Varahamahapuranam-1    Chapters   

అష్టావింశత్యధిక శతతమోధ్యాయః - నూటయిరువది యెనిమిదవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - వరాహదేవు డిట్లనెను.

భూషితాలంకృతం కృత్వా మమ కర్మపరాయణః,

శుక్లయజ్ఞోపకం దద్యా న్నవసూత్రగుణం తథా. 1

నా పనులయందు శ్రద్ధకలవాడు నాకలంకారములను సమర్పించి తొమ్మిది వరుసలుగల తెల్లని జన్నిదమును నాకు అర్పింపవలయును.

శిరసా చాఞ్జలిం కృత్వా వసుధా పున రబ్రవీత్‌.

తలపై అంజలి ఘటించి భూదేవి మరల ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి యిట్లు పలికెను.

ఏతన్మే పరమం గుహ్యం తద్భవాన్‌ వక్తు మర్హతి. 2

సన్ధ్యాం వై కేన మన్త్రేణ తవ కర్మపరాయణః,

వన్దేద్‌ భాగవతాం శుద్ధాం తవ కర్మవినిశ్చితః. 3

ప్రభూ! ఈ పరమరహస్యమును నీవు నాకు చెప్పవలయును. నిన్నర్చించు పనులలో శ్రద్ధయు, చక్కని వివేకమును కలవాడు పవిత్రయు, భగవంతునకు సంబంధించినదియు నగు సంధ్యను ఏమంత్రముతో మ్రొక్కవలయును?

తతో భూమివచః శ్రుత్వా భూతానాం ప్రభవోవ్యయః,

వరాహరూపో భగవాన్‌ ప్రత్యువాచ వసుంధరామ్‌. 4

అంత భూదేవి పలుకు విని భూతముల పుట్టుకకు, కారణమైనవాడు, అవ్యయుడు నగు వరాహరూప భగవానుడు బదులు పలికెను.

శ్రీ వరామ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు మాధవి తత్త్వేన యన్మాం త్వం పరిపృచ్ఛసి,

కథయిష్యామి తే భ##ద్రే ప్రవరం గుహ్య ముత్తమమ్‌,

యథా వదన్తి వై సుభ్రు పుణ్యాం భాగవతాః శుభాః. 5

మాధవీ! నీవు నన్ను అడిగిన ఆ పరమ రహస్యమును పుణ్యులు. మంచి వారునగు భాగవతులు ఎట్లు చెప్పుదురో అట్లు చెప్పెదను.

కృత్వా తు మమ కర్మాణి శుచి సంసారమోక్షణమ్‌,

పూర్వాం చైవాపరాం సన్ధ్యాం యథా వన్దతి నిశ్చితః. 6

తన పనులన్నింటిని చక్కగా చేసికొని పరిశుద్ధుడై సంసారమోక్షణమునకై ప్రాతఃసంధ్యను, సాయం సంధ్యను ఎట్లు నమస్కరింపవలయునో చెప్పెదను.

జలాఞ్జలిం తతో గృహ్య మమ భక్త్యా వ్యవస్థితః,

ముహూర్తం ధ్యానమాస్థాయ ఇమం మన్త్ర ముదాహరేత్‌. 7

దోసిలితో నీటిని గ్రహించి భక్తిని కుదురు కొల్పుకొని ముహూర్తకాలము ధ్యానమాచరించి ఈ మంత్రమును పఠింప వలయును.

మన్త్రః - మంత్రము.

భవోద్భవ మాదివ్యక్తరూప మాదిత్యం చ సర్వ దేవ

బ్రహ్మా రుద్ర స్త్వాదృక్‌ స మమాసీద్‌ ధ్యాన యోగస్థితాస్తే

వై సంధ్యా సంస్థా వాసుదేవం నమన్తి ఆదిమవ్యక్తరూప

మాత్మానం కృత్వా దేవ సంస్థా తథాపి సంసారార్థకర్మ

తత్కారణా మే సంధ్యాసంస్థా వాసుదేవ నమోనమః

సృష్టికి కారణమైనవాడు, వ్యక్తరూపముగలదానికి మొదటి వాడు అగు ఆదిత్యుడు బ్రహ్మ, రుద్రుడు నాధ్యాన యోగమున ఎట్లు నిలిచియుండిరో అట్టివాడగును. వారు సంధ్యలయందు చక్కగా నిలిచినవారై వాసుదేవునికి నమస్కరింతురు. అట్లే మొదటివాడు అవ్యక్తరూపుడు అగు ఆ వాసుదేవ పరమాత్మను, దేవతలందరు ఈ సంసారముకొరకైన కర్మమునకు కారణమై సంధ్యలయందు నెలకొని యున్న మేమందరము ఓ వాసుదేవా! నీకు మరల మరల నమస్కారము అర్పించుచున్నాము అనుచు అర్చించుచుందురు.

మన్త్రాణాం పరమో మన్త్ర స్తపసాం పరమం తపః,

ఆచారం కురుతే హ్యేతన్‌ మమ లోకాయ గచ్ఛతి. 8

ఇది మంత్రములలో పరమ మంత్రము. తపస్సులలో గొప్ప తపస్సు. దీనిని ఆచారముగా చేయువాడు నా లోకమున కరుగును.

గుహ్యానాం పరమం గుహ్యం రహస్యం పరముత్తమమ్‌,

య ఏవం పఠతే నిత్యం న స పాపై ర్విలిప్యతే. 9

రహస్యములలో పరమమైనదియు, దాచవలసినవానిలో అతిముఖ్యమైనదియు నగు ఈ మంత్రమును ప్రతిదినము జపించువానికి పాపము లంటవు.

నా దీక్షితాయ దాతవ్యం నోపనీతే కదాచన,

దీక్షితాయైవ దాతవ్య ముపపన్నే తథైవ చ. 10

దీక్ష పొందని వానికి, ఉపనయనము కాని వానికి దీని నొసగరాదు. దీక్షకలవానికి భక్తితో దగ్గరకు వచ్చిన వానికి మాత్రమే ఈయవలయును.

పున రన్యత్‌ ప్రవక్ష్యామి శృణు తత్త్వేన మాధవి,

దీపం యథైవ గృహ్ణామి దత్తం భాగవతైః శుభైః. 11

మాధవీ! భగవంతుని భక్తిగల సజ్జనులు ఒసగెడు దీపమును నేనెట్లు గ్రహింతునో ఆవిషయమును విడబరచి చెప్పెదను, వినుము.

కృత్వా తు మమ కర్మాణి గృహ్య దీపక ముత్తమమ్‌,

జానుసంస్థాం తతః కృత్వా ఇమం మంత్ర ముదాహరేత్‌. 12

నా పూజాకర్మము లన్నింటిని చక్కగా ఆచరించి మేలైన దీపమును గ్రహించి దానిని మోకాళ్ళపై నిడుకొని ఈ మంత్రమును పఠింపవలయును.

మన్త్రః - మంత్రము

ఓం నమో భగవతే నుగ్రహజాతాయ విష్ణో

సర్వదేవాగ్ని సంస్థా ప్రవిష్టా ఏవం చాగ్ని సంస్థాః ప్రవిష్టా

ఏవం చాగ్ని స్తవ తేజః ప్రవిష్ఠః తేజ శ్చాత్మా మాం

ససమ్తశ్చ్ర తేజసః సంసారార్థం దేవ గృహ్యస్వ దీపద్యుతి

మన్త్రమూర్తి ర్మన్త్రశ్చ భూత్వా ఇమం కర్మ చ నిష్కలం

తత్కరోమి యథాన్యాయం గర్భవాసేన దుఃఖితః

అనుగ్రహరూపమైన తేజస్సు గల భగవంతునకు నమస్కారము. ఓ విష్ణూ! దేవతలందరు ఈ అగ్నియందు ప్రవేశించియున్నారు. అట్లే అగ్నియందుండు శక్తులన్నియు ఇందు ప్రవేశించినవి. ఈ అగ్ని నీ తేజస్సునందు ప్రవేశించినది. ఈ తేజస్సు ఆత్మరూపమై నన్ను చేరినది. నీవు మంత్రములతో కూడినవాడవై ఈ ప్రపంచము కొరకు దీనిని గ్రహింపుము. ఈ దీపకాంతి, మంత్రమూర్తి మంత్రమై గర్భవాసమున పడి కుములుచు, నేను ఏదేది చేసితినో అది అది యెల్ల పాపము లేని దగునట్లు చేయుగాక!

యస్త్వనేన విధానేన దీపకం దదతే నరః,

తారితాః పితరస్తేన నిష్కలాశ్చ పితామహాః. 13

ఈ విధముగా చిరుదివ్వెల సమర్పించు నరుడు తన పితృదేవతలను తరింపజేయును. వంశమును పూర్వము వారి నందరిని పాపరహితులను చేయును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి కర్మ లోక సుఖావహమ్‌,

యేన మన్త్రేణ దాతవ్యం లలాటే మమ చిత్రకమ్‌. 14

లోకమునకు సుఖమును కలిగించు మరియొక పనిని, భూదేవీ! నీకు చెప్పెదను. నా నొసటిపై తిలకమెట్లు ఏ మంత్రముతో దిద్దవలయునో తెలిపెదను.

మన్త్రః - మంత్రము

ముఖమణ్డనం చిన్తయ వాసుదేవ త్వయా ప్రయుక్తం

చ మయోపనీతమ్‌. ఏతేన చిత్రితం దేవ గృహ్ణ మమైవ

సంసారకరో హి మోక్షమ్‌. ఏతేన మన్త్రేణ చిత్రకం

దాతవ్యమ్‌.

వాసుదేవా! నీవే సమకూర్చిన ఈ ముఖాలంకారమును నేను తెచ్చితిని. దీనితో నీ ముఖము నలంకిరంతును. దీనిని దేవా! దయతో స్వీకరింపుము. నాకు సంసారమును కూర్చు పాపమునుండి మోక్షము ననుగ్రహింపుము.

నారయణ వచః శ్రుత్వా విస్మితా చ వసుంధరా,

వారాహరూపం భగవన్‌ ప్రత్యువాచ పునర్వచః. 15

నారాయణుని పలుకు విని భూదేవి అచ్చెరువంది భగవంతుడా! అనుచు వరాహరూపదేవునితో ఇట్లు పలికెను.

శ్రుత్వా భాగవతా దేవ తవ కర్మపరాయణాః,

కృత్వా తు తవ కర్మాణి శేషే చ తవ సేవనే. 16

తవ ప్రాపణకృత్యం తు కేషు పాత్రేషు కారయేత్‌,

ఏతదాచక్ష్వ తత్త్వేన యేన తుష్యసి మాధవ. 17

నీ అర్చనల యందు శ్రద్ధగల భాగవతులు నీపూజలను గూర్చి విని చక్కగా ఆచరింతురు. అట్టి నీ సేవాకర్మముల యందు నీ భక్తులు నీవు తుష్టి పొందువిధముగా ఉపయోగింపదగు పాత్ర లెట్టివి? దీనికి నాకు చక్కగా చెప్పుము.

తతో భూమ్యా వచః శ్రుత్వా లోకనాథోబ్రవీదిదమ్‌,

శృణు తత్త్వేన మే దేవి యే చ పాత్రా మమ ప్రియాః,

తాని తే కథయిష్యామి యత్త్వయా పూర్వపృచ్ఛితమ్‌. 18

భూదేవి పలుకులు విని ఆలోకనాథుడు ఇట్లు పలికెను. దేవీ! నీవు నన్నడిగినదానికి సమాధానముగా నాకెట్టి పాత్రలు ప్రియములగునో వానిని తెలిపెదను. వినుము.

సౌవర్ణం రాజతం కాంస్యం యేషు దీయేత ప్రాపణాః,

తాని సర్వాణి సంత్యజ్య తామ్రం చ మమ రోచతే. 19

బంగారు, వెండి, కంచు పాత్రలలో నా కర్పింపవలసిన వాని నర్పింతురు. కాని నేను వానినన్నింటిని వదలి రాగిపాత్రను ఇష్టపడుదును.

ఏవం నారాయణా చ్ఛ్రుత్వా ధర్మకామా వసుంధరా,

ఉవాచ మధురం వాక్యం లోకనాథం జనార్దనమ్‌. 20

నారాయణుని ఈ మాట విని ధర్మకామ యగు వసుంధర లోకనాథుడగు జనార్దనునితో తీయని ఈ పలుకును పలికెను.

ముచ్య సౌవర్ణరౌప్యం చ కాంస్యం చైవ జనార్దన,

ఏతన్మే పరమం గుహ్యం తామ్రస్తే రోచతే కథమ్‌. 21

జనార్దనా! బంగారు, వెండి, కంచు పాత్రలను వదలి నీవు రాగిపాత్ర నెట్లిష్టపడుదువు. ఆ రహస్యమును నాకు చెప్పుము.

తతో భూమివచః శ్రుత్వా ఆది రవ్యక్త మవ్యయః,

లోకానాం ప్రవరః శ్రేష్ఠః ప్రత్యువాచ వసుంధరామ్‌. 22

అంత భూదేవి మాట విని మొదటివాడు, అవ్యక్తుడు, అవ్యయుడు, లోకములలో అందరికి కోరదగినవాడు, శ్రేష్ఠుడు అగు నారాయణుడు భూదేవి కిట్లు బదులు పలికెను.

శృణు తత్త్వేన మే భూమి కథ్యమానం మయానఘే,

ఏకచిత్తం సమాధాయ యేన మే తామ్రకం ప్రియమ్‌. 23

పుణ్యులారా! నాకు రాగిపాత్ర ఏల ప్రియమైనదో చెప్పెదను, మనస్సును చెదరకుండ చేసికొని వినుము.

సప్తయుగ సహస్రాణి ఆదికాలాది మాధవి,

యస్తు తామ్రసముత్పన్నే మయైవ ప్రియదర్శనే. 24

ఓ ప్రియదర్శనా! ఈ రాగి పుట్టి ఏడువేల యుగములైనది.

తతః కమలపత్రాక్షి గుడాకేశో మహాసురః,

తామ్రరూపం సమాదాయ మమై వారాధనే స్థితః. 25

కమలపత్రాక్షి! ఆసమయమున గుడాకేశుడనెడు మహారాక్షసుడు రాగి రూపు ధరించి నన్ను కొలుచుటకు సిద్ధపడెను.

తత ఆరాధిత స్తేన సహస్రాణి చ షోడశ,

మమ భక్తో విశాలాక్షి ధర్మకామేన నిశ్చయమ్‌,

తతః ప్రీతోస్మి సుశ్రోణి తస్య సంతపనిశ్చయాత్‌. 26

పదునారువేల ఏండ్లు అతడట్లు ధర్మకామముతో నన్నారాధింపగ నేనాతని తపస్సునకు ప్రీతినందితిని.

తత స్తామ్రాశ్రమే రమ్యే యత్ర తామ్ర సముద్భవః,

దృష్టాశ్రమం మయాదేవి కఞ్చిదేవ సుభాషితమ్‌. 27

అంత ఆరాగిపుట్టిన రమ్యమగు తామ్రాశ్రమమున నేనాతనిని గాంచి కొంచెముగా మంచిమాట లాడితిని.

తతో జానుస్థితో భూత్వా మమ ఏష విచిన్తయన్‌,

తమూచేహం తతో దృష్ట్వా మమ చిన్తాపరాయణమ్‌,

గుడాకేశ మహాప్రాజ్ఞ మమ కర్మవిధౌ స్థితః. 28

అంత నతడు మోకాళ్ళపై నిలిచి నన్నే చింతించు చుండగా నేనాతనిని గాంచి గొప్పప్రజ్ఞగల ఓ గుడాకేశా! నీవు నాపూజయందు నెలకొని యున్నావంటిని.

ఏవం స తు మయా ప్రోక్తః ప్రసన్నేనాంతరాత్మనా,

గుడాకేశ మహాభాగ బ్రూహి కిం కరవాణి తే. 29

ప్రసన్నమగు హృదయముగల నేను మరియు నతనితో నిట్లంటిని. మహాభాగా! గుడాకేశా! నేను నీకేమి చేయవలయునో చెప్పుము.

తోషితోస్మి మహాప్రాజ్ఞ త్వయా భ##క్తేన కేవలమ్‌,

యత్త్వయా చిన్తితః సౌమ్య కర్మణా మనసా చ వై,

వరం బ్రూహి మహాభాగ తవ యద్‌ రోచతే హృది. 30

భక్తుడవగు నీయెడ నేను మిక్కిలి సంతసించితిని. కర్మముతో, భావముతో నీవేది తలతువో, నీ హృదయమున ఇష్టమగు కోరిక యేదో ఆ వరమును అడుగుము.

ఏవం మమ వచః శ్రుత్వా గుడాకేశో వచోబ్రవీత్‌,

కరాభ్యా మఞ్జలిం కృత్వా విశుద్ధే నాన్తరాత్మనా. 31

ఇట్టి నా మాటను విని గుడాకేశుడు చేతులతో దోసిలిపట్టి మిక్కిలి శుద్ధమగు అంతరాత్మలో ఇట్లు పలికెను.

యది తుష్టోస్మి మే దేవ సమస్తే నాన్తరాత్మనా,

జన్మాన్తరసహస్రాణి తవ భక్తి ర్దృఢాస్తు మే,

చక్రేణ వధ మిచ్ఛామి త్వాయా ముక్తేన కేశవ. 32

దేవా! నీవు నిండు హృదయముతో నా యెడల తుష్టుడవైనచో నాకు నీ యందలి భక్తి వేలకొలది జన్మముల వరకు గట్టిదై నిలుచుగాక! నీవు వదలిని చక్రముతో నా చావును కోరుచున్నాను.

య ఏష మజ్జామాంసం వై త్వయా చక్రేణ పాతితమ్‌,

తామ్రం నామ భ##వే ద్దేవ పవిత్రీకరణం శుభమ్‌. 33

నీ చక్రముతో కూలిన నా యీ మజ్జయు, మాంసమును 'తామ్రము' అను పేరుగలదియై, పవిత్రము చేయు శుభద్రవ్య మగుగాక!

తేన పాత్రం తతః కృత్వా శుద్ధి ర్ధర్మవినిశ్చితా,

తవ ప్రాపణకం దేవ తామ్రభాజన సంస్థితమ్‌. 34

దానితో చేసిన పాత్ర యందుంచి నీ కర్పించిన వస్తువు పవిత్రమైనదగు గాక.

ఏత న్మే పరమం చిత్తం లోకనాథ వ్యవస్థితమ్‌,

ప్రసన్నో యది మాం దేవ తతో మే దీయతాం వరః,

యత్త్వయా చిన్తితం దేవ తప ఉగ్ర మిదం మహత్‌. 35

లోకనాథా! దేవా! ఇది నా చెదరని హృదయము. ఈ నా తపస్సు గొప్పదిగా తీవ్రమైనదిగా నీవు భావింతు వేని నా యందు ప్రసన్నుడవైతి వేని నా కీ వరము ప్రసాదింపుము.

బాఢ మిత్యేవ తం చాహ ఏవ మేతద్‌ భవిష్యతి,

యావల్లోకా ధరిష్యన్తి తావ చ్చైవం మహాసుర,

తావ త్తామ్ర స్థితో భూత్వా మమ సంస్థో భవిష్యసి. 36

సరియే, అది యట్లే యగును. ఓయి మహారాక్షసా! లోకములుండునంతవరకు నీవు రాగియందు నిలుచువాడవై నాలో నెలకొన్న వాడవగుదువు.

గుడాకేశతప శ్చైవం సతామ్రం తస్య నిష్కలమ్‌,

మాఙ్గల్యం చ పవిత్రం చ సర్వసంసార మోక్షణమ్‌,

ఏవం తత్ర మయా చోక్తం సోపి వై తపసి స్థితః. 37

గుడాకేశుని తపమిట్టిది. అతడే రాగి ఆయెను. ఆతనిదెల్ల పాపములేనిది, శుభ##మైనది, పవిత్రమైనది, సంసారమోక్షణము కలిగించునట్టిది అగును - అని అచట నేను పలికితిని. అతడును తపస్సున నిష్ఠకల వాడాయెను.

ఏవం పశ్యతి తం చక్రం మధ్యాహ్నే తు దివాకరే,

వైశాఖస్య తు మాసస్య శుక్లపక్షే తు ద్వాదశీమ్‌,

వధిష్యతి న సందేహః స చక్ర శ్చాగ్ని తేజసః. 38

వైశాఖమాసమున శుక్లపక్షమున ద్వాదశినాడు మధ్యాహ్నమున సూర్యుడు వెలుగొందుచుండగా నా చక్రము నతడు చూచుచుండగా అగ్నిదీప్తి గల ఆ నా చక్రము ఆతనిని వధించును. సందేహము లేదు.

ఏష్యతే మమ లోకాయ ఏవ మేత న్న సంశయః,

ఏవ మేతద్‌ వచ శ్చోక్త్వా తత్రై వాన్త రధీయత. 39

ఆతడు నా లోకమున కరుగును. ఇందు సంశయములేదు. అని యీ మాట పలికి అచ్చటనే అంతర్ధానము చెందితిని.

సోపి కుర్వీత కర్మాణి చక్రాద్‌ వధమనీషయా,

శుచీని చ విశిష్టాని యథోపేతం మమ ప్రియే. 40

చక్రముతో చచ్చు కోరికతో ఆతడును, శుద్ధములు, శ్రేష్ఠములు నాకు సంబంధించినవి అగు పనులు చేయుచుండును.

సోపి చిన్తయేత తత్ర నివృత్తే నాన్తరాత్మనా,

కుత శ్చైషతి వై మాసః కదా చక్రం సమేష్యతి. 41

యో మే నికృత్య మాంసాని విష్ణుసంస్థం కరిష్యతి,

ఏవం సంచిన్తయానస్య మాసం మాధవ మాగతమ్‌. 42

లోకమునుండి మరలిని అతరంగముతో ఆతడు ఆ నెల ఎప్పుడు వచ్చునో, చక్రము రాక ఎన్నడో, అది నా మాంసములను చీల్చి నన్నెప్పుడు విష్ణువునందు లీనము చేయునో అని తలపోయుచు ఉండగా ఆ వైశాఖ మాసము ఏతెంచెను.

శుక్లపక్షే తు ద్వాదశ్యాం తతో ధర్మసునిశ్చితః,

విష్ణు సంస్థాపనం కృత్వా మధ్యాహ్నేతు దివాకరే. 43

ముఞ్చ ముఞ్చ మయా చక్రం జ్వలన్నిన హుతాశనమ్‌,

ఆత్మా మే నీయతాం శీఘ్రం నికృత్య చక్రమఙ్గతే. 44

శుక్లపక్ష ద్వాదశినాడు సూర్యుడు నడిమింట నుండగా ధర్మమున చక్కని నిశ్చయముగల ఆతడు మనస్సును విష్ణువునందు చక్కగా నిలిపి ప్రభూ! అగ్నివలె మంటల క్రక్కుచున్న నీ చక్రమును నాపై వదలు, వదలు. వెంటనే నీ చక్రము నన్ను చీల్చి వైచి నా ఆత్మను ఒక్క పెట్టున నీ కడకు తీసికొనిపోవుగాక! అని భావించెను.

తస్య మాంసమయం తామ్రం పఞ్చరఙ్గం తు శోణితమ్‌,

రూపం చాస్థీని జాయేత మలకం కాంస్య ముచ్యతే. 45

అతని మాంసమంతయు రాగి, రక్తము తగరము, ఎముకలు బంగారము, మలము కంచు అయ్యెనని చెప్పుదురు.

యో వై తామ్రేణ మే దేవి ప్రాపణం మమ దీయతే,

ఏకైకస్య చ సిక్థస్య తచ్ఛ్రుణుష్వ ఫలం మహత్‌. 46

దేవీ! ఎవ్వడు గాని రాగి పాత్రతో నాకు నైవేద్య మిడినచో దాని ఒక్కొక్క మెతుకువలన కలుగు గొప్ప ఫలమును గూర్చి వినుము.

యావన్తి తాని సిక్థాని తామ్ర పాత్ర స్థితాని వై,

తావద్‌ వర్షసహస్రాణి మమ లోకే స మోదతే. 47

ఆ రాగి పాత్రలో ఉన్న మెతుకు లెన్నో అన్ని వేల ఏండ్లు ఆతడు నా లోకమున ఆనందమందును.

ఏతద్‌ భాగవతః కుర్యాద్‌ యదీచ్ఛేత మమ ప్రియమ్‌,

గుహ్యం తామ్రమయం పాత్రం నిత్యం మాం ధర్మకారణాత్‌. 48

భాగవతుడు నాకు ప్రియమొనరింపగోరు నేని ప్రతిదినము నా కొఱకు రాగి పాత్రను ఉపయోగింపవలయును. దీనివలన ధర్మము కలుగును.

ఏవం తామ్రం సముత్పన్నం తస్మాత్‌ ప్రియతరం మమ,

దేవి తత్త్వేన తే హీదం కథితం తామ్ర నిశ్చయమ్‌. 49

రాగి యిట్లు పుట్టినది. కావున నాకు మిక్కిలి యిష్టమైనది. దాని స్వరూపమును గూర్చి విశదముగా నీకు చెప్పితిని.

పవిత్రాణం పవిత్రం చ మంగళానాం చ మంగళమ్‌,

విశుద్ధానాం శుచి శ్చైవ తామ్రం సంసారమోక్షణమ్‌. 50

రాగి పవిత్రములలో పవిత్రము. మంగళముల కెల్ల మంగళము. శుద్ధములలో శుద్ధము. సంసారము నుండి ముక్తి కలిగించునది.

దీక్షితానాం విశుద్ధానాం మమ కర్మపరాయణమ్‌,

సదా తామ్రేణ కర్తవ్య మేవం భూమి మమ ప్రియమ్‌. 51

దీక్షితులు, విశుద్ధులు నగు వారు నా సంబంధమగు కార్యములలో నాకు ప్రియమగు రాగినే ఉపయోగింపవలయును.

ఏషా వై దీక్షనా భ##ద్రే ఏష తామ్రస్య సంభవః,

నిష్కలం కథితం సర్వం కి మన్యత్‌ పరిపృచ్ఛసి. 52

ఇది దీక్షా విధానము. రాగి పుట్టుక ఇట్టిది. దీనిని నిండుగా నీకు చెప్పితిని. మఱియేమి అడుగుదువు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టావింశత్యధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువది యెనిమిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters