసగవలయును. నాకు బంగారము వలదు. ఇంతి వలదు, రాజ్యము వలదు. అప్సరస వలదు. స్వర్గమువలదు. మనసున కింపైన ఐశ్వర్యము వలదు.

తథా స్వర్గ సహస్రాణి ఏక స్తత్ర న రోచతే,

జ్ఞాతు మిచ్ఛామి తే మాయాం యయా క్రీడసి మాధవ. 68

వేయిస్వర్గములలో ఒక్కటియు నాకు రుచింపదు. నీవు ఎల్లప్పుడు క్రీడించునీమాయను తెలియగోరుచున్నాను.

తత స్తస్య వచః శ్రుత్వా సమయా తత్ర భాషితః,

కింమాయయా తే విప్రేన్ద్ర అకార్యం పృచ్ఛసే ద్విజ,

దేవా అపి న జానన్తి విష్ణు మాయా విమోహితాః. 69

అంత నతని మాటవిని నేనిట్లంటిని: ఓవిప్రవరేణ్యా! నీకు ఆమాయతో పనియేమి? కాని పనినడుగుచున్నావు. విష్ణుమాయ చేత మిక్కిలిమోహితులై దేవతలు కూడ దాని నెరుగరు.

తతో మమ వచః శ్రుత్వా సచ బ్రాహ్మణపుంగవః,

ఉవాచ మధురం వాక్యం మాయాకర్మ ప్రణోదితః. 70

అప్పుడా బ్రాహ్మణోత్తముడు నామాట విని మాయాకర్మము పురికొల్పగా తీయగా ఇట్లు పలికెను.

యది తుష్టోసి మే దేవ కర్మణా తపసా తథా

తవ దేవ ప్రసాదేన మమైవం దీయతాం వరః. 71

దేవా! నాకర్మము, నాతపస్సు నీకు తృప్తి కలిగించినచో నీ అనుగ్రహమువలన నాకీవరమునే ఒసగవలయును.

తతస్తు సమయా ప్రోక్త స్తపస్వీ బ్రాహ్మణ స్తథా

గచ్ఛ కుబ్జామ్రకే గంగాం స్నాతో మాయంతు ద్రక్ష్యసి. 72

అప్పుడా తపస్వియగు బ్రాహ్మణునితో -కుబ్జామ్రకమనుచోట కరుగుము. అందు గంగలో స్నానము చేసి నామాయను చూతువు- అంటిని.

మమైవం వచనం శ్రుత్వా కృత్వా చైవ ప్రదక్షిణమ్‌,

కుబ్జామ్రకే దేవి విప్రో మమ మాయాభి కాంక్షిణః. 73

ఈ నామాట విని ఆ విప్రుడు నా మాయను చూడగోరినవాడై నాకుప్రదక్షిణ మొనరించి కుబ్జామ్రకమున కరిగెను.

తతఃకుండీ త్రిదండీ చ మాత్రా భాండం చ యత్నతః,

స్థాపయిత్వా యథాన్యాయం తీర్థమారాధయద్‌ యథా. 74

అంతనాతడు కమండలువును, దండమును, ఇతరవస్తువుల భాండములను ఒకచోటనుంచి తీర్థమును సేవించెను.

తతో హ్యవతరన్‌ గంగాం విధిదృష్టేన కర్మణా,

అవగాహ్య తతో గంగాం సర్వగాత్రాణి క్లేదితాః. 75

అంతనాతడు శాస్త్రము చెప్పిన తీరున గంగలోనికి దిగి నీటమునిగి అన్నిఅవయములను తడుపుకొనెను.

నిషాదాన్తర్గతో గర్భే తిష్ఠతే న చ బ్రాహ్మణః

హృదయే చిన్తయత్‌ తత్ర గర్భక్లేశేన పీడితః. 76

అంత ఆబ్రాహ్మణుడు హఠాత్తుగా ఒక నిషాదవనిత గర్భమున నిలిచెను. గర్భక్లేశము పీడింపగా హృదయమున ఇట్లు తలపోసెను.

అహో కష్టం మయా కించి త్కర్మ వాదుష్కృతం కృతమ్‌,

యోహం నిషాదగర్బేస్మిన్‌ వసామి నరకేషు చ. 77

అయ్యో! ఎంతకష్టము! నేనేమి పాడుపనిచేసితినో ఆటవికస్త్రీ కడుపున పడితిని. ఈ నరకములందుంటిని.

ధిక్‌ తపో ధిక్‌ చ మే కర్మ ధిక్‌ ఫలం ధిక్‌ చ జీవితమ్‌.

యోహం నిషాదగర్భేషు పీడ్యతేధన సంకులే. 78

ఛీ! నాతపమేల? నాకర్మమెట్టిది? దానిఫలమేమి. నా బ్రదుకెంత నికృష్టమయినది! నేను నిషాదగర్భమున ఏభాగ్యము లేనిచోట నలిగిపోవుచున్నాను.

త్రీణి చాస్థిశ##తే పూర్ణే నవద్వారాభిదర్శనే

మూత్ర పురీషసాకీర్ణే మాంసశోణిత కర్దమే. 79

దుర్గంధి దుఃసహేచైవ వాతికే శ్లేష్మపైత్తికే

బహురోగసమాకీర్ణే బహుదుఃఖ సమాకులే

అలం కిం తేన చోక్తేన దుఃఖాద్యనుభవామిచ. 80

మూడునూర్లఎముకలు, తొమ్మిది ద్వారములు, మలమూత్రములసంకీర్ణత, రక్తమాంసముల బురద, భరింపనలవికాని దుర్వాసన, వాతము, పిత్తము, శ్లేష్మముల వికారములు, పెక్కురోగముల రొంపి, పక్కుదుఃఖముల గందరగోళముగల ఈ గర్భమున, నోటితో చెప్పనేల? పడరాని పాట్లు పడుచున్నాను.

