Varahamahapuranam-1    Chapters   

పంచవింశత్యధికశతతమో ధ్యాయః - నూటయిరువది యైదవ అధ్యాయము

సూత ఉవాచ - సూతుడు పలికెను.

శ్రుత్వా మాయాబలం హ్యేతత్‌ ధరణీ శంసిత వ్రతా,

వరాహ రూపిణం దేవం ప్రత్యువాచ వసుంధరా. 1

కొనియాడదగిన వ్రతములు గల ధరణి మాయాబలమును గూర్చి విని వరాహదేవునితో ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - భూమి పలికెను.

యత్తత్‌ కుబ్జామ్రకం దేవ భాషసే తదనన్తకమ్‌,

నాహమత్ర నిజానామి యన్మయా పూర్వపృచ్ఛితమ్‌. 2

దేవా! నీవు కుబ్జామ్రకము అనంతమహిమలు కలదని చెప్పుచున్నావు. మరియు నేను మున్నడిగిన విషచములును కలవు. వీనిని గూర్చి నేను తెలియకున్నాను.

యత్తత్‌ కుబ్జామ్రకే పుణ్యం వ్యుష్టి స్తస్య సనాతనీ,

ఏతన్మే పరమం గుహ్యం భగవన్‌ వక్తు మర్హసి. 3

కుబ్జామ్రకమునందలి పుణ్యమును గూర్చియు, మిక్కిలిసనాతనమయిన మహిమను గూర్చియు ఆ పరమ రహస్యమును నాకు నీవు దయతో చెప్పవలయును.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహ దేవుడు ఇట్లు చెప్పెను.

సర్వం తత్కథయిష్యామి సర్వలోక సుఖావహమ్‌,

యత్తత్కుబ్జామ్రకే వ్యుష్టి ర్యచ్చ తీర్థ మనిన్దితమ్‌,

తాని కార్త్స్నేన మేదేవి శృణు తత్త్వేన సుందరి. 4

దేవీ! కుబ్జామ్రకమునందలి మహిమ యెట్టిదో, ఏదోషమును లేని తీర్థమెట్టిదియో దానిని,సర్వలోకమునకు సుఖము కూర్చుదానిని తేటపడునట్లు తెలియ జేసెదను. వినుము.

యథా కుబ్జామ్రకో జాత స్తతస్తీర్థం యథాక్రమమ్‌,

యచ్చ కర్మ తతో భూమి స్నాతో యాతి మృతేష్వపి. 5

కుబ్జామ్రకము ఎట్లు పుట్టినదో, అచట తీర్థము ఎట్లేర్పడినదో, అందు స్నానము చేసియు, మరణించియు నరుడు పొందు గతి యెట్టిదియో అవియన్నియు వరుస తప్పక చెప్పెదను.

యుగే సప్తదశే భూమి కృత్వా చైకాం వసుంధరామ్‌,

మధు కైటభౌ తథా హత్వా బ్రహ్మ వచననోదితః,

సంహారం తు తత్ర కృత్వా గంగాద్వార ముపాగతః. 6

భూమి! పదునేడవ యుగమున భూమినంతటిని ఒక్కటిచేసి, బ్రహ్మమాట మీద మధుకైటభులను సంహరించి నేను గంగా ద్వారమును చేరుకొంటిని.

పశ్యామి తం నతం భూమి రైభ్యం నామ మహాయశమ్‌,

మమ చారాధనే యుక్తం ధర్మకర్మ సునిష్ఠితమ్‌. 7

అచట గొప్ప ప్రతిష్ఠ కలవాడును, ధర్మకర్మములందు గొప్ప నిష్ఠకలవాడును, నా ఆరాధన యందు తగులము కలవాడును అగు రైభ్యుడను మునిని కాంచితిని.

యుక్తినూన్యో గుణజ్ఞశ్చ శుచి ర్దక్షో జితేన్ద్రియః,

దశవర్ష సహస్రాణి ఊర్థ్వబాహుః స తిష్ఠతి. 8

చక్కని నేర్పుగలవాడు, గుణము లెరిగినవాడు, శుచి, సమర్ధుడు, జితేంద్రియుడు నగు అతడు పదివేల ఏండ్లు చేతులు పైకెత్తికొని అచట నిలిచి యుండెను.

సహస్రం చాంబుభ##క్షేణ తథాశైవాలభక్షణమ్‌,

వర్షాణాం చ శతం పంచ తిష్ఠతే సమహామునిః. 9

వేయిఏండ్లు నీరు ఆహారముగా, అయిదువందల యేండ్లు నాచు భోజనముగా ఆ మహర్షి అచట నిలిచి యుండెను.

తతః ప్రీతో7స్మ్యహం దేవి రైభ్యస్య చ మహాత్మనః,

భక్త్యా చ పరమా చైవ తేన చారాధితో హ్యహమ్‌. 10

మహాత్ముడగు రైభ్యుని పరమభక్తికిని, అతని ఆరాధనకును నేను పరమ ప్రీతినందితిని.

తతో వై తప్యమానం తం గంగాద్వార ముపాగతమ్‌,

ఆమ్రవృక్షం సమాసాద్య దృష్టః స మునిపపుంగవః. 11

అట్లు గంగా ద్వారమున కరిగి తపించుచున్న ఆమునివరుని నేనొక మామిడిచెట్టు నాశ్రయించి చూచితిని.

దర్శితో 7యం మయా చాత్మా హేతుమాత్రేణ కేనచిత్‌,

మయా యదాశ్రిత శ్చామ్ర స్తేన కుబ్జత్వ మాగతః. 12

ఒకానొక కారణము చేత నేనా మామిడిచెట్టు రూపమున అతనికి దర్శన మొసగితిని. నేనా చెట్టు నాశ్రయించినంతనే ఆ చెట్టు కుంచించుకొని పోయినది.

ఏవం కుబ్జామ్రకం ఖ్యాతం స్థాన మేకం యశస్విని,

మృతాపి తత్ర గచ్ఛన్తి మమ లోకాయ కేవలమ్‌. 13

అట్లా స్థలము కుబ్జామ్రకమని (కుంచించుకొని పోయిన మామిడిచెట్టు కలది) ప్రసిద్ధి కెక్కినది. అచట మరణించిన వారును నేరుగా నాలోకమున కేగుదురు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

దృష్ట్వా మమ ఋషి శ్చైవ యాని వాక్యా న్యభాషత. 14

వసుంధరా! మరియొక విషయమును కూడ చెప్పెదను వినుము. ఆ ఋషి నన్ను చూచి ఏమనెనో తెలిపెదను.

ఏవం తత్ర మయా దృష్ట్వా కుబ్జరూపం సమాస్థితః,

జానుభ్యా మవనిం గత్వా కిఞ్చి దేవ ప్రభాషతే. 15

గుజ్జురూపముననున్న నన్ను అతడచట గాంచి మోకాళ్లను నేలపై ఆన్చి కొంచెమేదో భాషించెను.

జానుభ్యాం పతితం దృష్ట్వా సమునిః సంశితవ్రతః,

వరేణ ఛందిత స్తత్ర న తసై#్యవ చ రోచతే. 16

కొనియాడదగిన వ్రతములు గల ఆ ముని మోకాళ్లపై నిలిచి యుండగా నేను ఆతనిని వరము కోరుకొమ్మంటిని. అది ఆతనికి రుచింపలేదు.

మమైవం వచనం శ్రుత్వా స ఋషి స్తపసాన్వితః,

ఉవాచ మధురం వాక్యం ప్రసాదార్థీ మహాయశాః. 17

తపస్సుతో కూడియున్న ఆ ఋషి, ఆ మహాయశస్వి నా అనుగ్రహమును కాంక్షించుచు నామాటవిని మధురముగా ఇట్లనెను.

యది ప్రసన్నో భగవన్‌ లోకనాథో జనార్థనః,

తవ చాత్ర నివాసం వై దేవ ఇచ్ఛామి నిత్యశః. 18

భగవన్‌! నీవు లోకనాథుడవు, జనార్దనుడవు. నీకు నాయందు దయ కలిగినచో నీవు ఎల్లప్పుడు ఇచట నివసింపవలయునని కోరుచున్నాను.

యావల్లోకా ధరిష్యన్తి తావ ద్వర మహాప్రభో,

స్థానం తవ ప్రసాదా చ్చైవేచ్ఛేయం తవ సంస్థితమ్‌. 19

లోకములుండునంత వరకు ఇది నీకు నెలవు కావలయును. నీ దయ. ఇదియే నా కోరిక.

మా మే భక్తి ర్భవే దన్యే తవ వర్జ్యా జనార్దన,

అన్యే భక్తి ర్భవేద్‌ విష్ణో రోచతే న కదాచన. 20

జనార్దన! నిన్ను విడచి నాకు మరియొకని యందు భక్తి కలుగకుండుగాక! ఇతరుల యందు భక్తి నాకెన్నటికిని రుచింపదు.

ఏతేన పరమం చిత్తం యన్మయా హృది వర్తతే,

ఉపేంద్ర యది తుష్టో 7సి ఏతన్మే దీయతాం వరమ్‌. 21

నా హృదయమున ఉన్న పరమవాంఛ ఇదియే. నీవు తుష్టి నందితివేని ఈ వరము నాకీయ దగును.

తత స్తస్య వచః శ్రుత్వా రైభ్యస్య మునిపుంగవ,

బాఢ మిత్యేవ బ్రహ్మేన్ద్ర ఏవ మేతద్‌ భవిష్యతి. 22

అంత ఆ రైభ్యుని మాట విని, మునిపుంగవా! బ్రాహ్మణోత్తమా! సరియే, అదియట్లే యగునని పలికితిని.

మ మైవం వచనం శ్రుత్వా బ్రాహ్మణః స వసుంధరే,

ముహూర్తం ధ్యాన మాస్థాయ ప్రత్యువాచ ద్విజోత్తమమ్‌. 23

నా మాట విని ఆబ్రాహ్మణోత్తముడు ముహూర్తకాలము ధ్యానమున నిలిచియుండెను. నేనాతని కావర మొసగితిని.

శృణు తత్త్వేన మే దేవి యన్మాం త్వం పరిపృచ్ఛసి,

తీర్థే కుబ్జామ్రకే పుణ్య మమ లోకసుఖావహే. 24

దేవీ! నీవు నన్నడిగినదానికి సంబంధించి కుబ్జామ్రకమను పుణ్యతీర్థమునందలి లోకసుఖము కలిగించు విశేషములను తెలిపెదను. వినుము.

తీర్థం తు కుముదాకారం తస్మిన్‌ కుబ్జామ్రకే స్థితమ్‌,

స్నానమాత్రేణ సుశ్రోణి స్వర్గం ప్రాప్నోతి మానవః. 25

ఆ కుబ్జామ్రక క్షేత్రమునందలి తీర్థము (కొలను) కలువ వంటి ఆకారమున నున్నది. అందు స్నానము చేసిన మాత్రమున మానవుడు స్వర్గమున కరుగును.

కౌముదస్య తు మాసస్య తథా మార్గశిరస్య చ,

వైశాఖసై#్యవ మాసస్య కృత్వా వై కర్మ దుష్కరమ్‌. 26

యో వై పరిత్యజేత్‌ ప్రాణాన్‌ స్త్రియః పుంపనపుంసకే,

నిష్కలాం లభ##తే సిద్ధిం మమ లోకం స గచ్ఛతి. 27

కార్తీకము, మార్గశిరము, వైశాఖము అను నెలలలో ఇచట దుష్కరమగు పూజాకర్మమాచరించి ప్రాణములు పరిత్యజించువారు స్త్రీలు గాని, పురుషులుగాని, నపుంపకులుగానీ, ఏ లోపములేని సిద్ధిని పొందుదురు. నా స్థానమున కరుగుదురు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తీర్థం మానస మిత్యేవ యస్తు తత్ర విధీయతే. 28

యస్మిన్‌ స్నాత్వా విశాలాక్షి గచ్ఛతే నందనం వనమ్‌,

దివ్యం వర్షసహస్రం వై మోదతే చాప్సరైః సహ. 29

మరియొక విషయమును వసుంధరా! తెలిపెదను. దీనిని మానస తీర్థమనియ నందురు. దీనిని చేరుకొని పుణ్యకార్యము లొనరించి అందు స్నానము చేసినవాడు నందనవనమున కరుగును. అందు వేయి దివ్యవత్సరములు అప్సరసలతో కూడి విహరించును.

పూర్ణే వర్ష సహస్రే తు జాయతే విపులే కులే,

ద్రవ్యవాన్‌ గుణవాం శ్చైవ జాయతే తత్ర మానవః. 30

వేయి ఏండ్లు నిండిన తరువాత ఆతడు గొప్పకులమున మహాధనవంతుడు, గుణవంతుడు నై పుట్టును.

తత్రాథ ముఞ్చతే ప్రాణాన్‌ కౌముదస్య తు ద్వాదశీమ్‌,

పుష్కలాం లభ##తే సిద్ధిం మమ లోకం చ గచ్ఛతి. 31

కార్తీక ద్వాదశినాడు అందు ప్రాణములు వదలినవాడు పూర్ణసిద్ధిని పొంది నాలోకమున కరుగును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

మాయాతీర్థ మిదం ఖ్యాతం యేన మాయా విజానతే. 32

వసుంధరా! మరియొక విషయమును కూడ చెప్పెదను. వినుము. దీనికి మాయాతీర్థమనియు ప్రసిద్ధి. దీనిచేత నరుడు మాయను తెలిసికొన గలుగును.

తస్మిన్‌ కృతోదకో బ్రహ్మన్‌ మాయాతీర్థే మహాయశాః,

దశవర్ష సహస్రాణి మద్భక్తో జాయతే నరః. 33

ఈ మాయా తీర్థమునందు స్నానము చూసిన దొడ్డమానిసి పదివేలయేండ్లు నాభక్తుడై యుండును.

లభ##తే పరమాం వ్యుష్టిం కుబేరభవనం యథా,

సహస్ర మేకం వర్షాణాం స్వచ్ఛన్ద గమనాలయమ్‌. 34

గొప్ప సంపదను పొందును. వేయి యేండ్లు అతనికి కుబేరుని భవనము ఇష్టము వచ్చినట్లు తిరుగు నివాస మగును.

అథవా మ్రియతే తత్ర మాయాతీర్ధే యశస్విని,

మాయాయోగీ తతో భూత్వా మమ లోకాయ గచ్ఛతి. 35

ఒకవేళ ఆతడా మాయాతీర్థమున మరణించినచో అతడు మాయా యోగియై నాలోకమున కరుగును.

(మాయాయోగీ - మాయతో యోగము కలవాడు - మాధవుడు)

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తీర్థం సర్వాత్మకం నామ సర్వధర్మ గుణాన్వితమ్‌. 36

భూదేవీ! మరియొక విషయము చెప్పెదను. వినుము. అందు సర్వాత్మక మగు తీర్థ ము కలదు. అది అన్ని ధర్మగుణములతో కూడినట్టిది.

యస్తత్ర స్నాయతే కశ్చిద్‌ వైశాఖస్య తు ద్వాదశీమ్‌,

నిష్కలం లభ##తే స్వర్గం సహస్రం దశ పంచ చ. 37

అందు వైశాఖ శుద్ద ద్వాదశినాడు స్నానమాచరించు వాడు, ఏ లోపము లేని స్వర్గమును పదునైదువేల ఏండ్లు పొందును.

అథాత్ర ముఞ్చతే ప్రాణాన్‌ తీర్థే శీర్షకపే తథా,

సర్వసంగం పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి. 38

అట్లే అచటి శీర్షకపమనెడు తీర్థమున ప్రాణములు వదలినవాడు తగులము లన్నింటిని వదలి నాలోకమున కరుగును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి శృణు మే శుభలోచనే,

తీర్థం పూర్ణముఖం నామ తంతు కశ్చి న్న జానతే. 39

శుభలోచనా! మరియొక విషయమును వక్కాణింతును. వినుము. అచట పూర్ణముఖమను తీర్థము కలదు. దాని నెవ్వడు నెరుగ జాలడు.

తత్ర సర్వా భ##వేద్‌ గంగా శీతలం జాయతే జలమ్‌,

తత్ర చోష్ణం భవత్యంబు జ్ఞేయం పూర్ణముఖం తథా. 40

గంగనీరంతయు తక్కిన అన్నితావులందును చల్లగా నుండును. కాని వేడిగా నుండు తావు పూర్ణముఖ తీర్థమని తెలియనగును.

స్నాత్వా గచ్ఛతి సుశ్రోణి సోమలోకే మహీయతే,

పశ్యతే తు సదాసోమం సహస్ర దశపంచ చ. 41

అందు స్నానమొనరించి నరుడు సోమలోకమున కరిగి ప్రతిష్ఠ పొందును. పదునైదు వేలయేండ్లు సోముని ఎల్లపుడు దర్శించు చుండును.

తతః స్వర్గాత్‌ పరిభ్రష్టో బ్రాహ్మణ శ్చైవ జాయతే,

మద్భక్తః శుచిమాన్‌ దక్షఃసర్వకర్మ గుణాన్వితః. 42

పిదప స్వర్గము నుండి తిరిగి వచ్చి బ్రాహ్మణుడై పుట్టును. నా భక్తుడు, శుచిమంతుడు, సమర్థుడు, అన్ని సత్కర్మములు, గుణములు కలవాడును అగును.

అథవా మ్రియతే తత్ర మాసి మార్గశిరే తథా,

శుక్లపక్షే చ ద్వాదశ్యాం మమ లోకం స గచ్చతి. 43

ఒకవేళ మార్గశిర శుద్ద ద్వాదశినాడు అచట మరణించినచో ఆతడు నాలోకమున కరుగును.

తత్ర మాం పశ్యతే నిత్యం దీప్తిమన్తం చతుర్భుజమ్‌,

న జన్మ విద్యతే తస్య మరణం చ కదాచన. 44

గొప్ప దీప్తి నాలుగు భుజములు గల నన్ను ఎల్లవేళల చూచుచుండును. వానికి ఇంక చావుపుట్టుకలు ఎన్నటికిని ఉండవు.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

అశోకం నామ తీర్థంతు అశోకం తత్ర తిష్ఠతి,

తస్యవ్యాప్తిం ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే. 45

వసుంధరా! మరియొక విషయమును చెప్పెదను. వినము. అశోకమును తీర్థము కలదు. అందు నరుడు శోకము లేనివాడై యుండును. దాని వ్యాప్తిని గూర్చి చెప్పెదను. వినుము.

అనన్యమానసో భూత్వా భక్తో భాగవతో మమ,

యస్తు స్నాతి తత్ర తీర్థే కదాచి దపి మానవః,

దశవర్ష సహస్రాణి మోదతే హ్యమరాలయే. 46

నా భక్తుడగు భాగవతుడు అనన్యమగు మనస్సుతో అందు ఒక్కమారైన చేసి పదివేలయేండ్లు స్వర్గమున ఆనందమందును.

తతః స్వర్గాత్‌ పరిభ్రష్ట స్తస్య తీర్థస్య యత్ఫలమ్‌,

ద్రవ్యవాన్‌ గుణవాంశ్చైవ మద్భక్త శ్చైవ జాయతే. 47

పిదప స్వర్గము నుండి కదలివచ్చి ఆ తీర్థము ఫలముగా ధనవంతుడు, గుణవంతుడునగు నాభక్తుడై పుట్టును.

వైశాఖస్యతు మాసస్య శుక్లపక్షస్య ద్వాదశీమ్‌,

యది ముంచేత్‌ స్వకం దేహం కృత్వా కర్మ సుదుష్కరమ్‌. 48

న జన్మమరణం తస్య న గ్లాని ర్నచ వై భయమ్‌,

సర్వసంగ వినిర్ముక్తో మమ లోకాయ గచ్ఛతి. 49

వైశాఖమాస శుక్లపక్ష ద్వాదశినాడు అందు ఎవరికిని సాధ్యముకాని మరణించుట అనుపని చేసి అతడు చావు పుట్టుకలు పొందడు. అలసత, భయము ఆతనికి కలుగవు. అన్ని తగులములను విడనాడి నాలోకమున కరుగును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తీర్థం కరవీరకం నామ లోకే మమ సుఖావహమ్‌. 50

వసుంధరా! కరవీరకమను తీర్థము మిక్కిలి సుఖము కలిగించునది కలదు. దానిని గూర్చి తెలిపెదను వినుము.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి యేన జ్ఞాపయతే శుభే,

పురుషో జ్ఞానవాం శ్చేవ మమ భక్తి సమన్వితః. 51

దాని గుర్తు చెప్పెదను. దానితో అది తెలియ వచ్చును. దానివలన పురుషుడు నాభక్తితో కూడినవాడై జ్ఞాపవంతు డగును.

మాఘమాసే తు సుశ్రోణి శుక్లపక్షే తు ద్వదశీమ్‌,

పుష్పితః కరవీరో వై మధ్యాహ్నే తు న సంశయః. 52

మాఘమాస శుక్లపక్షద్వాదశినాడు మధ్యాహ్నమున కరవీరము పూచును. సంశయము లేదు.

తస్మిన్‌ కృతోదక స్తీర్థే స్వచ్ఛందగమనాలయః,

భ్రమేద్‌ విమాన మారూఢో సహస్రం నరినర్తి చ. 53

ఆతీర్థమున స్ననమాడిన వాడు వేయియేండ్లు ఇచ్చ వచ్చిన గృహముల కరుగుచు విమాన మెక్కి తిరుగాడుచుండును.

తథాత్ర మ్రియతే భూమి మాఘమాసే తు ద్వాదశీమ్‌,

బ్రహ్మాణం మాం చ పశ్యేత పశ్యేతే చ వృషధ్వజమ్‌. 54

మరియు మాఘమాస శుక్లపక్ష ద్వాదశినాడు అందు మరణించినవాడు బ్రహ్మను, నన్ను, పరమేశ్వరుని దర్శించును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తస్య బ్రాహ్మణముఖ్యస్య పూర్వం యత్‌ కథితం మయా. 55

వసుంధరా! మఱియు నొక విషయమును చెప్పెదను. దానిని వినుము. దీనిని మునువు నేనా బ్రాహ్మణ శ్రేష్టునకు (రైభ్యునకు) చెప్పితిని.

తస్మిన్‌ కుబ్జామ్రకే భ##ద్రే స్థానం తు మమ రోచతే,

పుణ్డరీక ఇతిఖ్యాతం తీర్థ మేవ మహద్యశః. 56

ఆ కుబ్జామ్రకమున నాకు మిక్కిలి ఇష్టమైన పుండరీకమను స్థానము కలదు. అదియు గొప్ప ప్రసిద్ధి గల తీర్థము.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తస్య తీర్థస్య సుశ్రోణి ఫలం తత్ర మహాగుణమ్‌. 57

దాని గుర్తును, ఆ తీర్థము సేవించిన కలుగు గొప్పగుణము గల ఫలమును చెప్పెదను. వినుము.

పుండరీకస్య యజ్ఞస్య యజమానస్య యత్ఫలమ్‌,

ప్రాప్నోతి వసుధే తత్ర స్వయమేవ నసంశయః. 58

పుండరీక యజ్ఞము చేయు యజమాను డేఫలము పొందునో దానిని మానవుడు అందు స్వయముగా అందుకొనును. సందియుము లేదు.

అథవా మ్రియతే తత్ర లబ్ధసంజ్ఞో మహాతపాః,

దశానాం పుండరీకానాం ఫలం ప్రాప్నోతి మానవః. 59

మహాతపస్సు కలవాడై జ్ఞానము పొందిన మానవుడందు మరణించునేని పది పుండరీక యాగముల ఫలమును పొందును.

భుక్త్వా యజ్ఞఫలం తత్ర జాతిశుద్ధో మహాతపాః,

సిద్ధించ లభ##తే నిత్యం మమ లోకాయ గచ్ఛతి. 60

ఆ మహాతాపసుడు జాతిచేత శుద్ధుడై యజ్ఞ ఫలమును అనుభవించి నిత్యమగు సిద్ధిని పొంది నాలోకమున కరుగును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి ప్రియే తద్‌ వై శృణోహి మే,

అగ్నితీర్థ మితి ఖ్యాతం గుహ్యం కుబ్జామ్రకే స్థితమ్‌. 61

ప్రియా! అగ్నితీర్థమని కుబ్జామ్రకమున గుట్టుగా నుండు మరియొక తీర్థమును గూర్చి చెప్పెదను. వినుము.

పునః ప్రజాయతే చైవ ద్వాదశ్యాం పఞ్చవర్జితః,

కౌముదస్య తు మాసస్య మాసి మార్గశిరస్య చ. 62

ఆషాఢస్య చ మాసస్య శుక్లపక్షే తు ద్వాదశీమ్‌,

యశ్చైవ మాధవే మాసి సమయే హృది వర్తతే,

తేషాం శుక్తే తు ద్వాదశ్యాం తీర్థం తిష్ఠతి తత్త్వతః. 63

కార్తీకము, మార్గశిరము, ఆషాఢము, వైశాఖము అను నెలలో శుక్లపక్ష ద్వాదశినాడు, లేదా మనసునకు నచ్చిన సమయమందు, పంచమహాపాతకములను రూపుమాపుకొనిన మానవుడు ఈ తీర్థమును సేవించునేని యిది తన నిజస్వరూపమును వానికి కన్పట్ట జేయును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి దేవి తత్త్వం విజానతః,

యేన చిహ్నేన విజ్ఞేయం స తీర్థవరమామకమ్‌,

ఏకచిత్తం సమాధాయ తచ్ఛ్రుణోహి వసుంధరే. 64

దేవీ! దాని గుర్తు చెప్పెదను. నాదయిన ఆ తీర్థమును గూర్చి ఆ గుర్తుతో చక్కగా తెలియవలయును. చెదరని చిత్తమును కుదురు పరచుకొని వినుము.

ముచ్య భాగవతాన్‌ శుద్ధాన్‌ మమ సంహితపాఠకాన్‌,

న కశ్చిత్‌ తద్విజానాతి యస్తు శాస్త్రం న జానతి. 65

నా సంహితను పఠించువారు, శుద్ధులు, అగు భాగవతులన వదలిన వాడు, శాస్త్రము నెరుగనివాడును దానిని తెలిసినకొనజాలడు.

ఫలం తస్య ప్రవక్ష్యామి మృతో7పి స్నాతకో7పి వా,

ఏకచిత్తం సమాధాయ తచ్ఛ్రుణోహి వసుంధరే. 66

అందు మృతి చెందినవాడు, స్నానము చేసినవాడు పొందు ఫలమును చెప్పెదను. మనసును చెదరనీయక కుదురు పరచుకొని వినుము.

అగ్నితీర్థేషు స్నాతో వై తస్మిన్‌ కుబ్జాన్రుకే తు వా,

అగ్నితీర్థే మహాభాగే శృణు స్నానేన యత్ఫలమ్‌. 67

కుబ్జామ్రకము నందలి అగ్నితీర్థమునందు స్నానము చేయుట వలన కలుగు ఫలమెట్టిదియో చెప్పెదను. వినుము.

సప్త కృత్వాగ్నిమేధానాం యత్ఫలం భవతి ప్రియే,

ప్రాప్నోతి స మహాభాగే స్నానమాత్రే న సంశయః. 68

అచట స్నానమాడినంత మాత్రమున నరుడు, ఏడు అగ్నిమేధములు చేసిన ఫలమును పొందును. సంశయము లేదు.

అథవా మ్రియతే తత్ర తత్వైనైకైక ద్వాదశీమ్‌,

వింశద్రాత్రోషితస్తత్ర మమలోకాయ గచ్ఛతి. 69

అట్లు కాక ఇరువది రాత్రులు అందు నివసించి ఏఒక్క ద్వాదశినాడు గాని అందు మరణించునేని అతడు నాలోకమున కరుగును.

తీర్థస్య తస్య వక్ష్యామి చిహ్నాని శృణు సుందరి,

యేన విజ్ఞాయతే విద్వాన్‌ మమభక్త్యా సుఖావహమ్‌. 70

సుందరీ! ఆ తీర్థపు గుర్తులను చెప్పెదను. వినుము. దానివలన నరుడు నాభక్తితో పరమ సుఖమునకు తావలమగు జ్ఞానసంపద చేత ప్రసిద్ధుడగును.

ఉష్ణం భవతి హేమంతే వసుధా తత్ర నిస్కలమ్‌,

గంగా తద్‌ భవతే చోష్ణా గ్రీష్మేవై శీతలా భ##వేత్‌. 71

అచట నేల హేమంతమున (చలికాలమున) వేడిగా నుండును. అచటి గంగ వేడిగా నుండును. గ్రీష్మకామున చల్లగా నుండును.

ఏతచ్చిహ్నం మహాభాగే తీర్థమాగ్నేయ ముత్తరే,

తరన్తి మానవా యేన ఘోరం సంసారసాగరమ్‌. 72

మహాభాగా! ఉత్తరముగా నున్న అగ్ని తీర్థపు గుర్తు ఇది. దీనివలన మానవులు ఘోరమగు సంసార సాగరమును దాటుదురు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి దేవి కుబ్జామ్రకే మహత్‌,

వాయవ్య మితి విఖ్యాతం తీర్థం ధర్మాద్‌ వినిః సృతమ్‌. 73

మరియు కుబ్జామ్రకము నందు వాయవ్యమని ప్రసిద్ధి కెక్కినదియు ధర్మము అను కొండనుండి వెలువడినదియునగు తీర్థమొకటి కలదు. దానిని గూర్చి చెప్పెదను.

తస్మింస్తీర్థే తు యః స్నాతః కృతోదకకృతాగ్నికః,

వాజపేయస్య యజ్ఞస్య ఫలంప్రాప్నోతి నిష్కలమ్‌. 74

ఆ తీర్థమున స్నానమాడి ఉదకకార్యములు, అగ్నికార్యములు చేయువాడు వాజపేయయాగఫలమును సమగ్రముగా పొందును.

అథవా మ్రియతే తత్ర వాయుతీర్థే మహాహ్రదే,

దినాని దశ పఞ్చైవ కృత మేవ హి మామకమ్‌. 75

న తస్యమ్రియతే భూమి జన్మ తస్య న విద్యతే,

జాయతే చ చతుర్బాహు ర్మమ లోకే ప్రతిష్ఠితః. 76

వాయుతీర్థము అను ఆ గొప్ప సరస్సునందు పదునైదు దినములు నా పూజాకర్మముల నాచరించుచు మరణించు వానికి మరల చావు పుట్టుకలు కలుగవు. ఆతడు నాలుగు చేతులు కలవాడై నాలోకమున స్థిరముగా నిలచి యుండును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి వాయుతీర్థస్య సుందరి,

యేన చిహ్నేన విజ్ఞేయః శుభై ర్భాగవతై స్తథా. 77

సుందరీ! ఉత్తములగు భాగవతులు ఏ గుర్తుతో ఆ వాయుతీర్థమును తెలిసికొందురో దానిని చెప్పెదను.

అశ్వత్థవృక్ష పత్రాణి చలన్తి నిత్యశో7వనే,

చతుర్వింశతి ద్వాదశ్యాం యేన ప్రజ్ఞాయతే విభో. 78

అవనీ! అచట ఇరువది నాలుగు ద్వాదశుల యందును రావియాకులు నిరంతరము కదలాడుచుండును. దానితో ఆ తీర్థమును తెలిసికొన దగును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి తీర్థే కుబ్జామ్రకే భువి,

శక్రతీర్థ మితి ఖ్యాతం సర్వసంసార మోక్షణమ్‌. 79

కుబ్జామ్రక క్షేత్రమున శక్రతీర్థమను మరియొక తీర్థము కలదు. దానిని గూర్చి చెప్పెదను. అది సర్వసంసారము నుండియు ముక్తి పొందించును.

తస్మిన్‌ స్నాతో వరారోహే శక్రతీర్థే మహాయశాః,

శక్రస్య వసతే లోకే వజ్రహస్తో న సంశయః. 80

ఆ శక్రతీర్థమున స్నానముచేయు గొప్ప కీర్తిగల మానవుడు ఇంద్రుని లోకమున వజ్రము చేతియందు కలవాడై నివసించును. సంశయము లేదు. (వజ్రహస్తుడు - ఇంద్రుడు)

అథవా మ్రియతే దేవి శక్రతీర్థే మహాతపే,

ఉపోష్య దశరాత్రాణి మమ లోకాయ గచ్ఛతి. 81

మరియు పదిరాత్రులు అందు ఉపవాస మొనరించి మరణించువాడు నాలోకమున కరుగును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి యేన విజ్ఞాయతే తతః,

ఏకచిత్తం సమాదాయ శృణు సుందరి తత్త్వతః. 82

సుందరీ! మనసు కుదుటపరచు కొని వినుము. ఆ తీర్థమును గుర్తించెడు చిహ్నమును తెలిపెదను.

పఞ్చవృక్షం తత స్తత్ర తస్య తీర్థస్య దక్షిణ,

భూమి యేన సవిజ్ఞేయః శక్రతీర్థ మితి స్మృతమ్‌. 83

భూమీ! అచట దక్షిణమున అయిదుచెట్లు కలవు. దానితో ఆ శక్ర తీర్థమును తెలియ నగును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి తీర్థ మేవ వసుంధరే,

వరుణన తప స్తప్తం సహస్రాః పఞ్చ సప్త చ.

వసుంధరా! మరియొక తీర్థమును గూర్చి చెప్పెదను. అందు వరుణ దేవుడు పండ్రెండువేల యేండ్లు తపస్సు చేసెను.

తస్య స్నాతస్య వక్ష్యామి పృచ్ఛితం చైవ యత్ఫలమ్‌. 84

మృతో వా యేన ప్రాప్నోతి పురుషః సంశితవ్రతః,

అష్టవర్ష సహస్రాణి గత్వావై వరుణాలయమ్‌,

స్వచ్ఛన్దమనసో భూత్వా ఏవమేవ నసంశయః. 85

నన్నడిగితివేని అందు స్నానము చేసిన ఫలమును చెప్పెదను. మరియు విశుద్ధమగు వ్రతములు గల పురుషుడు అందు మరణించినచో పొందు ఫలమును తెలియ జేయుదును. అతడు ఎనిమిది వేలయేండ్లు వరుణ లోకమున ఇష్టము వచ్చినట్లు తిరుగాడును. సంశయము లేదు.

అథవా మ్రియతే తత్ర వింశరాత్రోషితో నరః,

సర్వసంగాన్‌ పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి. 86

అచట ఇరువది రాత్రులు ఉపవాసముండి మరణించిన నరుడు అన్ని తగులములను విడనాడి నాలోకమున కేతెంచును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తత్ర ధారా పతత్యేకా ఏకరూపా సదా భ##వేత్‌,

న వర్ధతే చ వర్షాసు ఘర్మే న హ్రసతే పునః. 87

వసుంధరా! దాని గుర్తును చెప్పెదను. వినుము. అచట ఒక ధార పడుచుండును. అది ఎల్లప్పుడు ఒకే రూపమున నుండును. వర్షాకాలమున పెరుగదు. వేసవి యందు తరుగదు.

సప్తసాముద్రకం నామ తస్మిన్‌ కుబ్జామ్రకే స్థితమ్‌,

తస్మిన్‌ కృతోదుకో భూమి నరో ధర్మ పరాయణః,

త్రయాణా మశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి మానవః. 88

భూమీ! ఆ కుబ్జామ్రక క్షేత్రమున సప్తసాముద్రమను తీర్థ మొకటి కలదు. అందు స్నానము చేసిన ధర్మపరాయణుడగు నరుడు మూడు అశ్వమేధ యాగముల ఫలమును పొందును.

శీఘ్రం గచ్ఛతి వై స్వర్గం సహస్రం త్రీణి పఞ్చ చ,

తతః స్వర్గాత్‌ పరిభ్రష్టః కులవాన్‌ జాయతే ద్విజః,

వేదవేదాంగకుశలః సోమపశ్చైవ జాయతే. 89

అతడు వడివడిగా స్వర్గమున కరుగును. ఎనిమిదివేలయేండ్లు అందు నివసించును. పిదప స్వర్గము నుండి తిరిగి వచ్చి ఉత్తమ కులమున, వేదములందు, వేదాంగములందు నేర్పు కలవాడును. సోమపానము చేయువాడును నగు బ్రాహ్మణుడై పుట్టును.

అథాత్ర ముచ్యతే ప్రాణాన్‌ ముక్తః సంగ వివర్జితః,

ఉషిత్వా సప్తరాత్రం వై మమ లోకాయ గచ్ఛతి. 90

మరియు, అచట ఏడురాత్రులు ఉపవాసముండి అన్ని తగులములను వదలుకొని ప్రాణములు విడుచువాడు నాలోకమున కరుదెంచును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి తీర్థభూమిం మహోధరే,

వైశాఖస్య తు ద్వాదశ్యాం విభూతి స్తత్ర జాయతే,

వహేచ్చ విమలా గఙ్గా స్వర్గతోయ విభూషితా. 91

దాని గుర్తు చెప్పెదను. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు అందు విభూతి పుట్టును. స్వర్గజలములతో అలంకృతమైన గంగ అచట ప్రవహించును.

తస్మింస్తీర్థే మహాతేజః క్షీరవర్ణం పునర్భవేత్‌,

పునశ్చ పీతవార్ణాభా పునా రక్తోదకా భ##వేత్‌. 92

ఆ తీర్థమున గంగ గొప్ప కాంతికలదియై పాలవంటి వన్నె కలది యగును. మరల పచ్చని రంగుతో ప్రకాశించును. అటుపై ఎర్రని వన్నె కలది యగును.

వర్ణం మరకతాభాతి పునర్ముక్తా సమప్రభమ్‌,

ఏతై శ్చిహ్నైస్తు విజ్ఞేయం తత్‌తీర్థం పరమాత్మభిః. 93

కొంతవడి మరకతముల రంగుతో తేజరిల్లును. మరల ముత్యముల కాంతివంటి కాంతితో అలరారును, దొడ్డ హృదయమును గలవారు ఈ గుర్తులతో దానిని తెలిసికొందురు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తీర్థం కుబ్జామ్రకే భువి,

తీర్థం మానసరం నామ సర్వవైష్ణవకం శుభమ్‌. 94

కుబ్జామ్రకమున మరియొక తీర్థమున గూర్చి చెప్పెదను. దానిని మానసరమందురు. విష్ణుభక్తులందరు దానిని సేవింతురు. శుభ##మైనది.

తస్మిన్‌ స్నాతో వరారోహే గచ్ఛతే మానసం సరః,

దేవాన్‌ పశ్యతి వై సర్వాన్‌ రుద్రేంద్ర సమరుద్గణాన్‌. 95

అందు స్నానమాడినవాడు మనాససరోవరమున కరుగును. అందు రుద్రులు, ఇంద్రుడు, మరుద్గణములు - అను వారితో కూడిన దేవతల నందరిని దర్శించుకొనును.

అథ తత్ర మృతో భూమి త్రింశద్రాత్రోషితో నరః,

సర్వసంగ వినిర్ముక్తో మమ లోకాయ గచ్ఛతి. 96

అందు ముప్పదిరాత్రులు ఉపవాసముండి మరణించిన నరుడు, అన్ని తగులములను తెగత్రెంపులు చేసికొని నాలోకమున కరుగును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి యేన ప్రజ్ఞాయతే నరైః,

పరాగర్వాచ్చ వితతం మానుషాణాం దురాసదమ్‌. 97

నరులు దానిని చక్కగా తెలిసికొనుటకు వీలగు గుర్తును చెప్పెదను. అది ఎదురుబదురుగా వ్యాపించియుండి మనుష్యులకు ప్రవేశింప నలవి కానిది.

ఏతత్‌ తే భూమి విజ్ఞేయా యథైషో మానసం సరః,

శుభై ర్భాగవతై ర్జేయో మమ కర్మసునిస్ఠితైః. 98

అది మానససరోవరము వంటిది. ఉత్తములు, నా కర్మము లందు నిష్ఠ కలవారునగు పరమభాగవతులకు మాత్రమే తెలియ దగినది.

ఏతత్‌ తీర్థం మహాభాగే తస్మిన్‌ కుబ్జామ్రకే స్మృతమ్‌,

సిద్ధికామస్య విప్రస్య రైభ్యస్య పరికీర్తితమ్‌. 99

మహాభాగా! కుబ్జామ్రకమున నున్న ఈ తీర్థమును గూర్చి సిద్ధికాముడగు రైభ్యుడను విప్రునకు వివరించి చెప్పితిని.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తత్ర కుబ్జామ్రకే వృత్తం పురాశ్చర్యం మహౌజసమ్‌. 100

భూదేవీ! ఆ కుబ్జామ్రక క్షేత్రమున మునుపు జరిగిన ఒక ఆశ్చర్యమును, గొప్పశక్తి కలదానిని చెప్పెదను. వినుము.

మమ నిర్మాల్యపార్శ్వే వై వ్యాలీ వసతి నిర్భయా,

గన్ధమాల్యోపహారాణి భక్షయన్తీ యదృచ్ఛయా. 101

నా నిర్మాల్యమునకు ప్రక్క ఒక త్రాచుపాము భయము లేనిదై గంధమాల్యములను, నివేదన వస్తువులను తినుచు ఉండెడిది.

కస్యచిత్త్వథ కాలస్య నకుల స్తత్ర చాగతః,

పశ్యతే చ తత స్తాం వై రమమాణాం చ నిర్భయామ్‌,

నకులేన సహ వ్యాలీ తయో ర్యుద్ధం ప్రవర్తత. 102

కొంతకాలమున కచటి కొక ముంగిస వచ్చెను. భయములేక ఆడుకొనుచున్న ఆ త్రాచును చూచెను. అంత ఆ రెంటికి పోరు ఆరంభమాయెను.

సంపూర్ణే తేతు మధ్యాహ్నే మాఘమాసే తు ద్వాదశీమ్‌,

తయా స దష్టో నకులో నాశాయ మమ మన్దిరే. 103

మాఘమాసపు ద్వదశినాడు మధ్యాహ్నము ముగియు నపుడు ఆ ముంగిస ఆ పాముకాటునకు నా మందిరమున మరణించెను.

తేనాపి విషదిగ్ధేన వ్యాలీ శీఘ్రం నిపాతితా,

ఉ భౌ చాన్యోన్యయుద్ధేతా ముభౌ పఞ్చత్వమాగతౌ. 104

ఆ ముంగిస విషము పైకొన్న పాము కూడ చనిపోయెను. ఇట్లా రెండును పోరొనర్చి మరణించెను.

వ్యాలీ ప్రాగ్జ్యోతిషే జాతా రాజపుత్రీ యశస్వినీ,

నకులో జాయతే దేవి కోశ##లేషు జనాధిపః,

రూపవాన్‌ గుణవాన్‌ దేవి సర్వశాస్త్ర కలాన్వితః. 105

పాము ప్రాగ్జ్యోతిషమున రాజపుత్రియై పుట్టి ప్రసిద్ధి కెక్కెను. ముంగిస కోసల దేశమున రూపవంతుడు, గుణవంతుడు, అన్ని శాస్త్రములలో కళలలో నేర్పు కలవాడును అగు రాజై పుట్టెను.

తౌ తు దీర్ఘేణ కాలేన సౌఖ్యేన పరిరఞ్జితౌ,

తౌ తు వర్ధత మన్యోన్యం శుక్లపక్షే యథాశశీ. 106

వారు పెద్దకాలము సుఖముతో శుక్లపక్షమున చంద్రునివలె పెరుగజొచ్చిరి.

దృష్ట్వా సా నకులం కన్యా శీఘ్రం వై హన్తు మిచ్ఛతి,

వ్యాలీం దృష్ట్వా రాజపుత్రః సహసా హన్తు మిచ్ఛతి. 107

ఆ రాజకన్య ముంగిసను చూచినంతనే చంప గోరును. రాజకుమారుడు పామును చూచినంతనే చంప గోరును.

అథ తస్యాంతు కాలేన కోశలః కామరూపకః,

మత్ర్పసాదేన వై దేవి సంబంధశ్చైవ జాయతే,

ఉభయోశ్చ కృతోద్వాహః ప్రాగ్జ్యోతిష సకోశలౌ. 108

అంత కొంతకాలమునకు కోసల రాజునకును, ప్రాగ్జ్యోతిష రాజకన్యకకును నాప్సాదమువలన సంబంధము ఏర్పడెను. వారిరువురు పెండ్లి చేసికొనిరి.

దృష్టప్రీతి స్తు తౌ జాతౌ యథాతు జతుకాష్ఠవత్‌,

రమతో ర్భ్రమతో స్తత్ర యత్ర తత్రాపి రోచతే,

యథా శచీ చ శక్రశ్చ విచరన్‌ నందనే వనే. 109

వారిద్దరికి అనురాగము పెరిగెను. వారిరువురు లక్కవలె కలిసిపోయిరి. ఆడుచు పాడుచువారు, నందనమున శచీపురందరుల వలె, ఇచ్చ వచ్చిన తావులందు విహరింప జొచ్చిరి.

ఏవం దీర్ఘేణ కాలేన తయోః ప్రీతి ర్న హీయతే,

వర్ధతే చ యథాన్యాయం వేలామివ మహోదధిః. 110

పెద్దకాలము గడచినను వారి అనురాగము తరుగుపోలేదు. మహాసముద్రము ఒడ్డుపైకి ఉప్పొంగినట్లు వృద్ధి పొందు చుండెను.

తే రమన్తి విహారేషు దేవతాయతనేషు చ,

ఏవం తయో ర్గతః కాలో వర్షాణాం సప్తసప్తతిః,

తౌ న బుద్ధ్యన్తి చాత్మానం మమ మాయా ప్రమోహితౌ. 111

ఉద్యానములలో, దేవాయములలో వారు విహరించు చుండిరి. అట్లు వారికి డెబ్బదియేడేండ్లు గడచెను. కాని నామాయ పైకొనగా వారు తమ నిజస్థితిని తెలియరైరి.

ఏవం తై విహరన్తౌ తు తస్మి న్నుపవనే తతః,

దృష్ట్వా వ్యాలీం రాజపుత్ర స్తతో హన్తుం వ్యవస్థితః. 112

ఇట్లు వారొకనాడు ఉద్యానవనమున విహరించుచుండగా రాజపుత్రుడొక పామును చూచి చంప నుంకించెను.

స తయా ధార్యమాణో వై వ్యాలీం హన్తుం తతోద్యతః,

యథా గరుత్మా న్నాగానాం హతవాన్‌ వినతాత్మజః. 113

ఆమె వలదని వారించుచున్ను రాజపుత్రుడు, పాములను చంపుటకు పరువెత్తు గరుత్మంతుని వలె, దానిని చంపుటకు సిద్ధపడెను.

స తథా వార్యమాణ శ్చ శీఘ్రమేవ నిపాతితా,

రుషితా రాజపుత్రీ సా న కిఞ్చి దపి భాషితా. 114

ఆమె వలదని అడ్డుపడుచున్నను ఆరాజపుత్రుడు ఆ పామును వడివడిగా చావగొట్టెను. అంత నా రాజపుత్రి కోపించి ఆతనితో మాటాడ కుండెను.

తత స్తస్యాం తు వేలాయం రాజపుత్ర్యాః సమగ్రతః,

బిలా న్నిష్క్రమ్య నకుల మాహార పరికాంక్షిణమ్‌,

దృష్ట్వా చ రాజపుత్రీ సా నకులం సర్పకాంక్షిణమ్‌. 115

అదే పమయమున రాజపుత్రి ఎదుట ఒక ముంగిస తిండికొరకు కలుగునుండి వెలువడి కానవచ్చెను.

దృష్ట్వా చ రమమాణం సా నకులం శుభదర్శనమ్‌,

క్రోధో వై జాయతే తస్యా నకులం హన్తు ముద్యతా,

వారితా రాజపుత్రేణ సుతా ప్రాగ్జ్యోతిషస్య వై. 116

చూడముచ్చటగా ఆడుకొనుచున్న ఆ ముంగిసను చూచిన రాజపుత్రికి క్రోధము కలిగెను. దానిని చంపబోయెను. రాజపుత్రుడు ప్రాగ్జ్యోతిష రాజకుమారిని వారించెను.

నకులం ఘాతితం దృష్ట్వా శుభగం సర్వదర్శినమ్‌,

కుపితో రాజపుత్రో వై రాజపుత్రీం ప్రభాషత. 117

చక్కగా తిరుగాడుచు, అందరకు చూడముచ్చట అయిన నకులమును ఆమె చంపివేయగా చూచి రాజపుత్రుడు కుపితుడై ఆమెతో నిట్లనెను.

స్త్రీణాం తు భర్తా వై మాన్యః సదైవ తు విధీయతే,

మయా వై ధార్యమాణన నకులం యత్త్వయా హతమ్‌. 118

ఆడువారికి మగడు ఎల్లవేళల మన్నింపదగిన వాడని శాస్త్రములు ఘోషించు చున్నవి. నీవేమో నేను వలదనుచున్నను ముంగిసను చంపితివి.

తత స్తస్య వచః శ్రుత్వా రాజపుత్రీ యశస్వినీ,

క్రోధమూర్ఛిత సర్వాఙ్గీ రాజపుత్ర మథాబ్రవీత్‌. 119

అభిమానవతియగు ఆరాజపుత్రి ఆతని మాట విని క్రోధముతో వణకి పోవుచున్న సర్వావయవములు కలదియై రాజ పుత్రునితో ఇట్లు పలికెను.

అనపరాధాచరితా త్వయా సర్పీ నిపాతితా,

కిం తత్ర నాపరాధం తే నిహతా క్షితిచారిణీ,

యత్త్వయా ధార్యమాణన శీఘ్రమేవ నిపాతితా. 120

ఏ పాప మెరుగక నేలపై ప్రాకుచున్న పామును, నేను వలదను చున్నను చంపివైచితివి. ఇందు నీ తప్పేమియు లేదేమి?

రాజపుత్ర్యా వచః శ్రుత్వా రాజపుత్రో యథాబ్రవీత్‌,

వాగ్భిః సకటుకం ప్రోక్తం మమ పూర్వం కదాచన. 121

రాజపుత్రి మాట విని రాజపుత్రుడు ఇట్లు పలికెను. నన్ను పోటుమాట లంటివి. మున్నెన్నడు నీవిట్లు పలుకవు.

సర్ప ఆశీవిషో భ##ద్రే తీక్షణదంష్ట్రో మహాభయః,

దశ##తే మానుషం శీఘ్రం తేన సర్పో మయా హతః. 122

అది పాము. ఒక్క పెట్టున విషమును క్రుమ్మరించునట్టిది. వాడికోరలతో మహాభయము పుట్టించునది. కనబడినంతనే మానవులను కరచునట్టిది. అందువలన నేను దానిని చంపితిని.

ప్రజా పాల్యా మయా భ##ద్రే యే కేచి దపథే స్థితాః,

సర్వే తే నాశితవ్యా వై రాజ్ఞా శాస్త్రే యథాశ్రుతిః. 123

రాజు ప్రజలను పాలింపవలయును. చెడ్డదారులను త్రొక్కువారిని నాశనము చేయవలయును. ఇది వేదముననుసరించి శాస్త్రము చెప్పిన విషయము.

శ్వాపదా యే తు హింసన్తి మానుషం తే7పి కామతః,

సస్యం చ యే7పి హింసన్తి తే7పి వధ్యా న సంశయః. 124

కావలయునని నరులను, పంటలను పాడుబెట్టునవి యగు క్రూరమృగములు వధింప దగినవి. సంశయము లేదు.

మమైవ రాజధర్మో వై కర్తవ్యో రాజకర్మణి,

నకులే నాపరాధం తే ఆఖ్యాహి యది కిం కృతమ్‌. 125

రాజకర్మమునందున్న నేను రాజధర్మమును తప్పక ఆచరింప వలయును. ముంగిస చేసిన తప్పేమో చెప్పుము.

దర్శనీయః సురూపశ్చ రాజయోగ్యో గృహేషు చ,

మఙ్గల్యశ్చ పవిత్రశ్చ నకులశ్చ నిపాతితః. 126

చక్కని రూపముతో చూడముచ్చట అయినది, రాజుల యిండ్లలో ఉండదగినది, శుభ##మైనది, పవిత్రమైనది యగు మంగిసను చంపితివి.

స చ మే ధార్యమాణన రాజపుత్రీం నతాం సతీమ్‌,

నతాం భ##ద్రే ప్రశంసామి నకులం గృహ్య మేవ చ 127

ఇండ్లలో ముద్దుగా తిరుగాడు ముంగిసను వలదన్నను చంపిన రాజపుత్రివి భార్యవు అయిన నిన్ను నేను మెచ్చుకొన జాలను.

యన్మయా ధార్యమాణో7పి త్వయా చ నకులో హతః,

మమ చాపి న భార్యాసి అహం చాపి పతి ర్నచ. 128

నేను అడ్డుకొనుచున్నను నీవు ముంగిసను చంపి వైచితివి. ఇంక నీవు నాకు భార్యవు కావు. నేను నీకు మగడను కాను.

కిం చ తే న హతో వా7ద్య అవధ్యాః సర్వతః స్త్రియః,

ఏత ద్వాక్య మథోక్త్వాచ నివర్త్య నగరం ప్రతి. 129

నిన్నీనాడు చంపకున్నాను. ఆడువారు వధకు అర్హలు కారు కదా! అని యిట్లు పలికి ఆతడు నగరమున కరిగెను.

ఏవం క్రోధం సమాదాయ నష్టప్రీతి రుభౌ తథా,

ఏవం స చ గతః కాలో దంపత్యో స్తదనంతరమ్‌,

న రఞ్జయతి చాన్యోన్యం యథాన్యాయేన దూషణమ్‌. 130

వారిరువురు ఇట్లు కోపము పొంది చెడిన ప్రీతి కలవారైరి. దంపతుల నడుమ కాలమెట్లో గడచుచుండెను. ఒకరినొకరు ఆనందపరచుకొనకుండిరి. తదనుగుణముగా తిట్టుకొనుటయు జరుగుచుండెను.

రాజపుత్రస్తు సుశ్రోణి శరీరం నాభిరఞ్జతి,

యథాన్యాయం విధానేన నకులాద్‌ వధకోపితః. 131

రాజపుత్రుడును ముంగిసను చంపిన కోపము చేత శరీర సుఖమును ఏమాత్రము పొందకుండెను.

అథ దీర్ఘేణ కాలేన కోశలాయా జనాధిపః,

శృణోతి తాం కథాం సర్వాం వధం నకులసర్పయోః. 132

అంత పెద్దకాలమునకు కోసలదేశాధిపతి ఆకథ నంతటిని, పాము ముంగిసల వధమును వినెను.

ఏవం శ్రుత్వా యథాన్యాయం సక్రోధ ముభయో రపి,

సమానీయ తతః సర్వా నమాత్యాన్‌ కఞ్చుకీస్తథా,

వధూపుత్రం సమానీయ రాజా వచన మబ్రవీత్‌. 133

ఇది యంతయు ఉన్నదున్నట్లు విని వారు కోపముతో నున్న విషయము తెలిసికొని మంత్రులను, కంచుకులను కోడలిని కొడుకును రావించి రాజిట్లు పలికెను.

కుతః పుత్ర గతం ప్రేమ వధ్వర్థే క్వ గత స్తవ,

ప్రీతి ర్జతుకాష్ఠవద్‌ యా పుత్ర నష్టా కుతస్తు సా. 134

నాయనా! కోడలియందలి నీప్రేమ ఎక్కడికి పోయినది? లక్క వలె అంటుకొని పోయెడు ప్రీతి ఏల నశించినది?

దర్పణష్వివ పశ్యామి ప్రతిబింబం యథాత్మని,

తథాస్తే నాపసవ్యేన కదాచిదపి పుత్రక. 135

అద్దములలో ప్రతిబింబమువలె మీ ప్రమేను నేను చూచితిని. బిడ్డా! ఎన్నడును విరుద్ధముగా కానరాదు.

దక్షా సుశీలా ధర్మిష్ఠా న చ వై త్యక్తు మర్హసి,

అప్రియం నోక్తపూర్వం తు పరే పరిజనే జనే,

మిష్టాన్న సాధనే హ్యేషా వధూ స్త్యక్తుం న యుజ్యతే. 136

ఈమె సమర్థురాలు, చక్కని శీలము కలది, ధర్మప్రవర్తనలో అందరికంటె మిన్న. నీ పరిజనము నందుకాని ఇతరజనుల విషయమున కాని ఆమె ప్రియము కాని మాట పలికి యుండలేదు. నీకు మధుర భోజనములు కూర్చు ఈ కోడలిని పరిత్యజించుట పాడిగాదు.

ధనం సర్వం తు తే ధర్మో ధర్మో యోషి న్న సంశయః,

అహో సత్యజనా దేవ స్త్రీణాం వై కులసంతతిః. 137

నీకు ధర్మమే సర్వమైన ధనము. కులస్త్రీయే ధర్మము. సంశయము లేదు. స్త్రీలలో సత్యశీలము గలవారి వలననే కులము చక్కగా సాగును.

తతః పితు ర్వచః శ్రుత్వా రాజపుత్రో యశస్విని,

ఉభౌ చ చరణౌ గృహ్య పితరం ప్రత్యభాషత. 138

అంత తండ్రిమాట విని రాజపుత్రుడు తండ్రి రెండు పాదములు పట్టుకొని ఇట్లు బదులు చెప్పెను.

దోషో న విద్యతే తాత స్నుషాయాం తవ నిష్కలా,

వార్యమాణా మయా రాజన్‌ నకుల శ్చాగ్రతో హతః. 139

తండ్రీ! నీకోడలి యందలి తప్పు ఆవంతయు లేదు! కాని నేను వలదనుచుండగా నా యెదుట ముంగిసను చంపినది.

తతో మే జాయతే మన్యు ర్దృష్ట్వా నకులం పాతితమ్‌,

క్రోధసక్తే సతప్తేన యేన వై పరిభాషితా. 140

చంపబడిన నకులమును గాంచిన నాకు పెనుకోపము కలిగెను. ఆ కోపముతో ఉడికి పోయిన నేను ఆమెను నిందించితిని.

తతః పతివచః శ్రుత్వా ప్రాగ్జ్యోతిషకులోద్భవా,

శిరసా ప్రణతిం కృత్వా వాక్యం చేదమువాచ హ. 141

అంత మగని మాటవిని ప్రాగ్జ్యోతిషరాజపుత్రి తలతో ప్రణమిల్లి యిట్లు పలికెను.

నాపరాధోతి భీత శ్చావనతో భుజగ స్తథా,

శతశో వార్యమాణన శీఘ్ర మేవ నిపాతితః. 142

ఏ తప్పు నెరుగనిది, బెదరిపోవుచున్నట్టిది, తలవంచుకొని తన దారిని తాను పోవుచున్నట్టిది. అట్టి పామును, నేను వంద విధములుగా వారించుచున్నను వడివడిగా చంపివైచెను.

తతః సర్పవధం దృష్ట్వా క్రోధ సంతప్తదర్శనా,

అనేన సహ సంవాదం కిఞ్చి దేవ ప్రభాషిణీ. 143

అట్టి సర్పమును వధించుట చూచి క్రోధము కాల్చి వేయగా ఈయనతో కొంచెముగా వాదులాడితిని.

వధూపుత్రవచః శ్రుత్వా కోసలానాం జనేశ్వరః,

ఉవాచ మధురం వాక్య ముభయో ర్యద్ధితం శుభమ్‌. 144

కోడలిమాటను, కొడుకుపలుకును విని కోసలరాజు ఇద్దరికి మేలైనదియు, శుభ##మైనదియునగు పలుకిట్లు పలికెను.

నకులో హత మిత్యాహ యది సర్పో నిపాతితః,

కిమిదం క్రియతే క్రోధ మేతన్మే వక్తు మర్హసి. 145

సర్పమును చంపగా నకులమును చంపితి ననుచున్నది. ఇంక నిచట కోపమేల చేయవలయునో నాకు చెప్పుము.

హతే తు నకులే పుత్ర కస్తే మన్యు ర్భవేత్‌ తదా,

రాజపుత్రి హతే సర్పే కస్తే మన్యు ర్భవే దిహ. 146

కొడుకా! ముంగి చచ్చినది. ఇంక నీకు కోపమేల? రాజపుత్రీ! పాము చచ్చినది. నీకిచట కోప మేల?

తతః పితు ర్వచః శ్రుత్వా కోసలేశ్వరనందనః,

ఉవాచ మధురం వాక్యం రాజపుత్రో మహాయశాః. 147

అంత తండ్రిమాట విని కోసలేశ్వరుని నందనుడు, గొప్ప కీర్తిశాలి, రాజపుత్రుడు తీయని పలు కిట్లు పలికెను.

తతః కిం తేన పృష్టేన త్వయా పృచ్ఛితు మర్హసి,

ఏతాం పృచ్ఛ మహాభాగ యం జ్ఞాస్యన్తి శరీరిణః. 148

అట్లయినచో నీవు నన్నడుగనేల? మహాత్మా! ఆమెనే అడుగుము. దానితో ప్రాణులందరు ఆ విషయ మెరుగుదురు.

పుత్రస్య వచనం శ్రుత్వా కోసలానాం జనేశ్వరః,

ఉవాచ మధురం వాక్యం ధర్మ సంయోగ సాధనమ్‌. 149

కొడుకుమాట విని కోసలరాజు వారిరువురి ధర్మపు కలయికను సాధించు తీయని పలుకిట్లు పలికెను.

బ్రూహి పుత్ర యథాన్యాయం యత్తే మనసి వర్తతే,

ప్రీతివిచ్ఛేదకరణ ముభయో ర్దమ్పతీ మిహ. 150

నాయనా! న్యాయముగా నీహృదయమున నేమున్నదో చెప్పుము. మీ యిద్దరకు ప్రీతిని త్రెంచివేసిన కారణ మెయ్యది?

జాతః సంవర్ధితః పుత్ర సర్వకర్మసు నిష్ఠితః,

పిత్రా వై పృష్టగుహ్యాని గోపయన్తి నరాధమాః. 151

కొడుకా! నిన్ను కంటిని, పెంచి పెద్ద చేసితిని, సర్మకర్మముల యందును నేర్పు నలవరచితిని. తండ్రి అడుగగా రహస్యములను దాచియుంచువారు నరాధములు.

సత్యం చ యదసత్యం వా న బ్రవన్తి కదాచన,

పతన్తి వరకే ఘోరే రౌరవే తప్తవాలుకే. 152

సత్యమో అసత్యమో ఉన్నదున్నట్లు తండ్రికి చెప్పనివారు మండుచున్న యిసుకగల ఘోరమైన రౌరవ నరకమున పడుదురు.

పిత్రా పృష్టం తు యే సత్యం బ్రువతే చ శుభాశుభమ్‌,

దివ్యాం చ తే గతిం యాన్తి యా గతిః సత్యవాదినామ్‌. 153

అది మేలైనను కీడైనను తండ్రి అడిగినపుడు సత్యమునే చెప్పువారు సత్యమును పలుకువారేగు సుగతికి పోవుదురు.

అవశ్యమేవ తద్వాక్యం వక్తవ్యం మమ సన్నిధౌ,

యస్య దోషేణ వై పుత్ర నష్టా ప్రీతి ర్గుణాకరే.154

కుమారా! నీవు నా యెదుట, మంచి గుణములకు గనియైన కోడలి యందు ప్రీతి యేల తప్పితివో దానిని తప్పక చెప్పవలయును.

తతః పితు ర్వచః శ్రుత్వా కోసలా నన్దివర్ధనః,

ఉవాచ శ్లక్షణయా వాచా తత్రైవ జనసంసది. 155

తండ్రి మాట విని కోసల రాజనందనుడు, ఆ సభయందే మెత్తని పలుకు నిట్లు పలికెను.

గచ్ఛత్యేష జనః సర్వో యథాన్యాయం గృహాణి వై,

కల్యం తే కథయిష్యామి ఏష యత్‌ తవ రోచతే. 156

నాయనా! ఈ జనమంతయు వారివారి యిండ్లకు అరుగుదురు గాక! మీకిష్టమైనచో రేపు ఉదయమున మీకు ఉన్న విషయమును చెప్పుదును.

ప్రభాతాయాం తు శర్వర్యాం శఙ్ఖదున్దుభి నాదితః,

విబుద్ధః కోసలశ్రేష్ఠః సూతమాగధ వన్దిభిః. 157

తెల్లవారుచుండగా కోసలరాజు శంఖములు, దుందుభులు మ్రోగుచుండగా సూతులు, మాగధులు, వందులు స్తోత్రపాఠములు చేయుచుండగా మేల్కొనెను.

తదా కమలపత్రాక్షో రాజపుత్రో మహాయశాః,

స్నాతో మఙ్గలకం కృత్వా రాజధానీ ముపాగతః. 158

అంత కమలముల రేకుల వంటి కన్నులు కలవాడు, గొప్ప యశస్సు కలవాడునగు రాజకుమారుడు స్నానము చేసి మంగళ కార్యములు ముగించుకొని రాజున్నతావునకు వచ్చెను.

తతః కఞ్చుకీ శీఘ్రం వై రాజధానీం నివేదితః,

ద్వారి తిష్ఠతి పుత్రస్తే తవ దర్శన లాలసః. 159

అంత కంచుకి వడివడిగా రాజుకడ కరిగి రాజా! నీ కుమారుడు నిన్ను చూచుకోరికతో ద్వారమున నిలిచి యున్నాడని నివేదించెను.

కఞ్చుకేస్తు వచః శ్రుత్వా కోసలానాం జనేశ్వరః,

శీఘ్రమేవ ప్రవిశ్యాథ మత్పుత్ర శ్చ కులోద్భవః. 160

కంచుకి మాట విని కోసలరాజు నాకుమారుడు, నాకులమున పుట్టినవాడు నగు అతనిని వెంటనే ప్రవేశ పెట్టుమని పలికెను.

రాజపుత్రే ప్రవిష్టే తు తత్ర చోత్సవతే జనః,

చాతుర్వర్ణ్య ప్రవృత్తిం తాం పరీతౌ పితృపుత్రకౌ. 161

రాజపుత్రుడు ప్రవేశింపగా అందున్న జనులందరు ఆనందమొందిరి. తండ్రి కొడుకులు నాలుగు వర్ణముల వారి స్థితిగతులను గూర్చి కొంత వడి ముచ్చటించిరి.

యద్‌ గుహ్యం పృచ్ఛసే తాత మమ చాత్ర జనాకులే,

న శక్నోమి చ తం వక్తుం తతో గుహ్యం జనాకులే. 162

నాయనా! జనులు నిండుగా ఉన్న తావున నా రహస్యము నడిగితిని. అందువలన ఆ రహస్యమును చెప్పజాలకపోవు చున్నాను.

అవశ్యమేవ వక్తవ్యం త్వయా పృష్టేన నిష్కలమ్‌,

ఏతద్‌ గుహ్యం మహారాజ ప్రీతి విచ్ఛేద కారకమ్‌. 163

మహారాజ! మా ప్రీతిని త్రుంచివేసిన కారణమగు రహస్యమును మొత్తముగా నేను నీకు తప్పక చెప్పవలయును.

యదిచ్ఛసి మహారాజ శ్రోతుం గుహ్య మిదం మహత్‌,

గచ్ఛ కుబ్జామ్రకం శీఘ్రం తాత ఏవదం మయా సహ. 164

మహారాజా! ఈ గొప్పగుట్టును నీవు వినగోరుదునేని నాతోపాటు కుబ్జామ్రక క్షేత్రమునకు శీఘ్రముగా రమ్ము.

తత్ర తే కథయిష్యామి కోసలాధిపతే నృప,

యత్త్వయా పృచ్ఛితం హ్యేతద్‌ గుహ్యం పూర్వ మనిన్దితమ్‌. 165

కోసలరాజా! నీవడిగిన ఆ పరమ రహస్యమును, ఏదోషము లేనిదానిని, నీకచట చెప్పెదను.

తత స్తస్య వచః శ్రుత్వా రాజపుత్రస్య వై నృపః,

బాఢ మిత్యేవ తత్రాహ చాతుర్వర్ణ్యం యశస్విని. 166

అంత ఆ రాజకుమారుని పలుకు విని రాజు నాలుగు వర్ణముల వారున్న ఆ తావున 'సరే' యని పలికెను.

రాజపుత్రే గతే తత్ర అమాత్యస్య చ సన్నిధౌ,

ఉవాచ మధురం వాక్యం యే వై తత్ర జనాః స్థితాః. 167

రాజపుత్రుడు అచట మంత్రులకడ నిలిచి యుండగా రాజు అచట నున్న జనులతో తీయగా ఇట్లు పలికెను.

తత్ర గచ్చామహే గన్తుం స్థానం కుబ్జామ్రకం ప్రతి,

న కేనచిద్‌ వారణీయో గమనే కృతనిశ్చయః. 168

మేము ఆ కుబ్జామ్రక క్షేత్రమునకు పోయెదము. వెళ్లుటకు నిశ్చయము చేసికొంటిమి. ఎవ్వరును మమ్ము వారింప రాదు.

అథ తే సప్తరాత్రేణ రాజానం తమువాచ హ,

సజ్జన్తి సర్వద్రవ్యాణి కిమాజ్ఞాపయతే భవాన్‌. 169

అంత ఏడు దినములు గడచిన తరువాత మంత్రులు రాజుతో సర్వద్రవ్యములను సిద్ధము చేసితిమి. తమ యాజ్ఞయేమి? అని పలికిరి.

అమాత్యానాం వచః శ్రుత్వా కోసలానాం జనాధిపః,

సాధు సాధ్వితి చోక్త్వా వై అమాత్య జనసంసది. 170

హస్త్యశ్వరథయానాని భాణ్డాగారం సుసంయుతమ్‌,

కారుజాపణ్య వేశ్చాశ్చ గన్తుకామాః ప్రచక్రిరే. 171

మంత్రుల మాట విని కోసలరాజు మంత్రుల సముదాయము నందు 'బాగు బాగు' అని పలికెను. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వాహనములు, చక్కగా సిద్ధపరుప బడిన ధనాగారము, శిల్పులు, వంటవారు, వేశ్యలు మొదలగు వారందరు బయలు దేరిరి.

తతః సరాజశార్దూలో జ్యేష్ఠం పుత్రం ప్రభాషత,

పుత్ర కిం చైవ కర్తవ్యం శూన్యం రాజ్య మిదం మయా. 172

అంత ఆ రాజోత్తముడు పెద్దకొడుకుతో, కుమారా! నేను చేయవలసిన దేమి? ఈ రాజ్య మిప్పుడు శూన్యమైనది. (రాజు లేనిదైనది) అని పలికెను.

తతః పితు ర్వచః శ్రుత్వా రాజపుత్రో మహాయశాః,

ఉవాచ మధురం వాక్యం నిపత్య చరణౌ పితుః. 173

అంత తండ్రి మాటవిని కీర్తిశాలి యగు రాజపుత్రుడు తండ్రి పాదములపై పడి తీయగా ఇట్లు పలికెను.

ఏష కనీయసో భ్రాతా ఏకోదర వినిఃసృతః,

ఏతస్య దీయతాం రాజ్యం యథాన్యాయ ముపాగతమ్‌. 174

ఈతడు నాతమ్ముడు. మేమిరువురము ఒక్క గర్భమునుండి వెలువడిన వారము. న్యాయముననుసరించి ఈ రాజ్యము నీతని కొసగుము.

పుత్రస్య వచనం శ్రుత్వా స రాజా ధర్మనిష్ఠితః,

త్వయి జీవతి వై జ్యేష్ఠే కనీయాన్‌ కథ మర్హతి. 175

కొడుకు మాట విని ధర్మమున నిష్ఠ గల రా రాజు, నీవు జీవించియుంగా చిన్నవాడు రాజ్యము కెట్లు అర్హుడగును? అని పలికెను.

తతః పితు ర్వచః శ్రుత్వా కోసలానాం కులోద్వహః,

ఉవాచ మధురం వాక్యం పితరం ధర్మకారణాత్‌. 176

అంత తండ్రి మాటవిని కోసలరాజు కులమును ఉద్ధరించు ఆ కుమారుడు ధర్మము ననుసరించి తండ్రితో ఇట్లు పలికెను.

అనుజానామి తే తాత దీయమానాం వసుంధరామ్‌,

తస్య ధర్మోచితో యస్తు భుఞ్జ మానస్య మేదినీమ్‌. 177

తండ్రీ! నీవు తమ్ముని కిచ్చెడు భూమిని నేను అంగీకరింతును. ఆతడు ఈ మేదిని ననుభవించుట ధర్మము చేత ఉచితమైనది అగుగాక!

నాహం కుబ్జామక్రం గత్వా నివర్తిష్యే కదాచన,

ఏతత్‌ సత్యం చ ధర్మం చ తతస్తే కథితం మయా. 178

నేను కుబ్జామ్రకమున కరిగి ఎన్నిటికిని తిరిగి రాను. ఇది సత్యము, ధర్మము. నేను నొక్కి చెప్పుచున్నాను.

రాజపుత్రా భ్యనుజ్ఞాతో హ్యభిషిక్తో జనాధిపః,

సంముఖేన మహారాజ్యే భూమి భూపతి సత్తమః. 179

రాజోత్తముడగు ఆ కోసలజనాధిపుడు కొడుకు అనుమతి మేరకు అందరిముందు తన రెండవ కుమారుని మహారాజ్యమున అభిషిక్తుని గావించెను.

తతో దీర్ఘేణ కాలేన స్థానం కుబ్జామ్రకం గతః,

అన్తః పురసమాయుక్తః సర్వద్రవ్య సమన్వితః. 180

అంత పెద్దకాలమునకు రాజు అంతఃపురముతో, సకల వస్తువులతో కూడినవాడై కుబ్జామ్రకమునకు చేరుకొనెను.

ఏవం చై వోషితా స్తస్థుః స్థానే కుబ్జామ్రకే గతాః,

దదుస్తే ధనరత్నాని దీర్ఘకాలం చ గచ్ఛతి. 181

వారందరు అచటి కరిగి ఆ కుబ్జామ్రక క్షేత్రమున ఉండిరి. పెక్కు ధనములను, రత్నములను దాన మొసగిరి. పెద్దకాలము గడచెను.

ఏవం చ వసతాం తేషాం బుద్ధీ రాజ్ఞో వ్యజాయత,

గుహ్యం వై ప్రష్టుకామస్య ప్రీతి విచ్ఛేద కారణమ్‌. 182

ఇట్లు వారచట నివసించుచుండగా ఒకనాడు రాజునకు కొడుకు కోడళ్ల ప్రీతి చెడుటకు గల కారణము నడుగ వలయునను బుద్ధిపుట్టెను.

తత శ్చాస్తం గతే సూర్యే తతో రాత్రి రుపాగతా,

కోసలాధిపతిః శ్రేష్ఠః పుత్ర మేవ మువాచ తమ్‌. 183

అంత సూర్యు డస్తమింపగా, రాత్రిరాగా కోసల రాజు తన పుత్రు నిట్లడిగెను.

ప్రాప్తాః కుబ్జామ్రకం వత్స విష్ణోః పాదసమాశ్రయమ్‌,

దత్తాని ధనరత్నాని న చైవం చిన్తయన్తి తామ్‌. 184

బిడ్డా! విష్ణుపాదములకు నెలవైన కుబ్జామ్రకమును చేరుకొంటిమి. పెక్కుదానములు చేసితిమి. దానిని గూర్చి విచారింపను

బ్రూహి సత్యంతత స్తత్ర యస్యత్వం సుందరీ స్నుషా,

అదుష్టకారిణీ యుక్తా కులశీల గుణాన్వితా. 185

నిజము చెప్పుము. కోడలు అందమైనది. పాడు పనులెన్నటికిని చేయనిది. యోగ్యురాలు. కులము, శీలము, గుణము నిండుగా కలిగినది. ఆమె యెడ నీవు విముఖుడవైన కారణమును దాపక చెప్పుము.

ఉవాచ మధురం వాక్యం పితరం తదనన్తరమ్‌,

స్వప తాత ఇమాం రాత్రి మేక ఏవ జనాధిప,

ప్రభాతే కథయిష్యామి యద్‌ వృత్తం తం దురాసదమ్‌. 186

అంత నతడు తండ్రితో మధురముగా ఇట్లు పలికెను : నాయనా ఈ రాత్రి నీవొక్కడవు ఇచట నిద్రింపుము. తెల్లవారినంతనే మునుపు జరిగిన ఆ ఘోరమైన వృత్తాంతమును తెలిపెదను.

తతో రజన్యాం వ్యుష్టాయా ముదితే చ దివాకరే,

కృతోదకం తు గంగాయాం క్షౌమవస్త్ర విభూషితః. 187

అర్చయిత్వా యథాన్యాయం భూమి యుక్తేన కర్మణా,

పితుః ప్రదక్షిణం త్వా వాక్య మేత దువాచ హ. 188

ఆ రాత్రి గడచిన పిమ్మట సూర్యుడుదయించిన తరువాత రాజపుత్రుడు గంగలో స్నానమాడి, పట్టువస్త్రములు కట్టుకొని, యోగ్యమగు విధానముతో పూజలు గావించి తండ్రికి ప్రదక్షిణము చేసి యిట్లు పలికెను.

ఏహ్యేహి తాత గచ్ఛామ యస్త్వం గుహ్యాని పృచ్ఛసి,

శృణు తత్త్వేన మే రాజన్‌ యత్త్వయా పూర్వపృచ్ఛితమ్‌. 189

రాజా! పోదము,రమ్ము. రమ్ము నీవు నన్నడిగిన రహస్యమును గూర్చి ఉన్నదున్నట్లు చెప్పెదను. వినుము.

రాజపుత్రశ్చ తే రాజా సా చ పఙ్కజలోచనా,

గతా నిర్మాల్యకూటం తే యత్త ద్వృత్త్వం పురాతనమ్‌. 190

ఆ రాజపుత్రుడు, ఆరాజు, ఆ పద్మలోచనము వారందరు మునుపు పాతకథ జరిగినిర్మాల్యపు ప్రోవు దగ్గర కరిగిరి. (నిర్మాల్మము - గతదినము నాటి తొలగించిన పూజా ద్రవ్యములు).

నిర్మాల్యం తు సమాసాద్య రాజపుత్రో మహాతపాః,

ఉభౌ తౌ చరణౌ గృహ్య పితరం ప్రత్యభాషత. 191

గొప్పతపస్సంపదగల ఆ రాజపుత్రుడు నిర్మాల్యము దరిజేరి తండ్రి రెండు పాదములను పట్టుకొని ఇట్లు పలికెను.

నకులోహం మహారాజ వహమి కదలీతలే,

తతోహం కాలసంయుక్తః ప్రాప్తో నిర్మాల్య కూటకమ్‌. 192

మహారాజా! నేను మునుపొక ముంగిసను. ఈ అరిటితోటలో ఉంటిని. కాలము త్రోసికొని రాగా ఈ నిర్మాల్యపు ప్రోవుకడకు వచ్చితిని.

తత శ్చాశీవిషా సర్పీ ప్రాప్తా చైవ ధనాధిప,

భక్షయన్తీ సుగన్ధీని దివ్యాని కుసుమాని చ. 193

అప్పుడచటికి ఒక విససర్పము వచ్చి మంచి సువాసనలు గల మేలైన పూవులను తినుచుండెను.

దృష్ట్వా తు తాం మహావ్యాలీం క్రోధ సంరక్తలోచనః,

అచిరేణ ముహూర్తేన అస్యాఙ్కం సంహితో గతః. 194

ఆ పెనుబామును చూచి కోపముతో నెరు పెక్కిన కన్నులతో ఒక్క పెట్టున దానిపైకి దుమికితిని.

తస్యాశ్చ మమ రాజేన్ద్ర ఘోరం యుద్దం ప్రవర్తత,

మాఘమాసస్య ద్వాదశ్యాం తతః కశ్చి న్న పశ్యతి. 195

దానికిని నాకును, మాఘమాసము ద్వాదశినాడు ఘోరమైన పోరు సాగెను. దాని నెవరు చూడరైరి.

యుధ్యమానస్య మే తత్ర గాత్రం చైవ నిగూహితః,

నాసావంశే తయా దష్టో భుజఙ్గ్యా చ తదన్తరే. 196

అట్లు పోరుచుండగా ఆ పాము నాఒడలెల్ల పెన వైచుకొని ముక్కుపై కాటు వేసెను.

మయాపి విషదిగ్ధేన నిహతా సా భుజంగమా,

ఉభౌ ప్రాణాన్‌ పరిత్యజ్య ఉభౌ పఞ్చత్వ మాగతౌ. 197

విషము పైకొన్న నేనును ఆ నాగుబామును చంపి వైచితిని. ఇట్లు ఇరువురము ప్రాణములను వదలితిమి.

మృతౌ స్మ కాలే రాజేన్ద్ర క్రోధదోష పరిప్లుతౌ,

జాతోహం తవ పుత్రో వై కోసలాధిపతేః సుతః. 198

ఇట్లిరువురము క్రోధముచేసిన తప్పు పైకొనగా ఆ సమయమున మరణించితిమి. నేను కోసలాధిపతివైన పుత్రుడనై పుట్టితిని.

ఏవం మే ఘాతితా సర్ఫీ తత్‌ క్రోధవశనిశ్చయాత్‌,

ఏతద్‌ గుహ్యం మహారాజ యత్త్వయా పూర్వపృచ్ఛితమ్‌. 199

అప్పటి కోపము మనసున ఉండుటవలన నేనా ఆడు పామును చంపితిని. రాజా! నీవు మునుపు అడిగిన దాని రహస్య మియ్యది.

రాజపుత్రవచః శ్రుత్వా వధూ ర్వచన మబ్రవీత్‌,

ఉవాచ శ్వశురం వాక్యం గత్వా నిర్మాల్య కూటకమ్‌. 200

రాజపుత్రుని మాట విని కోడలు ఆ నిర్మాల్యపు ప్రోవు కడకరిగి మామతో ఇట్లు పలికెను.

అహం సర్పీ మహారాజ నకులేన నిపాతితా,

ప్రోగ్జ్యోతిషకులే జాతా వధూ స్తవ ఉపాగతా. 201

మహారాజా! ఆ ముంగిస చంపిన త్రాచుపాము నేనే. నేను ప్రాగ్జ్యోతిష పురమున పుట్టి నీకు కోడల నైతిని.

తేన క్రోధేన నృపతే మూర్ఛితా మరణం ప్రతి,

ఘాతితో నకులశ్చైవ గుహ్య మేతద్‌ బ్రవీమి తే. 202

అట్లు నేను మరణించితిని. ఆ కోపముతో ఒడలెరుగని దానవై యింటిలోని ముంగిసను చంపివైచితిని. ఈ రహస్యమును ఇపుడు నీకు చెప్పుచున్నాను.

వధూపుత్రవచః శ్రుత్వా సరాజా సంశితవ్రతః,

మాయాతీర్థం సమాసాద్య తతం పఞ్చత్వ మాగతః. 203

కోడలు, కొడుకు చెప్పిన మాటలు విని నిష్ఠగా చేసిన వ్రతములుగల ఆరాజు మాయాతీర్థమును చేరుకొని అందు ప్రాణములు విడచెను.

రాజపుత్రో విశాలాక్షి రాజపుత్రీ యశస్వినీ,

పౌణ్డరీకే తతస్తేర్థే తేపి పఞ్చత్వ మాగతాః. 204

ఆ రాజపుత్రుడును, కీర్తిశాలిని యగు రాజపుత్రియు పౌండరీక క్షేత్రమును ప్రాణములు వదలిరి.

గతా స్తే పరమం స్థానం యత్ర దేవో జనార్దనః,

రాజా వా రాజపుత్ర శ్చ రాజపుత్రీ యశస్వినీ. 205

ఆ రాజును, రాజకుమారుడును, యశస్విని యగు ఆ రాజపుత్రికయు జనార్దన దేవుని పరమ స్థానమును చేరుకొనిరి.

మమ చైవ ప్రసాదేన తపసశ్చ బలేన చ,

కృత్వా సుదష్కరం కర్మ శ్వేతద్వీప ముపాగతాః. 206

నా అనుగ్రహము వలనను, వారి తపస్సు బలముచేతను చేయనలవి కాని కర్మమాచరించి వారు శ్వేతద్వీపమునకు చేరుకొనిరి.

యోసౌ పరిజనో దేవి కృత్వా తు సుకృతం తపః,

తేపి సిద్ధిం పరాం ప్రాప్తాః శ్వేతద్వీప ముపాగతాః. 207

వారి పరిజనము కూడ చక్కని తపస్సు చేసి పరమసిద్ధిని పొంది శ్వేతద్వీపమున కరిగిరి.

ఏవం తే కథితం దేవి వ్యుష్టిం కుబ్జామ్రకస్య చ,

తస్య బ్రాహ్మణముఖ్యస్య రైభ్యస్య కథితం మయా. 208

దేవీ! నేనా బ్రాహ్మణముఖ్యుడగు రైభ్యునకు చెప్పిన కుబ్జామ్రక మహత్వమును నీకు తెలియజేసితిని.

ఏష జప్యశ్చ పుణ్యశ్చ చాతుర్వర్ణ్వ వ్యవస్థితః,

కార్యాణాం చ మహత్కార్యం క్రియాణాం చ మహాక్రియా,

తేజసాం చ మహాతేజ స్తపసాం చ మహాతపః. 209

ఈ కథ జపింపదగినది. పుణ్యమైనది. నాలుగు వర్ణముల వారియందును నిలుప దగినది. కార్యములలో మహాకార్యము. శ్రద్దతో చేసెడు క్రియలలో ఉత్తమమైనది. వెలుగులలో గొప్ప వెలుగు. తపములలో గొప్పతపస్సు.

ఏత న్న మూర్ఖమధ్యే తు పఠే దపి కదాచన,

న పఠేద్‌ గోఘ్న మధ్యే తు వేదవేదాఙ్గ నిన్దకే. 210

మూర్ఖులమధ్య దీనిని ఎన్నిటికిని చదువరాదు. కసాయి వారి నడుమను, వేదములను, వేదాంగములను నిందించు వారున్న తావునను దీనిని పఠింపరాదు.

న పఠేద్‌ గురునిన్దకే మా పఠే చ్ఛాస్త్రదూషకే,

పఠేద్‌ భాగవతాం మధ్యే యేచ దీక్షాసు నిష్ఠితాః. 211

గురువులను, శాస్త్రములను నిందించు వారికడ దీనిని చదువరాదు. సత్కార్య దీక్షల యందు నిష్ఠ కల భాగవతులకడ చదువ వలయును.

య ఏనం పఠతే భూమి కల్యముత్థాయ మానవై,

పఠం స్తారయతే దేవి దశపూర్వాన్‌ దశాపరాన్‌. 212

ఉదయముననే లేచి మానవుడు దీనిని పఠించునేని వెనుక పదితరములవారిని, ముందు పదితరముల వారిని తరింపజేయును.

ఏతత్తు పఠ్యమానే వై యస్తు ప్రాణాన్‌ విముఞ్చతి,

చతుర్భుజ శ్చ జాయతే మల్లోకేషు ప్రతిష్ఠితః. 213

ఇది చదువుచుండగా ప్రాణములు విడిచినవాడు నాలుగు భుజములు కలవాడై నాలోకములయందు స్థిరనివాసము చేయును.

ఏతత్‌ తే కథితం భూమి స్థానం కుబ్జామ్రకం మయా,

మమ భక్తసుఖార్థాయ కి మన్యత్‌ పరిపృచ్ఛసి. 214

భూదేవీ! కుబ్జామ్రక స్థానమును గూర్చి నా భక్తులసుఖమునకై దీనిని నీకు చెప్పితిని. మరియేమి వినగోరుదువు?

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పంచవింశత్యధిక శతతమోధ్యాయః.

ఇది శ్రీవరాహ పురణమను భగవచ్ఛాస్త్రమున నూట ఇరువది యైదవ అథ్యాయము.

Varahamahapuranam-1    Chapters