కుతో విష్ణుః కుతో వాహం కుతో గంగాజలానిచ

గర్భసంసారనిష్క్రాన్తః పశ్చాద్‌ యాస్యామి యాంక్రియామ్‌. 81

విష్ణువెక్కడ? నేనెక్కడ? గంగాజలములెక్కడ? ఈ గర్భసంసారమునుండి వెలువడి యటుపై నేనేమిచేయవలసి యున్నదో?

ఏవం చిన్తయమానస్తు శీఘ్రం గర్భాద్‌ వినిఃసృతః,

భూమ్యాం తు పతత స్త స్య నష్టం తద్ధి విచిన్తితమ్‌. 82

ఇట్లు తలపోయుచు ఆతడు వెనువెంటనే గర్భము నుండి వెలువడెను. వెంటనే అతని ఆభావ మంతయు నశించెను.

ప్రజాతా సతతః కన్యా నిషాదస్య గృహే తదా,

యో సౌ కుణ్డీత్రిదండీ చనదీతీరేషు తిష్ఠతి,

నచతం విన్దతే కశ్చి న్మమ మాయాప్రమోహితః. 83

అంతనతడు ఒకనిషాదుని (ఆటవికుని) యింట కన్యగా పుట్టెను. కమండలువు, దండము నదిఒడ్డున నుండెను. నామాయవలన ఆతడు దాని నెరుగకుండెను.

అథ దీర్ఘేణ కాలేన నిషాదస్య గృహే తదా,

ధనధాన్య సమృద్దస్య వర్తతే సచ బ్రాహ్మణః,

నచ సంజ్ఞాయతే కశ్చిద్‌ విష్ణుమాయాప్రమోహితః. 84

అంత పెద్దకాలము ధనధాన్యములు నిండుగా గల ఆనిషాదుని యింట ఆబ్రాహ్మణుడు తిరుగుచుండెను. విష్ణుమాయ క్రమ్మగా ఆతడేమియు తెలియకుండెను.

అథ దీర్ఘస్య కాలస్య కృతోద్వాహా యశస్వినీ,

పుత్రం దుహితరం చైవ జనయ న్మమ మాయమా. 85

పిదప పెద్దకాలమునకు ఆమె వివాహము చేసికొని నామాయవలన కొడుకును కూతును కనెను.

భక్షాభక్షం చ ఖాదేత పేయాపేయం చ తత్పిబేత్‌,

జీవాని చైవ విక్రీయ ఘాతితాంశ్చ తతస్తతః. 86

తినదగినదానిని, తగనిదానిని తినెను. త్రాగదగినదానిని తగనిదానిని త్రాగెను. చంపిన జంతువులను అందందు అమ్ముకొని బ్రతుకుచుండెను.

కార్యాకార్యం నజానీతే వాచ్యావాచ్యం న జానతి,

గమ్యాగమ్యం నజానాతి మాయాజాలేన మోహితః. 87

ఏదిచేయనగునో ఏదిచేయరాదో, ఏదిపలుకనగునో ఏది పలుకరాదో, ఏదిపొందదగినదో, ఏదికాదో ఏదియు నామాయా జాలము మోహమున తెలియకుండెను.

పఞ్చాశ##తేషు వర్షేషు మయా ధ్యాతః సబ్రాహ్మణః,

తపసశ్చ ప్రభావేణ ఘటం స్పర్శతి సుందరి. 88

ఏబదియేండ్లు గడచిన పిమ్మట నాతలపు వలనను తపస్సు ప్రభావము వలనను ఆబ్రాహ్మణుడు కుండను తాకెను.

మనసా కురుతే స్నానం వస్త్రం చ పరినిక్షిపేత్‌,

భూమ్యాం వస్త్రం సమాస్థాప్య విగాహయతి జాహ్నవీమ్‌. 89

మనసులో స్నానమును భావించి వస్త్రములను తీసివైచి వానిని నేలపై ఉంచి గంగలో మునిగెను.

ప్రస్వేద ఘర్మసంతప్తా సశిరశ్చాప మాహతే

జాత స్తపోధన స్తత్ర దండకుణ్డిధర స్తథా. 90

మిక్కిలి చెమటతాపమున కుడికి తలను నీటముంపగా అంత ఆవనిత దండకమండలువులు తాల్చనతపోధనుడుగా ఆయెను.

తతః పశ్యతి విప్రోసౌ మాత్రాం కుణ్డం త్రిదణ్డికామ్‌,

వస్త్రాణి దర్శితా శ్చైవ యత్ర సంస్థాపితాః పురా

విప్రేణ జాతజ్ఞానేన విష్ణుమాయాభికాంక్షిణా. 91

అంత నావిప్రుడు వస్తువుల పెట్టెను, కమండలువును, త్రిదండమును, మున్నుతానుంచిన వస్త్రములను చూచెను. విష్ణుమాయను తెలిసికోనగోరిన విప్రుడనను జ్ఞానము కలిగెను.

తత ఉత్తరత స్తత్ర గంగాయాం తు తపోధనః

సవ్రీడో గృహ్ణతే వాసో యోగం చ పరిచిన్తయన్‌

ఉపవిశ్యాత్ర గంగాయాం పులినేన సమంతికే. 92

అంత గంగకు ఉత్తరముగా ఆ తపోధనుడు సిగ్గుతో వాసమును కల్పించుకొని దగ్గరలో ఉన్న ఆ యిసుకతిన్నె యందు కూర్చిండి యోగమును గూర్చి భావించుచు నుండెను.

తతో విన్దతి చాత్మానం తత్ర తత్ర విగర్హితమ్‌,

మయా కిం పాపకర్మేణ కృతం కర్మ సుదుష్కరమ్‌,

అగాధం వా పరిభ్రష్టం యేనాహం ప్రాపిత స్త్వియమ్‌. 93

అంత నాతనికి తాను నిషాదవనితగా నుండగా అందందు చేసిన పాపకర్మములన్నియు స్మృతికి వచ్చెను. పాపకర్ముడను. చేయరాని పనులు ఎంతగా చేసితిని! అగాధములో కూలిపోయితిని. ఈస్త్రీజన్మమెత్తితిని.

నిషాదస్య కులే జాతో భక్షాభక్షశ్చ భక్షితః,

జీవాశ్చ ఘాతితాః సర్వే స్థలజా జలజానిచ. 94

బోయకులమున పుట్టితిని. విచక్షణ లేనితిండితింటిని. నేలపై నీటిలోనుండు ప్రాణులనన్నింటిని చంపితిని.

పేయాపేయం చ మే పీతం విక్రీతా శ్చాప్యవిక్రయాః

అగమ్యాగమనం చైవ వాచ్యావాచ్యం న రక్షితమ్‌. 95

అన్నివిధములగు త్రాగుడులను త్రావితిని. అమ్మరాని వాని నమ్మితిని. పొందరాని వారిని పొందితిని. అనరాని మాటలంటిని.

వేశ్మతో 7భోజ్యభోజ్యాని భుక్తం చైవ నసంశయః

పుత్రా దుహితరశ్చైవ నిషాదా జ్జనితా మయా. 96

అన్ని కొంపలనుండి తినరానితిండ్లు సంకోచింపక తింటిని. నిషాదునివలన కొడుకులను, కూతుండ్రను కంటిని.

తతః కిం చాపరాధం వా కేన మామనుచిన్తయే

యేనాహం ప్రాపితో హ్యేనాం నైషాదీ మీదృశీం దశామ్‌. 97

నేనేమి తప్పుచేసితిని? ఏపాపకర్మముచేత ఈనిషాదవనితయగు దశను పొందితినో చెప్పగల ఎవనిని నేనిప్పుడు భావింతును?

ఏతస్మిన్నంతరే భూమి నిషాదః క్రోధమూర్ఛితః,

పుత్రైః పరివృత స్తత్ర మాయా తీర్థముపాగతః. 98

అనియిట్లనుకొనుచున్నంతలో ఆమాయాతీర్థమునకు ఆనిషాదుడు (ఆసోమశర్మనిషాదిగా ఉన్నప్పటిమగడు) బిడ్డలు చుట్టుకొనిరాగా ఒడలెరుగనికోపముతో వచ్చెను.

తతో మృగయతే భార్యాం భక్తిమాన్‌ శుభలక్షణామ్‌,

పరిపృచ్చతి చైకైకం తపమానం తపోధనమ్‌. 99

చక్కని లక్షణములుగల భార్యను మిక్కిలి అనురాగము కలవాడైవెదకుచుండెను.అచటతపస్సుచేయుచున్న ప్రతితపోధనుని అడుగుచుండెను.

కింను పశ్యధ భార్యా మే గంగాతీరముపాగతా

ఘట మాదాయ హస్తేన ఆగతా జలకారణాత్‌. 100

అయ్యలారా! నా యింటిది నీటికొరకు కుండపట్టుకొని గంగఒడ్డునకు వచ్చినది. మీరు చూచితిరా?

తత్రైవ చ నరాః కేచి న్మాయాతీర్థముపాగతాః,

పశ్యన్తే తత్ర పరివ్రాజం కుంభం చైవ యథాస్థితమ్‌. 101

ఆమాయాతీర్థమునకు వచ్చిన జనులు, తాము ఒక సన్యాసిని, అదిగో అచట ఉన్న కుండను చూచితిమని చెప్పిరి.

తతో దుఃఖేన సంతప్తః అపశ్యంశ్చ స్వకాం ప్రియామ్‌,

దృష్ట్వా పటం చ కుంభం చ కరుణం పరిదేవయత్‌. 102

అంత నతడు తనప్రయురాలిని కానక పెనుదుఃఖముతో కుమిలిపోవుచు ఆమెతాల్చిన వస్త్రమును, నీటి కుండను చూచి జాలికలుగునట్లుగా ఏడ్చుచుండెను.

ఇదం వాసశ్చ కుంభంచ నదీకూలేషు తిష్ఠతి,

న చాపి దృశ్యతే భార్యా మమ గంగా ముపాగతా. 103

ఇదిగో వస్త్రము. ఇదిగోకుండ నదిఒడ్డున నున్నవి. గంగకు వచ్చిన నా యింటిది మాత్రము కానరాదు.

అథ కేనాపి గ్రహేణ స్నాయమానా తపస్వినీ

గృహీతా తోయసంస్థేన జిహ్వాలోభేన చస్త్రియమ్‌. 104

ఆదీనురాలు స్నానము చేయుచుండగా నీటనున్న మొసలి ఏదైన జిహ్వాచాపల్యముచేత తినివేసెనేమో!

న వాప్రియం మయేత్యుక్త్వా కదాచిదపి వాచకమ్‌,

స్వప్నే7పి నోక్తపూర్వో7స్మి కదాచిదపి చాప్రియమ్‌. 105

ఒక్కనాడును, కలలోకూడ నేనామెను మనసునకు కష్టముకలుగునట్లు తిట్టియుండలేదు.

అథవాపి పిశాచేన భక్షితా భూతరాక్షసైః,

ఆకృష్టా కింను రోగేణ గంగాతీరసమాశ్రితా. 106

ఒకవేళఏపిశాచమో, భూతమో, రక్కసియో మ్రింగలేదుకదా! గంగఒడ్డునకుచేరిన ఆమెను ఏరోగమో పట్టలేదుకదా!

కిం కృతం దుష్కృతం పూర్వం మమ కర్మ సుసంకటమ్‌,

యేన మత్పురతో భార్యా త్వద్దృష్టా విగతిం గతా. 107

నేను మునుపు ఎంతఘోరమైన పాపముచేసితినో నాముందు నాభార్య మీరు చూచుచుండగా దుర్గతిపాలైనది.

ఏహి మే సుభ##గే కాంతే మమ ఛందానువర్తిని,

పశ్యైతాన్‌ వా సగంభీరాన్‌ క్లిశ్యమానా నితస్తతః. 108

ఓ సుందరీ! నాయిష్టమునుబట్టి నడచుకొనుదానవు. రా! ఇదిగో పరమదుఃఖముతో నలిగిపోవుచు అటుఇటు తిరుగుచున్న ఈ బిడ్డల నైన చూడుము.

కిం మాం పశ్య వరారోహేత్రీన్‌ పుత్రాన్‌ సుసుబాలకాన్‌,

దుహితౄః పశ్య చత్వారి సర్వంతు మమ మానదే. 109

ఓసినాప్రియురాలా! ఈనీ పాలబుగ్గలపసిబాలురు ముగ్గురు కొడుకులను, నలుగురు బిడ్డలను చూడుము. నీవేనాకు అన్నియు అయితివి.

మమ పుత్రా రుదన్త్యేతే బాలకా స్తవ లాలసాః,

నిత్యం చ దారికా రక్ష మమ దుష్కృత కారిణః. 110

నీకొరకు అంగలార్చుచున్న ఈ పిల్లలు ఏడ్చుచున్నారు. పాపాత్ముడనగు నాబిడ్డలను కాపాడుము.

కామం మాం క్షుధితం చైవ యాస్యసి త్వం పిపాసితమ్‌,

త్వమేవ ముచ్య కల్యాని మమ భక్త్యా వ్యవస్థితా. 111

నాపై మిక్కిలి ప్రేమకలదానవు, ఆకలిదప్పులతో అలమటించుచున్న నన్ను వదలి పోయితివి.

ఏవం విలపమానస్య నిషాదస్య యతస్తతః,

సవ్రీడో భాషతే విప్రో నిషాదత గచ్ఛ నాస్తి సా

సుఖం యోగం సమాఖ్యాతం పుత్ర భార్యా గతోహియః. 112

ఇట్లు పరమకరుణగా ఆనిషాదుడు ఏడ్చుచుండగా ఆవిప్రుడు సిగ్గుతో నిషాదునితో ఇట్లు పలికెను. ఆమె లేదు. పొమ్ము. ఆలుబిడ్డలు నశించుట సుఖమైన యోగమని పెద్దలు చెప్పుదురు.

తం తథా రుదితం దృష్ట్వా కారుణ్యన పరిప్లుతమ్‌,

నిషాదం భాసతే తత్ర గచ్ఛ కిం పరిక్లిశ్యసే. 113

ఇంకను అట్లే కరుణతో నిలువెల్ల మునిగిన ఆ నిషాదునితో ఆవిప్రుడు ఇట్లుపలికెను. వెళ్లు. ఊరక యేల అట్లు కుమిలి పోయెదవు?

తాని బాలాని రక్షస్వ ఆహారై ర్వివిధై రపి

ఏతే వై త్రాయాణీయాస్తే సదా కాలం హి పుత్రకాః. 114

పెక్కువిధములగు ఆహారములతో ఈ పిల్లలను రక్షింపుము. ఈనీబిడ్డలను ఎల్లవేళ నీవు రక్షింపవలయును గదా!

పరివ్రాజవచః శ్రుత్వా నిషాద స్తస్య సన్విధౌ,

ఉవాచ మధురం వాక్యం దుఃఖశోకపరిప్లుతాః. 115

ఆ నిషాదుడు అసన్యాసిపలుకువిని, దుఃఖము నిలువెల్ల క్రమ్ముకొనగా మెల్లగా ఇట్లు పలికెను.

అహో మునివర శ్రేష్ఠ అహో ధర్మవిదాం వర,

సాన్త్వితో7స్మి త్వయా విప్ర వచనై ర్మధురాక్షరైః. 116

అయ్యవారా! గొప్ప ధర్మము తెలిసినవాడవు. తీయని మాటలతో నన్ను ఓదార్చితివి.

నిషాదస్య వచః శ్రుత్వా సమునిః సంశితవ్రతః,

ఉవాచ మధురం వాక్యం దుఃఖశోకపరిప్లుతః. 117

నిష్ఠతో చేసిన వ్రతములుగల ఆముని నిషాదునిమాట విని దుఃఖము తన్నుముంచి యెత్తగా ఇట్లు పలికెను.

మా రోదీ ర్వచ్మి భద్రం తే తవాహం ప్రవరస్త్రియః,

గంగాతీరం సమాసాద్య జాతా7స్మి చ తవప్రియా. 118

ఏడవకు! నీకుచెప్పెదను. నీకు శుభమగును. నేనే నీదొడ్డభార్యను. ఈ గంగ ఒడ్డుకు వచ్చి నీకు ప్రియురాల నయితిని.

పరివ్రాజవచః శ్రుత్వా నిషాదో విగతజ్వరః,

శ్లక్షం వచన మాదాయ ప్రత్యువాచ ద్విజోత్తమమ్‌. 119

సన్యాసిమాట విని నిషాదుడు కొంతతేరుకొని ఆ బ్రాహ్మణోత్తమునితో ప్రియమైన పలుకులతో నిట్లనెను.

కిమిదం భాషసే అవ్యక్తం యత్కదాచన,

అభాషైవ చ కర్మాణి పుంసః స్త్రీత్వం నచార్హతి. 120

బాపనయ్యా! ఏమి యిట్లు అయోమయముగా పలుకుచున్నావు? మగవాడు ఆడుదియగుట ఎన్నడు విన్నదికూడ కాదు.

నిసాదస్య వచః శ్రుత్వా బ్రాహ్మణో దుఃఖమూర్ఛితః,

ఉవాచ మధురం వాక్యం గంగాతీరేషు ధీవరమ్‌. 121

నిషాదుని మాటవిని బ్రాహ్మణుడు ఒడలెరుగని శోకముతో గంగఒడ్డున ఆబోయతో తీయగా ఇట్లు పలికెను.

శీఘ్రం గచ్ఛ స్వకం దేవ మేతాన్‌ గృహ్య స్వబాలకాన్‌,

సర్వేషాం చ యథాసంఖ్యం స్నేహం కర్తవ్య మేవచ. 122

త్వరగా నీతావునకు ఈ పసివారిని కొని పొమ్ము. అందరియందును సమానమగు ప్రేమ చూపవలయును.

సతేన చోదితో హ్యేవం నిషాదో నావగచ్ఛతి

మధురం స్వర మాదాయ ప్రత్యువాచ స బ్రాహ్మణమ్‌. 123

ఆతడట్లు చెప్పుచున్నను నిషాదునకేమియు తెలియవచ్చుటలేదు. తీయనిస్వరముతో ఆబ్రాహ్మణున కిట్లు పలికెను.

కిం త్వయా దుష్కృతం కర్మ కృతం పూర్వం పురాతనమ్‌,

మమ యద్‌ భాషసే చైవ మహం తే ప్రవరస్త్రియః. 124

అయ్యా! నేను నీదొడ్డయిల్లాలి ననుచున్నావు. ఇట్లగుటకు నీవు మున్ను చేసిన మహా పాపమేమి?

కేన దోషేణ ప్రాప్తస్వం స్త్రియత్వం ఋషిపుంగవ,

మునిత్వం చ కథం ప్రాప్తం మేతదాచక్ష్య పృచ్ఛతః. 125

ఋషిపుంగవా! ఏతప్పుచేత నీకు ఆడుదనము కలిగినది? మరల ముని వెట్లయితివి? ఇది నాకు చెప్పుము.

ఏవం తస్య వచః శ్రుత్వా స ఋషిః సంశితవ్రతః,

ఉవాచ మధురం వాక్యం మాయాతీర్థజలేచరమ్‌. 126

అని యిట్లుపలుకగా ఆఋషి మాయాతీర్థము జలమున సంభవించిన దానిని గూర్చి తీయగా ఇట్లు పలికెను.

నిషాద శృణు తత్త్వేన యత్కథా మమ తత్త్వతః,

న మయా దుష్కృతం కించిత్కృత మేవ హి కేనచిత్‌. 127

నిషాదుడా! నాకథ ఉన్నదున్నట్లు చెప్పెదను. వినుము. నేనెన్నడు తప్పుడుపనిని చేయలేదు. నాచేత ఎవ్వరు చేయింపలేదు.

ఏవం భక్తి సమాచార మభక్ష్యం చైవ వర్జితమ్‌,

సమయారాధితో దేవో లోకనాథో జనార్దనః,

కర్మభి ర్బహుభి శ్చైవ మయా దర్శనకాంక్షిణా. 128

నేను భక్తినిండిన ఆచారములు కలిగి, తినరాని దానిని వదలివైచి అనేకపుణ్యకార్మములతో లోకనాథుడగు జనార్దనుని దర్శనము కోరి ఆరాధించితిని.

అథ దీర్ఘేణ కాలేన మయా దృష్టో జనార్దనః,

ఈప్సితా చ మయా తత్ర విష్ణుమాయా మహాభయా. 129

అంతపెద్దకాలమునకు జనార్దనుడు నాకు దర్శన మిచ్చెను. నేనును మహాభయంకరమగు విష్ణుమాయను చూడగోరితిని.

తతో మాం భాషతే విష్ణుః కింతే మాయేన బ్రాహ్మణ

గచ్ఛ కుబ్జామ్రకం శ్రేష్ఠం స్నానం కురు చ జాహ్నవీమ్‌. 130

అంత విష్ణువు నాతో విప్రా! నీకామాయతో పనియేమి? సరే! కుబ్జామ్రక క్షేత్రమున కరుగుము. గంగలో స్నానము చేయుము.

ఏవం తత్ర వచశ్చోక్త్వా విష్ణు శ్చాన్తరధీయత,

అహం మాయాప్రలోభేన గంగాతీర ముపాగతః

స్థాపితం దడ్డ కుణ్ణీ చ పాత్రం వస్త్రం చనిక్షిపేత్‌. 132

ఇట్లు పలికి విష్ణు వంతర్థానము చెందెను. నేనును మాయ నెరుగు పిచ్చికోరికతో గంగఒడ్డునకు వచ్చితిని. దండమును కుండిని, పాత్రను, వస్త్రములను ఒకచోట ఉంచితిని.

ఉచితే నోపచారేణ నిమజ్య సలిలాంభసి

న తత్ర కించిజ్జానామి కిమిదం కింప్రవర్తతే. 133

తగు విధమైన ఉపచారముతో గంగనీట మునిగితిని అటుపై ఏమిజరిగినదో ఏమియు తెలియనైతిని.

సర్వ మేవ విజానామి యో నిషాదగృహే7వసమ్‌

లోభమోహార్ధకామార్థక్రోధేన చ పరిప్లుతః. 134

లోభము, మోహము, కామము, క్రోధము అనునవి ముంచియెత్తుచుండగా నిషాదుని యింట ఉండుట మాత్రము తెలియవచ్చినది.

తతః కేనాపి కర్మేణ జలకృత్య మిహాగతః

నిమజ్య సలిలే చాత్ర జాతో7స్మి బ్రాహ్మణోహ్యహమ్‌. 135

అంత ఏదో కర్మవశమున నీటికొరకు ఇక్కడకు వచ్చితిని. ఇచట నీటమునిగి మరల బ్రాహ్మణుడ నయితిని.

నిషాద పశ్య కుండం చ మాత్రా వస్త్రం సచీవరమ్‌,

పఞ్చా శద్వర్షవాసోపి తతస్తత్ర న నశ్యతి.

నిషాదా! ఇదిగోకుండ, ఇవిగోకావిగుడ్డలు, ఏబది యేండ్లుయినను చెడక ఇక్కడ అట్లేయున్నవి.

నజీర్ణా శ్చీవరాః సర్వే జాహ్నవ్యానైవ తేహృతాః. 136

చివికిపోయిన నాకావిగుడ్డలన్నియు గంగలో కొట్టుకొని పోకున్నవి.

ఏవం తేన తతశ్చోక్తో నిషాదో7దృశ్యతాం గతః,

యే చ తే బాలకా స్తత్ర తేషాం కశ్చిన్నదృశ్యతే. 137

ఇట్లతడు పలుకుచుండగా నిషాదుడు అదృశ్యుడాయెను. అచటనున్న బిడ్డలలో ఒక్కడును కానరాడాయెను.

సతతో బ్రహ్మణో దేవి తప స్తపతి నిశ్చితః

ఊర్ద్వశ్వాసోర్ధ్వబాహుశ్చ వాయుభక్ష పరాయణః. 138

అంత నాబ్రాహ్మణుడు శ్వాసను పైకి గట్టిగా తీసికొనుచు (ప్రాణాయామముచేయుచు) చేతులు పైకెత్తి, వాయువు మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయుచుండెను.

తస్య వై తిష్ఠమానస్య అపరాహ్ణం తు జాయతే,

తతః ప్రముచ్య తోయం తం దేవి కృత్వా యథోచితమ్‌. 139

అట్లు నిలిచియుండగా అపరాహ్ణసమయమాయెను. అంత నాతడు నీటిని వదిలి తగు కృత్యములు చేసికొనెను.

కర్మణ్యషు చ పుణ్యషు మమార్చనరత స్తతః,

అర్చయిత్వా యథాన్యాయం వీరాసన ముపాగతః,

వృతస్తు బ్రాహ్మణౖ ర్ముఖ్యై ర్గఙ్గాస్నానేషు వై ద్విజః. 140

నాపూజలయందు, పుణ్యకార్యములయందు ఎల్లవేళల మిక్కిలి ఆసక్తికలవాడై వీరాసనమువేసికొని నన్నర్చించుచుండెను. గంగాస్నానమునకు వచ్చిన ఉత్తమ బ్రాహ్మణులందరు ఆతనిచుట్టును చేరిరి.

ఊచు స్తతో ద్విజా స్తత్ర తపస్వీ తపసిస్థితః

పూర్వాహ్ణే స్థాపితా మాత్రా త్రిదండీ దండకుండికా. 141

ఇతో గతోసి బ్రహ్మేన్ద్ర స్థాపయిత్వాతుచీవరాన్‌

విస్మారిత మిదం స్థానం శీఘ్రం న త్వముపాగతః. 142

అంత నాబ్రాహ్మణులందరు అట్లు తపస్సున కూర్చున్న ఆతాపసితో ఇట్లనిరి: బ్రాహ్మణోత్తమా! ఎప్పుడో పూర్వాహ్ణమున ఈమాత్ర, దండము, కమండలువు, నారచీరలు ఇక్కడ ఉంచి ఎటకోపోయితివి. ఈస్థలమును మరచితివి? త్వరగా రాకుంటివి.

తతో విప్రవచః శ్రుత్వా తూష్ణీ మాసీన్ముని స్తదా,

బ్రాహ్మణానుగతం స్థాన మాత్మనాత్మాను సంస్థితః. 143

ఆ విప్రుల పలుకులు విని ఆముని మిన్నకుండెను. వారున్న తావును గూర్చి మనసులో భావించుచుండెను.

ఏతస్మిన్నంతరే దేవి స చ బ్రాహ్మణపుంగవః,

చిన్తయన్‌ మనసా దేవి కిమిదం చాద్భుతం మహత్‌

అద్య పఞ్చాశద్‌ వర్షాణి అమావాస్యాతు ఏష వై. 144

ఇంతలో ఆబ్రాహ్మణప్రవరుడు మదిలో ఇట్లు తలపోసెను. ఇదియేమి ఆశ్చర్యము? ఏబదివత్సరములు గడచినవి. ఈనాడు అమావాస్య.

కిమిదం వర్తతే కాలం కిం మామూచుశ్చ బ్రాహ్మణాః

పూర్వాహ్ణే స్థాపితా మాత్రా అపరాహ్ణే కుతో గతః. 145

ఇపుడు ఏకాలముజరుగుచున్నది? ఈబ్రాహ్మణులు పలుకుచున్న దేమి? నాసంచిని పూర్వాహ్ణమున ఇచట ఉంచి ఎటకేగి అపరాహ్ణమునకు వచ్చితివనుచున్నారు.

ఏతస్మిన్నన్తరే దేవి బ్రాహ్మణం తస్య బ్రాహ్మణః,

దర్శితం తస్య చాత్మానం దివ్యరూపేణ వర్చసా,

దర్శయిత్వా తతో రూపం భాషితం వచనం మయా. 146

ఇంతలో అచట బ్రాహ్మణ స్వరూపములో ఉన్ననేను ఆబ్రాహ్మణునకు దివ్యమైనరూపము తేజస్సుగల నానిజరూపమును చూపితిని. చూపి అతనితో ఇట్లంటిని.

స్నాతుకామో గతో విప్ర పూర్వాహ్ణే జపకారణాత్‌,

ఇదం పశ్యాపరాహ్ణే వై కింప్రభో వినివర్తసే. 147

విప్రా! స్నానముచేయగోరి జపముకొరకు పూర్వాహ్ణమున వెళ్లితివి. ఇదిగో, చూడు. అపరాహ్ణము. ఇపుడు తిరిగి వచ్చితివేమి?

మమైవ వచనం శ్రుత్వా స చ శ్రోత్రియపుంగవః,

కృతాంజలి పుటో భూత్వా మన్యునా చాభిపీడితః,

భూమౌ చ స్వశిరః కృత్వా ప్రత్యువాచ తతో మమ. 148

నాఆమాట విని ఆశ్రోత్రియుడు చేతులు జోడించి తలను నేల కాన్చి దుఃఖము పైకొనగా ఇట్లు పలికెను.

జాతా మే సప్త జాతాని అపత్యాని చ పుష్కలాన్‌,

విక్రీతం జాతకం మద్యం కచ్ఛపం చ సితాత్మకమ్‌. 149

నాకేడుగురు పిల్లలు పుట్టిరి. మద్యమును, పిల్లలను, తెల్లనితాబేటిని అమ్మితిని.

భక్షాభక్షం కృతం చాన్యత్‌ పేయాపేయం చ పీతవాన్‌,

గమ్యాగమ్యం కృతంచాపి వాచ్యావాచ్యం చ భాషితమ్‌. 150

తినరానితిండి, త్రాగరానిత్రాగుడు, పొందరానిపొందు పలుకరాని పలుకులు ఈయన్నింటిని చేసితిని.

కిం మయా వికృతం కర్మ సేవమానేన మాధవ,

తపశ్చ తప్యమానేన కిం మయా వికృతంతపః,

భక్షితం కిమకర్మణ్యం సేవమానేన చాచ్యత. 151

వ్యభిచారం చ మే తత్ర కృతం చైవ తవార్చనే

ఏత దాచక్ష్వ తత్త్వేన యేనాహం నరకం గతః. 152

మాధవా! నిన్ను సేవించుచు నేను చేసిన పాడుపనియేమి? తపస్సుచేయుచు నేనుచేసిన వికృతమగుతపస్సెట్టిది? నీఆరాధన చేయుచు, అచ్యతా! నేనే పూజకుపనికిరాని కూడుతింటిని? నీపూజలో నేను చేసిన అకార్యమేమి? నేనానరకమునకు పోవుటకు చేసిన పాపమెట్టిదో ఉన్నదున్నట్లు నాకు తెలియజెప్పుము.

ఏతత్‌ తేనామ ముక్తస్తు వచనం దుఃఖసంయుతమ్‌,

మాయాలుబ్ధేన విప్రేన గంగాపులిన సంసది. 153

తత స్తస్య వచః శ్రుత్వా కరుణం పరిదేవితమ్‌,

ఉక్త వానస్మి తం విప్రం దుఃఖ సంతప్తలోచనమ్‌. 154

ఇట్లు పెనుదుఃఖముతో మాయకు వశుడైన ఆ విప్రుని జాలిగొలుపు ఏడుపు పలుకులు విని గంగపులినమునందు దుఃఖముతో కుమిలిపోయినకన్నులుగల ఆతనితో ఇట్లు పలికితిని.

మా మత్యం కురువై విప్ర ఆత్మదోషో హి తే భవత్‌,

యేన దుఃఖ మనుప్రాప్తం తిర్యగ్యోనిం చవై గతః. 155

విప్రా! మనసును చెదరగొట్టుకొనకుము. ఇది నీస్వీయదోషము. దానివలన ఈ దుఃఖము పొందితివి. నీచయోని యందు పడితివి.

ఉక్త మేవ మయాపూర్వం విప్ర కిం తవ మాయయా,

దదామి దివ్యలోకాన్‌ వై తాంస్తు బ్రాహ్మణ నేచ్ఛసి. 156

నేను ముందే చెప్పితిని. విప్రా! నామాయతో నీకు పనియేమి? దివ్యలోకముల నిత్తును. అంటిని. అవి నీవు కోరకుంటివి.

దృష్ట్వా తు వైష్ణవీ మాయా యాత్వయా బ్రాహ్మణప్సితా,

నగతం దివసంచైవ నాపరాహ్ణ మశేషతః,

వర్షాణి నైవ ప ఞ్చాశ న్నిషాదస్య గృహే7భవత్‌. 157

బ్రాహ్మణా! నీవుకోరిన వైష్ణవ మాయను చూచితివి. రోజుగడవలేదు. అపరాహ్ణము కాలేదు. ఏబదియేండ్లు నీవు నిషాదునియింట నిటువలేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ర్ఛుణుష్వ ద్విజోత్తమ,

యా ఏషా వైష్ణవీ మాయా త్వయా బ్రాహ్మణ ఈప్సితా 158

త్వయా నతత్కృతం కిఞ్చి చ్ఛుభం వాశుభ మేవవా,

సర్వం మాయామయం తత్ర విస్మయాత్‌ పరితప్యసే. 159

విప్రవరుడా! మరియొక విషయముకూడ నీకు చెప్పెదను. దానిని ఆలకింపుము. ఇదియంతయు నీవుకోరిన వైష్ణవమాయ. నీవు శుభమునుగాని అశుభమునుగాని ఏమియు చేయలేదు. ఇదియంతయు మాయతో నైనది. నీవు విస్మయము వలన కుందుచున్నావు.

యత్త్వయా దుష్కృతం కర్మ వ్యభిచారం తథాకృతమ్‌,

అర్చనం నచతే భ్రష్టం తపశ్చైవ న నాశితమ్‌. 160

నీవు చేసిన పాడుపని, వ్యభిచారముల వలన నీతపమేమియు చెడలేదు. తపస్సు పాడుకాలేడు.

పునరన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రు ణోషి ద్విజోత్తమ,

యస్య చైవాపరాధేన స్వయం కృత్వా భవాన్తరే. 161

మరియొక విషయము చెప్పెదను. పూర్వజన్మమునందలి ఏఅపరాధముతో నీవిట్లయితివో దానిని చెప్పెదను.

శుద్ధా భాగవతా విప్ర మద్భక్తా నాభివాదితాః,

తస్య దోషాపరాధస్య ఫలం ప్రాప్తం తతో ద్విజ,

సర్వధా వన్దనీయా వై భక్తా భాగవతాః శుచిః. 162

నాభక్తులు, పరిశుద్ధులు నగు భాగవతులను నీవు అభినందింపకుంటివి. ఆతప్పుఫలమును నీవిపుడు ఈ రూపమున పొందితివి. నాభక్తులు శుచులు అగు భాగవతులు ఎల్లవిధముల వందనీయులు.

యే తు వన్దన్తి విప్రేన్ద్ర భక్తాన్‌ భాగవతాన్‌ మమ

వన్దితో 7స్మీహ విప్రేన్ద్ర సత్య మేతన్న సంశయః. 163

భక్తులగు భాగవతులకు వందనముచేయువారు నాకు వందనముచేయువారగుదురు. ఇందు సందియము లేదు.

యో మాం పృచ్ఛతి వై గన్తుం యస్య వాచ్యం న విద్యతే,

అనన్య మనసో భూత్వా మద్భక్తేషు నియోజయేత్‌. 164

నన్ను పొందుటకు కోరువాడును, ఎట్టినిందలు పొందనివాడును అనన్యమగుమనస్సుతో నాభక్తులయందు తగులము పొందవలయును.

గచ్ఛ బ్రాహ్మణ సిద్దోసి ప్రాణాం శ్చాత్రైవ సంన్యస,

గచ్ఛ మే పరమం స్థానం శ్వేత ద్వీపం మయా సహ. 165

పొమ్ము! బ్రాహ్మణా! సిద్ధుడవైతివి. ప్రాణముల నిచటనే వదలుము. పద! నాతోపాటు పరమస్థానమగు శ్వేతద్వీపమున కరుగుము.

ఏవముక్తో మయా భూమి సచ బ్రాహ్మణ పుంగవః,

దత్త్వా వరం మహాభాగే తత్త్రై వాంతర ధీయత. 166

నేనిట్లు ఆబ్రాహ్మణునితో పలికి వరమిచ్చి అంతర్థానము చెందితిని.

బ్రాహ్మణో దేహం సంన్యస్య మాయాతీర్థే యశస్విని,

కృత్వా సుదుష్కరం కర్మశ్వేతద్వీపముపాగతః. 167

బ్రాహ్మణుడిట్లు ఇతరులకు చేయనలవికాని మహాకార్యముచేసి మాయాతీర్థమున దేహమును వదలి శ్వేతద్వీపమును చేరుకొనెను.

ధన్వీ తూణీ శరీ ఖడ్గీ మహాబల పరాక్రమః,

మమ పశ్యతి వై నిత్యం మాయాబలం సుసంస్థితమ్‌. 168

ధనస్సు, అంబులపొంది, బాణములు, ఖడ్గముతాల్చి గొప్పబలపరాక్రమములు కలవాడై నిత్యము చక్కనిస్థితితోనున్న నామాయాబలమును ఆతడు చూచుచున్నాడు.

తవ మాయేన కింభూమే నమాయాంజ్ఞాతుమర్హసి,

మమ మాయాం నజానన్తి దేవదానవ రాక్షసాః. 169

కనుక భూమి! నీకు నామాయతో నేమిపని? నామాయను నీవెరుగజాలవు. దేవతలు, దానవులు, రక్కసులును ఎవ్వరు ఎరుగరరు.

ఏతత్‌ తే కథితం భూమే మాయాఖ్యానం మహౌజసమ్‌,

మాయాచక్ర మితి ఖ్యాతం సర్వం దుఃఖసుఖావహమ్‌. 170

భూమీ! నీకిట్లు మాయకథ చెప్పితిని. ఇది మహాశక్తి కలిగినట్టిది. దీనిని మాయాచక్ర మని కీర్తింతురు. సర్వదుఃఖములను పోకార్చి సుఖముల కూర్చునట్టిది.

ఆఖ్యానానాం మహాఖ్యానం తపసాం చ పరం తపః,

పుణ్యానాం పరమం పుణ్యం గతీనాం పరమా గతిః. 171

ఇది కథలలో మహాకథ. తపస్సులలో గొప్పతపస్సు. పుణ్యములలో పరమపుణ్యము. గతులలో పరమగతి.

పఠేచ్చ నిత్యం భ##క్తేషు అభ##క్తే షు న కీర్తయేత్‌,

మాపఠేన్నీచమధ్యే వై న పఠేచ్ఛాస్త్రదూషకే. 172

దీనిని భక్తులనడుమ చదువవలయును. భక్తి లేనివారికడ కీర్తింపరాదు. నీచులనడుమను, శాస్త్రములనిందించువారికడను పఠింపరాదు.

అగ్రతః పృష్ఠతో మహ్యం మద్భక్తేషు యథాగ్రతః,

పఠతః శోభ##తే విప్ర నతు యే శాస్త్రదూషకాః. 173

నాముందు, నావెనుక నాభక్తులముందును దీనిని చదువువాడు శోభిల్లును. కానిశాస్త్రదూషకులకడ అట్లు ప్రకాశింపడు.

కల్య ముత్థాయ యోనిత్యం పఠతే చ దృఢవ్రతః,

తేన ద్వాదశవర్షాణి మమాగ్రే పఠితం భ##వేత్‌. 174

చెదరని దీక్షతో ఉదయమున లేచి నిత్యము దీనిని పఠించువాడు పండ్రెండేండ్లు నాముందు పఠించినవాడగును.

అథ పూర్ణేన కాలేన పుమాన్‌ పఞ్చత్వ మాగతః,

మద్భక్తో జాయతే దేవి వియోనిం చ న గచ్ఛతి. 175

కాలము నిండిన తరువాత ఆ నరుడు దేహమును చాలించి నాభక్తుడగును. నీచజన్మములు పొందడు.

య ఏవం శృణుయా న్నిత్యం మహాఖ్యానం వసుంధరే,

న స చాయేత మందాత్మా వియోనిం నైవ గచ్ఛతి. 176

వసుంధరా! ఈమహాఖ్యానమును నిత్యము వినువాడు బుద్ధిహీనుడు కాకుండును. నీచజన్మము పొందకుండును.

ఏతత్తే కథితం భ##ద్రే త్వయా యత్పూర్వ మీప్సితమ్‌,

ముచ్యమానం వరారోహే కిమన్యత్‌ పరిపృచ్ఛసి. 177

భద్రా! నీవు నన్ను మున్నడిగిన విషయమును వివరించితిని. ఇటు పై ఇంక ఏమి అడుగుదువు?

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుర్వింశత్యధిక శతతమో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువదినాల్గవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters